“వాసు ఏమంటున్నాడు?”
“వెళ్ళనని కచ్చితంగా చెప్పేసాడట”
“బాగా చెప్పాడు. తప్పుకదే, వాడినలా అనడం? ఐనా దిట్టంగా వున్న ఇల్లు పడగొట్టుకుని అపార్టుమెంటు కట్టుకోవడమేమిటి? కుదిర్తే ఇది ఇలాగే వుంచుకుని వేరే కొనుక్కోవాలి. అదిసరే, అంత వీళ్ళ బాగుకోరేవాడైతే ఆ చెప్పేదేదో వాసుకే జెప్పచ్చుకదా అతను, ఇల్లొదిలేసి వెళ్లమనే బదులు?” అన్నాడాయన.
“వాసుకి సలహాలిచ్చేవాళ్ళు వేరే వున్నారు. రాము, త్రిమూర్తులు, గీత పాత ఆఫీసరు. ఇల్లు పడగొట్టడానికి అస్సలు వప్పుకోరు. పడగొడితే మళ్ళీ ఇలాంటి ఇల్లు కట్టగలరా? ఇప్పుడు కాదుగానీ, వీలుచూసుకుని మాధవ్‌ని పిలిచి హెచ్చరించండి, రియల్ ఎస్టేట్వాళ్ళ మాయలో పడద్దని” అంది ప్రమీల.
వాళ్ళింట్లోనూ చిన్నగా చీలికలు వస్తున్నాయి. రమ కుటుంబంలో ఇమిడిపోయిందిగానీ, లత యిబ్బంది పడుతోంది. విశాలమైన ఇంట్లో ఒక్క ఆడపిల్లగా అన్ని సౌకర్యాలతోనూ పెరిగిన పిల్ల మూడు బెడ్రూమ్స్ ఫ్లాట్‌లో తమ మూడు జంటలు, మధ్యలో వచ్చిపోతుండే సుమతికీ మధ్య ఇరుకిరుగ్గా వున్నట్టు ఫీలౌతోంది. సాంప్రదాయమో, సుమంత్మీది ప్రేమో, సర్దుకునే ప్రయత్నం చేస్తోందిగానీ, ఆమె తల్లిదండ్రులుమాత్రం కూతురు కష్టపడిపోతోందని గాభరాయెత్తిపోతున్నారు. ఎవరూ బయటికి అనట్లేదు. ఐనా వ్యక్తమౌతోంది. వాళ్ళింటికి వచ్చి వుండండని సూచనప్రాయంగా సుమంత్‌తో అన్నారట. అతను అర్థం కానట్టు వూరుకున్నాడు. బాహాటంగా అడిగితే కాదనలేకపోవచ్చు. కాదంటే గొడవలౌతాయి.
అరుణ యింట్లో మరొక రకం. మాధురిది అన్నిట్లోనూ చొరబడిపోయే తత్వం. ప్రహ్లాద్ ప్రతీదీ తనకి చెప్పి చెయ్యాలంటుందట. తమందరూ చాలా క్రమశిక్షణతో, పొదుపుగా బతికి, పిల్లలకి బాధ్యతలు పంచకుండా వుండేసరికి వాళ్ళకి కష్టమనేది తెలీకుండా వుంటోంది. మాటపంతాలూ, అత్తమామల వునికి ఇవే పెద్దసమస్యలుగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లల్ని కని ఏవో కష్టాలు అనుభవించేసినట్టు అనుకుంటారుగానీ, నిజానికి మగపిల్లవాడితో వుండేది జీవితకాలపు సమస్య. విడదీసుకోవడానికి వీల్లేకుండా ఎన్నో ముళ్ళు. అన్నిటికీ మించినది కొడుకన్న వ్యామోహం.
వసంత్ ఇంట్లో గొడవేంటో! మొదట్లో మానస తిరగబడి జవాబిచ్చేదట. వసంత్ ఎలా నచ్చజెప్పాడోమరి! రాజశేఖరం ఏమన్నా చెవిటిదాన్లా వుపేక్ష వహిస్తోందట. పిల్లలు పట్టించుకోకుండానూ, విలువివ్వకుండానూ వుంటే ఇంక ఆ పెద్దరికం దేనికి? అటు రాణా… బాధ్యత తెలీకుండా తయారయ్యాడు. గీత ముందుపడి అందర్నీ కూడగట్టకపోతే యమున బతికిబట్టకట్టేది కాదేమో! ప్రమీల ఆలోచనలన్నీ తిరిగితిరిగి గీతదగ్గిరకి వచ్చి ఆగాయి. దానికి ఈ ఇంట్లోవాళ్ళంటే ఎందుకంత ప్రేమ? మళ్ళీ చిన్నపిల్లలాగే వుంటుంది. సుమతిలా తెలివితక్కువమాటలూ మాట్లాడుతుంది. అలుగుతుంది. దెబ్బలాడుతుంది. వాసుకే సరేమో అది!
రిటైర్మెంటు డబ్బు, పెన్షను, బాధ్యతలు తీరటం, పిల్లలు ప్రయోజకులవటం పెద్దవాళ్ళ జీవితాల్లోనూ, కొత్తగా వచ్చిన పే కమిషను గీతావాసుల జీవితాల్లోనూ మార్పులు తెచ్చాయి. ఆర్థికవిధానాల్లో గవర్నమెంటు పాలసీలు మారాయి. దానికితోడు ఎలక్టానిక్ యుగం ఆరంభంలో వుండి, సమాజంలో ఏవో మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందులా కాకుండా చేతుల్లో కాస్తంత డబ్బు ఆడుతోంది. విహీకి కానుకలు బాగా వచ్చాయి. వాసు ఆడపిల్లలందరికీ మంగళహారతి భారీగా వేసాడు. వాళ్లంతా లెక్కలుపెట్టుకుని పంచుకున్నారు. చిన్నవాళ్ళు ముగ్గురికీకూడా ఇవ్వబోయారు, మరదళ్ళైనా.
“మాకేం అక్కర్లేదు. మాకూ అన్నలున్నారు. అప్పుడు మేం నలుగురమే పంచుకుంటాం” అంది శేఖర్ కూతురు వీణ మూతిముడుచుకుని.
“అరేయ్, నువ్వు పెళ్ళిచేసుకోరా! మాకూ డబ్బులొస్తాయి” అంది పల్లవి కృష్ణతో.
“నీకు మంగళహారతి కట్నాలివ్వడానికి నేను పెళ్ళిచేసుకోవాలా? ఏం తెలివేబాబూ? డబ్బులు కావాలని నేరుగా అడగచ్చుకదా” అన్నాడు కృష్ణ. అతనిది బీటెక్ ఐపోయింది. ఉద్యోగంకూడా వచ్చింది. వెళ్ళి చేరటంవుంది.
“రేపు మీ అందర్నీ సినిమాకి తీసుకెళ్ళి, ఐస్‌క్రీం కూడా తినిపిస్తాడులేవే” బుజ్జగించింది గీత.
“వాళ్ళేనా? మేమూ వెళ్తాం సినిమాకి. మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో, ఇలా అందరం కలవటం. మాకూ తీసుకోరా” అంది సుమతి.
“అందరికీ తలో విజిలు, హీరో ఎంట్రీకి కాగితంముక్కలు విసుర్తారే, అవికూడా కావాలి” అంది రవళి.
“దేనికే?” అన్నాడు కృష్ణ హడిలిపోయి.
“హీరోయిన్ తలవెంట్రుకో, పైట అంచో ఎంట్రీ యిచ్చినప్పుడు మేం కూడా విజిళ్ళేసి కాగితంముక్కలు ఎగరేస్తాం” అంది సుమతి. లత, రమ నవ్వుతూ చూసారు.
“వీళ్ళంతా చాలా అడ్వాన్సైపోయారు. నువ్వేం మేనేజి చేస్తావుగానీ, మాకూ టికెట్లు తియ్యరా” అన్నాడు సుమంత్.
“ఒక బాక్సంతా చేసెయ్యరా! అందరం కలిసి వెళ్దాం” అన్నాడు ప్రహ్లాద్.
“సీనియర్స్నికూడా పట్టుకుపోదాం. అంతా రిటైరయ్యారుకదా?” అన్నాడు సుమంత్. అంతా గోలగోలగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు పెరిగిపోతున్నారు. మర్నాడు మార్నింగ్‌షోకి రెండుబాక్సులూ బుక్చేసుకోవడానికి నిర్ణయమైంది. తెలిసిన థియేటరే. సిన్మాహాలు ఓనరు రవి క్లాస్మేట్. షరతులు వర్తిస్తాయి. ఆడవాళ్ళు ఒకదాంట్లోనూ, మగవాళ్ళు మరొకదాంట్లోనూ కూర్చోవాలి. ఆడైనా, మగైనా పిల్లలంతా మగవాళ్ళే. సినిమా మొదలైనప్పట్నుంచీ ఆరారగా స్నాక్సూ, కూల్డ్రింకులూ సప్లై వుండాలి. గబగబ చెప్పేసారు రవళీ, సుమతీ.
“ఏకేవీ. ఎవరి ఖర్చులు వాళ్లవి” అంది సుమతి. మొదట్నుంచీ అలవాటైన పద్దతి అదే.
అంత సంతోషం మధ్యా దు:ఖాన్ని మనసునిండా నింపుకుని బయటపడకుండా తిరుగుతున్న వ్యక్తులు ఇద్దరు. నీలిమ చాలా వెల్తిపడుతోంది. అందరిమధ్యకీ రావడానికి అవమానపడుతోంది. మాధవ్కికూడా ఒక్కపిల్లో పిల్లవాడో పుట్టి వుంటే బావుణ్ణని అందరికీ అనిపించింది. ఆ భావం ఎవరి చూపుల్లో కనిపించినా ఆమె తట్టుకోలేకపోతోంది. ఇద్దరు కొలీగ్స్ కుటుంబాలతో వస్తే వాళ్లకి ఆమెని పరిచయం చేసాడు మాధవ్. అక్కడ మాట్లాడుతూ, మర్యాదలు చూస్తూ దూరదూరంగా వుండిపోయింది.
సంధ్య భర్త రాలేదు. వస్తాడు వస్తాడందిగానీ, అతను రాడని అందరికీ అర్థమైంది. ఆమె నిశ్శబ్దంగా ఒకవార కూర్చుంది. ఆమె బాధపడ్డం లేదు. బాధపడటం ఎప్పుడో మానేసింది. ఏ ఫంక్షనుకి పిలిచినా వస్తుంది. ఎందులోనూ కలగజేసుకోకుండా, ఏదీ తనకి పట్టనట్టు కూర్చుంటుంది. రవి వచ్చి దగ్గర కూర్చున్నాడు. అతని మనసులో చెప్పలేని బాధ సుళ్ళు తిరుగుతోంది. అది తిరిగి తీసుకోలేని తప్పు చేసినప్పటి పశ్చాత్తాపంలాంటిది… ఆమె చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. విడిపించుకుంది. బారసాల పీటలమీంచీ లేచి, అందర్నీ భోజనాలకి పంపించి వాసుకూడా వచ్చాడు.
“పిన్నీ! నాకుగానీ, గీతకిగానీ నీమీద ఎలాంటి కోపం లేదు. ఆరోజు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వుండిపో” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
“పోనీ, పెద్దాడిదగ్గిరకి వచ్చెయ్. మాకున్నదే నీకూ పెడతాడు. ఆ పిల్లనీ, మనవల్నీకూడా తెచ్చేసుకో. తండ్రిదగ్గిరుండి చేసుకునే వుద్యోగం ఏదో ఇక్కడుండి చేసుకుంటుంది” అంది విజ్జెమ్మ.
“పెళ్ళికిముందే నా కొడుకుని వల్లో వేసుకున్నది నాకేమౌతుందే? ఆ పిల్ల నా కోడలూ కాదు. వాళ్ళు నాకు మనవలూ కాదు” ఛర్రుమంది సంధ్య. “నేనెవరింటికీ రాను. నాకు తిండి పెట్టాల్సిన బాధ్యత నీ అల్లుడికి ఇంకా గుర్తుందిలే” ఆమె మనసు రాయిలా కఠినంగా వుంది. లోలోపలి వూట దాన్ని మెత్తబరచగలదేమోగానీ పైపైనుంచీ వచ్చిన ఓదార్పుమాటలు కాదు.
వీళ్ల మాటలు సాగుతూ వున్నాయి, పద్మ గీతని పిలిచి అంది, “వ్యవసాయం మనింట్లో ఎవరూ చెయ్యలేదు. ఆ పొలమ్మీద అంత డబ్బు పోసే బదులు, మీ నాన్న నీకిచ్చిన స్థలం ఖాళీగా పడుంది. అందులో రెండుగదులు కట్టుకోవచ్చుకదే?” అని. గీత జవాబిచ్చేలోగా ప్రహ్లాద్ వెళ్ళి పోయాడు ఆమధ్యలోకి. వియ్యంకులిద్దరూ అది తమకి సంబంధం లేని విషయమన్నట్టు దూరంగా వెళ్ళారు.
“అలా అనచ్చా పిన్నీ? వాసు బాధపడడా? డెవలపయే కాలనీలో మనంకూడా ఇల్లు కడితే వుపయోగం వుంటుందిగానీ, క్రిక్కిరిసిపోయిన యిళ్ళమధ్య కడితే స్థలంమీద ఇంకాస్త పెట్టినట్టవదా? లక్షలో ఇల్లంటే ఏ రెండుగదులో వెయ్యగలుగుతారు. అందులో ఎవరొచ్చి వుంటారు? అద్దేం వస్తుంది? రాని అద్దెకోసం పెట్టుబడి ఎవరేనా పెడతారా?” అన్నాడు.
“అదికాదురా! అద్దెలకోసం ఇళ్ళు కట్టంకదా? వీళ్ళే వెళ్ళి వుండాలి. మొదట రెండుగదులు వేసుకుంటే తరవాత వీలునిబట్టి పెంచుకోవచ్చు. మేమంతా అలా కట్టుకున్నవాళ్ళమే. ఒక్కగదిలో కాపురం వున్నాం మేమైతే” అంది పద్మ. ఆమెకూడా వాసు చెప్పే మేథావివర్గంలోని మనిషే. ఎంత తెలివితక్కువగానేనా మాట్లాడగలదు.
“వాసుకేం ఖర్మే, అలా ఓ గదిలోనూ రెండుగదుల్లోనూ కాపురం వుండటానికి? మాయింటికి మహారాజు వాడు. అవన్నీ నీ కొడుక్కి చెప్పుకో పో” అంత దూరాన్నించీ ఆ మాటల్ని విని దగ్గిరగా వస్తూ అంది లక్ష్మి .
“నాకున్నది ఒకడే కొడుకు. వున్నదేదో వాడికే వెళ్తుంది. మరి నీకు? ఇద్దరు. పెద్దాడు ఇలా ఆస్తులమీద ఆస్తులు పోగేస్తున్నాడు. ఉన్నది ఒక్క యిల్లు. అందులోకూడా వాటా యిస్తే చిన్నాడేమైపోవాలి? ఇద్దరూ నీ పిల్లలేకదా?” అంది పద్మ. ఆమెమీద భర్త వత్తిడి బాగా వుంది. ఆయన్ని కుటుంబరావు సన్నసన్నగా ఎగేస్తున్నాడు. పద్మ ఆ మాటలంటున్నప్పుడు గీత ప్రహ్లాద్ వెనక కుర్చీకి ఆనుకుని నిలబడింది. అప్పుడు చూసింది మాధురి ఇద్దరిలో కనిపించే స్పష్టమైన పోలికలని. పద్మ చెప్పడం అయింది. గీతకి మనసుకి లోతుగా ఎక్కడో గుచ్చుకుంది. కోపంగా వెళ్ళబోయింది.
“ఓయ్, వదినమ్మా! ఇప్పుడెళ్ళి వాసుకి మోసెయ్యకు. మేం ఇక్కడ మాట్లాడుతున్నాం. తెలిస్తే వాడు బాధపడతాడు” అన్నాడు ప్రహ్లాద్.
“నేను బాధపడితే పర్వాలేదుగానీ వాసు బాధపడకూడదా? అదేం వుండదు. సంతోషపడ్డా, బాధపడ్డా ఇద్దరం కలిసే పడతాం” అంది గీత అడుగు ముందుకేసి. ఐపోయింది వదినగారి పిలుపులోని మర్యాద.
“ఇక్కడికి రావే బాబూ, ముందు నువ్వు” అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి కుర్చీలో కుదేశాడు ప్రహ్లాద్.
“అరేయ్, అరేయ్, అదేమైనా ఇదివరకట్లా చిన్నపిల్లనుకుంటున్నావా? ఇద్దరు పిల్లల తల్లి. బాలింత. వళ్ళు అదురుతుంది” కంగారుగా కేకలేసింది లక్ష్మి. తప్పుచేసినట్టు అతని ముఖం పాలిపోయింది. “సారీ! గీతా! ” అన్నాడు నొచ్చుకుని.
“పర్వాలేదు ప్రహీ!” అంది గీత.
“అత్తా! ఈ విషయం మొదటిసారి వచ్చినప్పుడు వసంత్ మాయింటికొచ్చి సారీ చెప్పాడు.
నువ్వెందుకు బాధపడుతున్నావు, మనపైన పెద్దవాళ్ళు చాలామంది వున్నారు వాళ్ళు చూసుకుంటారు- అన్నాను. మళ్ళీ ఇప్పటిదాకా ఎవరూ అనలేదంటే ఎవరో ఒకళ్ళు సర్దిచెప్పి వుంటారనుకున్నాను. ఇవాళ మళ్ళీ నువ్వు ఎత్తావు. అంటే ఇదింకా నడుస్తునే వుందన్నమాట. ఇప్పుడింక విను. మేము ఆ యిల్లు వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళేది లేదు. నేను ఆ యింట్లో మూడోతరం కోడల్ని. నాకిద్దరు కొడుకులు. నా కోడళ్ళుకూడా అదే యిల్లు మెట్టాలని అనుకుంటున్నాను. నా కోరికని వాళ్ళకికూడా నేర్పిస్తాను. ఇల్లు ఇప్పటికైతే దృఢంగా వుంది. ఒకవేళ లోపలి ఇటుక గుల్లబారి, మళ్ళీ కట్టుకోవలసిన అవసరం వస్తే, అవే పునాదులమీద మళ్ళీ కట్టుకుంటాంగానీ స్ట్రక్చరు మార్చం. మాధవ్నికూడా పలకరించి చూడు. తనూ ఇదే అంటాడు. ఇంక ఆస్తులంటావా, ఎవరి సంపాదనలూ, ఖర్చులూ, దాపరికాలనిబట్టి సమకూరుతాయి” అంది స్థిరంగా. ఆమాటలకి పద్మ ఖంగుతింది.
“మీకంటే రెండు జీతాలుకదే?” అంది కాస్త తేరుకుని.
“ఇద్దరం పనిచేస్తున్నాం కాబట్టి” అంది గీత.
“అందరికీ వుద్యోగాలు రావద్దే?”
“కదా? మరి అలాంటప్పుడు వాళ్ళ అదృష్టాలతో మాకెందుకు ముడిపెడుతున్నావు? మాకు వున్నదీ లేదు, వాళ్లకి లేనిదీ లేదు. మాధవ్వాళ్ళు పొలం వద్దనుకున్నారు. కొనలేదు. మేం కొని బైటపడ్డాం. అంతేనా?” అని లేచి, పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. లక్ష్మి వెనకే వెళ్ళింది. ఈ సందర్భంలో పద్మ అలా అనడం ఆవిడకి బాధని కలిగించింది. గీతని చూసి పద్మ అసూయపడుతోందని అర్థమైంది. ఖర్మ! దీంతో పద్మకి పోలికేమిటి? ఓ వయసువాళ్ళూ కాదు, సరిసాటివాళ్ళూ కాదు. తలపట్టుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.