ఝరి 1-10 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

“జీవితం పర్యవసానమేగానీ కారణం కాదు” యాభైరెండేళ్ళ వయసులో గీత తెలుసుకున్న నిజం యిది.
మరైతే జీవితం అంటే ఏమిటి? చావుపుట్టుకలమధ్య యెడాన్ని ఏర్పరిచే కాలరేఖా? ఆ కాలరేఖని అనుభవాలుగా మార్చే సంఘటనలా? జీవితానికి మొదటిదే నిర్వచనమైతే అప్పుడు పశువూ లేదు, మనిషీ లేడు, చెట్టూ పుట్టా ఏదీ లేదు. అన్నీ ఒకటే. కాబట్టి రెండోదే ఔతుంది. మనిషి పుట్టి, పెరిగి పెళ్ళిచేసుకుని, పిల్లల్ని కని పెంచి పెద్దచేసేసాక మిగిలిపోయిన శూన్యాన్నికూడా జీవితమనే అనాలా? దారానికి గుచ్చిన పూసలన్నీ ఒక కొసకి చేరిపోయి మరో చివరంతా ఖాళీగా వుండి, గుచ్చడానికి ఇంక పూసలు మిగిల్లేని దారంకూడా దండేనా? కారణాలు లేక, సంఘటనలు జరక్క మిగిలిపోయిన కాలంకూడా జీవితమేనా? ఆ కాలాన్ని మరిదేంతోనూ నింపలేమా? ఎన్నో ప్రశ్నలు.
ఈ సంఘర్షణ ఆమెని ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది.


అవంతీ హాస్పిటల్స్ . రాత్రి పదకొండున్నర.
అప్పుడే అంబులెన్స్‌లోంచీ దింపిన గీతని స్ట్రెచర్‍మీద వేసుకుని కారిడార్లో గబగబ నడుస్తున్నారు ఇద్దరు ఆయాలు, ఒక వార్డుబోయ్. వాళ్ళ వేగం అందుకోలేకపోతున్నాడు వెనకే వస్తున్న వాసు. స్ట్రెచర్ చక్రాల చప్పుడు వాళ్ల అడుగుల శబ్దంతో కలిసి ఆ రాత్రివేళ ప్రశాంతతని భంగపరుస్తోంది. రెండు మలుపుల తర్వాత స్ట్రెచర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. థియేటర్ తలుపు మూసుకుంది.
వాసు వెళ్ళి డాక్టర్‍ని కలిసాడు. డాక్టర్ గిరీష్ తెలిసినవాడే. కొద్ది పరిచయం. అవంతీపురం పరిచయాలు అలాగే వుంటాయి. ఊరంతా కలిపి రెండు స్కూల్స్, ఒక కాలేజి వుండేవి వాళ్ళప్పుడు. ఒకటి ఎలిమెంటరీ స్కూలు, మరోటి హైస్కూలు. అందరూ క్లాస్‍మేట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ఫ్రెండ్స్. లేకపోతే అవే పరిచయాలు తండ్రులవైపునించో, తాతలవైపునుంచో. తరాలుగా ఇక్కడే స్థిరపడిపోయిన కుటుంబాలు చాలా వుండేవి. ఇప్పుడు అదంతా చాలావరకూ మారిపోయింది.
వాసు, గిరీష్ డిగ్రీదాకా కలిసి చదువుకున్నారు. డిగ్రీ తర్వాత వాసు వుద్యోగంలో చేరిపోతే అతను మెడిసిన్‍లో సీటొస్తే సిటీకి వెళ్ళి చదివి మళ్ళీ వెనక్కొచ్చి కోపరేటివ్ హాస్పిటల్లో చేరిపోయాడు. ఇప్పుడు ఒకరినొకరు గుర్తుపట్టి పలకరించుకున్నారు.
“ఏం జరిగింది?” అడిగాడు గిరీష్.
చెప్పాడు వాసు.
“కంగారుపడకు. నా ప్రయత్నం నేను చేస్తాను. అంతా సవ్యంగానే జరుగుతుంది” అనేసి లేచాడు. వాసు ఇవతలికి వచ్చాడు.
థియేటర్ ముందు వరుసగా కొన్ని కుర్చీలు వేసి వున్నాయి. వాటిల్లో ఒకదాంట్లో కూలబడ్డాడు.
“చనిపోవాలన్న కోరిక మనిషికే కాకుండా మొత్తంగా ఒక సమాజానికి కూడా వుంటుందా?” ముందురోజు రాత్రి గీత అడిగిన ప్రశ్న.
ఎందుకడిగింది అలా? ఆ అడగటానికీ, ఈ ఆత్మహత్యాప్రయత్నానికీ సంబంధం వుందా? అసలు బలవంతంగా ప్రాణం తీసుకునే అవసరం ఏం వచ్చింది? ఆమె ఆలోచనలు ఇలా సాగుతున్నాయని తనెందుకు గుర్తింలేకపోయాడు? అతనికి అంతా అయోమయంగా అనిపించింది. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళుమూసుకున్నాడు.
బతుకుతుందా, గీత? కళ్ళలో తడి కదిలింది.
“ఇక్కడ చల్లటిగాలి వస్తుంది. లోపల రిసెప్షన్ హాల్లో కూర్చోండి సార్!” అతని ముందునించీ వెళ్తూ ఒక సిస్టర్ చెప్పింది.
ఆమె వెనుకే చేతిలో రైటింగ్‍పాడ్‍తో మరొక సిస్టర్ వచ్చింది.పేషెంటు వివరాలవీ నింపి, ఒక ఫారంమీద సంతకం పెట్టించుకుంది. పేషెంటుకి
ట్రీట్‍మెంటు సమయంలో ఏదేనా జరిగితే పూర్తి బాధ్యత అతనిదేనని అందులోని సారాంశం.
“అడ్వాన్స్ కట్టండి” ఎంత కట్టాలో చెప్పేసి వెళ్ళిపోయింది.
అతను వెళ్ళి రెసెప్షన్ కౌంటర్లో డబ్బు కట్టాడు. అక్కడే ఒక మూలకి ఖాళీకుర్చీ చూసుకుని కూర్చున్నాడు. రాత్రికావటంతో ఎవరూ లేరు. మనసు అంచుదాకా నిండిపోయి విషాదం తొణికిసలాడింది. ఎవరితో పంచుకోవాలి? ఒకరికి ధైర్యం చెప్పాల్సిన వయసులో వున్నవాడు, తనకి ఓదార్పు ఇచ్చేవాళ్ళెవరు? తన తల్లిగానీ, గీత తల్లిదండ్రులుగానీ ఎనభయ్యేళ్ళ దరిదాపుల్లోనూ, దాటీ వున్నవాళ్ళు. ఈ అర్ధరాత్రి వాళ్ళని నిద్రలోంచీ లేపి ఏమని చెప్తాడు? అదంత అవసరం అనిపించలేదు. ఏమీ చెయ్యకుండా అలానే కూర్చుండిపోయాడు. గంట గడిచింది.
సాధారణంగా స్టమక్‍వాష్ ప్రొసీజరు ఇరవైనిముషాలు, అరగంటకి మించి పట్టదు. ఎందుకింకా అవలేదు? కంగారనిపించింది. వెళ్ళి చూసి వచ్చాడు. థియేటరుముందు ఇంకా ఎర్రబల్బు వెలుగుతోంది. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.
నిర్వ్యాపారత్వం బాధని పెంచుతోంది. సెల్ తీసి ఒక నెంబరు నొక్కాడు.
“హలో, వాసూ! ఇంత రాత్రివేళ ఏమిట్రా?” నిద్రమత్తులో వున్న గొంతు. అతని కజిన్ మహతిది.
“గీత… గీత… నిద్రమాత్రలు మింగేసింది” నెమ్మదిగా అన్నాడు.
మహతి నిద్ర ఒక్కసారి ఎగిరిపోయింది. “ఏమిటీ?” అడిగింది అపనమ్మకంగా.
“ఔను మహీ! హాస్పిటల్లో వున్నాము. ట్రీట్‍మెంట్ జరుగుతోంది. గంటైంది. ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే వుంది” అతని గొంతు వణికింది. ఆ వొణుకు వెనుక దు:ఖం ఆమెని చేరింది.
“కూల్… అసలేం జరిగింది?”
“అదే రొటీన్. కొత్తగా ఏం జరుగుతుంది? జరగాల్సినవన్నీ జరిగిపోయాయికదా? పిల్లలు కూడా సెటిలైపోయినట్టే. ఎందుకిలా చేసిందో తెలీడం లేదు. నిన్న రాత్రి నన్నో ప్రశ్న అడిగింది. దానికీ ఈ ప్రయత్నానికీ ఎంతవరకూ సంబంధం వుందో అర్థమవలేదు”
“ఏం ప్రశ్న?”
అతను చెప్పాడు. కొద్దిసేపు అట్నుంచీ మౌనం.
“అసలు తనకి నిద్రమాత్రలు ఎక్కడివి?” అడిగింది.
“అమ్మ వాడుతుంది. ఆవిడ తులసి దగ్గరికి వెళ్ళేముందు తీసుకెళ్లడం మర్చిపోయినట్టుంది. స్ట్రిప్ మొత్తం వేసేసుకుంది. నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. తను పడుక్కోడానికి వెళ్ళింది. గంటతర్వాత నేనూ వెళ్ళి చూస్తే ఏముంది? మంచం పక్కని నేలమీద ఖాళీ స్ట్రిప్, మంచంమీద మంచినీళ్ళు తాగేసిన గ్లాసు, తన పిచ్చినిద్ర చూసి అనుమానం వచ్చింది ” అన్నాడు. అట్నుంచీ చిన్న నిట్టూర్పు. అప్రధానమైన విషయాలు… ప్రయాణం హడావిడిలోమర్చిపోయిన మాత్రలు ఇలాంటి మలుపు తీసుకుంటాయని ఎవరుమాత్రం అనుకుంటారు?
“ఔనుగానీ, తులసి ఎలా వుంది?” అడిగింది మహతి. తులసి వాసు చెల్లెలు.
“తను బానేవుంది…”
“అతనలా ఎలా చేసాడురా?”
“వస్తావుగా, మాట్లాడుకుందాం” అన్నాడు. మాట్లాడటానికేమీలేదు. తులసికి బ్రెస్ట్‌కేన్సరు వచ్చింది. ఒకవైపు తీసేసారు. సిలికాన్ ఇంప్లాంట్ ప్రస్తావన వచ్చింది.
“పెట్టుకున్నా అది నా కాన్ఫిడెన్స్‌కోసం, అంతా వెనుకటిలాగే వుందని నటించడంకోసం కాదు. ఇది మా యిద్దరికీ సంబంధించిన విషయం” అంది. దాని అర్థం? అతను పాతికేళ్ళ వివాహబంధాన్ని వదిలేసి మూవాన్ అయాడా? అంత తేలికా, బంధాన్ని తెంచుకోవడం?
దానికీ తులసే జవాబు చెప్పింది. “ఎదుటివాళ్ళ త్యాగాలమీద బతకాలని మనం ఆశపడతాం. అదో ముళ్ళకిరీటం కాదూ, అవతలివారికి? మనకోసం ఎంతకని మొయ్యగలరు? నాకూ ఈ బంధంలోంచీ బయటపడి వేరేవిధంగా జీవితాన్ని గడపాలని వుంది. పిల్లలకి చెప్పాం. వాళ్ళు అర్థం చేసుకున్నారు. బంధానికి బయట ఇద్దరం సంతోషంగానే వున్నాం. నో రిగ్రెట్స్”
“గీత విషయం మీ పిల్లలకి చెప్పావా?” మహతి ప్రశ్న అతన్ని చెల్లెలి ఆలోచనల్లోంచీ బయటపడేసింది.
“లేదు. అసలెవరికీ చెప్పలేదు. ఏమని చెప్పను?”
“నువ్వు కంగారుపడకు. నేను ఫ్లైట్ టికెట్ దొరుకుతుందేమో చూస్తాను. వెంటనే బయల్దేరతాను”
“నీ కూతురు?”
“తను మేనేజి చేసుకోగలదు. ఫ్రెండ్సున్నారు”
“మరైతే వుంటాను” అతను ఫోన్ పెట్టేసాడు. ఐదు నిముషాలకి కాల్. యూయస్‍నుంచీ. ఎత్తాడు. సుధీర్‍. అతను ఇంకో కజిన్.
“మహి వాట్సప్ చేసింది. ఏంట్రా? ఏం జరిగింది?” ఆదుర్దా సుధీర్ గొంతులో.
“ట్రీట్‍మెంటు జరుగుతోంది. ఇంకా ఎవరూ ఏమీ చెప్పట్లేదు” అన్నాడు వాసు.
“ఏం కాదులేరా. భయపడకు. డాక్టర్ ఇవతలికి వస్తే ఒకమాటు మాట్లాడించు” అన్నాడు. కొద్దిసేపు ఇద్దరిమధ్యా నిశబ్దం.
“ఎందుకు చేసిందిలా?”
“తెలీదు”


కొంచెం స్టేబుల్ అవగానే ఐసియ్యూనించీ స్పెషల్‍రూమ్‍కి మార్చారు. సెలైన్ పెట్టారు. అప్పటినుంచీ అక్కడే వున్నాడు వాసు. ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందాని ఎదురుచూస్తూ, తనుమాత్రం రెప్పేనా వెయ్యకుండా. ఇంకా తెల్లారలేదు.
“కొద్దిగా కాంప్లికేషన్స్ డెవలపయ్యాయి. ఆక్సిజెన్ పెట్టాల్సి వచ్చింది. మరేం భయం లేదు. ఇప్పుడప్పుడే స్పృహలోకి రాదు. సిస్టర్స్ చూసుకుంటారు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో” అని గిరీష్ చెప్పినా అతను వినలేదు.
తర్వాత ఎనిమిదిగంటలకి స్పృహలోకి వచ్చింది గీత. ఒక్కమాటు కళ్ళిప్పి చుట్టూ చూసింది. తలంతా దిమ్ముగా వుంది. చుట్టూ వున్న పరిసరాలన్నీ తననుంచీ విడిపోయినట్టు వింతైన భావన. భావన వింతదే. కానీ కొత్తది కాదు. ఈమధ్య తరుచుగా అనిపిస్తోంది.
“గీతూ! ఎందుకిలా చేసావు?” ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు వాసు. అతని గొంతులో బాధ, ఆవేదన, కొద్దిగా కోపం.
“తెలీదు” ఆమె జవాబు.
“తెలీదా?” తెల్లబోయాడు.
“ఎందుకో తెలీదు, చచ్చిపోవాలని బలంగా అనిపించింది ఆ సమయాన”
“అదే ఎందుకు? నీకేం తక్కువ? ఏదేనా వుంటే చెప్పుకోవాలిగానీ, ఇదేం పని?”
“మీకెవరికీ అర్థం కావటంలేదు. ద సొసైటీ ఇట్‍సెల్ఫ్ ఈజ్ డైయింగ్. నాకు భయంగా వుంది” అంది.
అతను తల పట్టుకున్నాడు. “ప్లీజ్, నువ్వా ఆలోచన మానవా?”
ఆమె నిరాసక్తిగా నవ్వింది. డాక్టర్ వచ్చాడు.
“ఎలా వుంది మీకిప్పుడు?” అడిగాడు గీతని. బీపీ చూసాడు. పల్స్ పట్టుకుని మరోసారి చూసాడు.
“గుడ్. బాగానే రికవరయారు. డిశ్చార్జి చేసేస్తాను” అని చెప్పి, “ఐసియూలో ఎక్కువసేపు వుండకూడదు. పద” అని వాసుని తీసుకెళ్ళిపోయాడు.
“ఆమెని ప్రస్తుతం ఏమీ అడగద్దు. నెమ్మదిగా తెలుసుకో ఎందుకిలా చేసిందో! అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. కానీ జాగ్రత్త. వంటరిగా వదలద్దు” అన్నాడు. వాసు తలూపాడు.
“ఇక్కడెందుకు? డిశ్చార్జి చేసేద్దాం. ఒకటి రెండురోజులు లిక్విడ్స్ ఇస్తే. తర్వాత మామూలైపోతుంది. అవసరమైతే ఫోన్ చెయ్యి” అన్నాడతను. వాసు దానికీ తలూపాడు. మెదడంతా ఖాళీగా అనిపిస్తోంది.
డిశ్చార్జి ఫార్మాలిటీస్ జరుగుతుంటే మహతి ఫోన్ చేసి చెప్పింది. “నేను బయల్దేరేసాను. చెకిన్ ఐపోయింది. గంటన్నర ఫ్లైట్ జర్నీ. అక్కడ్నుంచీ కేబ్ తీసుకుంటాను. అదో మూడు గంటలు. ఇంటికి రానా? హాస్పిటల్‍కా?”
“ఇంటికే వచ్చెయ్”
“ఎలా వుంది తనకి?”
“బానే వుంది”
“…”
“…”
“మరైతే వుంటాను. అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం” మహతి ఫోన్ పెట్టేసింది.
వాసు మిగిలిన పని పూర్తిచేసుకుని గీతని తీసుకుని బయల్దేరాడు. వెనక సీట్లో ఆమె పడుకుంటే అతను డ్రైవ్ చేయసాగాడు. ఇంటికీ హాస్పిటల్‍కీ పెద్దదూరమేమీ లేదు. కానీ ఇప్పుడున్న మన:స్థితిలో అతనికి ఆ దూరం పెరగటమే కాకుండా తనకీ గీతకీ మధ్యకూడా అంతులేనంత దూరం ఏర్పడినట్టనిపించింది.


ఇంటిమలుపు తిరిగారు. పుట్టి పెరిగిన వూరు. చిరపరిచితమైన దారి. ఇప్పటికి ఒక లక్షసార్లేనా ఆ దారమ్మట అతను నడిచి వుంటాడు. క్రమక్రమంగా వచ్చిన మార్పులు మనసుకి పెద్దగా ఏర్పడవుగానీ తన చిన్నప్పటికీ ఇప్పటికీ వూరెంతో మారింది.
అప్పట్లో వూరంతా వాడలుగా వుండేది. బ్రాహ్మణవాడ, రెడ్లవాడ, కాపువాడ, కమ్మరివాడ, కుమ్మరివాడ… ఇలా. తమ వాడంతా పెద్దపెద్ద యిళ్ళు. ఇళ్ళు రోడ్డుకే వుండేవి. ఇంటిముందు అరుగులు, అరుగుల మధ్య సింహద్వారం. దాంట్లోంచీ లోపలికి వెళ్తే ఖాళీస్థలం. ఇంటి చుట్తు స్థలం. మధ్యలో ఒక పెద్దయిల్లు. పిల్లలకీ, ముసలివాళ్ళకీ రోజంతా అరుగులమీదే గడిచిపోయేది. వయసులో వున్న ఆడవాళ్ళుకూడా ఇళ్ళలో పనైపోతే కాసేపు వచ్చి కూర్చునేవారు. నలుగురూ చేరి కబుర్లు చెప్పుకోవటం, కూరల బేరం, కూరలు తరుక్కోవటం, బియ్యం ఏరుకోవటం, వత్తులు చేసుకోవటం, ఆకులు కుట్టుకోవటం, సాయంత్రాలైతే పువ్వులు మాల కట్టుకోవటం, కుటీరపరిశ్రమలన్నీ అక్కడే. దారమ్మట వచ్చి వెళ్ళేవారిని పలకరించటం. అసలు తెలీనివాళ్లంటూ ఎవరూ వుండేవారు కాదు. మగవాళ్ళకికూడా అదే వేదిక. అందరూ కాకపోయినా కొందరికి. పొద్దున్నే ఇద్దరో ముగ్గురో కలిసి పేపరు ఒక్కో పేజీచొప్పున పంచుకుని చదువుకోవటం, రాత్రి భోజనాలయాక నిద్రొచ్చేదాకా రాజకీయాలు మాట్లాడుకోవడం అక్కడే.
రోడ్లు వెడల్పు చెయ్యటంలో అరుగులు కూలిపోయాయి. ఇంత పెద్ద యిళ్ళెందుకని చాలామంది డెవలప్‍మెంటుకి ఇచ్చేసారు. కొంతమంది అమ్ముకుని వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ఒకటో రెండో తప్ప ఇళ్ళ స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. మిగిలిపోయిన ఆ ఒకటి రెండు యిళ్లలో తమది ఒకటి. ఆ తరం మనుషులు జరిగిపోయారు. కుటుంబం ఒక అవిరళధారలా వుండేది, ఇప్పుడు ఆ ధార, అది సాగిన ప్రవాహం ఎక్కడో ఆగిపోయినట్టుంది. ఏ యింట్లోనూ ఒకరూ ఇద్దరూ తప్ప మనుషుల్లేరు. పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వాళ్లదగ్గరకి పెద్దవాళ్ళు వెళ్ళాల్సిందే తప్ప ఇక్కడికి వచ్చి వుండే అవకాశం ఇప్పటి జీవనశైలి వాళ్ళకి ఇవ్వలేదు.
అతని గుండెల్లో రాత్రినుంచీ తొణికిసలాడుతున్న బాధ ఇంకా వొలికిపోతోందిగానీ తగ్గటంలేదు. మృత్యువు అంచుదాకా వెళ్ళి, తనమీద దయతలిచి తిరిగొచ్చిన గీత వెనకసీట్లో నిద్రలో వుంది. ఇంటిముందు ఆపి, దిగి, ఇంటి తాళం తీసి వచ్చాడు. గీతని లేపి, భుజాలకి పొదువుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి సోఫాలో పడుకోబెట్టాడు. తలకింద దిండు అమర్చి తను ఎదురుగా వున్న మరో సోఫాలో కూర్చున్నాడు. రాత్రంతా నిద్రలేకపోవటం, మానసికమైన వత్తిడితోపాటు పొద్దుటినుంచీ కాఫీకూడా తాగలేదేమో, చాలా అలసటగా వుంది. కానీ గీతని వదిలిపెట్టి అక్కడినుంచీ ఇంచికూడా కదలాలనిపించలేదు. ఏదో భయం.
ఇప్పుడింక ఆమె తల్లిదండ్రులని రమ్మని చెప్పచ్చునేమో! వాళ్ళు పైవాళ్ళు కాదు. గీత తన మేనమామ కూతురే. కానీ ఇలాగని విషయం తెలిస్తే మామయ్య కంగారుపడతాడు. అసలే బీపీమనిషి. ప్రమాదం తప్పిందికదా? మహతి వచ్చేదాకా ఆగితే మంచిది. ఎంతదాకా వచ్చిందో, మహతి? ఫ్లైటు దిగిందో లేదో అనుకుంటూ ఫోన్ చేద్దామనుకుంటుంటే వీధితలుపు దగ్గర చప్పుడైంది. దాంతోపాటు వాకర్ చప్పుడుకూడా. తలతిప్పాడు.
“రా! ఆమ్మా!” అన్నాడు వచ్చినావిడని లేచి ఎదురెళ్ళి చెయ్యిపట్టుకుని తీసుకొస్తూ. కుర్చీలో కూర్చుండబెట్టాడు. ఆవిడ సర్దుకుని కూర్చుని, వాకర్ పక్కని పెట్టింది. బాగా పెద్దామె. ఎనభైకి పైన వుంటాయి. వాసు తల్లికి మంచి మితృరాలు. జారిపడితే తుంటెముక విరిగింది. సరిగా అతుక్కోలేదు. వాకర్ సాయంతో నడుస్తుంది. ఇల్లుదాటి ఎక్కడికీ వెళ్ళదు.
“రాత్రి అంబులెన్స్ దేనికి వచ్చింది వాసూ? తులసికి ఏమైనా ఐందేమోనని భయపడ్డాను. రాత్రంతా ఏడుస్తునే వున్నాను. నా కళ్ళముందు పుట్టి పెరిగిన బిడ్డ అది. ఎంతటి రోగమొచ్చింది! అప్పుడే వద్దామనుకున్నా. కానీ కళ్ళు సరిగ్గా కనిపించవుకదా! మీరెప్పుడొస్తారా, ఏమైందో తెలుసుకుందామాని అప్పట్నుంచీ చూస్తూ కూర్చున్నాను” అంది.
“తులసి బాగానే వుంది ఆమ్మా! గీతకే రాత్రంతా బాగా కడుపునొప్పి. హాస్పిటల్‍కి వెళ్ళాం” అన్నాడు నిజం చెప్పకుండా.
“ఏమన్నారు?”
“చిన్న ఆపరేషన్ అయింది” అన్నాడు.
“ప్రమాదమేం లేదుకదా?” ఆదుర్దాగా అడిగింది. లేదన్నట్టు తలూపాడు. ఆవిడ నెమ్మదిగా లేచి, గీత దగ్గిరకి వెళ్ళి నిల్చుంది. ఆమె మొహంలోకి చూసి, తలనిమిరింది. “ఎంత పడిందీ, ఎంత చూసిందీ!” అంది.
“మరి నేను వెళ్తాను. పెదనాన్న ఒక్కరే వున్నారు. ఏ అవసరం ఎలా వస్తుందోనని మీక్కూడా మా యింట్లోనే వంట చేయించాను. వంటాయన కాఫీ, టిఫెను, భోజనం పట్టుకుని వస్తాడు” అని చెప్పి లేచింది.
“వంటాయన్ని రానీ, అతన్తో వెళ్దువు” అన్నాడు వాసు.
“నే ఒక్క క్షణం కళ్ళెదురుగా కనిపించకపోయినా పెద్దనాన్న హైరానపడిపోతాడు” అంటూనే ఒక్కర్తీ వెళ్ళలేననుకుని మళ్ళీ కూర్చుంది. పదినిముషాలకి వాళ్ళింటినుంచీ మనిషి వచ్చాడు. అతన్తో కలిసి వెళ్ళిపోయిందావిడ. వాసు బ్రష్ చేసుకుని ఫ్లాస్కులోంచీ కాఫీపోసుకుని తాగుతుంటే మహతి ఫోన్ వచ్చింది.
“ఇంటికి వచ్చారా?” నిర్ధారణకోసం అడిగింది.
“ఇప్పుడే వచ్చాం” చెప్పాడు.
వాసు హాస్పిటల్‍నుంచీ డ్రైవ్ చేసుకు వచ్చిన దారంతా డ్రైవ్ చేసుకుని రావటానికి ఆమెకి అతనికన్నా కొంచెం తక్కువ వ్యవధి పట్టింది. ఆమె రాకతో అతనికి కాస్త సాంత్వన చిక్కింది. నెమ్మదిగా ఇంట్లో మనుషుల కదలికలు, పనులు మొదలయ్యాయి. తను ఫ్రెషయ్యి, ఫ్రెష్‍గా కాఫీ కలుపుకుని మగ్ తెచ్చుకుని అతని పక్కని కూర్చుంది మహతి. గీత యింకా నిద్రలోనే వుంది. ఆమె మొహంలోకి చూస్తూ కూర్చుంది మహతి.


వాసూ, గీతలది మేనరికం. గీత తండ్రి రామారావు. ఆయనకి ఆరుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. అందులో రెండో చెల్లెలు లక్ష్మి. ఆవిడ పెద్దకొడుకే వాసు. రామారావు మిగతా అక్కచెల్లెళ్ళూ తమ్ముళ్ళూకూడా అక్కడే వుండేవారు. ఇప్పుడంటే పిల్లలు పెద్దవాళ్ళై అక్కడా యిక్కడా స్థిరపడ్డంతో ప్రపంచం నలుమూలలకీ చెదిరిపోయారుగానీ మొదట్లో అందరూ అవంతీపురంలోనే వుండేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళకి చెందిన ఒక ఏడెనిమిది కుటుంబాలవాళ్ళు ఆ చుట్టుపక్కల వుంటారు. రాకపోకలు తక్కువ. అవసరాలకీ, శుభాశుభాలకీ కలుసుకోవటమే. అవంతీపురంకూడా హైదరాబాదులో కలిసిపోయింది. దూరాలు అవేగానీ మాదీ హైద్రాబాదే అని గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రజ.
వాసుకి తులసికాక ఒక తమ్ముడు. అతను ముంబైలో వుంటాడు. గీతకి ఒక తమ్ముడు. అతనిది ఆస్ట్రేలియా. ఇరువైపుల పెద్దవాళ్ళ బాధ్యతా వీళ్లదే. మేనమామకి ఫోన్ చేసాడు వాసు. పక్కింటావిడకి చెప్పినట్టే కడుపునెప్పి వస్తే గీతని హాస్పిటల్‍కి తీసుకెళ్ళానని చెప్పి, “డ్రైవర్ వేణుని పంపిస్తున్నాను మామయ్యా! నువ్వూ అత్తయ్యా వచ్చెయ్యండి” అన్నాడు.
వేణుకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకురమ్మన్న విషయం చెప్పాడు. వేణు వీళ్ళకి బాగా నమ్మకస్తుడు. రెండిళ్ళకీ మధ్య రాకపోకలు, బట్వాడాలు అన్నీ అతనివల్ల చులాగ్గా సాగిపోతుంటాయి. కేబ్ డ్రైవర్లలా కాకుండా పెద్దవాళ్ళు ఎక్కేడప్పుడూ దిగేడప్పుడూ దగ్గరుండి చూసుకుంటాడు. అతనికి స్వంతంగా రెండు కార్లున్నాయి అద్దెకి కావాలంటే ఇస్తాడు. ఎవరేనా రమ్మంటే డ్రైవరుగా వెళ్తాడు. గంటకి యింతని తీసుకుంటాడు. ఓలా, ఊబర్‍లాంటి సర్వీసెస్ వచ్చాక ఇతనికి డిమాండ్ తగ్గిపోయింది. కొన్నాళ్ళు ఓలాకి చేసాడు. కొవిడ్ వచ్చాక అదీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నిలదొక్కుకోవటానికి పెద్ద స్ట్రగుల్. మనుషుల అవసరాలకీ అవి తీరే సదుపాయాలకీ మధ్య ఎక్కడో చిన్న చీలిక.
“ఇవన్నీ ఎక్కడివి?” అడిగింది మహతి టేబుల్‍మీద వున్న పదార్ధాలని చూసి. వాసు చెప్పాడు.
“ఆమ్మ ఎలా వుంది? మీ అమ్మకన్నా పెద్దదికదూ?” అడిగింది. అతను తలూపాడు. ఇద్దరిమధ్యా మాటలు సాగలేదు.
“ఎప్పుడు లేస్తుంది? తనకి ఆహారం ఏమిటి?” అడిగింది మహతి, గీతగురించి.
“పాలు కాచి ఇద్దాం. నువ్వు స్నానం చేసి రా! భోజనం చేద్దువుగాని” జవాబిచ్చాడు.
“నువ్వు? అన్నం చాలదేమో! కుక్కరు పడేస్తాను”
“నాకేం వద్దు మహీ!” అని తల దించుకుని కూర్చున్నాడు వాసు. ఇప్పటిదాకా ఆపుకున్న దు:ఖం ఇంక ఆగలేదు. అతని భుజాలు కదలటం చూసింది మహతి.
“ఏమిట్రా, ఇది? గండం గట్టెక్కాక? వాసూ! ధైర్యంగా వుండు… మేమంతా వున్నాం కదా? ఎందుకలా చేసిందో తెలుసుకుందాం. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం…” పక్కని వచ్చి కూర్చుని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఓదార్పుగా అంది.
“లే. లేచి స్నానం చేసి రా! టిఫెను కూడా తినలేదు నువ్వు. ఆమ్మ ఇచ్చిన ఇడ్లీలు అలాగే వున్నాయి” అంటూ చెయ్యి పట్టి లేవదీసి బాత్‍రూమ్‍ ముందు నిలబెట్టింది. అతను స్నానం చేస్తూ వుంటే సుధీర్ దగ్గర్నుంచీ ఫోనొచ్చింది.
“చేరావా, మహీ? ఎలా వుంది గీతకి? గిరీష్‍తో మాట్లాడాను. ఆలస్యం కాకుండా తీసుకురావటంతో ప్రమాదం తప్పిందన్నాడు. ఇంకేం భయం లేదట” అని ఆగి, “ఒక వారంలో నేను బయల్దేరి ఇండియా వస్తున్నాను. కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాలి. అమ్మ విషయం, అక్కడి యిల్లు అన్నీ చూసుకోవాలి. చాలాకాలంగా వాయిదా వేస్తున్నాను. ఇప్పుడింక ఇదోటి జరిగిందా? వచ్చి వాళ్ళిద్దర్నీ చూడాలని వుంది. వాసు బాగా బ్రేకై వుంటాడు. వాళ్ళిద్దరిదీ ఒక్క ప్రాణం, ఒక్క వూపిరీ. వాడికి ధైర్యం చెప్పు. వాడితో తర్వాత మాట్లాడతాను. ఉంటాను” అని పెట్టేసాడు. అతని మనసులో వుండే ఆతృత మహతికి తెలుసు. కాలంతోపాటుగా సాగుతున్న రహస్యం అది.
వాసు బాత్రూంలోంచీ వచ్చాడు అతని కళ్ళు ఎర్రగా మంకెనపువ్వుల్లా వున్నాయి. ఐతే ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు మహతి. ఒకమాటు మొహంలోకి చూసి వూరుకుంది. బాధ ఓదార్చితేనూ దు:ఖం కోప్పడితేనూ తగ్గదు.
“సుధీర్ కాల్ చేసాడు. వాళ్ళకిప్పుడు ఎటూకాని టైం కదూ, నీతో మళ్ళీ మాట్లాడతానన్నాడు” అంది. అతను తలూపాడు. మహతి కుక్కరులో కొద్దిగా బియ్యం పడేసి, తనుకూడా స్నానానికి వెళ్ళింది. ఇద్దరి భోజనాలూ అయేసరికి గీత కాస్త కదిలింది. మహతి పాలు గ్లాసుతో తీసుకొచ్చింది. వాసు భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెడితే తను తాగించింది. ఆమె సగం తాగుతూనే నిద్రలోకి జారుకుంది.
విషయం ఇదని చెప్పకుండా వాసు చెప్పినట్టే చెప్పి, మరీ ముఖ్యమైనవాళ్ళకి రమ్మని ఫోన్ చేసి చెప్పింది మహతి. విషయం మరోలాకూడా బయటపడింది. నెమ్మదిగా ఒకొక్కరూ రావటం మొదలైంది.
రామారావు, ఆయన భార్య యశోద వచ్చారు. రావడంతోటే, “నువ్వెప్పుడొచ్చావే?” అని మహతిని అడగడం, “ఏది, గీత? ఎలా వుంది దానికి?” అని కూతురికోసం వెతుక్కోవటం ఒక్కసారి జరిగాయి.
“అంత కడుపునెప్పి ఎందుకొచ్చింది? ఏం తిన్నారు, నిన్న యిద్దరూను? ఇద్దరే వున్నారని వండుకోవడం మానేసి బైట తింటున్నారా?” అని రామారావు యక్షపశ్నలన్నీ వేసాడు. ఆయనకి హైబీపీ వుంది. అసలు విషయం చెప్తే ఏం ముంచుకొస్తుందోనని ఇంకా వాసుకి భయమే. గైనిక్ సమస్యేమోననుకుంది యశోద. మహతి ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళి చెప్పింది. ఆవిడ నిశ్చేష్టురాలైంది.
“మామయ్యకి చెప్పడానికి వాసు భయపడుతున్నాడు. హాస్పిటల్లో వుండగా నాకు ఫోన్ చేస్తే వెంటనే బయల్దేరిపోయాను” చెప్పింది మహతి.
“ఆయనకి నెమ్మదిగా చెప్పచ్చులే. ఇది ఇలా ఎందుకు చేసింది మహీ? నాకేం బోధపడ్డంలేదు. భార్యాభర్తలేమైనా గొడవపడ్డారా అనుకోవడానికి వాళ్ళగురించి అందరికీ తెలిసిందేకదా?” అంది. ఆవిడ గొంతు వణికింది.
“ఊరుకో అత్తా! వాసూ ఏడుపే. నువ్వుకూడానా? పద. బయటికి వెళ్దాం” అని ముందుగదిలోకి తీసుకెళ్ళింది.


వాసు చిన్నమేనమామ రవి వచ్చాడు. రామారావుని చూసి లోపలికి రాబోతూ ఆగిపోయాడు. వాళ్ళిద్దరికీ ఎన్నోయేళ్ళుగా మాటల్లేవు. రామారావు లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వెనకే వెళ్ళింది యశోద.
“పోనీ, ఎదురుపడ్డ మనిషి. ఓమాటు పలకరిస్తే పోయేదికదూ?” అంది.
“నేను అన్నీ ఎప్పుడో మర్చిపోయాను. వాడే ఇంకా మనసులో పెట్టుకుని ఏడుస్తున్నాడు” అన్నాడు కోపంగా. ఆ మాటలు హాల్లోంచీ విన్నాడు రవి. ఎప్పుడో దశాబ్దాలనాడు ఏవో జరిగాయి. తప్పులో, వొప్పులో, హక్కులు సాధించుకోవడాలో, అలక సాగించుకోవడాలో. అప్పటినుంచీ అన్నయ్యకీ తనకీ మాటలు ఆగిపోయాయి. ఎదురుపడి పలకరించుకోవడం నిలిచిపోయింది. ఇప్పుడు మారటం సాధ్యమా? కుర్చీలో అస్థిమితంగా కదిలాడు.
“మీ అందరికీ వున్నట్టే నాకూ హక్కులుంటాయని అనుకున్నాను. బైటివాళ్ళెవరో ఎగేస్తే రక్తం పంచుకుని పుట్టిన అన్నతో తెగతెంపులు చేసుకోవటమేనా?” అన్నాడు రామారావు. మహతి చిన్నగా నవ్వింది.
“లోపల కూర్చుని నువ్వేదో అంటుంటే మాకెవరికీ వినిపించట్లేదు మామయ్యా!” అంటూ వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి రవికి ఎదురుగా కుర్చీ జరిపి కూర్చోబెట్టింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారుగానీ ఏమీ మాట్లాడుకోలేదు. తెగిపోయింది దారమైతే ముడేసి కలపవచ్చుగానీ బంధాన్ని కలపడం కష్టం.
“రాత్రంతా నిద్ర లేనట్టుంది, కాసేపు పడుకోవచ్చుకదా, వాసూ?” అంది యశోద. వాసు తలూపాడేగానీ లేవలేదు.
“ఆఫీసునించీ ఇంటికెళ్తుంటే గిరీష్ కనపడి చెప్పాడు, గీతని హాస్పిటల్లో చేర్చిన విషయం. వెంటనే ఇలా వచ్చాను. అసలేమైందిరా?” అడిగాడు రవి, వాసుని.
“గిరీషేం చెప్పాడు?”
“ఏమీ చెప్పలేదు”
రామారావువంక ఓమాటు చూసి “ఏం లేదు, కడుపునెప్పి” అన్నాడు. ఏదో జరిగిందని రవికి అర్థమైంది.
“రవీ! జరిగినవేవో జరిగిపోయాయి. ఇంక బతికినంతకాలం బతకం నేనూ ఆయనాను. ఓమాటు ఇద్దరూ ఇంటికి రండి” అంది యశోద.
“అలాగే వదినా!” అన్నాడతను.
వాసు కజిన్స్ ఇద్దరు వచ్చారు. కొందరు ఫోన్ చేసి పరామర్శించారు. మొత్తం పంథొమ్మిదిమంది వీళ్ళు. వాట్సప్ గ్రూపుంది. దాన్నిండా మెసేజిలు, ఆగకుండా కాల్స్.
“అరేయ్, నన్నింకొక్క ప్రశ్న అడిగినా నాకు మరొక్క కాల్ చేసినా ఫేస్‍బుక్‍లో మిమ్మల్నందర్నీ బ్లాక్ చేసి పారేస్తాను. ఘనకార్యం వెలగబెట్టింది తను. తగ్గాక తనతోటే మాట్లాడండి” కోపంగా మెసేజి పెట్టి గ్రూపులోంచీ బయటికి వచ్చేసాడు వాసు. ఆ మెసేజి చూసి చిన్నగా నవ్వి, తనూ గ్రూపు క్విట్ చేసింది మహతి.
“ఆ సుధీర్‍గాడిని తన్నాలి. చాటింపు వేసేసినట్టున్నాడు” అన్నాడు వాసు. వీళ్ళిద్దరూ బైటికి వచ్చేసారుకాబట్టి గ్రూపులో వాళ్ళందరూ ఇక సుధీర్ని బంబార్డ్ చేస్తారు.
గిరీష్ వచ్చాడు. “గీతకి ఎలా వుందో చూసి వెళ్దామని వచ్చాను. బానే వుందికదా? ఏమైనా తాగిందా?” అని అడిగాడు. పల్స్ చూసాడు.
“ఓసారి పాలు తాగింది. ఏకనిద్ర పోతోంది” చెప్పింది మహతి.
“నిద్రమాత్రలుకదా, కొంచెం ప్రభావం వుంటుంది” అన్నాడు గిరీష్.
“నిద్రమాత్రలేమిటి?” రామారావు చప్పుని అడిగాడు. డాక్టరు సమక్షంలోనేకాబట్టి ఇంక భయంలేదనుకుంది మహతి.
“నీ కూతురు పెద్దఘనకార్యం చేసింది మామయ్యా!” అంది నెమ్మదిగా విషయం చెప్తూ. అనుకున్నట్టే ఆయన బీపీ పెంచుకున్నాడు. ఊపిరిసలపక వుక్కిరిబిక్కిరయాడు. ముఖమంతా జేవురించింది. ఆయన్ని కంట్రోల్‍చెయ్యటం కాస్త కష్టమైంది. టాబ్లెట్ వేసాక కాసేపటికి సర్దుకున్నాడు. గుండెల్లోమాత్రం సన్నటి మంటలాంటి బాధ. ఎందుకు చేసింది, కూతురలా? అందర్నీ వేధించిన ప్రశ్నే ఆయన్నీ పట్టుకుంది.
“పెద్దవాళ్ళకి ఆయుర్దాయం పెరిగింది. పైగా పిల్లలవలన సుఖం లేకుండా పోయింది. మాకళ్ళముందు మీకేదైనా ఐతే ఎలా తట్టుకుంటాంరా వాసూ? నీ భార్యకి అంత చిన్నవిషయం అర్థం కాలేదా?” అన్నాడు.
“అది నీ కూతురు కాదా మామయ్యా? లేచాక నువ్వే అడుగు” అంది మహతి. ఆవేశాలకీ, ఆవేదనలకీ మధ్య వత్తిడిని తగ్గించే కుషన్లలాంటి మాటలూ ఓదార్పులూ వుండాలి. అలా వుంటాయి మహతి మాటలు. ప్రతి సంభాషణలోకీ తను వెళ్ళి భావోద్వేగాల తీవ్రతని తగ్గిస్తుంటుంది.
“సందర్భం ఎలాంటిదైనా నిన్ను కలవటం నాలో కొంచెం వుత్సాహాన్ని నింపింది వాసూ! ” అని, మహతికేసి తిరిగి, “మీరు…?” సందిగ్ధంగా అడిగాడు గిరీష్.
“మహతిని. మీ చెల్లెలి క్లాస్‍మేట్‍ని” అంది ఆమె.
“ఔనౌను. గుర్తొచ్చింది. మా అపర్ణతో మిమ్మల్ని చాలాసార్లు చూసాను. ఏం చేస్తున్నారు? ఎక్కడుంటున్నారు?” అని అతను అడిగితే, మహతి తనగురించి చెప్పి, అపర్ణ వివరాలు ఆమె తెలుసుకుంది.
“అపర్ణ చాలా సంతోషపడుతుంది, మీరు కలిసారని చెప్తే. ఇంకా వుంటారా? తనని తీసుకొస్తాను” అన్నాడు. ఆమె తలూపింది. మళ్ళీ మామూలు మాటల్లో పడ్డారు.
“మళ్ళీ ఆరోజులు తిరిగొచ్చేస్తే బావుణ్ణనిపిస్తోంది. సాయంత్రాలయ్యేసరికి ఫుట్‍బాల్ గ్రౌండులో చేరిపోయేవాళ్ళం. జాబ్‍లో చేరాకకూడా వెళ్ళేవాడిని. తర్వాత ఏమిటో, టైము చాలకపోవటంతో పూర్తిగా ఆగిపోయింది. మొన్నీమధ్యని ఎందుకో గ్రౌండు చూడాలనిపించి వెళ్ళాను. పిల్లలెవరూ ఆడట్లేదనుకుంటాను, వూళ్ళోని చెత్తంతా తెచ్చి అక్కడ పోస్తున్నారు. ఏదో పోగొట్టుకున్నట్టనిపించింది” అన్నాడు గిరీష్.
“మేమూ అక్కడే ఆడేవాళ్ళం. మీరొచ్చాక ఫుట్‍బాల్‍కానీ, మా అప్పుడు ఖోఖో, కబడ్డీ ఆడేవాళ్లం. ఇంటర్‍కాలేజి టోర్నమెంట్సులో మాకు కప్పులుకుడా వచ్చాయి” అన్నాడు రామారావు కలగజేసుకుని.
“మా అన్నయ్యావాళ్ళూ కాస్త వయసులు మీదపడి, పిల్లల బాధ్యతలు మొదలై ఆడటం తగ్గించేసరికి మేం మొదలుపెట్టాం. మాతర్వాత మీరు. ఆ తర్వాత ఆడ్డానికి ఎవరూ లేరు. పిల్లలు చదువుల్లో బిజీగా వుండిపోయారు” అన్నాడు రవి. అన్నదమ్ములమధ్య కొద్దిగా ముడి వదులైంది.
“చదువులనేకాదు మామయ్యా! వాళ్ళ వుద్యోగాలూ అలానే వున్నాయి. ఏ అర్ధరాత్రికో యింటికి రావటం, కాస్తేదైనా తీరిక వుంటే సెల్‍ఫోన్లు, కంప్యూటర్లు. అసలు నిద్రెప్పుడుపోతారో తెలీదు” అంది మహతి.
“నిజమేనే, మహతీ! ముంబైలోనేకదే, పల్లవి వుండేది యాభైఫ్లోర్ల అపార్టుమెంటులో. లిఫ్టులోకి రాగానే మొబైల్ సిగ్నల్స్ అందవు. వాళ్ళ ఫ్లోర్ వచ్చేదాకా అక్కడ నిలబడే నిద్రపోతుంటారు పిల్లలు” అన్నాడు రవి. అంతా నవ్వారు.
“స్విగ్గీలు, జొమాటోలు. ఏమిటో మామయ్యా! లైఫ్ చాలా డిఫరెంటుగా అనిపిస్తుంది అక్కడ. ఉరుకులు, పరుగులు, ఏదో ఒకలా బతికెయ్యడం. ఏదో పొగొట్టుకున్నామనిపిస్తుంది. నిజమే! గిరీష్ అన్నట్టు పొందుతున్నామన్న భావనకన్నా పోగొట్టుకుంటున్నామన్న ఆలోచన ఎక్కువగా కలుగుతోంది” అంది మహతి.
“కొన్ని కంఫర్ట్స్ కావాలనుకున్నప్పుడు కొన్నిటిని వదులుకోవాలి మహీ! గీతకికూడా ఇదే చెప్తాను” అన్నాడు వాసు.
“ఎందుకు వదులుకోవాలి? ప్రకృతి వనరులుండి, పనిచెయ్యడానికి మనుషులుండికూడా ప్రపంచంలోని ఏ దేశంలోనివాళ్ళకీ రాని పరిస్థితి మనకే ఎందుకు? కష్టపడి చదువుకుంటున్నారు. మంచిమంచి జీతాలమీద వుద్యోగాలు చేస్తున్నారు. అంతవరకూ బావుంది. వేళాపాళాలేని పని. అదీ సరే. క్వాలిటీ లైఫ్‍కోసం విదేశాలకి. సరే వెళ్తున్నారు, వెళ్ళినవాళ్ళెవరూ మళ్ళీ తిరిగి రావట్లేదు. ఓ పాతికేళ్ళు గడిచి, మనంకూడా జరిగిపోయాక ఎవరుంటార్రా, ఇక్కడ?” మహతి అడిగింది. ఆమె గొంతు గీత గొంతులాగే వినిపించింది వాసుకి.
“మహతి అన్నది నిజం వాసూ! లైఫ్ ఈజ్ డ్రెయినింగ్ ఔట్” అన్నాడు గిరీష్.
గీత నిద్రలోంచీ లేచింది. సంభాషణ ఆగిపోయింది. చుట్టూ వున్న అందర్నీ చూసి, మళ్ళీ కళ్ళుమూసుకుని పడుక్కుంది. వాసు లేచి వెళ్ళి కొబ్బరిబోండం కొట్టి నీళ్ళు తెచ్చిచ్చాడు. తాగింది. కాసేపాగి మజ్జిగన్నం బాగా పిసికి, మెతుకులు తీసి తెచ్చింది యశోద. అదికూడా తాగింది.
“లోపల పడుకుంటాను” అంది నెమ్మదిగా సోఫాలోంచీ దిగి నిలబడి. వళ్ళు తూలింది. మహతి చప్పుని పట్టుకుంది. ఆమె సాయంతో బెడ్‍రూమ్‍లోకి వెళ్ళింది. యశోద వెంట వెళ్ళింది. ఆమెని మంచందగ్గిరకి చేర్చాక అందరికీ టీ చేసుకొచ్చింది మహతి. తాగాక, గిరీష్, రవి వెళ్తామని లేచారు.
“వాసూ! నువ్వెళ్ళి లోపల కాసేపు పడుకో. నేను వంట చూసుకుంటాను” అంది యశోద ఇవతలికి వచ్చి. అతను వెళ్ళాడు. మహతి అప్పటికే వంట మొదలెట్టింది.
“నీకూ వాసుకీ ఏదేనా ఆర్డర్ పెట్టుకుంటారేమిటే?” అడిగింది.
“వద్దులే అత్తా! వంకాయలు వేయించి, ముద్దపప్పు, చారు పెట్టేస్తాను. చాలదూ?” అడిగింది మహతి.
గదిలో వాసు గీత పక్కని పడుక్కున్నాడు. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. దు:ఖాన్ని నిగ్రహించుకునే ప్రయత్నం చేసాడు.
“బావా!” అంది గీత. అతను తిరగలేదు.
“ప్రవాహం ఆగిపోయింది. ఆ నిజాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాను. ప్రామిస్. ఇంకోసారి ఇలా చెయ్యను” అంది నెమ్మదిగా. బయట ఇంకెవరో వచ్చినట్టు సందడి వినిపించింది.
“సంతోషించాం. బుద్ధిగా వుండు” అనేసి, వాసు ఇవతలికి వచ్చాడు. అమ్మమ్మనీ తల్లినీ వెంటబెట్టుకుని తులసి పెద్దకొడుకు చరణ్ వచ్చాడు.
“ఏదిరా, అది?” అడిగింది లక్ష్మి ఆదుర్దాగా. గీత వున్న గదివైపు చూపించాడు. తల్లితో కలిసి తులసికూడా వెళ్ళింది. వాళ్ళవెంట రామారావు వెళ్ళాడు.
“ఏమిటే, ఈ పిచ్చిపని? ఏం కష్టం వచ్చిందని?” అడిగింది లక్ష్మి కోడల్ని దగ్గరకి తీసుకుని.
“ఏమీ లేదులే, అత్తా! టేబ్లెట్లు దొరికేసరికి వేసుకోవాలనిపించింది. వేసుకున్నాను. అంతే” అంది గీత. తులసి తడికళ్లతో నవ్వింది.
“అందరం ఒక పడవలో ప్రయాణిస్తున్నవాళ్ళమేకదూ?” అంది. “అందర్లోనూ ఏవో అసంతృప్తులు. తీరకుండా మిగిలిపోయిన, తీర్చుకునే అవకాశం లేని కోరికలు. ఇలాంటి ప్రయత్నాలు వద్దులే వదినా! ఈ జన్మలో అనుభవించకుండా తప్పించుకున్నామని అనుకున్నవి ఇంకో జన్మకి కొనసాగితే కష్టం. మనం వద్దనుకున్నవన్నిటినీ మనమే భవిష్యత్తులోకి మోసుకెళ్తున్నట్టౌతుంది” అంది గీత నుదుటిమీది జుత్తు సర్ది, ముద్దుపెట్టుకుని.
“ఎంత పెద్దదానివయావు తులసీ!” అంది గీత. కాస్త దూరంగా నిలబడి వున్న తండ్రిని చూసింది.
“కూర్చో నాన్నా!” అంది.
“ఈరోజు నిన్నిలా చూడటం చాలా పెద్ద అదృష్టం గీతూ! కనీసం నేనూ, అమ్మా బతికున్నంతవరకేనా ఈ సంతోషాన్ని యిలా వుండనీ” అన్నాడాయన.
అవతలిగదిలో వాసు చరణ్‍తో మాట్లాడుతున్నాడు. తులసి ఇద్దరుకొడుకులూ ఇక్కడి చదువులయ్యాక యూయస్ వెళ్ళారు. ఇద్దరికీ అక్కడే వుద్యోగాలు. తల్లికి కేన్సరు వచ్చాక పెద్దకొడుకు వుద్యోగం వదులుకుని ఇక్కడికి వచ్చేసాడు. చిన్నవాడు చేతన్ తనూ వచ్చేస్తానన్నాడు.
“ఇద్దరం దేనికిరా? నేనుండి అమ్మని చూసుకుంటాను. నీకు చూడాలనిపించినప్పుడు రా” అన్నాడు చరణ్.
అలాగే నీడలా వుండి తల్లి అవసరాలన్నీ చూసుకున్నాడు. తండ్రికి ప్రతి కదలికలో తోడుగా వున్నాడు. ఇప్పుడు బెంగుళూర్లో మళ్ళీ ప్లేస్‍మెంటు వచ్చింది. వెళ్ళాలి. ఇంతలో తల్లిదండ్రులమధ్య చీలిక. తను వెళ్ళాలా? తల్లికి సపోర్టుగా వుండాలా? ఆవిడని తనతో తీసుకెళ్ళాలా? ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పుడు ఈ సంఘటన. అత్త ఎందుకిలా చేసింది? అమ్మ ఎందుకలాంటి నిర్ణయం తీసుకుంది? మహతి పెద్దమ్మ వంటరిజీవితం ఎందుకు గడుపుతోంది? ఒకదాన్ని అనుసంధానించుకుని మరొకటిగా ఎన్నో ప్రశ్నలు. జీవితంగా పైకి కనిపించేది మనిషి వేసుకునే తొడుగులాంటిదనీ, దానికింద అసలు శరీరంలాంటిది ఇంకేదో వుంటుందనీ అనిపించింది. ఉ<హు. అది శరీరంకూడా కాదు, చర్మం. ఇంకా లోపలకూడా వుంటుంది. అదీ తెలియాలి. తెలుసుకోవాలన్న కోరిక మొదలైతే ఒక విషయం దగ్గర ఆగదు.
అందరి భోజనాలూ అయ్యాయి.
“రుక్మిణక్కా! మీ వంటాయన్ని నాలుగురోజులు మాకు చెయ్యమని చెప్తావా? మీ యింట్లో ఇంక వంట పెట్టుకోకు. ఇక్కడ వండించి పంపిస్తాను. అందరం పెద్దవాళ్ళమైతిమి. గీత చూస్తే అలా. మమ్మల్ని కూర్చోబెట్టి తులసీ, మహతే చెయ్యాలి” అంటూ లక్ష్మి పక్కింటామెతో చాలాసేపు మాట్లాడింది.


గీతావాసులకి ఇద్దరు కొడుకులు. వాళ్ళకి విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. సుధీర్‍కి సెకండ్ కజిన్స్‌గ్రూపుకి యాక్సెస్ లేదు. టైమ్ జోన్లు వేరవటంతో నిద్రలేచాక ఆ పిల్లలకి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు కంగారుపడుతూ వెంటనే తండ్రికి ఫోన్ చేసారు. పెద్దవాడు మయూఖ్. అతను బేలన్స్‌డ్‍గా వున్నాడు. చిన్నవాడు విహంగ్ చాలా సెన్సిటివ్. అతనైతే ఏడుపే. వాసు ఇద్దరికీ ధైర్యం చెప్పి, గీతతో మాట్లాడించాడు. చరణ్ అక్కడ కనిపించడం పిల్లలిద్దరికీ తమ తల్లిదండ్రులపట్ల వుండాల్సిన బాధ్యతని గుర్తుచేసినట్టైంది.
“నేను బయల్దేరి వస్తాను నాన్నా!” అన్నాడు పెద్దవాడు మయూఖ్.
“ఇక్కడంత సీరియసేమీ లేదు. మీ వీలు చూసుకుని రావచ్చు. లేకపోతే మేమిద్దరం వస్తాం. కంగారుపడకండి” అన్నాడు వాసు.
“ఇదొక పెద్ద డైలమా కదూ? మనకే చిన్నకష్టం వచ్చినా పిల్లలు దగ్గిరుండాలనిపిస్తుంది. అలాగని వస్తామని వాళ్ళంటే ఇబ్బంది కలిగిస్తున్నామేమోనని మనమే వెనక్కి తగ్గుతాం” అంది మహతి.
“జరిగేవి జరుగుతాయని వదిలెయ్యక ప్రతిదాన్నీ విశ్లేషించడం దేనికి?” అన్నాడు వాసు.
గీత తమ్ముడు కాల్ చేసాడు.
“వాట్సప్ గ్రూపులో ఏం పెట్టాన్రా?” అడిగాడు వాసు.
“ప్లీజ్ బావా! అక్కతో ఒక్కసారి మాట్లాడతాను” అని బతిమాలితే, “కంగారేం లేదు కృష్ణా!” అంటూ గీతకి ఫోను పంపాడు.
మహతి దగ్గరకి కబుర్లకి చేరాడు చరణ్. నూనెలో వేయించి వుప్పూకారం ధనియాలపొడీ చల్లిన వంకాయవేపుడు చరణ్‍కి బాగా నచ్చింది.
“ఫ్రెండ్స్‌తో కలిసి వున్నప్పుడు ఒక్కోసారి వండుకుంటాం ఆమ్మా! ఎన్నిరకాల దినుసులు వేస్తామో! రుచిమాత్రం రాదు. ఇలా సింపుల్‍గా చేసుకుంటే బావుంటుంది. శ్రమ తప్పుతుంది” అన్నాడు. మహతి నవ్వింది. తన కూతురూ అంతే. వంట చేస్తానంటుంది. పదో యిరవయ్యో కప్పులు పెట్టుకుని వాటిల్లో ఏవేవో పదార్ధాలు వేసుకుని వంట మొదలెడుతుంది. బోలెడన్ని గిన్నెలౌతాయి. చివరికి నువ్వు చేసినట్టు రుచి రాలేదంటుంది.
నిద్రలకి వుపక్రమించేసరికి పదకొండైంది. గీతకి నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది. అందరూ ఆమె వున్నగదిలోనే పడుక్కున్నారు. ఎవరికీ నిద్ర రాలేదు. ఏవేవో మాట్లాడుకుంటూ వుండిపోయారు. అన్నీ అతకని మాటలే. ఆ కుటుంబంలో కొన్ని సమస్యలున్నాయి. అవి మాట్లాడటానికి అది సందర్భం కాదు. ఇంతమంది సభ్యులు ఒకచోట కలవటమూ అరుదే. చాలాకాలమైంది ఇలా కలిసి. యుగాలైనట్టే వుంది అందరికీ. ఎన్నో చెప్పుకోవాలని వుంది. ఏదీ బైటికి అనలేకపోతున్నారు. గీతని ఎవరూ మాట్లాడించలేదు. ఆమెకూడా అనాసక్తిగా వింటూ మౌనంగా వుండిపోయింది. మనసులోమాత్రం తుఫాను రేగుతోంది.


కుటుంబం ఒక ఎటర్నల్ ఫాబ్రిక్‍లాంటిది. ఎప్పుడు మొదలైందో తెలీదు. కానీ మనుషులు కుటుంబాలుగానే పరిచయమయ్యారు.
స్వాయంభువ మనువు, శతరూప, ఉత్థానపాదుడు, ప్రియవ్రతుడు. భాగవతపూర్వకాలంలో.
రాముడు, సీత, లవకుశులు. త్రేతాయుగంలో.
కృష్ణుడు, రుక్మిణి, ప్రద్యుమ్నుడు. ద్వాపరయుగంలో.
రాజులు, రాణులు, అంత:పురాలు. రూపురేఖలు మార్చుకుని వుండచ్చు, అంత:కలహాలతో అతలాకుతలమై వుండచ్చు, కానీ కుటుంబాలుగానే వున్నారు. ప్రముఖులు వంశాలు నిర్మించుకున్నారు, వంశచరిత్రలు రాసుకున్నారు. సామాన్యులు కుటుంబాలు నిర్మించుకున్నారు, కుటుంబచరిత్రలు, ప్రవరలు చెప్పుకుని గర్వపడ్డారు. మూడునాలుగుతరాలవాళ్ళు ఒక కప్పుకింద బతికారు.
కాలం మారింది. చదరంత కుటుంబం చేతిరుమాలంతకి కుదించుకుపోయింది. నలుగురన్నదమ్ములు, పదిమంది పిల్లలతో వుండే యిళ్ళన్నీ ఇద్దరులేక ముగ్గురు- ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు- కంటే ఒకరు, కనకపోయినా తప్పులేదనుకునేవరకూ ప్రస్థానించారు. ఇప్పుడు ఏ పోగుతోనీ ముడిపడని విడిపోగులనికూడా కుటుంబం అంటున్నారు.
ఎన్నో జ్ఞాపకాలు. అందరి మనసుల్లో. ఒకొక్కరిలో ఒకొక్క కోణంలోంచీ. జీవితం ఒక్కసారి మొదలవదు. జరుగుతూ పోతున్నదే ఏదో ఒక సంఘటనతో గుర్తింపులోకి వస్తుంది. తరువాత సంఘటనల పరంపర కొనసాగుతుంది. ఈ సంఘటనలు కేవలం ఒక్క వ్యక్తికే చెంది వుండవు. వాటితో ఎందరికో సంబంధం వుంటుంది. అలాంటి సంఘటనలు గీతకి ఆమె ఇరవయ్యోయేట మొదలయ్యాయి.
ముప్పైరెండేళ్ల కిందట ఒక సాయంత్రం. ఆఫీసునించీ వచ్చాడు రామారావు. సాయంత్రం ఐదున్నర.
అప్పటికే గీత వచ్చేసి వుంది. తండ్రికోసం ఎదురు చూస్తోంది. ఆఫీసునించీ వస్తూ లైబ్రరీకి వెళ్ళి కూతురికోసం నవలలు తెస్తాడు. వాటికోసం ఆమె ఎదురుచూపు. ఆయన రాగానే చేతిలో వున్న పుస్తకాలు ఆత్రంగా అందుకుంది – యద్దనపూడి అగ్నిపూలు, రవీద్రనాథ్ ఠాగోర్ పడవమునక.
“నాన్నా! ఇదీ సినిమాగా వచ్చింది” అంది అగ్నిపూలు చూడగానే. ఆయన తలూపాడు. ఆమె పుస్తకాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కుని లోపలిగదిలోకి వెళ్ళాడు. యశోద మంచినీళ్ళూ, టిఫెను టేబుల్‍మీద పెట్టింది. రేడియో ఆన్ చేసి, పేపరు చూస్తూ తినడం మొదలుపెట్టాడు. అదయ్యేసరికి కాఫీ తీసుకొచ్చింది.
“కాసేపు పైన కూర్చుందాం” అంది. భార్యాభర్తలిద్దరే ఏవైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు డాబామీద కూర్చుంటారు.
“భోజనాలయాక” అన్నాడు. ఆమె తలూపింది.
రాత్రి భోజనాలయాక పైకి వెళ్ళి కూర్చున్నారు. గీత తండ్రి తెచ్చిన నవలల్లో మునిగిపోయి వుంది. కృష్ణ హోంవర్కు చేస్తున్నాడు.
దీపావళి వెళ్ళి అప్పటికి వారంరోజులైంది. చంద్రుడు పూర్ణత్వాన్ని నింపుకోవడానికి ఇంకా వ్యవధి వుంది. ఆకాశం పారిజాతం చెట్టుకింది నేలలా వుంది, నక్షత్రాలతో నిండిపోయి. అందమైన విషయాలు మాట్లాడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం అది. చుట్టూ పరిసరాలు బావుంటే మాట్లాడే మాటకి వినిపించే అర్థంకూడా మారుతుంది.
చలి సన్నగా వణికిస్తుంటే చీరచెంగు భుజాల చుట్టూ కప్పుకుంది యశోద. అలవాటే, ఇలాంటి చలి. డాబామీదా, అవంతీపురం కోటలోనూ తపస్వినీనది వొడ్డునా. భర్తతో కలిసి ఎన్నో ఏళ్ళు ఆస్వాదించింది. అతనితో ఏదేనా చెప్పాలంటే ఇలాంటి ఇలాంటి ఏకాంతమే వెతుక్కుంటుంది.
“గీతకి ఇరవై నిండుతాయి. చదువైంది. వద్దంటుంటే వెళ్ళి వుద్యోగంలో చేరింది. ఉన్నవూరేగాబట్టి సరిపోయింది. ఇంక పెళ్ళి చేస్తే బావుంటుందేమో! అవతలివాళ్ళు ఇష్టపడితే వుద్యోగం చేస్తుంది, లేకపోతే లేదు. మన బాధ్యత తీరుతుంది. అత్తయ్యకూడా అదే అంటున్నారు” అంది నెమ్మదిగా. రామారావు ఆమేకేసి తలతిప్పి చూసాడు.
“ఔనుకదూ! నాకూ అనిపించింది ” అంతే నెమ్మదిగా అన్నాడు.
“మీ దృష్టిలో ఎవరున్నారు? ” ఆతృతగా అడిగింది.
“ఏడుగురు వరసైన మగపిల్లలు ఇంట్లో వుండగా బయటి సంబంధానికి ఎలా వెళ్తాం?” అడిగాడు.
“ఎవరికిద్దామని?”
జవాబు చెప్పలేని ప్రశ్నేమీ కాదది. కానీ బయటపెట్టడానికి రంగం సిద్ధం చేసుకోవాలి.
“అమ్మేమంటోంది?”
“ఆవిడకి మీమీద గొప్ప నమ్మకం. అబ్బాయికి తెలీదా- అన్నారు”
రామారావుకి ఆరుగురు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు ప్రమీల. ఆమెకి ఇద్దరు కొడుకులు. సుధీర్, సుమంత్. ఇద్దరూ గీతకన్నా పెద్దవాళ్ళే. రెండో చెల్లెలు లక్ష్మి. ఆమె పెద్ద కొడుకు వాసు. గీతకి వయసైనవాడు. అతని తర్వాతివాడు మాధవ్. అతనూ గీతకన్నా పెద్ద. మూడో చెల్లెలికి ఇద్దరు కూతుళ్ళు. ఆమె వరసలో లేదు. తరువాతివాళ్ళు అరుణ, సంధ్య, పద్మ. వాళ్ళు ముగ్గురికీ కూడా కొడుకులున్నారు. ఈ అందర్లో గీత ఎవర్నేనా యిష్టపడుతోందా? అదే బైటికి అన్నాడు.
“దాని మొహం. దానికేం తెలుస్తుంది? చిన్నపిల్ల. మంచీచెడూ చూసి నిర్ణయించాల్సింది మనమే” తేలిగ్గా అనేసింది యశోద. రామారావు అలా అనుకోలేకపోయాడు. వాళ్ళందరితో కలిసి పెరిగినప్పుడు ఎవరో ఒకరిమీద యిష్టం లేకుండా ఎలా వుంటుంది? అలాంటిదేమీ లేకపోతే నిర్ణయం తమదే. ఉంటే? అప్పుడు తమ నిర్ణయాన్ని కాదనలేక గీత తలొంచి జీవితాంతం బాధపడటమో, ఎదురుతిరిగిందని తమకి మనస్తాపం మిగల్చడమో జరుగుతుంది. అడిగేస్తే సరి! అనుకున్నాడు.
“ఇప్పుడేగా, నాతో అన్నావు? ఆలోచిద్దాం. ఎలా ముందుకి వెళ్తే బావుంటుందో! ఎవరితో సంబంధం కలుపుకున్నా మిగతావాళ్లకి కోపం వస్తుంది” అని లేచాడు. అదీ నిజమే! అనుకుంది యశోద.
మరుసటిరోజు కూతుర్ని ఆఫీసుదగ్గిర పికప్ చేసుకున్నాడు రామారావు. ఆ వూళ్ళో చూడదగ్గవీ సాయంత్రాలయేసరికి అందరు విరామంకోసం చేరేవీ రెండు ప్రదేశాలున్నాయి. ఒకటి తపస్వినీ నది వొడ్డు. రెండోది అవంతీపురం కోట.
కోట రాజకుటుంబీకులది. సందర్శనకోసం పెట్టారు. టికెట్టుమీద చూసి రావచ్చు. కోటముందు పెద్దతోట వుంది అక్కడ కూర్చోవచ్చు. తండ్రీకూతుళ్ళు అక్కడికి వెళ్ళారు. టికెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళి తోటలో ఒకవార కూర్చున్నారు. తండ్రి యిలా ఎందుకు తీసుకొచ్చాడో అర్థమవలేదు గీతకి. నిజానికి రామారావు మనసులో నిగూఢమైన ఒక కోరిక వుంది. తన కూతురూ, రక్తం పంచుకు పుట్టినదీ కాబట్టి తన కోరిక ఛాయలు ఆమెలోకి విస్తరించాయా? దాని రూపాన్ని ఆమె గుర్తించగలదా? ఎన్నో సందేహాలు. ప్రేమ వుందనుకుంటాం. అది ప్రకటితమై, నిర్ధారించబడే చర్యలు కొన్ని వుంటాయి. ఈ కోరిక అలాంటి చర్యనే కోరుకుంటోంది.
కోట చాలా యిష్టం గీతకి. కారిడార్లలో రాచకుటుంబీకుల వర్ణచిత్రాలుంటాయి. రాచకుటుంబీకులది గొప్ప కళాత్మక దృష్టి. గీత చిన్నప్పుడు, ఇప్పటి తరానికి ఆద్యుడైన రాజు కోటలోనే పై అంతస్థులలో వుండేవాడు. చనిపోయి పదేళ్ళైంది. ఆయన పిల్లలంతా విదేశాలలో స్థిరపడ్డారు. కోటలో చిత్రకళ, సంగీతం, నాట్యం, శిల్పంలాంటి ఎన్నో వర్కుషాపులు నడుస్తూ వుంటాయి. చాలా పెద్ద లైబ్రరీ వుంది. ఒకసారి అక్కడికి వెళ్ళినవారిని వ్యసనంలా అది అతుక్కుపోతుంది. అక్కడికక్కడ కూర్చుని బొమ్మలు గీసే చిత్రకారులు వుంటారు. అలాగే రాతితోనూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‍తోనూ బొమ్మలు చేయచ్చు. కొయ్యతోనూ, బంకమట్టితోనూ చేయచ్చు. ముడిసరుకు ఇక్కడే దొరుకుతుంది. ఇవన్నీ అక్కడున్న గేలరీలో అమ్మకానికి పెడతారు. వాటిని ఇష్టమైనవారు కొనుక్కుని తీసుకెళ్తారు. అలా వచ్చిన డబ్బులో కొంత కళాకారులకీ, కొంత కోటనిర్వహణ ఖర్చులకీ వెళ్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా కళాతృష్ణ తీర్చుకోవడానికీ, చిన్నచిన్న సంపాదనలకీ అదో మార్గం.
స్వతంత్రం వచ్చాక సంస్థానాల విలీనం జరిగింది. రాజులకి భరణాలు ప్రకటించి వారి రాచరికాలని రద్దు చేసారు. ఒక దశాబ్దం క్రితం భరణాలనికూడా రద్దుచేసారు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా గీతకి చాలా బాధనిపిస్తుంది. ఇచ్చినమాట తప్పడంలా, ఈ దేశపురాచరిక సంస్కృతికి చేసిన అన్యాయంలా అనిపిస్తుంది. రాజకీయనాయకులందరూ గొప్పవాళ్ళు కానట్టే రాజుల్లోనూ చెడ్డవాళ్ళు వుండచ్చు. వ్యక్తులకోసం వ్యవస్థని రద్దుచేసుకోవటమేనేది క్షంతవ్యం కాదు. ఇది ఆమె ఆలోచనాసరళి. ఆలోచనలే మనిషి జీవితాన్ని నిర్మిస్తాయి. ఆలోచనలు లేకపోతే జీవితానికి రూపురేఖలు వుండవు. అది ఎముకల్లేని జీవిలాంటిది. వట్టి దూది కూరి చేసిన బొమ్మలాంటిది.
తన కుటుంబంతోనూ, తను చదివే స్కూలు, కాలేజిపిల్లలతోనూ ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చింది ఆమె. పిల్లలకి ఎంతో అనువైన పిక్నిక్ స్పాట్ అది. కారిడార్లలో తిరుగుతూ చిత్రాలన్నీ చూసేది. రాజుకూతురు ఫోటోల్లో చిన్నపిల్ల. ఇప్పుడు వృద్ధురాలు. తండ్రి పెద్ద కుర్చీలో కూర్చుని వుంటే చురుకైన మెరిసే కళ్లతో చూస్తూ ఆయన్ని ఆనుకుని నిలబడి వుండేది. ఆ వయసు పిల్లలందరికీ రోల్‍మోడల్లా అనిపించేది. తరువాతికాలంలో ఆ పిల్ల పెళ్ళిచిత్రాలు గీత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదొక సహజపరిణామం. ఆడపిల్ల వ్యక్తురాలయాక శారీరకంగా వచ్చే మార్పుల పర్యవసానం. తన పక్కని నడుస్తూ, తన లోలోపల గుసగుసలాడుతూ, తన నవ్వుల్లో నవ్వై, చూపుల్లో చూపై, తన నడనలో నడకైన అవ్యక్తరూపం ఆమెకి స్ఫురించేది. అన్నీ తెలిసినట్టే వుండేది కానీ ఎవరో పోలిక దొరికేది కాదు.
తండ్రీకూతుళ్ళిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు కొంతసేపున్నాక, రామారావు వాళ్ళిద్దరిమధ్య వున్న నిశబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు.
“అమ్మ, మామ్మ నీకు పెళ్ళి చెయ్యాలంటున్నారు” అన్నాడు.
గీత వులిక్కిపడింది. “అప్పుడేనా?” అడిగింది.
“చేసుకునే వయసు ఇదేకదా? ఒక తోడు వుంటే చిలకాగోరింకల్లా వుంటారు”
“చిలకాగోరింకలని ఎందుకంటారు నాన్నా? రెండూ ఒక జాతి పక్షులు కావుకదా?”
“నిజమే. చిలకల్లా, గోరింకల్లా అనాలేమో!” అన్నాడు రామారావు. ఎదిగిన ఆడపిల్లతో పెళ్ళి విషయం మాట్లాడటం అంత తేలికకాదని అర్థమైంది అతనికి. యశోద మాట్లాడాల్సిన విషయం. ఆమె ఎలా నిర్ణయిస్తుందోనన్న భయంచేత తను విషయం ఎత్తుకున్నాడు.
“చేసుకునేది నువ్వు. నీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను” అన్నాడు.
“నాకేం తెలుస్తుంది? మీకెలా నచ్చితే అలా చెయ్యండి” అంది గీత.
“ఉ<హు< ఏడుగురు మగపిల్లలున్నారు మన కుటుంబంలో. మీ అందరూ కలిసి పెరిగారు. వాళ్ళలో ఎవరేనా అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం వుందా? లేకపోతే బైట సంబంధానికి వెళ్ళమంటావా?”
గీత ముఖం ఎర్రబడింది. తల దించుకుంది. రామారావుకి అర్థమైంది. ఆయన గుండె వడివడిగా కొట్టుకుంది. గీతకి ఎవరంటే యిష్టం? డాక్టరుకాబట్టి సుధీరంటేనా? విలాసవంతంగా వుంటారుకాబట్టి అరుణ కొడుకంటేనా? చలాకీగా తిరుగుతూ ఆటలవీ ఆడుతూ వుండే సంధ్య కొడుకంటేనా? వాసు ఈ పోటీలో వున్నాడా? అసలు లేడా? ఎవరికి వాళ్ళకి ఎన్నో లెక్కలున్నాయి. ఆ లెక్కలన్నీ ఆయన మనసులో కదుల్తున్నాయి.
“నేనే చెప్పాలా, నాన్నా?” అడిగింది గీత.
“చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా?”
“నాకు లక్ష్మత్తంటే యిష్టం” అంది.
ఆయనకి వెంటనే అర్థమవలేదు. కొద్దినిముషాలకి బుర్ర వెలిగింది. సంతోషం. మనసునిండా నిండిపోయింది. ఒకళ్ళమీద ఒకళ్ళకి ఇష్టాలున్నప్పుడు కొంచెం కాకపోతే కొంచెమేనా మనసులు అర్థమౌతాయి. తండ్రీపిల్లలకీ, తల్లీపిల్లలకీ, భార్యాభర్తలకీ ఎంతోకొంత సామరస్యం (రస సమత్వం) వుంటుంది. మనుష్యులు కుటుంబాలుగా కలిసి వుండగలిగేది అందుకే.
“వాసుకి మాట్లాడనా?” ఆతృతగా అడిగాడు. ఆమె తలూపింది. ఆయన సంతోషానికి అవధుల్లేవు.
“వెళ్దామా?” అడిగాడు.
తలూపింది. వెళ్తూ ఒక కారిడార్లోంచీ నడిచారు. రాజకుమారి పెళ్ళిచిత్రాలు చూసింది గీత. అస్తమిస్తున్న సూర్యుడి వెలుతురు, ట్యూబులైటుల వెలుతుర్లో కలిసిపోతూ సృష్టించిన ఒక వింతకాంతిలో. ఇంతకాలం కనిపించకుండా తనని ఆవరించుకుని వున్న వూహావ్యక్తి ఇప్పుడు పీటలమీద తన పక్కని కనిపించాడు.
ఇద్దరికోసం ఐస్‍క్రీమ్ కొన్నాడు రామారావు.
“మనం ఇక్కడికొచ్చామని చెప్తే తమ్ముడు గొడవ చేస్తాడు” అంది తన కోన్ అందుకుని తింటూ.


“అప్పుల బాధ భరించలేక అవంతీపురానికి చెందిన విశాల, వెంకట్రావు అనే దంపతుల ఆత్మహత్య” అనే వార్త అన్ని టీవీ చానెల్స్‌లో వస్తోంది. పక్కని వేరే విండోలో విజువల్స్. వాళ్ళు వురి వేసుకున్నవీ, పోలీసులు ప్రాథమిక పరిశోధన చేస్తున్నవీ, చాలామంది జనం ఇంటిమీదికొచ్చి అరుస్తూ, తిడుతున్నవీ.
అప్పుడు సమయం పగలు పదిన్నర.


ఒకే ఒక్క సంఘటన అప్పటిదాకా సవ్యంగా సాగిపోతున్న జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. అలాంటి సంఘటనకి సంబంధించిన సంకేతాలేవో అందుతున్నట్టు పొద్దుటినుంచే మనసెందుకో ముసురు పట్టినట్టుంది అమృతకి. గజిబిజిగా ఎన్నో ఆలోచనలు. ఏ ఒక్క ఆలోచనలోనూ స్పష్టత లేదు. దానికితోడు చూసుకోకుండా తప్పు కమాండ్ ఇవ్వడంతో కొంత డాటా డిలిటైపోయింది. అది రిట్రీవ్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే సిస్టం హ్యాంగ్ అవుతోంది.
సడెన్‍గా వాట్సాప్‍లో మెసేజి. స్వప్న దగ్గర్నుంచి.
“నువ్వు వెంటనే బయలుదేరి హాస్టల్‍కి వచ్చేసేయ్” అని. స్వప్న ఈవేళ ఆఫీసుకి రాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది.
“ఎందుకే, వర్క్ ఫ్రమ్ హోం?” అంటే-
“లేజీ” అని నవ్వొకటి.
“క్రేజీ” జవాబు ఇచ్చి ఒక్కతే బయల్దేరి వచ్చేసింది అమృత. ఇద్దరూ ఒకే ఆఫీసు, ఒకే హాస్టల్, ఒకే రూమ్. ఇద్దరికీ ఏడాది స్నేహం. ఒకేసారి వుద్యోగంలో చేరారు. ఎందుకో చాలా నచ్చింది అమృత, స్వప్నకి. స్నేహం చెయ్యాలనిపించింది. ఆమెకూడా అలాగే అల్లుకుపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జంటకవుల్లా తిరుగుతారు. మెట్రోలో సీటు ఆపి, పక్కకి చూసినప్పుడూ, దిగాక ఆటో ఎక్కగానే వెంటనే అదికదిలినప్పుడూ స్వప్న వెంట లేకపోవడం తెలిసింది అమృతకి. ఇప్పుడు ఆఫీసుకి రాగానే తిరిగి వచ్చెయ్యమని.
“బయల్దేరావా?” మళ్లీ మెసేజి.
“ఏమైంది? నీకేమైనా వంట్లో బాగాలేదా?”
“కాదుగానీ. వెంటనే బయల్దేరిపో అమృతా! ఇక్కడికొచ్చాక తెలుస్తుంది”
అమృతకంతా అయోమయంగా వుంది. వచ్చెయ్యమంటోంది. కారణం చెప్పదు. ఫోన్లో మాట్లాడితే ఏదేనా అనుకోనిది జరిగి ఆదుర్దా వుంటే గొంతు వణుకులోనూ, ఏ కడుపునొప్పో వస్తే గొంతు నొక్కిపట్టడంలోనూ తెలుస్తుంది. ఈ రెండూ కాని భావమేదో వ్యక్తమౌతోంది గొంతులో. వెంటనే సీట్లోంచీ లేచి ఇవతలికి వచ్చి ఫోన్ చెయ్యబోతుంటే హెచ్చార్ మేనేజర్ భరత్‍నుంచి మెసేజి. రమ్మని. వెళ్ళింది. అతని ముఖంలోకూడా ఏదో అర్థం కాని భావం.
“నువ్వే వస్తావని చూస్తున్నాను. స్వప్న నీకింకా కాల్ చెయ్యలేదా? నాకు ఇప్పుడే చేసింది. నిన్ను వెంటనే పంపమని అడిగింది. నువ్వు వెళ్ళు” అన్నాడు. ఇలాంటివి కార్పొరేట్ రంగంలో అసలు జరగవు. స్వప్న రాలేదు. తనుకూడా పర్మిషనో లీవో అడిగితే లెక్కకట్టేస్తారని తటపటాయిస్తోంది. అలాంటిది భరత్ అతనంతట అతనే వెళ్లమనటం?!!!
“తను బాగానే వుందా?” అడిగాను. ఆమె గొంతులో వణుకు.
“మీ హాస్టల్ ఎక్కడ?”
చెప్పింది.
“నాకూ అటు పనుంది. నిన్ను దింపి వెళిపోతాను” అని లేచాడు.
“ప్లీజ్! చెప్పు. తనెలా వుంది?”
“తనకేం కాలేదు అమృతా! ” అతను ఆమెకేసి చూడకుండా తలదించుకుని సిస్టం షడౌన్ చేస్తూ చెప్పాడు. ఇద్దరూ ఇవతలికి వచ్చారు. అతను కారు తీసాడు. ఆమె పక్కన కూర్చుంది.
హైటెక్‍సిటీ…చందానగర్…మియాపుర్…కూకట్‍పల్లి… మెయిన్‍రోడ్డుమీంచీ మలుపు తీసుకున్నాడు. హాస్టల్ వచ్చాక కారు ఆపి, వచ్చినట్టు స్వప్నకి ఫోన్ చేసి, అప్పుడు నెమ్మదిగా అమృతతో చెప్పాడు, “మీ పేరెంట్స్ ఇద్దరికీ యాక్సిడెంట్ అయిందట”
తలమీద పిడుగు పడ్డట్టైంది ఆమెకి. దిగకుండా అలాగే కూర్చుండిపోయింది.
స్వప్న లోపలినుంచి వచ్చింది. డోర్ తీసి, భుజంమీద చెయ్యేసింది. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంది అమృత. ఆ ఆసరాతోనే కార్లోంచీ దిగింది.
“నేనూ వుండనా? నా హెల్ప్ కావాలా? నువ్వు చూసుకోగలవా?” అడిగాడు భరత్, స్వప్నని.
“నేను చూసుకుంటాను. ఇద్దరం కలిసి వాళ్ల ప్లేస్‍కి వెళ్లిపోతాం” ఆమె జవాబిచ్చింది.
భరత్ కొంచెం తికమకపడ్డాడు. “ఆర్యూ ష్యూర్? నేను కూడా వస్తాను” అన్నాడు.
“అవసరం లేదు భరత్. వాళ్ళ ప్లేస్‍కి టాక్సీ బుక్ చేస్తాను. అరగంటలో వెళ్ళిపోతాం” అంది.
“సరే మరి. ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడగండి. అమృతా! ధైర్యంగా వుండు. మీ తల్లిదండ్రులకి ఏమీ కాదు. తొందర్లోనే కోలుకుంటారు. మరైతే నేను వెళ్తాను” అతను కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడనటంకన్నా స్వప్న పంపించేసిందనటం సరైనది. కారు ఇలా కదిలిందో లేదో, అమృత చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది స్వప్న. సిట్టింగ్ లాంజిలోకి వెళ్ళగానే బేగ్‍లోంచీ రిమోట్ వెతికి తీసి, టీవీ ఆన్ చేసింది. యాక్సిడెంటు చాలా పెద్దదా? చిన్నదైతే టీవీలో రాదు. ఎలా వున్నారు వాళ్ళిద్దరూ? అమృతలో సన్నగా వణుకు. కళ్ళు టీవీ స్క్రీన్‍కి అప్పజెప్పింది. తనకి భరత్ చెప్పినదానికి భిన్నంగా.
“అప్పుల బాధ భరించలేక వెంకటాపుర్‍కి చెందిన విశాల, వెంకట్రావు అనే దంపతుల ఆత్మహత్య” అనే వార్త స్క్రోలౌతోంది. పక్కని విజువల్స్. ఆ యిద్దరూ ఆమె అమ్మా, నాన్న!!
చుట్టూ వున్న ప్రపంచం గిర్రుని తిరుగుతున్నట్టు అనిపించింది అమృతకి.
“ఇక్కడొద్దు. రూంలోకి వెళ్దాం పద” అని రిమోట్‍కూడా తనతో తెచ్చేసింది స్వప్న. అమృత యాంత్రికంగా ఆమెని అనుసరించింది. జరుగుతున్నదానితో తనకి సంబంధం తెగిపోయినట్టూ, ఏ కలలోనో వున్నట్టూ అనిపించింది. మెదడు మొద్దుబారిపోయింది. రూంలోకి వెళ్ళగానే తలుపు వేసేసింది స్వప్న.
“నువ్వు ఆఫీసుకి వెళ్ళాక కాసేపు టైంపాస్‍కని టీవీ పెట్టాను. ఈ న్యూస్ స్క్రోలౌతోంది. చానెల్ మార్చి చూసాను. అన్ని చానెల్సూ కవర్ చేస్తున్నాయి. వెంటనే టీవీ ఆఫ్ చేసి, రిమోట్ ఎవరికీ కనిపించకుండా పెట్టాను. లక్కీగా వార్డెన్ లేదు. ఎటో వెళ్ళింది. ఉంటే టీవీ వదలదు. భరత్‍కికూడా ఇదంతా చెప్పలేదు. అమృతా! ఇది మామూలు విషయంకాదు. అందరికీ తెలిస్తే చాలా అసహ్యంగా వుంటుంది. తలో మాటా అంటారు. ఏం చెయ్యాలోకూడా తోచదు. ఈ విషయంలో ముందుగా స్పందించాల్సినది నువ్వు. ఏం చెయ్యాలనుకుంటున్నావు?” అడిగింది.
“ఏం చెయ్యాలో తెలీటంలేదు”
“మీకు బంధువులెవరూ లేరా? “
“అమ్మ చిన్నప్పుడే తాతయ్య పోయారు. ఆయన డెత్ బెనిఫిట్స్, కంపాషనేట్ గ్రౌండ్స్‌మీద వుద్యోగం అమ్మమ్మకి ఇచ్చారు. ఎదిగిన కొడుకు చనిపోయాడు, బాధ్యతలు అలాగే వున్నాయి, వుద్యోగం తీసుకుని డబ్బు వాళ్ళకిమ్మని తాతయ్యవైపువాళ్ళు అడిగారట. అమ్మమ్మ వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మళ్ళీ దగ్గరికి చేరనివ్వకుండా చేసిందట. ఆవిడ పోయినప్పుడుకూడా వాళ్ళెవరూ రాలేదు. నాన్న వుండగానే అమ్మకూడా అచ్చం అలాగే చేసిందట. సో ఎవరూ లేరన్నట్టే” అభావంగా చెప్పింది.
“మరేం చేద్దామనే? అసలీ అప్పులేమిటి? వాళ్ళకి నువ్వొక్కదానివేగా?” అయోమయంగా అడిగింది స్వప్న.
“నాకూ తెలీదు. నేను టెన్త్ క్లాసప్పట్నుంచీ హాస్టల్స్‌లోనే వుండి చదువుకున్నాను. నాన్న టీచరు. అమ్మ ఏవేవో చేసేది. చీరల వ్యాపారం చేసేది. చిట్టీలు నడిపేది. వడ్డీలకి అప్పులిచ్చేది. నన్ను షేర్లగురించి అడిగారు కొన్నాళ్ళక్రితం. వీటిగురించి నేను లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు” యాంత్రికమైన జవాబు. ఎవరిగురించో చెప్తున్నట్టు నిర్వికారంగా చెప్తుంటే స్వప్న భయంగా చూసింది.
“అమృతా! ఏం చేస్తావు? ఎంతోసేపు ఈ నిజాన్ని దాచలేవు. పొద్దున్న అంతా ఆఫీసుకెళ్ళే హడావిడిలో వున్నారుకాబట్టి ఎవరూ చూడలేదు. సాయంత్రానికి అంతా గుప్పుమనిపోతుంది”
“వెళ్తాను. వెళ్ళకుండా ఎలా?”
“ఆడపిల్లవి, ఒక్కదానివీ అక్కడికి ఎలా వెళ్తావే? ఎవరేనా అడ్వకేట్‍ సలహా తీసుకో”
“నీకెవరేనా తెలుసా?”
ఆమె జవాబు చెప్పేలోగా తలుపుమీద చిన్నగా చప్పుడైంది.
“అమృతా మేడమ్! మీకు కొరియర్ వచ్చింది” ఆయా చెప్పింది.
స్వప్న లేచి వెళ్ళి తలుపు తీసి వుత్తరం తీసుకుని తెచ్చి అమృతకి యిచ్చింది. కవరుపైన చేతిరాత అమృత తండ్రిది. చెయ్యి వణికింది. అపనమ్మకం. వుత్తరం నాన్నదైతే తను చూసిన వార్త?
“ఎక్కడినుంచి?” స్వప్న అడిగింది.
“నాన్న దగ్గర్నుంచి”
ఆమెలో కూడా ఆశ్చర్యం.
కవరు చింపి, నాలుగు మడతలున్న కాగితాన్ని బయటికి తీసింది అమృత.
అమృతా!
ఆశ్చర్యపోతున్నావా? నువ్వు చూసిన వార్త నిజం. ఈ వుత్తరం కూడా నిజమే. ఈరోజు వుదయం ప్రాణం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, రాత్రి నీకు ఈ వుత్తరాన్ని పోస్ట్ చేసాను. మేము ఎండమావుల వెనుక పరిగెత్తాము. ఇంక పరిగెత్తలేక అలిసిపోయి పరుగు ఆపేద్దామనుకున్నాం. ఇంతకన్నా నీకు ఈ విషయంలో ఏమీ చెప్పలేను. క్రమంగా నీకే తెలుస్తాయి. మాధవరావు మామయ్య వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఎంతవరకూ తను నీకు సాయపడగలడో తెలీదుగానీ, సాయం మాత్రం చేస్తాడు. తనెలా చెప్తే అలా చెయ్యి. తనొచ్చేదాకా హాస్టల్ గదిలోంచీ ఇవతలికి రాకు. ఆఫీసుకి కూడా వెళ్ళకు.
నాన్న
తను చదివి, వుత్తరాన్ని స్వప్న చేతిలో పెట్టింది అమృత. ఆమెకూడా చదివింది. ఒక పెద్ద బరువు దిగిన భావన స్వప్న ముఖంలో. అలాంటి ఫీలింగేమీ కలగలేదు అమృతకి. మాధవరావు తన తండ్రికి బాల్యస్నేహితుడు. కావచ్చు. ఆయన ఇలాంటి పరిస్థితిలో తనకి సాయం చేస్తాడా? అసలు తనేం చెయ్యాలిప్పుడు? ఒకవైపు చనిపోయిన అమ్మానాన్నా. మరోవైపు పోలీసు కేసులు, అప్పులు, అప్పులవాళ్ళు. అంతా గందరగోళం.
ఫోన్ మోగింది. కొత్త నెంబరు. ఎత్తడానికి భయపడింది. ఫోను మోగుతునే వుంది. ఏమైతే అయిందని ఎత్తింది. మాధవరావే. ఇంత వెంటనే ఆయన స్పందిస్తాడనుకోలేదు.
“అమృతా! నేను బయల్దేరాను. దార్లో వున్నాను. అరగంటలో హాస్టలు దగ్గిర వుంటాను. నువ్వు కంగారుపడకు” అన్నాడు. అంతకన్నా ఎక్కువేం మాట్లాడలేదు.
“ఎవరు?” అడిగింది స్వప్న.
“మామయ్యే”
“ఏమన్నారు? వస్తానన్నారా? ఎప్పుడు? అప్పటిదాకా నువ్వు?” ఎన్నో ప్రశ్నలు.
“దార్లో వున్నారట. అరగంట పడుతుందన్నారు”
ఆయన వచ్చేదాకా ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అలా బొమ్మలా అమృతా, ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని స్వప్నా కూర్చున్నారు. అదేమిటో ఏడుపు రావటం లేదు అమృతకి. ఒక విధమైన స్తబ్దత నిలువెల్లా ఆవహించుకుపోయింది. కణతలు నొక్కుకోవాలనిపించింది. నుదుటినుంచీ కళ్ళ కిందివరకూ అరచేత్తో రుద్దుకోవాలనిపించింది. తలలో నరాలు బిగుసుకుంటున్నట్టనిపించింది. చిట్లిపోతాయా? స్వప్న చేతిలోంచీ చెయ్యి విడిపించుకుని రెండు చేతుల్లో ముఖం దాచుకుంది.
“అమృతా!” భుజంమీద చెయ్యి వేసి, దగ్గరకి తీసుకుంది స్వప్న. “మంచినీళ్ళు తాగుతావా?” అడిగి, జవాబుకోసం ఎదురుచూడకుండా నీళ్ళ బాటిల్ తెచ్చి మూత తీసి అందించింది. తాగాలనిపించలేదు అమృతకి. ఒక గుక్క తాగి గొంతు దిగక అక్కడే వుమ్మేసింది. ఆమెని గుండెలకి హత్తుకుని అలాగే నిలబడింది స్వప్న. ఏడవదు, ఉలకదు, పలకదు అమృత. ఆ తరువాతి సమయం ఎలా గడిచిందో, మాధవరావు వచ్చిన క్షణం ఎలా దగ్గరకొచ్చి చేరుకుందో ఇద్దరికీ తెలియలేదు. మగవాళ్ళని హాస్టల్ గదుల్లోకి రానివ్వరు. ఆయన్ని విజిటర్స్ లాంజిలో కూర్చోమని ఆయా వచ్చి చెప్పింది. అమృత చెయ్యి పట్టుకుంటే నెమ్మదిగా నడిచిపించుకు వెళ్ళింది స్వప్న. అమృత కాళ్ళు తడబడ్డాయి. అడుగు పడలేదు. అతికష్టమ్మీద ఆయన కూర్చున్నవరకూ వెళ్ళి పట్టు తప్పి నేలమీదే కూలబడిపోయింది.
“పదమ్మా, వెళ్దాం” అన్నాడు. ఆయన కళ్ళలో జాలి.
“ఒక్క నిముషం అంకుల్” రూంలోకి వెళ్ళి హడావిడిగా బేగ్ సర్ది తీసుకొచ్చింది స్వప్న.
“అమ్మాయ్, నీ పేరు? ” అడిగాడు మాధవరావ్. స్వప్న చెప్పింది. “శ్రమ అనుకోక మాతో నువ్వూ రాగలవా? దార్లో తనకి తోడుగా వుంటావు. మళ్ళీ డ్రైవర్నిచ్చి వెంటనే పంపేస్తాను” అన్నాడు. తలూపింది. ఆయన అడక్కపోయినా వెళ్ళేది. అమృత అంటే అంత ప్రాణం. అందులోనూ ఇప్పుడింత కష్టం వచ్చింది. కాదనాలన్న ఆలోచనకూడా రాలేదు.
“ఏమైందమ్మా? మేడంకు ప్రాణం బాగాలేదా?” అప్పటిదాకా అక్కడే వుండి చూస్తున్న ఆయా అడిగింది. అది అమృత ఎదుర్కొన్న మొదటి ప్రశ్న.
“ఔను. చూస్తున్నావు కదా? రా, చెయ్యందివ్వు. లేవదీద్దాం” అంది స్వప్న. ఇద్దరూ కలిసి లేవదీసి చెరో చెయ్యీ పట్టుకుని నడిపిస్తే నెమ్మదిగా కార్లో ఎక్కి కూర్చుంది. మాధవరావు నడుపుతుంటే కారు అవంతీపురం ఎస్టేట్స్‌వైపుకి దారితీసింది. అమృత అలాగే కూర్చుంది. అదే జడత్వం, అభావత. ఆ వార్త తను చూసినప్పట్నుంచీ జరిగిన విషయాలని మాధవరావుతో క్లుప్తంగా చెప్పింది స్వప్న.


అవంతీపురం ఎస్టేట్స్!!!
సిటీకి కాస్త దూరాన వుండే గృహవ్యాపారసముదాయం. ఎనిమిదేళ్ళవయసులో త్రిమూర్తులి మనసులో పడిన బీజం. ఆపైన దశాబ్దాల అవిరళకృషి. చుట్టుపక్కల పిల్లలందరికీ అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ వుండటం తనుతప్ప ఇంట్లో మరో పిల్లాడుగానీ పిల్లగానీ లేకపోవటం గుర్తించి తల్లిని అడిగాడు. “అమ్మా! నేనొక్కడినే ఎందుకు? నాన్నెందుకు మనింట్లో వుండరు?”
రంగమ్మ ఏడ్చింది. జవాబు చెప్పలేదు. చెప్పినా అర్థంచేసుకునే వయసు త్రిమూర్తులికి లేదు.
ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టిపోయాక ఇతనొక్కడు దక్కాడు. ప్రసవమప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు ఆవిడ్ని. అతికష్టమ్మీద తల్లినీ బిడ్డనీ బతికించాడు డాక్టరు. మళ్ళీ గర్భం వస్తే ఆవిడ ప్రాణానికి ప్రమాదమని చాలా గట్టిగా చెప్పాడు. శంకరయ్యకి భార్యమీద ప్రేమా అంటే చెప్పలేడుగానీ, చూస్తూచూస్తూ ఆవిడ చావుకి తను కారణం కాలేకపోయాడు. ఈ ప్రేమలూ, బంధాలూ, నీతినియమాలూ బాహ్యమైనవి. మనసుని అంటుకుని వుంటాయి. పొరల్లాగా వలిచి తీసెయ్యచ్చు. ప్రాకృతికమైన అవసరాలు వాటికన్నా బలమైనవి. అవి మనసులోని భాగం. వాటిది బీజరూపం. కొందరికి వాటిని అదుపులో వుంచుకోవడం వస్తుంది. మరికొందరికి రాదు. రానివాళ్లలో శంకరయ్య వున్నాడు.
కొన్నాళ్ళు రంగమ్మ నెలసరి లెక్కలు వేసుకుని కలిసారుగానీ అదికూడా భయంభయంగానే. చివరికి లక్ష్మమ్మ అనే స్త్రీని చేరదీసాడు. పెద్దాపురంనుంచీ తీసుకొచ్చి వేరే యింట్లో వుంచాడు. రంగమ్మకి చెందాల్సిన ప్రేమ అటు మళ్ళిపోయింది. ఆ యింట్లోనే నివాసం. కొడుకు అప్పుడూ యిప్పుడూ ప్రాణమే. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాడు. భార్యాకొడుకుల అవసరాలన్నీ చూస్తాడు.
లక్ష్మమ్మ కళావంతుల స్త్రీ. మంచి వైణికురాలు. పదిమంది మగవారివెంట పోయే మనిషి కాదు. సమాజంలో కొన్ని అస్తవ్యస్తాలున్నట్టు కంటికి కనిపిస్తుంది. ఒక సాంప్రదాయం సదుద్దేశంతోనే మొదలౌతుంది. కొంతకాలం గడిచాక దానికి ఏవేవో వచ్చి చేరి, దాని నిర్మలత్వాన్ని దోపిడీ చేస్తాయి. దేవదాసీవ్యవస్థ వివాహేతర వ్యవస్థకాదు. ఎప్పుడో కాలాలనాడు స్త్రీపురుషులిద్దరికీ సమానప్రతిపత్తి వున్నప్పుడు కొందరు మగవారికిలాగే కొంతమంది ఆడవారికికూడా పెళ్ళి అంటే అయిష్టత వుండేది. దానికి కారణాలు అనేకం. హార్మోనుల అసమతుల్యత, శృంగారంపట్ల మానసికమైన వైముఖ్యం, కొన్ని కళల్లోనూ విద్యల్లోనూ నిష్ణాతులైనవారికి అదొక ప్రతిబంధకమన్న ఎరుక, ఇలా. వాళ్ళు పెళ్ళి వద్దనుకునేవారు. ఆ సాంప్రదాయం క్రమంగా మురికిని కలుపుకుంటూ సాగుతోంది. ఆ కారణాన్నే రంగమ్మకి ఆ స్త్రీపట్ల చాలా విముఖత కలిగి, అలాంటి స్త్రీని తనకి సమానస్థానంలోకి తెచ్చాడని భర్తపట్ల పైకి అర్థమవని విధంగా గౌరవంకూడా స్వల్పంగా తగ్గింది.
ఇవి పెద్దవాళ్లకి సంబంధించిన విషయాలు. అప్పటికి త్రిమూర్తులికి అర్థమవనంత పెద్ద విషయాలుకూడా. అందర్లాంటి యిల్లు తనకీ కావాలనే కోరిక మొదలైంది త్రిమూర్తులికి. కొందరికి అపారమైన సంపద కావాలి. దానికోసం కష్టపడతారు. వ్యాపారసామ్రాజ్యాలు స్థాపిస్తారు. ఇంకొందరికి చేస్తున్న వృత్తి, చదివే చదువు ప్రాణానికన్నా ఎక్కువ. త్రిమూర్తులి ధ్యేయంకూడా అలాంటిదే. పెద్ద కుటుంబం వుండాలి, చుట్టూ మనుషులుండాలని. కుటుంబసంపద కావాలని.
పంథొమ్మిదేళ్ళకి తమ్ముడి కూతురితో పెళ్ళిచేసింది తల్లి. ఒకరొకరుగా పదిమంది పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్లలో నలుగురు ఆడ, ఆరుగురు మగ. అందరినీ తన చుట్టూ స్థిరపరుచుకోవడానికి చాలా ఆలోచనలు చేసాడు త్రిమూర్తులు.
“ఇంతమంది పిల్లల్ని సాదాలంటే స్థిరమైన ఆదాయం లేకపోతే కష్టం. ఏదేనా వుద్యోగంలో చేరు” అన్నాడు తండ్రి. కొడుక్కి అంతమంది సంతానం కలగటం ఆయనకి చాలా సంతోషాన్నిచ్చింది.
“ఉద్యోగం అంటూ నేనే దేశంమీదకి బయల్దేరితే నా పిల్లలూ అదే దారిపడతారు. చెట్టుకొకడూ పుట్టకొకడూ ఔతారు. ఇక్కడే వుండి ఏదో ఒకటి చేస్తాను” అన్నాడు త్రిమూర్తులు. తండ్రి ఐదెకరాల పొలం కొడుకు పేరున రాసాడు. అది త్రిమూర్తులికి నిలదొక్కుకుని ఆలోచించుకోవటానికి అవకాశాన్నిచ్చింది. బట్టలకొట్టు తెరిచాడు.
“వ్యాపారాలు మన యింటావంటా లేవు. మనకేం చేతనౌతుందిరా?” అని తండ్రి ఎంత మొత్తుకున్నా వినలేదు.
కొట్లో ఏవో నాలుగురకాల చీరలూ పంచెలూ పెట్టడంతో వూరుకోలేదు త్రిమూర్తులు. ఏడాదికో రెండేళ్లకో ఒకట్రెండు జతలు కొనుక్కునే సామాన్యమైన వాళ్ళని ఎంచుకోలేదు అతను. డబ్బున్నవాళ్లనీ, అదో విలాసంగా, హోదాగా అనుకుని బట్టలు కొనుక్కునేవాళ్లని దృష్టిలో వుంచుకున్నాడు. చుట్టుపక్కల వూళ్ళతో మొదలుపెట్టి ఇతరరాష్ట్రాలకికూడా వెళ్ళి సరుకు కొనుక్కొచ్చేవాడు. మిల్లుబట్టలు చవగ్గా వచ్చేవి. అవి కొని వాటిమీద అద్దకం వేయించి తెచ్చేవాడు. నెమళ్ళూ, చిలకలు, హంసలు, పువ్వులు, అప్పట్లో అద్దకం అంటే. జనం ఎగబడిపోయేవారు. వచ్చిన సరుకు వచ్చినట్టే ఎగిరిపోయేది. సరుకొచ్చిందని వార్త పెడితే చాలు, ఎక్కడెక్కడివాళ్ళూ వచ్చి కొనుక్కునేవారు. పెళ్ళిళ్ళకి పట్టుచీరలు కంచినుంచీ నేయించుకున్నా, మిగతా అంతా ఇతని సరుకే, నాణ్యత, కొత్తదనం చూసి. కొడుకుని చూసి తండ్రే ఆశ్చర్యపోయాడు.
“తమ్ముళ్ళని నీకూడా తిప్పుకో” అని లక్ష్మమ్మ పిల్లల్ని చేరిక చెయ్యబోయాడు. ఆయనకంటే వాళ్ళు పిల్లలుగానీ త్రిమూర్తులికేమీ కారు.
“వాళ్ళు నాకు తమ్ముళ్ళు కారు. ఎవరంటే నేను చెప్పుకోలేను. అమ్మతో ఎంత మీకు సరిపడకపోయినా, మా గౌరవమర్యాదలుకూడా ఆలోచించాలికదండీ” అనేసాడు. ఆయన మళ్ళీ అడగలేదు.
నలుగురు ఆడపిల్లల్నీ చుట్టుపక్కల వూళ్ళలో ఇచ్చి చేసాడు త్రిమూర్తులు. ఆరుగురు కొడుకులకీ చిన్నప్పట్నుంచే కుటుంబసంపద గురించి చెప్పేవాడు. “అన్నదమ్ములన్నాక ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. ఒక్కమాటమీద వుండాలి” అని తరుచుగా చెప్పేవాడు. ఐదుగురుకొడుకులకి అతని మాటలు వంటపట్టాయి.
ఆరోవాడు మురళి మాత్రం, “ఇంతోటీ ఈ కొట్టొకటీ చూసుకోవటానికి ఇందరం కావాలా? ఈ పల్లెటూళ్ళో నేనుండను. నాది నాకు పంచిచ్చేస్తే పట్నం వెళ్ళి ఏదేనా వుద్యోగం చూసుంటాను” అని పంచుకునీ తుంచుకునీ వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి చూడలేదు. అతనికోసం త్రిమూర్తులి భార్య, తల్లి బెంగపెట్టుకున్నారు. భార్యది కన్నకడుపు కాబట్టి కాస్త ఎక్కువ దిగులు. మిగిలిన పిల్లలకోసం మనసు సరిచేసుకుంది. లేచి తిరిగింది. ఆ కొడుక్కోసం పడే బెంగ వుండివుండి ఒక బుడగలా లేస్తుంది. మళ్ళీ పేలిపోతుంది. కొన్ని కన్నీళ్ళు మనసులో నిండుతాయి. ఇంకో బుడగని ఎప్పుడో సృష్టిస్తాయి. త్రిమూర్తులు కొడుకుకోసం వాకబు చేయించాడు. అడ్రసేనా యివ్వకుండా ఇల్లు వదిలి, ఎక్కడికి వెళ్తున్నాడోకూడా యిదమిద్ధంగా చెప్పని కొడుకుగురించి అతనుమాత్రం ఏం చేస్తాడు? భార్యలాగే మనసు రాయి చేసుకున్నాడు. పుణ్యకార్యాల్లో అతనిపేరుకూడా చదివిస్తాడు. అతనికి పెళ్ళైందో లేదో తెలీదు. ధర్మపత్నీ సమేతస్య అనిపిస్తాడు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని మనసులో దీవిస్తాడు ఆ కొడుకుని. మిగతాకొడుకులు మాత్రం తండ్రితోనే వుండిపోయారు. ప్రగతినీ చూసారు, సంతృప్తినీ పొందారు.
ఇప్పుడు త్రిమూర్తులికి తొంభయ్యైదేళ్ళు. పదిమంది సంతానం, డబ్భైరెండుమంది మనవలూ, రెండువందల ఆరుమంది మునిమనవలూ వాళ్ళ పిల్లలు మరో నలభైమందీ అతని సంపద. వాళ్లలో మగసంతతివాళ్ళంతా యాభైకుటుంబాలవాళ్ళు వేర్వేరు ఇళ్ళలో ఒకచోటే కలిసి వుంటారు. అదే అవంతీపురం ఎస్టేట్స్.


దాదాపు గంటన్నర తర్వాత ఎస్టేట్స్ ముందు ఆగారు. డ్రైవ్ చేస్తూ ఎప్పుడు చెప్పాడో మరి, వీల్‍చెయిర్‍తో, సర్వెంటుతో గేటు దగ్గిర ఎదురు చూస్తోంది మాధవరావు భార్య రోహిణి. స్నేహితురాలికి ఇంకేం భయం లేదన్న నమ్మకం కలిగింది స్వప్నకి.
“ఈ వార్త తెలిసినప్పట్నుంచీ అలాగే బొమ్మలా వుందట. ఏడవనుకూడా లేదట. ప్రసూన వుందా? క్లినిక్కి తీసికెళ్ళు ముందు” అన్నాడు మాధవరావు.
“ఈ అమ్మాయెవరు?” స్వప్న గురించి అడిగిందావిడ.
“అమృత ఫ్రెండు. పొద్దుటినుంచీ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంది. మంచిపిల్ల. ఐనా ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలిద్దరూ ఏం చెయ్యగలరు?”
స్వప్న ఆవిడకి నమస్కరించింది.


“నేను వచ్చేదాకా వుండు స్వప్నా” అని, సర్వెంటుతో వీల్‍ఛెయిర్ నడిపించుకుంటూ వెళ్ళిపోయింది రోహిణి.
“పదమ్మా, అటువైపు కూర్చుందాం” అన్నాడు మాధవరావు. ఇద్దరూ కలిసి నడిచారు. పెద్ద మండువాయింటిని ఆనుకుని, కేంటిన్‍లాంటిదేదో వుంది. ఆ కేంటిన్ ముందు వేసి ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.
“వాష్‍రూం వుంది, ఫ్రెషై రామ్మా” అన్నాడు. నిజానికి చాలా అలిసిపోయింది స్వప్న. వెంటనే హాస్టల్‍కి వెళ్ళిపోవాలి. వార్డెన్ వచ్చేసి వుంటుంది. విషయంకూడా తెలిసి వుంటుంది. తనమీద కోపం వచ్చిందేమో! ఆవిడ భయం ఆవిడది. ఇన్‍మేట్ల విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా పోలీసుకేసులు పెడతారు. హాస్టల్‍మేట్స్ ఒకొక్కరు వస్తుండవచ్చు. ఈ విషయమే చర్చించుకుంటున్నారేమో! పాపం అమృత! ఆలోచనలతో మెదడంతా క్రిక్కిరిసిపోయి గ్లానిలాంటిది వచ్చింది. చల్లటినీళ్ళతో ముఖం కడుక్కుంటే బాగుంటుందనిపించి లేచి వెళ్లింది. అద్దంలో ముఖం చూసుకుంటే రోజంతా పడిన టెన్షన్ ప్రతిబింబించినట్టుంది. ఐనా ఆలోచనలు ఆగలేదు.
తర్వాతేంటి? ఏం జరుగుతుంది? అమృత జీవితం ఎంతలో ఎలా తలక్రిందులైంది? ఈ సమస్యల్లోంచీ ఎలా బైటకి వస్తుంది? ఆ అప్పులవాళ్ళు ఆమెని వదులుతారా? వెతికి పట్టుకుంటే? తనేం చెయ్యగలదు, ఈ విషయంలో? నాలుగుకోట్ల అప్పులట. ఏం చేసినా తీర్చలేదు అమృత. తన తండ్రిని సాయం చేయమని వప్పించి ఆ అప్పులవాళ్ళకి నచ్చజెప్పి సమయం తీసుకున్నాగానీ అంత అప్పు తీర్చగలదా? అసలు ఇంతవరకూ తను చేసిందే ఆయనకి ఇష్టం వుండదు. అందులో ఆయన తప్పు కూడా లేదు. తమది మధ్యతరగతి స్థాయి. ఒక చట్రంలో బిగించబడి ఉంటాడు తండ్రి. దాన్ని దాటి బయటికి రాలేడు. ఇటువంటి సమస్యలు ఆ ఫ్రేంలో ఉండవు. ఏమవబోతోంది అమృతకి? పరిస్థితిలోని నిస్సహాయత అర్థమై కడుపులోంచీ దు:ఖం తెర్లుకుని వచ్చింది. ఆపుకోలేకపోయింది.
పదినిముషాలు అలా ఏడ్చాక మనసు కొంత తేలికపడింది. చల్లటినీళ్ళతో ముఖం కడుక్కుని చున్నీతో బాగా తుడుచుకుని ఇవతలికి వచ్చింది. మాధవరావు ఆమె ముఖంలోకి చూసి చిన్నగా నిట్టూర్చాడు. టేబుల్ మీద ప్లేట్లో వేడివేది చపాతీలు, పొగలు కక్కుతూ ఆలుగడ్డ కూరా ఉన్నాయి.
“తిను స్వప్నా! పొద్దుటినుంచీ ఏమీ తిని వుండవు” అన్నాడు. తినాలనిపించలేదు ఆమెకి.
“చూడమ్మా! అమృతకేమీ భయం లేదు. వాళ్ల నాన్న నమ్మి నాచేతిలో పెట్టినందుకు పిల్లకి అన్యాయం జరగదు. చాలా పెద్ద వుమ్మడి కుటుంబం మాది” అన్నాడు. ఆఖరి మాటలకి స్వప్న ఆశ్చర్యంగా చూసింది. అమ్మానాన్నలతోపాటు బామ్మాతాతయ్యలు వుంటే వుమ్మడికుటుంబం అంటారని ఆమెకి తెలుసు. అందులో ఈ పెద్దతనమేమిటో అర్థమవలేదు.
“మా తాతగారు, మా నాన్నగారు, ఆయన తమ్ముళ్ళు నలుగురు, వాళ్ళ పిల్లలం, మా పిల్లలు, మాలో కొందరి మనవలు అంతా ఇక్కడే ఉంటాము. ఎక్స్టెండెడ్ జాయింట్ ఫామిలీ అంటారుకదా, యిప్పుడు? అలాంటిది. అమృత ఇంతపెద్ద కుటుంబంలో ఎక్కడో ఒకచోట ఇమిడిపోతుంది. తల్లిదండ్రులని కోల్పోయిన లోటు తీర్చలేనుగానీ, వాళ్లపరంగా ఎదురయిన సమస్యలని చట్టబద్ధంగా పరిష్కరించే మార్గం చూస్తాను” అన్నాడు మాధవరావు. స్వప్న ఆశ్చర్యంగా చూసింది. అంతమంది మనుషులు కలిసి ఒకచోట వుంటారా? ఎలా? అసలు ఆలోచనకికూడా అందలేదు. ఆ ఆలోచనకన్నా, ఆయన అమృత గురించి యిచ్చిన ధైర్యం ముఖ్యమైనదైంది.
“ఎలక్షన్లప్పుడు మా కుటుంబాన్నిగురించి పేపర్లో రాస్తార్లే. మాది పెద్ద ఓట్‍బేంకుకదూ? ఈసారి రాసినప్పుడు చదువుదువుగాని. అప్పుడప్పుడు వస్తుండు. సరదాగా మామధ్య గడపచ్చు” అన్నాడు.
“థాంక్స్ అంకుల్! అమృతకి ఏదో ఒకటి చెయ్యండి. మీరు కలగజేసుకోకపోతే ఏం చెయ్యాలో నాకుగానీ తనకిగానీ తోచేది కాదు. బహుశ: పోలీసులు పట్టుకెళ్ళడమో, లేకపోతే ఇదీ తన తన తల్లిదండ్రులలాగా ప్రాణం తీసుకోవటమో జరిగేది. మావన్నీ చాలా చిన్నచిన్న జీవితాలు, జీతాలు. అమ్మానాన్నల రక్షణలో వున్నామన్న ధైర్యంతో గడిపేస్తుంటాం. అలాంటి రక్షణకూడా డొల్లగా వుంటుందని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలుస్తుంటుంది. వందేళ్ళు పోగుచేసినా అమృత వాళ్ళు చేసిన అప్పులు తీరటమనేది జరగదు” నీళ్ళు నిండిన కళ్ళతో చేతులు జోడించి అంది స్వప్న.
“థాంక్స్ ఎందుకు? పొద్దుటినుంచీ తనని కాపాడి మాకు జాగ్రత్తగా అప్పగించావు. మీ ఇద్దరిమధ్యా ఎలాంటి స్నేహం ఉందో అలాంటిదే వాళ్ల నాన్నకీ నాకూ వుంది. నీ సందేహాలన్నీ తీరినట్టేనా? ఇంక టిఫిన్ తిను” అన్నాడు. స్వప్నకి మనసు తెరిపినపడ్డట్టయింది. తినాలనిపించకపోయినా ఆయన మాట కాదనలేక ఒక ముక్క తుంపి నోట్లో పెట్టుకుంది. రోహిణి వచ్చింది.
“అబ్బ! పొద్దుటినుంచీ ఒకటే టెన్షను. న్యూస్ ఛానెళ్ళు వూదరగొట్టేస్తున్నాయి” అంది. “అవంతీపురమంతా పొక్కిపోయినట్టుంది. రామారావుగారి చెల్లెలు అరుణ ఫోన్ చేసింది. వాళ్ళది రెండులక్షలదాకా వుందట. ఇంకెవరెవరు పెట్టుబడి పెట్టారో! ఈ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంక అంతా మనని అడుగుతారు” అంది.
“మరేం కంగారుపడక్కర్లేదు. శ్యామ్మోహన్ చూసుకుంటున్నాడు ఆ వ్యవహారాలన్నీ” జవాబిచ్చాడు మాధవరావు. వెళ్లి ఇద్దరికీ కాఫీ కలిపించుకుని వచ్చాడు. కాఫీ తాగుతూ తనే మళ్ళీ చెప్పింది రోహిణి. ” వచ్చినప్పుడు ఎలా బొమ్మలా వుందో అలాగే ఉంది. షాకులో ఉందని చెప్పి సెడెటివ్ ఇచ్చింది ప్రసూన . నిద్ర లేచాక వాస్తవంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామంది. దుర్గమ్మని దగ్గర కూర్చోబెట్టి వచ్చాను”
మాధవరావు ఇచ్చిన ధైర్యాన్ని గుండెనిండా నింపుకుంది స్వప్న. రోహిణి స్వప్న వివరాలు అడిగి తెలుసుకుంది. తల్లిదండ్రులు, చదువు, ఉద్యోగం, ఇలా. మాటల్లో పెట్టి ప్లేట్లో ఉన్నదంతా తినిపించింది. తర్వాత కాఫీ తెచ్చి యిచ్చింది.
“ఇంక వెళ్తాను ఆంటీ! వార్డెన్‍కి చెప్పి రాలేదు. తొమ్మిదింటి లోపల హాస్టల్లో ఉండాలి” అని లేచింది. మాధవరావు లెటర్‍ప్యాడ్ తెప్పించుకుని, జరిగిన అనూహ్యమైన సంఘటనల కారణంగా సొంత పూచీకత్తుమీద అమృతని తనతో తీసుకొచ్చినట్టుగా రాసి సంతకం పెట్టి ఇచ్చాడు.
“దీన్ని మీ వార్డెన్‍కి ఇవ్వు స్వప్నా! ఇంకా ఏదేనా వుంటే మాట్లాడమను”అన్నాడు.
విడిగా తన విజిటింగ్‍కార్డు స్వప్నకి ఇచ్చి, “ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. నీ ఫ్రెండ్‍ని చూడాలనిపించినప్పుడు రావటానికి మొహమాటపడద్దు. నిజానికి మేమెవ్వరం తనకి పెద్దగా తెలీదు. మాగురించి విని వుంటుంది. అంతే. నువ్వు మధ్యమధ్యలో పలకరించి, చూసి వెళ్తేనే తనకి బావుంటుంది” చెప్పాడు. క్లినిక్కి వెళ్లి అమృతని చూసి, బయలుదేరింది.
మాధవరావు డ్రైవర్‍కి చెప్తుంటే, “క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంకుల్. మళ్ళీ అతను అంత దూరం వెనక్కి తిరిగిరావాలి” మొహమాటంగా అంది. భార్యాభర్తలిద్దరూ వినలేదు. కారు కదిలేదాకా చూసి ఇద్దరూ మళ్లీ క్యాంటీన్ ముందు వచ్చి కూర్చున్నారు.
“ఒక్కరోజులో తలకిందులైపోయింది ఈ పిల్ల జీవితం. ఎలా దార్లో పడుతుందో!” అంది రోహిణి. ఆమె మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. కొంతకాలంక్రితం వెంకట్రావు అమృతని తమ ఇంటి కోడలిగా చేసుకోమని అడిగాడు. వీళ్ళకి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పైవాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయాయి. అంటే మిగిలివున్న విజయ్‍కి భార్యగా. భర్తకి ఎలాగా ఎలాంటి అభ్యంతరం ఉండదుకాబట్టి, కొడుకుని అడిగి చెప్తానంది తను. అలాగే విజయ్‍ని అడిగింది.
“ఇష్టమేనమ్మా! తను నాకు తెలుసు. కొంతకాలం వాళ్ల కాలేజీలో టీచ్ చేశాను. అలా పరిచయం. మంచి అమ్మాయి. నెమ్మదస్తురాలు” అన్నాడు. అలా చెప్తున్నప్పుడు అతని కళ్ళలో మెరుపు కనిపించింది. వాళ్ళ మధ్య పరిచయం అంతేనా, ఇంకా ముందుకి వెళ్ళారా? అనే ప్రశ్నలు ఆరోజుని ఎదురైతే ఇంత జరిగాక కూడా ఆ ఇష్టం అలాగే ఉంటుందా అనేది యిప్పుడు కళ్లముందు నిలిచిన ప్రశ్న. ఒకవేళ కొడుకు ఇంకా యిష్టపడుతునే వున్నా ఇన్ని అప్పులు, సమస్యలతో వాళ్ళ పెళ్ళి జరిగేదేనా? విజయ్ జీవితాన్ని చిక్కుల్లో పడేసే ఆ పెళ్ళి అవసరమా? అనేవి ఇంకొన్ని ప్రశ్నలు. భార్యాభర్తలు స్వప్న వెళ్ళిపోయిన చాలాసేపటిదాకా అలాగే కూర్చున్నారు. మాధవరావు ఫోను మోగింది.
“నే వెళ్ళి తన దగ్గిర వుంటాను. మెలకువ వస్తే ఎవరం దగ్గర లేకపోతే కంగారుపడుతుంది” అని లేచింది రోహిణి.
ఆయన ఫోనెత్తాడు. శ్యామ్మోహన్ దగ్గర్నుంచి. ఎదురు చూస్తున్నదే.
“ఇక్కడ బాగా గొడవలైపోయాయి మాధవా! జనం ఇంటిమీద పడ్డారు. అసలు డెడ్‍బాడీస్‍ని కదపనివ్వలేదు. అతికష్టమ్మీద ఇంటిని సీల్ చేసి డెడ్‍బాడీస్ తీసుకెళ్ళారు పోలీసులు. పోస్ట్‌‌మార్టం రిపోర్టు వచ్చేసరికి చాలా లేటైంది. బాడీస్ మార్చురీలోనే వున్నాయి. దహనం రేపే. పొద్దున్నే నువ్వు బయల్దేరి వచ్చెయ్” అన్నాడు శ్యామ్మోహన్. కొద్దిసేపు మౌనం.
“అలా ఎలా చేసాడురా, వాడు? నూరేళ్ళ జీవితాన్ని భ్రష్టుపట్టించుకున్నాడు. ఎన్నోసార్లు కలిసేం. ఎంతసేపూ చీటీ మొదలుపెట్టాం, చేరండి అనేవాడే తప్ప, ఎప్పుడూ ఈ అప్పులగురించి ఒక్కమాటకూడా అనలేదు. నాలుగుకోట్ల పై చిలుకురా అప్పులు. అసలంత డబ్బు ఎలా పుట్టించారో, పుట్టించినదాన్ని ఏం చేసారో తెలీడం లేదు” ఆ మౌనం తర్వాత ఆయన అన్న మాటల్లో అంతులేని ఆవేదన.
“కూతుర్ని నాకు అప్పగించాడు. వెళ్ళి తీసుకొచ్చాను” దానికి సంబంధించిన విషయాలు చెప్పాడు మాధవరావు.
“ఆ అమ్మాయికేదో వుద్యోగం వున్నట్టుందికదూ? పోన్లే, అదొకటి నయం. ఐనా బైటికి వస్తే ఆ పిల్లని బతకనివ్వర్రా!”
“ఆలోచిద్దాం ఏం చెయ్యాలో”
“విజయ్‍ని నాతో ఎందుకు పంపించావు? ఇలాంటివి అనుభవం లేదుకదూ, చాలా అప్‍సెటయాడు. నువ్వెలాగా రేపు వస్తావుకాబట్టి వాడిని తిరిగి వెళ్ళమన్నాను. ఇప్పుడే బయల్దేరాడు. గోవిందు, నారాయణాకూడా వచ్చేస్తున్నారు” అన్నాడు. వాళ్ళిద్దర్లో ఒకరు మాధవరావు తమ్ముడు, మరొకరు బాబాయ్ వరస.
“మొదట అమృతని తీసుకురావటానికి వాడినే పంపాలనుకున్నాను. ఇలాంటి విషయాల్లో కథలు అల్లేస్తారు. అందుకని నేను అటెళ్ళి వాడిని నీతో పంపాను”
ఆ తర్వాత వాళ్ళు చిన్నప్పటి విషయాలు మాట్లాడుకున్నారు. వెంకట్రావు, వీళ్ళిద్దరూ కలిసి రాజావారి స్కూల్లోనే చదువుకున్నారు. ఒకే తరగతి. వెంకట్రావుది మధ్యతరగతి కుటుంబం. మనిషికూడా పెద్ద చొరవగా వుండేవాడు కాదు. శ్యామ్మోహన్‍ తండ్రికూడా ప్లీడరే. తండ్రి వారసత్వాన్నే అతను అందిపుచ్చుకున్నాడు. మాధవరావువాళ్ళది అప్పటికే పెద్దకుటుంబం. ఇంట్లో పదిపాతికమంది పిల్లలుండేవారు. పెద్ద ఆవరణ. ఈ ఇద్దరూకూడా ఇతనింట్లోనే తిరిగేవారు.
పెళ్ళిళ్ళయాకకూడా వాళ్ళ స్నేహాలు కొనసాగినా, విశాల పెద్దగా కలవలేకపోయేది. వాళ్ళతో తమని పోల్చుకుని బాధపడేది. భర్త మెతకవాడవటం చూసి, కుటుంబపగ్గాలు తను తీసుకుంది. డబ్బు… డబ్బు… డబ్బు… అదే వేటలో వుండేది. చీటీలు, చీరల వ్యాపారం, ఫైనాన్స్ బిజినెస్ ఏవేవో చేసేది. స్నేహితులతో డబ్బు లావాదేవీలు వద్దని నిష్కర్షగా చెప్పేసాడు శ్యామ్మోహన్‍. వాళ్ళు నడిపే చీటీల్లోగానీ వ్యాపారాల్లోగానీ చేరలేదు. మాధవరావుకూడా అదే దూరంలో నిలబడ్డాడు. అందుకు చాలా కోపం వుండేది విశాలకి.
వాళ్ళకి డబ్బుందని గర్వమనో, తమకి ఎందుకూ కలిసి రారనో బలమైన ద్వేషం ఏర్పరుచుకుంది. మాధవరావు ఇంటికి రావటం ఏ ఫంక్షనుకేనా. అదికూడా అంటీముట్టనట్టు వచ్చి వెళ్ళేది. అమృతని ఒకసారో రెండుసార్లో తీసుకొచ్చింది బాగా చిన్నప్పుడు. పదోతరగతినుంచీ హాస్టల్లో వేయటంతో ఆ పిల్లని మళ్ళీ ఇంక చూడలేదు రోహిణి. ఆ చిన్నప్పటి ముద్దొచ్చే రూపమే ఆమెకి గుర్తు. వెంకట్రావుకి కూతురి గురించి ఏదో బెంగ వుండేది.
విజయ్‍కి చేస్తే పెద్ద కుటుంబంలో పడుతుందని అతను ఆశపడితే విశాల అసలా మాటే పడనివ్వలేదు.
“ఇలాంటి ఆలోచన మీకెలా వచ్చింది? వాళ్ళు ఎప్పుడేనా మనని గౌరవంగా చూసారా? అసలు విజయ్‍కి ఏముందని? పెద్దచదువా, వుద్యోగమా? ఈ వూరొదిలిపెట్టడట. ఇంక ఏం చూసి ఇవ్వాలి? ఆ మందలో పడి తింటున్నాడు. రోజులు వెళ్ళదీస్తున్నాడు” చాలా చులకనగా మాట్లాడి, “నా కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. దానికి అమెరికా సంబంధం చూస్తాను” అని తీర్మానించింది.
వెంకట్రావుకి వాస్తవాలు తెలుసు. మాధవరావు కుటుంబం తమకి అందనంత ఎత్తుని వుందని, వాళ్ళకి కొన్ని ఆదర్శాలు వున్నాయికాబట్టి సంబంధం కలుపుకోవటానికి తనకొక అవకాశం దొరికిందికానీ, లేకపోతే విజయ్‍కి తన కూతురు ఎందులోనూ సరితూగదని. భార్యకి ఆ అవగాహన వుందో లేదో అతనికి తెలీలేదు. పరిస్థితులు చెయ్యి జారుతున్నాయని అనిపించినప్పుడుమాత్రం భార్యకి తెలీకుండా రోహిణిని అడిగాడు, “అమృతని విజయ్‍కి చేసుకో అక్కా!” అని. మాధవరావు భార్యని అతను అలానే పిలుస్తాడు.


స్వప్న తిరిగి హాస్టల్‍ చేరేసరికి బాగానే చీకటి పడింది. ఆమెని దింపేసి డ్రైవర్ వెళ్ళిపోయాడు. వార్డెన్‍తోసహా అంతా హాల్లోనే వున్నారు. ఆమె అనుకున్నట్టు ఇదే విషయంగురించి మాట్లాడుకుంటున్నారు. స్వప్నని చూడగానే మాటలు ఆపేసి, కుతూహలంగా చూసారు. ఆమె నేరుగా వార్డెన్ దగ్గిరకి వెళ్ళి కూర్చుంది. మాధవరావ్ ఇచ్చిన లెటర్ తీసి యిచ్చింది. ఆమె దాన్ని తెరిచి చదివి,
“తను అవంతీ ఎస్టేట్స్‌వాళ్ళ అమ్మాయా?” ఆశ్చర్యంగా అడిగింది. “మరీ ఈ ఫ్రాడ్?”
“మాధవరావుగారు అమృతావాళ్ళ నాన్నగారి స్నేహితుడట మామ్! అమృత బాధ్యత తీసుకున్నారు. అంతే. వాళ్ళింటికి తనని తీసుకెళ్ళేటప్పుడు నన్ను వెంట రమ్మన్నారు. అమృత అసలు సెన్సెస్‍లో లేదు. తన పరిస్థితి చూసి వెంట వెళ్ళాను ” అంది స్వప్న.
“ఎలా వుంది, అమృత?”
“షాక్‍లో వుంది. నేను వచ్చేప్పటికి ఇంకా అలానే వుంది. వైద్యం చేయిస్తున్నారు.”
“అమృతకి ఈ విషయాలు, అంటే వాళ్ళ ఆర్థికపరిస్థితులవీ తెలీవా?”
“ఇలాంటివి పిల్లలతో చర్చించరుకద మామ్?” అంది స్వప్న.
“నువ్వు చాలా రిస్కు తీసుకున్నావు స్వప్నా! అలా కొత్తవ్యక్తిని ఎలా నమ్మి వెళ్ళావు? తీసుకెళ్ళింది సరైనవాళ్ళుగనుక సరిపోయిందిగానీ, లేకపోతే ఎన్ని చిక్కుల్లో పడేదానివో తెలుసా? ఇది లేడీస్ హాస్టల్. పోలీసులు, కేసుల్తో మాకూ చాలా సమస్యలు ఎదురయ్యేవి. టీవీ వార్తల్లో చూసినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి అలర్ట్ చెయ్యాల్సింది. మరొకరికి తెలీకుండా ఆమెని హాస్టల్‍నుంచీ వెళ్ళిపొమ్మనేదాన్ని. నీకేదైనా జరిగితే మీ పేరెంట్స్‌కి ఏం చెప్పాలి నేను? ఆడపిల్లలు మీరిద్దరూ కలిసి ఇంత పెద్ద విషయంలో ఏం చెయ్యగలమని అనుకున్నారు?” అంది వార్డెన్ మందలింపుగా. అది నిజమే కాబట్టి స్వప్న ఇంకేం మాట్లాడలేదు.
“సారీ మామ్!” అని వూరుకుంది.
ఎన్నో ప్రశ్నలు అందర్లో. ఏమైంది అంత డబ్బు? అమృతనే అంతా కట్టాలా? ఎక్కడినుంచీ తెస్తుంది? పోలీసు కేసౌతుందా? ఆమె భవిష్యత్తేమిటి? కొందరిది కుతూహలం. మరికొందరిది ఆరా. ఇంకొందరికి లోలోపలి ఆనందం. వెరసి ఇదంతా మనుషులుండే సమాజం.


పెద్దమండువా యిల్లు, త్రిమూర్తులు మొదట్లో కట్టించినది, కుటుంబం ఎంతగా పెరుగుతున్నా చాలాకాలం అందులోనే సర్దుకున్నారు. మండువా, వాకిలి, నాలుగు గదులు, వంటిల్లు వుండేవి. ఇంటిముందు పెద్దపెద్ద అరుగులు. పిల్లలు, ఆ అరుగులమీదే పెరిగారు. పెద్దయ్యారు. పెళ్ళిళ్ళుకూడా ఆ యింట్లోనే అయాయి. కోడళ్ళొచ్చారు. పాత వొరవడినే పాటించారు. సమస్య లేకపోయింది. వాళ్లకీ పిల్లలు పుట్టారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ల కోడళ్ళొచ్చారు. కొత్త ఆలోచనలు తెచ్చారు.
ఇల్లు ఇరకటం, ఆలి మరకటం అంటారు. ఇల్లు ఇరుగ్గా వుంటే అక్కడిది ఇక్కడా ఇక్కడిది అక్కడా నిరంతరం సర్దుకుంటూ వుండే ఆలి మర్కటంలాగే అనిపిస్తుంది. ఇంటియిరుకు గొడవలకి దారితీయరాదనీ, ఏ కుటుంబానికి ఆ కుటుంబానికే వేరే యిల్లుంటే గొడవలు వుండవనీ ఆలోచించి రెండు అంతస్తుల్లో పాతికయిళ్ళు ఫ్లాట్స్‌లా కట్టించాడు. టిఫెన్లూ భోజనాలూ అందరూ కలిసే చేస్తారు. త్రిమూర్తులి సంస్థానానికి పెద్ద వంటగదీ, దానికి ఆనుకుని భోజనాల హాలూ వుంటుంది. వంటవాళ్లున్నారు. ఆవరణలో మొదట్లో కట్టిన యిల్లు ఇంకా దృఢంగా అలాగే వుంది. త్రిమూర్తులు కొడుకులూ కోడళ్ళతో కలిసి అందులో వుంటాడు. వంటలూ, స్టోరూ అక్కడే. మిగతావారుమాత్రం వరసగా కట్టిన అపార్ట్‌మెంట్‍లో ఎవరి కుటుంబాలతో వారు వుంటారు. ఇప్పటికి సరిపోయేన్ని ఫ్లాట్లున్నాయి. అధునాతనంగా కొత్తటవరు కట్టించే ఆలోచనలో వున్నాడు. ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో ప్రతిపాదన ముందుకి సాగటంలేదు.
“చనిపోవాలన్న కోరిక మనిషికే కాకుండా మొత్తంగా ఒక సమాజానికి కూడా వుంటుందా?” అనేది గీత ప్రశ్న. ఇది అలాంటిదే. త్రిమూర్తులు తన తర్వాతి మూడు నాలుగుతరాలగురించి కలలు కన్నాడు. ఆలోచనలు చేసాడు. పథకాలు రచించాడు. త్రిమూర్తులి యింట్లోని ఇప్పటి తరానికి రేపు అనేది ఆలోచనల్లోకి రావటం లేదు.


ఇద్దరు కొడుకులు చెరోవైపూ చెయ్యి పట్టుకుని నడిపిస్తుండగా నెమ్మదిగా నడిచి వచ్చి భోజనాలగదిలో తన కుర్చీలో కూర్చుంటాడు త్రిమూర్తులు. మిగిలిన కొడుకులూ, ఐదుగురు కోడళ్ళూ వెనకాల వస్తుంటారు. చూడటానికి అదొక ఇంపైన దృశ్యం. దేవుడి వూరేగింపు జరుగుతుంటే నడిచి వచ్చే పెద్దల్లా వస్తారు అందరూ. వంట్లో ఓపిక వున్నరోజుల్లో మనవల్లోనో, మునిమనవల్లోనో చిన్నపిల్లల్ని ఎవరో ఒకర్ని దించకుండా ఎత్తుకు తిరిగేవాడు త్రిమూర్తులు. ఇప్పుడు తనే చిన్నపిల్లాడిలా అయాడు. ఆయనకి తీపిపదార్ధాలంటే చాలా యిష్టం. ఒక తీపి, కొద్దిగా అన్నసారం తీసుకుంటాడు. అంతకుమించి అరగదు. ఆయన భార్య పోయి పదేళ్లైంది.
రాత్రి భోజనాలదగ్గర కలుసుకున్నప్పుడు వెంకట్రావు గురించి మాట్లాడుకున్నారు. అతని ప్రస్తావన అప్రమేయంగా వచ్చింది. వెంకట్రావు వాళ్ళందరికీ తెలుసు. టీవీలో వచ్చిన వార్తలు అందరూ చూసారు. “నీకెందుకురా, ఈ గొడవలు? నాలుగుకోట్లంటే మాటలు కాదు. ఆ పిల్లని తీసుకొచ్చావు, నాలుగురోజులు మంచీచెడూ చూసి పంపేసెయ్” అన్నాడు మాధవరావు తండ్రి రఘునాథరావు. ఆయన త్రిమూర్తులి పెద్దకొడుకు. మాధవరావు ఆయనకి పెద్దకొడుకు.
“శ్యామ్మోహన్ వాళ్ళ డబ్బు వ్యవహారాలు చూస్తున్నాడు. ఇల్లుంది, ఇంకేమేం వున్నాయో చూద్దాం. దాన్నిబట్టి ఆ పిల్లనేం చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు మాధవరావ్.
“ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం? వెంకడికీ వాడి భార్యకీ బుద్ధిలేకపోయింది. ఈ డబ్బు లెక్కలవన్నీ అవనీ. తల్లిదండ్రులు చేసుకున్న అప్పులకీ వాళ్ళు మిగుల్చుకున్నవాటికీ చెల్లు పెట్టేసి అప్పుడు ఆలోచిద్దాం” నెమ్మదైన గొంతుకతో స్థిరంగా చెప్పాడు త్రిమూర్తులు. ఆయనే అలా చెప్పాక ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు. భోజనాలయ్యాయి. రోహిణి, అమృత దగ్గర వుంటానని లేచింది.
“నువ్వెందుకు పెద్దమ్మా! ఎవర్నేనా వుంచుదాం. సిస్టర్‍‍ని వుండమంటాను” అంది ప్రసూన.
“సిస్టర్నికూడా వుండమనుకానీ తెలిసినవాళ్ళం ఎవరం దగ్గర లేకపోతే ఎలా ప్రసూనా? ఏ రాత్రేనా మెలకువ వస్తే? జరిగినదేమీ చిన్నవిషయం కాదు” అంది రోహిణి.
“ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి మరి” చెప్పింది ప్రసూన.
రోహిణి వెళ్ళిపోయింది. అమృత ఇంకా నిద్రలోనే వుంది. అమృతని కనిపెట్టుకుని వుండమని సిస్టర్‍కి చెప్పి పక్క బెడ్‍మీద పడుకుంది తను. నిద్ర రావట్లేదుగానీ అంతా తమకి సంబంధం లేని విషయం. ఎలా ముగుస్తుందో తెలీదు. ఆ ఆలోచనలకి అలసటనిపిస్తోంది.
రాత్రి పదకొండైంది వెంకట్రావు ఇంటికి వెళ్ళినవాళ్ళు తిరిగి వచ్చేసరికి. చావింటినుంచీ తిరిగొచ్చారు. బాగా పెద్దకుటుంబం కావటంతో ఇలాంటి అవసరాలు తరుచుగా వుంటుంటాయి. అందుకు రెండు పెద్ద బాత్‍రూంలు వున్నాయి. ఆడవాళ్లకొకటి, మగవాళ్ళకి వొకటి. తుడుచుకోవటానికి తువ్వాళ్ళూ, స్నానం చేసాక కట్టుకోవటానికి ఉతికి ఆరేసిన బట్టలు అక్కడే అలమరల్లో వుంటాయి. ముగ్గురూ స్నానాలు చేసి, వంటగదివైపు వెళ్ళారు. వంటాయన ఎదురు చూస్తున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయిందని పాలు మాత్రం తాగి ఎవరి ఫ్లాట్స్‌కి వాళ్ళు వెళ్ళారు. అంత దగ్గరగా చావుని చూసి వున్నారేమో, ఎవరికి వారే మనసు చెదిరి వున్నారు. మామూలు చావులు కావవి. ఉరేసుకుని వికృతంగా మారిన ఇద్దరు మనుషులు, విధ్వంసమైన ఒక కుటుంబం.
విజయ్ వెళ్ళేసరికి మాధవరావ్ మేలుకునే వున్నాడు. స్నానం చేసి కట్టుకుని వచ్చిన పంచ మార్చుకుని మామూలుగా వేసుకునే షార్ట్స్, టీ షర్టులోకి మారాడు విజయ్.
“అమ్మేది?” అడిగాడు ఆమె కనిపించకపోవటంతో.
“అమృత దగ్గరుంది. ప్రసూన క్లినిక్‍లో వున్నారు ఇద్దరూ!”
“ఓమాటు అమ్మని చూసి వచ్చేస్తాను” అని వెళ్ళాడు.
చాలా అలసిపోయాడు విజయ్. అలసట శారీరకమైనదికాదు, మానసికమైనది. చూసిన దృశ్యాలేవీ మనసులోంచీ చెరిగిపోవట్లేదు. అమృతని చూడాలనిపించింది. కాలేజిలో చూసినప్పుడే ఇష్టం ఏర్పడిపోయింది. తర్వాత తల్లి ప్రతిపాదన ముందుకి వచ్చింది. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఈ పరిస్థితులు దేనికి దారితీస్తాయి? ఎలా తట్టుకుంటుంది అమృత? దగ్గరకి తీసి వోదార్చేందుకు ఆప్తులెవరున్నారు? ఆలోచిస్తునే క్లినిక్కి వెళ్ళాడు. నిద్రపోతున్న అమృతని కిటికీలోంచీ చూసి, వచ్చేసాడు. రోహిణి అతన్ని గమనించలేదు.
“రేపు దహనం కదు నాన్నా? అమృతని తీసుకెళ్తున్నారా?” అడిగాడు తిరిగొచ్చాక. అప్పటిదాకా ఆవిషయాన్ని గురించి ఇంకా అనుకోలేదు మాధవరావు.
“తల్లిదండ్రులుకదా? తీసికెళ్తేనే మంచిదేమో!” అతనే అన్నాడు.
“ఆ విషయం తెలిసినప్పట్నుంచీ కొయ్యబారిపోయి వుంది తను. ప్రసూన ఇచ్చిన ఇంజెక్షన్‍కి నిద్రపోయింది. ఇంకా లేచినట్టు లేదు. కదూ?”
“ఇంకా లేవలేదు. మీరు చెప్పింది నిజమేకానీ, మనతో తీసుకెళ్తేనే మంచిది. తల్లిదండ్రులుకదా? ఆఖరిచూపులేనా దక్కలేదన్న బాధ జీవితాంతం వుంటుంది” అన్నాడు విజయ్. “ఎవరెవరు వస్తున్నారు రేపు?” తనే అడిగాడు.
“ఇప్పటిదాకా తీసుకెళ్తున్నారా అన్నావు, ఇప్పుడు తీసుకొస్తున్నారా అనడుగుతున్నావు? అదేంటి నువ్వూ వస్తున్నావా?” మాధవరావ్ ఆశ్చర్యపోయాడు. కొడుకు మనసేమిటో అర్థమవ్వలేదు.
“ఎందుకో చాలా అలజడిగా వుంది నాన్నా! ఈ విషయంలో దూరంగా, నాకు పట్టనట్టు వుండలేకపోతున్నాను”
“అమ్మ అప్పట్లో నిన్నడిగిన విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నావా విజయ్?”
“నాకా అమ్మాయంటే అప్పటికే చాలా యిష్టం నాన్నా! ఇద్దరికీ పరిచయం కూడా వుంది. పెళ్ళి అనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే, ఒక ఆత్మీయురాలికి వచ్చిన కష్టంలా అనిపిస్తోంది. నాకు తెలిసిన వ్యక్తుల విషయంలో జరిగిన ఈ సంఘటనకూడా నన్ను కలవరపెడుతోంది. అంకుల్‍వాళ్ళూ అలా ఎలా చేసారు? దీంతో అమృతకి ఎంతవరకూ సంబంధం వుంటుంది? లీగల్‍గా అనే కాదు, నైతికంగా కూడా. డబ్బు పెట్టుబడి పెట్టినవాళ్ళు ఇంటిమీదికి వచ్చి తిట్టిన తిట్లు వింటుంటే హారిబుల్‍గా అనిపించింది. చిన్నచిన్న డబ్బులు పోగొట్టుకున్నవాళ్ళు సరే, పెద్దమొత్తాల్లో నష్టపోయినవాళ్ళు అమృతని వదులుతారా? మనం ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలం? ఈ పరిస్థితుల్లో తను వుద్యోగం చెయ్యటంకూడా కష్టమే” అన్నాడు విజయ్.
“శ్యామ్మోహన్ చూస్తున్నాడుకదా? ఇల్లుంది. రెండుకోట్లు చేస్తుంది. చావాలనుకున్నవాళ్ళు బయటెక్కడో ఆ పని చెయ్యక ఇంట్లో చేసారు. అనాలోచితత్వం అనేది వాళ్ల జీవితాలతోపాటు చుట్టూ వున్నవాళ్ళ జీవితాలనికూడా యిబ్బందిలో పడేస్తుంది. ఇప్పుడింక ఆ యిల్లు కొనడానికి ఎవరూ ముందుకి రారు. వచ్చినా నామమాత్రపు ధర పలుకుతుంది. ఇంకేమేం ఆస్తులున్నాయో ఏమున్నాయో చూద్దాం”
“ఏం చేసినా నాలుగుకోట్లనేది మామూలు కుటుంబంలో పుట్టడం చాలా కష్టం”
“ఇది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారంకాదుగానీ, పడుక్కోరా, ఇంక. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి” అన్నాడు మాధవరావ్.
విజయ్ తన గదిలోకి వెళ్ళబోతూ ఆగాడు.
“నాన్నా! మీకు అమ్మంటే చాలా యిష్టం కదా?” అడిగాడు.
“అదేం ప్రశ్నరా?”
“మీ పెళ్ళికన్నా ముందు తనెవరో మీకు తెలీదు. పెళ్ళి యిష్టాన్ని పుట్టిస్తుందా? లేక మనసులో పుట్టే అనేకానేక యిష్టాలని నియంత్రిస్తుందా?”
“రెండూను”
విజయ్ వెళ్ళిపోయాడు. మాధవరావ్ ఆలోచనలోపడ్డాడు. కొడుకు మనసేదో అర్థమయీ అవనట్టుగా వుంది. అమృత అంటే యిష్టమని చెప్పాడు. వెంటనే పెళ్ళి గురించి అడిగాడు. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. ఎప్పటికేనాసరే, అప్పులన్నీ తీరకుండా అమృతని కోడల్ని చేసుకోవడం అసంభవం. దాంతో ముడిపడివున్న అపఖ్యాతిని తన కుటుంబం మొయ్యలేదు. కుటుంబం తనొక్కడిదీ కాదు. ఇప్పటిదాకా ఎలాంటి మచ్చా లేనివిధంగా ఇంత పెద్ద కుటుంబాన్ని లాక్కొచ్చాడు తాతయ్య. వ్యాపారాల్లోగానీ, వ్యవహారాల్లోగానీ ఎక్కడా చిన్న తేడా కూడా రానివ్వలేదు. ఇంటిలెక్కలూ అలానే వుంటాయి. ఆయన పేరంటేనే నిజాయితీ. ఐనా ఈ విషయాలు ఆలోచించేందుకు ఇది సందర్భం కాదు. విజయ్ తన సంఘర్షణేదో బయట పెట్టాడు. కాదు. అన్యాపదేశంగా ఏదో చెప్పాడు. ఏమిటది?
అమృతని కోడలిస్థానంలో చూడమని. మాధవరావుకి అర్థమైంది. అంతేనా? ఆ పిల్లని తీసుకుని ఎటేనా వెళ్ళిపోతాడా? తన ఆఖరి పినతండ్రి చేసాడట అలాంటి పని. ఈ మనుషులు అక్కర్లేదని వెళ్ళిపోయాడట. మళ్ళీ తిరిగి చూడలేదు. అప్పటి పరిస్థితి వేరు. తమ కుటుంబానికి ఈ పరపతి లేదు. ఇప్పుడలా కాదు. త్రిమూర్తులంటే అవంతీపురంలోనూ సగం హైద్రాబాదులోనూ తెలుసు. విజయ్ వెళ్ళటం అంత గౌరవంగా వుండదు. విజయ్ అలాంటి పని చెయ్యగలడా? అతని మనసు బరువెక్కింది. పిల్లలు కుటుంబగౌరవాన్ని నిలబెట్టాలనే అందరు తల్లిదండ్రులూ కోరుకుంటారు. దానికి అతను మినహాయింపు కాదు.


రాత్రి పన్నెండు దాటింది. విజయ్ చూసి వెళ్ళి అప్పటికి గంట.
హాస్పిటల్ బెడ్‍మీద నెమ్మదిగా కదిలింది అమృత. పల్చటి వెలుతురు గదంతా పరుచుకుని వుంది. బెడ్ పక్కని కుర్చీలో కూర్చుని సిస్టర్ కునికిపాట్లు పడుతోంది. పక్క మంచంమీద రోహిణి నిద్రలో వుంది. గాఢనిద్రేమీ కాదు. సిస్టర్ వుందికదాని చిన్నకునుకు తీసిందంతే.
ఒక్కసారి వులిక్కిపడ్డట్టు లేచి కూర్చుంది అమృత. ఎక్కడుందో ఏం జరిగిందో కొద్దిక్షణాల అయోమయం తర్వాత నెమ్మదిగా ఒకొక్కటే గుర్తొచ్చాయి. ఆ గుర్తు రావటం చెళ్ళుమని వీపుమీద బలంగా చరిచినట్టు. కొన్నిగంటలుగా గడ్డకట్టుకుపోయిన దు:ఖం పెద్ద కెరటంలా విరుచుకుపడింది. రోహిణికి మెలకువ వచ్చేసింది. ఆమె పక్కని వచ్చి కూర్చుని దగ్గరకి తీసుకుంది. జుత్తు సరిచేస్తూ, వీపు నిమురుతూ సంభాళించే ప్రయత్నం చేస్తోంది. ఎంత ఏడిస్తే ఆ దు:ఖం చల్లారుతుంది?
సిస్టర్ గ్లాసులో పోసి మంచినీళ్ళు తీసుకొచ్చింది.
“ప్రసూనమ్మని పిలవమంటారా?” ఇస్తూ అడిగింది. అక్కర్లేదన్నట్టు తలూపి, నీళ్ళు అందుకుంది రోహిణి. గ్లాసు నోటికి అందిస్తే అతికష్టమ్మీద నాలుగుగుక్కలు తాగింది అమృత. ఉక్కిరిబిక్కిరైపోయింది. దు:ఖం ఉగ్గబట్టుకోలేనంత. బయటపెట్టలేనంత. గుండెల్లో నిలవలేనంత. మనసే పట్టనంత. వళ్ళంతా కదిలిపోతోంది. భుజాలు, డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి. దవడలు కొట్టుకుంటున్నాయి.
“ఎలాగే చంద్రకళా, ఈ పిల్లని పట్టుకోవటం?” నిస్సహాయంగా అడిగింది రోహిణి. ఆమెకీ కళ్ళనీళ్ళు తిరిగాయి.
“డాక్టరమ్మ వస్తే మళ్ళీ ఏదేనా మందిస్తుంది” అంది సిస్టర్.
“రేపు దహనానికి తీసుకెళ్ళాలి. మళ్ళీ మత్తిస్తే ఎలా? ఐనా కడుపులో దు:ఖాన్ని మత్తు తీసెయ్యదుకదా? ” అంటూనే ఫోను అందుకుని, భర్తకి రమ్మని ఫోన్ చేసింది. అతను వస్తూ ప్రసూననీ వెంటబెట్టుకుని వచ్చాడు. మంచినిద్రలోంచీ లేచి వచ్చినట్టుంది ప్రసూన, కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వున్నాయి.
“అమృతా! కూల్. చూడు, నేను మాధవరావుని. ఇక్కడికి వచ్చినప్పుడు బోల్డ్‌గానే వున్నావుకదా?” ఎన్నోవిధాల మాట్లాడించే ప్రయత్నం చేసాడు మాధవరావు.
“షాక్‍లోంచీ బైటికి వచ్చింది. ఏడవనివ్వండి పెదనాన్నా! అదే మంచిది ” అంది ప్రసూన. దాదాపు రెండుగంటలదాకా ఆ వుద్వేగం ప్రవాహంలా కొట్టుకొస్తునే వుంది.
“నేనుకూడా చచ్చిపోతాను” అంది ఇంకా వొణుకుతునే.
“అలాగే చచ్చిపోదువుగాని. రేపు అమ్మావాళ్ళని చూడటానికి వెళ్ళాలి. వాళ్ళకి చెయ్యాల్సినవన్నీ చేసాక అప్పుడు. ఐనా చచ్చిపోయి ఏం సాధిస్తావు? మీ నాన్నేం సాధించాడు?” మృదువుగా అడిగాడు మాధవరావ్. తండ్రి మాట ఎత్తగానే మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చింది అమృతకి.
చంద్రకళ పాలు గ్లాసులో పోసి తీసుకొచ్చింది.
“కొంచెం తాగు అమృతా! రేపటికి ఓపిక రావాలికదా?” అని బలవంత పెడితే రెండుగుక్కలు తాగి వదిలేసింది. ఏడుస్తూ పక్కమీదికి వొరిగిపోయింది. ఆమెని చూస్తుంటే జాలేసింది రోహిణికి. ఇక్కడ ఎవరూ ఆమెకి ఏమీ కారు. తమతో చనువు లేదు. తండ్రిద్వారా తమగురించి విని వుంటుంది. అంతే. తామైనా మానవతాదృక్పథంతోనో స్నేహధర్మంతోనో తీసుకొచ్చారు. దు:ఖంలో ఆమె అనుభవిస్తున్న గాఢత తమకి లేదు, వుండదు. అలాంటప్పుడు తమ వోదార్పు ఆమె మనసుని ఎందుకు తాకుతుంది?
“అలా వదిలెయ్ పెద్దమ్మా! అవసరమైతే సెలైన్ పెడదాం” అంది ప్రసూన.
“రేపు మాతో తీసుకెళ్ళాలే. ఊరుకోబెట్టడం ఎలాగో అర్థమవటం లేదు” అంది రోహిణి.
“కార్లోనేగా వెళ్ళేది? మరేం పర్వాలేదులే. ఇప్పుడు నువ్వేం చెప్పినా తను వినదు. జాగ్రత్తగా గమనించుకో. అంతే” అని, “నేను వెళ్ళనా? ఉండనా?” అడిగింది.
“నువ్వెందుకమ్మా? ఇందాకా చంద్రకళ నిన్ను పిలవనా అని అడిగితేనే వద్దన్నాను. పెదనాన్న వెంటబెట్టుకుని వచ్చారు. వెళ్ళు, వెళ్ళి పడుకో” అంది రోహిణి. ప్రసన్న కదిలింది.
“దింపేసి వస్తాను” అని వెంట వెళ్ళాడు మాధవరావు.
“నాలుగుకోట్లట పెదనాన్నా, వాళ్ళు ముంచినది. మీరెందుకు తీసుకొచ్చారు, ఈ అమ్మాయిని? ఎలా హేండిల్ చేస్తారు పరిస్థితిని? అమృత మన దగ్గర వుందంటే అంతా మనింటిమీదికి వస్తారేమో! ఇందులో మన చెయ్యీ వుందంటే?” అడిగింది ప్రసూన.
“చూస్తూచూస్తూ ఆడపిల్లని అలా వదిలెయ్యలేంకదే? కొద్దిపాటి ఆస్తులేవో వున్నట్టున్నాయి. అవేవో గట్టి చేసి తండ్రి వ్యవహారాలతో తనకే సంబంధం లేదని ఈ పిల్లచేత స్టేట్‍మెంటు ఇప్పించి ఎక్కడికో ఒకచోటికి దూరంగా పంపించేస్తే సరిపోతుంది”
“పెద్దతాతయ్యకూడా అలానే అన్నారు. ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తామని. మరి కన్న తల్లిదండ్రులకి ఆ ఆలోచన వుండక్కర్లేదా? ఐనా కొద్దోగొప్పో వుందంటున్నారు, అవి అమ్మి, అప్పులు వాళ్ళే తీర్చుకోవచ్చుకదా? చావటం దేనికి?”
“శక్తికి మించిన బరువులు ఎత్తుకున్నప్పుడు కుదురు తప్పడం సహజంకదా?”
ప్రసన్నని ఇంటిదగ్గర వదిలేసి మాధవరావు మళ్ళీ వచ్చేసరికి అమృత ఇంకా ఏడుస్తునే వుంది. జాలిగా ఆమెని ఒకసారి చూసాడు. పక్కనే కూర్చుని తలనిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తోంది రోహిణి.
“పెళ్ళి యిష్టాన్ని పుట్టిస్తుందా లేక అనేకానేక యిష్టాలని నియంత్రిస్తుందా అని అడిగేడు నీ పుత్రరత్నం” అన్నాడు మాధవరావు భార్యతో. తామిద్దరూ మాట్లాడుకుంటే ఆ అమ్మాయి ధ్యాసమళ్ళుతుందేమోనని ఆలోచించాడు.
“అదేమిటి?” అడిగింది రోహిణి.
“ఆలోచించాల్సిన విషయమే” అన్నాడు. ఇంకొద్దిసేపు అవీయివీ మాట్లాడుకున్నారు. ప్రయోజనం లేకపోయింది. అమృత తన లోకంలో తనుంది.
“కాసేపు పడుకోండి. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. ఎన్నింటికట?” అడిగింది రోహిణి దహనాన్నిగురించి.
“పది దాటుతుంది” అన్నాడు మాధవరావు. వేరేగదిలోకి వెళ్ళాడాయన. రోహిణిమాత్రం అలాగే కూర్చుంది.
ఆ రాత్రి నిద్రపోని మరోవ్యక్తి త్రిమూర్తులు. భార్య పోయినప్పట్నుంచీ చాలా వెల్తిపడుతున్నాడు. పద్ధెనిమిదేళ్ళ వయసులో ఆయనకి పెళ్ళైంది. అప్పట్నుంచీ ఎన్నో కలలు, ఆలోచనలు, ప్రణాళికలు. పెద్దకుటుంబం ఏర్పరుచుకోవాలని, దాన్ని నిలబెట్టుకోవాలని. ఏది చేసినా ఇద్దరూ కలిసి చేసారు. మనసులో వుండే భావాలన్నీ మాటలరూపంలో ఒకరినుంచీ ఇంకొకరికి చేరేవి. ఇప్పుడు ఆ మాట్లాడే మనిషి లేక వెల్తి. వృద్ధులు అనుభవించే సమస్యల్లో ఇది చాలా పెద్దది. మాట్లాడ్డానికి సమానస్థాయికి చెందిన తోడు లేకపోవటం చాలా పెద్ద కష్టం.
ఇద్దరో ముగ్గురో కొడుకులు ఆయనదగ్గరే పడుకుంటారు. రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడతారు. రోజంతా జరిగిన విషయాలు చెప్తారు. ఆరోజుని ఆయన అనుభవించినది విచిత్రమైన స్థితి. కొడుకులు మాటలు ఆపేసాకకూడా ఆయన మెలకువగానే వున్నాడు. ఎప్పటెప్పటి విషయాలో గుర్తొచ్చాయి.
మనిషికి ఏ మూడు నాలుగేళ్ళకో జ్ఞాపకాలు మొదలౌతాయట. వికాసం వచ్చినప్పట్నుంచీ రోజుకి కొన్నివేల ఆలోచనలు సాగుతుంటాయి. ఈ ఆలోచనల్లో అధికభాగం అప్రధానమైనవి. పుట్టి, పువ్వులమీది పుప్పొడిలా రాలిపోతాయి. మిగిలినవాటిల్లో చాలావరకూ సుదూరమైన జ్ఞాపకాలతో మొదలుపెట్టి క్షణంక్రితంవరకూ జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంటాయి. త్రిమూర్తులి ఆలోచనలు సుదూరగతంలోని కొన్ని సంఘటనల దగ్గర ఆగాయి. మనసంతా పరితాపం నిండిపోయింది.
“తను అలా ఎలా చెయ్యగలిగాడు?” దిగ్భ్రాంతి, అపనమ్మకం.
“రఘూ!” పెద్ద కొడుకుని పిలిచాడు.
“నాన్నగారూ!” అన్నాడు.” ఇంకా నిద్రపోలేదా, మీరు?” అడిగాడు.
“నీకెందుకు నిద్రపట్టలేదు?” ఎదురు అడిగాడు త్రిమూర్తులు.
“మాధవ చేసిన పని తాలూకూ పర్యవసానం ఎలా వుంటుందో వూహకి అందటం లేదు”
“వాడూ, శ్యామ్మోహనూ అంత తెలివితక్కువవాళ్ళు కాదు. వాళ్ల ఆలోచనలు వాళ్ళకి వుంటాయి. తల్లిదండ్రులు చేసిన తెలివితక్కువపనికి పిల్ల బతుకు నాశనం కావాలా? నీ కొడుక్కి అంత గుండెధైర్యం వున్నందుకు సంతోషించు”
రఘునాథరావు మాట్లాడలేదు. అటు కొడుకు తెగించి చేసాడు. ఇటు తండ్రి సమర్ధిస్తున్నాడు. తనెందుకు భయపడుతున్నాడు? ఇది తన నైజమా? కష్టం వస్తే భయపడటం తన నైజమా? తన రక్తంలో జీర్ణించుకుపోయి వుందా? ఒక పెద్ద ప్రశ్న అతనిముందు. దానికి జవాబు రాబోయేకాలం వెతుక్కుంటుంది.
“రేపు ఎవర్నేనా పత్తిపాడు పంపించగలవా?” కొద్దిసేపటి తర్వాత అడిగాడు త్రిమూర్తులు.
“పత్తిపాడా? ఎందుకు?” కొడుకు ఆశ్చర్యం.
“మనింటి పిల్లని ఆ వూళ్ళో యిచ్చాము”
“మనింటి పిల్లనా? ఎవర్ని?! “
“పిల్లంటే పిల్ల కాదులేరా! నీకన్నా పెద్దదే. ఆవిడ గురించి వాకబు చేసి తెలుసుకోవాలి. ఒకవేళ బతికి వుండి కదలించగలిగే స్థితిలో వుంటే ఇక్కడికి ఓమాటు జాగ్రత్తగా తీసుకురావాలి” అన్నాడు త్రిమూర్తులు.
ఎవరని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు ఆ డబ్భయ్యైదేళ్ళ పెద్దకొడుకు. మర్నాడు భార్యని అడిగాడు. “పత్తిపాడులో మనవాళ్లెవరేనా వున్నారా? అక్కడికి పిల్లనిచ్చానంటారేంటి, నాన్న? అసలు ఆ వూరే మనింట్లో సంబంధాలకి నిషిద్ధం. నాకు తెలిసి అక్కడ్నుంచీ పిల్లని తెచ్చుకోలేదు, అక్కడికి ఎవర్నీ యివ్వలేదు”
ఆవిడ భర్తకేసి నిశితంగా చూసింది. “మీ తాతగారికి మరో ఆవిడ వుండేవారు. ఆవిడ కూతుర్ని అక్కడ యిచ్చారట. అందుకే మామగారు పత్తిపాడు సంబంధాలు వద్దన్నది. ఒకసారి మీ అమ్మ చెప్పారు” అంది.
“నాకింత వివరంగా తెలీదు” అన్నాడతను. ఇన్నేళ్ళు గడిచిపోయాక కాలగర్భంలో కల్సిపోయిన ఆ బంధుత్వాన్ని తండ్రి ఎందుకు వెలికి తీయాలనుకుంటున్నాడు? ఆవిడ యింకా బతికే వుందా? తిరుగుతోందా? రమ్మంటే వస్తుందా? వచ్చాక? సాఫీగా సాగే ఆలోచనకి ఏ చిన్న ఎదురుగాలి తాకినా అది ప్రశ్నగా మారిపోతుంది. అతని ఆలోచనలు ప్రశ్నలుగా మారుతున్నాయి.


అవంతీపురంకోటలో కూర్చుని రామారావు కూతుర్తో పెళ్ళి విషయం మాట్లాడిన మర్నాడే లక్ష్మి ఆయన యింటికి వచ్చింది. ఈ యిద్దరు అన్నాచెల్లెళ్ళూ ఒకరి ఆలోచనలు మరొకరు అందిపుచ్చుకున్నట్టు ప్రవర్తించడం యశోదకి ఎప్పుడూ ఆశ్చర్యమే. గీత స్నేహితులతోకలిసి సినిమాకి వెళ్ళింది. కృష్ణ మునిసిపల్ గ్రౌండుకి వెళ్ళాడు. ఇంట్లో భార్యాభర్తలిద్దరే వున్నారు. మాట్లాడుకోవటానికి అనువుగా వుంది. అలవోక కబుర్లయ్యాయి. అతిథిమర్యాదలయ్యాయి.
“నీకు మాయింటి విషయాలన్నీ తెలిసినవేకదన్నయ్యా! బావ ఏదీ పట్టించుకోరు. ఆఫీసుకి వెళ్ళి రావటం, జీతం తెచ్చి నా చేతిలో పెట్టడంతో ఆయన బాధ్యత సరి. నువ్వు పక్కని నిలబడటంచేతగానీ లేకపోతే ఈ సంసారం వొడ్డుకి చేర్చడం నావల్ల అయేది కాదు. పిల్లల చిన్నప్పుడంటే సరిపోయింది. ఇప్పుడింక వాళ్ళూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి కాస్తంత బాధ్యతలు అప్పజెప్తే బావుంటుందని నా ఆలోచన. వాసుకి పెళ్ళి చేసి కోడల్ని తెచ్చుకుంటే నాకు ఆసరా ఔతారనుకుంటున్నాను” అంది.
యశోద ఆశ్చర్యాన్ని ఆపుకుని భర్తకేసి చూసింది. ఇప్పటికిప్పుడు పెళ్ళి చెయ్యాలంటే ఈ సంబంధం ఒక్కటే తమకి అనువైనది. వాసు గవర్నమెంటు వుద్యోగం చేస్తున్నాడు. పిల్లవాడు బావుంటాడు. కలుపుగోలు మనిషి. పెద్ద ఆస్తిపాస్తులనికాదుగానీ, తమకి వున్నట్టే స్వంతయిల్లుంది వాళ్ళకి. లక్ష్మి భర్తకి ఇంకా రెండుమూడేళ్ల సర్వీసుంది. ఆమెకూడా ఆడబడుచునన్న దర్పం చూపించదు.
“వాడితో అంటే ఇప్పుడే పెళ్ళేంటని చాలా గొడవ చేసాడు. చివరికి గీతని తప్ప ఇంకెవర్నీ చేసుకోనని తేల్చాడు” ఆగింది లక్ష్మి.
మొదటే యశోద నిండా ఆశ్చర్యంలో వుంది. ఈ మాటల్తో రామారావుకూడా ఆశ్చర్యపడ్డాడు. ఇటు గీత వాసుని చేసుకుంటానంది. అటు వాసుకూడా అలాంటిమాటే అంటున్నాడు. ఇద్దరికీ మధ్యని ఏదేనా నడిచిందా? ఒకరికొకరు చెప్పుకున్నారా?
“నీ కూతుర్ని కోడల్ని చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీక్కూడా యిష్టమైతే ముహుర్తాలు పెట్టుకుందాం. అలాకాకుండా నీకు వేరే ఆలోచనలేవైనా వుంటే చెప్పు, నేను వాసుకి నచ్చజెప్పుకుంటాను” అంది.
“గీత పెళ్ళి ఆలోచన మాకూ వుంది లక్ష్మీ! నాక్కొంచెం వ్యవధి యివ్వు” సాలోచనగా అన్నాడు రామారావు. అతనలా ఎందుకన్నాడో ఆమె గ్రహించింది. తన కొడుకొక్కడే కాదు, ఇంకా వరసైనవి చాలా సంబంధాలున్నాయి ఆయన చేతిమీద. మొదటిది ఆయనొక నిర్ణయం తీసుకోవడం, రెండవది మిగిలినవాళ్ళకి కోపాలు రాకుండా నచ్చజెప్పుకోవడం అనే రెండు సమస్యలు వున్నాయి ఆయనముందు. మరికొద్దిసేపు వుండి వెళ్ళిపోయింది. కూతురి పెళ్ళివిషయం తోసుకొస్తోందని భార్యాభర్తలిద్దరికీ అర్థమైంది.
మరుసటిరోజు పెద్దచెల్లెలు ప్రమీల యింటికి వెళ్ళాడు. ఆమెకూడా వుద్యోగం చేస్తుంది. ముగ్గురు పిల్లలు వాళ్ళకి. ఇద్దరు మగపిల్లలు, మధ్యలో ఆడపిల్ల. మగపిల్లలిద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. ఆడపిల్ల సిటీలో హాస్టల్లో వుండి ఎమ్మే చదువుతోంది. ఒకేసారి అందుకున్న ముగ్గురి చదువుల ఖర్చుతో వుక్కిరిబిక్కిరిగా వున్నారు వాళ్ళు.
“దానికిప్పుడేమంత వయసుందని అన్నయ్యా, పెళ్ళికి తొందరపడుతున్నావు? ఈరోజుల్లో పద్ధెనిమిదేళ్ళకీ ఇరవయ్యేళ్ళకీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నవాళ్ళెవరు? డిగ్రీతో చదువు మానిపించేసావు. దానికి ఆ వుద్యోగం అవసరమా? సుమతితోపాటు హాస్టల్లో వేస్తే ఇద్దరూ కలిసి చదువుకునేవారు” అంది, గీతకి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నానన్న ఆయన ప్రతిపాదన విని. పైకలా అందిగానీ లోపలెక్కడో చురుక్కుమంది. ఆమె కూతురు, గీతకన్నా పెద్దది.
రామారావు నవ్వాడు. “ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసాను. ఇది ఏడోది. మీరంతా పెద్దచదువులేమీ చదవలేదు. సుఖంగానే వున్నారు. మీకులాగే దీన్నీ డిగ్రీ చదివించాను. పెద్దప్రయత్నాలేమీ లేకుండానే వుద్యోగం వచ్చింది. ఇక్కడేకాబట్టి చేస్తోంది. పెళ్ళయాక వచ్చేవాళ్లు చెయ్యమంటే చేస్తుంది. లేకపోతే లేదు. పెళ్ళి చేసి పంపడం నా బాధ్యత. దీని తర్వాత ఇంకా కృష్ణ వున్నాడు”
“ఎవరేనా వున్నారా, నీ దృష్టిలో?” అనుమానంగా అడిగింది.
“ఇంకా ఎవర్నీ అనుకోలేదు ప్రమీలా! లక్ష్మి వాసుకి అడిగింది. నీ అభిప్రాయంకూడా తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు.
“మాకింకా ఇప్పుడే అలాంటి ఆలోచనలు లేవు. సుధీర్ పైనలియర్లో వున్నాడు. ఇదయాక పీజీ చేస్తానంటున్నాడు. సుమతికి చెయ్యకుండా వాడికి చెయ్యలేం. దాని చదువు ఇంకో ఏడాది వుంది. ముగ్గురు పిల్లల చదువులు ఒక్కసారి సాగుతున్నాయంటే మాకూ కొంచెం వూపిరి పీల్చుకునే వ్యవధి కావాలి. ఎంతలేదన్నా వాడు స్థిరపడటానికి ఇంకో ఐదారేళ్ళు పడుతుంది. అప్పటిదాకా మీరు ఆగుతారా? ఆగేమాటైతే బావని కనుక్కుని చెప్తాను. ముందు తాంబూలాలు పుచ్చుకుని పెళ్ళి తర్వాత చేద్దాం. అలా కాదంటే రవికి వాళ్ల మామగారు చదువు చెప్పించినట్టు నువ్వూ నీ అల్లుడికి చెప్పించుకో. సుమతి చదువవగానే ఇద్దరికీ కలిపి ఒక్కసారి చేసేద్దాం” అంది అప్పటికప్పుడు తోచిన ఆలోచనల్ని జాగ్రత్తగా మాటలుగా పేరుస్తూ. చెల్లెలి లౌక్యం రామారావుని బాధపెట్టింది.
“ఆలోచించు అన్నయ్యా! గీత మాకు పరాయిది కాదు. సుధీర్ పెద్ద చదువులు చదివాడంటే ఆ ఫలితం అనుభవించేది అదే. వాసుదేం వుంది. క్లర్కేకదా?” అంది.
అర్థమైంది. మెడిసినంటే ఏదోఎంబీబియస్ చదివి బోర్డు కట్టడం కాదు. ఎమ్మెసో, ఎండీనో చెయ్యాలి. ఆ చదువు తను చెప్పించగలిగితే బావుంటుంది. మరి తన కొడుకు? గీతా వాసూ ఒకళ్ళంటే ఒకళ్ళకి యిష్టం అని బయటపెట్టుకున్నారు. మరెందుకు వచ్చినట్టు తను? మీకు మీరే నిర్ణయించుకుంటారా, కనీసం నాతో అనద్దా అనే నెపం మీదపడకుండా వుండేందుకు వచ్చాడు. చెల్లెలు మరోదార్లో వస్తోంది.
“అంతంత చదువులకి నేను తూగలేను ప్రమీలా! నీకు తెలీనిదేం వుంది? మంచికో చెడుకో చదువు ఆపేసి అది వుద్యోగంలో చేరింది. ఈడొచ్చిన పిల్లని పెళ్ళి చెయ్యకుండా ఎక్కువరోజులు యింట్లో పెట్టుకోలేము. వాసుకి లక్ష్మి అడిగింది. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు.
“అంటే నిర్ణయించుకునే వచ్చావా, అన్నయ్యా?” సూటిగా అడిగింది. రామారావు విషయాన్ని బైటపెట్టలేదు. ప్రమీల తన తర్వాత తనంతటిది యింట్లో. పెద్దకూతురు. ఆమె పెద్దరికం ఆమెది. ఆమెని వప్పించకుండా ముందుకి వెళ్ళలేడు.
“ఇంకా లేదమ్మా! సుధీర్ ఎంబీబియెస్ అవగానే ప్రాక్టీసు మొదలుపెడితే పెళ్ళి చెయ్యచ్చు. గీతకెలాగా వుద్యోగం వుందికాబట్టి వాడి ప్రాక్టీసు అందుకునేదాకా సర్దుకుంటారని అనుకున్నాను”
“వాడు ఎమ్మెస్ చదవాలని పట్టుదలగా వున్నాడు. బావకికూడా అలానే వుంది. ఏముంది ఈ చిన్నచిన్న వుద్యోగాల్లో? మనమందరం గుమస్తా వుద్యోగాలు చేసి ఏం ఒరగబెడుతున్నాం? పెద్దచదువులు చదివే వీలు మనకి లేకపోయింది. మా సరదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళని చదివిస్తున్నది అందుకే. చదువుకోవాలన్న మా కోరిక వాళ్ళద్వారా తీరుతుందని. పిల్లలు తెలివైనవాళ్ళు. ఎంతదాకా చదివితే అంతదాకా చదివిస్తాం. ఒకసారి పెళ్ళనే ఝంఝాటంలో పడితే ఇంక అంతే. సుధీర్ చదువు ఆగకూడదు”
“సరేనమ్మా! నీ అభిప్రాయం తెలిసింది. నా శక్తీ నాకు తెలుసు. నాన్న నా పంథొమ్మిదేళ్ళ వయసులో పోయారు. అప్పట్నుంచీ పదేళ్ళు మన కుటుంబంకోసం కష్టపడ్డాను. తర్వాత పదేళ్ళు ఇల్లు నిలబెట్టుకోవడానికి పడరాని పాట్లు పడ్డాను. అదయాక పిల్లలు ఎదిగి వచ్చారు. నా స్థాయి ఇది. గీతకి పెళ్ళి చేసి పంపించినా యింకా కృష్ణ వున్నాడు. వాడింకా చిన్నవాడు. చదువవ్వడానికి టైం పడుతుంది. ఈలోగానే నేను రిటైరైపోతాను” అన్నాడు.
“అన్నీ మన చేతుల్లోనే వున్నాయి. మన ఆలోచనల్ని అనుసరించే వున్నాయి. అంత కష్టపడి యిల్లు నిలబెట్టుకున్నావు, నీ పిల్లల అవసరాలకి అది వుపయోగపడనప్పుడు అంత కష్టం అప్పట్లో దేనికి పడ్డట్టు? అమ్మేస్తే కృష్ణ మళ్ళీ కట్టుకోలేడా? నీ రిటైర్మెంటు డబ్బులేం చేస్తావు? ప్రాక్టికల్‍గా ఆలోచించు” అంది ప్రమీల. ఆమె అలా అన్నాక ఇంకా మొండిగా కుదరదని అనలేకపోయాడు రామారావు. నిజానికి అతన్లో ఆలోచనకూడా మొదలైంది అదేక్షణాన.
“ఆలోచించుకుని చెప్తాను” అని లేచాడు.
మనసు ప్రమీల రేపిన ఆలోచనలతో అలజడిగా వుండగానే తర్వాతిరోజు అరుణ యింటికి వెళ్ళాడు. ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు. ప్రహ్లాద్ సియ్యే చేస్తున్నాడు. కూతురు, ప్రవల్లిక పది చదువుతోంది.
“ప్రహ్లాద్ చదువయ్యి ప్రాక్టీసు మొదలుపెట్టడానికి చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు ఆడపిల్లని పెళ్ళి చెయ్యకుండా వుంచమని నేను చెప్పలేను. ఐనా ఎప్పటి మాట? పిల్లల యిష్టాలు అప్పటికి ఎలా వుంటాయో ఎవరు చెప్పగలరు? నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి అన్నయ్యా!” అంది. అందర్లాగే కొడుకుని బియ్యెస్సీయో, ఎమ్మెస్సీయో చెప్పిస్తే ఏదో వుద్యోగంలో చేరేవాడు. ఇప్పుడీ, బీకామ్, సియ్యే అవీ ఆమెకి అంతు చిక్కట్లేదు. తనకే అవగాహన లేని విషయాన్నిగురించి అన్నగారికేం హామీ యివ్వగలదు? మరో కారణానికికూడా ఆమెకి అన్నగారి సంబంధంమీద ఆసక్తి లేదు. అరుణ కొద్దిగా పొట్టి. ఆమె భర్త నందగోపాల్ మంచి ఎత్తు. భార్యాభర్తల్ని అలాగే చూడటానికి సమాజంలోని మనుషులు అలవాటుపడిపోయారు. అరుణ కొడుక్కి తల్లిపోలికా, కూతురికి తండ్రి పోలికా వచ్చాయి. పదిహేనేళ్లకే ప్రవల్లిక గడకర్రలా ఎదిగిపోయింది. ప్రహ్లాద్ ఎత్తు తక్కువ. గుమ్మటంలా వుంటాడు. ఎత్తు పెరగడంకోసం గుంజీలూ, బస్కీలూ ఎన్ని తీసినా వొళ్ళు గట్టిపడింది తప్ప అనుకున్న ప్రయోజనం రాలేదు. అతన్లో తను పొట్టి అన్న కాంప్లెక్సు బాగా వుంది. నాలుగంగుళాల షూ వేస్తాడు ఎత్తు కవర్ చేసుకోవడానికి. అంతవరకూ అది అతని వ్యక్తిగతం. చాలా చిన్న విషయం. గీత సన్నగా వుంటుంది. అతనంత ఎత్తే వున్నా, ఇద్దరూ పక్కపక్కని నిలబడితే పొడుగనిపిస్తుంది. ఈ విషయం అరుణ రెండుమూడుసార్లు గమనించి, నిర్ధారణ చేసుకుంది. అన్నకూతురన్న ప్రేమ మనసుని లాగినా, వాళ్ళకి పెళ్ళి చేసి, బతుకుల్ని జటిలం చెయ్యకూడన్న భావన దాన్ని ఆపింది. తన కొడుక్కి మరోపిల్ల దొరక్కనూపోదు, గీతకి పెళ్ళి కాకుండానూ వుండదు. ఇద్దరికీ ముడిపెట్టడం తప్పనిసరైతే కాదు.
“బావతో మాట్లాడనా?” అన్నాడు రామారావు.
“ఆయనేనా ఏం చెప్తారు? ఇదే చెప్తారు” అంది. వీళ్ళు మాటల్లో వుండగానే ఆమె భర్త నందగోపాల్, కొడుకూ వచ్చారు. మేనమామని పలకరించేసి ప్రహ్లాద్ లోపలికి వెళ్ళిపోయాడు. నందగోపాల్ బావగారిని అభిమానంగా పలకరించాడు. అతనికి రామారావంటే చాలా గౌరవం. ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని సమర్ధవంతంగా నడిపించి వడ్డుకి చేర్చాడో తెలుసు. అందుకు ఎంతో ఆదరం.
“కూతురికి పెళ్ళి చేద్దామనుకుంటున్నాడట అన్నయ్య” అంది అరుణ.
“కంగ్రాట్స్ బావగారూ! గో ఎహెడ్. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యడంలో మీకు తిరుగు లేదు. ఇంతకీ సంబంధాలేమైనా చూసారా? గీతకి వరసైన బావలే బోల్డంతమంది వున్నారు. స్వయంవరం ప్రకటించండి. వరమాల ఎవరి మెడలో పడుతుందో వాళ్ళు అదృష్టవంతులు” అన్నాడు.
“సర్లెండి మీ హాస్యం. అన్నయ్యకంటే సంపాదించే కూతురుంది. మనలో ఎవరికీ ఇంకా ఆర్జనపరులైన కొడుకుల్లేరు” అంది అరుణ.
“నిజమేనండీ బావగారూ! వాసుకితప్ప ఇంకెవరికీ వుద్యోగాల్లేవు. మరో నాలుగైదేళ్ళు ఆగచ్చుకదా? వరమాల పట్టుకుని అమ్మాయి నిలబడిందంటే అబ్బాయిల్లో చురుకు పెరుగుతుంది” అన్నాడతను ఛలోక్తిగా.
“లక్ష్మి, వాసుకి అడిగిందట” అరుణ చెప్పింది.
“ఓహ్! వెరీ నైస్”
“ప్రమీల, సుధీర్‍కి ఇచ్చి చేసి, వాడికి పై చదువులు చెప్పించుకోమందట. వ్యవహారం అక్కడ ఆగింది. మనదాకా రాలేదు. నా నెంబరు మూడు కదా?” అందామె.
“నచ్చితే వాసుకి యిచ్చి చెయ్యండి. లేకపోతే సుధీర్ చదువయ్యేదాకా ఇంకొన్నాళ్ళు ఆగండి. అదీకాదంటే బైటి సంబంధానికి వెళ్లండి. అంతేగానీ పెళ్ళివిషయంలో షరతులు, బేరాలు మంచివి కాదు. రవి విషయంలో చూసాంకదా?” అన్నాడతను. రామారావు తలూపాడు.
“మీ ఈఫీల్ టవరేది?” మేనకోడలిగురించి అడిగాడు.
“అదా? మా బావగారితో వాళ్ళింటికి వెళ్ళింది” అరుణ చెప్పింది.