పగలంతా బాగా వర్షం కురిసి సాయంత్రానికి తెరిపి నిచ్చింది. తడిసిన మట్టి వాసన పీలుస్తూ చల్లటిగాలి ఆస్వాదిస్తూ ఆరుబయట నిల్చుంటే కడిగిన ముత్యంలా ప్రకృతి మైమరపిస్తోంది. “మమ్మీ! కాసేపలా వెళ్ళి ఆడుకుని వచ్చేస్తాం” సోనూ తన జత పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చింది.
“స్వెటర్లేసుకుని వెళ్ళండి. చలిగా వుంది. ఎక్కువసేపు వుండదు. చప్పునొచ్చేయ్యండి”
పిల్లలు తూనీగల్లా పరిగెత్తారు. పగలంతా యింట్లోనే వుండి విసిగిపోయారేమో, ఆ విసుగంతా వాళ్ళ పరుగుల్లో తుర్రుమంది. నేను మొక్కలమధ్య కాసేపు తిరిగి లోపలికొచ్చాను. నా వెనకాలే పిల్లలూ వచ్చేసారు.
అందరికన్నా ముందొచ్చి నా చెరోపక్కనీ నిలబడ్డవాళ్ళు సోనూ, మనోజ్. సోనూ మా పిల్ల. మనోజ్ పక్కవాళ్ళ అబ్బాయి. ఇద్దరి మొహాల్లోనూ సంభ్రమం. ఏదో అద్భుతం జరిగినంత ఆశ్చర్యం.
“మమ్మీ! మమ్మీ!” తన పిడికిలి తెరిచి చూపించింది సోనూ.
చిన్న చేపపిల్ల! కొర్రమీను.
నేను ఒక్కడుగు వెనక్కేసాను. “ఛీ..ఛీ.. పారెయ్యండి. ఎక్కడి నుంచీ తెచ్చారు దీన్ని? ముందది చచ్చిపోతుంది. నీళ్ళలో పడేసెయ్యండి. తర్వాత తీసికెళ్ళి కాలువలో వదిలిపెట్టండి” అని కేకలు పెట్టాను.
మనోజ్ ఒక్క పరుగున వెళ్ళి మగ్గుతో నీళ్ళు తెచ్చాడు. సోనూ చేతిలోని చేపపిల్లని అందులోకి వదిలింది. ప్రాణం వచ్చినట్లై అది నీళ్ళలో కదలడం మొదలుపెట్టింది. అది ఈదుతుంటే వీళ్ళిద్దరూ విస్మయంగా చూస్తున్నారు. నాకు తల్లో పేనుని చూసినా వీధిలోని కుక్కని చూసినా ఒకే విధమైన ఎలర్జీ. కుక్కపిల్లనీ, పిల్లిపిల్లనీ దేన్నీకూడా పెంచుకోవాలనిపించదు. మిగిలితే యింతన్నం పేపర్లో పెట్టి తెచ్చి, గేటవతల పెడ్తాను. ఏ కుక్కో తిని వెళ్తుంది. అంతకు మించిన అనుబంధాన్ని పెంచుకోను.
ప్రదీప్, సోనూ అలా కాదు. వీధిని పోయే కుక్కపిల్ల, పెరట్లో దొరికిన వంటరి పిల్లికూన దారితప్పిన గొర్రెపిల్ల, మందలోంచీ జారుకున్న మేకపిల్లా అన్నీ వాళ్ళిద్దరికీ నేస్తాలే. ఒక గంటో, రోజో, రెండురోజులో వాటితో ఆడుకుని గమ్యానికి చేరుస్తారు. ఇప్పుడీ చేపపిల్ల మా కొత్తఅతిథి. ప్రదీప్ ఆఫీసునుంచీ వచ్చేదాకా పిల్లలిద్దరూ మగ్గునీ చేపనీ కాపలాకాస్తూ కూర్చున్నారు. కారణం మూడుసార్లది బైటికి గెంతింది. మిగిలిన పిల్లలంతా ఆటలకి వెళ్ళిపోయారు. ప్రదీప్ స్కూటర్ చప్పుడు వినగానే యీ యిద్దరూ ఈ వార్త అందించడానికి వెళ్ళిపోయారు.
నేను మగ్లోకి తొంగి చూసాను. గిరికీలు కొడ్తూ యీదుతోంది అందులోని చిన్నిప్రాణి. నల్లగా వుంది. పెద్ద అందంగా ఏమీ లేదు. ఒక మొప్ప మీద పుట్టుమచ్చలాంటి చుక్కేదో వుంది. ఒకచోట తటస్థంగా వుండకుండా కాసేపు తోకమీద నిలబడి గెంతుతూ, కాసేపు గిరికీలు కొడుతూ యీదుతోంది. దాని చిన్ని ఆకృతి… అదేనా దానిలోని ఆకర్షణ? తేల్చుకోలేక పోయాను.
ప్రదీప్ యింట్లోకి రావటమే పెద్ద కోలాహలంగా వచ్చిపడ్డాడు. సిటీ పొలిమేరల్లో వుంటుంది మా యిల్లు. అతని ఆఫీసుకి దాదాపు గంట ప్రయాణం. కానీ అంతసేపు స్కూటర్మీద ప్రయాణించిన అసలటేదీ అతని ముఖంలో కనిపించలేదు.
“ఏదేదీ?” అంటూ కొత్త అతిథిని చూసి చాలా ముచ్చటపడ్డాడు.
“ఇంక ఆడింది చాలుగానీ, దీన్నా కాలువలో వదిలేసి రండి” అన్నాను.
“చాల్చాల్లే! ఇంతందంగా వున్నదాన్ని వదిలెయ్యమంటావేంటి? మేం దీన్ని పెంచుకుంటాం. ఈసారి నీమాట వినేది లేదు. నీకు చిరాకు కలిగేలా యిది యిల్లంతా తిరగదు. ఒక్కచోటే వుంటుంది. చూడు… ఎంత బావుందో!” అని సరదాపడ్తూ ఒకటే హడావిడి పెట్టేసాడు.
“సోనూ! పెద్ద బోర్నవిటా సీసా తీసుకురా! దీన్నందులో పెడదాం ఇప్పటికి. మనో, గోధుమపిండి చిన్నవుండ చేసి పట్రా! సోనూ… యిప్పుడు నీ టర్న్. కాంపౌండులో మూల ఇసుక వుంది. చూడు, అందులోంచీ గులకరాళ్ళూ, శంఖాలూ, గవ్వలూ ఏరి తీసుకురావాలి. మనో… పెద్ద
మగ్‌తో నీళ్ళు తేరా…”” అంటూ కమేండ్లి స్తుంటే పిల్లలు ‘ఎస్ బాస్’ స్టయిల్లో చేసారు. నేను నిస్సహాయంగా చూసాను.
చేపపిల్లకి చిన్న ఎక్వేరియం తయారు. సోనూ దాన్ని తన టేబుల్మీద పెట్టుకుంది. మనోజ్ చిన్నబుచ్చుకున్నాడు.
“రేపు నీ టేబుల్మీద. ఒకరోజు నీ దగ్గర, ఒకరోజు సోనూ దగ్గర” వంతులు వేసాడు ప్రదీప్. మనోజ్ వప్పుకున్నాడు. కాసేపటికి వాడికి యింటినుండీ పిలుపు వచ్చింది. వెళ్ళిపోయాడు. సోనూ నూత్రం తన స్టడీ టేబుల్‌కే అతుక్కుపోయింది. అన్నం కూడా అక్కడే తింది.
మర్నాడు స్కూల్ నుంచీ వస్తూ సోనూ తన ఫ్రెండ్సందరినీ వెంటబెట్టుకుని వచ్చింది. కొత్త నేస్తాన్ని చూపించడానికి.
వాళ్ళంతా ఒకటే ప్రశ్న. “మీరు ఫిష్ తింటారా?” అని.
“ఊహు..” అంది సోనూ.
“మరి దీన్నేం చేస్తారు? రెండు, మూడు నెలల్లోనే యింత పెద్దదౌతుంది” మోచెయ్యి దాకా కొలత చూపిస్తూ అడిగాడొక అబ్బాయి.
“మేం పెంచుకుంటాం!”
“పెంచుకుని ఏం చేస్తారు?”
“ఏదో ఎందుకు చెయ్యాలి? ఏమీ చెయ్యం”
రోజులు గడుస్తున్నాయి.
బోర్నవిటా సీసాలోని చేపపిల్ల జానెడైంది. నానిన సేమ్యా పలుకులు, గోధుమపిండి వుండలు, పాలకూర ఆకులు, ఏం పెట్టచ్చో జాగ్రత్తగా వూహించుకుని, ఫక్తు శాకాహారిలా పెంచుతున్నారు దాన్ని. ఇప్పుడుంచిన సీసా దానికి చాలటం లేదు. అది స్వేచ్ఛ కోరుకుంటోందేమో, దానికీ భావోద్వేగాలున్నాయేమో నాకు తెలీదు. అయిష్టంగా, అనాక్తిగానైనా దాన్ని గమనించటానికి అలవాటు పడ్డాను. అది చోటు చాలక సీసా గోడల్ని కొట్టుకుంటే దానికి కోపం వచ్చి, యిలా చేస్తోందేమోననుకుంటాను.
ప్రదీప్ చిన్న గ్లాస్బాక్స్ కొనుక్కొచ్చి అందులోకి దీన్ని మార్చాడు. సోనూ దాంతో బాగా అనుబంధం పెంచుకుంటోంది. అది తనదని అనిపించుకోవటానికి మనోజ్ ఏదడిగితే అది యిచ్చేసింది. చాక్లెట్ రేపర్స్తో చేసుకున్న బొమ్మలు, నేమ్‌స్లిప్స్, సెంటెడ్ పెన్ను.. ఏదంటే అది.
అనూహ్యమైన సంఘటన జరిగిపో యింది.
ప్రదీప్ స్నేహితుడు, ప్రసాద్ మా యింటికొచ్చాడు. ప్రదీప్ ఆ సమయాన ఇంట్లో లేడు. వస్తూనే సోనూ టేబుల్ మీద వున్న గ్లాస్బాక్స్మీద అతని దృష్టిపడింది.
“అరే.. కొర్రమీను బాగా పెద్దదైంది. మీకెందుకిది?” అడిగాడు.
“సోనూ పెంచుతోంది. ఆమధ్యని పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్తే కాలువగట్టున దొరికిందట” చెప్పాను. కాసేపు ప్రదీప్కోసం చూసి వెళ్తానని లేచాడు.
“బాగా పెద్దదైంది. వికారంగా లేదూ? పెంచుకోవటానికి యివికాదు. నేను తనకి గోల్డ్‌ఫిష్ తెచ్చిస్తాను. చిన్న ఎక్వేరియం బాక్స్ కూడా” అంటూ నేనింకో మాట చెప్పినా వినకుండా దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. స్కూలునుంచీ రాగానే సోనూ బాగా గొడవచేసింది చేప యేదని.
“ప్రసాద్ అంకుల్ తీసుకెళ్ళాడే. ఇదేం బాలేదట, రేపు చిన్నచిన్న గోల్డ్‌ఫిష్ తెచ్చిస్తానన్నాడు” అన్నాను.
“బాలేనిది అంకుల్ కెందుకట? నా ఫిష్ నాకే కావాలి” అంది ఏడుస్తూ. ప్రదీప్ వచ్చేదాకా ఏడుస్తూనే వుంది.
“ఇది గొడవ చేస్తుందని తెలీదా? ఎందుకిచ్చావ్?” అని నన్ను కోప్పడ్డాడు.
“బావుంది. అతను నా మాట వినిపించుకుంటేనా?” అన్నాను నేను. ప్రదీప్ అలాగే వెళ్ళిపోయాడు ప్రసాద్ వాళ్ళింటికి. చాలాసేపయ్యాక తిరిగొచ్చాడు. వెంట ప్రసాద్ కూడా వున్నాడు. నల్లచేపగానీ ఎక్వేరియం బాక్స్గానీ లేదు. రెండు కుందేళ్ళున్నాయి. వాటిని కాంపౌండులో గడ్డిలో వదిలిపెడితే గెంతుతూ అటూ యిటూ తిరగటం మొదలుపెట్టాయి. సోనూ వాటి ప్రేమలో పడిపోయింది.. మితృలిద్దరూ లోపలికి వచ్చారు. ఉన్నట్టుండి ప్రసాద్ పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. హాలంతా దద్దరిల్లిపోతోంది.
“ఏంటి?” అడిగాను నేను.
“శాకాహారి చేప” అన్నాడు నవ్వుతూనే. నాకూ నవ్వొచ్చింది. “అదేంటి?”
అతను చెప్పేంతట్లో సోనూ వచ్చింది. “అంకుల్! నా చేపేది?” అడిగింది కోపంగా.
దగ్గరకి రమ్మని చేతులు చాపాడతను. సోనూ తన కోపాన్ని యింకా వ్యక్తపరుస్తూ దూరంగానే వెళ్ళి నిలబడింది. అతనే లేచి వెళ్ళి ఎత్తుకుని వొళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
“మీ యింటికి రాగానే ఆ చేప ఏడుస్తూ కనిపించిందిరా సోనూ!” అన్నాడు.
“నాకెప్పుడూ అలా కనిపించలేదుగా? “
“నీళ్ళల్లో వుంటుంది. అందుకేమో!!”
“మరి నీకెలా కనిపించింది?”
“నాకు వాటి భాష తెలుసు!”
“ఎలా వచ్చు?”.
“మా యింట్లో అక్వేరియం బాక్స్ వుంది కదా? రోజూ వాటితో మాట్లాడుతుంటాను”
“ఐతే నా చేప ఏమంది?” “
“ఈ సోనూ నాకన్నీ నచ్చనివే పెడ్తోందని చెప్పింది. దానికి ఇష్టమైనవేవీ పెట్టవటగా?”
“దానికేంటిష్టం?”
“ఫిష్‌ఫీడ్”
“అంటే?”
“వామ్స్”
“యాక్!”” అంది సోనీ వెంటనే. ప్రసాద్ మళ్ళీ నవ్వేసాడు. అతనూ ప్రదీప్ కలిసి అక్వేరియం షాపుకి వెళ్ళారట. ఫిష్‌ఫీడ్ మాట వినగానే ప్రదీప్ వద్దనేసాడట. తిరిగొస్తూ దార్లో కుందేళ్ళని కొనుకొచ్చారు.
“కుందేళ్ళు శాకాహారులు. వాటికి మంచిగా గడ్డీ, కేరట్లు పెట్టి పెంచు. నేనొస్తాను, తీసికెళ్ళడానికి” అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.
“ఎందుకు తీసికెళ్ళడం?” అని సోనూ అడుగుతూనే వుంది. అతను జవాబివ్వకుండా నవ్వుతూనే వున్నాడు.
“ఇల్లీగల్ కదూ?” నేను కొంచెం గట్టిగానే అడిగాను.
“కుందేలు కాదు. చెవులపిల్లి ఔను” అతని జవాబు.
ఎర్రటి భావహీనమైన కళ్ళతో గడ్డిలో తిరుగుతున్న కుందేళ్ళని చూస్తుంటే నాకెలాంటి యిష్టమూ కలగలేదు. మనం పిలిచినా చిటిక వేసినా అని స్పందించవు. వాటికి మనుషులతో ఎలాంటి అనుబంధం వుండదు. అంత తేలిగ్గా మచ్చిక కావు. తెల్లగా వెన్నెలముద్దల్లా వుంటాయని వాటిని చూసి మనం సంతోషపడటమే. వాటి గెంతులు, వాటి తిండీ, వాటి ప్రపంచం వాటిది. అవి తొందర తొందరగా పిల్లల్ని పెడుతున్నాయి. ఉడుతపిల్లలంత చిన్న చిన్న పిల్లల్ని. వాటిని కాపాడటం కష్టంగా వుంది. కాంపౌండులో పెద్దవి తిరుగుతుంటే వీధి కుక్కలు గేటు దగ్గరకొచ్చి మొరుగుతున్నాయి. ప్రదీప్‌కి ఎందుకో కుందేళ్ళ పెంపకం నచ్చలేదు. వాటిని కొన్న దగ్గరే యిచ్చేసి వచ్చాడు. సోనూ అభ్యంతరం చెప్పలేదు. పెద్దదౌతోంది. సెవెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడ్డాయి సోనూకి. చదువులో పడిపోయింది. బొమ్మలన్నీ షోకేసులో స్థానాలని వెతుక్కున్నాయి.
సోనూకి డాక్టరవాలనే కోరిక ఏర్పడింది. ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంటర్లో హాస్టల్లో చేరింది. మెడిసిన్‌లో యింక్కెక్కడో సీటొచ్చింది. ఇల్లంతా మూగవోయింది. తనతోపాటే తన ఫ్రెండ్సంతా కూడా పెద్ద య్యారు. ఎక్కడెక్కడి కాలేజీల్లోనో సీట్లు వచ్చి వెళ్ళిపోయారు.
ఎప్పుడో సెలవుల్లో వస్తారు. ఇల్లూ వాకిలీ అంతా సందడి నింపి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక ఆ సందడి మా గుండెల్లో ప్రతిధ్వనిస్తూ వుంటుంది. జ్ఞాపకాల తరంగాలై గుండె చెలియలికట్టని తాకుతూ వుంటాయి.
ఎమ్మెస్ చేస్తున్నప్పుడు సోనూ రాహుల్‌ని తీసుకొచ్చి పరిచయం చేసింది. తెల్లగా పొడుగ్గా వున్నాడు. బక్కపలుచగా వున్నా దర్పం కనిపిస్తోంది. విప్రోలో సాఫ్ట్వేర్ యింజినీరనీ, లక్ష జీతమనీ తెలియగానే అనీజీగా అనిపించింది. భావరహితమైన కుందేళ్ళ కళ్ళు గుర్తొచ్చాయి. వాటి లోకం వాటిది, అందులో యింకెవరికీ ప్రవేశం లేదని కూడా. ఇతని అంతరంగిక ప్రపంచంలోకి ఓ మధ్యతరగతి ఆడపిల్లకి ప్రవేశం వుంటుందా?
“డాడీ! మేం ప్రేమించుకుంటున్నాం. అతని తల్లిదండ్రులకి యిష్టమే. మీరూ వప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాం” అంది సోనూ.
నా గుండె దడదడలాడింది. ప్రదీప్ ఏమంటాడోనని చూసాను.
“వప్పుకోకపోతే?” సీరియస్‌గా అడిగాడు ప్రదీప్.
“వప్పుకునేదాకా ప్రేమించుకుంటూనే వుంటాం” అంది సోనూ అంతకంటే సీరియస్‌గా.
తండ్రీ కూతుళ్ళు ఒకరికంటే ఒకరు పెద్దనటులు. వాళ్ళ సీరియస్‌నెస్ నటన. మీరొప్పుకోకపోయినా మేం చేసుకుంటాం అంటే ప్రదీప్
హర్టయ్యేవాడేమో. అతనెలాగా వప్పుకుంటాడని సోనూకి తెలుసు. అందుకే అలా అంది. ప్రదీప్ నవ్వేసి, యిద్దర్నీ ఆప్యాయంగా చూస్తూ ఓకే చెప్పాడు. నేను మాత్రం సోనూని మరోసారి ఆలోచించమని చెప్పాలనుకున్నాను.
“శాకాహారి చేప… ” పెద్దగా నవ్వేసాడు రాహుల్. అతనలా నవ్వుతూనే వున్నాడు. అతనికిప్పుడు సోనూ బాల్యమంతా క్షుణ్ణంగా తెలుసు. మాయింటి గేట్లోంచి వచ్చిన అతిథులెవరో, శాకాహారి చేప ఎలా వచ్చిందో అన్నీ స్వయంగా చూసినంత బాగా తెలుసు. నవ్వుతూ వుండిన అతని ముఖంలో హఠాత్తుగా నీలినీడలు పరుచుకున్నాయి.
“బాల్యం యింత అందంగా వుంటుందని తెలీదు. నా చిన్నతనమంతా యిరుకు అపార్ట్మెంట్లలోనూ, తరగతి గదుల్లోనూ, క్లాసు పుస్తకాల్లోనూ, పెద్దవాళ్ళ యాంబిషన్స్లోనూ గడిచిపోయింది. నీతో పంచుకుందామంటే నా దగ్గర ఒక్క జ్ఞాపకం కూడా లేదు” అన్నాడు సోనూతో.
నాకు బాధగా అనిపించింది అతనలా అంటుంటే, మాతరం డబ్బుకోసం చాలా అనుబంధాలని తెంచుకుంది. ప్రదీప్ తండ్రి నానుంచీ అపరిమితంగా కట్నకానులకని ఆశించాడు. కొడుకు జీతంలో అధిక భాగం తనకే చెందాలనుకున్నాడు. డబ్బే కొడుకుతోగల ముఖ్యమైన సంబంధం కావడంతో అది బలహీనపడి, తెగే దిశగానే కొనసాగింది. అత్తమామల గొంతెమ్మకోరికలు అక్కడ విన్నవించుకోలేక నేను చాలాకాలం పుట్టినింటికే వెళ్లడం మానేసాను.
రాహుల్‌కి యాభైవేల జీతం. ఆ జీతం కోసం బాల్యాన్ని వ్యయపర్చాడు. సోనూ పరిచయమవకపోతే అందమైన బాల్యాన్ని గురించీ, మనుషుల అనుబంధాలు గురించి తెలిసేది కాదు. ఒక తండ్రి తన పిల్లలతో వాళ్ళ స్థాయికి దిగిపోయి ఆడగలడనీ ఒక అమ్మ, తన కూతురు అపురూపంగా తెచ్చి చూపించిన గడ్డిపువ్వునీ, గుడ్డిగవ్వనీ చూసి హృదయపూర్వకంగా ఆశ్చర్యాన్ని ప్రకటించగలదనీ అతనికి తెలీదు. అతనికి ప్రపంచం తెలీదు. అతను మామధ్యకి వస్తున్నాడు తప్పించి, సోనూని తనవైపు లాక్కోవటం లేదని నాకర్థమయాక అతనిపట్ల కలిగిన అనీజీనెస్ తొలగిపోయింది.
రాహుల్, సోనూ తిరుగు ప్రయాణం అయారు. రాహుల్ తల్లిదండ్రుల అడ్రస్ తెలుసుకున్నాడు, ప్రదీప్. వెళ్ళి కలవటానికి.
వెళ్ళేరోజు రాహుల్ నా దగ్గర కొచ్చి నిలబడ్డాడు. సోనూ, మనోజ్ చిన్నప్పుడు ఏదేనా చెప్పాలనుకుంటే యిలాగే వచ్చి నిల్చునేవారు. ఆత్మీయంగా అనిపించాడు.
“ఏంటి రాహుల్?” అడిగాను.
“నేనొచ్చిన రోజు మీ కళ్ళలో కొంత అయిష్టతని కనిపెట్టాను. అది పోయిందనుకుంటాను”” అన్నాడు సంకోచిస్తూ.”బాప్ రే!” అనుకున్నాను.
“మాకొక పాపాయి పుడితే మీకే తెచ్చి యిస్తాం. సోనూని పెంచినంత అందంగా పెంచగలరా, చుట్టూ వున్నవారికి ఆహ్లాదాన్ని పంచేలా? ప్రామిస్… తను పరిచయమయాకే నాకు తృప్తి అనేది తెలిసింది. నాలో మార్పు నాకే తెలుస్తోంది. చాలా రెస్ట్‌లెస్‌గా వుండేవాడిని. అది తగ్గింది…నా పేరెంట్సు ఇప్పుడు బాగానే సెటిలయారు. నన్ను బాగా చదివించి, బాగా సంపాదించుకోగలిగే అవకాశాన్నిచ్చారు. అలాగే సంపాదించాను. షేర్లలో పెట్టాను. బాగా కలిసొచ్చింది. రెండు ఫ్లాట్స్ కొన్నాను. ఇంకా సంపాదించాలన్న తపన వుండేది. పగలూ, రాత్రీ కష్టపడేవాడిని. సంపాదించడం తప్పుకాదు, కానీ అదే జీవితం కాకూడదంది…ఆ మాటల గురించి బాగా ఆలోచించాను. ఇంకెవరేనా అంటే సంపాదించటం చేతకాక అంటున్నారని తీసిపారేసేవాడిని. కానీ, కాబోయే ఒక సర్జన్ అన్న మాటలు. ఇక్కడికొచ్చి వాటి పునాదుల్ని చూసాను” అన్నాడు.
“కానీ సోనూ డాక్టరు, ఇంకా కెరీర్ మొదలు పెట్టలేదు. నువ్వేదైతే గుర్తించావో, ఏదైతే కాకూడదని తనందో అందుకు విరుద్ధంగా జరిగితే?”
“తనని అనుసరించే నా జీవితం వుంటుంది…” అన్నాడు స్థిరంగా. సోనూమీద అతనికున్న ప్రేమకీ, నమ్మకానికీ ఆశ్చర్యపోయాను.
సోనూ పెళ్ళిని దాటి ఈ యింట్లో తన వ్యక్తిత్వపు తొలి పునాదులు వేసుకోబోయే కొత్తఅతిథి కోసం నా ఆరాటం, ఆలోచనలూ మొదలయాయి.
(26/2/2004 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.