మల్లీశ్వరి by Thulasi Bhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. తగిన శిక్ష by Thulasi Bhanu
  3. మల్లీశ్వరి by Thulasi Bhanu
  4. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  5. శోభ by Thulasi Bhanu
  6. సహన by Thulasi Bhanu
  7. బ్రతుకు దీపం by Thulasi Bhanu
  8. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  9. జ్ఞాపకం by Thulasi Bhanu
  10. కీర్తన by Thulasi Bhanu
  11. మనోరంజని by Thulasi Bhanu

“వర్షా! ఎప్పుడూ పాటలేనా నీకు? పదా, షాలినిని పరిచయం చేస్తాను. తనిప్పుడు సెలెబ్రిటీ తెలుసా?” అని దామిని దాదాపు వర్షని లాక్కెళ్ళుతున్నట్టు తీసుకెళుతోంది.
“అబ్బా! ఇదొక్క పాటన్నా విననీ, నా ఇళయరాజ పాటకి, నన్ను దూరం చేయకే రాక్షసి” అని అంటోంది వర్ష. ఇయర్ ఫోన్స్‌లో పాట వింటోందికదా తను కొంచెం గట్టిగా మాట్లాడినట్లు తెలీలేదు.
షాలిని, హర్ష, శరత్, దివ్యా ఒకేసారి, ఆమెవైపు చూసారు. అది గమనించి వెంటనే పాటని ఆపేసి, ఇయర్‍ఫోన్స్ తీస్తూ నవ్వింది పలకరింపుగా.
” ఏ పాట మీరు వినేది?” అడిగాడు హర్ష.
“ఇదే రాజయోగం… చామంతి మూవీ” అంది వర్ష.
“ఓ… మంచిపాట. మనిషికో స్నేహం నా ఫేవరెట్ సాంగ్” అన్నాడు హర్ష.
వర్షని అందరికీ, షాలినిని వర్షకీ పరిచయం చేసింది దామిని. అందరూ కబుర్లలోపడ్డాక మళ్ళీ తన పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోయింది వర్ష.
హర్ష అప్రయత్నంగానే గమనిస్తున్నాడు ఆమెని. ఇంకా పసితనం పోని క్యూట్ మొహం, కళ్ళు మూసుకుని పాటలు వింటూ వుండటం చూస్తే అతని మనసుకి బావుంది. అస్సలు అమ్మాయిలంటేనే చిరాకు అంటాడు. పెళ్ళి ప్రేమ అనేవి తనకి అర్ధమే కావు అంటాడు. అలాంటిది ఈరోజు ఆమెని చూస్తే మాత్రం అభిమానం కలుగుతోంది.
వర్ష తనకిచ్చిన జ్యూస్ గ్లాసుని తీసుకుంది, పాటలు ఆఫ్ చేసింది.
“ఏం జాబ్ చేస్తున్నారు? అడిగాడు హర్ష ఆమె పక్కన కూర్చుంటూ.
“టీచర్ని” అంది. “సిటీలో కాదు, మా అమ్మగారి ఊరిలో. ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను. మరి మీరు?” అడిగింది.
“సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ని” అన్నాడు హర్ష. “మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు?” అడిగాడు.
“అమ్మో! ఎక్కువ రోజులు ఉంటే నా స్కూల్ పిల్లలు ఊరుకోరు. అసలే నేను చాక్లెట్లు తీసుకెళతానని ఎదురుచూస్తూ ఉంటారు. మీ సిటీవాళ్ళకి ఫారెన్ చాక్లేట్స్ ఎలానో మా ఊరిపిల్లలకి ఈ పట్నం చాక్లెట్స్ అంటే పిచ్చి” అంది తమాషాగా నవ్వుతూ.
అతను అపురూపంగా ఆమె మాటలు వింటూ ఆమెనే చూస్తున్నాడు.
“నేను మంచి అబ్బాయినే! నాకు మీ ఫోన్ నంబర్ ఇస్తారా? మీ ఊరికి వస్తాను, వచ్చేముందు మీకు ఫోన్ చేసి వస్తాను”అన్నాడు.
“ఇస్తాను. మీరు ఎలాంటి అబ్బాయైనా పర్వాలేదు. నాకు కరాటే వచ్చు. పిచ్చివేషాలేస్తే సిటీకి వచ్చి మరీ మీతో ఫైట్ చేస్తా” అంది అల్లరిగా. తన నంబర్ ఇచ్చింది. హాయిగా నవ్వేసాడు.
“యు ఆర్ టూ క్యూట్” అన్నాడు మనస్ఫూర్తిగా.
“సరే సరే” బై చెప్పేసి వెళ్ళిపోయింది. మొదటిసారి… ఎప్పుడూ జరగనట్లు తననుంచి తానే విడిపోతున్నట్లు అనిపించింది హర్షకి, ఆమె దూరం వెళుతున్నకొద్దీ.


వర్ష పిల్లలికి బోర్డు మీదవి రాసుకోమని చెప్పి తాను పుస్తకం చూసుకుంటూ ఉంది. కాసేపటికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి గేటువైపు తలెత్తి చూసింది. హర్ష నుంచుని చూస్తూ ఉన్నాడు. ఆమె చూడగానే ఆప్యాయంగా నవ్వాడు. లేచి వెళ్ళింది.
“హాయ్, హర్షా! చెప్పకుండా వచ్చావే?” అంది.
“మీ అమ్మగారిని పరిచయం చేస్తానన్నావుగా?” అన్నాడు కళ్ళారా ఆమెని అపురూపంగా చూసుకుంటూ.
వర్ష తల్లి మల్లీశ్వరి తోటపని చేసుకుంటూ ఉంది. పాతపాటలు సన్నగా వచ్చేలా పెట్టుకుంది. కుందేళ్ళు, కోళ్ళు, పావురాలు తోటలో తిరుగుతూ ఉన్నాయి. తోటమధ్యలో చిద్విలాసంగా నవ్వుతూ ఉన్న కృష్ణయ్య ప్రతిమ ఒకటి ఉంది. తాను బృందావనానికి వచ్చానా అన్నట్టు అనిపించింది హర్షకి.
“అమ్మా! ఇతనే హర్ష…”అని, “మా అమ్మ మల్లీశ్వరి…”అని ఒకరికొకర్ని పరిచయం చేసింది.
“దా బాబు!” అని మట్టిచేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చింది మల్లీశ్వరి.
మొలకలొచ్చిన పెసలు ఉల్లి పచ్చిమిర్చి ఉప్పు కలిపి ఇచ్చింది. ధనియాలు, శొంఠి వేసి కాచిన కాఫీ ఇచ్చింది. భలే ఉన్నాయే అనుకున్నాడు హర్ష.
వర్ష మళ్ళీ స్కూలుకి వెళ్ళిపోయింది. మల్లీశ్వరి వంట చేస్తుంటే వంటింట్లోనే కూర్చుని పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలను చూస్తూ ఆవిడ మాటలు వింటున్నాడు.
“వర్షకి నువ్వు నచ్చావు బాబూ! మీ అమ్మానాన్న కూడా వచ్చుంటే బావుండేది” అడిగింది.
“వారు ప్రస్తుతం యూఎస్‍లో ఉన్నారు. వచ్చే వారం వస్తారు” చెప్పాడు హర్ష.
“తనుకూడా నాలానే ప్రకృతిని, సహజత్వాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. కాలాన్నిబట్టీ అందరూ ఎలా ఉంటే మనమూ అలా అన్నట్టు కాకుండా తనకు నచ్చిన రీతిలోనే ఉంటుంది. మరి తన అలవాట్లు నీకు నచ్చుతాయో లేదో?” అంది సందేహంగా.
“వర్ష ఎలా ఉన్నా నాకు ప్రాణం అత్తమ్మా!” అనేసాడు హర్ష. ఠక్కున తలతిప్పి అతన్ని చూసింది. చిన్నగా నవ్వింది.
మరోనెలలోపే హర్ష, వర్ష దంపతులయ్యారు. పెళ్ళికి హర్ష తల్లిదండ్రులు రాలేకపోయారు. హర్ష సిటీలో, తన కంపెనీ పనులు చూసుకుని ఊరు వస్తుంటాడు. వర్ష ఊరిలోనే స్కూలుని, తల్లిని చూసుకుంటూ ఉంది.


ఆ రోజు హర్ష వస్తాడని ఎదురుచూస్తోంది వర్ష. ఒక కబురు తన ప్రియసఖుడికే ముందు చెప్పాలని తల్లికి కూడా ఇంకా చెప్పలేదు. ఎనిమిదయ్యింది.
“ఇంక తినేసెయ్యమ్మా. మధ్యాహ్నం కూడా అతను వస్తాడని, అతనితో తింటానని కూర్చుని ఇప్పటివరకూ తినలేదు. తినేసేయ్” అంది మల్లీశ్వరి. సరే అని అన్నం తింటోంది వర్ష.
హర్ష కొంచెం చిరాకుగా వచ్చాడు. మల్లీశ్వరి ఎదురెళ్ళింది. పట్టించుకోకుండా తమ గదిలోకి వెళ్ళిపోయాడు. వర్ష అతని చిరాకుని గమనించుకోలేదు. మల్లీశ్వరికి తెలిసింది ఏదో బాలేదని.
వర్ష తినడం ముగించి అన్నం చేతులు కడుక్కుని గబగబా లోపలికివెళ్ళింది. హర్ష డ్రెస్ మార్చుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు.
“హర్షూ! నేను నీకో మాటచెప్పాలి “అంది గారాబంగా.
హర్ష కళ్ళెత్తి చూసి,” ఏమిటి ?” అన్నాడు.
“మన ప్రేమకి ప్రతిరూపం మనమధ్యకి రాబోతున్నారు” అంది చిరుసిగ్గుతో పొట్టమీద చెయ్యేసి చూపిస్తూ.
అతని మొహం వెలిగిపోయింది. వర్షను చెయ్యిపట్టి దగ్గరకు తీసుకున్నాడు. ఒక నిముషమే అలా. వెంటనే, “వర్షా! ఇప్పుడే వద్దురా! “అనేసాడు.
“ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు వద్దు పిల్లలు? అయినా ఇప్పుడు వద్దనుకుంటే ఎలా? ” అంది వర్ష.
“నేను… నాకు …” అని సరిగా చెప్పట్లేదు హర్ష.
“నీకు తెలుస్తోందా, ఒక మంచి సంఘటనని ఎంతలా పాడుచేస్తున్నావో? ఏమి ఆలోచిస్తున్నావు? నాకు చెప్పవా?” అంది స్నేహంగా.
“అమ్మావాళ్ళు నన్ను అమెరికా రమ్మంటున్నారు. మనం వెళ్ళొద్దాము. అక్కడ మన సొంత కంపెనీ పనులు కొన్ని నేను చూడాలి” అన్నాడు.
“ఇప్పుడా? అంది సంశయంగా వర్ష. “అసలు ఏం జరుగుతోంది? నేను నీతో ఈ సమయాన్ని ఊహించుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి?” అని నీరసపడింది.
“మనం రేపు సిటీ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళే పనులకోసం” అన్నాడతను
“ఎన్నిరోజుల ట్రిప్? ” అడిగింది
“టూ ఇయర్స్” అన్నాడు.
“మరి మా అమ్మ సంగతి?” అడిగింది.
“అత్తమ్మని కూడా తీసుకెళదాము” అన్నాడు.
“అమ్మ ఈ ఊరు దాటి , సరిగ్గా రెండ్రోజులుకూడా ఎక్కడా ఉండదు, అలాంటిది, దేశం దాటి రావటమా?”
“అలా అంటే ఎలా? మాట్లాడి ఒప్పిద్దాము” అన్నాడు.
“నాకు తెలుసుకదా? ఈ ఇల్లు వదిలి అమ్మ ఎక్కడికీ రాదు”
“అయితే మనిద్దరం వెళ్ళొద్దాము”
“అమ్మనొదిలి అంత టైమ్ నేను ఉండను” అంది స్పష్టంగా.
“నేను అడిగేది మా అమ్మానాన్న దగ్గరికి వెళ్దామని” అన్నాడు స్థిరంగా.
“అమ్మతోనే నేనుండాలని పెళ్ళికి ముందే చెప్పానుగా?”
“అప్పుడు ఇలా అవసరం పడుతుందని నాకు ఎలా తెలుస్తుంది?”
“కష్టం హర్షా, మామూలుగానే కష్టం, ఇప్పుడు పాపను మోస్తూ నేను ఎక్కడకూ రాను అమ్మని వదిలి…”
“ప్చ్! ఇది కూడా ఒకటా ఇప్పుడు? సరైన ప్లానింగ్ లేకుండా పిల్లలు ఎందుకు మనకి ఇప్పుడు?” అన్నాడు.
“మనం తొందరపడి పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది” అంది.
“సరే, ఇప్పుడు ఏమయ్యింది, డాక్టర్‍తో మాట్లాడితే పిల్లల బరువు తొలగించుకోవచ్చు”
వర్ష కోపంగా అతన్ని చూసి, “ఇవాళ నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మను వదిలి రమ్మంటావు. పిల్లలు వద్దంటావు… ఏంటిది? నేను ప్రేమించినవాడివేనా నువ్వు?” అని బాధపడింది.
మల్లీశ్వరి మర్రోజు ఇద్దరినీ గమనించి ఇద్దరికీ ఏదో మనఃస్పర్ధ వచ్చిందని అర్థం చేసుకుంది. రాత్రి భర్తకి తీపికబురు చెప్పి ఆనందపడి, పొద్దున్నే అమ్మకి చెప్పాలి, అమ్మ కళ్ళల్లో వెలుగు చూడాలి అనుకుంది, కానీ చివరికేమయ్యింది, విషయం చిక్కుముడిలా తయారయ్యింది అని బాధపడుతోంది వర్ష.
“తయారయ్యావా? సిటీకి వెళ్దామా ఇంక? ” అని అడిగాడు హర్ష.
“నువ్వు వెళ్ళిరా! నేను రావట్లేదు” అంది వర్ష..
“వర్షా! వెళ్ళిరా సిటీకి. స్కూలుపిల్లల్ని నేను చూసుకుంటానుగా ” అంది మల్లీశ్వరి, విషయం సరిగా తెలియక.
“అత్తమ్మా!” అంటూ హర్ష తమ ఫారెన్ ట్రిప్ గురించి చర్చ మొదలుపెట్టబోయాడు.
“అమ్మా! నాకు ఆరెంజ్ జ్యూస్ చేసియ్యవా?” వెంటనే అడిగింది వర్ష. అతనికి చెప్పద్దు అన్నట్టు సైగ చేసింది.
స్కూలుకని బయల్దేరి బయటకు వచ్చారు ఇద్దరూ. ఊర్లోని జామతోటలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“హర్షా! నేను అమ్మని వదిలి రాను. నువ్వు ఈ సమయంలో నన్ను వదిలివెళ్ళటంకూడా నాకు ఇష్టం లేదు” అంది.
“అరే, నన్ను మావాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దంటావా? అన్నాడు కోపంగా.
“పెళ్ళికిముందు, నా చిన్నప్పటినుంచీ అమ్మావాళ్ళూ, నేనూ ఎప్పుడూ ఒక్కచోట కలిసిలేము. అమ్మావాళ్ళకి నాకు ఏవో పనులతో విడివిడిగా ఉండటం మొదట్నుంచీ అలవాటు అయిపోయింది. నేను హాయిగా నీతో అత్తమ్మతో మన పర్ణశాలలో ప్రశాంతంగా ఉండిపోతాను, నువ్వూ అత్తమ్మా నేను కలిసే ఉందాము ఎప్పుడూ అన్నావు. ఇప్పుడేమో ఇలా”
“అయితే ఏంటిప్పుడు? నేను మా అమ్మావాళ్ళతో ఉండాల్సిన అవసరం వచ్చింది. మరి వెళ్ళాలా, వద్దా?” అడిగాడు.
“నీ ఇష్టం” నీరసంగా అంది, శారీరకంగా, మానసికంగా అలిసిపోయి.
“సరే, సిటీకి పదా. మనిద్దరి పాస్‌పోర్ట్ , వీసాల పనులు చూసుకుందాము” అన్నాడు..
“నేను రాలేను ” అంది.
“నా భార్యవి నువ్వు, నాతో రావా?” అడిగాడు.
“ఊహూ< రాను” అని అంటూ తల అడ్డంగా ఊపింది.
“నేను తీసుకెళ్ళకుండా ఉండను” అన్నాడు.
ఆమె మౌనంగా లేచి వెళ్ళబోయింది,
“వర్షా! సమాధానం చెప్పు” కోపంగా అడిగాడు.
అలా రెండునెలలు వాదనలతో నడుస్తోంది భార్యాభర్తలిద్దరి మధ్య. అది తెలిసీ, ఏమీ చెయ్యలేక మల్లీశ్వరి నలిగిపోతోంది. ఐనాకూడా కూతురు తల్లి కాబోతున్న విషయానికి ఆవిడ చాలా సంబరపడి ఇంకా అపురూపంగా చూసుకుంటోంది. హర్ష కోపంతో, వర్ష తల్లి కాబోతున్న విషయానికి కనీసవిలువను కూడా ఇవ్వట్లేదు.
“ఏంటీ, ఈ మగవారి మనస్తత్వం? ప్రేమించేటప్పుడు అంతా నువ్వే అని నెత్తిన పెట్టుకుంటారు, పెళ్ళి అయ్యి బాధ్యతల్లో పడ్డాక నువ్వెవరో అన్నట్లు ప్రవర్తిస్తారు” అని మల్లీశ్వరి వర్షకి చెబుతూ బాధపడుతోంది.
అప్పుడే వచ్చి అది విన్న హర్ష, ” అత్తమ్మా! వర్షని మీమాటలతో ఎందుకు నాకు దూరం చెయ్యాలని చూస్తున్నారు? కూతురికి ఒక తల్లి చెప్పే మాటలేనా అవి? ” అని అడిగాడు కోపంగా.
వర్ష అతన్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి, “ఆవిడ మనిద్దరం బావుండాలని ఎంతో కోరుకుంటుంది. అలాంటి అమ్మని ఏం అంటున్నావు నువ్వూ?” అని కోప్పడింది.
“మగవారిగురించి తనకున్న అర్థంలేని అభిప్రాయం నీకు నూరిపోయటం నేను విన్నానుగా?” అన్నాడు.
“నువ్వు చేసేదే అనుకుంటున్నాము. అందులో నిజం ఉంది తప్ప అర్థంలేని అభిప్రాయం ఏముంది? నువ్వు చేసేది ఎంతో నిర్లక్ష్యంగా ఉండి, నన్నెంత బాధ పెడుతోందో అమ్మేగా ప్రత్యక్షంగా చూస్తోంది? “అంది కోపంగా.
“మరి నువ్వు నా తల్లిదండ్రుల దగ్గరికి రావటానికి అడ్డుచెప్పేది, మీ అమ్మవల్లేగా? ఆవిడేగా కారణం? ఆవిడెలాగూ మీ నాన్నని అర్థం చేసుకోకుండా అహంకారంగా దూరం చేసుకుంది. ఇప్పుడు నీకూ అలానే నేర్పిస్తోంది. మీ అమ్మాబిడ్డలకి మొగుడు ఒక అలంకారం మాత్రమే అనుకుంటా! మొగుడు, మొగుడి కుటుంబం అంటే విలువే లేదు. ఛా… ” అన్నాడు కోపంగా.
“ఏంటిది? అమ్మంటే నీకు గౌరవం అనుకున్నాను. ఆవిడంటే ఇలాంటి చెడ్డ అభిప్రాయం నీకుందా?” అంది బాధగా వర్ష.
“ఇదొక్క విషయంలోనే నాకు ఆవిడంటే చిరాకు” అన్నాడు హర్ష.
“ప్లీజ్, ఇంకొక్క మాట నువ్వు మాట్లాడావంటే బాగోదు. నువ్వు మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళిపో. వారంరోజులు టైమిస్తున్నాను. తరువాత నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా నేనొప్పుకోను” అనేసింది కోపంగా.
“సరే…” అని తానూ కోపంగా అనేసాడు హర్ష.
అదంతా విన్న మల్లీశ్వరి బాగా ఆలోచించింది. హర్ష తల్లిదండ్రులు అయిన జానకి, ప్రభాకర్‍లకు ఫోన్ కలిపింది. జానకి ఫోన్‍లో ఉంది.
“వదినా! బావున్నారా? అడిగింది మల్లీశ్వరి.
“మీరు బావున్నారా?”అడిగింది జానకి.
“మీరూ అన్నయ్య ఒక పదిరోజులు మా దగ్గరకి వచ్చి వెళ్ళండి. అబ్బాయి పెళ్ళికికూడా రాలేనంత బిజీ మీరని తెలుసు. కానీ దయచేసి మీ ఇద్దరూ రండి” అంది మల్లీశ్వరి.
“కష్టంకదా వదినా? పరిస్థితులు బాలేవనే హర్షని ఇక్కడికి రమ్మన్నాము” అంది జానకి.
“వదినా! డబ్బు నష్టం గురించి ఆలోచించకండి. అంతకుమించిన అవసరాలు కూడా మనిషికి ఉంటాయిగా? మీ వదినగా హక్కుగానే అడుగుతున్నా. నామాట కాదనద్దు ప్లీజ్” అంది మల్లీశ్వరి జానకిని ఒప్పించుకోవటానికి. పిల్లనిచ్చిన తల్లి ఎందుకు అంతలా అడుగుతోందో అనుకుని, “సరేనైతే. వచ్చే వారం ఈపాటికి నీదగ్గరే ఉంటాము “అని మాటిచ్చింది జానకి.
ఆరోజు పొద్దున్నే వచ్చేసారు జానకి, ప్రభాకర్.
అప్పటికే మల్లీశ్వరి లేచి ఇంటి ముందు తోట, వెనక పెరడు అంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేసింది. బొగ్గులకుంపటి ముట్టించి పాలగిన్నె పెట్టింది, స్టవ్‍మీద నీళ్ళు కాచి ఫిల్టర్‍లో డికాక్షన్‍కి కాఫీపొడి వేస్తోంది. ఇంటిముందున్న చిట్టిగంట మధురంగా మ్రోగింది. ఆ శబ్దం విని వెళ్ళి తలుపు తీసింది. అప్పటికే ఫొటోల్లో చూసి ఉన్నారు కాబట్టి బానే గుర్తుపట్టి “వదినా!” అని పలకరించుకున్నారు వెలిగిపోతున్న నవ్వుమొహాలతో జానకి, మల్లీశ్వరి.
“రండన్నయ్యా!” అని ప్రభాకర్ వాళ్ళని ఆహ్వానిస్తూ వర్ష రూమ్ తలుపు తట్టింది.
వర్ష, హర్ష బయటకువచ్చారు.
“అమ్మా! మీరు ఇక్కడ…” అని హర్ష ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో వెళ్ళి తల్లిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. తల్లి స్పర్శ హర్షకు ప్రశాంతంగా చల్లనిగాలి తాకినట్టు హాయిగా ఉంది, అప్రయత్నంగా అతని కళ్ళల్లో నీళ్ళు. జానకి వర్షను చూస్తూ చేయి చాపింది. అయిదునెలల కడుపుతో వర్ష, అప్పుడే నిద్రలేచిన ముద్దుమొహంతో ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది. తానే రెండడుగులు ముందుకెళ్ళి వర్షను ప్రేమగా దగ్గరకు తీసుకుంది జానకి. తమ రక్తపాశమైన చిట్టిపాపను స్పృశిస్తున్నట్టు వర్ష పొట్టమీద చెయ్యి వేసి మృదువుగా నిమిరింది. వర్ష కళ్ళు ఆనందంతో మెరిసాయి, అత్తగారి స్నేహానికి. జానకి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టింది. వెళ్ళి ప్రభాకర్ కాళ్ళకు దండం పెట్టింది వర్ష. మల్లీశ్వరికి అవన్నీ కళ్ళకు నిండుగా అనిపించాయి.
ఆవిడ చేసిపెట్టిన కమ్మటి వంటలతో కడుపునిండా భోజనం చేసారు జానకి ప్రభాకర్. తమలపాకులకు సున్నం రాసి వక్కపొడి పెట్టి ఇచ్చింది.
“పిల్లల పెళ్ళి అయ్యాక తాంబూలాలు పుచ్చుకుంటున్నాముగా వదినా?” అని ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
ప్రభాకర్ భుక్తాయాసంతో సోఫాలో కూర్చునే గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు.
“వదినా! రాత్రుళ్ళు నిద్రమాత్రలు వేసుకున్నా కూడా కంపెనీ వ్యవహారాలతో టెన్షన్ పుట్టి, నిద్రపట్టక చస్తాము. ఇక్కడ నీచేతి కమ్మటిభోజనం, నీ ఇంటి ప్రశాంతవాతావరణంలో ఆయన వళ్ళు మరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నారు” అంది జానకి ఆప్యాయంగా వియ్యపురాలి చెయ్యి పట్టుకుని.
అలా పదిరోజులు అనుకున్నవాళ్ళు నెలరోజులు దాటినా మల్లీశ్వరి పర్ణశాలను, కడుపుతో ఉన్న వర్షను కళ్ళారా చూసుకోకుండా ఉండలేక, వెనక్కి తిరిగి వెళ్ళాలనిపించక ఇక్కడే ఉండిపోయారు. కృత్రిమంగా లేనిపోని హోదాలు, అంతస్థులు తెచ్చిపెట్టుకుని, తమని తామే కోల్పోయే ఆర్ధికలావాదేవీల జీవితం కంటే, సహజసిద్ధమైన జీవితశైలిలో జీవిస్తుంటే మనసుకి ఒత్తిడి ఎక్కువ తెలీకుండా, ఎంత ప్రశాంతంగా జీవించవచ్చో మల్లీశ్వరిద్వారా అనుభవంలోకి వచ్చింది జానకీవాళ్ళకి. ఈ వయసులో వెనక్కెళ్ళి పద్మవ్యూహంలాంటి గజిబిజి జీవితం గడిపేకంటే, అమ్మ ప్రేమలాంటి ప్రకృతికి దగ్గరగా ఉండే జీవితమే బావుందనుకుని అక్కడ అన్నీ చక్కబెట్టుకుని వచ్చి వాళ్ళ దగ్గరే ఉండిపోవాలనుకుని నిర్ణయించేసుకున్నారు. రాబోయే మనవరాలితో ఆటలను ఆడుతున్నట్టు కూడా ఊహించేసుకుని మల్లీశ్వరితోబాటు జానకి ప్రభాకర్ మురిసిపోతున్నారు.
ఆరోజు మల్లీశ్వరి జానకికి చెబుతోంది. వర్ష తండ్రి , ఆడపిల్ల అనే కారణంగా వర్షను కడుపులోనే తుంచేయమన్నాడని, తాను ఒప్పుకోలేదనే కోపంతో తనకి నరకం చూపించాడని, వర్ష పుట్టాక కూడా ఒకసారి పిచ్చికోపంతో వర్షని నేలకేసి విసిరికొట్టాడని, అదృష్టం బావుండి కింద మెత్తనిబొంత ఉండటంతో వర్ష బతికిందని చెప్పి మల్లీశ్వరి జానకి చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఎన్నేళ్ళ కన్నీళ్ళు గుండెల్లో దాచి ఉంచుకుందో మరి ఏడుపు ఆగట్లేదు ఆమెకి. జానకి తేరుకునేదాకా ఓపికపట్టి ఆమెని కదిలించలేదు,
కాసేపాగి ” నేనున్నానుగా నీకు నీ కష్టసుఖం పంచుకునేందుకు ” అన్నట్టుగా గట్టిగా దగ్గరకు తీసుకుంది.
అదంతా విన్న హర్ష రూమ్‍లోకి వెళ్ళి తన చెంపమీద తానే కొట్టుకున్నాడు. ఇది ఊహించి వెనకాలే వచ్చిన వర్ష అతని చేతిని పట్టుకుంది.
ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక తల వేరేవైపు తిప్పుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. అతని తలను తన భుజంపైన ఆనించుకుని తన పొట్టమీద చేయి వేసుకుంది, తనకు ఇద్దరూ పిల్లలే అన్నట్టుగా. అప్పుడే హర్ష మొదటిసారి ఆప్యాయంగా వర్ష పొట్టమీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు. అదే క్షణంలో మొదటిసారి పాప వర్ష బొజ్జలో కదిలింది. వర్షకు ఆనందమే ఆనందం అనిపించింది.
“హర్షా! పాప మొదటిసారి కదిలింది… అమ్మా, అత్తమ్మా, మావయ్యా పాప కదులుతోంది” అని సంబరంగా చెప్పింది అందరితో.ఆ రోజు సాయంత్రం చిన్న పండుగ చేసుకున్నారు అందరూ కలిసి పర్ణశాలలో.