ఒకరికి ఇద్దరైతే… by Tulasibhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  3. శోభ by Thulasi Bhanu
  4. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  5. ఒకరికి ఇద్దరైతే… by Tulasibhanu
  6. మనోరంజని by Thulasi Bhanu

“ఒరేయ్.. ” అన్న తల్లి శారద అరుపుకి, బాల్కనీలో నిలబడి ఫోన్ చూసుకుంటున్న విహారి ఉలిక్కిపడ్డాడు, అంతే అతని … చేతిలోని ఫోన్ జారి గ్రౌండ్ ఫ్లోర్‍కి పడిపోయింది.
“ఎన్నిసార్లు చెప్పాలిరా, సోఫామీద టిఫిన్ ప్లేట్ పెట్టి తినద్దని? సోఫాలో చట్నీ, కారప్పొడి పడ్డాయి. కనీసం తిన్న వెంటనే శుభ్రం చేయవు, అలాగే వదిలేస్తే మనం కూర్చునేటప్పుడు ఎంత చిరాగ్గా ఉంటుంది… ” ఇహ ఆవిడ శుభ్రత స్పీచ్ ఆగదు.
విహారి కూడా ఆగకుండా కిందకు పరిగెత్తాడు, ఫోన్ బతికుందా లేదా చూసుకుని వెనక్కు తెచ్చుకోవడానికి.
శారదకు శుభ్రత ముఖ్యం, విహారి పరమ బద్దకస్తుడు, ఎలా పడితే అలా బతికేస్తాడు. నిత్యం ఒకరివల్ల మరొకరికి హింస తప్పదు.
“ఆదివారం వస్తే నేను వంట చేస్తా” అంటాడు విహారి. వంటింటిని చెల్లాచెదురు చేసిపడేస్తాడు. అతని మీద వాగి వాగి శారదకు ఆయాసం తప్పదు.
సుబ్బారావుకి హాయిగా చెవుడొచ్చి పదేళ్ళయ్యింది, ఆఫీసులో తప్ప ఇంట్లో, అది కూడా శారద ఉండే దరిదాపుల్లో, చెవిటి మిషన్ అస్సలు ఉపయోగించడు… బోడిగుండంత ఉత్తమం లేదు అన్నట్లుగా, చెవుడంత సుఖం లేదు అనుకుంటాడు ఆయన. శారద మాటలు వినకుండా తప్పించుకోవచ్చని.
విహారికి తన గదిలోమాత్రం కాస్త శాంతి దొరుకుతుంది. ఎదిగిన కొడుకుకి ఏకాంతం అవసరం అనేమో, శారద, విహారి గదిలోకి ఎక్కువ
చెకింగ్‍కి రాదు.. కాబట్టి విహారి ఇంట్లో ఉన్నప్పుడు కాస్త తన రూమ్‍లో తనకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా, ఇష్టారాజ్యంగా ఉంటాడు.
కానీ, విధి చాలా బలీయమైనది.


స్వప్న, భార్య రూపంలో విహారి జీవితంలోకి వచ్చింది.
శుభ్రత విషయంలో శారదకంటే రెట్టింపు పట్టింపు స్వప్నకి.
విహారికి ఇహ గదిలోని స్వేచ్ఛాస్వతంత్రాలుకూడా ఆవిరయిపోయాయి.
అతను ఆఫీస్‍కి వెళ్ళేముందు హడావుడిగా రెడీ అవుతాడు. జుట్టు దువ్వుకుని దువ్వెన విసిరేస్తాడు, పౌడర్ రాసుకుని డబ్బాను పడేస్తాడు. చకచకా పరిగెత్తి పౌడర్ చేతుల్తోనే టిఫిన్ తినబోతాడు. అలాంటిది అనునిత్యం. ఆరోజుకూడా.
“ఏవండీ.. ” అని స్వప్న అరుపులాంటి పిలుపు రూమ్‍లోంచీ వినపడితే, విహారి ఉలిక్కిపడి వదిలేసరికి, చేతిలోని దోశ ముక్క, టపుక్కుమని జారిపడి, పచ్చడి గిన్నెలో మునిగిపోయింది. గబగబా రూమ్‍లోకి వెళ్ళాడు.
“పౌడర్ డబ్బా, దువ్వెన ఎక్కడ తీసినవి అలాగే అక్కడే పెట్టమని ” స్వప్న ఆదేశం.
తప్పదుగా, ఆమె చెప్పినట్లుగా చేసొచ్చి మళ్ళీ ఇంకో దోశముక్క తుంచుకుని తినబోయాడు.
“ఒరేయ్! పౌడర్ చేతులని శుభ్రంగా కడుక్కుని కదరా తినాలి…” శారద శాసనం.
“ఛీ… ” అని చేతిలోని దోశముక్కని, ప్లేట్లోకి విసిరికొట్టి, విరక్తిగా ఆఫీస్‍కి బయల్దేరుతూ షూస్ వేసుకోవటం మొదలుపెట్టాడు.
ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాగా. హాల్లో ఒకరూ, బెడ్ రూమ్‍లో మరొకరూ శుచీశుభ్రత క్రమశిక్షణ క్లాసులు తీసుకుంటుంటే అతనికి చిరాకు వచ్చేస్తోంది.
అప్పుడు, చెరోవైపూ అమ్మ, భార్య. ఒకరు తమ చేత్తో దోశముక్క, మరొకరు స్పూన్‍తో చెట్నీ, విహారి నోటికి అందిస్తున్నారు, తమ శుభ్రమైన చేతులతో.
“హు< వీళ్ళకి మళ్ళీ ఈ సెంటిమెంట్ యాంగిల్‍కూడా ఉందా?” అని దోశను కసాబిసా నమిలి తింటూ ఆలోచిస్తున్న విహారి కళ్ళకు ఎదురు సోఫాలో చిద్విలాసంగా నవ్వుతూ తననే చూస్తున్న తండ్రి కళ్ళల్లో ఓ భావం స్పష్టంగా కనపడింది.
అది…
“తమ బలిపశువు బలహీనపడితే ఎలా, మళ్ళీ తాము సాధించడానికి ఓ జీవి కావాలి మాకు… అనిరా, వాళ్ళ మనోభావం” అని అర్థమైంది.
“అమ్మో.. ఆహా.. ఇలా కూడానా.. ” అని అనిపించి. ఈ అని ఏడవాలనిపించింది.
సంవత్సరానికి పండంటి పాపాయి వచ్చేసింది స్వప్న ఒడిలోకి.
పసిపాపాయి ఉందని, త్వరగా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉందని శారద, స్వప్న వారి వారి శుభ్రతానియమాలను మరింత కష్టతరం చేసారు.
కాళ్ళు శుభ్రంగా కడుక్కుని, ఆఫీస్ బట్టలు మార్చుకున్నాకే చిట్టితల్లిదగ్గరకు రావాలి అని గట్టి నియమం విధించారు.
బద్దకిష్టు అయిన విహారికి ఇల్లు చేరిన వెంటనే ఫ్రెష్ అవ్వాలంటే వళ్ళు సహకరించదు. కానీ, వస్తూనే చిన్నిపాపను పలకరించాలని, బుజ్జిపాపను ఆడించాలని విహారికి ఆశ. అయినా సరే, పాప దగ్గరకు పూర్తి శుభ్రంగా అయితే తప్ప వెళ్ళరాదని తల్లి, భార్య రూలు. సరే, పాప మంచికోసం విహారి కడిగిన ముత్యంలా తయారయ్యి వెళ్ళేవాడు.
పాపకు ఏడేళ్ళు వచ్చాయి.
ఒకరోజు చిన్మయి పాపను సరదాగా బయటకు తీసుకెళ్ళాడు విహారి. గంట తరువాత ఇంటికొచ్చాక చిన్మయి, స్వప్నకు కళ్ళు తిప్పుతూ గమ్మత్తుగా చెప్పింది
“నాన్న నాకు గప్‍చుప్ తినిపించారమ్మా, భలే బావుంది” అని చెబుతూ, విహారి వైపు చూస్తూ, “నాన్నా! రేపుకూడా తింటాను” అని అంది గారాబంగా.
అంతే! స్వప్నకు కోపం వచ్చింది,
“చిన్నిపాపకి, నేను అన్నీ ఇంట్లో శుభ్రంగా కమ్మగా చేసిపెడుతున్నానుకదా, మీరెందుకూ అలా బయటివి ఎక్కడపడితే అక్కడ తినిపించటం? ఇదుగో గరికపాటివారు, తన ప్రవచనంలో ఏం చెబుతున్నారో చూడు ” అని అంటూ యూట్యూబ్‍లో ఓ వీడియో చూపిస్తోంది… ” అందులో గరికపాటివారు చెబుతున్నారు.
“పానీపూరీ అని ఖాళీ పూరీ ఒకటి చిల్లుపెట్టి ఏదో రసం నీరసం అని పోసిస్తారు. అది ఆహా ఓహో అని అందరూ తినటం, ఆ పానీ పవిత్రం, ఆ పూరీ పవిత్రం, ఆ గరిటె పవిత్రం, ఆ బండి పవిత్రం, ఆ బండి పక్కనున్న మురిక్కాలవ మరీ పవిత్రం.. అవి ఇంకా ఇంకా కావాలని తినటం, రుచి మాత్రమేనా అండీ, శుచి ఉండద్దూ.. ” అని అలా అలా సాగుతోంది ఆ వీడియో.
ఇహ ఈ వీడియో పూర్తయ్యాక, మళ్ళీ స్వప్న స్పీచ్‍లు కూడా ఏ లెవల్‍దాకా వెళతాయో, అర్ధమైన విహారి నీరసంగా కూలబడిపోయాడు.
ఇంతలో భార్య ఒక్కతే చాలదన్నట్లు, తల్లి శారద వంటింట్లోంచీ శుభ్రంగా కడుక్కున్న చేతులు చీరకొంగుతో తుడుచుకుంటూ, వచ్చి, ” ఏరా కూతురికి శుభ్రమైన తిండి మాత్రమే పెట్టాలని తెలియని వాడివి నువ్వేం తండ్రివిరా… ” అని తనుకూడా మొదలుపెట్టింది…
అమ్మో ఒకరికి ఇద్దరయ్యారు బాబోయ్, నా బుర్ర తింటానికి… అని అనుకుని లేని ఓపిక తెచ్చుకుని మరీ బయటకు పారిపోయాడు పాపం విహారి.