ఝరి 31-40 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

మగవాడు తప్పుచేస్తాడు. చట్టబద్ధంగానూ, చట్టవిరుద్ధంగానూ పిల్లల్ని కంటాడు. అతన్ని జైలుకి పంపిస్తే వుద్యోగం వూడుతుంది. అంతా కలిసి రోడ్డుని పడతారు. అందుకు ఆ తప్పుని వుపేక్షిస్తారు. చట్టబద్ధంగా పుట్టిన పిల్లలు తండ్రిప్రేమలోనూ, తమకిగల వారసత్వహక్కుల్లోనూ మిగతావాళ్ళతో పంచుకోవాలి. రాజీపడాలి. తండ్రి ప్రవర్తనకి శిక్షని అనుభవించాలి. ఇవి మగవాళ్లకి తెలీదా అంటే తెలుసు. తప్పని తెలుసు. పర్యవసానం ఎవరో ఒకరికి శిక్షగా వుంటుందనీ తెలుసు. ఎవరో ఒకరికి, తనకి కాదుగాబట్టి అందులోని గాఢత మనసుకి పట్టదు. సర్దుబాటు చేసుకోవడం అని అర్థం చేసుకుంటాడు.
“ఐ హేట్ యూ అమ్మా!” అని నోట్ పెట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది.
ఆ అమ్మాయిముందు చాలా అవకాశాలున్నాయి. బతికున్నంతకాలం ఆత్మన్యూనతతో కుంగిపోవడం, నిస్సిగ్గుగా తిరగడం, అన్నవాళ్ళని చంపడం, చచ్చిపోవటం. క్రైమ్‍కి దారితీయడానికి అదొక సూక్ష్మమైన కారణం. ఎందరో పిల్లలు ఎన్నో బాధల్ని మనసులో దాచుకుని కొందరూ, అది బాధని తెలీని స్థితిలో కొందరూ బతుకుతుంటారు. దాన్ని గుర్తించకుండా, పరిష్కారం చూపించకుండా ఉన్నతసమాజంకోసం మనం కలలుకనడం హాస్యాస్పాదం. పిల్లలు పుట్టాక అమ్మవనీ, నాన్నవనీ, మనిషి వునికి పిల్లలద్వారా కొనసాగాలి. వాళ్ళకి కొంత గౌరవం, ఆత్మవిశ్వాసంతో బతకగలిగే అవకాశం మిగల్చాలి.
మహతి విషయం స్థూలంగా చూస్తే వేరేగా అనిపిస్తుంది. కానీ మౌలికత ఒకటే. అతని పిల్లలకి మేఘన అక్కగా పరిచయం.
“ఎలా?”
“పెద్దమ్మ కూతురు.”
“ఏ పెద్దమ్మ? ఎలా పెద్దమ్మ?” అనే ప్రశ్నలు ఇంకా వాళ్ళు వేసి వుండకపోవచ్చు. అతను వాళ్ళకి వివరంగా చెప్పగలగాలి.
“మీ అమ్మా, నేనూ, మీరూ ఎలా వుండేవాళ్లమో, ఒకప్పుడు పెద్దమ్మా, నేనూ, మేఘనా అలా వుండేవాళ్ళం” అని స్పష్టంగా చెప్పగలగాలి. చెప్పినా వాళ్ళు అతను ఆశించినంత సౌహార్ద్రతతో అర్థం చేసుకోకపోవచ్చు. మేఘన విషయంలో తల్లిదండ్రులమధ్య ఏదైనా స్పర్థ వుండి, అది వీళ్ళ దృష్టికి వచ్చి, తాత్కాలిక వుపేక్ష జరిగినా, రేపెప్పుడేనా తండ్రి పరాయిగా అనిపించే సందర్భం వస్తే వాళ్ళు గమనించి వుపేక్షించిన స్పర్థ ఆ అంశాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. తండ్రి అలా మారటానికి కారణంగా అనిపించుతుంది. వీళ్ళిద్దరివల్లనే తామలా అయ్యామనిపిస్తుంది.
“లోపలికెళ్దాం పద” అంది ఆలోచనల్లోంచీ తేరుకుని.
మహతి లేచింది. తులసి అనుసరించింది. ఇద్దరూ వెళ్ళేసరికి వాసు అప్పుడే యింట్లోకి వస్తూ కనిపించాడు.
“ఎక్కడికెళ్ళావురా? పొద్దుటినుంచీ కనబడలేదు?” అడిగింది తులసి.
“మేఘన, వాళ్ళ నాన్నకి యాక్సిడెంటైందనీ, వస్తున్నాననీ ఫోన్ చేసింది. ఎయ్ర్‍పోర్టుకి వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుని హాస్పిటల్లో దించి వస్తున్నాను” అన్నాడు.
“నువ్వు హాస్పిటల్‍కి వెళ్ళావా?!!” ఆశ్చర్యంగా అడిగింది మహతి. “ఎలా వుంది అతనికి?” ఆమె గొంతు వణికింది. ఆశ్చర్యంలో ఆ వణుకు కలిసిపోయింది.
“అదోమాట అంది. వెళ్లక తప్పలేదు”
“ఏమందేమిటి? దానికి ఈమధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయటలే, మహతి చెప్పింది” అంది తులసి.
“మా అమ్మకి ఏ చిన్నకష్టం వచ్చినా, మీరంతా వున్నారు. వచ్చి నిలబడతారు. మా నాన్న ఒక్కడే హాస్పిటల్లో వున్నాడు. తమ్ముడూ, చెల్లీ కంగారుపడుతున్నారు- అంది”
“ఐతే?”
“దాని వెనకకూడా మనందరం వున్నామని చెప్పడానికి వెళ్ళాను”
“బావుంది మీ యిద్దరి తెలివీను. పిల్లలకి మేనమామ పోలికలొస్తాయని విన్నానుగానీ, ఇలా చుట్టూ తిరిగికూడా వస్తాయని యిప్పుడే తెలిసింది” అంది తులసి. అతను తులసి మాటలు పట్టించుకోలేదు. మహతివైపు తిరిగి అన్నాడు.
“మహీ! నరేంద్రని చూసాను. తెల్లారిగట్ట పాలకోసం వెళ్తుంటే జరిగిందట. దెబ్బలు బాగానే తగిలాయి. రక్తం చాలా పోయింది. బ్లడ్‍బేంకునించీ తెప్పించి ఎక్కించారు. మేం వెళ్ళేసరికి అప్పుడే తెలివిలోకి వచ్చాడు. అదీ కొద్దిసేపే. పిల్లలగురించి చాలా వర్రీ ఔతున్నాడు. ఇద్దరు పిల్లలు. అక్కడే వున్నారు. మేఘనకన్నా చిన్నవాళ్ళు. ఇదీ చిన్నదేగా? ముగ్గుర్నీ యింట్లో ఎలా వదిలిపెట్టాలా అని భయపడుతున్నాడు. నాతో పంపమన్నాను. మొహమాటపడ్డాడు. నువ్వు నాతో వస్తే వాళ్లని యిక్కడికి తీసుకొద్దాం. తగ్గాక వచ్చి తీసుకెళ్తాడు”
ఒక్కసారి అందరూ మౌనంగా వుండిపోయారు. ముందుగా మాట్లాడింది మహతే.
“ఇక్కడికి తీసుకురావటమేమిటి? వాళ్ళవాళ్ళకి వార్త వెళ్ళే వుంటుంది. ఎవరో ఒకరు వస్తారు” అంది.
“ఎవరూ లేరని చెప్పాడు. మనం ఏది చేసినా మేఘనకోసం చేస్తాం. అది వాళ్లతో బాగా అనుబంధం పెంచుకుంది. అక్కడి బాధ్యత తనదే అనుకుంటోంది. ఇలాంటప్పుడు ఏం చెప్పినా దానికి తలకెక్కదు. తప్పుగా అర్థం చేసుకుని నీకు దూరం జరుగుతుంది. అతను మంచివాడో, స్వార్థపరుడో నాకు తెలీదు. భార్యకూడా లేదుకాబట్టి అతనికి యింట్లో దీనిలాగ ఎదిగిన పిల్ల అవసరం ఎంతేనా వుంటుంది. పైగా ఈ యాక్సిడెంటు. పూర్తిగా రికవరవ్వడానికి ఎంత టైం పడుతుందో! కోపం పక్కనపెట్టి ఆలోచించు”
“…”
“సుధీర్ వస్తే సంబంధం మాట్లాడి పెళ్ళి చేసి పంపేసే ఆలోచనలో వున్నాం. అనవసరంగా ఇరుక్కుపోతుంది” నచ్చజెప్తున్నట్టు అన్నాడు. అతని మనసులోకూడా లోతైన ఒక ఆలోచన వుంది. తులసి అడిగిందీ మహతి వీలు కాదన్నదీ అదే. కానీ అతనికి జవాబు తెలీదుకాబట్టి ఆశావహమైన వూహగానే వుంది.
“వెళ్ళు మహీ! వాసు చెప్పింది నిజమే. పిల్లల ఆలోచననలనీ కదలికలనీ మనం పట్టుకోలేం” అంది తులసికూడా.
“తీసుకెళ్తానని గట్టిగా చెప్పి, వాళ్లని మీరే వెంటపెట్టుకుని రావచ్చుకదా? మళ్ళీ మహతి దేనికి?” అడిగింది గీత. అప్పటికే మహతి తయారై వచ్చింది. ఇద్దరూ వెళ్ళిపోయారు.
“అతని భార్య పోయిందట వదినా! మళ్ళీ కలుస్తారేమోనని అన్నయ్య ఆలోచనలా వుంది” అంది తులసి.
“వాసూ! ప్రమాదం ఏం లేదుకదా?” కార్లో కూర్చున్నాక మళ్ళీ అడిగింది మహతి.
“బైటపడ్డట్టే. పెద్దప్రమాదం తప్పిందట” అతని జవాబు.
పరిచయం అనేది యిసుకలో రాసిన రాత కాదు. మెదడులోని కొన్ని న్యూరాన్లు వేసే శాశ్వతముద్ర. పరిచయం గాడత పెరిగినకొద్దీ ఆ ముద్ర మరింత బలంగా పడుతుంది. మహతికి నరేంద్ర యిప్పుడు భర్త కాదు. కానీ ఒకప్పుడు ఆమెకి సర్వం ఐనవాడు. అందంగా జరిగిన పెళ్ళీ, రెండేళ్ళపాటు చక్కగా సాగిన వైవాహికజీవితం – మూడేళ్ళ నరకం, మేఘన పుట్టుక దివారాత్రాల్లాంటివి. విడిపోయిన మొదట్లో కూతురికోసం అతను వచ్చినప్పుడు తప్పనిసరిగా కలవటం, చూడటం, అవసరానికి మించని సంభాషణ వుండేవి. జీవితం యిలా ఐనందుకు అతని ప్రవర్తనలో కోపం స్వల్పంగా కనిపించేది. ఆ పిల్లని స్కూల్లో వేసాక స్కూలుకి వచ్చి చూసేవాడు. అక్కడే తనకీ అతనికీ మధ్య పిల్లని మార్చుకోవడం జరిగేది. రోజులు గడుస్తూ కమూనికేషన్ పెరిగాక ముందుగా ఫోన్లో చెప్పో, మెసేజి పెట్టో స్కూలుకే వచ్చి తీసుకెళ్ళేవాడు. మేఘన కాలేజికి వచ్చాక తన నేరు ప్రమేయం ఆగిపోయింది. ఈమధ్య అతన్ని చూసింది లేదు. అంటే దాదాపు ఏడెనిమిదేళ్ళు.
అతను మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడనీ, యిలా యీ పిల్లకోసం ఇక్కడికి రావడం అతని భార్యకి యిష్టంలేదనీ వార్తలు తెలిసేవి. తరువాత ఆ అవికూడా ఆగిపోయాయి. ఏ విషయమేనా మేఘన చెప్తేనే తెలియడం. అతనికి ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరూ రాకపోవటమేమిటి? ఆమె ఆలోచనలు ఆమె అదుపులో లేవు. హాస్పిటల్ చేరేదాకా ఇద్దరిమధ్యా ఎలాంటి మాటలూ జరగలేదు.


వాసుతో కలిసి వచ్చిన మహతిని చూసి ఆశ్చర్యపోయాడు నరేంద్ర. మహతి వెనుక నిలబడ్డ ఆమె బలగాన్ని ఆరోజు చూసాడు. మేఘనకోసం వాళ్లు కదిలి రావటాన్ని ఈరోజు మళ్ళీ చూస్తున్నాడు.
“మా అమ్మ” అంది మేఘన అతని పిల్లల్తో. “మీకు పెద్దమ్మౌతుంది” అంది. కొడుకు హరి. కూతురు ఇందిర. అప్పటికే వాసు వాళ్ళకి పరిచయమయ్యాడు.
“పిల్లలని నేను తీసుకెళ్తాను. తగ్గాక మళ్ళీ తీసుకెళ్లచ్చు” క్లుప్తంగా అంది మహతి.
“థేంక్స్” అన్నాడతను నిశ్చింతగా. ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అతను అనుకోలేదు. భార్య చనిపోయి రెండేళ్ళైంది. తనమీది బాధ్యత రెట్టింపైందనుకున్నాడు. పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిలేని లోటు తెలీనివ్వకూడదనుకున్నాడు. అలాగే జరిగింది ఈ రెండేళ్ళూ. పిల్లలు కొంచెం దిగులు మరిచారు. మళ్ళీ యిప్పుడు కొత్త సమస్య. పాలకోసం వెళ్తుంటే మోటార్‍సైకిల్ కొట్టేసింది. వాకర్స్ కొందరు చూసి అంబులెన్స్ పిలిచి ఎక్కించి పంపారు. తన సెల్‍లో ఎమర్జెన్సీ నెంబరు చూసి కొడుక్కి ఫోన్ చేస్తే అతను వచ్చాడు. గుడ్ సమరిటన్ చట్టం రావటంతో కొంత మార్పు వచ్చిందిగానీ అంతకిముందు యాక్సిడెంట్ కేసుల్లో ఎవ్వరూ సాయం చేసేవాళ్ళు కాదు. హాస్పిటల్స్ కూడా తీసుకునేవి కాదు. భూమ్మీద తనకి యింకా నూకలు మిగిలివున్నాయంటే పిల్లలు అదృష్టవంతులన్నట్టే.
“మరి నాన్నా, మీరు? హాస్పిటల్లో ఒక్కరూ ఎలా వుంటారు? నేను మీతో వుంటాను” అంది మేఘన.
“ఆడపిల్లవి, నువ్వెందుకు? తమ్ముడు వుంటాడు. డాక్టర్‍తో మాట్లాడాను మేఘనా! అటెండెంటుని పెడతానన్నారు. చెల్లీ నువ్వూ వెళ్ళండి. వెళ్ళి మళ్ళీ వద్దురుగాని” అన్నాడు. ఆమె అయిష్టంగా వప్పుకుంది. అతను మళ్ళీ మగతలోకి జారిపోయాడు. తండ్రి మాటలు విని హరి ముఖం చిన్నబోయింది. చిన్నవాడు, రాత్రంతా ఒక్కడూ హాస్పిటల్లో వుండటానికి భయపడ్డాడు. మేఘనకీ ఆ యేర్పాటు నచ్చలేదు. మహతి యిద్దర్నీ చూసింది. హరి భయమూ సరైనదే. కూతురికి నచ్చకపోవటమూ సరైనదే.
“అసలు ఎవరెవరికి ఫోన్లు చేసారు? ఎవరేనా బయల్దేరారా?” అడిగింది. నానమ్మ, తాతయ్య చనిపోయారట. వాళ్ళు ఆమె పెళ్లప్పటికే బాగా పెద్దవాళ్ళు. నరేంద్రకి ఒక అక్క వుంది. ఆవిడ, భర్త విదేశాల్లో కొడుకు దగ్గిర వుంటారు. అమ్మమ్మ, మేనమామ వున్నారు.
“మా మామయ్య బాగా తాగుతాడు. అందుకని నాన్న వాళ్ళని మాయింటికి రానివ్వరు” హరి చెప్పాడు. ఎవరూ లేకపోవటమేమిటో అర్థమైంది మహతికి.
“పోనీ, నేనుంటాను. మీరంతా వెళ్లండి ” అంది చివరికి కొంత తర్జనభర్జనపడి.
మనిషి నోట్లోంచీ వచ్చే ప్రతిమాటా దానివెనకనుండే భావాలతో సంబంధం లేకుండా ఎదుటివాళ్లమీద ప్రభావం చూపిస్తుంది. ఆమె యిలా అనాలని వాసు అస్పష్టంగా కోరుకున్నదే. అంత సూక్ష్మంగానూ సంతోషించాడు. హరికి నెత్తిమీది పెద్దబరువు దిగిపోయినట్టైంది. అదతని ముఖంలో కనిపించింది. మేఘనా సంతోషపడింది. అదొక అవ్యక్తమైన ఆకాంక్షని ఆశ్రయించుకుంది. ఎటొచ్చీ నచ్చనిది ఇందిరకే.
“ఈవిడెవరు, మా నాన్నదగ్గిర వుండటానికి?” అని ప్రశ్నించుకుంది. బైటపడలేదు. ఆ అమ్మాయి గుంభనమనిషిగా ఎదగబోయే పిల్ల.
“మనదాకా రాకపోతే వేరే విషయం. వచ్చాక వదిలిపెట్టి మనదారిని మనం పోలేముకదా?” అంది మహతి వాసుతో. తన చర్యని సమర్ధించుకుంటూ. తనకే సంబంధం లేనిచోట వాసుకి అసలే వుండదు. ఇంతదాకా అతను చెయ్యడమే ఎక్కువ. కాబట్టి అతన్ని వుండమని అనలేకపోయింది. వాసు ఆమెని వదిలిపెట్టి మిగిలిన ముగ్గురినీ తీసుకుని బయల్దేరాడు.
“రాత్రికి నీకు భోజనం తేనా? బెడ్‍షీటు అవీ?” అడిగాడు వెళ్ళేముందు.
“ఎన్నిసార్లు తిరుగుతావురా? ఇప్పటికి రెండుసార్లైంది. ఒక్కరోజుకి సర్దుకుంటాలే. ఇక్కడే కేంటిన్లో ఏదో ఒకటి తింటాను. పొద్దున్నే వేణుని పంపించు” అంది.
“మేఘనా! వీళ్ళింటికి వెళ్ళి కావల్సినవన్నీ తీసుకుని వస్తారా? నేను రావాలా? మీరు వెళ్లగలరా?” అడిగాడు వాసు.
“వెళ్ళు వాసూ! లగేజి వుంటుందికదా? తిళ్ళుకూడా తిని వుండరు. ఇంటికి వెళ్ళేదాకా ఆగకు. బైట ఎక్కడేనా పెట్టించు” అతనితో అని, “ఏమే, ఔనా?” కూతుర్ని అడిగింది మహతి. ఆ పిల్ల తలూపింది. వాళ్ళు వెళ్ళిపోయారు.
ఎదురుగా వంటినిండా కట్లతో బెడ్‍మీద వున్న అతన్ని చూస్తుంటే బాధ, ఆశ్చర్యం రెండూ కలిగాయి. భార్యాభర్తలు, యిద్దరు పిల్లలు, అట్నుంచీ, యిట్నుంచీ కలుపుకుని యింకో యిద్దరు తోబుట్టువులు. ఇదీ యిప్పటి కుటుంబాల పరిస్థితి. ఎవరి జీవితాల్లో వాళ్ళు యిరుక్కుపోయి వుంటారు. ఎవరికీ పెద్దపెద్ద కుటుంబాలు లేవు. ఒకరు కాకపోతే మరొకరు సాయానికి వస్తారనే అవకాశం లేదు. తమకేనా ప్రేమలు వున్నాయి కాబట్టి పెద్దకుటుంబం అయింది. లేకపోతే ఎవరిదారి వాళ్ళదే.
నీకు నేనూ, నాకు నువ్వూ అని భార్యాభర్తా పాడుకుంటూ గడిపేసే రోజులు కాదని యితనికి తెలీదా? భార్య లేదు, బంధువులు లేరు. అంత అజాగ్రత్తగా ఎలా బతికాడు? తాము పట్టించుకోకపోతే ఆ పిల్లలేమౌతారు? మేనమామతో గొడవలున్నాయన్నాడు హరి. వాటి స్వరూపం ఏమిటో? ఆడపిల్లకి అలాంటిచోట రక్షణ వుంటుందా? కోపాలూ తాపాలూ పక్కన పెట్టినా, మేఘన వాళ్ళనేం చూసుకోగలదు? ఇంటాబైటా ఎలా నిభాయించగలదు? ఇతను పూర్తిగా ప్రమాదంలోంచీ బైటపడ్డట్టేనా? రేపటికి మత్తుదిగి కళ్ళు తెరుస్తాడా? అతనికి ఏదేనా ఐతే ఆ యిద్దరు పిల్లల పరిస్థితి ఏమిటి? ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో సుళ్ళు తిరిగాయి. నెమ్మదిగా మనసు మరల్చుకుని సెల్‍ఫోన్లో తలదూర్చింది.
“మహతి ఏది?” యింటికి వాసుకి రాగానే ఎదురైన ప్రశ్న.
“నాన్న దగ్గిర వుండిపోయింది” మేఘన జవాబిచ్చింది. ఇందిర చురుగ్గా చూసింది. “మా నాన్న” ఆమె మనసు సరిచేసుకుంది.
“మాది చాలా పెద్ద కుటుంబం. అక్కడ కూర్చున్నారే తాతయ్య, వాళ్ళు మొత్తం తొమ్మిదిమంది. వాళ్ల పిల్లలు మా అమ్మావాళ్ళు. వాళ్ళ పిల్లలం మేం ముప్పైమందిమి. మాకు వాట్సాప్ గ్రూపు వుంది” మేఘన గొప్పగా చెప్పి, అక్కడున్న అందర్నీ పరిచయం చేసింది. ఆ పిల్లకి తనకింత పెద్ద కుటుంబం వుందని చెప్పుకోవడం ఎప్పుడూ గర్వమే. తగ్గట్టుగా ఎప్పుడూ ఆమె గాయపడింది లేదు. మహతి కూతురని ఇంకాస్త కన్సర్న్ చూపిస్తారు.
అంతా స్నానాలు చేసారు. రాత్రి భోజనాలు తేలిగ్గా చేసారు.
“మీరు ముగ్గురూ ఒక గదిలో పడుక్కోండి. కొత్తకదా, వాళ్ళకి విడిగా పడుకోవడానికి భయంగా వుంటుంది” అంది గీత. ముగ్గురూ ఒకగదిలోకి చేరారు.
“నువ్వు మానాన్నని నాన్నంటావేం?” ఇంక ఆపుకోలేక అడిగేసింది ఇందిర. అరచేతి వెడల్పైన పొడవైన జడతో, తీర్చిదిద్దినట్టుండే కనుముక్కుతీరుతో చక్కటి బొమ్మలా వుండే ఆ అమ్మాయి ముదినాపసానిలా మాట్లాడుతుంది.
“నాకూ నాన్నే కాబట్టి” అంది మేఘన.
“అలా ఎలా?” ఆ ప్రశ్నలో అమాయకత్వం లేదు. తండ్రికి రెండోసారి పెళ్లైందని సూచనగా తెలుసు. దానితో మిగతా విషయాలని సమన్వయపరుచుకోలేకపోతోంది.
“నాన్ననే అడుగు” మేఘన జవాబు.
“రేపు నీకు ఎగ్జాం వుందికదూ? ఏమైనా చదివావా?” మాటమార్చుతూ అడిగాడు హరి.
“వచ్చినవే రాస్తాను. ఇక్కడినుంచీ ఎలా వెళ్ళాలి? నువ్వు తీసుకెళ్తావా?” అడిగింది ఇందిర.
“ఎవరో ఒకరు దించుతార్లే” అంది మేఘన.
“మీరు మాకేమౌతారు?” మళ్ళీ ఇందాకటి ప్రశ్నని తిప్పి వేసింది.
“నాన్నని అడగమన్నానుకదా?”
“రేపు మాయింటికి వెళ్ళిపోతాం”
“పెద్దవాళ్ళెవరూ లేకుండా ఎలా వుంటారు? అపార్టుమెంటు కాదుకదా? “
“నువ్వూ రా!”
“సేఫ్ కాదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు”
నిద్రపోయేదాకా ఇందిర ఇలాంటివే ఏవో ఒకటి అడుగుతునే వుంది. హరి మామూలుగానే వున్నాడు. అతనికీ చెల్లెలికి వచ్చినన్ని సందేహాలూ కలిగాయికానీ స్వభావం భిన్నమైనది కావడంతో అంతగా పట్టించుకోలేదు.


మధ్యమధ్యలో సిస్టర్స్ వచ్చి నరేంద్రకి టెంపరేచర్ తీసుకుని, సెలైన్ చూసుకుని, మందులు వేసి వెళ్తున్నారు. కాస్త దూరంగా వున్న అటెండెంట్ బెడ్‍పైన పడుకుంది మహతి. పెద్దపెద్ద కిటికీలున్న గదికావటంతో చలిగా అనిపించి చీర కొంగు భుజాలచుట్టూ కప్పుకుంది. నిద్ర రాలేదు. నిద్రపోవాలనీ అనుకోలేదు. సెల్ చూస్తూ దూరం జరిపిన ఆలోచనలన్నీ మళ్ళీ చుట్టుముట్టాయి. అవి నెమ్మదిగా జ్ఞాపకాలదారిలోకి మళ్ళాయి.


గీత పెళ్లవడంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలన్న హడావిడి ఆ కుటుంబాలలో మొదలైంది. సుధీర్ ఇంక చదవనని వెళ్ళి వుద్యోగంలో చేరాడు.
ఆ విషయంలో అతను ఎవరి సలహానీ తీసుకోలేదు. తల్లిదండ్రులని సంప్రదించలేదు. అవంతీపురం కార్పొరేషన్ హాస్పిటల్లో ఖాళీ వుందంటే అప్లై చేసాడు. పెద్దగా ప్రయాసపడకుండానే వచ్చేసింది. చేరాక యింట్లో చెప్పాడు.
“నాకీ చదువు చాలు. అమ్మకానికి పెట్టి నన్నెవరు చదివిస్తారా అని మీరు చూడక్కర్లేదు” అన్నాడు. గురుమూర్తికి కోపంవచ్చింది. కానీ ఒక నిజం అర్థమైంది. ఈ ముగ్గుర్నీ అంతంత చదువులు చదివించడానికి అప్పటికే చాలా అప్పులు చేసారు. ఇప్పుడింకా పై చదువులంటే యిల్లు అమ్మటమో, వాళ్లనే స్టడీలోన్లు తీసుకోమనటమో తప్పదు. స్టడీలోనంటే అప్పుల్తో వాళ్ళు జీవితాలు మొదలుపెట్టాలి.
అతను గీతకోసం మనసు పాడుచేసుకోవటం ప్రమీలకీ గురుమూర్తికీ కూతురి విషయంలో బాధ్యత గుర్తుచేసినట్టైంది. ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఆ పిల్లకూడా ఎక్కడో మనసు పారేసుకుని వస్తేనన్న భయం మొదలైంది. అందుకే రిసెర్చి చేస్తానన్నా వినకుండా పెళ్ళి చేసేసారు. ఆ విషయంలో సుమతికి కొంత అసంతృప్తి వున్నా, క్రమంగా సర్దుకుపోయింది. మహతికి చూడటంలో కొంచెం ఆలస్యం చేసారు. పీజీ అయాక కొన్నాళ్ళు ఖాళీగా వుంది. టెంపరరీ వుద్యోగాలు చేసింది. గీత పెళ్లైన నాలుగేళ్లకి ఆమెకి అయింది.
ఆమెకి పెళ్ళిమీద పెద్దగా ఆసక్తి లేదు. ఫ్రిజిడిటీ కాదు. భయం. రెండేసి మూడేసి నెలలు సాగే పీరియడ్స్, వాటిని ఆపడానికి వాడే మాత్రలు… చూడటానికి అందంగానే వుంటుంది. చదువుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే మంచి వుద్యోగం వస్తుంది. ఎంతో కొంత కట్నం యివ్వగలిగే స్తోమతు ఆమె తండ్రి సంపాదించుకున్నాడు. ఐనాసరే, మనసులో విముఖత. పెళ్ళి అవసరమా? చేసుకోకుండా బతకలేదా? లేని జవాబుదారీతనాన్ని ఎందుకు ఎత్తుకోవాలి? ఎన్నో ప్రశ్నలు.
“పెళ్ళైతే ఇలాంటివి దార్లోపడిపోతాయి” అంది నిర్మల. “నీకు కాకపోతే చెల్లికి ఎలా కుదుర్తుంది?” అంది ఆవిడే మళ్ళీ.
ఇద్దరూ ఆడపిల్లలని మహతి తండ్రికి మొదటే కోపం. ఇలాంటివి అర్థం కావు. చేసుకోడు. చేసుకునేలా పెరగలేదు. ఆడపిల్లలు గుండెలమీది కుంపటికాబట్టి దింపుకోవాలనే ఆలోచన. దాంతో మహతి యిష్టాయిష్టాలతోటీ, భయాలతోటీ సంబంధం లేకుండా పెళ్ళి జరిగిపోయింది.
పూర్వపరిచయం ఏదీ లేని స్త్రీపురుషులిద్దరిమధ్య పెళ్ళితో మొదలయ్యేది ప్రేమ కాదు. పుట్టవలసినదీ, పుట్టేదీ అనుకూలత, పరస్పరనమ్మకం. ఒకరికొకరు అనువుగా మారాలి. దాపరికాలూ, ఒకరినొకరు నియంత్రించడాలూ వుండకూడదు. నరేంద్రకి మహతి బాగా నచ్చిందట. ఆ యిష్టాన్ని అతనెప్పుడూ దాచుకోలేదు. మంచివాడు. సరదాగా వుండేవాడు. పెళ్ళీ, హనీమూన్ సరదాగానే అనిపించాయి ఆమెకికూడా. అతనికి ఒక అక్క. ఆవిడ తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిపోయాక యితను పుట్టాడట. అందుకని తల్లీకూతుళ్ళిద్దరికీ అతనిమీదే ప్రాణాలు.
నెలసరి అదుపులో వుంచడానికి టేబ్లెట్లు వేసుకోవడం, ఎప్పుడేనా నెల ఎగించితే అత్తగారు ఆరాటంగా చూడటం, కాదని గ్రహించి మొహం చిన్నబుచ్చుకోవటం.
“కొందరికి కాస్త ఆలస్యంగా పుడతార్లే. పెళ్లైన వెంటనే పుట్టరు” అని ఆమె వినేలాగ సర్దిచెప్పుకోవడం జరిగాయి. ఆమె పెళ్ళైన ఏడాదికి రవళి పెళ్ళైంది. పెళ్ళిలో మహతి తండ్రికి కొడుకుల్లేని లోటంతా తీర్చాడు నరేంద్ర. ఆ వెంటనే మూడునెలలకే శుభవార్త. రవళిదగ్గర్నుంచీ. దాస్తే దాగేది కాదు. ఇంట్లో అసంతృప్తులు బాహాటంగానే మొదలయ్యాయి. మహతిని చూడటానికి ఎవరో ఒకరు తరుచుగా వచ్చేవారు. అదొక ఏర్పాటు. ఆ వచ్చినవాళ్ళతో నిర్మల రహస్యంగా మాత్రలు, మందులు పంపించేది. ఒకరోజు మహతి టేబ్లెట్ వేసుకుంటుంటే అతని అక్క చూసింది.
“ఏం మాత్రలవి? పిల్లలు పుట్టకుండా వేసుకుంటున్నావా?” అని చేతిలోంచీ లాక్కుంది. తెలిసిన డాక్టరుకి చూపిస్తే ఆవిడ మహతిని తీసుకురమ్మందట. అప్పట్నుంచీ మహతి మహతి కాదు. దోషి, నేరస్తురాలు, మరబొమ్మ.
“రోగిష్టిపిల్లని మోసం చేసి అంటగట్టారు. మా తమ్ముడి జీవితం నాశనం చేసారు. మీకు మేమే దొరికామా?” అనే దండకంతో మొదలై, అటేడు, యిటేడు తరాలనీ తూర్పారబట్టి నిలబెడితే మరో అధ్యాయం మొదలైంది. ఆమె ప్రమేయం లేకుండా, ప్రతిఘటన పట్టించుకోకుండా.
“ఒక్క పిల్లనో, పిల్లడినో కని చేతిలో పెడితే వాళ్ల కోపాలు తగ్గుతాయి మహీ! మనుషులు మంచివాళ్ళే. విషయం దాచిపెట్టామని కోపం. ఇలాంటి విషయం ఎలా చెప్పగలం? అతనికే ఇలాంటిదేదో లోపం వుంటే వాళ్ళుమాత్రం చెప్పేవాళ్ళా? మనమేనా మోసం చెయ్యాలనుకోలేదు. పెళ్ళైతే ఇలాంటివి సర్దుకుపోతాయనుకున్నాం. కన్నొంకరో, కాలొంకరో ఐతే మనం చెప్పినా చెప్పకపోయినా కళ్ళతో చూసి వాళ్ళే తెలుసుకుంటారు. నువ్వొక్కదానికే కాదు, ఎంతోమంది ఆడపిల్లలకి యిలాంటి సమస్యలు వుంటాయి. మగవాళ్ళకి అర్థం కావు. మగపిల్లల్ని కనడం నా చేతిలో లేదని మీ నాన్నకి ఇప్పటికేనా అర్థమైందా? ఇదీ అంతే. మీ అత్తా, ఆడబడుచూ అంటావా, వొళ్ళు వాళ్ళది కాకపోతే తాటిపట్టకి ఎదురు డేకమనే రకాలు. సర్దుకుపోక తప్పదమ్మా! పెళ్ళంటూ చేసుకున్నాక పిల్లల్ని కనాలని కోరుకోవటంలో తప్పులేదుకదా?” అని తల్లి బుజ్జగించింది. నచ్చజెప్పింది. మభ్యపెట్టింది. కన్నీళ్ళు, వేడ్కోలు, చస్తానని బెదిరింపు.
ఫలితం. మూడు అబార్షన్ల తర్వాత తొమ్మిదినెలల బెడ్‍రెస్టుతో మహతికి మేఘన పుట్టింది. లక్షల్లో ఖర్చుపెట్టాడు ఆమె తండ్రి. ఇద్దరాడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వున్న ఆయనకి అది శక్తికి మించినది. కూతురి కాపురం నిలబెట్టడం తన బాధ్యత అనుకున్నాడు, పెట్టాడు. ఇద్దరూ ఆడపిల్లలేనన్న బాధ దానికదే. తామంత గొడవచెయ్యబట్టే యిదంతా సాధ్యపడిందని నరేంద్రవాళ్ళనుకున్నారు, నమ్మారు. లేకలేక పుట్టిన మనవరాలికి బారసాలకూడా ఘనంగానే జరిపించాడు మహతి తండ్రి.
“ఒక్క కన్ను కన్నూకాదు, ఒక్క బిడ్డ బిడ్డా కాదు. ఇంకో కానుపైతే పెద్దాపరేషన్ చేయిస్తాను” అంది నరేంద్ర తల్లి, బారసాల జరిపి, తీసుకొచ్చి దింపినప్పుడు, నిర్మలతో.
“ముప్పయ్యేళ్ళేనా లేని పిల్లకి హిస్ట్రెక్టమీయా?” తెల్లబోయింది నిర్మల. ఆమె అలా బైటపడకూడదేమో! కానీ ఆ మాటలు విన్నాక ప్రతిఘటనలాంటి తక్షణస్పందనని అదుపు చేసుకోలేకపోయింది.
“లేకపోతే? మా తమ్ముణ్ణి సన్నాసుల్లో కలవమంటారా?” కంయిమంది అతని అక్క.
మహతికి పైప్రాణం పైనే పోయింది. ఇంకో పిల్ల. మామూలుగా పుడుతుందా? లేక చర్వితచర్వణమౌతుందా? ఆలోచిస్తుంటే తలతిరిగి చేతికొచ్చినంత పనైంది. అప్పటికి యింకే గొడవా జరగలేదు. నరేంద్రలో చాలా మార్పు వచ్చింది. మార్పా? సహజంగానే అతనంతా? అనే అనుమానం కలిగేలా. వాస్తవపరిస్థితులకన్నా తల్లీ, అక్కా చెప్పిన మాటల ప్రభావం ఎక్కువగా వుండేది. వాళ్ళేం చెప్పివుంటారో క్రమంగా మహతికి అర్థమైంది.
“ఇంకో రెండేళ్ళు ఓపికపడితే మరో పిల్లో పిల్లాడో పుట్టగానే పెద్దాపరేషన్ చేయిద్దాం. అప్పటిదాకా తిట్టోకొట్టో దార్లో పెట్టుకో. మందులు మింగడం దానికి అలవాటేకదా?” అని వుంటారు. అతని తండ్రి యింకొన్ని సలహాలు చెప్పి వుంటాడు. మహతికి అలా అర్థం అయేలానే వుంది అతని ప్రవర్తన. అమానుషమే. ఆమెకి. వాళ్ల దృష్టిలో కాదు. నిరపేక్ష మంచితనం అనేది ఎక్కడా వుండదు. తల్లిదండ్రులేనా పిల్లలపట్ల అలాంటి మంచితనం కొంతకాలం చూపించగలరు. ఒక సహజభావంలాగ. పిల్లలు చిన్నవాళ్ళుగా వున్నప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళై స్వార్ధపరులైతే ఆ మంచితనం తగ్గిపోతుంది. అంత ప్రాకృతికబంధంలోనే లేని మంచితనం ఇక్కడ యిలాంటి సందర్భంలో ఎలా వుంటుంది?
మోసపోయాడన్న క్రోధంలో మునిగిపోయాడు నరేంద్ర. మోసంచేసి కళ్ళెదురుగా తిరుగుతున్న మహతిని చూస్తే కోపం, అసహనం. చాలా కటువుగా వుండేవాడు. ఏకాంతంలో చెయ్యిపట్టుకున్నప్పుడు విడిపించుకుని దూరం జరిగింది. అతనికి కోపం వచ్చేసింది. జడపట్టుకుని గుంజి, వీపుమీద ఒక దెబ్బ వేసి, ఫో అని దూరంగా నెట్టేసాడు. హడిలిపోవడం, నిలదొక్కుకోలేక ముందుకి పడిపోవటం, దెబ్బతగలడం అతని కోపానికీ నిస్పృహకీ పర్యవసానాలు. ఇంకోరోజు మళ్ళీ కొట్టాడు. మరెందుకో, ఇంకెందుకో. మొదటిసారి కొట్టినప్పుడు అతని తల్లి కొద్దిగా జాలిపడింది. రెండోసారినుంచీ నీ కర్మ, చేసినదానికి అనుభవించు అనుకుంది.
మొదటిసారి అసలు తిరగబడాలని తెలీలేదు మహతికి. భార్యాభర్తలు కొట్టుకోవడం ఆమె ఎక్కడా వినలేదు. ఊహకికూడా రాని విషయం అది. తండ్రి తల్లిని తిట్టడం చూసింది. కొట్టడం లేదు. మానసికహింస బయటికి రానిది. బాధని మనసులోనే దాచుకుని స్త్రీ పైకి నవ్వుతూ తిరుగుతుంది. భౌతికహింస రూపురేఖలు మరోలా వుంటాయి. అందరికీ తెలుస్తుంది. అవమానం రెట్టింపౌతుంది. రోజంతా ఏడుస్తూ వుండిపోయింది మహతి. అతనేమీ పశ్చాత్తాపపడలేదు.
ఒకొక్కసారికీ ఆమెలో వివేచన పెరిగింది. అతను మంచివాడే. అతనిలోని ఈ దౌష్ట్యాన్ని ట్రిగ్గర్ చేసింది తమ పెళ్ళి అన్న విషయం గ్రహించాక, తమదారులు కలవ్వని అర్థమైంది. ఏ మనిషేనా తనని మోసంచేసారనుకోవడం మొదలయ్యాక, మోసం చేసిన వ్యక్తితో కలిసి వుండటం కష్టం. జాలీ, క్షమా లేనిచోట తనుమాత్రం వుండగలదా? ఇద్దరూ చదువుకున్నవాళ్ళు. ఇలా గొడవగొడవ చేసుకోకుండా డాక్టర్ని కలిసి సామరస్యమైన పరిష్కారం వుందేమో అడగచ్చు. అది కానప్పుడు, విడిపోవచ్చు. రెండు కుటుంబాలమధ్యా కొంచెం గొడవలౌతాయి. తప్పదు. కానీ అతనీ కోపంలోంచీ బైటికి రాడు. దెబ్బలు తింటూ తను వుండలేదు.
కొన్ని పెళ్ళిళ్ళు జరగకూడదు. తమ పెళ్ళి అలాంటిది. కొన్ని సమస్యలకి పరిష్కారం వుండకపోవచ్చు. తమ సమస్య అలాంటిది.
విడిచిపెట్టి వెళ్ళడం ఎక్కడికి? తల్లిదండ్రుల దగ్గిరకి వెళ్తే ఇది సర్దుబాటువ్యవహారంగా మారిపోతుంది. తండ్రి తనమీద, తల్లిమీద అరుస్తాడు. వాళ్ల కాళ్ళో గడ్డమో పట్టుకుని బతిమాలి తీసుకెళ్ళి వదిలిపెట్టి రమ్మంటాడు. కుటుంబంలో పెద్దవాళ్ళెవరూకూడా విడిపోవటాన్ని సమర్ధించరు. లోపం తనలో వుందికాబట్టి తగ్గి వుండాలని చెప్తారు. నరేంద్రవాళ్ళకికూడా మహతిని వదిలిపెట్టేసి సంఘంలో పరువుతీసుకోవాలనో అంత బలగం వున్న కుటుంబంతో గొడవలు పెట్టుకోవాలనో లేదు. వాళ్ళు రెండేళ్ళ యాక్షన్ ప్లాన్ రచించుకుని అమలుచేస్తున్నారు.
ఎవరికీ తెలీనిచోటికి వెళ్ళిపోవాలి. అలా అనిపించిన వుత్తరక్షణాన్నించీ ఆ యిల్లు పరాయిదిగా అనిపించసాగింది మహతికి. ఒక బేగులో రెండుజతల బట్టలు, మేఘనవి ముఖ్యమైన వస్తువులు సర్దేసింది. బయటికి వెళ్ళేప్పుడు వెయ్యచ్చని కొన్న డయపర్స్ పెట్టుకుంది. పాలపొడి చిన్న సీసాలో పోసుకుని, స్పేర్ పాలసీసా, తిత్తి వుంటే అవికూడా సర్దుకుంది. డబ్బు చూసుకుంది. తల్లి అప్పుడూ అప్పుడూ యిచ్చినదీ, పాప చేతిలో చూడటానికి వచ్చినవాళ్ళు పెట్టినవీ అంతా కలిపి రెండువేలదాకా వుంది. దాన్ని లెక్కపెట్టుకున్నాక భరోసాగా అనిపించింది.
ఎక్కడికి వెళ్ళిపోవాలనేది యింకా అనిశ్చితమే. ఆ ఎక్కడికో మహతి మనసులో స్థిరపడకుండానే ఇల్లు దాటాల్సిన సందర్భం వచ్చేసింది. అతను కొట్టినందుకు చెంప ఎర్రగా కందిపోయింది. అంత విసురుగా నెట్టేసినందుకు బోర్లాపడి నుదుటిమీద బొప్పి కట్టింది. చేతిగాజులు పగిలి గుచ్చుకున్నాయి.
“నేనిక్కడ వుండను. వెళ్ళిపోతాను” కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే, అదురుతున్న పెదవులతో, కోపంగా చెప్పి, బేగు తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని, ట్రిగ్గరవడానికి ఎదురుచూస్తోందని అర్థం చేసుకున్నాడు.
“ఇప్పుడే వెళ్ళిపో. ఎవరు వుండమన్నారు నిన్నిక్కడ? ఎందుకున్నావు?” అడిగాడు నరేంద్ర.
ఎవరూ ఆహ్వానించలేదు తనని యిక్కడికి. ఒక మొక్కుబడి వ్యవహారంలా వచ్చి కూర్చుంది. ఆమెకి కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. జీవితంలో ఎప్పుడూ చవిచూడని తిరస్కారం. తనని అలాంటి పరిస్థితిలో నిలబెట్టినందుకు అందరిమీదా కోపం వచ్చింది.
అతన్ని దాటుకుని వెళ్ళి మేఘనని అందుకోబోతుంటే, “అదెక్కడికి?” అడిగాడు.
“అది నా కూతురు. నాతో రాక యిక్కడెందుకు వుంటుంది?” అంది.
అతని కళ్ళలో చులకనభావం. పెదాలమీద అదోలాంటి తేలికతనంతో కూడిన నవ్వు. ఎక్కడికెళ్తుంది? పుట్టింటికేకదా? అనుకున్నాడేమో, ఆపలేదు. రాత్రి పదకొండుగంటలవేళ చంటిపాపని ఎత్తుకుని యిల్లుదాటింది మహతి. అతని తల్లీతండ్రి లోపల నిద్రపోతున్నారు. ఒకవేళ మెలకువగా వున్నా ఇవతలికి రారు. కొంతమందికి సమస్యల్ని జటిలం చేసుకోవడంతప్ప సామరస్యంగా పరిష్కరించుకుని నష్టతీవ్రతని తగ్గించుకోవడం రాదు. జరిగిన డేమేజి ఎలాగా జరిగింది. మహతిమీద కక్షతీర్చుకోవటంవలన కొడుకు జీవితం బాగవదు. జరిగిన పెళ్ళి దాని ప్రభావాలతోసహా రద్దవదు.
ఇల్లు మెయిన్‍రోడ్డుకే వుంటుంది. గేటు తియ్యగానే ఆటో కనిపించింది. ఎక్కి కూర్చుంది. స్టేషనుకి పొమ్మంది. ఇంతరాత్రివేళ ఒక్కర్తీ చంటిపాపతో బయల్దేరడం ఆశ్చర్యాన్ని కలిగించిందేమో, ఆటోడ్రైవరు కొంచెం వింతగా చూసాడు. ఆమె పట్టించుకోలేదు. స్టేషనుకి వెళ్ళేసరికి ప్లాట్‍ఫాంమీద ముంబై వెళ్ళే రైలు కదలడానికి సిద్ధంగా వుంది. టిక్కెట్టు కొనుక్కోవాలన్న ఆలోచన రాలేదు. కంపార్టుమెంటుమీద బోర్డుకూడా చూడలేదు. ఎక్కి కూర్చుంది. అప్పుడు అనౌన్సుమెంటు వినిపించింది. అది ముంబై రైలైనా, కలకత్తా రైలైనా అలాగే ఎక్కేసేది. ఆ క్షణాన వున్న వూపు అలాంటిది.
కంపార్టుమెంటంతా ఖాళీగా వుంది.
“ట్రెయిన్ కదుల్తుంటే ఎక్కేసాను. ముంబైకి టిక్కెట్టివ్వండి” అంది చెకింగ్‍కి వచ్చిన టీసీతో.
“చంటిపాపతో ఆఖరినిముషందాకా ఆలస్యం ఎలా చేసారు? ఖమ్మంరూట్లో యాక్సిడెంటై రైళ్లన్నీ లేటయ్యాయి, చాలామంది రిజర్వేషన్ కేన్సిల్ చేసుకున్నారుగానీ లేకపోతే రిజర్వేషన్ దొరికేదికాదు. రాత్రంతా పాపతో జెనరల్లో ఎలా ట్రావెల్ చేసేవారు?” టీసీ టికెట్టిస్తూ అడిగాడు.
“థేంక్స్” అంది మహతి ముక్తసరిగా. అతను తన మొహాన్నీ, నుదుటిబొప్పినీ, ఉబ్బిన కళ్ళనీ చూసాడనీ పరిస్థితంతా చదివేసాడనీ ఆమెకి తెలీలేదు.
మేఘన నిద్రపోతోంది. కాఫీ అమ్మేఅతనొస్తే బ్రూ వెయ్యకుండా పాలు పోయించుకుని, అవే చల్లార్చి నిద్రలోనే పట్టింది. ఒళ్ళోనే పడుకోబెట్టుకుని సీట్లో వెనక్కి వొరిగి, కాలంలో కరిగిపోతున్న చీకటినీ, చీకటిని దూసుకుంటూ రైలు ముందుకి వెళ్తుంటే వెనక్కి జారుకుంటున్న అస్పష్టదృశ్యాలనీ చూస్తూ కూర్చుంది.


ఇంచుమించు అదేసమయానికి అక్కడ అవంతీపురంలో కలకలం మొదలైంది.
“పిల్లని తీసుకుని మీ అమ్మాయి యింట్లోంచీ వెళ్ళిపోయింది” మహతి తండ్రికి చెప్పేసి బాధ్యత తీరిపోయినట్టు ఫోన్ పెట్టేసాడు నరేంద్ర. అప్పటినుంచీ ఆ తొమ్మిది కుటుంబాలలో ఎవరికీ నిద్రలు లేవు. మగవాళ్ళంతా రోడ్లమీదికి వచ్చేసారు.
తెల్లవారాక ముంబైలో మాధవ్ యింట్లో ఫోన్ మోగింది. అతనుండేది ముంబైలో. అతనే ఎత్తాడు. అవతల గీత. గొంతు చాలా కంగారుగా వుంది.
“మహీ మేఘనని తీసుకుని యింట్లోంచీ వెళ్ళిపోయిందట మాధవ్! రాత్రి పదకొండింటికట. దాని భర్త ఫోన్ చేసి చెప్పాట్ట. ఇంటికి వస్తుందేమోనని మహి అమ్మ, నాన్న చాలాసేపు ఎదురుచూసి, ఎంతకీ రాకపోయేసరికి కంగారుపడి అందరికీ ఫోన్లు చేసారు. ఎక్కడికెళ్ళిందో తెలీటంలేదు. ఊరంతా గాలిస్తున్నారు. వాసూ, మా నాన్న, రవిబాబాయ్‍- వాళ్ళింటికి వెళ్ళి గట్టిగా నిలదీస్తే, మొగుడో దెబ్బవేస్తేనే అర్ధరాత్రి ఇంట్లోంచీ వెళ్ళిపోతుందా అందట అతని తల్లి. వాళ్లు దాన్ని కొడుతున్నార్రా!” అని ఏడ్చేసింది.
ఉరమని పిడుగులా విన్న ఆ వార్తకి అతను కంగారుపడిపోయాడు.
“గీతూ! ఏడుపు ఆపి, అసలేం జరిగిందో సరిగా చెప్పు” అన్నాడు. మళ్ళీ అవే విషయాలు చెప్పింది. చెప్పి, “అదసలు పెళ్ళే వద్దంది. అంతా కలిసి బలవంతంగా వప్పించి చేసారు. చేసిన దగ్గర్నుంచీ పిల్లలకోసం చెండుకు తిన్నారు. పిల్ల పుట్టనే పుట్టింది. ఇప్పుడేమో కొడుతున్నాడట” అంది.
“రాస్కెల్” అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. “మేం వెంటనే బయల్దేరిపోతాం” అన్నాడు.
“మీరొచ్చి ఏం చేస్తారు? వద్దు. రావద్దు. అది చెప్పడానికే ఫోన్ చేసాను. మహీ అక్కడికి వస్తే? ఎక్కడివాళ్ళు అక్కడే వుండండి. ఎవరూ యిళ్ళకి తాళాలు వెయ్యకండి. సుమంత్‍కీ, వసంత్‍కీ రవళికీ మిగతావాళ్ళకీ కూడా అదే చెప్పాను. మనదగ్గిరకి కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది?” అంది.
“ఇక్కడికా? అంతరాత్రివేళ రైళ్ళేం వుంటాయి?”
“స్టేషనుకి ఫోన్ చేసి అడుగు. ఖమ్మందగ్గిర గూడ్సు పట్టాలు తప్పిందట. రైళ్ళన్నీ గంటలకిగంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి” అంది. అతను ఫోన్ పెట్టేసాడు.
“ఏమైంది?” అతనికి కాఫీ తెచ్చి యిస్తూ అడిగింది అతని భార్య నీలిమ. చెప్పాడు. వీళ్ళెవరూ పైవాళ్ళు కాదు. అందర్తోటీ పెద్ద చనువు లేకపోయినా వాళ్లమధ్య నాలుగైదేళ్ళుంది. మహతితో పరిచయం వుంది. అర్ధరాత్రివేళ యిల్లొదిలిపెట్టి వెళ్ళిపోయేంత తెగింపు వున్నదానిలా అనిపించలేదు. ఆశ్చర్యం కలిగింది.
“మీవాళ్లంతా అక్కడుండగా యిక్కడికెందుకు వస్తుంది?”
“అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే మొదట గుర్తొచ్చేది మనిల్లే”
“ఇక్కడికి రాకపోతే?”
అతనికి గుండె దడుక్కుమంది. మహతి యిక్కడికే వస్తుందనుకోవడం బావుంది. రాదనుకోవడంలోని నిస్పృహ, ఆమెకేం జరిగిందోనన్న కంగారు మనిషిని నిలవనివ్వటం లేదు. ఊరికే పచార్లు చేస్తున్నాడు.
“ఆఫీసుకి టైమౌతోంది. ఆవిడ వస్తే నేను యింట్లో వుంటానుకదా?” అంది నీలిమ కాసేపటికి.
“లీవు పెడతాను. ఇంత టెన్షన్లో పనెక్కడ చెయ్యగలను?” అన్నాడు మాధవ్. ఆమె వింతగా చూసింది. తను ఎంత చెప్పినా యిలాంటివిషయాల్లో అతను వినడని వూరుకుంది. అతనింక ఆఫీసుకి వెళ్ళడుకాబట్టి వంట నిదానంగా చేసుకోసాగింది. వీళ్ళ ప్రేమలూ అభిమానాలూ ఆమెకి ఎప్పుడూ ఆశ్చర్యమే. స్వంత అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూకూడా కారు. కజిన్స్‌మధ్య యింత అటాచిమెంట్సేమిటి? అదికాదు, ఆమెకి చికాకనిపించేది, వాళ్లమధ్య తను పరాయిగా అనిపిస్తుంది. అనేక విషయాల్లో పెద్ద గొడవలుకూడా జరిగాయి. తప్పనిసరై అతను ట్రాన్స్ఫర్ చేయించుకుని యిటొచ్చేసాడు.
నీలిమావాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్ళు. అక్క మాధురి. చెల్లెలు మానస. మాధురిని ప్రహ్లాద్ చేసుకున్నాడు. ఆ పెళ్ళిలో చూసి, నీలిమని మాధవ్ యిష్టపడ్డాడు. మూడోపిల్లనికూడా ఇక్కడే యిస్తే బావుంటుందని మానసని వసంత్‍కి చేసారు. రామారావింట్లో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా పెళ్ళికావల్సిన పిల్లలకి లోటు లేదు. ఇప్పుడింకో కొత్తతరం కూడా తయారౌతోంది. అలా ఆయన ముగ్గురు చెల్లెళ్లతో వియ్యం అందింది నీలిమ తల్లి. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కట్టుగా వుంటారు. ఆ కట్టులోకి యింకెవరినీ చొరబడనివ్వరు. మహతి వ్యవహారాన్ని గురించి మిగిలిన యిద్దరితో మాట్లాడాలని నీలిమకి ఎంతో తహతహగా వుంది. మాధవ్ వుండగా ఫ్రీగా మాట్లాడలేదు. అతని కోణం వేరు, ఆమె కోణం వేరు. అందుకు అతను బైటికి వెళ్ళడానికోసం చూస్తోంది.
మాధవ్ రైల్వేస్టేషనుకి ఫోన్ చేస్తే, కోణార్క పదిగంటలు లేటని తెలిసింది. కొంచెం ఆశగా అనిపించింది. ఫోను దగ్గిర్నుంచీ లేవలేదు . భోజనం అన్యమనస్కంగానే చేసాడు. కొడుకు ఏడుస్తుంటే కాసేపు ఎత్తుకుని ఆడించాడు. వంటిగంటౌతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. వాసు చేసాడు.
“అన్ని ఆశలూ ఐపోయాయిరా! నిన్నరాత్రి బాబాయ్ ఫోన్ చేసినప్పట్నుంచీ ఎవ్వరం యింట్లో లేము. వెతికినవాళ్ళం వెతికినచోట వెతక్కుండా వెతుకుతున్నాం. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు ఏవీ వదలకుండా జల్లెడపట్టినట్టు వెతుకుతున్నాం. మహీ ఫ్రెండ్స్‌నికూడా అడిగాం. ఎవ్వరింటికీ వెళ్ళలేదు. చంటిపిల్లతో వెళ్ళిందిగాబట్టి పిచ్చిపనులేవీ చెయ్యదని ఒక నమ్మకం, అటొస్తుందన్న ఒక్క ఆశే మిగిలాయి. పోలీస్ కంప్లెయింటుకూడా యిచ్చాడు బాబాయ్. అమ్మమ్మ, పిన్ని ఒకటే ఏడుపు. ఇద్దరినీ ఎవరం పట్టలేకపోతున్నాం” అన్నాడు వాసు. అతనిగొంతు వణికింది.
“కోణార్క యింకా రాలేదురా! దానికోసమే ఎదురుచూస్తున్నాను” జవాబిచ్చాడు మాధవ్.
“ఇలా ఎందుకు చేసిందిరా? మనింటికి వచ్చేసినా సరిపోయేదికదా?”
“మనలో ఎవరిదగ్గిరకి వెళ్ళినా మళ్ళీ నచ్చజెప్పి పంపిస్తారని ఆలోచనేదో చేసింది. అసలుకి ఆ నరేంద్రగాణ్ణి లోపలేయించాల్సింది. అర్ధరాత్రి ఆడపిల్లని ఇంట్లోంచీ పంపించేస్తాడా? మనిషేనా అసలు?” కోపంగా అన్నాడు మాధవ్.
“వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఏమైనా తేడా వస్తే వూరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాము. నరేంద్రకూడా మాతోపాటుగా వెతికాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదట. వాళ్ళింటికి వెళ్ళిపోతుందనుకున్నాడట. అతని సంగతి తర్వాత. ముందు ఇది కనిపించాలికదా?” అన్నాడు వాసు.
“ఫూల్… ఇడియట్… స్కౌండ్రల్…” వచ్చిన తిట్లన్నీ తిట్టాడు మాధవ్. ఎంత కాదనుకున్నా బావగారుగాబట్టి అంతకన్నా పెద్ద తిట్లు తిట్టలేకపోయాడు. ఇంకో నాలుగైదుగంటల తర్వాత ముంబై చేరబోయే కోణార్కమీదే ఆశపెట్టుకుని అన్నదమ్ములిద్దరూ ఫోన్ పెట్టేసారు.


మనసు మొద్దుబారినట్టు వున్నా, ఏవీ ఆగలేదు మహతికి. రాత్రంతా కంటిమీదికి కునుకు రాలేదు. కూతురు ఆకలికి ఏడవటం, పాలు పట్టడం, డైపర్లు మార్చడం, ఆ పిల్లని ఆడించడం, నిద్రపుచ్చడం… అన్నీ యధావిధిగా జరిగిపోయాయి. యాంత్రికంగా చేసుకుపోయింది. దృశ్యాలన్నీ చీకట్లు కరిగించుకున్నాయి. తెలతెలవారుతోంది. మేఘన నిద్రలేచి ఆటలు మొదలుపెట్టింది. పాకడానికి లేక ఏడుపు మొదలుపెట్టింది. సైడుబెర్తులు రెండూ ఖాళీగా వుంటే అక్కడికి మారి, పాపని బెర్తుమీద వదిలి పడకుండా అంచుని తను అడ్డం కూర్చుంది. లక్కకాయ చేతికిస్తే దాంతో ఆడుకుంటూ, అక్కడక్కడే బోర్లాపడుతూ ఆడుకుంది మేఘన. బోర్లాపడుకోవడం బోరుకొట్టి కూర్చోవాలనుకున్నప్పుడు చోటుచాలక తల్లితో యుద్ధం చేస్తోంది. ఈ హడావిడిలో వుండగా హఠాత్తుగా అనిపించింది మహతికి, ఎవరో తనని గమనిస్తున్నారని. ఎవరతను? తెలిసినవాడు కాదు. మరీ చిన్నవాడు కాదు. నలభై వరకూ వుండచ్చు వయసు. ఎప్పట్నుంచీ చూస్తున్నాడు తనని? ఇబ్బందిగా అనిపించి, చీర భుజాల చుట్టూ కప్పుకుని కూర్చుంది.
అప్పటికి రెండుసార్లు కాఫీ తాగింది. ఆకలనిపించలేదు. అసలు ఆ ధ్యాసే పుట్టలేదు. ఇప్పటిదాకా జరిగిందేమిటి, ఇకపై జరిగేదేమిటన్న ఆలోచనలు కూడా రావటంలేదు. నరేంద్ర తనని కొట్టడం, యింట్లోంచీ పొమ్మనడం పదేపదే గుర్తొస్తున్నాయి. మనసుకి పుండు రేగినట్టుగా వుంది. జడత్వం వదిలింది. కళ్ళు నీళ్ళతో నిండితే చప్పుని తుడుచుకుంది. ఆగలేదు కన్నీళ్ళు. ముఖానికి పమిటకొంగు అడ్డం పెట్టుకుంది.
ఇదేనా జీవితమంటే? పెళ్ళంటే? ఎవరు సుఖంగా వున్నారు ఇంట్లో? తన తల్లి… తండ్రి చాలా కోపదారి మనిషి. చెడ్డవాడు కాదేమోగానీ, ఆయన కోపం అలా అనిపించేలా చేస్తుంది. ఇద్దరూ ఆడపిల్లలని సాధిస్తాడు. సంధ్య పిన్ని భర్తకి బైటి స్నేహాలున్నాయట. ఇంకా ఎవరెవరి జీవితాలు ఎలా వున్నాయో! ఎవరి పెదాలమీది నవ్వులు ఏ సమస్యలనీ, దు:ఖాలనీ దాచిపెట్టాయో తెలీదు. తన బతుకుమాత్రం బట్టబయలైపోయింది. పెళ్ళొద్దంది. ఇంకా చదువుకుంటానంది, వుద్యోగం చేస్తానంది. తండ్రి వినలేదు. చచ్చిపోతే వదిలిపోయేది. గుదిబండలా ఈ పిల్లని పుట్టించారు. అసలు దీన్నెందుకు వెంటపెట్టుకుని వచ్చింది తను? ఇప్పుడేం చెయ్యడం? ఏడుపు ఆపుకోవడం కష్టంగా వుంది.
“చూడండి”
మగగొంతు అతిదగ్గర్లో వినిపించి వులిక్కిపడింది. చప్పుని కళ్ళూ ముక్కూ తుడుచుకుని తలతిప్పింది. అతనే. తనని గమనిస్తున్నాడని అనిపించిన వ్యక్తి. గమనిక నిజమే.
“నిన్న ట్రెయిన్ ఎక్కినప్పుడు ఆ ఎక్కిన తీరూ అదీ చూసి, మీరేదో కష్టంలో వున్నారనిపించింది. మీకు టికెట్ రాసిన టీసీ నాకు ఫ్రెండు. అతను మీ బాధ్యత నాకు అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళాలి మీరు?” అడిగాడతను మృదువుగా.
“ముంబైకి టికెట్టు తీసుకున్నానుకదా?” అంది మహతి కొంచెం ఇబ్బందిగా.
“ముంబైలో ఎక్కడికి? ఎవరేనా వున్నారా?”
ఢిల్లీయో కలకత్తాయో అయితే జవాబు వెతుక్కునేది. ఇప్పుడు ఆ అవసరం రాలేదు. మాధవ్ కాపాడాడు.
“మా తమ్ముడున్నాడు”
“ఇంట్లో గొడవపడ్డారా? మీరు వస్తున్నట్టు మీ తమ్ముడికి తెలుసా? ఫోన్ చేశారా? లెటర్ రాశారా?” అతని ప్రశ్నలు చాలా బాధ్యతగా వున్నాయి. మహతి మాట్లాడలేదు. అతనికి ఎందుకు చెప్పాలని, అతనికేమిటి సంబంధమన్న కోపం.
“మీరు చూస్తే చదువుకున్నవారిలా వున్నారు. ఇంట్లో గొడవపడితే అర్ధరాత్రి యిల్లొదిలిపెట్టి వంటరిగా వచ్చెయ్యడమేనా? తెల్లవారేదాకా ఆగచ్చుకద? మీ భర్త ఏం చేస్తాడు? మహా ఐతే ఇంకా కొడతాడు. ఓర్చుకుంటే తెల్లారి పరిష్కారం దొరుకుతుంది. కాదంటే చంపేస్తాడు. ఒక్కసారితో గొడవ వదిలిపోతుంది. లేదంటే తిరగబడి కొట్టలేరా? గదిలోకి తోసేసి బైట గడియ పెట్టలేరా? వీధిలోనో పెరట్లోనో నిలబడి పెద్దగా అరిచి గొడవచెయ్యలేరా? ఇలా తొందరపడి ఇల్లొదిలిపెట్టి వచ్చేస్తే ఏ కొంచెం తేడా వచ్చినా బతుకు నిత్యనరకమేకదా? ఇంట్లోంచీ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అదేదో పగలు చెయ్యాలి. పకడ్బందీగా చెయ్యాలి. నా మాటల్ని తప్పుగా అనుకోకండి. ముంబైలో దిగగానే మీ తమ్ముడికి ఫోన్ చెయ్యండి. వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటే సంతోషం. లేకపోతే మిమ్మల్ని తిరుగురైల్లో మళ్ళీ మీవాళ్లకి అప్పజెప్తాను. ఈలోగా మీకే అవసరం వచ్చినా నాకు చెప్పండి. నా పేరు రామ్మోహన్. రైటర్ని. నాగురించి భయపడక్కర్లేదు” అన్నాడు.
మహతికి ఆ చొరవ చిరాగ్గా అనిపించింది. ఇతను తనకి కే‍టేకరేమిటి? తనని తిరిగి తీసుకెళ్ళి తనవాళ్ళకి అప్పజెప్తాడా? ఎవరికి అప్పగిస్తాడు? ఎవరిచ్చారు ఆ అధికారం? ఒక్కర్తీ ఆడపిల్ల కనిపిస్తే కాపాడే బాధ్యత మీద వేసేసుకోవడమేనా? ఆ టీసీ ఎవరు? అతను ఇతనికి తనని అప్పజెప్పడమేమిటి? ఇద్దరు అపరిచితులమధ్య తను చెయ్యి మారిందన్న విషయం అర్థమై అసహనాన్ని కలిగించింది. ఈ మారటం వెనక వుద్దేశాలు మరోలా వుంటే జీవితం ఇంకోలా వుంటుందనికూడా అర్థమై కొద్దిగా భయం వేసింది.
ప్రపంచం పెద్ద వ్యాపారకేంద్రం. ప్రతినిత్యం వస్తువులు చేతులు మారుతూ వుంటాయి. వస్తువులేకాదు, వాటిని మారకం చేసే మనుషులు కూడా కమోడిటీసే కొంతమందికి. కొన్ని దొంగవ్యాపారాలుంటాయి. మనుషుల్తో చేసే వ్యాపారం అలాంటిది. తను రాత్రివేళ వంటరిగా బయల్దేరింది. తప్పే. ఆ యిల్లు నరేంద్రకే కాదు, తనకీ యిల్లే. కట్నం యిచ్చి పెళ్ళిచేసుకుంది. కానుకలు తెచ్చి యిల్లు నిలబెట్టుకుంది. వెళ్ళిపోతానని ముఖంమీద చెప్పేసి అందరూ చూస్తుండగా ఎందుకు రాలేకపోయింది? తనింట్లోంచీ తను బయటికి రావటానికి రాత్రయి, ఒక సంఘటన జరగడంకోసం ఎందుకు ఎదురుచూసింది? తనింట్లోంచీ తనే ఎందుకు పారిపోయింది? తెలివితక్కువతనమేకదా? ఇలాంటి అనాలోచితమైన పనులే ఎదుటివాళ్ళకి చొరవ తీసుకునే అవకాశాన్ని యిస్తాయి.
“థేంక్స్. నేను చూసుకోగలను” ముక్తసరిగా అంది. అతను ఇంకేమీ మాట్లాడకుండా అతని సీట్లోకి వెళ్ళిపోయాడు. కానీ అతనన్న మాటలు బలంగా తట్టి లేపాయి ఆమెని. లేకపోతే రైలు ఆగి, దిగాక తడబడిపోయేది.
మాధవ్ ఇంటికి వెళ్ళాలనుకుని రాలేదు తను. ఎలా? వాడి యిల్లు తెలీదు. అసలు వాడు వూళ్ళోనే వున్నాడా? ఎటేనా వెళ్ళాడా? వాడు వూళ్ళో లేకపోతే ఏం చెయ్యాలి? తిరిగి వెళ్ళిపోవడమేనా? ఫోన్ చేస్తే తెలుస్తుంది, వున్నాడో లేదో కానీ తనకి ఫోన్ నెంబరుకూడా తెలీదు. ఆమె ఆలోచన పదునెక్కింది. రామ్మోహన్ మాటల్తో ఒక కుదుపులా మొదలైన ఆలోచనలు నెమ్మదిగా దార్లో పడ్డాయి. గీత ఇంటినెంబరు తనకి తెలుసు. గీతకి చేసి మాధవ్ నెంబరు తీసుకోవచ్చు. వప్పుకుంటాడా వాడు? కొన్నాళ్ళు వాళ్ళింట్లో వుండి ఏదేనా జాబ్ వెతుక్కుని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ తను ఆలోచించుకోలేదు. ఇలాంటివన్నీ ముందే ఆలోచించుకుంటారా? క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు తనది. అలాంటప్పుడు అన్నీ ఆలోచించుకోవలసింది. కొన్ని పనులంతే. జరిగేదాకా జరగాలన్న ఆత్రం వుంటుంది. జరిగాక మాత్రమే ఆలోచన మొదలౌతుంది.
అక్కడ యింట్లో ఈ విషయం తెలిసిందా? నరేంద్ర చెప్తే తెలుస్తుంది. చెప్పకపోతే? చెప్పకుండా వుంటాడా? తల్లిదండ్రులదగ్గిరకి వెళ్ళిందని అతను అనుకుంటాడు. అతనింట్లోనే వుందని వాళ్ళనుకుంటారు. అంతరాత్రివేళ ఇల్లొదిలిపెట్టి వచ్చింది. ఎక్కడికెళ్ళిందో, పోనీ తను వెళ్ళిందని అతను అనుకుంటున్నచోటికి క్షేమంగా చేరిందా లేదా, తనేమైందోనన్న భయం అతనికి లేదా? కనీసం మేఘనగురించి? ఎన్నో ఆలోచనలు మనసులో. భర్తకి తనంటే అంత పట్టింపులేకపోవడం మనసుని పిండేసినట్టైంది. అతను తనవాళ్లకి చెప్పాడో లేదో అప్పటికప్పుడు తెలిసే అవకాశం లేదని అర్థమైనా దాంతో సంబంధం లేని బాధ అది. అతికష్టంమీద ఆలోచనలని అటు మళ్లకుండా ఆపుకుంది.
ఆలోచనల్లో కొంత స్పష్టత వచ్చాక మనసు కుదుటపడింది. మేఘన పాలకోసం ఏడిస్తే అప్పటికే పోయించుకుని వుంచుకున్న పాలు పట్టింది. ఆ పిల్ల నిద్రకి పడింది. పిల్ల మొలతాటికి తన చీరకొంగు ముడివేసి, పడుక్కోబెట్టి తనూ పడుక్కుని బాగా దగ్గరికి తీసుకుని ఇద్దరికీ చీరకొంగు కప్పింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.
ముంబై చేరేసరికి సాయంత్రమైంది. ఈమధ్యలో మేఘన అనుష్ఠానాలన్నీ జరిగాయి. మహతి మరో రెండుసార్లు కాఫీ తాగింది. ముంబై సీయస్టీ వచ్చింది. ఆ జనం, హడావిడీ చూస్తుంటే అధైర్యంగా అనిపించింది. మాధవ్ వూళ్ళోనే వున్నాడా, లేడా ? పెద్ద ప్రశ్న. మేఘనని ఎత్తుకుని, బేగ్ తీసుకుని దిగింది. రామ్మోహన్ వెనకే అనుసరించాడు. ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు. ఎదురుగా పబ్లిక్ బూత్ వుంది. గీత యింటికి ఫోన్ చేసింది. ఎవరు ఎత్తారో ఇంకా తెలీదు. గోలగోలగా మాటలు వినిపిస్తున్నాయి.
“హలో!” అంది నెమ్మదిగా.
“ఎవరు?” అవతలివైపునించీ గీతదే ఆ గొంతు. తనని గుర్తుపట్టినా అందులో నిండా అపనమ్మకం.
“మహతిని”
“మహీ! ఎక్కడున్నావే? ఇక్కడ నువ్వేమయ్యావో తెలీక హడిలి చచ్చిపోతున్నాం” గమ్ముని అడిగింది గీత. ఆమె గొంతులో ఒక్కసారి ఎన్నో భావాలు. ముఖ్యంగా పెద్ద ప్రమాదం తప్పిందన్న సంతోషం. మహతికికూడా దారి తప్పిపోయి, వెతుక్కుని వెతుక్కుని మళ్ళీ సరైనదార్లోకి వచ్చినట్టు అనిపించింది. అది ఈ ఒక్క సంఘటనతో కాదు, ఐదేళ్ళుగా, పెళ్ళి అనే సంఘటన జరిగినప్పట్నుంచీ వెతుకులాటే. ఈ కుటుంబం, అందులోని తొమ్మిది యిళ్ళు, మనుషులు వీళ్ళే తనలో ప్రవహించే జీవధారకి మూలాధారం.
“ముంబైలో. సీయస్టీలో దిగాను. మాధవ్ యిక్కడే వున్నాడా? అటొచ్చాడా? నెంబరు నా దగ్గిర లేదు. వాడికి ఫోన్ చేసి స్టేషనుకి రమ్మను” అంది.
“ఇప్పుడే చేస్తాను. మహీ! ఎన్నో ప్లాట్‍ఫామ్‍మీద దిగావు? అక్కడ కేంటిన్ ఏదైనా వుంటే అందులో వెళ్ళి కూర్చో. ఏమైనా తిన్నావా? తిను. ఆఫీసులు వదిలే టైమ్ కదా, చాలా ట్రాఫిక్ వుంటుంది. వెంటనే బయల్దేరినా వాడు రావటానికి ఎంత లేదన్నా గంట పడుతుంది. బోల్డ్‌గా వుండు. కొత్తప్రదేశంకదా, తడబడకు. ఫోన్ పెట్టెయ్ ఇంక. వాడికి చేస్తాను” అంది.
మహతి ఫోన్ పెట్టేసి, బూత్ అతనికి డబ్బులిచ్చింది. ఎస్టీడీ కావడంతో బిల్లు బాగానే వచ్చింది. బూత్ అతనికి డబ్బులిచ్చి, వెనక్కి తిరిగేసరికి తనకోసం నిలబడ్డ రామ్మోహన్ కనిపించాడు. మాధవ్ వస్తున్నట్టు చెప్పేస్తే వెళ్ళిపోతాడనిపించి, అతని దగ్గిరకి నడిచింది.
“మా తమ్ముడు వస్తున్నాడు” అంది, మీరింక వెళ్లచ్చునన్న భావం ధ్వనించేలా. అతను అదేం పట్టించుకోలేదు.
“కేంటిన్‍కి పదండి. ఏదేనా తిందురు. మీ తమ్ముడు ఎంత దగ్గర్లో వున్నా రావడానికి గంటేనా పడుతుంది. అంటే మీరు ఇల్లు చేరడానికి మరోగంట. ఇంటికి వెళ్లాక ఫ్రెషయ్యి, తిండికి కూర్చునేందుకు ఇంకో అరగంట. వెరసి రెండున్నర, మూడుగంటలు. తినేస్తే ఒక పనౌతుందికదా?” అన్నాడు ముందుకి దారితీస్తూ. ఒక్కక్షణం మహతికి గీత గుర్తొచ్చింది. గీతకూడా ఇలానే ఆలోచిస్తుంది. ఒకప్పుడు తనూ అలానే ఆలోచించేది. అతనికీ తనకీ ఆలోచనల్లో సారూప్యత వుందని గ్రహించాక అతనిపట్ల చిన్న సానుకూలత ఏర్పడింది. తనకేమీ హానిచెయ్యడనే నమ్మకంకూడా కలిగింది. ప్రయాణమంతా తనని గమనించుకుని వున్నందుకు నవ్వూ వచ్చింది. సుధీర్‍వాళ్ళుకూడా ఇలాగే ఆడపిల్లల బాధ్యత మీదేసుకునేవారు. అలా అనుకున్నాక ఆమె ఆలోచనల్లో కొద్దిగా మార్పొచ్చింది. అతను భయపెట్టినట్టు మాధవ్ వూళ్ళో లేకపోయి, రామ్మోహన్ బలవంతంగా తిరుగు రైలు ఎక్కిస్తే మాత్రం ఈ సయోధ్య వుండేది కాదు. అదంతాకాదు, అప్పటికే నీరసం మొదలైంది మహతికి. ఎప్పుడూ లేనిది మేఘన బరువనిపిస్తోంది. ఏ కళ్ళేనా తిరిగితే? భయం వేసింది. గీతకూడా కేంటిన్లో ఏదేనా తినమనే చెప్పింది. ఇంక ఆలోచించలేదు. అతన్ని అనుసరించింది.
“పాపని ఇటివ్వండి” అన్నాడు ఆమె కష్టంగా నడవడం చూసి. అందించింది. మొదట వీణ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. మేఘన ఇమడలేదు. తర్వాత పుస్తకాన్ని పట్టుకున్నట్టు పట్టుకోబోయాడు. పిల్ల అతని చేతుల్లోంచీ జారిపోయింది. అతనికి చిన్నపిల్లలని ఎత్తుకోవడం రాదని అర్థమైంది మహతికి.
“నేను ఎత్తుకోగలను” మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇద్దరూ కేంటిన్లో వెళ్ళి కూర్చున్నారు. ఎవరి టిఫెన్ వాళ్ళే కొనుక్కుని తెచ్చుకున్నారు. అతనికి ఇలాంటివి పెద్దగా పట్టింపులు లేవని అర్థమైంది మహతికి. మరోసారి కలుసుకోవటం జరగదని ఇద్దరికీ తెలుసు. జరిగితే మాత్రం అది మిరకిలే. పైపై విషయాలే మాట్లాడుకున్నారు. అతను రచయితనని చెప్పినట్టు గుర్తొచ్చింది ఆమెకి. అతని రచనలగురించి అడిగింది కొంచెం కుతూహలంగా.
“నేను పాపులర్ రచయితని కాదు. నా బుక్స్ పుస్తకాలషాపుల్లో మొదటి వరసల్లో వుండవు. వెతుక్కుని, ఒకటిరెండు పేజీలు చదువుకుని కొనుక్కోవాలి. ఐనా నా రీడర్స్ నాకున్నారు” చిన్నగా నవ్వి అన్నాడు. రెయిన్ ఆన్ ఎ సన్నీ ఆఫ్టర్‍నూన్, వెన్ ఐ మెట్ ఎ డెవిల్ అంటూ తను రాసిన రెండుమూడు పుస్తకాలగురించి చెప్పాడు. ఎండగా వున్నప్పుడు వర్షం పడితే ఇంద్రచాపం ఏర్పడటంతోపాటు వడగళ్ళు పడతాయి. అంటే ఒకే సంఘటన, రెండు ఫలితాలు. మానవప్రవృత్తికి సింబాలిగ్గా చూపిస్తూ రాసాడట మొదటి నవల. రెండోది అధిభౌతిక విషయాల గురించి. చెప్తుంటే మహతికి ఆసక్తిగా అనిపించింది. పల్ప్ ఫిక్షన్ చదివి ఆస్వాదించే స్థాయిని దాటిందామె.
“యూనివర్సిటీలో వున్నప్పుడు బాగా చదివేదాన్ని. ఇప్పుడు తగ్గింది. కొత్తగా వస్తున్న సాహిత్యాన్నిగురించి పెద్దగా తెలీదు” అంది.
“పదేళ్ళైంది రాసి”
“సారీ!” అంది మహతి. “ఇప్పుడేమైనా రాస్తున్నారా?” అడిగింది.
“మొదలుపెట్టాలి. ఎ గర్ల్ ఇన్ ద ట్రెయిన్, నేమ్ నాట్ నోన్. మిమ్మల్ని చూసాక వచ్చిన ఆలోచన. మగవాళ్ళు చెయ్యని పని ఆడవాళ్ళే ఎందుకు చేస్తారని సందేహం. పుట్టిల్లైనా, అత్తిల్లైనా మీరుండే యింటికి మీరెందుకు చెందలేకపోతున్నారు? ఇలా వదిలేసి రావడం దేనికి?” అన్నాడతను.
“మీ ప్రశ్నలోనే జవాబుంది. అమ్మగారిల్లు, అత్తగారిల్లు. అంతేకదా, వుండేవి?”
“ఎవరికి వాళ్ళకే విడిగా యిల్లుండదు. ఒక్కో మనిషి ఒక్కో యింట్లో వుండరు. పోరాటం చేసేనా యిల్లు నిలుపుకోవాలి. ఉండే యిల్లంటే ఆస్థి కాదు. కొన్ని షరతులకి లోబడి కొందరు వ్యక్తులు కలిసి వుండే ప్రదేశం. షరతులు అంటే ఒక తల్లిదండ్రులకి పుట్టినవాళ్ళు, పెళ్ళిద్వారా కలుసుకున్నవాళ్ళు, ఇలా. మనని నిలబెట్టడానికి కాళ్లకింద వుండే నేల. మీ విషయాల్లో తలదూర్చుతున్నాననుకోవద్దు. నేను రచయితని. రచయితలు సహజంగానే కొంచెం స్వతంత్రం తీసుకుంటారు. మామూలు వ్యక్తులు ఆలోచించని విషయాలని ఫ్రేం దాటి వెళ్ళి ఆలోచిస్తారు”
“ఆలోచించండి. ఇంకా కొన్ని ప్రశ్నలే తప్ప జవాబులు దొరకవు” క్లుప్తంగా అంది మహతి. మాటల్లో ఎంతసేపైందీ తెలీలేదు. టైం చూసుకుంది. లేచి నిలబడింది. అతను అనుసరించాడు. వెళ్ళి గేటు ఎదురుగా నిలబడింది. మాధవ్ వస్తూ కనిపించాడు.
“మహీ!” అంతదూరంనుంచే అన్నాడతను. దగ్గిరకి వస్తుంటే అడిగాడు రామ్మోహన్. “అతనేనా?” అని. ఆమె తలూపింది.
“మరైతే నేను వెళ్తాను” అని ఆమె జవాబుకోసం చూడకుండా వెళ్ళిపోయాడు.
మాధవ్ వస్తూనే మేఘనని అందుకున్నాడు. చేతిలో బేగ్ తీసుకున్నాడు. “ఎంత హడలగొట్టావే? పద. టేక్సీలో వెళ్ళిపోదాం” అంటూ ముందుకి నడిచాడు. ముందు ఆమెని ఎక్కించి, పాపని అందించి తనూ ఎక్కాడు. టాక్సీ కదిలింది. మహతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చర్యలోని ఓదార్పు, ఆ స్పర్శలోని సాంత్వన. ఆమెని కదిలించాయి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ప్లీజ్, కంట్రోల్ చేసుకో. నా దగ్గిరకి వచ్చేసావుకదా? అందరం కలిసి ఏదో ఒకటి ఆలోచిద్దాం” అన్నాడు అనునయంగా. ఆమె సీట్లో వెనక్కి వాలి కళ్ళుమూసుకుంది. మూసుకున్న కళ్ళలోంచీ టపటప కన్నీళ్ళు జారుతుంటే పైటకొంగు ముఖంమీద వేసుకుని, శబ్దం రాకుండా నియంత్రించే ప్రయత్నం చేసింది. మాధవ్ మనసంతా కలిచివేసింది.


మాధవ్ ఇంట్లోంచీ వెళ్ళగానే నీలిమ అక్క మాధురి ఫోన్ వచ్చింది. నీలిమే చెయ్యాలనుకున్న కాల్ అది.
“మీదాకా వచ్చిందా, వార్త? వచ్చే వుంటుందిలే. చీమచిటుక్కుమటే చాలు, వూరంతా చాటింపు వేసుకుంటారు వీళ్ళు… మీ తోడికోడలు ఒక్కర్తి చాలు, వూరంతా వుగ్గళించడానికి. అబ్బ! నిన్నట్నుంచీ ఎవరికీ నిద్రలూ తిళ్ళూతిప్పలూ లేవనుకో. మూడోఆవిడ కూతురు నెలలపిల్లని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అనారోగ్యం మనిషిట, ఆమె. దాచిపెట్టి పెళ్లి చేశారు. ఆ పిల్లకూడా బోల్డంత వైద్యం చేయిస్తేగానీ పుట్టలేదు. ఆ భాగోతం అందరికీ తెలిసిందేగా? ఇప్పుడేవో గొడవలు మొదలయ్యాయి. ఆమెని కొడతాడట భర్త. అందుకే కోపం వచ్చి యింట్లోంచీ వెళ్ళిపోయిందనుకుంటున్నారు. మోసం చేస్తే కొట్టక నెత్తిమీద పెట్టుకుంటారా? ” అంది మాధురి గబగబ.
“వార్త రావడమేమిటి, ఆమే ఇక్కడికి వస్తోంది” అంది నీలిమ నీరసంగా.
“ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది, మీ దగ్గిరకి వస్తున్నట్టు?”
“ఇంకెవరు? ఆమెగారు స్టేషన్లో దిగి, వుందిగా ఆవిడ ఫ్రెండు, గీతకి చేస్తే గీత మీ మరిదికి చేస్తే, ఈయన స్టేషనుకి పరిగెత్తారు”
“మీకే చెయ్యచ్చుకదా? మధ్యలో గీత రికమెండేషనెందుకు?”
“ఏమోనే? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చిన మనిషిని మా యింటికి తీసుకొస్తున్నాం. ఏం గొడవలౌతాయో తెలీడం లేదు. అందరికీ దూరంగా వచ్చేసి, ప్రశాంతంగా వున్నాం. మళ్ళీ సుడిగాలీ, తుఫానూను”
“అసలు నిన్నట్నుంచీ ఎవర్నేనా నిలకడగా వుండనిచ్చిందా గీత? ఆమె వీళ్ళందరికీ లీడర్. పెద్దా-చిన్నా, ఆడా-మగా అంతా ఆమె నోటిమీద నడుస్తారు. మాకందరికీ ఫోన్లమీద ఫోన్లు. మహతి మీ ఎవరింటికైనా వస్తుందేమో ఎక్కడికీ వెళ్ళకండని వసంత్‍కి ఫోన్ చేసి చెప్పిందట. వాళ్ళు ఈరోజు కొలీగ్స్ కుటుంబాలతో కలిసి రామప్ప వెళ్దామనుకుని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. నెలరోజుల్నించీ అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందట. అంతే, ఆ ఫోన్‍తో ఆగిపోయారు. మానసకి ఏడుపొక్కటే తక్కువ, ఏమిటే యీ కర్మ, ఆమె వస్తుందని హారతిపళ్ళాలు సిద్ధం చేసుకుని వుంటామా అని. ఐనా మహతి తల్లిదండ్రులున్నారు, మేనమామలున్నారు, భర్త-అత్తవారు వున్నారు. వాళ్ళు చూసుకోరా?” అంది మాధురి. ఇంకొంచెంసేపు అదే విషయం మాట్లాడుకున్నాక కాల్ ముగిసింది. అదయ్యాక చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడింది నీలిమ. అవే విషయాలని మరోమాటు చెప్పుకున్నారు వాళ్ళిద్దరూ.
ఈ పెద్దకుటుంబం వాళ్ళు ముగ్గురికీ చాలా అసంతృప్తిని యిచ్చింది. తమదైన జీవితాన్ని ఎవరికి వారు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామనే బాధనీ, ఇన్ని బంధాలు-బాంధవ్యాలమధ్య ఎక్కడో చిక్కుపడిపోయి, భర్తలు తమకి ఎడంగా వుంటున్నారన్న దుగ్ధనీ రగిల్చింది. అవసరమా, ఇంత పెద్ద కుటుంబం, తల్లిదండ్రులతో పిల్లలే కలిసి వుండని యిప్పటికాలంలో మేమంతా ఒకటని ఈ తొమ్మిది కుటుంబాలవాళ్ళూ డప్పులు కొట్టుకోక ఎక్కడికక్కడకి తుంచుకోవచ్చుకదా? అనే ఆలోచన స్థిమితంగా వుండనివ్వదు వాళ్ళని.
ఇంకో గంటకి మాధవ్, మహతి యిల్లు చేరారు. మేఘన చికాకుపడి ఏడుస్తోంది.
“దాన్ని కిందకి దించరా!” అంది మహతి లోపలికి రాగానే సోఫాలో కూలబడి. పెట్టవలసిన పరుగు శ్వాస తీసుకోవడంకోసం ఆపినట్టుంది ఆమెకి. నీలిమ మంచినీళ్ళు, కాఫీ తెచ్చి యిచ్చింది.
“పాపకి కాస్త స్నానం పోసి, పాలుపట్టవే నీలిమా!” అన్నాడు మాధవ్. ఆమె పాపని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
“ఇలా ఎందుకు చేసావు మహీ? ఇంట్లోనే కూర్చుని మా అందరికీ ఫోన్లు చేస్తే వచ్చి ఆయన మక్కెలిగదన్నేవాళ్ళం” అన్నాడు.
“తప్పు మనవైపుని వుంచుకుని ఆయన్నెందుకు, అనడం?” అంది మహతి.
“మహీ!!”
మహతి జవాబివ్వలేదు. ఎవరికేనా ఏమని చెప్తుంది? తనకి అసలు స్పేసనేది మిగల్చలేదు ఎవరూ. ఎవరికీ ఏదీ చెప్పుకోలేకకదా, ఇల్లొదిలిపెట్టి వచ్చినది? “కొన్నిరోజులు ఆశ్రయం యివ్వు మాధవ్. ఏదేనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను. అసలు మీయింటికి రావాలని బయల్దేరలేదు. ఇక్కడికొచ్చాక ఆలోచన వచ్చింది” అంది.
“ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీయిల్లూ, నాయిల్లూనా? ఎలా పెరిగాము? ఎలా తిరిగాము? ఇప్పుడు నన్ను పరాయివాడిని చేస్తున్నావా?” మాధవ్ బాధపడ్డాడు.
“ఆరోజులు గడిచిపోయాయి మాధవ్. చదువుకుంటూ బాధ్యత తెలీకుండా తిరిగినరోజులు కాదు. నాచుట్టూ ముళ్ళు బిగించేసి, నన్ను అశక్తురాలిని చేసి మా అమ్మా నాన్నా ఆడిస్తున్న రోజులివి. ఉద్యోగం తెచ్చుకోకపోతే పెళ్ళి చెయ్యనంది అమ్మ. మళ్ళీ రవళికి ఆలస్యమైపోతోందని ఆగకుండా చేసేసింది. పెళ్లైన దగ్గిర్నుంచీ సమస్యలే. అసలు పెళ్ళే ఒక సమస్య. నీకెలా చెప్పనురా? ఏదేనా చెప్పబోతే నాన్న అరుస్తాడు. అమ్మ చస్తానని బెదిరిస్తుంది” అంది కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా. అతనికి ఏం చెప్పాలో తెలీలేదు. క్రమంగా మహతి దు:ఖం వుధృతి పెరిగింది. కొన్నేళ్ళుగా పోగుచేసుకున్న దు:ఖాన్ని బైటికి వొంపుతోంది. అతనికి ఏమని ఓదార్చాలోకూడా తెలీలేదు. గుండె చిక్కబట్టినట్టౌతోంది ఆ దు:ఖం చూస్తుంటే. కళ్ళు తడయ్యాయి. ఇంతలో ఫోన్ మోగింది. ఎత్తాడు. గీత.
“ఇంటికి వచ్చేసారా? ఎంతసేపైంది వచ్చి?” అడిగింది.
“ఇప్పుడే వచ్చాం” అన్నాడు.
“ఏం చేస్తోంది?”
“తీరిగ్గా కూర్చుని ఏడుస్తోంది”
“ఫోన్ యివ్వు దానికి” అంది గీత. మహతి మాట్లాడనన్నట్టు చెయ్యూపింది.
“మాట్లాడదట. తర్వాత చేయిస్తాలే” అన్నాడు మాధవ్. “గీతా! ఏమైందసలు మీ అందరికీ? చిన్నమాటనేసరికి చాలు, నలుగురూ కలిసి మామీద రాకాసుల్లా పడిపోయేవారు. ఆ బోల్డ్‌నెస్ ఏమైపోయింది? మహీని చూస్తుంటే బాధేస్తోంది. అక్కడే వుండి, తిరగబడక, ఒక్కర్తీ పసిపిల్లనేసుకుని ఇంతదూరం రావడం, ఈ కన్నీళ్ళు, నాకేమీ అర్థంకావట్లేదు. బాబాయ్‍వాళ్ళూ ఎందుకు పట్టించుకోరు?” అన్నాడు.
“అప్పుడంటే చిన్నతనంకదూ? మమ్మల్ని తిరగబడి కొట్టలేకనా, మా చేతుల్లో దెబ్బలు తిని వూరుకునేవాళ్ళు? మేం కొట్టడానికి చెయ్యెత్తితే పరిగెత్తించి పరిగెత్తించి ఆఖర్లో ఒక దెబ్బవేయించుకోవడం అప్పటి సరదా. అప్పటి కోపాలూ, దెబ్బలాటలూ అన్నీ తాటాకుమంటల్లా వుండేవి. ఇప్పుడలాకాదు. ఈ దెబ్బలాటల వెనక పరిష్కారం అడిగే సమస్యలుంటాయి. నిలువునా దహించేసే దు:ఖం వుంటుంది. ఎదుటివాళ్లని దగ్ధం చెయ్యాలనిపించే క్రోధం వుంటుంది. మహిని అమ్మానాన్నలు పట్టించుకోకపోవటమేమిటి? పోతే సమస్య దీనిది, పరిష్కారం వాళ్ళది. ఒకొక్కసారి రెండూ కలవ్వుకదా?” అని, ఆగింది.
“సరే, విను. రేపు నేనూ, వాసూ బయల్దేరుతున్నాం. ఎల్లుండి మామ్మ, మహి అమ్మానాన్నలు, అత్తా వస్తున్నారు. అందరికీ ఒక్కసారి రిజర్వేషన్లు దొరకలేదు. మహీవాళ్ళనాన్న మామ్మకే కాస్త వింటాడు. లేకపోతే శివాలెత్తిపోతాడు. వచ్చినదగ్గరనుంచి పిన్నిని తిడుతూ ఉంటాడు. ఎవరికీ ఏమీ తోచనివ్వడు. అందుకే మామ్మని తీసుకొస్తున్నాం. రవళికూడా వస్తోంది. వాళ్ళు విడిగా వస్తున్నారు. ఎవరికి ఎలా రిజర్వేషనైతే అలా బయల్దేరుతున్నాం. మహీకి ధైర్యం చెప్పు. తన యిష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదని హామీ యివ్వు” మళ్ళీ తనే అంది గీత. మాధవ్ సరేనని పెట్టేసాడు. అతను మాట్లాడినవన్నీ లోపలున్న నీలిమకి బాగానే వినిపించాయి. గీత ఏం మాట్లాడి వుంటుందో తెలీదు. ఊహించడానికి ప్రయత్నం చేసింది. మాధవ్ మళ్ళీ మహతిదగ్గిరకి వచ్చి కూర్చున్నాడు.
“ఎంతసేపు ఏడుస్తావే? లే, స్నానం చేస్తే అన్నం తిందాం” అన్నాడు. “బట్టలేవేనా తెచ్చుకున్నావా? లేకపోతే నీలిమవి కట్టుకుందువుగాని. రేపు బజారుకి వెళ్ళి నీకు కావల్సినవి తెచ్చుకోవచ్చు” అన్నాడు. మహతి కదల్లేదు.
“రేపు గీతా, వాసూ బయల్దేరుతున్నారు. ఎల్లుండి మిగతావాళ్ళొస్తున్నారు. అందరం కలిసి మాట్లాడుకుందాం. నీ యిష్టానికి భిన్నంగా ఏదీ జరగదని చెప్పమంది గీత” అన్నాడు.
“వాళ్లంతా ఎందుకొస్తున్నారు? నాకు ఎవ్వర్నీ కలవాలని లేదు. ఇక్కడినుంచీ వెళ్ళిపోతాను” అంది విసుగ్గా.
“ఎక్కడికి వెళ్తావు? సమస్యనుంచీ పారిపోయినంతమాత్రాన అది నిన్ను వదిలిపెడుతుందా? ఇంకా జటిలమౌతుంది. వీళ్ళనంటే తప్పించుకుంటావు సరే, రేపు బావావాళ్ళూ వస్తే? నువ్వు దొరక్కపోతే పోలీసుకంప్లెయింటు ఇస్తారు. మేఘన అతనికీ కూతురేకదా, దాన్ని తీసుకెళ్ళిపోతారు. ఒక్కదానివీ ఏం చెయ్యగలవు? మహీ! ఇంతదాకా పెద్దవాళ్ల వ్యవహారంగా వున్న సమస్య యిప్పుడు వాళ్ళతరాన్ని దాటుకుని మనమధ్యకి వచ్చింది. నీకేం కావాలో స్పష్టంగా ఆలోచించుకో. మేమంతా నీకు అండగా వుంటాము. నీకు కష్టం కలిగించేది ఏదీ జరగదు” అన్నాడు నచ్చజెప్తున్నట్టు. ఆమె అయిష్టంగా లేచింది. బాత్రూంలో షవర్ శబ్దం వినిపించాక నీలిమ అతన్ని పిలిచింది. అప్పటికి మేఘన తయారైపోయింది. నేలమీద దింపితే చకచక ఇల్లంతా పాకేస్తోంది. మాధవ్ కొడుకు ఆ పిల్లని వింతగా చూస్తూ వెంటవెంట తిరుగుతున్నాడు.
“అమ్మా! పాప… పాప…” అంటున్నాడు సంభ్రమంగా.
“నేనొక్కమాట చెప్తాను వింటారా?” అడిగింది. అతను ఏమిటన్నట్టు చూడగానే, “ఈ బాధ్యతంతా మీరెందుకు మీదేసుకుంటున్నట్టు? ఆమె తల్లిదండ్రులు, మేనమామలు అంతా వున్నారు. మనింట్లో ఈ గొడవలన్నీ దేనికి? తనని వెంటబెట్టుకుని మీరే అక్కడికి వెళ్తే బావుంటుందికదా?” అంది నెమ్మదిగా. మాధవ్ ఆమెకేసి నిశితంగా చూసాడు.
“నీలూ! మీ అంత కంపాక్ట్ ఫామిలీ కాదు మాది. మా మామ్మ సంతానం, అమ్మమ్మ సంతానం, అమ్మ సంతానం కలిపి ఒకటే కుటుంబం అనుకుంటాం మేము. ఈ విషయం నీకు ఇంతకిముందే ఎన్నోసార్లు చెప్పాను. నీకూ తెలుసు. మాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరించుకుంటాం. ఇప్పటిదాకా మహతి విషయం వాళ్ళ అమ్మానాన్నలు, మిగిలిన పెద్దవాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు తను నన్ను వెతుక్కుంటూ మనింటికి వచ్చింది. నామీద నమ్మకంతో వచ్చింది. ఇంటిదాకా వచ్చిన ఆడపిల్లని వెళ్ళిపొమ్మని చెప్పక చెప్పినట్టు తీసుకెళ్ళి వాళ్ళింట్లో వదిలిపెట్టి రాలేను. ఎంత గొడవలైనా పరిష్కారం ఇక్కడే జరగాలి. పెద్దవాళ్ళంతా కదిలి వస్తున్నప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వడం బాగోదు” అన్నాడు స్పష్టంగా.
“అదేమాట మీ వదినకి వర్తించదా? ఆవిడ సలహామీదేకదా, అంతా ఇక్కడికి వచ్చేది?” చురుగ్గా అడిగింది.
“కేపబుల్ కాబట్టి ఏంచేద్దామని వాళ్ళు అడుగుతారు, తనకి తోచింది చెప్తుంది. అడక్కుండా ఎందులోనూ తలదూర్చదు” అన్నాడు. ఆ మాట ఎక్కడో సున్నితమైనచోట తాకింది నీలిమకి.
“మీరసలు నామాట ఎప్పుడు విన్నారు?”
“ఎప్పుడు వినలేదు? ఎందులో వినలేదు?” నిలదీసాడు. ఆమె తడబడింది. నిజమే. తామిద్దరికీ సంబంధించిన అన్ని విషయాల్లోనూ తనదే పైమాట. మిగిలిన విషయాల్లోమాత్రం అతను వినడు. ససేమిరా. ఈ విషయాలమీద ఇప్పటికే చాలా గొడవలయ్యాయి. వాటికి పర్యవసానంగా మాధవ్ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో అతను చాలా బెంగపడ్డాడు. ఇంత పెద్ద ముంబైనగరంలో ఇమడలేకపోయాడు. తల్లికూడా తననే తప్పుపట్టింది.
“ఎంచి చూడ్డానికి ఏ వంకా లేనంత చక్కటి సంబంధాలు దొరికాయి మీకు. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ అన్నదమ్ముల్ని ముగ్గుర్ని చేసుకున్నారు. మేం ఏం పెడతామా అనే ఆశింపులు లేవు వాళ్ళకి. అల్లుళ్ళమధ్య ఎలాంటి అరమరికలూ లేవు. మాకెంత మనశ్శాంతిగా వుందో తెలుసా? ఇంక గీతంటావా, వాళ్లందరిమధ్యా పుట్టి పెరిగింది. మీ అత్తగారికి మేనకోడలు. కాస్త అభిమానం చూపిస్తుందేమో! పెట్టుకోమను, నెత్తిమీద. అలాగే తిరగమను. ఆస్తుల్లోనూ పెట్టుపోతల్లోనూ తేడా చూపిస్తే నిలదియ్యాలిగానీ, చిన్నచిన్నవిషయాలకి గొడవలు చేసుకుని మీ భార్యాభర్తలమధ్య వున్న సఖ్యత చెడగొట్టుకుంటావా?” అంది.
చిన్న విషయమేనా? ఒక నాణానికి రెండు ముఖాల్లా, పువ్వుకి తొడిమా- రెక్కాలా, ఒక ఒరలో రెండు కత్తుల్లా… ఒక యింట్లో ఇద్దరు కోడళ్ళు. ప్రతిదానికీ గీత… ప్రతివాళ్ళకీ గీత… తన తెలివినీ, చదువునీ, చురుకునీ కప్పేస్తూ, అన్ని బంధాల్లోనూ, అన్నిచోట్లా గీతే. ఆ అందరి మనసుల్లోనూ నిండిపోయి. ఎలాగో వదిలించుకుని బయటపడింది. ఇప్పుడీ మహతి. ఈమె ఎలాంటిదో! ఎన్నాళ్ళుంటుందో! ఆమెముందు తను కనిపిస్తుందా మాధవ్‍కి? మళ్ళీ గొడవలు మొదలా? ఎందుకీ అవసరంలేని బంధాలని చుట్టుకుని, వాటిల్లో ఇరుక్కుపోయి బతకడం? భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళుగా వుంటే చాలదా? అప్రసన్నంగా అనిపించింది.
“పెద్దగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. చాలా మామూలు విషయాలివి. అందరిళ్ళలోనూ వుంటాయి. ఇలాంటి సమస్యలు చాలానే దాటాం మనం. గీతతో జరిగిన గొడవలకన్నా పెద్దవేం జరగవు. ఇంట్లోకి సరుకులేమేం కావాలో లిస్టు రాసిస్తే మార్వాడీకి ఇచ్చి వస్తాను. కూరలు రేపు తెచ్చుకోవచ్చు” చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోయాడు. నీలిమ చిన్నబుచ్చుకుంది. వినని మనిషికి ఎంత, ఏం చెప్పి ఏం లాభం అని తనకి తనే సర్దిచెప్పుకుంది. కుటుంబవిషయాల్లో కొన్నిట్లో మగవాడికి స్వేచ్ఛ వుండదు. ఇంకొన్నిటిలో ఆడవారికి. అది అర్థం చేసుకోగలిగితే ఇళ్ళలో సమస్యలు తలెత్తవు. ప్రతీ విషయం తనకే అనుకూలంగా జరగాలనుకోవడంలో సమస్య ఇమిడి వుంటుంది. నీలిమకి బాగా అనుభవం. తెగిపోయేదాకా వచ్చిన బంధం మళ్ళీ అతుక్కుంది. అందుకే ఆమె తగ్గింది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎందుకు బిగబట్టాలో మాధవ్‍కీ తెలుసు. ఆమెనుంచీ వచ్చే ప్రతిఘటన అర్థం కానట్టు వదిలేసాడు.
అతను హాల్లోకి వెళ్ళి ఇలా టీవీ పెట్టాడో లేదో, వంటింట్లోంచీ శ్రీముఖం.
“ఈ పిల్లేమిటండీ బాబూ? అంత బిజీగా ఇల్లంతా పాకేస్తోంది? ఏవైనా నోట్లో పెట్టేసుకుంటుందో ఏమిటో? కాళ్ళకీ చేతులకీ అడ్డంపడిపోతోంది” అంది, మేఘన హడావిడి చూసి హడలెత్తి. రోజంతా రైల్లో కట్టేసినట్టు వుందేమో, వేణ్ణీళ్ళ స్నానం, వెచ్చగా పాలూ పడేసరికి గిలకలా తిరుగుతోంది. మాధవ్ వచ్చి వంగి ఎత్తుకున్నాడు. అతని కొడుకు వెనకే వచ్చి చేతులందించాడు. రెండోవైపుకి వాడినీ ఎత్తుకున్నాడు.
“మా మామయ్య చిన్నప్పుడు మమ్మల్ని ఇలానే ఎత్తుకునేవాడు. ఎప్పుడూ ఇంట్లో ఇద్దరో ముగ్గురో పిల్లలం వుండేవారం” అన్నాడు.
“ఆయనకంటే స్వంతచెల్లెళ్ళూ, బాధ్యతాను. మీకు కాదుకదా?” అనబోయి ఆగిపోయింది చెప్పినా అతనికి అర్థంకాదని, అర్థం చేసుకునే ప్రయత్నంకూడా చెయ్యడని. అప్పటిదాకా జరిగిన స్పర్థని పొడిగించడం దేనికని వూరుకుంది. కొద్దిసేపయాక ఆమెకూడా వచ్చి వంటింట్లోంచీ వచ్చింది.
“బావుంది మురిపెం. ఇద్దర్నీ కలిపి అలా ఎంతసేపు ఎత్తుకుంటారు?” అని, కొడుక్కోసం చెయ్యిజాపింది. వాడు తల్లికి మొహం తిప్పేసుకున్నాడు. మేఘనని అందుకోబోతే ఆ పిల్ల ఒక్క వుదుటుని మీదికి దూకింది.
“మహాచురుగ్గా వుంది. కష్టమే, దీన్ని పట్టుకోవడం. రైల్లో రోజంతా ఎలా ఆపిందో, వీళ్ళమ్మ” అంది, జాగ్రత్తగా ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ.
మేఘన రెండు పెదాలూ బిగబట్టి మొహంలో మొహం పెట్టి ఫ… అంది.
“నామీదకెక్కి కూర్చుని నన్ను పొమ్మంటావేమే? అవంతీపురంవాళ్ల తిక్క కాస్తంత నీకూ వుందా? ఆ తానులో పోగువేకదా?” అని నవ్వేసింది నీలిమ. ముఖంమీదికి పడుతున్న జుత్తు, నల్లగా మిలమిల్లాడుతున్న కళ్ళూ, కదిలినప్పుడల్లా వూగుతున్న ఎర్రరాళ్ల లోలక్కులు. పిల్లని మృదువుగా దగ్గిరకి తీసుకుని ముద్దుపెట్టుకుంది. మాధవ్ తేలిగ్గా నిశ్వసించాడు.
మనుషులు చెడ్డవాళ్ళు కారు. కుటుంబం, సమాజం వాళ్ళకోసం మూసలు తయారు చేసి వుంచుతాయి. ఓ వంపులో అత్తా ఆడబిడ్డలూ మంచివాళ్ళు కాదనీ, మరో మెలికలో కోడలు కన్నకూతురవ్వదనీ, నువ్వెక్కువనీ, మరొకళ్ళు తక్కువనీ ఇలాంటి ఎన్నో మేనుఫాక్చర్ డిఫెక్ట్స్ వుంటాయి. అందులోకి వారు సర్దుకునే క్రమంలో వాటన్నిటినీ సరిజేసుకుంటూ రావాలి. లేకపోతే అవి మనుషులు బైటికి చూపించే ప్రవర్తనలో బాగంగా వుండిపోతాయి.
మహతి స్నానం చేసి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా మంకెనపువ్వుల్లా వున్నాయి. నీలిమ పక్కని వెళ్ళి కూర్చుంది.
“ఏడవడానికి బాత్రూమెందుకే? ఇంకాసేపు ఇక్కడే నువ్వుండి ఏడుస్తానంటే వద్దనేవాడినా? అదేదో ఇక్కడే పూర్తిచేసుకుని వెళ్ళాల్సింది. సదుపాయంగా వుండేది” అన్నాడు మాధవ్.
“పోరా! పెళ్ళై కొడుకు పుట్టినా ఏం మారలేదు నువ్వు” అంది మహతి.
“ఎందుకు మారాలి?” అడిగాడతను.
మేఘన తల్లిమీదికి దూకింది. మహతి అందుకుంది.
“ఫ…” అంటూ కాస్త పెద్ద రాగం తీసింది పిల్ల.
“అక్కడేమో మీ నాన్న ఆయనింట్లో ఆయన కూర్చుని నన్ను పొమ్మన్నాడు. ఇక్కడేమో మామ యింట్లో అత్తవొడి సింహాసనం దిగి వచ్చి నువ్వంటున్నావా?” అంది.
“అబ్బ! ఎంత పండితులే, మీరిద్దరూను. మాటలుకూడా రాని గోళీకాయంత పిల్లది ఏదో చప్పుడు చెస్తే దానికి భాష్యాలు చెప్తున్నారు!” అన్నాడు మాధవ్. కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు.
“భోజనం చేసెయ్యండి. ఎప్పుడు తిన్నారో!” అంది నీలిమ.
“కాసేపాగి తిందాం. టిఫెను తిన్నాను” అంది మహతి. ఆమెకీ నీలిమతో పెద్దగా చనువు లేదు. పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్లలోనూ కలుసుకున్నప్పుడు పలకరించుకోవడమే. అదీ వీళ్ళు ముంబాయి వచ్చేసాక మళ్ళీ కలిసింది లేదు. వేడుకలూ, సాంప్రదాయాలూ ఎన్నున్నా, పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటివైపు చుట్టాలని కలవడానికి ఎన్నో పర్ముటేషన్లు, కాంబినేషన్లు పనిచెయ్యాలి.
“స్టేషన్‍కి వచ్చినప్పుడు నాతో ఒకాయన వున్నాడు చూసావా? నువ్వు రాగానే వెళ్ళిపోయాడు. నిన్నంతా నాకు కేర్‍టేకర్ రోల్ వేసాడు. రైల్లోంచీ దూకేస్తానేమో, ఇంకే పిచ్చిపనేనా చేస్తానేమోనని చూస్తూ కూర్చున్నాడు” అంది మహతి.
“మరి పరిచయం చెయ్యలేదేం? రైలు దిగినప్పుడు నిన్ను చూసి నేనూ కంగారుపడ్డాను. అంత పెద్దగొడవ జరిగిందా మహీ?” అడిగాడు బాధపడుతూ. నీలిమకీ బాధేసింది. ఆడపిల్ల కంటతడి పెడితే కదలని గుండె వుండదు. మహతి అతని ప్రశ్నలకి జవాబు చెప్పలేదు.
“రామ్మోహన్‍ట అతని పేరు. రైటర్నని చెప్పాడు. నువ్వు అతని పుస్తకాలేవేనా చదివావా?”
“ఇక్కడ తెలుగువాళ్ళ సంఘం వుంది. వాళ్లలో కొందరు విమెన్ ఎంపవర్‍మెంటుమీద పనిచేస్తారు. ఇతనొకడు. పేరు విన్నాను. పరిచయం లేదు. మన ఫీల్డు అదికాదుకదా?” అన్నాడు.
“సిత్ సితారా అని ఒక కథ నేను చదివాను. అతను ఎంచుకునే కథావస్తువు మామూలుదే ఐనా చూపించే కోణం భిన్నంగా వుంటుంది. రావణసంహారం తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ విషయాన్ని ఆవిడ కోణంలోంచీ రాసాడు.
రాజ్యానికి రాణి ఎలాంటి ప్రలోభంలో పడకూడదు. బంగారుజింక అనే మోహంలో పడటం ఒక యుద్ధానికే కారణమైంది. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. రావణుడే గెలిస్తే మమ్మల్ని నమ్మినవాళ్ళకి అకారణద్రోహం జరిగినట్టు. రాముడు ముందుండి నన్నూ లక్ష్మణుడినీ నడిపించిన నాయకుడు. నాయకుడి బలాన్ని నేను శంకించి మారీచుడి కేకలు విని కంగారుపడ్డాను. ఆ క్షణాన రాముడు నా బలహీనత అయ్యాడు. యుద్ధనీతికి విరుద్ధం. నాకు కాపలాగా వున్న లక్ష్మణుడిని బలవంతంగా పంపడం, అతను దాటద్దన్న హద్దుని దాటడం, ఇవన్నీ నా అపరాధాలు. శిక్ష సరైనదే- అనిపిస్తాడు ఆవిడ పాత్రచేత” అంది నీలిమ.
“చాలా బావుంది ఆయన వివరణ. అప్పటి మనుషులకి బాధ్యత అనేది అసిధారావ్రతంలాంటిది. అందుకే ఈరోజుకీ వాళ్లని తలుచుకుంటున్నాం. దైవస్థానంలో నిలబెట్టి పూజలు చేస్తున్నాం” అంది మహతి. జస్ట్ బీటింగ్ అబౌట్ ద బుష్. మాధవ్‍తో చాలా చెప్పాలని వుంది. కానీ ఏదో సంకోచం అడ్డుపడుతోంది. చెప్పలేకపోతోంది. అది భార్యాభర్తలిద్దరికీ అర్థమైంది. తనుండటంవలన మాట్లాడలేకపోతోందని అనుకుంది నీలిమ. లేవబోయింది. మహతి చెయ్యి పట్టుకుని ఆపింది.
“నీకు తెలీకూడని రహస్యాలేం వుండవు నీలిమా! నువ్వూ మాలో ఒకదానివి. కూర్చో” అంది.
“చెప్పు మహీ! మీమధ్యని గొడవలు జరుగుతున్నాయని తెలుసు. అవేంటో వివరంగా తెలీదు. అనారోగ్యం, పిల్లలు పుట్టకపోవటం, ఇలాంటి జవాబులేవో వినిపించేవి. పెళ్ళికిముందు బాగానే వుండేదానివి. కొత్తగా ఇదేంటని ఆశ్చర్యం. సుధీర్‍తో మాట్లాడాను. వాడు పీసీవోడీలనీ, హార్మోన్ల అసమతుల్యతనీ వైద్యపరిభాషలో ఏవో చెప్పాడు. ఇప్పుడు పాపకూడా పుట్టేసాక కొత్తగా గొడవలేంటి?” అడిగాడు. మహతి తలదించుకుంది. నెమ్మదిగా అంది.
“పెళ్లైన కొత్తల్లో రెండేళ్ళు మీ అందర్లాగే మేముకూడా బాగానే వున్నాం మాధవ్. చాలా చక్కటివాడతను. ఆకాశంలోంచీ చిన్నముక్క తుంచుకుని తెచ్చుకుని దానిమీద పడుక్కుని కలల్లో తేలిపోదామనుకునేవాడు. సముద్రానికి వలవేసి పట్టుకుని రాకుమారికి మేలిముసుగు వేయచ్చనుకునేవాడు. అంత భావుకుడైన మనిషి జీవితం రప్చరైపోతోంది. మనం మోసం చేసామన్న కోపం, కోరుకున్నది అందట్లేదన్న నిరాశానిస్పృహలు, నామీద చెయ్యిచేసుకోవడం, అక్కడితో ఆగదు గొడవ. కోపంగా ఇంట్లోంచీ వెళ్ళి గంటో రెండుగంటలో రోడ్లుపట్టుకుని తిరిగి ఇల్లు చేరతారు. అలా వెళ్ళినప్పుడు ఏ యింటిముందేనా నిలబడతారేమో, తలుపులు తెరిచి ఏ అమ్మాయేనా యితన్ని లోపలికి తీసుకెళ్తుందేమోనన్న భయం నన్ను నిలవనివ్వదు. ఇక అతని నాన్న ఎవర్నేనా గుళ్ళో పెళ్ళిచేసుకుని మరో కాపురం పెట్టమని సలహా యిచ్చారట. వాళ్ల బెదిరింపుల్లో తెలిసింది. అతన్లో అలాంటి దిగజారుడుతనం చూసి నేను తట్టుకోలేను. నువ్వు, సుధీర్, వాసు, మీ అందర్లాంటివాడే అతనుకూడా. చాలా మంచివాడు. చూస్తూచూస్తూ అతను అలా కావడం నేను భరించలేను. రాణాకోసం మీరంతా ఎంత బాధపడ్డారో, వాడిని దార్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసారో గుర్తు తెచ్చుకో. అలాంటివాడేకదా, ఇతనూ?” అంది తలదించుకుని. మాధవ్ వింతగా చూసాడు. మనసులో ప్రేమపెట్టుకుని విడాకులు అడగడం ఆశ్చర్యంగా అనిపించింది.
“…”
“చేస్తున్నది గవర్నమెంటు వుద్యోగంకాబట్టి ఇంకో పెళ్ళిచేసుకునే సాహసం అతను చేయకపోవచ్చు కానీ” ఆగింది.
“ఏ రోజుకారోజు అతను ఏ గడప తొక్కి వచ్చాడోనని అనుమానిస్తూ, అసహ్యించుకుంటూ బతకలేను. చదువూ, సంస్కారం, పౌరుషాభిమానాలు వున్నదాన్ని. అలాంటి బతుకు నాకొద్దు. తల్లిదండ్రులే కట్టు తెంపేసాక అలా జరగదన్న నమ్మకం నాకు లేదు. వాళ్ళు బాగా పెద్దవాళ్ళు. పాతకాలంవాళ్ళు. విడాకులిచ్చి ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చన్న ఆలోచన అతని తల్లిదండ్రులకి లేదు. అంతేకాదు, విడాకులంటే మనం యిచ్చిన కట్నం తిరిగివ్వమని అడుగుతామనో, మనోవర్తి కోరతామనో డబ్బుల్తో ముడిపెట్టుకున్న భయాలు కొన్ని. మా నాన్నకూడా ఏదో ఒకలా సర్దుకుపొమ్మంటాడు. అమ్మేమో ప్రతిదానికీ చస్తానని బెదిరిస్తుంది. ఏం చెయ్యనురా? నాది పెద్ద అనారోగ్యమో, సమస్యో కాదని చూసేవాళ్ళకి అనిపించవచ్చు. కానీ నావరకు నాకది పెద్ద సమస్యే. అతని నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అతని దగ్గిర గౌరవాన్ని పోగొట్టుకున్నాను. అపరాధిలా చూస్తున్నారు నన్ను వాళ్ళు” అంది.
మాధవ్ ఆమెకేసి సునిశితంగా చూసాడు. పెళ్ళి తామందర్లో ఎంతో కొంత మార్పు తెచ్చింది. భావాలూ, మనస్తత్వాలూ మౌలికంగా మారకపోవచ్చు. కానీ తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన రెండోమనిషి ప్రభావం ఎంతోకొంత వుంది. గీత, నీలిమ, తులసి, సుమతి, రవళి, ఈ ఆడపిల్లలంతా పుట్టిల్లనే కంఫర్ట్‌జోన్ వదిలిపెట్టాక కొంత సర్దుబాటు నేర్చుకున్నారు. శారీరకంగా కూడా మారారు. అమ్మలు అయారు. వళ్ళొచ్చింది, తగ్గింది, బలహీనపడ్డారు, మళ్ళీ పుంజుకున్నారు. జీవితంలోని రసాస్వాదన చేస్తున్నారు. పూర్ణత్వం దిశగా ప్రయాణిస్తున్నారు. వాళ్ల కళ్లలో కలలున్నాయి. ఆశలున్నాయి.
మహతి అలా లేదు. ఐతే ఆమెకూడా మారింది. ఆ మార్పు అసహజంగా వుంది. బాగా లావెక్కింది. మనసునిండా అలసట, విసుగు, ముఖంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ. పెళ్ళి, శృంగారం పీడకలలుగా మారాయి ఆమెకి. భార్యాభర్తలు పరిష్కరించుకోవలసిన విషయాలని అతని తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు చేతిలోకి తీసుకున్నారు. అదంతా ఆమెకి తన శరీరంమీదా, అది సహజంగా ఏర్పరుచుకున్న వ్యవస్థమీదా మందులు, వైద్యం, సాంప్రదాయంపేరిట జరుగుతున్న దాడిలా అనిపిస్తోంది. పిల్లలు కావాలనుకోవడంలో తప్పులేదు. కొందరికి అంత తేలిగ్గా పుట్టరు. ప్రయత్నాలు చేస్తారు. ఐనా పుట్టకపోవచ్చు. ఆ పాయింటు దగ్గిర రాజీపడట్లేదు మనుషులు. సవాలుగా తీసుకుంటున్నారు. ప్రకృతి విసిరిన ఈ సవాలుని జయించడానికి యుద్ధభూమి స్త్రీ శరీరం. కొందరు స్త్రీలు సవాలుని స్వీకరించగలరు. కొందరు తప్పుకుంటారు. స్వీకరించలేని ఈ కొందరిలో మహతి వుంటుంది. వేసుకుంటున్న మందులు ఆమె శక్తిని పీల్చేసుకుంటున్నాయి. ఆపైన పాప పెంపకం. అటుపైన తనకి ఎలాంటి బాధా లేదని భర్తముందు నటించవలసిన అవసరం. పర్యవసానంగా ఎదురైన ప్రశ్న. అతను అతనిలా, నేను నాలా ఎందుకు బతక్కూడదని. పైకి కనిపిస్తున్న ఈ మహతి రూపం మాధవ్‍ని కదిలిస్తోంది. ఎలా వుండే పిల్ల, ఎలాగైపోయింది! బాధపడ్డాడు.
“నాన్న, అమ్మ సర్దుకుపొమ్మని చెప్తారు. అంటే? సంధ్య పిన్ని, బాబాయ్‍లా బతకాలా మేము? ఎవరికోసం? అది జీవితమేనా? దాంట్లోంచీ మేము పొందేది? ఒకళ్ళకోసం ఒకళ్ళున్నారన్న నమ్మకం వీగిపోయాక ఇంక ఆ పెళ్ళికి ఎలాంటి విలువా, అర్థం వుండవు. ఇంక దేనికి, మేం కలిసి వుండటం? అలాంటి జీవితం నాకొద్దు మాధవ్. నేను వంటరిగా బతకాలనుకుంటున్నాను. ఇదొక్కటే పరిష్కారం. అతను పూర్తి ఆరోగ్యం వున్న మనిషి. నాకు అతన్ని సంతోషంగా వుంచే శక్తి లేదు. నేనుగానీ, గీతగానీ ఈ విషయాలు చెప్తే నాన్న వినరు. అందుకే సంకోచం విడిచి నీకు చెప్తున్నాను. మేము విడిపోవాలి. అంతకన్నా పరిష్కారం లేదు. నువ్వు, వాసు, సుధీర్, సుమంత్, మీరంతా మాట్లాడండి. నా కూతురి కాపురం కూల్చుతున్నారనే నిందకూడా వేస్తారేమో నాన్న, మీమీద. దాన్ని పట్టించుకోకండి” అంది మహతి.
“వదినా! నన్నుకూడా కూర్చోబెట్టి మీ విషయాలన్నీ ఓపెన్‍గా చెప్పారు. నాదొక్క మాట వింటారా?”’ అంది నీలిమ. మహతి చెప్పమన్నట్టు చూసింది. “మీరు తీసుకున్నది చాలా పెద్దనిర్ణయం. మీ అమ్మానాన్నగార్లు వప్పుకోరని మీరే అంటున్నారు. ఇది చాలా పెద్ద సిటీ. ఇక్కడ ఎవరేనా గైనిక్‍ని కలిసి, అసలు మీ సమస్యలగురించి చెప్పి, మరోమాటు సలహా తీసుకోవచ్చేమో!” అంది.
“నీ మాట కాదంటున్నాననుకోకు నీలిమా! కేవలం మందులు మింగినంతమాత్రాన ఇలాంటి సమస్యలు తీరవు. జీవనశైలి మార్చుకోవాలి. బీపీ వస్తుంది ఒక ఆడమనిషికి. ఆవేశపడకూడదు, ఆందోళనపడకూడదు, ఉప్పూకారాలు తగ్గించుకోవాలి, వ్యాయామం చెయ్యాలి, అంటూ ఆ పేషెంటుకి సవాలక్ష చెప్తారు. ఆమెని వూరికే రెచ్చగొట్టద్దు, ఆమెతో వాదించద్దు, ఆమెని ఆరోగ్యంగా వుంచడం పూర్తిగా నీ బాధ్యత అని ఆమెని వెంటబెట్టుకుని వచ్చిన మగమనిషికి చెప్పే డాక్టర్లెందరు? మూలం వుండేది అక్కడకదా? అలా చెప్పరు. అంటే ఆమె ఆరోగ్యం బాధ్యత పూర్తిగా ఆమెదే. ఇక్కడ నాది” అంది.
కొన్ని సమస్యలకి పరిష్కారం వుండదు. మహతి సమస్యకీ అంతే. ఆమె నిర్ణయమే కీలకం. నరేంద్ర విషయంలో మాధవ్ కోపం తగ్గలేదు. అతనికోణంలోంచీ ఆలోచించి అతనికి మంచి జరగాలని ఆలోచిస్తున్న మహతిమీద అతను చెయ్యిచేసుకున్నాడనేది మాధవ్ జీర్ణించుకోలేకపోయాడు. మర్నాడు సెలవు పొడిగించుకుని ఇంట్లోనే వుండిపోయాడు. మూడోరోజు తెల్లవారి వాసు, గీత దిగారు. అప్పటిదాకా మామూలుగా వున్నదల్లా, ముభావంగా మారిపోయింది నీలిమ. పలకరింపులు అయ్యాయి.
“పిల్లల్ని తీసుకురాలేదా, వదినా? వాళ్ళని చూసి చాలారోజులైంది” అన్నాడు మాధవ్, ఇద్దరే వచ్చేసరికి.
“రిజర్వేషన్లు చాలా టైట్‍గా వున్నాయి. మాకిద్దరికే చెరో బోగీలోను వచ్చాయి. వాళ్ళనీ వీళ్ళనీ రిక్వెస్టు చేసి ఒకచోటికి మార్చుకున్నాం. అందుకే మామయ్యావాళ్ళదగ్గిర వదిలిపెట్టి వచ్చాం” అన్నాడు వాసు.
మాధవ్ కొడుకునీ, మహతి కూతుర్నీ ఒకళ్ల తర్వాత ఒకళ్ళని ఎత్తుకుని ముద్దుచేసింది గీత. మాధవ్ కొడుక్కి కొత్త తెలుసు. విడిపించుకుని వెళ్ళి తల్లి చాటుని దాక్కున్నాడు. మేఘన, గీత మొహంలో మొహం పెట్టి, ఆమెని కూడా ఫ అంది.
“నువ్వే ఫ” అంది గీత ఆ పిల్ల ముక్కు పట్టి సుతారంగా వూపుతూ. ఆ పిల్ల రెండు రాగాలు తీసింది. గీత రెండు స్వరాలు హెచ్చు పాడింది. ఇద్దర్నీ చూసి, మాధవ్ పెద్దగా నవ్వేసాడు. “దీనికి నువ్వు బలే సరిపోయావు వదినా! వీళ్ళిద్దరూ నిన్నంతా శంకరభాష్యం చెప్పారు” అన్నాడు నీలిమనీ మహతినీ చూస్తూ.
“పిల్లది. దాని మాటలకి అర్థమేం వుంటుంది?” అని తనూ నవ్వేసింది గీత. “ఏమే, నిన్నంతా వీళ్ళందరికీ పాఠాలు చెప్పి చెప్పి అలిసిపోయావా?” అని మేఘనని మరింత ముద్దుచేసింది. మహతిని ప్రేమగా చూసింది. ముందురోజటి భయాందోళనలు తగ్గాయి, ఆమెని సజీవాకృతిగా చూస్తుంటే. వాసుకి కూడా.
“ఎంత హడలగొట్టేసావే! నువ్వు ఎప్పుడూ స్వతంత్రంగా ఒక్క పనికూడా చెయ్యగా చూడలేదు. ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగావు మహీ? అతనంత దురుసుగా ప్రవర్తిస్తుంటే నాతోనో గీతతోనో ఎందుకు చెప్పలేదు? మేం మీ నాన్నని తీసుకుని వెళ్ళి మాట్లాడేవాళ్ళంకదా? ఇలాంటివి దాస్తే ఎలా?” అన్నాడు వాసు.
“బాబాయ్‍కి అన్నీ తెలుసురా! వింటే ఆయన మహీవాళ్ళ నాన్నెందుకౌతాడు?” అన్నాడు మాధవ్.
కాఫీ ఫలహారాలయ్యాయి. నెమ్మదిగా రోజు ముందుకి సాగుతోంది. పిల్లల పనులు, వంట సాగుతున్నాయి. అన్నదమ్ములిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఫోన్లు చేసి మిగతవాళ్ళతో మాట్లాడారు.
“చాలా పొరపాటు చేసావు మహీ! ఇంతంత గొడవలు జరుగుతున్నట్టు మాయెవ్వరికీ తెలీదు. తెలిస్తే అక్కడికక్కడే తేల్చుకునేవాళ్ళం. మాయింటికి వచ్చేస్తే నేను నిన్ను కాయనే? ఇంత రిస్కు తీసుకోకూడదు. అతనేమో ఇంట్లో దర్జాగా కూర్చుని, నువ్వు వెళ్ళిపోతుంటే చూస్తూ వూరుకుని, మీ అమ్మాయి యింట్లోంచీ వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తాడా, ఒకవైపు నువ్వు, నీ కూతురు రైల్లోనూ, మరోవైపు మేమంతా రోడ్లమీదా పడతామా? ఎంత కంగారుపడ్డామో తెలుసా? మామ్మ, మీ అమ్మ ఎలా ఏడ్చారో! పైకలా వుంటాడుగానీ మీ నాన్న మాత్రం? కంగారెత్తిపోయారు. అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. నీ ఫోనొచ్చాక, అప్పుడు మాకు దిక్కు తోచింది” గీత మహతితో అంది. మహతి మాట్లాడలేదు.
“నాకూ చాలా ఏడుపొచ్చేసింది మహీ! మనలో ఏ ఒక్కరికి ఏ చిన్నకష్టం వచ్చినా తట్టుకోలేను” అంది గొంతు వణుకుతుండగా. మహతి ఆమెని దగ్గరకి తీసుకుంది. నెమ్మదిగా సర్దుకుంది గీత.
“నీ మనసులో ఏం వుందో మీ నాన్నతో కచ్చితంగా చెప్పు. ఆయన వినడం వినకపోవడం తర్వాతి సంగతి. ముందు నువ్వు బోల్డ్‌గా వుండాలి. ఏమనుకుంటున్నావో చెప్పగలగాలి. అప్పుడు మేమంతా నీవెనక నిలబడతాం. బలవంతపు కాపురం చెయ్యమని ఎవ్వరం అనం. కానీ కాపురం వద్దనుకోవడానికి నీ కారణాలేంటో స్పష్టంగా చెప్పగలిగితేనే మీ నాన్నని వప్పించగలం ” అంది గీత. మహతి తలూపింది.
“ఇప్పటికిప్పుడు విడాకులేమీ ఐపోవు. కొన్నాళ్ళు దూరంగా వుండి, ఆ తర్వాతకూడా నిర్ణయం మార్చుకోవచ్చు” అన్నాడు వాసు.
ఈ చర్చల్లో తనకి స్థానం లేకపోవడం, ముందురోజు మహతీ, తనూ, మాధవ్ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు వుండిన సాన్నిహిత్యం యిప్పుడు లేకపోవడం గ్రహించింది నీలిమ. తను వీళ్ళందరిమధ్యా పరాయిదే. అదే గొప్ప విషాదం ఆమెకి. ఇటు మాధురీ మానసల్లా అంటీముట్టనట్టు వుండటానికి లేదు. ఈ మనుషులంతా మాధవ్‍తోసహా గీతచూట్టూ తిరుగుతుంటారు. గీత తనింట్లో, తన జీవితంలో అనివార్యమైన భాగం. దూరం జరగడానికి ఎలాంటి వెసులుబాటూ లేదు తనకి.
ఇటు మహతి తల్లిదండ్రులు, లక్ష్మి, విజ్జమ్మ, అటు రవళి, ఆమె భర్త శ్రీనివాస్ ఇంచుమించుగా ఒకేసారి వచ్చారు. రావడమే వడగళ్లవానలా వచ్చాడు మహతి తండ్రి నారాయణ. దారంతా ఆయన భార్యని తిడుతునే వున్నాడు, కూతురు చేసినపని నచ్చక. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తమకి కొనసాగింపు అనుకుంటారు. వాళ్ళు మెప్పు పొందితే పొంగిపోయి, తప్పు చేస్తే కృంగిపోయి, పూర్తిగా పిల్లల స్పేస్‍లో బతికేస్తూ వుంటారు. వాళ్ళ బతుకుకూడా తామే బతకాలని వుంటుంది. కానీ సాధ్యపడదని తెలీక, తాము బతుకుతున్నదే వాళ్ల బతుకనుకుని, తాము కోరుకున్నట్టే అది వుండాలని నమ్ముతారు. అలాంటివాడు ఆయన. ఆ తిట్లు తినితిని విసుగెత్తిపోయిన నిర్మలకి మహతిని చూడగానే ఎలా స్పందించాలో ఎలా పలకరించాలోకూడా తోచకుండా పోయింది.
ఇంతమంది కొత్తవాళ్ళని చూసి రవళి కూతురు పెద్దగా ఏడుపు అందుకుంది. ఆమెని చూసి, వైరస్ అంటుకున్నట్టు మిగిలిన యిద్దరు పిల్లలుకూడా మొదలుపెట్టారు. మొదటి నాలుగైదు నిముషాలూ ఎవరికీ ఏమీ తోచలేదు. ఇల్లంతా గగ్గోలెత్తిపోయింది.
“నువ్వెందుకు ఏడుస్తున్నావే, పండితురాలా?” అంది గీత మేఘనని ఎత్తుకుని. నిర్మల పిల్లకోసం చేతులు చాపింది. గీత అందించింది. పిల్లని గుండెకి హత్తుకుని కూతురి చెయ్యి గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది ఆమె. వాస్తవానికి మైల్‍స్టోన్స్‌లో భాగంగా ఒక్కరోజులో మార్పు వచ్చి, కొత్త తెలీడం మొదలై మేఘనకూడా రవళి కూతురిలాగే ఏడ్చి వుండచ్చు. కానీ తల్లి పడుతున్న క్షోభ సటిల్‍గా అర్థమైందో ఏమో అనిపించింది బయటికి. చాలాసేపు ఏడ్చి, పాలు తాగి నిద్రలోకి జారుకుంది ఆ పిల్ల. ఇకపై సమాజంగానీ, ఇంట్లోవాళ్ళుగానీ ఆమెని చూసే దృక్పథం అలా స్థిరీకరించబడుతుంది. తండ్రి వదిలిపెట్టేసాడన్న జాలి, తల్లి వంటరిదన్న సానుభూతితో కూడిన దృష్టి ఆమెచుట్టూ అల్లుకుని వుంటుంది.
“ఊరుకో అత్తా! మహీ బానే వుందిగా!” అంది గీత వోదార్పుగా. పమిటచెంగుతో కళ్ళూ, మొహమూ తుడుచుకుంది నిర్మల. ఆవిడ ఏడుపూ, పిల్లల ఏడుపులూ ఆగీ ఆగగానే నారాయణ మొదలుపెట్టాడు.
“ఆడపిల్లల్ని అదుపులో పెట్టి పెంచుకోవడం చేతకావద్దా? దాని పెళ్ళికనీ, పిల్లని కనడానికనీ నాకున్న నాలుగుసెంట్ల భూమితోసహా అన్నీ అమ్మేసి పిచ్చివాడిలా ఖర్చుపెట్టాను. నిలబెట్టుకోవాలికదా? ఎంత తెగింపు లేకపోతే అతన్ని ఎదిరించింది చాలక పిల్ల తల్లై వుండి యింట్లోంచీ పారిపోయి వస్తుంది? దాని తోటిది చక్కగా కాపురం చేసుకుంటుంటే దీనికేమైంది? మన దగ్గిర లొసుగులున్నప్పుడు నోరుమూసుకుని పడుండక్కర్లేదా? పిల్లకి చెప్పుకోవా? నీ బుద్ధేమైంది? ఇద్దరాడపిల్లల్ని కన్నప్పుడే నీ తెలివితేటలు తెలిసాయి” అని నిర్మలని దులిపేసాడు. ఏ తప్పు, ఎక్కడే పొరపాటు జరిగినా, అది ఆమె చేసినా, మరెవరు చేసినా, అందులో ఆమె ప్రమేయం వున్నా, లేకపోయినా సంభాషణని తిప్పితిప్పి తీసుకొచ్చి అక్కడే ఆపుతాడు. ఇదివరకు కూతుళ్ళు ఎదురుచెప్పేవారు కాదు. అసలు విషయం పక్కనిపెట్టి, పొంతనలేని విషయానికి తల్లిని తిడుతుంటే ఇప్పుడుమాత్రం రవళి వూరుకోలేదు.
“ఊరికే అమ్మనెందుకు తిడతావ్ నాన్నా? ఆవిడకి మగపిల్లలు పుట్టరని ముందే నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? మరి ఆవిడ్ని పెళ్ళిచూపుల్లో చూసి తెలుసుకున్నదేమిటి?” అంది రవళి విసుగ్గా. అలాంటి సందర్భంలోకూడా ఆ మాటలు నవ్వు తెప్పించాయి. అందరూ నవ్వు ఆపుకోవడానికి సతమతమయ్యారు.
“ఈపాటి అడిగే తెలివి నాకూతురికి వుంటే అసలు ఇంతదాకా వచ్చేదే కాదు” అంది విజ్జెమ్మ.
“మా బతుకులు మమ్మల్ని బతకనివ్వలేదు. చిన్నప్పటినుంచీ మా ఇద్దరికీ ముడిపెడుతూ పెంచారు. అక్క పెళ్లి చేసుకోనంది. నాకు సమస్య ఔతుందని దాని మెడలువంచి పెళ్ళిచేసారు. అది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ మా అందరిలా బతకలేదు. అలా బతకడానికి దాన్ని పుట్టించలేదని భగవంతుడే ఎన్నో సూచనలు యిచ్చాడు. ఐనా మీరెవ్వరూ పట్టించుకోలేదు. దాన్ని చదివించి ఉంటే ఏ సైంటిస్టో, లింగ్విస్టో అయ్యేది. కనీసం అమ్మ అన్నట్టు వుద్యోగం వచ్చేదాకా ఆగివుంటే దానికి నచ్చినట్టు అది బతికేది. సరే, పెళ్ళి చేసారు, పిల్లలకోసం వాళ్ళు దెబ్బలాడుతున్నప్పుడేనా దాన్ని మనింట్లో వుంచేసుకోవలసింది. అంతా దానికి కలిసి నరకం చూపించారు. వంట్లోంచీ రోజులతరబడీ, వారాలతరబడీ రక్తం పోతూ వుంటే ఒక మనిషికి ఎంత కష్టంగా వుంటుందో తెలుసా నాన్నా? ఆరోగ్యమైన మెదడుండి శరీరం సహకరించక మంచానికి అంటుకుపోయి వుండటం ఎలా వుంటుందో మీకందరికీ ఎందుకు అర్థం కాదు?” కోపంగా అడిగి, శ్వాసతీసుకోవడంకోసం ఆగింది. చిన్నప్పట్నుంచీ ఆడపిల్లలని ఆయన తమని ఈసడించిన కోపం అంతా అందులో చూపించింది.
“ఆ పెద్దమనిషి, బావ, దానిమీద చెయ్యిచేసుకుంటాడా? ఎందుకు? ఐదునిముషాల సంతోషంకోసం? అదేమైనా బొమ్మా, వంట్లో అనారోగ్యం, అయిష్టం పెట్టుకుని అతనికోసం ఆడటానికి? అతన్ని సమర్ధించి మీరు అక్కని తప్పుపడుతున్నారా? ఇంకా పిల్లలు కావాలట వాళ్ళకి? అమ్మ నాదగ్గిర చెప్పుకుని ఏడ్చింది. ఇదేమైనా యంత్రమా, సహజంగా పుట్టని పిల్లలని తయారుచేసి ఇవ్వడానికి? ఏం, పిల్లలు లేకపోతే మనుషులు మనుషులు కారా? నల్లులో పిల్లులో ఐపోతారా? వీళ్ళొక్కళ్ళూ కనకపోతే యావత్తు మానవసృష్టే ఆగిపోతుందా? ఐనా ఒక పిల్లని కష్టమో, నిష్టూరమో, కని పడేసింది. అంత సరదా వుంటే ఇంకోదాన్ని పెంచుకోవచ్చుకదా?” అని చెరిగేసింది. అక్కడితో ఆగలేదు.
“మన తప్పుంటే, అక్కమీద యిష్టం లేకపోతే దాన్ని గౌరవంగా మనింట్లో వదిలిపెట్టి, నలుగుర్లో నిలదియ్యాలి. అంతేగానీ, కొట్టి యింట్లోంచీ వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తాడా? సిగ్గుందా, అసలు ఆయనకి? అన్నం తింటూ సవ్యంగా పెరిగిన మనిషేనా? అది క్షేమంగా పాపతో మన కళ్ళముందు కనిపిస్తోందిగాబట్టి ఈరోజుని ఇలా వున్నాం” అంటూ మహతిని పట్టుకుని ఏడ్చేసింది. ఈ ప్రేమలు, మమకారాలు, పునర్జన్మలా వుంది మహతికి. “రవళీ! దేనికే ఏడుపు? వూరుకో” అని వోదార్చింది.
డబ్బిచ్చి కొనిపెట్టిన అనారోగ్యాలు, వాటి మధ్య బిక్కుబిక్కుమంటూ మంచానికి అతుక్కుపోయి వుండటం, కాస్త కదిలితే చాలు జరిగే రుధిరవృష్టి, “నేనింక చచ్చిపోతానేమోనే!” అని భయంభయంగా అనడం, అందులోని బతుకుతీపి, “చావు ఇంకా భయంకరంగా వుంటుందా?” అని వణికిపోవడం అక్కాచెల్లెళ్ళు పంచుకున్న విషయాలు. రవళి ఈ జన్మలో మర్చిపోలేదు ఆ మాటల్ని, అవి పలుకుతున్నప్పుడు అక్క ముఖంలో కదిలిన భావాలనీ. ఒక స్త్రీ ప్రాణాలకి తెగించి కన్న ఆడపిల్లని తండ్రిననో, భర్తననో అధికారం చూపించి ఇలా హింసపెట్టడాన్ని సమర్ధించలేకపోతోంది. ఏమిటి ఇంత గొప్పగా చెప్పుకునే మాతృత్వం? సృష్టి కొనసాగడానికి ప్రకృతి చేసుకున్న ఏర్పాటు. దానిచుట్టూ కథలు, కవిత్వాలు,మాతృత్వంలోనే వుంది ఆడజన్మ సార్ధకం అని పాటలు. ఆడవారికి పిల్లలు పుట్టకపోతే మగవాళ్ళు కనేలా చెయ్యాలి పరిశోధనలు. అదీ సైన్సంటే. సమస్యకి పరిష్కారంగా మరో సమస్యని సృష్టించడం కాదు. బాధపడుతున్నవాళ్ళని ఇంకాస్త బాధపెట్టడం కాదు. ఎందుకు అర్థం కాదు, ఈ విషయం?
“నేనేమన్నానే? లక్షణంగా పెళ్ళి చేసాం. పాపకూడా పుట్టింది. హాయిగా కాపురం చేసుకుంటుందని నా తాపత్రయం” అన్నాడు నారాయణ తగ్గకుండా. “నువ్వు వాడి మాట వినవు. నిన్ను వాడో దెబ్బ వెయ్యకూడదు. ఓర్చుకోవు. నిన్నేమీ అనకూడదు. అర్ధరాత్రి యింట్లోంచీ పారిపోయి వచ్చేస్తావు. ఏం చేద్దామనే?” అడిగాడాయన మహతిని.
“ఏదేనా వుద్యోగం చూసుకుంటాను. నా బతుకు నేను బతుకుతాను” అంది మహతి.
“ఊళ్ళో నా పరువేంగాను? కూతురు అత్తారింట్లోంచీ పారిపోయి వచ్చిందంటే నలుగుర్లో తలెత్తుకుని ఎలా తిరగను? నీ భర్తా, అత్తవారూ ఎదురుపడతారు. వాళ్ళకి మొహం ఎలా చూపించను?”
“ఇక్కడే వుంటాను నాన్నా! ఇక్కడే వుద్యోగం వెతుక్కుంటాను”
“ఇక్కడా?” తెల్లబోయాడు. అందర్నీ చూసాడు. “ఒక్కర్తినీ నడిరోడ్డుమీద వదిలేస్తే దానికే తెలిసివచ్చి చక్కగా కాపురానికి వెళ్ళేది. దడికట్టినట్టు అంతా దానిచుట్టూ నిలబడ్డారు. నిన్ను చేసుకున్నాను, చూడు, అదీ నా బుద్ధితక్కువ. ఐనదానికీ కానిదానికీ నీ పుట్టింటివాళ్ళొచ్చి పడిపోతున్నారు. ఇది నా యింటివిషయం, నా కూతురి వ్యవహారం” అని భార్యకేసి తిరిగి అరిచాడు.
“నువ్వెందుకు వచ్చావే, ఇక్కడికి?” అడిగాడు గీతకేసి తిరిగి.
“అదేంటి, మా మరిది యిల్లు మాయిల్లు కాదా? మాయింటికి నేను రాకూడదా, మామయ్యా?” అమాయకంగా మొహంపెట్టి అడిగింది ఆమె.
“ఇది నీ యిల్లా? ఔన్లే, దేశంలో వున్న యిళ్ళన్నీ నీవే. వెయ్యిళ్ళ పూజారివి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా, వచ్చి వాలిపోతావు” అన్నాడు. “ఏమిటి, ఎలీట్ లెవెనా మిమ్మల్ని మీరు అనుకునేది? అందులో ఐదుగురు ఇప్పుడు ఇక్కడే తేలారు. ఇంకా ఎవరెవరు దిగుతున్నారు? ఏం కుట్రలు చేద్దామని? మహతి కాపురం నిలబెట్టే పనులు చెయ్యండి. అందరం సంతోషిస్తాం”
“మహీ మా యింటికి వచ్చింది బాబాయ్! మీమీద నమ్మకం పోయి, ఆశలన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇది కేవలం మీయింటి వ్యవహారం మాత్రమే కాదు” మాధవ్ కలగజేసుకున్నాడు. నారాయణ గుర్రుగా చూసాడు.
“ఐతే ఏమిట్ట? మళ్ళీ దాన్నక్కడికి పంపిద్దామనుకుంటున్నావా? ఏ ప్రాణమేనా తీసుకుంటే ఏంచేస్తావయ్యా? నా మనవరాలిని నాకు తెచ్చివ్వగలవా?” అడిగింది విజ్జెమ్మ.
“మీకు మనవరాళ్ళకేం తక్కువ? ఉన్నారుగా, ఓ మంద. ఇంకో మంద తయారౌతోంది” అన్నాడు నిరసనగా.
“నాలుగు కోళ్ళూ, మూడు మేకలూ లెక్క కాదుకదా? ఎంతమంది వుంటేనేం? ఏ పిల్ల ఆ పిల్లే. మహతి మహతే” అంది పెద్దావిడ.
“చంటిపిల్లని పెట్టుకుని ఇక్కడ వుద్యోగమేం చేస్తావే? పద నాతో. అక్కడికెళ్ళాక ఏదో ఒకటి ఆలోచిద్దాం” అన్నాడు నారాయణ మహతితో. ఎలాగో ఈమధ్యనుంచీ తీసుకెళ్తే తర్వాతి విషయం తర్వాత చూసుకోవచ్చని వుంది.
“నీకేకాదు, నాకూ పరువు వుంది నాన్నా! చేసుకున్న పెళ్ళి ఫెయిలై ఇలా తిరిగి వెళ్తే నా ఫ్రెండ్స్ ముందు నాకూ అవమానమే” అంది మహతి.
“విన్నారండీ, ఈ పిల్ల ఎలా మాట్లాడుతోందో?” అత్తగారికి ఫిర్యాదు చేసాడు.
“పిల్ల అన్నావుకదా, పిల్లలాగే మాట్లాడుతోంది. నా వయసొచ్చాక నాలా మాట్లాడుతుంది. ఇక్కడ వదిలేసి వెళ్లండి. నేను నెమ్మదిగా కనుక్కుంటాను” అంది ఆవిడ.
“నేనింక అక్కడికి వెళ్ళను అమ్మమ్మా!” ఆవిడ భుజమ్మీద తలపెట్టుకుని ఏడ్చింది మహతి.
“వెళ్లనని ఒక్కమాట నువ్వు అనేస్తే అవదుకదమ్మా? వాళ్ళొచ్చి ఏం గొడవచేస్తారో!” అందావిడ బుజ్జగిస్తున్నట్టు. అప్పటికి ఏమీ మాట్లాడకపోయినా, పెద్దవాళ్ళకి నిస్పృహగా వుంది యిలా జరగడం. ఆడపిల్ల పుట్టిందనగానే ఒక వెంచర్ మొదలైనట్టు హడావిడిపడి, డబ్బు దాచడంతో మొదలుపెట్టి, పెట్టుబడితో ముగిస్తారు. పెద్దబరువు భుజాలమీంచీ దింపుకున్నట్టు సంతోషపడతారు. భార్యాభర్తలకి పొసగపోయినా, పిల్లలు పుట్టకపోయినా నిరాశానిస్పృహలతో కృంగిపోతారు. అదే పరిస్థితి యిప్పుడు. ఎవరూ ఏమీ మాట్లాలేకపోతున్నారు. తమ తర్వాతి తరం ఆలోచించినట్టు ఆలోచించలేకపోతున్నారు.
లక్ష్మి, నీలిమ కాఫీ ఫలహారాల పని చూడటానికి లోపలికి వెళ్ళారు. గీత బయటి అందర్తో సమానంగా కూర్చుని వ్యవహారాలు మాట్లాడుతుండగా, తనింట్లో తను అప్రధానంగా వంటగదిలో వుండటం నీలిమకి నచ్చలేదు. అదామె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మి పట్టించుకోలేదు. ఎవరు ఏది చెయ్యగలరో వాళ్ళు అది చేస్తేనే పనులు సానుకూలమౌతాయని లక్ష్మికి తెలుసు. గీత అందర్నీ కూడగట్టినట్టు నీలిమ ఎక్కడ చెయ్యగలదు? ఈమె మాట ఎవరు వింటారు?
నిర్మల గీత పక్కకి వచ్చి కుర్చుంది.
“గీతూ! నువ్వూ, మహీ ప్రాణస్నేహితులు. నువ్వెలా చెప్తే అదలా చేస్తుంది. అది యింట్లోంచీ వెళ్ళిపోతే నువ్వు తల్లడిల్లిపోయావు. ఇప్పుడుకూడా దాన్ని చూడాలనేకదా, ఇంతదూరం పరిగెత్తుకొచ్చావు? అది ఇప్పటి కష్టాన్ని చూసుకుని భయపడుతోంది. కొన్నాళ్ళు ఓర్చుకుంటే మీ అందర్లాగే హాయిగా వుంటుంది. అతన్ని వదిలేసి, ఒక్కర్తీ ఎలా బతుకుతుంది? నిండా ముప్పయ్యైదేళ్ళు లేవు దానికి. పైగా పాపకూడా వుంది. పిల్లని ఎలా పెంచి పెద్ద చేస్తుంది? నువ్వే ఎలాగేనా నచ్చజెప్పవే” అంది కన్నీళ్ళతో.
మగవాడు పెళ్ళి చేసుకుంటాడు. భార్య అభిప్రాయాలు తన అభిప్రాయాలకి భిన్నంగా వుండకూడదనుకుంటాడు. మొదట మనిద్దరి అభిప్రాయాలూ ఒకలాగే వుండాలనే సూచన యిస్తాడు. తర్వాత ఆమె ఆలోచనలు తప్పని హెచ్చరిస్తాడు. ఆఖరికి వాటిని నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. చివరికి ఆమె అతని అభిప్రాయాలని యిష్టమయ్యో, అవకో స్వంతం చేసుకుంటుంది. కాకపోయినా, చిలకలా అవే పలుకులు పలుకుతుంది. నిర్మల పరిస్థితి అది. కూతురు ఏదో ఒకలా కాపురానికి వెళ్ళిపోతే… అక్కడ నిలదొక్కుకుంటే చాలని నారాయణలాగే ఆమెకికూడా అనిపిస్తోంది. ఆమెని చూస్తుంటే జాలేసింది గీతకి. వాదించాలనో నచ్చజెప్పాలనో అనిపించలేదు. దశాబ్దాలపాటు నడిచిన భర్త దాష్టీకంలో ఏది మంచో ఏది చెడో విశ్లేషించుకునే శక్తిని కోల్పోయిన మనిషితో ఏం మాట్లాడుతుంది? మూర్ఖులు, పెద్దగా ఏమీ తెలీనివాళ్ళు నడిపిస్తున్న కుటుంబాల్లో వుండే ఈ దృక్పథం సమాజం అంతటా ఆవరించి వుంటుంది. ఎంతో తెలిసినవాళ్ళనికూడా సందిగ్ధంలో పడేసేలా.
“అంతా సరిగ్గానే జరుతుందత్తా!” అని లేచి లోపలికి వెళ్ళింది. తల్లిని చురుగ్గా చూసి మహతికూడా ఆమె వెనకే వెళ్ళింది. చిన్న డబల్ బెడ్‍రూం ఫ్లాట్ అది. మాధవ్, నీలిమలకైతే పొందికైన పొదరింటిలా వుంటుంది. ఇప్పుడు ఇంతమంది వచ్చేసరికి ఇల్లంతా మనుషులే అన్నట్టుంది. ఏమూలకి వెళ్తున్నా ఎవరో ఒకరు కనిపిస్తున్నారు. వెళ్ళి కిటికీకి అభిముఖంగా నిలబడింది. తనిక్కడికి వచ్చి తప్పుచేసిందని బలంగా అనిపించింది.
“అత్తా! వంట నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి అక్కడ కూర్చో” అంది గీత లక్ష్మితో. ఆమె చేతిలో పని అందుకుని. లక్ష్మి వెళ్ళింది. నీలిమ, గీతే మిగిలారు. నిజానికి ఒక్కమనిషికి తప్ప పనిచేసుకునే వీలుండదు వంటింట్లో.
“నువ్వు చేస్తావా, నేను చెయ్యనా?” అడిగింది గీత. ఇంతమందికి వంట! నీలిమకి మిడిగుడ్లు పడ్డాయి. అప్పటికే వచ్చిన చుట్టాలనీ, వాళ్ళందరికీ అన్నీ అమర్చి పెట్టాల్సిన బాధ్యతనీ తలుచుకుని గాభరాయెత్తిపోతోంది.
“అంత పెద్దవంట నాకు రాదు” అంది నసిగినట్టు. ఆమాట ఆమెచేత అనిపించాకే తను పని మొదలుపెట్టింది గీత. ఎన్నో గొడవలు ఇద్దరూ ఒకింట్లో కలిసి వున్నరోజుల్లో. నేను-నువ్వు, నా భర్త-నీ భర్త, నా పని- నీ పని, నువ్వు చేస్తావా- నేను చెయ్యనా, నేనే ఎందుకు చెయ్యాలి- నీజోక్యం ఏమిటి, ఇలాంటి ఎన్నో హద్దుగీతలు నీలిమ గీసేది. అవన్నిటి ఔచిత్యాన్నికూడా దాటి అవమానించింది గీతని. అందుకే వాసుగానీ, గీతగానీ నీలిమతో అవసరాన్ని మించి మాట్లాడరు. వాళ్లకి సంబంధించినంతవరకూ ఇది మాధవ్ యిల్లు. అతన్ని వాళ్ళు దూరం చేసుకోరు.
రెండుకేజీల బియ్యం స్టౌ ఎక్కించేసి, పిల్లలకోసం ముద్దపప్పుకి పడేసి, కూరకీ, పులుసుకీ ముక్కలు తరగమని నీలిమకి చెప్పి ఇవతలికి వచ్చింది. స్నానాలు, టిఫెన్లు అయి, మళ్ళీ గొడవకి కూర్చున్నారు అందరూ. వాసు నారాయణకి వాస్తవపరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
ఫోను మోగింది. సుధీర్ దగ్గర్నుంచీ. మాధవ్ ఎత్తాడు. ఈ విషయంలో ఏం చెయ్యాలో, వ్యవహారాన్ని ఎలా ముందుకి నడపాలో వీళ్ళంతా రాకముందే నిర్ణయించుకున్నారు గీత, వాసు, మాధవ్. గంటకి ఒకళ్ళు ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడి, నిర్మోహమాటంగా చెప్పాలంటే బుర్రతినెయ్యాలని అనుకున్నారు. మాధవ్‍తో రెండుమాటలు మాట్లాడాక నారాయణకి ఫోన్ యిమ్మన్నాడు సుధీర్. అమెరికానుంచి కాల్ అనేసరికి గొప్పగా తీసుకున్నాడు ఆయన. సుధీర్ అంత శ్రద్ధ చూపించడం గర్వంగా అనిపించింది. సుధీర్ మామూలు విషయాలే మాట్లాడాడు. మహతి సమస్యలు ఒక్కరోజువి కావు. ప్యుబర్టీకన్నా ముందే బీజమాత్రంగా లోలోపల వుండి, ప్యుబర్టీతో బహిర్గతమై కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చాయి. వాటన్నిటినీ ప్రత్యక్షంగా చూసినవాడు ఆయన. అలాంటివాడికి యిప్పుడు కావలిసినది వైద్యపరిజ్ఞానం కాదు, కూతురిపట్ల సానుభూతి. అన్నీ మాట్లాడాక అప్పుడన్నాడు.
“ఇక్కడ ఇలాంటివి సర్వసాధారణం బాబాయ్. మహీ చిన్నపిల్లకాదు. ముప్పయ్యేళ్ళు దాటాయి తనకి. చదువుకుంది. కొంత వైవాహిక జీవితం గడిపింది. మంచీచెడూ తెలీకుండా వుంటుందా? దానికి ఎలా నచ్చితే అలాగే చేద్దాం” అన్నాడు. అతనలా అంటాడనుకోలేదు నారాయణ. వాసు, సుధీర్ ఒకళ్లనొకళ్ళు కౌంటర్‍బేలెన్స్ చేసుకోవడం వాళ్ళ చిన్నప్పట్నుంచీ ఎన్నోసార్లు చూసాడు. వాసు తొందరపడితే సుధీర్ ఆపేవాడు. సుధీర్‍కి కోపం వస్తే వాసు సర్దిచెప్పేవాడు. ఇప్పుడు వాసు నరేంద్రని బాగా బెదిరించి వచ్చాడు. సుధీర్ కాస్త సానుకూలంగా మాట్లాడతాడని ఆయన ఆశించాడు.
“అక్కడ జరిగితే జరగచ్చుగానీ, ఇక్కడ అలా కాదుకదరా? ఊళ్ళో పరువుపోతుంది” అన్నాడు. సుధీర్ నవ్వాడు.
“ఎవరి పరువు బాబాయ్? మహీ విడాకులు తీసుకుంటే మీ పరువెందుకు పోతుంది? ఇది తన జీవితం. పోతేగీతే పెళ్ళి ఫెయిలైనందుకు దాని పరువుపోవాలి. ఐనా అవంతీపురం అప్పట్లాగే వుందా? మనగురించి తెలిసినవాళ్ళు ఎంతమంది? వాళ్లలో ఈ విషయం తెలుసుకుని మీ పరువుతీసేవాళ్ళు ఎంతమంది? ఒకళ్ళో యిద్దరో అడుగుతారేమో! వాళ్లకి మీరు చెప్పలేరా?” అన్నాడు.
“బావుందిరా! అలాంటివి మొహమ్మీద అడుగుతారేమిటి? వెనకాల నవ్వుకుంటారు” అన్నాడు.
“వాళ్లలా నవ్వుకున్నట్టు మనకెలా తెలుస్తుంది?”
“తెలీనంతమాత్రాన?” ఆయనకి తన ప్రశ్న తనకే తికమకగా అనిపించింది.
సుధీర్ మరోసారి నవ్వాడు. “అన్నీ మన ఆలోచనలే. ఇప్పుడు మనుషులంతా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లని చేసి అమెరికా డిస్పాచ్ చేసే ప్రయత్నాల్లో తలమునకలుగా వున్నారు. ఇలాంటివి పట్టించుకునే తీరిక ఎవరికీ వుండదు. మీరు భయపడక మహీకి ధైర్యం చెప్పండి” అన్నాడు. మరింక వుంటానని ఫోన్ పెట్టేసాడు. చెప్పింది కొంచెమే. కానీ చాలా స్పష్టంగా వుంది. నారాయణకి చేదు రుచిచూసినట్టైంది.
తర్వాత కొద్దిసేపటికి ప్రహ్లాద్ చేసాడు. మహతి మరెక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడికి రావడం మంచిదైందని హర్షం ప్రకటించాడు.
“మహీ మనింటి పిల్లకాబట్టి యింకా మీకు విలువనిస్తోంది. దాన్ని నిలబెట్టుకోవడం మంచిది” అని ముక్తాయింపు చేసాడు.
అప్పట్నుంచీ ఒకరొకరుగా ఫోన్లు చేస్తునే వున్నారు. నిన్నటిరోజుని వీళ్ళంతా నారాయణ బలగం. మహతికోసం వూరూవాడా వెతికారు. వాళ్ళకున్న పరిచయాలన్నీ వాడుకుని సాయపడ్డారు. మాట్లాడనని మొరటుగా చెప్పలేకపోయాడు. పద్మవ్యూహంలో చిక్కుబడిన అభిమన్యుడిలా అనిపించింది ఆయనకి తన పరిస్థితి.
సుమతి ఫోన్ చేసినప్పుడు గీత ఎత్తింది. గీత గొంతు వినిపించగానే అవతలివైపు కొద్దిగా మౌనం.
“మహతికి ఇస్తావా?” నేరుగా ప్రశ్న. ఎక్కడో చురుక్కుమంది గీతకి. ముఖం మ్లానమైంది. తమ పెళ్ళయ్యాక సుమతి ఇదివరకట్లా మాట్లాడటం తగ్గించేసింది. ఫంక్షన్స్‌లో కలుసుకోవడమే. అప్పుడుకూడా పొడిపొడి పలకరింపులే. ఒకప్పట్లా ఆత్మీయతలు కలబోసుకోవడం లేదు. సుమంత్ సైతం అంతే.
గీత పెళ్ళితో మొదలైంది వరసలు పెట్టి పిలుచుకోవడం. “బావున్నావా, వదినా?” అని బయటి వ్యక్తిని పలకరించినట్టు పలకరిస్తాడు. డబ్బు గర్వమా అంటే మిగతావాళ్ళతో అలా లేరు. ఒక్క తనతోనే. ఫోనుగురించి మహతికి చెప్పి తను దూరంగా వెళ్ళిపోయింది. చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మహతి తర్వాత రవళితోనూ, నిర్మలతోనూకూడా మాట్లాడి పెట్టేసింది సుమతి.
అందరూ మహతి అభిప్రాయానికి విలువనిస్తున్నారనే విషయం క్రమంగా నారాయణకి అర్థమైంది. మహతి తన కూతురని కాదు, పుట్టుకనుంచీ బాంధవ్యం పెనవేసుకుని పెరిగిన ఆ పదకొండుమందిలో ఒకతి. తమలో ఒకదానికి కష్టం వచ్చిందనగానే కంగారుపడుతున్నారు. ఓదార్చుతున్నారు. ధైర్యం చెప్తున్నారు. ఈరోజుని బాగానే వుంటుంది. రేపెలా? కూతురి భవిష్యత్తేమిటి? ఏం పెట్టుకుని తింటుంది? పిల్లని చదివించి పెళ్ళెలా చేస్తుంది? అప్పుడు వీళ్ళేం చెయ్యగలరు? ఒకపూట తిండి పెడతారేమోగానీ, బాధ్యతనైతే ఎవరూ తీసుకోరు. ఎలా బోధపరచాలి కూతురికి? స్నేహం వేరు, సహాయం వేరు, బాధ్యత వేరని. నిస్సహాయంగా కూర్చుండిపోయాడు.


సమస్య నిప్పురవ్వలాంటిది. అది ఉండుండి రాజుకుంటూ వుంటుంది.
“మేం స్టేషన్లో వున్నాం. ఎలా రావాలో అడ్రెసదీ చెప్తే ఇంటికి వస్తాం” అని ఫోన్ చేసాడు నరేంద్ర. చెప్పింది రవళి. నారాయణ ఫోన్ తీసుకున్నాడు.
“మీరు స్టేషన్లోనే వుండండి. నేను వచ్చి తీసుకెళ్తాను” అన్నాడు.
“ఈ మర్యాదలవీ అక్కర్లేదులెండి, మేం రాగలం” జవాబిచ్చాడు నరేంద్ర. అతని మాటల్లో పైకి కనిపిస్తున్న కాఠిన్యం వెనుక వున్నది పూర్తిగా కోపం కాదు. బింకం. మహతిని కళ్ళతో చూస్తేగానీ కుదుటపడని భయం. కోపం వచ్చింది. కొట్టాడు. ఆమె ఇంట్లోంచీ వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్తుందనుకున్నాడు. మామగారికి ఫోన్ చేసి చెప్పేసి బాధ్యత తీరిపోయినట్టు వూరుకున్నాడు.
“ఈ తింగరబుచ్చి మనకి దొరికిందేమిట్రా?” అంది తల్లి గొడవంతా అయ్యాక. తలపట్టుకుని.
తెల్లారుతుంటే వాళ్లవైపునించీ ముగ్గురు వచ్చారు.
“కట్టుకున్నవాడితో కాపురం చెయ్యనన్నదాన్ని మీ పిల్లనే చూసాను. మగవాడికి కోపం రాదా? ఒక్క దెబ్బ వేస్తేనే యిల్లొదిలిపెట్టి వెళ్ళిపోతుందా?” తన తల్లి వాళ్ళమీద నోరుచేసుకుంది.
వాసు అన్నతను వెంటనే రియాక్టయ్యాడు.
“కొడితే యింట్లోంచీ వెళ్ళిపోయిందా?” నిశ్చేష్టుడయ్యాడు. “మీరు మహీని కొట్టారా? ఎందుకు? చదువుకున్నవారు, అలా ఎలా చెయ్యగలిగారు? మొదట్లో బాగానే వున్నారుకదా? పిల్లలు కావాలనుకున్నారు. అదీ జరిగింది. ఇంక దేనికి కొట్టడం? ఏవేనా సమస్యలుంటే పదిమందిమధ్యని పడేయ్యాలి. కష్టం వుంటే చెప్పుకోవాలి. ఐనా మీకేం కష్టం బావా? మందులు మింగిందీ, వైద్యం చేయించుకున్నదీ, ప్రాణాలకి తెగించి పిల్లని కన్నదీ అది” అన్నాడు. అనడమే కాదు, “మహీ ఎక్కడికెళ్ళిందో ఏమైందో తెలీదు. అది పాపతో, ప్రాణాలతో మా కళ్ళపడిందా సరేసరి, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టం” అని హెచ్చరిక చేసాడు. తెల్లారేదాకా వెతికి, ఇంక కనిపించకపోతే పోలీసు కంప్లెయింటు ఇచ్చారట. తనదగ్గర్నుంచీ వెళ్ళిపోయింది. జవాబుదారీ తనదే ఔతుంది. స్టేషనుకి పిలవడం, ప్రాథమికదర్యాప్తు చెయ్యడం జరిగాయి. ఇప్పుడామె కనిపించింది. తను చేసేది గవర్నమెంటు వుద్యోగంకాబట్టి వాళ్ళు కేసు విత్‍డ్రా చేసుకోకపోతే సమస్యే. అందుకే వెంటనే బయల్దేరి వచ్చాడు. అతని ఫోన్‍తో మాధవ్ యింట్లో వున్న అందర్లో కాస్త టెన్షన్ మొదలైంది.
“ఎవరెవరు వస్తున్నారో! ఏం గొడవచేస్తారో! ఇక్కడ ఈ వూరుకాని వూళ్ళో అదంతా అవసరమా? మనింటికి వెళ్ళిపోదాం పదవే అంటే విన్నావుకాదు. అసలు ఆడపెత్తనాలు, పిల్లపెత్తనాలు ఎక్కువయ్యాయి మనింట్లో” అని ఎగిరాడు నారాయణ.
“మా యిద్దర్నీ కనడంతోనే అమ్మ తెలివేంటో నీకు తెలిసింది. పూర్తిచేసెయ్ నాన్నా!” అంది రవళి.
“నువ్వుండవే” అని కసిరింది విజ్జెమ్మ. “గొడవకి దిగకండి. కొద్దిరోజులు ఆగి పంపిస్తామని నచ్చజెప్పండి” ఆవిడ భయం ఆవిడది. ఇంతదూరం పారిపోయి వచ్చిన పిల్ల మళ్ళీ పంపిస్తే ఇంకేం చేస్తుందోనని. అలాగని పంపద్దని గట్టిగా చెప్పలేకపోతోంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి అందరికీ భయం. అలాగని మహతి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించలేకపోతున్నారు.
“నేను వెళ్లను అమ్మమ్మా!” విసుగ్గా అంది మహతి.
“అంతా నీ పెత్తనమేనేమిటి?” అత్తగారి మాటలకి కాస్త వత్తాసు దొరికి అన్నాడు నారాయణ. “వీళ్ళందరూ హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు, నిన్నుమాత్రం అంతా ఏకమై ఎగేస్తున్నారు. ఇప్పుడు బాగానే వుంటుంది. పిల్లనేసుకుని ఎలా బతుకుతావు? ఎల్లకాలం మేం వుంటామా? అతనంతట అతను వస్తున్నాడు. తీసుకెళ్తానంటే వెళ్ళిపో” అన్నాడు నారాయణ.
“వీళ్ళందరిలాగా నేను పుట్టలేదు నాన్నా! డిఫెక్టివ్ పీసుని. నన్నిలా వదిలేస్తే నా బతుకు నేను బతుకుతాను. బతకాలనీ నాకు వుంది. కానీ బలవంతంగా మీరంతా కలిసి నన్ను సాగనంపేలా వున్నారు” అంది మహతి.
లక్ష్మి చప్పుని ఆమెని దగ్గరికి తీసుకుంది. “అలా మాట్లాడకు మహీ! ఎంత ప్రమాదం తప్పి ఇక్కడికి వచ్చావో ఎవరికీ తెలీడంలేదు. దార్లో ఏదేనా జరిగివుండచ్చు. పెద్ద గండం తప్పింది” అంది. కళ్ళు చెమర్చాయి. ఓ పిల్ల తనదీ, ఇంకో పిల్ల పరాయిదీ అన్నట్టు పెరగలేదు వీళ్ళు.
కుటుంబాలు వుంటాయి, సమస్యలూ వుంటాయి. కుటుంబం కుదించుకుపోయినకొద్దీ సమస్యలు పరిష్కారం దొరక్కుండా ఒక పీటముడిలా బిగుసుకుపోతాయి. అక్కడ వుండేది ఇద్దరో ముగ్గురో వ్యక్తులు. వాళ్ళమధ్య అభిప్రాయబేధం వచ్చినప్పుడు రెండు వర్గాలుగా విడిపోతారు. నిష్పక్షపాతంగా ఆలోచించే యింకోవ్యక్తి లేకపోవటంచేత ముడి అలాగే వుండిపోతుంది. నలుగురు వ్యక్తులున్న నారాయణ కుటుంబంలో నిర్మలకి గొంతు లేవదు. రవళి అక్కని సమర్ధించినా స్వతంత్రించి ఏదేనా చెయ్యగలగడం పూర్తిగా ఆమె చేతిలో లేదు. భర్త వప్పుకోవాలి. ఇవన్నీ సమస్య పరిష్కరించడానికి వుండే పరిధులు. బైటివాళ్ళెవరేనా ఆ హద్దుని దాటి పరిష్కారంవైపు సమస్యని నడిపించాలి. అర్థమైంది లక్ష్మికి. చొరవ తీసుకుంది. మాట పడాల్సివస్తుందని తెలుసు. ఇంతకి తెగించిన మహతి ఇంకెంతకి తెగిస్తుందోనన్న భయం ఆ చొరవకి కారణమైంది. మనిషి ప్రాణంకన్నా అనిపించుకునే ఆ మాట పెద్దదికాదు.
“వెళ్ళనని అంత గట్టిగా చెప్తున్నప్పుడు బలవంతపెడతారేంటే, నిర్మలా? అదేమీ చిన్నపిల్ల కాదు. వచ్చినవాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించండి. కొన్నాళ్ళు ఇక్కడ వుంటుంది. ఇదేం పరాయిల్లు కాదు. తమ్ముడిల్లు. నేనో అమ్మో తోడుగా వుంటాం. తర్వాత ఆలోచిద్దాం” అంది. నేరుగా మరిదికి చెప్పలేదు. ఆవిడ చెప్తే నేను వినాలా అనిపించే పురుషాహంకారానికీ, భార్య పుట్టింటివాళ్ళనే చులకనభావానికీ అతీతుడు కాదు నారాయణ.
“అదికాదే, కట్నకానుకలకీ, వైద్యానికీ పుస్తీ పూసా అమ్మి పోగుచేసి లక్షల్లో ఖర్చుపెట్టాం. అవన్నీ వాళ్ళకి వదిలేసి, ఇది యిక్కడ వుండటమేమిటి? రాణివాసంలాంటి జీవితం కాలదన్నుకుని వెయ్యికీ రెండువేలకీ వుద్యోగం చెయ్యడమేమిటి?” నెమ్మదిగా బటపడింది నిర్మల.
“ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోవట్లేదుగా? ఒకవేళ అదే జరిగితే కట్నం వెనక్కివ్వమని అడుగుతాం. పిల్ల బాధ్యత అతనికీ వుంటుంది. మనోవర్తి ఇమ్మంటాం” అంది లక్ష్మి.
ఆ మాటలు విన్నాక నారాయణ కొద్దిగా శాంతించాడు. ఖర్చుపెట్టిన డబ్బు కొంతేనా తిరిగొస్తుందంటే మహతి బాధ్యత మరోసారి తీసుకోవడానికి మనసు కాస్త సుముఖమైంది. ఆయన చెడ్డవాడు కాదు. అనేకానేక భయాలమధ్య ఇరుక్కుపోయి వున్నాడు. జీవితాన్ని సాఫీగా నడిపించడమే తప్ప ఎదురుదెబ్బలు తిన్నవాడు కాదు. సమస్య ఎదురైనప్పుడు పారిపోవడమేగానీ ఎదురు నిలిచినవాడు కాదు. ఇద్దరూ ఆడపిల్లలే అని వగచేవాడు. వాళ్ళ భారం తను మోస్తున్నట్టు బాధపడేవాడు తప్ప వాళ్ళని చదువులకి తగ్గ వుద్యోగాలొచ్చే ప్రయత్నాలు చెయ్యనివ్వలేదు. అంత అవకాశం ఇవ్వలేదు. నరేంద్రావాళ్ళు వచ్చేదాకా ఇవే మాటలు జరిగాయి. మహతి గది వదిలి యివతలికి రాలేదు ఫోను వచ్చినప్పట్నుంచీ. వాళ్లతో ఎవరు మాట్లాడాలనేదానిమీదకూడా చర్చ జరిగింది.
“దెబ్బలాడినట్టు అందరం ఒక్కసారి మీదపడి మాట్లాడితే వ్యవహారం పొసగదు. ఎవరో ఒకరు మాట్లాడితే బావుంటుంది. అమ్మమ్మ, బాబాయ్, అమ్మ, మీలో ఎవరు మాట్లాడతారు?” అడిగాడు వాసు.
“వాళ్లెవరూ కాదు. నువ్వే మాట్లాడు వాసూ! నేనింక అక్కడికి వెళ్ళను. అదే వాళ్లకి చెప్పు. ఎలా చెప్తావో, నువ్వే చెప్పు” ఖండితంగా అంది మహతి. నారాయణ తల కిందకి వేలాడేసుకున్నాడు. ఇంకాకూడా ఎక్కడేనా లేశమాత్రపు ఆశ వుంటే అదీ అడుగంటింది. తెగతెంపులు తథ్యమనేది నిర్ధారణైంది.
నరేంద్ర, అతని అక్కాబావలు, మరో యిద్దరు బంధువులు వచ్చారు. ఆ యిద్దరు బంధువులూ నరేంద్ర ఖర్చులు పెడితే ముంబై చూసిరావచ్చని వచ్చినవాళ్ళు. వీళ్ళకి పెద్ద బలగం వుంది, తన వెనుకా నలుగురుంటే బావుంటుందని తీసుకొచ్చాడు నరేంద్ర. మనస్సులో ఏం వున్నా, పెద్దవాళ్ళంతా వాళ్ళని బాగానే ఆహ్వానించారు. వచ్చినవాళ్ళు ముభావంగా వున్నారు. అప్పుడే ఇక్కడకి యింతమంది మహతివైపువాళ్ళు వచ్చి వుంటారని నరేంద్ర వూహించలేదు.
కొత్తవాళ్లని చూడగానే నిలయవిద్వాంసులు ముగ్గురూ కచేరీలూ, జుగల్‍బందీలూ మొదలుపెట్టారు. కూతుర్ని ఎత్తుకుని బైటపడ్డాడు రవళి భర్త శ్రీనివాస్. అతను ఎంత పెద్ద వ్యవహారంలోనేనా తటస్థంగా వుంటాడు. నిర్మల మేఘనని ఎత్తుకుని సముదాయించడం మొదలుపెట్టింది.
“వీడిని కాసేపు అలా సొసైటీ పార్కుకి తీసుకెళ్ళి ఆడించవే, నీలిమా!” అన్నాడు మాధవ్. అత్తాకోడళ్ళు బాబుని తీసుకుని బయల్దేరారు. శ్రీనివాస్‍కూడా పార్కుకే వచ్చాడు. అక్కడ వీళ్ళకి కలిసాడు.
“మీరూ వస్తారంటే ఆగేవాడిని” స్నేహంగా నవ్వి అన్నాడతను నీలిమతో. “అంతమందిని ఒక్కచోట చూసేసరికి కంగారెత్తిపోతున్నారు పిల్లలు. మేఘన వూరుకుందా?” అడిగాడు.
“మీరు అక్కడ వుండాల్సింది. మాటలేవో నడుస్తున్నాయికదా, మనవాళ్ళకి సపోర్టుగా వుండేది” అంది ఆమె.
“మనం పెద్దగా మాట్లాడేదీ, చెప్పేదీ ఏం వుంటుంది? బైటివాళ్ళంకదా? సమస్య మూలాలు తెలీవు. వాళ్ళింటి వ్యవహారాలన్నీ రవళికి వదిలేస్తాను. రెండు ప్రశ్నలు అడుగుతుంది- ఇలా చేద్దామా అనో, ఇలా చెయ్యగలమా అనో. మొదటిది అడిగితే తను నిర్ణయం తీసుకుందనీ, రెండోది అడిగితే నా సలహా కావాలనీ అర్థం చేసుకుంటాను” అన్నాడు. అతను భార్యకి చాలా స్వేచ్ఛ ఇస్తాడు. నిజానికి స్వేచ్ఛ అనేదే అన్నిటికన్నా పెద్ద సంకెల. మనిషి కన్‍ఫైన్‍డ్ స్పేసెస్‍లో వున్నంత సౌకర్యంగా విస్తృతపరిధిలో వుండలేడు. పరిధి విస్తృతమైనకొద్దీ నలుగురు నడిచినదారి మన కాళ్ళకిందినుంచీ జరిగిపోతుంది. తప్పొప్పులు, పర్యవసానాలు, ప్రమాదాలు, ప్రమోదాలు అన్నిటి బాధ్యతా మనదే అయి వుండటం భయపెడుతూ వుంటుంది. ఆచితూచి వ్యవహరించి, ఎవరికివారే హద్దులు గీసుకునే పరిస్థితిలోకి చేరతాం. ఇంకా యిరుకైన చోటికి. ఒకొక్కసారి.
అతను అనుకున్నట్టు ఈ సమస్యకి తనూ పరాయిదాన్నని అనుకోలేకపోయింది నీలిమ. ఆమాటే ఆమెకి ముల్లుతో గుచ్చినట్టైంది. పెళ్ళిచేసుకుని వచ్చిన యింట్లో తను పరాయిదేమిటి? చురుగ్గా అనుకుంది. ఇంటికీ, వ్యవహారానికీ వున్న తేడా గుర్తించేలా రూపొందలేదు ఆమె మనసు.
లక్ష్మి ఒకచోట కూర్చుని వుంటే వీళ్ళు పిల్లల్ని వుయ్యాల, జారుడుబండ ఎక్కించడం మొదలుపెట్టారు.
వచ్చినవాళ్ళకి మంచినీళ్ళు, కాఫీలు యిచ్చింది గీత. స్నానాలు, టిఫెన్లు స్టేషన్లోనే కానిచ్చుకున్నామని చెప్పారు నారాయణ అడిగితే.
“వేసిన వేషాలు చాలుగానీ పద, మాతో” అంది నరేంద్ర అక్క లోపల వున్న మహతికి వినిపించేలా. ఆవిడకి అంతా వింతగా వుంది. భర్తని వంటిమీద చెయ్యి వెయ్యనివ్వదంలేదట. కాపురం చెయ్యదట. ఏ మగవాడు వూరుకుంటాడు అలా చేస్తే? పైగా ఇంట్లోంచీ పారిపోయి వచ్చింది. అలాంటి మరదలితో తనుగా మాట్లాడ్డం, ఆవిడకి చాలా కష్టంగా అనిపించింది. తమ్ముడిమీది కేసుకోసం తగ్గింది.
“నన్నెందుకు కొడుతున్నారో మీ తమ్ముణ్ణి అడగండి” అక్కడినుంచే అంది మహతి. ఆ మాటలకి మాధవ్‍కి కోపం పొంగుకొచ్చింది.
“మా అక్కని కొట్టారా బావా, మీరు?” అని నరేంద్ర మీదిమీదికి వెళ్ళాడు.
“కొట్టక నెత్తి మీద పెట్టుకుంటారా?” అని అతని అక్క గొంతు పెంచింది.
మాధవ్‍ని వెనక్కి లాగింది గీత. చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి పక్కగదిలో కూర్చోబెట్టింది. ఆ స్వతంత్రమే ఆమెలో నీలిమకి నచ్చనిది.
“మోసం చేసి పిల్లని అంటగట్టారు. మహతికి ఆరోగ్యం లేదు, బుర్రా లేదు. ఎన్నో ఆశలతో పెంచుకున్నాం మా తమ్ముడిని. పెళ్ళైనదగ్గిర్నుంచీ వాడు సుఖపడింది లేదు. మా అమ్మైతే కంటికీమంటికీ ఏకధారగా ఏడుస్తోంది.” అందావిడ. ఎవరూ కొద్దిసేపు మాట్లాడలేకపోయారు ఆ అభియోగానికి. నారాయణకి తనని ఎద్దేవాచేసినట్టనిపించి, ముఖం ఎర్రబడింది. ముందుగా తేరుకున్నది వాసే.
“మిమ్మల్ని మేం మోసం చేసాంకాబట్టి ఆ కోపాన్ని మహతిమీద తీర్చుకుందామనుకున్నారా బావా?” అడిగాడు సూటిగా చూస్తూ. నరేంద్ర మొహం తిప్పుకున్నాడు.
“ఏం మోసం జరిగింది? మహీని పెళ్ళిచూపుల్లో చూసుకున్నారు. కట్నకానుకలు, రూపం నచ్చి పెళ్ళిచేసుకున్నారు. రెండేళ్ళు సంతోషంగా గడిపారు. అప్పుడు మీకు కష్టపడ్డట్టేమీ అనిపించలేదా?” కంగుమంది అతని గొంతు. “చాలామందికి చిన్నచిన్న ఆరోగ్యసమస్యలుంటాయి. తలనొప్పి, అరుగుదల సరిగా లేకపోవటంలాంటివి. పీరియడ్స్ సమయంలో సమస్యలు ఆడపిల్లల్లో కొందరికి వుంటాయి. ఏవో టేబ్లెట్లతో మేనేజి చేసుకుంటారు. మహీకి అలాంటి ఏదో సమస్య వుండేది. అవయవలోపం లేదు తనకి. తృతీయప్రకృతి కాదు. అందుకే పెళ్ళిచేసారు. కొందరికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టరు. మా ఆమ్మకీ, అమ్మకీ ఐదేళ్లకి పుట్టామట. మా తమ్ముడికీ ఆలస్యంగానే పుట్టాడు పిల్లాడు. మహీకి మీరు టైం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు వైద్యాలు చేయించారు. మూడు అబార్షన్లు, ఒక డెలివరీ. అది మనిషి బావా! ఎంత ట్రౌమా వుంటుంది? పాప పుట్టాక తనకి కొంచెం టైము యివ్వలేకపోయారా? ఓపిక పట్టలేకపోయారా? అంత కోపంగా వుంటే తిరిగి పంపెయ్యాల్సింది. కొడితేనూ తిడితేనూ ఎవరు వూరుకుంటారు? అందులోనూ ఇలాంటి కారణానికి?” సూటిగా అడిగాడు. నారాయణగానీ మరెవరుగాని అంత స్పష్టంగా సమస్యని చెప్పలేకపోయేవారు. విషయం సున్నితమైనదికాబట్టి మాట్లాడలేక తడబడినా, ఇబ్బందిపడినా తప్పొప్పుల త్రాసులో తప్పు వీళ్లవైపే మొగ్గేది. నరేంద్ర అక్క మరెవర్నీ మాట్లాడనిచ్చేది కాదు.
వాసు అంతటి వ్యవహర్త అనుకోలేదు అక్కడివాళ్ళు. తమవల్ల పొరపాటు జరిగిందన్న భావం నిర్మలలో అంతర్గతంగా వుంది. వాళ్ళదే రైటేమో అన్న అనుమానంతో కూడిన ఆత్మన్యూనత వుండేది. అందుకే వియ్యాలవారిముందు తగ్గి వుండేది. నారాయణకి ఇలాంటి ఆలోచనలే రావు.
వాసు అలా నిలదీస్తుంటే నరేంద్రకి చిన్నతనంగా అనిపించింది. నాలుగ్గోడల మధ్య జరిగే విషయాన్ని బహిర్గతం చేసి, తనని ఇలాంటి పరిస్థితిలో నిలబెట్టిన మహతిమీద కోపం వచ్చింది.
“తనింక అక్కడికి రానని చెప్పేసింది. ఆ గదిలో వుంది. వెళ్ళి మాట్లాడండి. వస్తానంటే తీసుకెళ్ళండి. లేదంటే వదిలేసి వెళ్ళండి. మాయింటి ఆడపిల్ల మాకు బరువు కాదు. చదువుకుంది. ఏదో ఒక వుద్యోగం రాకపోదు” అన్నాడు వాసు.