అది ఒక పాతబంగళా. జమీందారీలు పోయి కొన్ని దశాబ్దాలైనా, దాని వాసనలు ఇంకా పూర్తిగా విడిచిపోలేదు. కింద చేయడానికి పనివాళ్ళూ లేరు, పని చేయించేందుకు మందికూడా లేరు. ఒక్కడే ఉంటాడు, ముసలాడైపోయాడు చాలాకాలంక్రితమే. వాళ్ళ నాన్నగారి హోదా, దర్పం అన్ని చూసినవాడు, అవి తనవరకూ రాలేకపోయేసరికి భరించలేకపోయాడు. పీడించి బతకడం మనిషికి హక్కు కాదు అనే సత్యాన్ని తెలుసుకున్నా, దానితో రాజీపడలేకపోతున్నాడు. భార్య చనిపోయింది. బిడ్డలు దేశాన్ని వదిలేశారు, దేశంతోపాటూ ఇతన్నీనూ. జమీను లేదు, జనమూ లేదు, జీవనమూ సాగదు అనుకుని విడిచి వెళ్ళిపోయారు.
ఒక్కడిగానే ఉండడం అలవాటయ్యిందా? అంటే కాలేదు. కానీ, అలానే కాలాన్ని గడిపేస్తున్నాడు. తండ్రి చేసిన పాపాలు బిడ్డలకి తాకుతాయాట, అది ఇతని జీవితంలో నిజమేనేమో అనిపిస్తుంది. ఎన్ని అకృత్యాలు చేశాడో, అన్యాయానికి మారు పేరు, నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం వాళ్ళ నాన్న, చివరి జమీందారు. ప్రేమమాత్రమే చివరివరకూ ఉంటుంది, భయంమాత్రం ఆ భావన తొలిగిపోగానే విజృంభించి విప్లవంగా మారుతుంది.
భూములను ఆ ఊరు ప్రజలు ఆక్రమించేశారు. తినడానికి తిండికూడా లేని పరిస్థితి ఇతనికి. ఎవరూ ఇంటికి రారు. భార్య ఉన్నంతవరకూ బతుకు బాగానే సాగింది, ఎలాగోలా. ఆమె మరణం ఇతనిపాలిట వ్రణం. రోజురోజుకీ ఆ బాధ పెరుగుతోందేతప్ప తరగడంలేదు. గుక్కెడు మంచినీళ్ళు పోసేవారే లేరు. మానసికంగానూ, శారీరకంగానూ ఒంటరితనం మనిషిని బలహీనపరుస్తుంది. ఒంటరితనం ఈ మనిషిని విడిచివెళ్ళడం లేదు, దరిద్రానికి ఒంటరితనం తోడేమో. చితికిన మనస్సు చిత్తభ్రాంతులకి లోనవుతుంది. అసలే అది పెద్దబంగళా, పైగా ఎవరూ లేనిది, ఎవరూ రానిది, ఒక్కడికే భయంగొల్పుతుంది. ఈ వయసులో ఒంటరితనానికి భయం బోనస్‌గా వచ్చింది అతనికి.
ప్రతిరోజూ అతని దగ్గరికి భయం నల్లనిముసుగు వేసుకుని వచ్చేది. మొదట్లో అతని దగ్గరగా రావడానికి మొహమాటపడినా, రోజురోజుకీ దగ్గరవసాగింది. అతన్ని వెన్నంటే ఉండేది ఏ గదిలోకెళ్ళినా, ఆత్మబంధువులాగా. భయాన్ని మోస్తూ బతుకీడుస్తున్న అతనికి ఒక్కటే భరోసా, రోజూ రాత్రి గర్వంగా తన బెడ్రూమ్ కిటికీలోంచి మెల్లగా వచ్చే నిద్ర.
నిద్ర దగ్గరకొస్తున్నప్పుడు భయం దూరంగా వెళ్ళిపోతుంది. ఎంతదూరం అంటే, అతనికి ఆ బంగళాలో భయంకూడా తనతోపాటే ఉంటుంది అన్న విషయం కూడా గుర్తురానంతగా. కానీ, ఎప్పుడైతే నిద్ర తనకు దూరంగా వెళ్ళిపోతుందో, అదే అదనుగా, ఎక్కడ దాక్కుంటుందో తెలియని భయం హఠాత్తుగా అతనిపై పడుతుంది, వళ్ళు ఝల్లుమనేట్టుగా. భయంతో సహవాసం బిక్కుబిక్కుమంటూ చేస్తూనే ఉన్నా, నిద్రకోసంమాత్రం ఎప్పుడూ ఎదురుచూడ్డం మానలేదు. నిద్ర అతడిని ఎప్పుడూ నిరాశపరచలేదు. కానీ, అది వచ్చే మార్గాలు రోజురోజుకీ మారుతున్నాయి. మామూలుగా పడకగది కిటికీలోంచి సాయంత్రం ఆరయ్యేసరికి తొంగిచూసే నిద్ర, కొన్నిరోజులు సింహద్వారంలోంచి, కొన్నిరోజులు రకరకాల ద్వారాలగుండా, కిటికీలగుండా రావడం ప్రారంభించింది. భయానికి ఈ వింతప్రవర్తన అర్థంకాలేదు. ఇలా అయితే, ఈ బంగళాలో సులువుగా తిరగలేనని భయానికి ఆందోళన మొదలయింది. ఆరోజునుంచీ నిద్రతో గొడవపడడం ప్రారంభించింది భయం. నిద్రవలన భయాన్ని కాసేపన్నా పక్కన పెట్టగల అతను ఈ హఠాత్పరిణామంతో దిగులుపడడం మొదలుపెట్టాడు. ఆ దిగులు అతన్ని అనేకవిధాల నిర్వీర్యుడిని చేసింది. కళ్ళకింద నల్లమచ్చలు వచ్చాయి, పీక్కుపోయి వికృతంగా తయారయింది ముఖం. జుత్తు పీచుకట్టిపోయింది, బట్టలూ పరిసరాలూ దుర్గంధం వెదజల్లడం మొదలుపెట్టాయి.
భయం బలంపుంజుకోవడం మొదలుపెట్టింది. నిద్ర ఆ పరిసరాల్లోకి రావడానికి సుముఖంగా ఉండడంలేదు. కానీ, ఏదో తెలియని జాలి కలుగుతోంది అతని మీద నిద్రకి. అప్పటిదాకా రోజూ వచ్చే నిద్రకాస్తా, రెండుమూడురోజులకు ఒకసారైనా రావడానికి ప్రయత్నం చేస్తోంది. భయం ఇప్పుడు బంగళా అంతా ఆవరించేసింది. నిద్ర వచ్చే దారులన్నింటినీ మూసేసింది. భయం గుప్పిట్లో బందీ అయిపోయాడు అతను. నిద్రమాత్రం, తను వచ్చేందుకు కొత్తదారుల్ని వెతుక్కుంటోంది, కానీ, కష్టసాధ్యంగా మారింది ప్రవేశం. ఒకరోజు రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది భయానికీ, నిద్రకీ. భయాన్ని గెలవనివ్వకూడదని, నిద్ర విశ్వప్రయత్నం చేసింది. తన శక్తినంతా ధారపోసి మరీ అతడ్ని నిద్రపోయేటట్టు చేసింది. భయం ఆ రోజు నుంచి ఇక ఆ బంగళా దరిదాపుల్లోకి రాలేదు. నిద్ర ఆ యుద్ధంలో శాశ్వతవిజయం సాధించింది.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.