యాక్సిడెంట్‍లో, కూతురు అల్లుడూ చనిపోతే , అమ్మానాన్నలను పోగొట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న మనవడు ఈశ్వర్‍ని , గుండెలకు హత్తుకుని ఏడుస్తోంది కమలమ్మ. కూరలు అమ్ముకుని బతికే తాను ముసలివయసులో మళ్ళీ ఒక చిన్న ప్రాణికి ఆసరా అవ్వాల్సి రావటం బరువే. కానీ బుజ్జి ఈశ్వర్‍ని చూస్తే బాధేసి, జాలేసి లేని ఓపిక తెచ్చుకుని బతుకు ఈడుస్తోంది.
షేర్ ఆటోలో లెక్కకుమించి ప్రయాణికులను ఎక్కించుకోనైతే ఎక్కించుకున్నాడుగానీ అదుపు తప్పిన ఆటోని రోడ్డు పక్కకి డింకీలు కొట్టకుండా ఆపలేకపోయాడు డ్రైవర్. ఫలితంగా అమ్మపొత్తిళ్ళలో మెత్తగా కూర్చుని వున్న ఈశ్వర్‍కు ప్రాణగండం తప్పిందికానీ తల్లీతండ్రీ లేని దురదృష్టం పట్టుకుంది.
తనకున్న ఓపికతో జంక్షన్‍లో కూర్చుని కూరలు అమ్ముతూ మనవడి ఆలనాపాలనా చూసుకుంటోంది.
ఆరోజు ఆమెకి ప్రాణం బాలేదనిపించింది. ఉండుండి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. పరిచి పెట్టిన కూరలన్నీ బుట్టలో సర్దేసి, నెత్తిన పెట్టుకుని, ఈశ్వర్ చెయ్యి పట్టుకుని ఇంటిదారి పట్టింది. సగం దూరం వెళ్ళాక తాగుబోతు డ్రైవర్ ఒకడు నడుపుతున్న మినీలారీ వేగంగా వచ్చి, ఇద్దర్నీ కొట్టేసింది. కమలమ్మ తల పక్కనున్న స్తంభంకి బలంగా తగలడం, ఈశ్వర్ తల నేలకి మెల్లగా తాకడం ఒకేసారి జరిగి ఇద్దరూ స్పృహ కోల్పోయారు.
జనాలు గుమిగూడారు, కమలమ్మకి తలనుంచీ బాగా రక్తం కారుతోంది
“అయ్యో” అంటూ గబగబా ఒక ఆటోలో కమలమ్మని ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదంతా జరుగుతున్నప్పుడు, పన్నెండేళ్ళ పాప మీరా, తన పోలీయోకాలు ఈడ్చుకుంటూ వచ్చి ఈశ్వర్‍ని వళ్ళోకి తీసుకుంది. తన చేతులతో వాడి బుగ్గలూ, నుదురూ తడుముతూ రాస్తూ ఉంది. వాడు కళ్ళు తెరిచి చూసాడు. లేపి నుంచోబెట్టి చెయ్యి జాగ్రత్తగా పట్టుకుని, పక్కనే ఉన్న ఫుట్‍పాత్‍మీద కూర్చోబెట్టింది. జనాలు కమలమ్మ ప్రాణాలతో మిగలదేమోననే భయంలో బాబుని గమనించుకోలేదు.
ఈశ్వర్ అయోమయంగా కూర్చుని ఉన్నాడు. అందరూ ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళిపోయారు. వాడిని ఏమి చేయాలో ఎవరికి అప్పగించాలో తెలియలేదు ఆ పిల్లకి. ఒక్కడినీ అలా వంటరిగా వదిలెయ్యలేకపోయింది.
“బాబూ పదా! ” అంది. ఊహూ అన్నట్టు తల అడ్డంగా తిప్పుతున్న వాడి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
“అయ్యో ఏడవకు తమ్ముడూ! నీకేం భయం లేదు దా! ” అని తన చేతులతో బాబుని దగ్గరకు తీసుకుని తన పల్లీమసాల బుట్ట దగ్గరకు తీసుకొచ్చింది మీరా. తన దగ్గరున్న బాటిల్లోని నీళ్ళతో వాడి మొహం కడిగి మెత్తటి బట్టతో తుడిచింది. వాడికి అమ్మ గుర్తొచ్చినట్టుంది, గుండె కదిలి, ఏడుస్తున్నాడు.
“అయ్యో ఏడవకు బాబూ! ఆకలేస్తోందా? పల్లీలు తింటావా? ” అని పల్లీలు గుప్పిటతో తీసి అందివ్వబోయింది. వద్దన్నట్టు తలడ్డంగా తిప్పుతూ, అమ్మ… అమ్మ… అని ఏడుస్తూ వెక్కిళ్ళు పెట్టాడు వాడు.
“ఏడవకు… ఏడవకు… నాన్నా!” అని తల్లడిల్లుతూ మొయ్యలేకపోయినా వాడిని నడుముకి ఎత్తుకుంది మీరా. చేత్తో బాబు తలను భుజానికి ఆనించుకుంది.
“ఓ ఓ ఓ ఏడవకమ్మా ఏడవకూ…” అని బుజ్జగిస్తూ , ఊయల ఊపినట్లుగా తాను కదులుతోంది. ఏడుస్తూ ఏడుస్తూనే ఆ లాలనకు నిద్రలోకి జారిపోయాడు. నెమ్మదిగా వాడినెత్తుకుని అలాగే ఫుట్‍పాత్‍మీద కూర్చుని వాడిని ఒడిలోకి మార్చుకుంది. అలా వాడిని వళ్ళో ఉంచుకునే పల్లీమసాలా పొట్లాలు కట్టి ఇస్తోంది కొనుక్కునేవాళ్ళకి.
ఓ గంట తరువాత నిద్ర లేచాడు. వాడిని అక్కడే కూర్చోబెట్టి పక్కనే ఉన్న షాపులో చాయ్ తెచ్చి, రెండు కప్పుల్లో తిప్పి చల్లార్చి, రెండు బిస్కట్లు ముంచి తినిపించి, మిగిలింది తాగించింది. ఆకలిమీద ఉన్నాడేమో వాడు గబగబ చాయ్ తాగి బిస్కట్లు తిని, అక్కడక్కడే, చిన్నగా ఆడుకోవడం మొదలుపెట్టాడు.
కమలమ్మ మూసిన కన్ను తెరవకుండా హాస్పిటల్ బెడ్‍మీద ఉంది. హాస్పిటల్లో చేర్పించినవారు తలా ఇంతా అని డబ్బులు జమచేసి కట్టారు. కమలమ్మ బొడ్డున దోపుకున్న సంచీలోకూడా కొన్ని డబ్బులు ఉండటం చూసిన నర్సు హాస్పిటల్ ఖర్చులకు పక్కన దాచి వుంచింది. మూడురోజులు చావుబతుకుతో పోరాడింది.
ఈ మూడురోజుల్లో ఈశ్వర్‍కి చాలా దగ్గరయ్యింది మీరా.
“అక్కా, అక్కా!” అని వాడుకూడా ఆ పిల్లకు తొందరగానే మాలిమి అయ్యాడు.
వరుసవరుస ఆక్సిడెంట్లు… అమ్మనుంచీ అమ్మమ్మకు, అమ్మమ్మనుంచీ మీరా అక్కకూ, తాను బదిలీ అవుతుండటంతో మీరా వాడికి కొత్తని అనిపించలేదు. పైగా మీరాకికూడా ఇన్నాళ్ళుగా ఏ బంధమూ లేని అవిటిబతుక్కి, ఇప్పుడు బాబు రూపంలో తమ్ముడు దొరకటం అపురూపంగా ఉంది. తనకోసంకూడా ఏ రోజూ వంటచేయనిది వాడు సరిగా తినటంలేదని కూరలు చేస్తోంది. చేతులు కాల్చుకుంటూ మరీ…
తానైతే హోటల్ అన్న ఇచ్చిన, మిగిలిపోయిన బిర్యానీతో మిగిలిపోయిన పప్పూ అన్నంతో సరిపెట్టుకునేది ఇన్నిరోజులూ. ఈశ్వర్‍కోసం అన్నీ మార్చుకుంది. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటోంది వాడిని.
మూడోరోజు రాత్రి , ఈశ్వర్‍కి వళ్ళు తెలియని జ్వరం. కాలుని ఈడ్చుకుంటూ పక్క పాకల్లో ఉన్నవారి సాయంతో మందులు తెప్పించి వేస్తూ రాత్రంతా వాడి నుదురు చల్లని బట్టతో తుడుస్తూ జాగ్రత్తగా చూసుకుంది, ఒక కన్నతల్లిలాగా…
వాడికి జ్వరం తగ్గలేదు. వాడిని చూసుకుంటూ పల్లీలు అమ్మే పనికి పోలేదు మీరా. నాలుగోరోజున కమలమ్మ హాస్పిటల్ నుంచీ డిస్చార్జ్ అయింది. ఆక్సిడెంటు అయినచోటకి వచ్చి బాబు గురించి విచారించింది. ఆమె అడిగినవారికి మీరా దగ్గర బాబు ఉన్నాడని తెలియక, ఎవరూ చెప్పలేకపోయారు.
“అయ్యో! నా బిడ్డ ఎక్కడున్నాడో!” అనుకుంటూ, కమలమ్మ తనకు ఓపికున్నప్పుడు తిరుగుతూ, విచారించుకుంటూ ఉంది. అప్పటికి పదిరోజులు… ఇద్దరూ విడిపోయి.
పల్లీమసాలా అమ్ముతోంది మీరా, జ్వరం తగ్గిన ఈశ్వర్‍ని పక్కన కూర్చోబెట్టుకుని. వాడికి ఎన్ని ప్రశ్నలో!
“అక్కా అదేంటీ? అక్కా ఇలా ఎలాగా?” అని ఒకటే అక్క జపం చేస్తూనే ఉంటాడు. మీరా వాడిని విసుక్కోకుండా సహనంగా చూసుకుంటోంది.
దూరంగా కమలమ్మ వాడిని చూసింది. ప్రాణం లేచొచ్చినట్టై లేని ఓపిక తెచ్చుకుని ఆనందంగా, “ఈశ్వర్!” అని పిలుస్తూ వస్తోంది.
వాడికి అమ్మమ్మ పిలుపు వినబడి తల తిప్పిచూసి “అమ్మమ్మా!” అని పిలుస్తూ పరిగెత్తుకెళ్ళి ఆవిడని కరుచుకుపోయాడు.
“నా బాబే! నా కన్నయ్యే! దెబ్బలేమీ తాకలేదుగా నాన్నా ఆ రోజు?” అంటూ ఆప్యాయంగా బాబుని గుండెలకు హత్తుకుంది.
మీరా వారిద్దరినీ చూసింది. వాడి నిశ్చింతను చూసి హాయిగా నవ్వింది. ఆరోజు వాడిని దగ్గరకు తీసిన విషయంనుంచీ ఈరోజువరకూ జరిగినవన్నీ ఆవిడకి చెప్పింది.
అంతా విని తన కాళ్ళకి ఉన్న వెండికడియాలలో ఒకటి తీసి మీరా చేతిలో పెట్టింది కమలమ్మ.
“ఏమిటిది అమ్మమ్మా? ఎందుకిలా?” అని మీరా కడియం తిరిగి ఇచ్చెయ్యబోయింది.
“పర్లేదమ్మా! చిన్నపిల్లవి, ఇంత పెద్దరికంగా నా మనవడిని ఇంత జాగ్రత్తగా చూసుకున్నావు! లేకపోతే ఈరోజుల్లో ఈ పాడు సిటీబతుకుల్లో నా మనవడు ఎటు కొట్టుకుపోయి ఉండేవాడో! ఈ పాడుసిటిలో బతుక్కి ఆధారం వెతుక్కుంటూ వచ్చాం. కానీ ఈ ఆక్సిడెంట్లు మా బతుకులనే మింగేస్తున్నాయి. అందుకే మా పల్లెకి పోతాం. అక్కడ గంజి తాగయినా సరే బతుకు వెళ్ళదీస్తాం. కనీసం నా మనవడికి నేనంటూ ఒక మనిషిని బతికి ఉంటాను” అనేసి మనవడికి చెయ్యి అందించి తీసుకుపోబోయింది.
“అక్కా పోతున్నా!” అన్నట్టు వెనక్కి తిరిగి చూసిన ఈశ్వర్‍కి, కళ్ళనిండా నీళ్ళతో, మొహంనిండా దిగులుతో కూర్చున్న ఆ పిల్లని చూసి వాడికీ దిగులేసింది. అక్క ఏడుపు చూసి జాలేసింది. కానీ ఏం చెప్పాలీ ఏం చేయాలీ అని అర్థంకాని వయసు వాడిది.
లోకంలో మొదటిసారి నా అనిపించిన బంధం… బాబు దూరంగా ఒక్కొక్క అడుగూ వేస్తుంటే…గుండె చెరువవుతుండగా ఏడుస్తోంది మీరా.
ఆమెను చూస్తూ వెయ్యలేక వెయ్యలేక అడుగు వేస్తున్నాడు ఈశ్వర్. అమ్మ పోయిన తరువాత ఏదో తెలియని బాధ మనసుకి తెలిసి ఏడుపొచ్చేది వాడికి, ఎంత అమ్మమ్మ ప్రేమగా చూసినా సరే… మళ్ళీ ఈరోజు , నిండా పన్నిండేళ్ళుకూడా నిండని మీరా స్వచ్ఛమైన ప్రేమ వాడికి తన అమ్మని గుర్తు తెచ్చింది…అమ్మని ఒకసారి వీడినట్లే ఇప్పుడూ మళ్ళీ అదే అమ్మని వీడి వెళుతున్న వెలితిలాగా మనసుకి దిగులేస్తోంది.
“అమ్మమ్మా! అమ్మ… “అన్నాడు కమలమ్మవైపు చూస్తూ.
“అమ్మా.. అమ్మెక్కడుంది నాన్నా? మనని వదిలి ఎప్పుడో వెళ్ళిపోతేనూ?” దిగులుగా అడుగుతూ, ఈశ్వర్‍వైపు చూసింది .
“అదిగో అమ్మ ” అంటున్నాడు వాడు మీరావైపు చెయ్యిపెట్టి చూపిస్తూ.
ఆవిడ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. తరువాత వాడి మనసులో, మీరా ఏర్పరుచుకున్న స్థానం అర్థం అయ్యింది… కమలమ్మ అడుగు మీరావైపు మళ్ళింది. అప్పటికే ఈశ్వర్ అమ్మమ్మ చేతివేలు విడిచిపెట్టి మీరావైపు పరుగు పెడుతున్నాడు.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.