ఆకాశగంగ by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant
  13. దివ్యశక్తి by Manas Krishna Kant

“కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయంట” అని నాలో నేనే నవ్వుకుంటున్నాను.  అది చూసి నాపక్కన ఉన్న పెద్దాయనకి అర్థమైనట్టు తలాడించి, “నిజమే బాబూ! కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయి. అలా అని కోళ్ళని కోస్తేమాత్రమే పడవు”’’ అని చెప్పి కోళ్ళరక్తంతో తడిసిన చెట్టు మొదలువైపు తిరిగి దండం పెట్టాడు కళ్ళు మూసుకుని.


ఆంత్రోపాలజీ రిసర్చ్ ప్రాజెక్టులో భాగంగా నేను ఈ మారుమూల గిరిజన తండాని ఎన్నుకున్నాను.  ఫీల్డ్ ట్రయల్స్, విజిట్స్ అక్కడి మనుషులను, మనస్తత్వాలను దగ్గరగా అర్థం చేసుకోవడానికి, వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను ఒక ఇన్‍సైడర్‍గా అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడతాయని.  సామాన్యజనాలకేగాక, ప్రభుత్వపెద్దలకుకూడా ఈ గూడెం అంతగా తెలియదు.  ఎందుకంటే, అభివృద్ధికేగాక, ఆచారవ్యవహారాలకుకూడా ఇది ఆమడ దూరం. కాదు కాదు, యోజనాల… క్రోసుల దూరం. 
అసలు ఇక్కడ ఒక గూడెం ఉందని నాకుకూడా చాలా ఆలస్యంగా తెలిసింది.  నేను చేయాల్సిన ప్రాజెక్టుకి ఒక పట్టణానికి దగ్గరలోగల చిన్న గిరిజనపల్లెను సెలెక్ట్ చేసుకున్నా. కానీ, దానికీ ఆధునికనాగరికతకూ అట్టే దూరం అనిపించలేదు. అలా అలా అక్కడ అందరినీ కనుక్కుని కొంచెం కొంచెం అడవిలో లోపలికెళ్తుంటే ఇక్కడ కనిపించింది ఈ గూడెం. 
ఇక్కడికి మూడురోజులకో, నాలుగురోజులకో ఒకసారి మంచినీళ్ళ ట్యాంకరు వస్తుందంట. అంటే ప్రభుత్వానికి కొంచెం కరుణ ఉంది అనుకున్నా. కానీ ప్రపంచంలో జరిగే విశేషాలు, వార్తలు ఎలా తెలుసుకుంటారని నాకు గైడ్‍గా వ్యవహరిస్తున్న ఒక గిరిజన యువకుడిని అడిగా. వాళ్ళకి తెలుసుకోవలసిన అవసరం ఏంటోకూడా తెలియదని అతనిద్వారా తెలిసింది. నాకుమాత్రం రోజూ పొద్దునే న్యూస్‍పేపర్ చదవకపోతే రోజు మొదలవదు. 
“ఎలా?”’అని అడిగా. 
“న్యూస్‍పేపర్ కావాలంటే, మంచినీళ్ళ ట్యాంకరు వాడికి డబ్బులిస్తే తెస్తాడు, కానీ మూడు నాలుగు రోజులకొకసారే” అని చెప్పాడు ఆ గిరిజన యువకుడు. గుడ్డిలో మెల్ల నయం అనుకుని అలాగే చెప్పమని డబ్బులిచ్చా ఆ యువకిడికి, ఆ డ్రైవరుకిమ్మని చెప్పి.
నేను ఇక్కడికొచ్చి ఇరవైరోజులకు పైగా అయింది.  నాలుగుసార్లే తెచ్చాడు పేపరు, కాకపోతే అన్ని రోజులవీ కలిపి ఒకేరోజు తెస్తున్నాడుకాబట్టి యిరవైరోజులవీ ఉన్నాయి. 
నేను నా మొబైల్, ఇతర గాడ్జెట్స్ తీసుకొని రాలేదు. నా ప్రాజెక్ట్ వర్క్‌ని అవి డీవియేట్ చేస్తాయని, ఆ అమాయక గిరిజనుల్ని గాభరాపెట్టకూడదని.  కానీ, అవి లేని లోటే తెలియలేదు. వారి జీవనవిధానాన్ని దగ్గరనుంచి గమనించడం వలన, ఆ విధానం చాలా ఆసక్తికరంగా ఉండడం వలన.  నవనాగరికత తెచ్చిన ముసుగులు లేకుండా ప్రకృతి, కేవలం ప్రకృతే వారికి గురువుగా, దైవంగా భావించి అది ప్రసాదించిన మార్గంలోనే జీవనాన్ని సాగించడం సరికొత్త అనుభూతి.  నేను చాలా విషయాల్లో వారిని అనుసరిద్దామని విఫలమయ్యా, కానీ ప్రయత్నం మానుకోలేదు.  మొదట్లో వాళ్ళు కొంచెం భయపడ్డారు, కొత్తగా వచ్చిన నన్ను చూసి.  తర్వాత తర్వాత నా ప్రవర్తన నచ్చో, వారికి జాలో, దయో, అభిమానమో కలిగో భయం స్థానే భ్రాతృత్వం వచ్చి చేరింది వారిలో.


రోజులు గడుస్తున్నాయి. నా నోట్సులు నిండిపోతున్నాయి.  ప్రతికదలికా, ప్రతివేడుకా, ప్రతిమాటా నాకు అమితాసక్తిని కలిగిస్తున్నాయి. దేన్నీ విడిచిపెట్టకుండా రాసుకుంటున్నా, గీసుకుంటున్నా, ఆనందానుభూతిని చెందుతూ. బిడ్డ పుట్టినప్పుడోరకం సంబరం, బిడ్డ పురిట్లో చనిపోయినా ఒక కార్యక్రమం, పెళ్ళికొకటి, పెద్దమనిషైతే మరొకటి. వృద్ధాప్యం ఒక శాపం కాదక్కడ అనిపించేంతగా వారిని ప్రతిపండుగలో, వేడుకలో భాగం చేయడం, చావొక సంబరం అక్కడ. కానీ, మనం నాగరిక సమాజంలో ఆచరిస్తున్న హోదా ప్రదర్శనకిమాత్రమే’అన్న భావం కనబడలేదు ప్రతిసంబరంలో.  నిజాయితీతో కూడిన జెన్యూఇన్ ఆనందం, ఆనందాన్ని వ్యక్తం చేయడానికేనన్న ఫిలాసఫీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి.  ఆర్గానిక్‍గా అన్న పదం ఇప్పుడు పాపులర్ అయింది నాగరికతలో, కానీ ఎప్పటినుంచో ఇప్పటికీ అవే వాడుతున్నారు వాళ్ళు, ఇంకా వాడుతూనే ఉంటారు నాగరికత అనే విషపురుగు కుట్టకపోతే.  సిక్స్‌ప్యాక్, టోన్ట్ బాడీస్, ఫిట్‍నెస్ అనేవి ఫ్యాషన్‍గా ఒక దశాబ్దిగా ఉందేమో మనకి, కానీ వీళ్ళు ఇక్కడ కొండలెక్కి, సెలయేళ్ళలో ఈది, వేటాడుతూ ఉండడంవల్ల ప్రతి ఒక్కరూ ఆడ, మగ తేడా లేకుండా అత్యంత ఫిట్‍గా, టోన్డ్‌గా, సిక్స్‌ప్యాక్‍లే కాదు, ఎయిట్‍ప్యాక్‍లతోకూడా ఉంటారు. అది వారికి కష్టం కాదు. అదే వారి జీవనవిధానం వారికిచ్చిన బహుమతి. 
ఇలాంటివెన్నో గమనిస్తూ, నేనొచ్చిన వసంతం, వేసవిగా మారి ఎర్రని ఎండ చురుక్కుమనిపించడం మొదలెట్టి నాలుగైదురోజులైంది. మంచినీళ్ళ ట్యాంకరు రావడం ఇంకో రెండ్రోజులు ఆలస్యమయ్యి, వారం రోజులకొకసారి వస్తోందిప్పుడు. దాంతో పాటు నాకు రావాల్సిన పేపర్లు కూడా.  మొదట్లో ఉన్న ఉత్సాహం, ఆశ్చర్యం’ అలవాటైపోవడంవల్లో, చిరాకు తెప్పించేంత వేసవి ఎండవల్లో తెలీదుకానీ, అక్కడున్న సెలయేట్లో నీటిలాగా ఆవిరైపోవడం మొదలెట్టాయి.  ఆసక్తి స్థానాన, అలసట, ఆశ్చర్యం స్థానంలో అసహనం చోటుచేసుకుంటున్నాయి.  నేను కోరుకొని వచ్చిన పని కావడంవలన, అప్పటికే అందరూ నాకు బాగా కావాల్సినవాళ్ళంతగా అభిమానిస్తుండడంవలన ఆ అసహనాన్ని అణచివేస్తూ, లేని ఆసక్తిని పైకి నటిస్తూ, నేర్చుకుంటూ, రాసుకుంటున్నా నోట్సుల్లో. 


నీరు సరిపోకపోవడంవలన, తాగడానికి నిల్వ ఉన్న కుంటల్లోని నీరే తాగుతున్నారు.  ఆ కుంటల్లోనే దోమలుకూడా గుడ్లనుపెట్టడం మొదలెట్టాయి. పారే నీటిలో దోమలు ఉండవు. నిల్వనీరు దోమలకి ఆవాసం.  ఇంకో మూడ్రోజుల్లో దోమలు విజృంభించడం మొదలెట్టాయి.  పిల్లలకు జ్వరాలు, విరేచనాలు వస్తున్నాయి.  కొంతమంది తేరుకుంటున్నారు, కొంతమంది మంచానికతుక్కుపోతున్నారు. పెద్దవాళ్ళుకూడా.  డెంగీ, మలేరియాలు చాలా సాధారణం ఇక్కడ.  నా దగ్గరున్న క్లోరిన్ బిళ్ళలు గూడేనికి రెండురోజులకు సరిపోలేదు, నా దోమతెర నాకుతప్ప వేరొకరికి సరిపోదు. 
వైద్యం, ఊరిపెద్ద చేస్తున్నాడు. ఏవేవో పసర్లు ఇస్తున్నాడు, కొందరికి పడుతుంది ఆ పసరు, కొందరికి లేదు.  ఆ వైద్యానికి తగ్గేట్టు లేదు. వేసవి ఎండ తగ్గుతుందో లేదో తెలియడం లేదు. పేపర్లు రావడానికి పదిరోజులు పడుతోందిప్పుడు. జ్వరాలు గూడెం అంతా వ్యాపించాయి, ఊరిపెద్ద అందరినీ పిలిచాడు ఒక చెట్టు దగ్గరకి.  ఆ చెట్టుని అందరూ ఎంతో భక్తితో చూస్తారు. అది ఒక పురాతన మహావృక్షంలాంటిది. వచ్చినప్పటినుంచీ చూస్తున్నా, ఏవైనా పెద్ద కార్యక్రమాలను ప్రకటన చేయడానికి అదే వేదిక.  ఆరోగ్యంగా ఉన్నవాళ్ళూ, అక్కడికి రాగలిగేవాళ్ళూ వచ్చి గుమిగూడారు.  ’
పెద్దాయన చెప్తున్నాడు, “గత పన్నెండు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇలా జ్వరాలెప్పుడూ రాలేదు.  వచ్చినా నెలల తరబడి నిలబడలేదు. వాగులు ఎప్పుడూ ఇన్నిరోజులు ఇంకిపోలేదు, చెట్లు ఇంతలా ఎండిపోనూ లేదు.  ఈ జ్వరాలకి విరుగుడు నీరే.  మన పొంగిపొర్లే వాగులే.  అలా నీరు రావాలంటే వర్షాలు పడాల్సిందే.  వర్షాలు పడాలంటే కోళ్ళు ఈ అమాసకు తెగాల్సిందే” అని కొంచెం బిగ్గరగా చెప్పి వెళ్ళిపోయాడు.
వైద్యానికి పసరు వాడడమే అశాస్త్రీయం అనుకున్నా నేను, ఈ వింత ప్రకటనకి ఆశ్చర్యపోయా.  అమావాస్య రెండురోజులుంది.  అందరూ ఆ పెద్దాయన చెప్పినట్టే కోళ్ళను సమకూర్చుకుంటున్నారు.  అన్ని కుటుంబాలూ అమావాస్యరోజు మధ్యాహ్నం చెట్టుదగ్గరకు చేరుకున్నారు.  నేను ఆ పెద్దాయన పక్కన నిలబడి జాగ్రత్తగా గమనిస్తున్నా ఆ తంతు అంతా.  నాగరికత నాకు నేర్పిన బయాసెస్’ అన్నింటినీ మెదడులో తిరగనివ్వకుండా కట్టడిచేస్తూ, అక్కడ జరుగుతున్నదాన్నంతా ఆబ్జెక్టివ్‍గా నోట్ చేసుకుంటున్నా.
చెట్టు మొదలుని కొంచెం నీటితో కడిగారు. ఒక్కొక్కరిగా వచ్చి భయంతోనో, చిరాకుతో అరుస్తున్న కోళ్ళని అక్కడ పెడుతున్నారు.  ఆ పెద్దాయన భక్తిగా, శ్రద్ధగా చేతులు జోడించి ఒక చిన్న పదునైన కత్తిని తీసుకొని ఒక కోడిని చేతితో పట్టుకొని మెడ కోశాడు.  ఆ కోయడంలో రాక్షసత్వంగానీ, క్రూరత్వంగానీ కనిపించలేదు.  ఒక బాధ్యత కనిపించింది. చిమ్ముతున్న కోడి రక్తాన్నిచెట్టు మొదలుపై వేశాడు.  ఒకటి తర్వాత ఒకటిగా వారిచ్చిన కోళ్ళను వరసగా కోస్తూనే ఉన్నాడు అవి అయిపోయినంతవరకూ, సాయంత్రం కావొస్తుంది.
“పసర్లు వేస్తే రోగాలు తగ్గుతాయట, కోళ్ళను కోస్తే వర్షాలు పడతాయట’’ ఎంత వద్దనుకున్నా నాలోని నవనాగరికత నింపిన శాస్త్రీయ దృక్పథం నవ్వు తెప్పించింది.  నా నవ్వులోని ఆంతర్యాన్ని గ్రహించాడో లేదా, నా అంతరంగంలోని అనుమానాల్ని గమనించాడో గానీ ఆ పెద్దాయన ‘‘కోళ్ళని కోస్తే వర్షాలు పడ్డాయి ఇంతకు ముందు, ఇప్పడూ పడతాయి, ముందు కూడా పడతాయి”’’ అని చెప్పి చెట్టు మొదటిని తాకి దండం పెట్టుకుని వెనుదిరిగి “అలా అని కోళ్ళని కోస్తే మాత్రమే పడవు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అతను చెప్పినప్పుడు అతని కళ్ళల్లో అచంచలమైన విశ్వాసం కనిపించింది.  కానీ విశ్వాసానికి, సైన్స్‌కి ఆమడ దూరం.  నాకు అతని విశ్వాసం నచ్చింది, కానీ శాస్త్రీయత లోపించిన వారి అమాయకత్వం బాధనిపించింది.  అలా ఆలోచనలలో మునిగి ఉన్న నేను చుట్టూ అలముకున్న చీకటిని గమనించలేదు.  గమనించి తేరుకునేలోపు దూరంగా చెట్లమధ్య కళ్ళుమిరుమిట్లుగొలిపే కాంతి.  కొన్ని క్షణాల నిశ్శబ్ధం తర్వాత పెళపెళమని ఆకాశంలో పెద్ద శబ్ధం.  అడుగు ముందుకేశాను, భుజంపై ఒక చిన్న చుక్క.  తలపైకెత్తి చూశా ముఖంపై మూడుబొట్లు.  ముందుకి అడుగులేసా, మూడో అడుగు పడకముందే మోకాలిలోతు నీటిలో ఉన్నా.  అది వర్షం కాదు సాక్షాత్తు ఆకాశగంగే.  మూడుక్షణాల్లో వాగు వరదైంది.  ఆ వరద నీటిలో నాలో ఏ మూలో దాగున్న నాగరిక అహం కొట్టుకుపోతుంది.  ప్రక్షాళన అయ్యింది గుంటల్లో పేరుకున్న నిల్వ నీరు.  కొత్త నీరు ప్రవహిస్తుంది వేగంగా, జ్వరాల్ని తగ్గించడానికంటూ.
మంచినీళ్ళ ట్యాంకరు వచ్చింది రెండురోజుల తర్వాత.  పేపర్లు తెచ్చాడు డ్రైవరు.  కోళ్ళను కోసినరోజు తర్వాతరోజు పేపరు తెరిచాను.  ఒక మూలగా వార్త క్యుములోనింబస్ మేఘాల ప్రభావంవలన ఎన్నడూ లేనంత వర్షపాతం ఏజెన్సీ ప్రాంతంలో’అని ఉంది.