నేను :
పిపీలికమంత ప్రాణశక్తిని సంపాదించుకుని బ్రహ్మాండాన్ని శాసించే మానవజన్మనెత్తడంకోసం అమ్మ గర్భంలో కొంచెం చోటు సంపాదించుకున్నాను. ప్రాణనాడుల స్పందన తప్పించి అంతా దుర్భరనిశ్శబ్దం. అంతర్ముఖంగా వెలిగే ఆత్మజ్యోతి తప్ప అంతా గాఢాంధకారం. కొన్నాళ్లు ఊర్ధ్వముఖం. కొన్నాళ్లు అధోముఖం. క్షణక్షణ గండం నూరేళ్ళ ఆయుష్షుగా గడిపి భూమ్మీద పడ్డాక నా అస్థిత్వపు తొలి భావరూపం “నేను”
పువ్వు పూసినా గువ్వ కూసినా అన్నీ నాకోసమేనని ఓ గట్టి నమ్మకం. అన్నీ నావేనని ఆరాటం. సృష్టిలోని అందమైనవన్నీ నాకోసమేననుకుంటూ ఉండే నాకోసం ఒక నువ్వు సృష్టించబడ్డావు.
నువ్వు:
పువ్వు విరిస్తే సంతోషపడిపోయి, చీకటిరాత్రి ఆకాశం చిచ్చుబుడ్డిలా నక్షత్రాల రవ్వల్ని విసిరే విస్తుబోయి, కాలికింద అప్రమేయంగా నలిగిపోయిన చీమని చూసి అయ్యో అనుకుని, అన్నిటినీ నిస్వార్థంగా ప్రేమించే నీకు కొన్ని భావాలుంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకవేళ ఒకటో రెండో అలాంటివేమైనా వుండి, నాకడ్డు తగిలితే నిస్సంకోచంగా వాటిని ఉరి తీసేవాడిని. అలా ఉరితీయబడ్డ భావాలు నీ మనసు వాకిలికి ప్రేతకళతో వేళ్లాడుతూ కొత్త భావాలని బైటికి…. రానివ్వకుండా లోనికి పోనివ్వకుండా నిన్నో జడపదార్థంగా మార్చేశాయి. చైతన్యం ఉన్న మనిషి చైతన్యం లేనట్టు ఉండటం ఎంత దుస్సహమో నాకెప్పుడూ అనుభవంలోకి రాలేదు. కానీ నువ్వు నాకన్నా పెద్ద తలారివని తెలిసి ఆశ్చర్యపోయాను.
కథలోకి.
అక్కడ నిశ్శబ్దం విస్తారంగా పరుచుకుని ఉంది.
మనిషి పుట్టబోయే ముందు ఉండేది నిశ్శబ్దమే. మరణించాక జారేది నిశ్శబ్దంలోకే. నిశ్శబ్దంలోంచే ఆవిష్కరింపబడి మళ్లీ నిశ్శబ్దంలోకి నిష్క్రమించటమే జీవితమైతే, దానికింత కోలాహలం ఎందుకు? అంతుచిక్కని ఈ ప్రశ్నకి జవాబు వెతుకుతూ బెడ్మీదున్న భార్యకేసి చూశాడు కిషోర్.
ఆకుపచ్చటి హాస్పిటల్ గౌనులో అస్థిపంజరంలా ఉంది సుచేత. తలమీది వెంట్రుకలన్నీ ఊడిపోయి బోర్లించిన చెంబులా ఉంది. గత కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. రేడియేషన్ ట్రీట్మెంటు ఇస్తున్నారు. ట్రీట్మెంటు తట్టుకోలేక, వ్యాధి కుదరక నామావశిష్ఠంగా మిగిలింది. మృత్యువుకి రోజులు లెక్కపెడ్తోంది.
ఎలాంటి మనిషి ఎలాగైపోయింది? రోజూ చూస్తూనే ఉన్నా దిగ్భ్రామ కలుగుతోంది కిషోర్‌కి. కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. తనేడిస్తే ఆమె మరింత బెంబేలెత్తిపోతుందని దుఃఖాన్ని నిగ్రహించుకుంటున్నాడు.
“బాధ బాగా ఉందా చేతూ?”. గద్గదస్వరంతో ఆమె మొహంలోకి మొహంపెట్టి ఆర్తిగా అడిగాడు. ఆమె కన్నీళ్లతో తలూపింది. “పాప… పాపెలా ఉంది? ఏడుస్తోందా?” అతి ప్రయాసమీద అడిగింది.
“హాస్టల్లో చేర్చాను. వాళ్ల ప్రిన్సిపల్కీ వాళ్లకీ చెప్పాను జాగ్రత్తగా చూసుకోమని. మరేం భయంలేదు. నువ్వు దానిగురించి బెంగపెట్టుకోకు!” ఓదార్పుగా చెప్పాడు.
ఆమె మనసులో జ్వాలలాంటిది ఎగిసిపడింది. తల్లి మృత్యుశయ్యలో… తండ్రి ఆమెను చూస్తూ… మూడేళ్ల పసిది ఆలనా పాలనా లేకుండా హాస్టల్లో … ఏ జన్మలోనో కాదు, ఈ జన్మలోనే చేసుకున్న పాపానికి శిక్ష ఇది… భారంగా కళ్లుమూసుకుంది. మూసుకున్న కనుకొలకుల్లోంచి నీళ్లు జారిపడ్డాయి.
తలుపు చప్పుడైంది. కిషోర్ తల తిప్పి చూశాడు. అరుణ! అతని మొదటి భార్య. ఎందుకొచ్చింది? ఎదుర్కోలేనట్టు తల దించుకున్నాడు. సుచేత కూడా అరుణవి చూసింది. ఆశ్చర్యంతో కళ్లు పెద్దవయ్యాయి. అలసిసొలసిపోయిన గుండెలోకి ఏదో కొత్త శక్తి వచ్చి చేరుకున్నట్టయింది.
వాళ్లు ముగ్గురి మధ్య గతం విస్తరించుకుని ఉంది. దాని పొడవు నాలుగేళ్ల కాలవ్యవధి. వెడల్పు ఒక మగవాడి నమ్మకద్రోహం. లోతు ఒక స్త్రీ
గుండెకి తగిలిన గాయమంత
అరుణా, కిషోర్ ఇద్దరూ ఒకేరోజు కొత్తగా వుద్యోగంలో చేరారు. ఇద్దర్నీ ఒకే బ్రాంచిలో వేశారు.
అరుణ తెల్లగా, పొడుగ్గా ఉంటుంది. పట్టుకుచ్చులాంటి జుత్తు. సన్నటి నాజూకైన ఆకృతితో చూసేవాళ్లని ఆకర్షిస్తుంది. కిషోర్ ఆ ఆకర్షణకి మినహాయింపు కాలేకపోయాడు.
కుతూహలం … ఆకర్షణ.. ప్రేమ… పెళ్లి … ఒక్కొక్క మెట్టే ఎక్కారు వాళ్లు. సృష్టిలోని చరాచర ప్రాణులన్నీ కేవలం ఒకే ఒక అర్జ్కోసం ఒకదానినొకటి కావాలనుకుంటాయి. మనుషుల అవసరం కూడా అదే అయినా, దాన్నంత బాహాటంగా చెప్పుకోలేక ‘ప్రేమ’ అనే పైపూత వేసుకుంటారు. ఆ ప్రేమే మనుషుల చేత సహజీవనం చేయిస్తోందని వంచన చేసుకుంటారు. అసలంటూ ఉందో, లేదో తెలీని మనసుని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా ఉందనేసుకుని అందులోంచి జనించే భావపదార్థంగా ప్రేమని భావించి, దాంతోటే జీవితం ముడిపడిందని నిర్ధారించుకుని ఆఖర్ని అదంతా ట్రాష్ అని తెలిస్తే – ఆ తెలిసినప్పటి స్టేజిలో ఉంది అరుణ. ఆమెకి తొమ్మిదోనెల నడుస్తోంటే బజార్లో కలిసింది సుచేత. ఇద్దరూ క్లాస్మేట్స్. తను కూడా అక్కడే జాబ్ చేస్తున్నట్లు చెప్పింది.
చెప్పి “ఏంటే, ఎవర్నీ పిలవకుండా పెళ్లి చేసుకున్నావ్?” అడిగింది. వట్టి అడగటమే కాదు, నిలదీసే చనువు కూడా ఉంది ఇద్దరిమధ్యా.
“లవ్మేరేజి… పెద్దవాళ్లకి ఇష్టం లేదు. అందుకని క్లుప్తంగా తిరుపతిలో చేసేసుకున్నాం. ఎవర్నీ పిలవలేదు!” అంది అరుణ.
“నాకిక్కడ ఏపీఎఫ్ఎసీలో పోస్టింగిచ్చారు. ఫస్ట్ అపాయింటుమెంటు ఢిల్లీలో ఇచ్చారు. నానా తిప్పలూ పడితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. డిపార్త్మెంటల్ ట్రాన్స్ఫర్. ప్రస్తుతం అమ్మావాళ్ళదగ్గర వుండి రోజూ వెళ్ళి వస్తున్నాను. ఏదేనా చిన్న పోర్షన్ దొరుకుతుందేమో, ఇక్కడే ఉండిపోయి, శనాదివారాల్లో అమ్మావాళ్ల దగ్గరికి వెళ్తే సరిపోతుందనిపిస్తోంది. వెళ్ళిరావటంతో చాలా అలసట అవుతోంది.”
“మేం ఉంటున్న ఇల్లు పెద్దదే. గెస్ట్రూమ్ విడిగా ఉంది. నీకిష్టమైతే వుండచ్చు” అంది అరుణ.
“వండ్రఫుల్ ఐడియా!” వెంటనే ఒప్పుకుంది సుచేత.
సుచేతని కిషోర్‌కి పరిచయం చేస్తూ ఆమెను గెస్ట్‌రూమ్‌లో వుంచితే బావుంటుందన్న తన ఆలోచనని అతనితో చెప్పింది అరుణ.
ఆడవారి వుద్యోగాలు పెరిగిపోతున్న కొద్దీ సమస్యలు జటిలమవుతున్నాయి. ఇదివరకు భార్యాభర్తల్ని ఒకే దగ్గర ఉంచాలనీ, పెళ్లికాని అమ్మాయిలకు వీలైనంతవరకూ తల్లిదండ్రులదగ్గర పోస్టింగ్ ఇవ్వాలనీ కొన్ని ప్రాతిపదికలు ఉండేవి. చాలావరకూ అవి అమలయ్యేవి. మారుతున్న రోజుల్లో ఇది సాధ్యపడటంలేదు. సుచేతకి తల్లిదండ్రుల దగ్గరకి ట్రాన్స్ఫరవడానికి కొంత టైం పడుతుంది. ఈలోగా ఆమె ఇక్కడ వసతి చూసుకోవాలి. హెడ్‌క్వార్టర్స్‌లో వుండట్లేదని ఎవరేనా ఫిర్యాదు చేస్తే పెద్ద సమస్య. ఢిల్లీ నుంచి ఆమెను ఏపీకి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి అలిసిపోయిన ఆమె తండ్రి ఇప్పుడామెని తన దగ్గరకి ట్రాన్స్ఫర్ చేయించుకుని, పెళ్లి చేసి మళ్లీ ఇంకోచోటికి ట్రాన్స్ఫర్ చేయించే పనికన్నా మంచిదని సంబంధాలు చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయనకి సుచేత ఫ్రెండింట్లో పేయింగ్‌గెస్ట్‌గా ఉంటానని చెప్పిన మాటతో చాలా వూరటగా అనిపించింది. అరుణ ఆయనకి తెలుసు. అదీకాక ఆయనకి వర్కింగ్విమెన్స్ హాస్టల్స్మీద మంచి అభిప్రాయం లేదు. ఎవరికీ లేని అభ్యంతరం కిషోర్‌కి కూడా లేదు.
అరుణకి అనుకున్నకన్నా ముందే నెప్పులు మొదలయ్యాయి. కిషోర్ కంగారుపడుతూ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాడు. బేబీ పాజిషన్ మారిందని, సిజేరియన్ చేయాలని చెప్పింది డాక్టర్. వెంటనే అడ్మిట్ చేసేసాడు కిషోర్.
అరుణకి మనసులో భయంభయంగా ఉంది. దగ్గర నిల్చుని నీకేం భయం లేదని చెప్పేవాళ్లు లేరు. తల్లి గుర్తొచ్చింది. తను అన్యకులస్తుల్లో చేసుకుందని తండ్రికి కోపం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయనో, భార్యాభర్తలది ఏడేడు జన్మలబంధమనో అనే నమ్మకాన్ని మనిషి ఈ విషయానికి ఎందుకు అన్వయించడో అర్థమవదు.
ఆమె హిస్టీరిగ్గా ఏడుస్తుంటే డాక్టర్ కోప్పడింది. “చిన్నపిల్లలా ఏడుస్తున్నావేంటి? నీకేమీ కాదు. కళ్లు తెరిచేసరికి చక్కటి పాపాయిని చూస్తావు. బేబీని చూసేసరికి అన్నీ మరిచిపోతావు. మళ్లీ ఏడాదికల్లా…” అని నవ్వించింది.
ఆపరేషన్ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి. అవి సర్దుకునేసరికి ఒళ్లంతా నీరు పట్టింది. అందులోంచి బయటపడేసరికి. ఫిట్చొచ్చేవి. దాదాపు నెల్లాళ్లు హాస్పిటల్లోనే ఉంది. ఆమెనీ, పాపనీ చూసుకోవడానికి ఆయాని పెట్టాడు కిషోర్. పెద్దవాళ్లు పూనుకుని చేసే పెళ్లిలో అందరి సహకారం వుంటుంది. భార్యాభర్తలు ఒకరికోసం ఒకరనే భావాన్ని ప్రతిసారీ ఇండ్యూస్ చేస్తారు. ఇద్దరిలో ఒకవిధమైన నిబద్ధత చోటుచేసుకుంటుంది. ఎవరికివాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళలో స్వీయనియంత్రణ ఉండాలి. అదొక్కటే భార్యభర్తలిద్దరినీ కట్టిపడేసే బంధం.
అరుణ హాస్పిటల్లో తన అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో కిషోర్ ఇంట్లో ఒంటరిరాత్రులతో పోరాడేవాడు. సుచేత అదే ఇంట్లో ఉంటోందన్న ఊహ అతన్ని ప్రలోభపెట్టేది. ఆమెక్కూడా అరుణ లేకుండా వాళ్ళింట్లో ఉండటం ఇబ్బందిగానే ఉంది. వీలైనంతవరకూ వెళ్ళివస్తోంది. మరీ అలిసిపోయినప్పుడో, ఆఫీసులో లేటైనప్పుడో మాత్రం రూమ్‌కి వస్తోంది. వచ్చి కూడా పెద్దగా అరుణావాళ్ల విషయాల్లో తల్దూర్చకుండా అంటీముట్టనట్టే ఉంటోంది. రోజూ అరుణని చూసి వస్తోంది.
రోజూ రెండుమూడుసార్లయినా హాస్పిటల్ కి వెళ్లొస్తాడు కిషోర్, భార్య అనారోగ్యం అతనికి కొంచెం అసహనం కలిగిస్తోంది. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత డెలివరీ, ఈ అనారోగ్యం… జీవితంలో ఏమీ అనుభవించలేదనిపిస్తోంది అతనికి. ఆమెను పెళ్లి చేసుకుని తనేం సుఖపడ్డాడు? రావాల్సిన కట్నం రాలేదు. హాస్పిటల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. బాంక్బాలెన్స్ చాలా వరకూ. ఖర్చయిపోయింది.
పెళ్లి తర్వాతి మెట్టయిన వికర్షణలోకి అడుగు మోపాడు. ఆ తర్వాత రెండురోజులకి అతని కళ్లల్లో ఒకరకమైన అపరాధభావన కనిపించింది అరుణకి. ఇంటికొచ్చాక అదేమిటో అర్థమైంది. అప్పటికి సుచేత రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.
తనతో ఒక్క మాటయినా చెప్పకుండా వెళ్లిపోయిందేమిటి? అని పదే పదే ప్రశ్నించుకుంది. అరుణ. కిషోర్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడా అనే అనుమానం తలెత్తింది. సుచేతగురించి ఆమెకి బాగా తెలుసు. తక్కువగా ఊహించలేకపోయింది. ఆమెకలాంటి అవసరం లేదు కూడా. ఇకపోతే కిషోర్! అతనూ తక్కువగా ప్రవర్తించడు. కానీ తేడా ఒక్కటే. స్త్రీ పురుషులకి మౌలికంగా ఆలోచనా వైరుధ్యం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో స్త్రీకి వున్నంత మానసిక అనుబంధం మగవాడికి వుండదు. లిబిడో అనేది స్త్రీపురుషులిద్దరికీ సమానమే ఐనా, కట్టుబాట్లు స్త్రీ జీవితాన్నీ, స్వేచ్చ మగవారి జీవితాన్నీ శాసిస్తుంటాయి.
సుచేతకి ఆఫీస్‌కి ఫోన్ చేసింది అరుణ. సుచేత పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేయ్యబోతుంటే తనే అంది “చంటిపిల్లనీ, నా నీరసాన్నీ వెంటేసుకుని నేనే అక్కడికి రానా? లేకపోతే నువ్వే వస్తావా? నువ్వేదో దాస్తున్నావు.. అదేమిటో నాకు తెలియాలి”
సుదీర్ఘంగా విశ్వసించింది సుచేత. “సాయంత్రం అటొస్తాలే!” అని ఫోన్ పెట్టేసింది. తనుకూడా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో కిషోర్.
“పాపం, ఆ అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావు? నీ మనసులో ఏమని అనుమానిస్తున్నావో, అది నిజమే! ఇట్ వాజ్ జస్ట్ కాజువల్. అందులో ఏ కమిట్మెంటూ లేదు!” అన్నాడు.
అరుణ దిగ్భ్రాంతికి గురైంది. “మన దాంపత్య ఫలితంగా గర్భం తెచ్చుకుని నేను హాస్పిటల్లో చేరి చావుబతుకుల్తో పోరాడుతుంటే మీరు … మీరిక్కడ కాజువల్ ప్లెజర్స్ వెతుక్కున్నారా?” అతి కష్టంమీద అంది.
తప్పుచేసిన మనిషికి నిలదీయటం నచ్చదు. కిషోర్‌కే నచ్చలేదు అరుణ తననలా నిలదియ్యటం. “ఎందుకంత విపరీతంగా ఆలోచిస్తావు? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అన్నం తినలేదా? స్నానం చేయలేదా? అలాగే ఇదీను! మేమిద్దరం ఆ విషయాన్ని మరిచిపోవాలనుకున్నాం, ఇప్పుడు నువ్వు సుచేతని పిలిచి పెద్ద సీన్ క్రియేట్ చెయ్యకు!” అన్నాడు.
వెంటనే సుచేతకి రింగ్ చేసి, “మీరు రానవసరం లేదు. అరుణకి నేను నచ్చజెప్తాను!” అని చెప్పాడు.
అతని ధోరణికి అరుణ తికమకపడింది. అతనికి సుచేతతో ఎలాంటి కమిట్మెంటూ లేదు. మరి తనతోటయినా ఉందా? ఎంత తరచి తరచి ఆలోచించినా లేదనే అనిపించింది. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఎంత పొరపాటు చేసింది! నిజాయితీగల శతృవుతో సహజీవనం చేయవచ్చుగానీ నిజాయితీ లేని మిత్రుడితో చేయడం కత్తిమీద సాములాంటిది. తనేం చెయాలిప్పుడు?
ఒకటి కాదు, రెండు కాదు. రోజుల తరబడి ఆలోచించింది అరుణ. విడిపోవడం తప్ప మరో గత్యంతరం కనిపించలేదు. మెటర్నిటీ లీవు పూర్తయ్యేసరికి ప్రమోషన్‌మీద ట్రాన్స్పర్ వచ్చింది. దాన్ని తీసుకుని వెళ్లి చేరిపోయింది. పిండిబొమ్మలా బలహీనంగా తయారైన అరుణ మూడునెలల పసిపాపతో ఇంట్లోంచి కదిలి వెళ్తుంటే కిషోర్‌కి బాధనిపించింది. ప్రమోషన్ వద్దనుకుంటే ఆమెను ఇక్కడే ఉంచుతారు. అయినా ఆమె వెళ్లడానికే నిశ్చయించుకుంది. అంటే… తనకి దూరంగా వెళ్లిపోవాలనుకుంటోందా? ఆమె మనసులోంచీ ఒక్కమాట కూడా బయటకు రాలేదు. ముందుగా తనే మాట్లాడటానికి అహం అడ్డొచ్చింది కిషోర్‌కి.
వెళ్లే ముందు కిషోర్‌తో మాట్లాడింది అరుణ. “సుచేతతో ఇంత జరిగాక కూడా ఏ కమిట్మెంటూ లేదన్నారు. దాన్నిబట్టి చూస్తే నాతోటయినా ఉందో, లేదో అనేది అనుమానమే. స్త్రీ అంటే కాజువల్ ఎంటర్టైన్మెంటు మీ దృష్టిలో. అలాంటప్పుడు మనం కలిసి ఉండటంలో అర్థం లేదు. అర్థం లేకుండా కలిసి ఉండటం కన్నా విడిపోవటం మంచిది.”
వికర్షణలో కడపటి అంచుకు చేరుకున్నాడు కిషోర్, “చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. విడిపోవాలన్నదే నీ కోరికైతే అలాగే కానీ!” తిరస్కారంగా అన్నాడు.
దాదాపు ఏడాదిదాకా సుచేత కిషోర్‌ని కలవనేలేదు. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసి చాలా బాధపడింది. అరుణని కలుద్దామని రెండుసార్లు ప్రయత్నం చేసి విరమించుకుంది. తామిద్దరూ మార్కెట్లో కలవటం దగ్గిర్నుంచి ఒక్కొక్కటీ గుర్తొచ్చి విషయాలన్నీ ముళ్లలా గుచ్చేవి. మరోవైపు కిషోర్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం మరుపుకి రావటం లేదు. అతను కావాలని కాదు, అతన్తో ఇంతదాకా వచ్చాక ఏమీ జరగనట్టు మరో వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన.
తండ్రి తెచ్చిన సంబంధాలన్నీ తిరగ్గొట్టింది. కొన్నాళ్లక్రితందాకా పెళ్లికి సుముఖంగా ఉన్న సుచేత ఒక్కసారిగా ఎందుకిలా మరిపోయిందోనని ఆమె తల్లికి సందేహం కలిగింది. కూతుర్ని తరచి తరచి అడిగి విషయం రాబట్టుకుంది.
“అయితే వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా?” నిర్ధారణకోసం అడిగింది.
“ఊ<“
“పాప ఎక్కడుంది?”
“అరుణే తీసుకెళ్లింది”
“అతనెలాంటివాడు చేతూ?”.
ఎలాంటివాడని చెప్తుంది? సమాజంలో ప్రస్తుతం స్థిరపడి ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మంచివాడే. మంచివాడైతే ఇలా ఎందుకు జరుగుతుంది? చెడ్డవాడైతే అరుణని పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? ఎటూ నిర్ధారించలేకపోయింది.
ఆమె మనస్థితిని అర్థం చేసుకుంది తల్లి. “అరుణ లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుందికాబట్టి అతనికి ఆమెపట్ల గౌరవం అంతంతమాత్రంగానే ఉంది. మేం వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం స్థిరపరుచుకుని వస్తాం. చూడు, అతను నీ కొంగు పట్టుకుని తిరక్కపోతే…” అంది.
అతన్ని తను చేసుకోవాలా? సుచేత సంఘర్షణ పడింది.
“అరుణ వదిలేసినా, నువ్వు చేసుకోనన్నా.. అతనికేం నష్టం లేదు. మరో ఆడపిల్ల ముందుకొస్తుంది. నువ్వయినా పెళ్లిచేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? ఎవరో ఒకర్ని చేసుకోక తప్పదు. ఇలాంటి విషయాలు దాగవు. బయటపడితే ఎంతెంత గొడవలొస్తాయి? నువ్వే ఆలోచించుకో చేతూ!”
తల్లి మాట కాదనలేకపోయింది సుచేత. ఆమె వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లే. కానీ ఆమె వ్యక్తిత్వం తల్లిదండ్రులని సమాజంతో క్రాస్ చేస్తే తయారైన హైబ్రీడ్ మొక్కలాంటిది.
“ఎలా ఉంది చేతూ?”
శ్రోతలిద్దరూ తెల్లబోయారు. ఆ ముగ్గుర్లోకీ ముందుగా సర్దుకున్నది అరుణే. కాబట్టే ఇక్కడికి రాగలిగింది. సుచేత పక్క దగ్గరగా స్టూలు లాక్కుని కూర్చుంది.
సుచేత కళ్లలో నీళ్లు నిండాయి. “నీకు ద్రోహం చేశాను. దానికి శిక్ష అనుభవిస్తున్నాను!”
“నువ్వు నాకు ద్రోహం చేయడమేమిటి? నాన్సెన్స్! అతను ఎరవేసిన గాలానికి చిక్కుకున్న మొదటి చేపని నేను, రెండో చేపని నువ్వు, అంతే!”
కిషోర్ కూర్చున్న చోట అస్థిమితంగా కదిలాడు. అక్కణ్ణుంచి లేచి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ ఆ పని చెయ్యలేకపోయాడు.
“పాపని హాస్టల్లో చేర్పిస్తుంటే చూశాను. మూడేళ్ల పిల్లని హాస్టల్లో ఉంచడమేమిటి?”
“అంతా నా కర్మ! ఎవరున్నారని దాన్ని చూడటానికి? అమ్మా, నాన్నా యాక్సిడెంట్లో పోయారు, తమ్ముడు కెనడాలో ఉన్నాడు. కిషోర్ అమ్మానాన్నలకి ఇక్కడికి వచ్చి వుండే వీలు లేదు. ఇది అక్కడ వుండలేదు. బెంగపెట్టుకుని ప్రాణంమీదికి తెచ్చుకుంది. తను … తనకి నన్ను చూసుకోవటం, ఆఫీసుకెళ్లటంతోటే సరిపోతోంది!”
“మా పాపకూడా అదే స్కూలు, నీ కూతుర్ని నేను తీసుకెళ్లనా? ఇద్దరూ కలిసి వెళ్లి వస్తూంటారు”
ఒక్క క్షణం … అక్కడ నిశ్శబ్దం కూడా నివ్వెరబోయింది.
“అరుణా!” దిగ్భ్రాంతిగా అంది సుచేత. “పాపని… నువ్వు … తీసుకెళ్తావా? ఎందుకు? ఎందుకని నామీద నీకింత దయ కలిగింది?” ఉద్వేగం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయింది సుచేత. ఆత్మీయులమంటూ ఒకరొచ్చి బాధని పంచుకోవటంలో ఇంత ఆనందం ఉంటుందా? అరుణ తనకి చేయూతనిస్తుందా? తన పాపకి అమ్మ కాబోతోందా? ఎంతో నిశ్చింత కలిగిందామెకి. కిషోర్‌తో ఆమెకి పూర్తిస్థాయిలో ఎలాంటి అనుబంధమూ ఏర్పడలేదు. అన్నిటికీ మించి అతన్ని విశ్వసించలేకపోతోంది. అరుణ ఉండగానే తనతో సంబంధం ఏర్పరుచుకున్న అతను మూడో స్త్రీని ఆహ్వానించడని నమ్మకమేమిటి? కిషోర్ మరోలా ఆలోచిస్తున్నాడు. అరుణ ఒంటరితనంతో బాగా విసిగిపోయింది. ఈ ప్రతిపాదనతో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకుందామనుకుంటోందని భావించాడు.
సుచేత “ఎందుకు”కి అరుణ నింపాదిగా జవాబిచ్చింది. “కిషోర్ మరో చేపని వెతుక్కోవాలి చేతూ! అందుకు ఈ పసిది ఆటంకంగా ఉంటుందని!!”
కిషోర్‌కి మిడిగుడ్లు పడ్డాయి. తన జీవితంలోంచి మౌనంగా నిష్క్రమించిన అరుణ… తనుందో, లేదో ఎక్కడుందో కూడా తెలియకుండా బతికిన అరుణ… ఇంత హఠాత్తుగా పునఃప్రవేశం చేసింది, తనమీద కక్ష తీర్చుకోవడానికన్నమాట! సుచేత ఆమెతో ఏకీభవిస్తుందా? ఆత్రంగా ఎదురు చూశాడు. అతను ఎదురు చూసినంతసేపు పట్టలేదు. ఆమె అంగీకారం చెప్పడానికి.
ఆ ఇద్దరు స్త్రీల అవిశ్వాస ప్రకటనతో అతని అంతరంగానికి ఉరి పడింది.
(ఆంధ్రప్రభ దినపత్రిక, ఆదివారం 11.1.1999)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.