అక్కడొక నగరాన్ని నిర్మించాలనుకున్నారు. చాలా ప్లాన్‍డ్ సిటీని. మామూలుగానైతే చుట్టుపక్కల వున్న వూళ్ళని కలుపుకుంటూ ఒక వూరేదో నగరంగా రూపుదిద్దుకుంటుంది. లేదంటే అడవుల్ని నరికేసీ, కొండల్ని పిండిచేసీ నగరాలని కడతారు. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. అందుకని కొన్ని పల్లెటూళ్ళని ఖాళీ చేయించి నగరనిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం పూర్తైంది.
“ఆలోచన మంచిదే. తినటానికి తిండీ, కట్టుకోవటానికి బట్టా లేని నిరుపేదలందరికీ చిన్నచిన్న వ్యాపారస్తులకీ వుపాధి కల్పించే ప్రయత్నంగా నగరనిర్మాణం మొదలైంది. ఊళ్ళు ఖాళీ చేసినవారికి వారికిగల ఆస్తులనిబట్టి పరిహారం ఇచ్చారు. స్థలానికీ, ఇంటికీ, ఇంట్లో వుండే చెట్టూ, పుట్టా, పురుగూ, పులుగూ అన్నిటికీ లెక్కగట్టి ఇచ్చారు. ఒక పెద్ద ప్రయోజనం కోరుకున్నప్పుడు ఇలాంటివి చిన్నచిన్న విషయాలౌతాయి. కానీ ఆ పెద్ద ప్రయోజనం రాజ్యానిది. ప్రత్యక్షప్రజది కాదు. ఈ చిన్నవిషయాలు పెద్దసమస్యలు ఆ ప్రత్యక్ష ప్రజకి. ఆ మహానగరం నిర్మించబడితే ఎవరెవరో వచ్చి అక్కడ వుంటారు. వీళ్ళ వూళ్ళో వీళ్లకి చోటుంటుందా అనేది సందేహమే. ఐనాకూడా ప్రయత్నలోపం జరగలేదు. కుటుంబంపట్లా తాము పుట్టి పెరిగిన నేలపట్లా ప్రేమ వున్న కొందరు, ఇక్కడే వుండి చిన్నాపెద్దా పనులు చేసుకుంటే ఇంకొందరు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలని వెతుక్కున్నారు. మా నాన్నలాంటి చాలామందిమాత్రం చేతినిండా వచ్చి పడ్డ డబ్బుని చూసి ప్రలోభంలో పడ్డారు. డబ్బుంటే ఎక్కడేనా బతకచ్చు, ఇక్కడే వుండాలనేముంది? అనుకుంటూ నెలవు వదిలి దేశంమీద పడ్డారు” అంది పల్లవి.
సుమారుగా ముప్పయ్యేళ్ళుంటాయి ఆమెకి. ముదురు ఎరుపురంగుమీద అంతే ముదురు ఆకుపచ్చరంగు ప్రింటున్న నూలుచీర, ఆకుపచ్చ జాకెట్టు వేసుకుంది. మెడలో సన్నటి గొలుసు. చేతులకి ఒక్కో ఎర్రటి వెడల్పుగాజు. చెవులకి చిన్నవి ఏవో దుద్దులు. ఏళ్ళుగా మనసులో పొంగిపొర్లుతున్న దు:ఖం కనుపాపల చెలియలికట్టని దాటలేక ఆగిపోతోంది. అలా ఆగిపోవటం ఆమె వ్యక్తిత్వానికి గాంభీర్యతని ఇచ్చింది. ప్రక్కనే నడుస్తూ ఆమె మాటల్ని వింటున్నవాడు ఆమె స్నేహితుడు, శిశిర్. ఇద్దరూ కొన్నేళ్ళుగా స్నేహితులు. పెళ్ళి చేసుకోవాలన్నది అతని ఆకాంక్ష. కానీ ఆమెలో అలాంటి వికాసం కనిపించట్లేదు. ఆమెకి అతని సాహచర్యం కావాలిగానీ జీవితాలు కలబోసుకునేందుకు ఏదో సంకోచం. తన జీవితమ్మీది పెత్తనం అతను తీసేసుకుంటాడేమోననే భయం. ఉద్యోగవిధుల్లో భాగంగా యీ వూరికి ఇద్దరూ వచ్చారు. ఆమెలో అలాంటి భయానికి పునాది పడిన చోటు అది. మనసు కొద్దిగా తెరుచుకోవటం మొదలైంది.
“మీది ఇక్కడా? అవంతీపురమా?!!” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఈ చుట్టుపక్కల వున్న యాభైఅరవైగ్రామాలని కలిపి ఇప్పుడు అవంతీపురం అనేస్తున్నారుగానీ, ఒకప్పుడు దేనికి దానికే పేర్లుండేవి. మాది రామభద్రపురం. ఆర్‍బీపీ బస్‍స్టాప్ అంటున్నారు ఇప్పుడు”
“ఔను. ఎన్నో ప్రాంతాలు పెద్దపెద్ద వూళ్ళలో అంతర్భాగాలుగా వుండిపోతాయి. కొన్ని బస్‍స్టాపులుగానూ, ఇంకొన్ని లేండ్‍మార్కులుగానూ మారిపోతాయి. మనం గుర్తెరగం”
“అదో పెద్ద విషాదం. ఉనికిని పోగొట్టుకోవటం అనేది దాని పేరు. ఊళ్ళైనా మనుషులైనా దాన్ని తట్టుకుని నిలబడటం చాలా కష్టం. మనిషంటే జన్యుప్రవాహం. వంశం. నేను… నాగుమయ్య మునిమనవరాలిని, చంద్రమయ్య మనవరాలిని, రాజమయ్య కూతుర్ని. మరిప్పుడు? నా రక్తంలో రక్తం కాని మరో తల్లిదండ్రులకి పెంపుడు వున్న కూతుర్ని. మనిషికే ఇలా వుంటే, మరి ఊరికి? ఊరంటే ఒక సంస్కృతి, జాతి” ఆమె గొంతు వణికింది. అతను ఆగి తల తిప్పి ఆమెవైపు చూసాడు. ఆమెకూడా ఆగింది.
“నీకు తెలుసా? ఊళ్ళకి వూళ్ళ మనుషులు వలసపోవటాన్ని గురించి ఎప్పుడేనా విన్నావా? ఎక్కడేనా చదివావా?” అడిగింది.
“ఇక్కడ కూర్చుందామా?” రోడ్డుకి ఒక పక్కగా వున్న సిమెంటు బెంచివైపు సూచిస్తూ అన్నాడు. ఆమె తలూపింది.
ఇద్దరూ అటుగా నడిచారు. కూర్చునేముందు “ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్ళి రెండు కప్పుల టీ తీసుకొచ్చి, ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు.
కొత్తగా కట్టిన నగరాన్ని మిగిలిన నగరాలతో కలిపే హైవే అది. దాదాపు మూడుకిలోమీటర్ల పొడవున రోడ్డుకి అటూయిటూ చిరువ్యాపారస్తుల దుకాణసముదాయాలు వున్నాయి. అక్కడ దొరకనిదంటూ ఏదీ వుండదు. వాళ్ళు పండించినవీ, తయారుచేసినవే కాక మారుబేరాలు, ప్లంబింగ్, రిపేర్లలాంటి సర్వీసులు… బట్టలు, బొమ్మలు, పుస్తకాలలాంటి సమస్తవస్తువులూ అక్కడ దొరుకుతాయి. రోడ్డు ఆ చివర్నుంచీ ఈ చివరదాకా నడుస్తూ కావల్సినవి కొనుక్కోవచ్చు. ఎందరు కూర్చోవడానికేనా సరిపోయేన్ని సిమెంటు బెంచీలు ఈ పొడుగునించీ ఆ పొడుగుదాకా రోడ్డుకి రెండువైపులా వున్నాయి. షాపింగులో అలసిపోయినప్పుడు వాటిమీద కూర్చుని కచోరీలు, పానీపూరీ, సమోసాలూ తింటారు జనం. చాలామంది మాల్స్‌లోకన్నా అక్కడికి రావటానికే చాలా యిష్టపడతారు. సహజంగా వుండచ్చు. ప్రవర్తించవచ్చు. చేసే షాపింగ్‍కి అది బోనస్.
“టీ చాలా బావుంది” అందామె.
అతను కొద్దిగా భుజాలు వంచి ఆ ప్రశంసని స్వీకరించాడు. చిన్నగా నవ్వింది. తరువాత ఆ నవ్వు కరిగిపోగా ఆమె ఆలోచనలో మునిగిపోయింది. అతనికి తెలిసినప్పట్నుంచీకూడా ఆమె ఈ ఆలోచనల అల్లకల్లోలంలోనే వుంది. బైటికి ఒక మనిషిగా లోపల మరోమనిషిగా వుంటుంది. అందులోంచీ ఆమె బయటపడితేనే తను చేసిన పెళ్ళి ప్రతిపాదనకి జవాబు దొరుకుతుందని అనుకుంటాడు. ఎన్నోయేళ్ళుగా తనతో కలిసి తిరుగుతున్న ఈ యువతి జీవితంమీద పడిన ముద్రలేమిటి? అవి ఎలాంటివి? ఎందుకంత విషాదం?
“నువ్వు చెప్పిన వలసవెళ్ళటంలో నాకు ప్రత్యక్ష అనుభవం లేదు. కానీ అలా వలస వెళ్ళిన తదుపరి పరిణామాలు మా కుటుంబంలో వున్నాయి. ఒక రాష్ట్రం విభజించబడినప్పుడు మనుషులు ఏం కోల్పోతారో నాకు తెలుసు. కొన్ని తరాలక్రితం జరిగిన ఒక చారిత్రక సంఘటనలో మేము ఇల్లూ వాకిలీ, కుటుంబం అన్నిటినీ పోగొట్టుకున్నాము. అది 1905లో జరిగిన బెంగాలు విభజన. నువ్వు చెప్పినట్టు మనుషులు గుంపులుగుంపులుగా తరలిపోతూ, మొదట చేతిలో వున్న విలువైన వస్తువుల్నీ, తరువాత డబ్బునీ, ఆడవారినీ, పిల్లలనీ పోగొట్టుకుంటారు. అలాంటి సంఘటనలో కట్టుబట్టలతో హైదరాబాదు చేరారు ఒక వ్యక్తి. మళ్ళీ పెళ్ళి చేసుకుని, కొత్తగా కుటుంబాన్ని ఏర్పరుచుకుని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టినా, తను పుట్టిన నేలకోసం, మొదటి ప్రేమికకోసం, పోగొట్టుకున్న సంతానంకోసం తపించిపోతూ, తనది అసమర్ధత అని స్వీయనింద చేసుకుంటూ బతికేరు. తరాలు గడిచాయి. నేను పుట్టాను. ఈనేలకి మేము చెందము. మాతృభూమికి తిరిగి వెళ్ళగలిగే అవకాశం లేదు. ఈ రెండు నిజాలూ మా కుటుంబాన్ని అంతర్గతంగా శాసిస్తూ వుంటాయి” అన్నాడు.
ఆమె కళ్ళెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. “ఎందుకని మనం ఈ విషాదాలని అంత తేలిగ్గా మర్చిపోయి కొత్తకొత్త విషాదాలని పోగుచేసుకుంటున్నాం?” అడిగింది.
“మర్చిపోయింది ఎక్కడ? మన జీవనశైలిలో ఇంకిపోలేదూ? పుట్టిల్లు వదిలి అత్తింటికి వెళ్ళిన ఆడపిల్ల పదేపదే తన మూలాలని వెతుక్కున్నట్టు మనంకూడా వెతుక్కుంటాం. కానైతే కాసేపైనా తిరిగి వెళ్ళటానికి మనకి ఎక్కడా ఆహ్వానం వుండదు” అన్నాడు.
“చాలామంది మనకి చక్కటి నగరాలు లేవు, మన నగరాలు ఎలాపడితే అలా అడ్డదిడ్డంగా విస్తరిస్తుంటాయని అసంతృప్తిని చూపిస్తారు. అమెరికాలాంటి దేశాలతో పోల్చి చూస్తారు. నాకొకటి చెప్పాలనిపిస్తుంది. అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ. వాళ్ళు ఆ దేశాన్ని పునాదులతోసహా నిర్మించారు. మనదేశం అలా కాదు. వేలయేళ్ళుగా ఇక్కడ మనుషులున్నారు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు వూళ్ళని కట్టుకున్నారు. వాటిని సరిచెయ్యటం సాధ్యపడే పనేనా? ఈ మహానగరం ఆలోచన అలా పుట్టుకొచ్చినదే. తన పాలనాకాలంలో ఈ దేశానికి ఒక అందమైన నగరాన్ని నిర్మించి ఇవ్వాలని ఒకానొక నేత అనుకున్నారు. ప్రజలు అడగలేదు. వాళ్ళకి తాము బతుకుతున్న జీవితంపట్ల ఎలాంటి ఆరోపణా లేదు. ప్రజలకేం ఇవ్వాలో అతను తనకి తెలుసనుకున్నాడు. ఊళ్ళు ఖాళీ చెయ్యమన్నారు. నిరసనలూ, ప్రతిఘటనలూ అయాయి. పరిహారాలు అందేయి. అవ్వ, తాత, అమ్మ, నేను, నాకొక ముగ్గురు అన్నలు… ఇందరి పక్షాన మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు. ఏవేవో డబ్బులొచ్చాయి. అవన్నీ పట్టుకుని మమ్మల్ని బయల్దేరదీసాడు. ఎక్కడికి? తెలీదు. ఏం చెయ్యటానికి? తెలీదు”
“…”
“అప్పటిదాకా ఒక వూరు, కొంత సమాజం, కొన్ని కట్టుబాట్లు వున్న మనుషులు గుంపులుగా ప్రయాణం మొదలుపెట్టాక విలువలన్నీ వదిలేసారు. పోరంబోకు స్థలాల్లో గుడిసెలు వేసుకుని కొన్నాళ్ళు వున్నారు. కల్లు, సారాయి తెచ్చుకుని తాగటం, దేనికేనా డబ్బులున్నాయికదా అనే పెడసరమైన జవాబు… ఒకళ్ళదొక్కళ్ళు దొంగతనం చేసుకోవడం, ఆడవాళ్ళని కొట్టడం… వ్యవహారం రాని ఈ మనుషుల చేతుల్లో డబ్బు ఎంతోకాలం నిలవలేదు. అవ్వ, తాత చచ్చిపోయారు. అన్నలు దేశాలు పట్టిపోయారు. ఇక మిగిలింది నేను, అమ్మ. నా ఎనిమిదేళ్ళ వయసులో మా నాన్న నన్ను ఎవరికో అమ్మేసి అమ్మని వదిలేసి ఆ డబ్బుతో తను పారిపోయాడు. మనిషికి ఆకలిలాగా అతనికి డబ్బు అనేది ఆకలిగా మారింది”
“…”
“నన్ను కొనుక్కున్నవాళ్ళు మంచివాళ్ళే. పిల్లల్లేని దంపతులు. నన్ను బాగానే చూసుకున్నారు. పెంచారు, పెద్ద చేసారు. చదువు చెప్పించారు. ఇంతదాన్ని చేసారు. నేను వారిని ప్రేమించలేను. ఎందుకో తెలీదు. కృతజ్ఞత వుంది. అది చూపగలను. కానీ వాళ్ళు ప్రేమకోసం తపిస్తున్నారు”
“ఎవరికేనా కావల్సింది అదేకదా?”
“అది పతనమైన విలువల్లోంచీ వస్తుందా?”
“…”
“నేరాలు పెరిగిపోతున్నాయి. దానికి ఇంటర్నెట్టు, పోర్నూ కారణాలని ఒక బలమైన ఆరోపణ. కావచ్చు. కాదనలేని కారణమే. కానీ ఈ మహానగరం మా కుటుంబాన్ని మూడుగా చీల్చింది. నలుగురు నేరస్తులనీ, ముగ్గురు నిస్సహాయులనీ, ఒక బాధితురాలినీ తయారుచేసింది. చెప్పు, ఇవన్నీ కొత్తగా తయారైన మూసలు కావా? ఈ మూసల్లోకి ఆ మనుషులు తప్పనిసరిగా వచ్చి చేరి సర్దుకుపోవట్లేదూ?”
“నిజమే” అతను వప్పుకున్నాడు. ఆమెకి తను ఇవ్వాల్సిన వోదార్పు స్వభావస్వరూపం ఎలా వుండబోతోందో కొద్దిగా రూపుకట్టడంలేదు.
“నేను రామభద్రపురం పిల్లనని నాకు తెలుసు. ఆ నిజం నా కొత్తజీవితంలో లుప్తమైపోలేదు. సంతోషాన్ని అనుభవించే మనసుని ముల్లులా గుచ్చుతూ వుండేది. నాకో తల్లి వుందనీ ఆమె ఈ జనారణ్యంలో ఎక్కడో తప్పిపోయిందనీ పెద్దౌతుంటే అర్థమైంది. నా పెంపుడు తల్లిదండ్రులని వివరాలు అడిగి తెలుసుకున్నాను. వాళ్ళ నన్ను ఇక్కడినుంచీ తీసుకొచ్చామని చెప్పారు. కొన్ని దృశ్యాలు… ఉ<హు… ఒకటే దృశ్యం…
చిన్న… అందమైన చుట్టుగుడిసె… గుడిసెకి అందం ఎలా వచ్చిందని అడక్కు. అమ్మా, నాన్నా, అవ్వా, తాతా, పిల్లలూ వుండే యిల్లు అందంగానే వుంటుందిలే. రేపెప్పుడో మాలో కొందరం పెరిగి పెద్దై సంపాదనపరులమైతే ఆ యింటిని మార్చి భవంతిని కట్టుకునేవాళ్ళం కావచ్చు… ఇంటిముందొక వేపచెట్టు… దానికి ఎత్తునించీ వేలాడే వుయ్యాల. అందులో వూగుతూ నేను…
దృశ్యం మారిపోయిందిలే… ఆ తర్వాత… ఇక్కడే ఎక్కడో నేలమీద గొంతుక్కూర్చుని అమ్మ… ఆమెని ఆనుకుని అలాగే కూర్చుని నేను… మాలాగే ఇంకా చాలామంది… కూలిపనికోసం ఎదురుచూస్తూ…
ఇంకాతర్వాత ఆ దృశ్యంలో నేను లేను. కానీ అమ్మ వుండాలికదా? ఆమె మళ్ళీ ఎవరికీ కనిపించలేదట. వెతుకుతూ వున్నాను అమ్మకోసం… వెతుకుతున్నానన్న సంతృప్తికోసం. నన్ను నేను మభ్యపెట్టుకోవడానికి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి, కొందరి ముఖాల్లోకి పట్టిపట్టి చూస్తాను. కానీ ఎక్కడ వెతకాలో అక్కడ కాదు…” చివరిమాటల్ని అంటున్నప్పుడు ఆమె గొంతు జీరవోయింది. ఆమె చూపు ఎక్కడో చిక్కువడింది. ఆ చూపు చివర్న-
మడతమంచములు అద్దెకివ్వబడును- అనే బోర్డు వేలాడుతోంది. వాటితోపాటుగా తన తల్లీనా? అనే ప్రశ్న కూడా.
“నేను గాయం మానిన గుర్తుని. నువ్వు పచ్చి గాయానివి. అందుకే ఇంత బాధ” ఓదార్పుగా అన్నాడు.
“దీన్ని సర్వైవల్ గిల్ట్ అంటారటకదా?” అడిగింది.
అతను తలూపాడు.
“అంతకన్నా చచ్చిపోవడం మెరుగుకదూ?”
“కాదనుకుంటా. మా ముత్తాతెవరో ఆరోజుని ఆ పని చేసివుంటే ఇప్పుడు నేనిలా నీపక్కని వుండను”
ఆమెకి జవాబు దొరికింది.
“సందర్భం వస్తే నువ్వూ మా నాన్నలానే చేస్తావనుకుంటున్నాను” అంది.
అతను నవ్వాడు. అంతకన్నా సానుకూలమైన స్పందనని ఆమెనుంచీ ఆశించలేదు. అందుకు నవ్వాడు.
“నవ్వెందుకు?” అసహనంగా అడిగింది.
“నేనలా చేస్తే నిన్ను నువ్వు మీ అమ్మలా నష్టపోవటానికి సిద్ధం చేసుకున్నావా అని”
ఆమె తెల్లబోయింది ఆ జవాబుకి.
“ప్రపంచంలోని దాదాపు అన్ని ఆర్ధిక, మానవీయ వ్యవహారాలన్నీ ఈ ఒక్క జవాబు చుట్టే తిరుగుతాయి. నువ్వెంత మోసపోగలవు, నువ్వెంత నష్టపోగలవు… కనీసం నువ్వెంత యివ్వగలవు అనే అంచనామీదే ముందుకి సాగుతాయి. కుటుంబమేనా, వ్యాపారమేనా. నీకోణంలోంచేనా, నాకోణంలోంచేనా. అందుకు ప్రతిఘటన లేప్పుడు ఆచరణ ఇంకా సాధ్యంకదా?” అన్నాడు.
ఆమె ఆలోచించింది. అతను చెప్పినవన్నీ తన కుటుంబంలో జరిగినట్టే అనిపించింది. రాజ్యం నువ్వెంత యివ్వగలవని అడిగింది. తన వునికికి సంబంధించినవన్నీ తీసుకుంది. పరిహారం ఇచ్చింది. తన తండ్రి అందర్నీ ఎంత నష్టపరచాలో అంతా నష్టపరిచాడు.
“ఈ నిజాన్ని నిజంగా వప్పుకోగలిగిన కొంతమంది మినహాయింపు. అందుకే నీ పెంపుడుతల్లిదండ్రులు నీ గురించి నీకు చెప్పారు. చెప్పారు కాబట్టి నువ్వింత బాధపడుతున్నావు. బాధపడ్తున్నావు సరే, బలహీనమెందుకు పడుతున్నావనేది నా ప్రశ్న. ఒకసారి అనుభవం తర్వాత కూడా” అతనే అన్నాడు.
“ఇవన్నీ ఆలోచిస్తూ బతకడం వుండదు. ఎవరో ఒకర్ని నమ్ముతాం. ఏదో ఒక క్షణంలో అజాగ్రత్తగా వుంటాం. పోగొట్టుకోవడమేనా?”
“పోగొట్టుకోవడాలన్నీ ఒకేలా వుండవు. మనం నిరంతరం ఏవో ఒకటి పోగొట్టుకుంటూనే వుంటాం. ఇష్టమైన క్షణాలని, అందమైన అనుభూతులని. మనసునిండా వున్నట్టనిపించిన అనుభూతులు కాలం గడిచేకొద్దీ పిడికెడు అనుభవాలుగా మారిపోతాయి. గడచిన సంఘటనలుగా వుండిపోతాయి”
కాసేపటికిందట దొరికిన జవాబుకీ ఇప్పుడీ చెప్పినవాటికీ సమన్వయం కుదరలేదు.
“ఇది ఇంకోరకం నష్టం. ఇప్పుడేమంటావు, ఐతే?” సూటిగా అడిగింది.
“మనం పెళ్ళి చేసుకుందాం”
“అన్నివిధాలా నష్టపోవడానికి పెళ్ళెందుకు?” అడిగింది. ఆమెకి అర్థమైంది అది.
అతనింకే ప్రయత్నమూ చెయ్యలేదు.
“పద వెళ్దాం” అని లేచి నిల్చున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.