తిరస్కృతులు – 19 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

నేను దిగులుగా కూర్చోగానే సుమ బిక్కమొహం వేసుకుని వచ్చి నా వొళ్లో చేరింది. నా మెడ చుట్టూ చేతులు బిగించి గుండెల్లో ముఖం దాచుకుంది. దాన్ని చూసి సుధా వచ్చి కూర్చుంది. జంటరాగానికి ఆలాపనగా ముందు సుమ గునుపు మొదలైంది. వాళ్ళకేం కావాలో నాకు తెలుసు. విడిపోయామనుకుంటున్న భార్యాభర్తల మధ్య అలా విడిపోలేని శారీరక ఏకత్వంతోటీ, కలిసిపోయిన మానసిక భిన్నత్వంతోటీ బాధపడే పసిపిల్లలుంటారు. వాళ్లకి తల్లీ తండ్రీ యిద్దరూ కావాలి. కానీ మా యిద్దరిమధ్యా మళ్ళీ సమన్వయం ఎలా సాధ్యం?
దూరంగా కారు హారన్ వినిపించింది. సుమ చెంగుమని నా ఒళ్ళోంచి లేచి పరిగెత్తింది నాకు గుండెల్ని మెలితిప్పినట్లయింది. ఇది ఇలాగే ఏ కారు హారన్ వినిపించినా తండ్రే అనుకుని పరుగెడుతుందా? అతను కాదని తెలిశాక దాని కళ్ళలో నిరాశ… దేవుడా! ఏమైపోయాయి మేము నలుగురం సరదాగా గడిపిన రోజులు?
చాలా విచిత్రంగా నాకు ప్రతి క్షణం ఏదో ఒక పనిలోనో ఆలోచనలోనో జ్ఞాపకంగా రాజ్ కదుల్తున్నాడు కానీ ప్రభాకర్‍ని నేనసలు తలుచుకున్నదే లేదు. రాజ్‍ని గుర్తుచేసుకోవడం నాకిష్టం లేదు. కాని పిల్లలతన్ని మర్చిపోవడంలేదు. నాకతను చెడ్డవాడు. పిల్లలకి కాదు. జరిగింది చెప్పినా అర్థం చేసుకునే వయసు వాళ్లకి లేదు.
దాన్ని తీసుకు రావటానికి నేను లేచి వెళ్ళేలోగా బలమైన అడుగుల చప్పుడు వినిపించడంతో వులిక్కిపడి తల తిప్పాను. రాజ్.. సుమని ఎత్తుకుని… ఇతను రాని ప్రదేశమంటూ ఏదీ వుండదా? మతిపోయినట్టు చూసాను.
“నీకసలు బుద్ధుందా? సుమని రోడ్డుమీదికి వదులావా? ఏ మోటార్‍సైకిలు కిందేనా పడితే?” ఆగ్రహంగా అడిగాడు.
“నువ్వు… నువ్వు” నాకసలు నోటిలోంచి మాట రాలేదు.
“నీకసలు అక్కడ వచ్చిన కష్టమేమిటని ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చావు? అంటే… నువ్విలా పారిపోతుంటే వెతికి పట్టుకుంటూ వుండాలా నేను?”
“నీకసలు నాతో పనేంటి? నాదారిన నన్నెందుకు వదిలిపెట్టవు?” అప్పటికి సర్దుకుని నిలదీసాను.
“నీతో నాకెలాంటి పనీలేదు. అది రాసిచ్చాను కూడా. కానీ వీళ్ళ బాధ్యత ఒకటుంది చూడు, అది నిన్ను వెతుక్కుంటూ తిరిగేలా చేస్తోంది. అసలు కిడ్నాపింగ్ కేసు పెడదామని చూసాను”
నేను అతనికేసి దిగ్ర్భాంతిగా చూసాను. “”నా పిల్లలగురించి… నామీద కేసు పెడతావా? అది పెట్టాల్సింది నేనుకదూ, ఆరోజుని?”
“వాళ్లు నాకూ పిల్లలేనని చాలాసార్లు చెప్పాను””
“అందుకేనా మొదట నన్నూ, తర్వాత వీళ్లనీ వదిలించుకున్నావు?”
“వసంతా! హోల్డ్ యువర్ టంగ్. పిల్లలెదురుగా ట్రాష్ మాట్లాడకు”
నేనొక్కసారి సృహలోకి వచ్చాను. అతని చేతుల్లో వున్న సుమ బిత్తరపోయి మా యిద్దర్నే చూస్తోంది.
“నాన్నా!” అంటూ నా వెనకే పరిగెత్తుకొచ్చిన సుధ దూరంగానే ఆగిపోయింది. దాన్నికూడా దగ్గరకి పిలుచుకుని రెండోచేత్తో ఎత్తుకున్నాడు.
సరిగ్గా అప్పుడే అమ్మమ్మ అక్కడ కొచ్చింది. “ఎవరే, వచ్చింది?” అంటూ.
అతన్నలా చూడగానే ఎవరో అర్థమైనట్టుంది. ఒక్కక్షణం తటపటాయించి, “అతన్ని కూర్చోమనమ్మా!” అంది. నేను కూడా సర్దుకున్నాను. కుర్చీ తీసుకొచ్చి వేసాను. అతను నాకేసి ఎగాదిగా చూసి, “”నీతో మాట్లాడాలి. సుధాసుమల ఎదురుగా మనం అరుచుకోవడం, దెబ్బలాడుకోవడం నాకిష్టం లేదు. వీళ్ళని యిప్పుడొచ్చిందే! ఆవిడ…”
” మా అమ్మమ్మ”
“ఆవిడకిచ్చి నాతో బయటికి రాగలవా? మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడతాను. నువ్వు తయారయ్యేలోగా వీళ్లనలా తిప్పి తీసుకొస్తాను” అన్నాడు. నేను జవాబు చెప్పేంతట్లో అమ్మమ్మ లోపల్నుంచి పిలిచింది. వెళ్లాను.
“అతనికి కాఫీ యివ్వు” అంది కప్పు నాచేతికిచ్చి.
“వసంతా! తొందరపడకు. చేసుకున్నా చేసుకుపోయినా ఒకరికి ఒకరు ఏమీ కాకుండా పోరు. అగ్నిసాక్షిగా చేసుకున్న భార్యాభర్తల మధ్య కూడా గొడవలు రాకుండా వుండవు. వాటిని నెమ్మదిగా పరిష్కరించుకోవాలిగానీ తెగేదాకా లాగకూడదు. మీ ముగ్గురి భవిష్యత్తూ అతని చేతిలో వుంది” అంది. నేను తలూపి వచ్చేసాను.
కాఫీ రాజ్‍కి యిస్తే అతను మాట్లాడకుండా తాగి కప్పుకింద పెట్టి లేచాడు.
“ఎక్కడిదాకా వెళ్తారు?” అడిగాను.
“సిటీదాకా వెళ్ళొస్తాం”
తలూపాను. వారు వెళ్లారు. ఎందుకో తెలీదు, మా యిద్దరి మధ్యా మొదలైన స్పర్థ కొంచెం చిన్నదైనట్టు అనిపించింది. ఇద్దరం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి వుంది యిప్పుడు. ప్రభాకర్ వున్నప్పుడు ఇలాంటి ప్రతి కలయికా నిప్పు కణికలా మంట పుట్టించేది.
అమ్మమ్మ నా దగ్గరకి వచ్చి కూర్చుంది.
“ఏం నిర్ణయించుకున్నావు వసూ? అతను రమ్మంటే వెళ్తావా?” అడిగింది.
“లేదు. అతనిలోని స్వార్ధం బయటపడ్డాకకూడా అన్నీ మర్చిపోయి ఏమీ జరగనట్టు ఎలా కలిసి వుండగలం?”
“దేనికేనా పట్టువిడుపులు వుండాలికదూ?”
“అమ్మమ్మా, నాది పరిష్కారం లేని సమస్య. అతనితో వెళ్లినంత మాత్రాన సమసిపోదు. అతన్నుంచి దూరంగా వెళ్లిపోవాలి. చేసింది తప్పని తెలిసాకకూడా కొనసాగిస్తే ఎలా? ఎప్పుడో ఒకప్పుడు ఆపాలి” అన్నాను స్థిరంగా.
“నీ యిష్టం. నీకు చెప్పేంతటిదాన్ని కాదు” అప్రసన్నంగా అని అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయింది. ఆవిడ తరానికి రాజ్ అలా వెతుక్కుంటూ రావటమే గొప్ప. ఆడవారి ఆత్మాభిమానంలాంటివి చాలా చిన్న విషయాలు.
రాజ్ వాళ్లు తిరిగొచ్చేసరికి బాగా రాత్రైపోయింది. వాళ్ళతో బయటికి వెళ్ళటం మాత్రమే అతని చేతిలో వుంటుంది. తిరిగిరావటం కాదు.
సుమ నిద్రపోయింది. సుధ కూడా నిద్ర జోగుతోంది.
“అతన్ని భోజనానికి వుండమను” అంది అమ్మమ్మ. రాజ్ కాదనలేదు. నేను వడ్డిస్తుంటే మాట్లాడకుండా తింటున్నాడు.
“నేనిక్కడున్నానని ఎలా తెలిసింది?” అడిగాను
అతను తినడం ఆపి ముఖంలోకి తీక్షణంగా చూసి, మళ్లీ తినసాగాడు. జవాబు యివ్వడనుకున్నానుగానీ యిచ్చాడు.
“నా ఫ్రెండ్ ఒకడు చూసాడట. మీరు విజయవాడలో దిగడం చూసి వెంటనే నిన్ను ఫాలో అయ్యి నువ్వే బస్సెక్కుతున్నావో చూసి నా సెల్‌ నెంబరుకి ఫోన్ చేసాడు. నిన్ను కనిపెట్టమని చాలామందికే చెప్పాను” అతను చాలా సీరియస్‍గా మా యిద్దరిమధ్యా ఒకప్పుడు ఎలాంటి అనుబంధం లేనట్టు, నేనేదో దోషినన్నట్టు మాట్లాడుతున్నాడు. చాలా దూరాన్ని మెయింటేన్ చేస్తున్నాడు.
“అంటే? నామీద నిఘానా?” కోపంగా అడిగాను.
“నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత”
ఈమాట వినివిని నాకు విసుగొచ్చేస్తోంది. పిల్లలు.. పిల్లలు… పిల్లలు… వాళ్లకి నేనేం తక్కువ చేస్తున్నానని? ఎందరు లేరు, తల్లో తండ్రో ఒకళ్ళే వున్న పిల్లలు? అందరిలాగే వాళ్లూ పెరుగుతారు. ఎందుకు యితనికి యింత ఆదుర్దా? ఒక పొరపాటు చేసాను. దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వడెందుకని? నా కళ్లలో నీళ్లు సుళ్లుతిరిగాయి. రెండు చేతులూ ఎత్తి అతనికి దణ్ణం పెట్టేసాను. ఏడుస్తున్న నన్ను వింతగా చూసాడు. “
“నేను నిన్నేమీ బాధపెట్టడం లేదే? ఎందుకా ఏడుపు? ఆ పరిస్థితుల్లో తప్పనిసరై ప్రమీల మాటలకి వప్పుకుని దూరం పంపించేసాను. నీ భవిష్యత్తు బాగుండాలని పిల్లల్ని నా దగ్గిర వుంచుకుంటే, వాళ్లని నీకిచ్చేదాకా వూరుకోలేదు. వసంతా! వాళ్లంటే నాకు ప్రాణమని నీకు
తెలీదా? వాళ్లని నేను చూడకూడదా? అతనలా చెప్పాడా?””
ప్రభాకర్ గురించి రాజ్ దగ్గిర మాట్లాడాలంటే ప్రాణం చచ్చిపోయినట్టయింది.
“చెప్పు… మాట్లాడవేం?”
“రాజ్ దయచేసి నన్నర్ధం చేసుకో. మా జీవితంలో నీ ప్రమేయం వుండకూడదు. నీకు వీళ్లు కాకుండా యింకా యిద్దరున్నారు”
“రేప్పొద్దున్న నీకూ పుడతారు. నేను వదిలేస్తే వీళ్ల గతేంటి?”
“నేను తల్లిని”
“ఏం చెయ్యగలవు?” అతని గొంతులో అంతులేని హేళన. “
“నీకు ప్రపంచజ్ఞానం లేకపోవడంకూడా పెద్దసమస్యగానే వుందే! సరైన నిర్ణయాలు తీసుకోవడం రాదు. పరిస్థితులని అర్థం చేసుకోలేవు…సరే, ఈ విషయంకూడా నేనే నిర్ణయిస్తాలే. వీళ్లని నేను తీసికెళ్తాను. నువ్వతని దగ్గరకి వెళ్లిపో. పాపం… పెళ్ళికి తేదీకూడా నిర్ణయించుకున్నాక నువ్విలా పారిపోయివస్తే అతనేమైపోతాడు?””
నేను రోషంగా చూసాను. “”పిల్లలని వదిలేసి నా దారి నేను చూసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇది నీ యిల్లు కాదు, యిష్టం వచ్చినట్టు మాట్లాడటానికి” అన్నాను.
“లేకపోతే మరేం చేస్తావు?”
“నేనసలు పెళ్లి చేసుకుంటున్నదే వాళ్లకోసం. నన్ను చెడిపోయినదాన్నంది నీ భార్య. పిల్లల్ని నాలాగే పెంచి మగవాళ్లకి వలవేస్తానంది. నువ్వు వింటూ వూరుకుండిపోయావు. నీకేమీ అనిపించలేదు. నాకో రేటు కట్టి వెళ్లగొట్టేసారు ఇద్దరూ కలిసి. నాపిల్లలు నీ దగ్గిర పెరిగినంతమాత్రాన వాళ్లకి నీ స్థాయి, కుటుంబగౌరవం వస్తాయా? రావు. నన్ను ప్రేమించి నెత్తిన పెట్టుకున్న నువ్వు నన్ను వెళ్లగొట్టేసినట్టే వాళ్లనికూడా ఎప్పుడో వెళ్లగొట్టేస్తావు. ఏ సమస్యలూ రానంతవరకే నీప్రేమ. నిన్ను ప్రేమించి నేను పొరపాటు చేసాను. దాన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్నూ పిల్లల్నీ వదిలిపెట్టి వెళ్లిపో రాజ్.. వెళ్లి ప్రమీలాదేవిని ప్రేమించుకో. నీ ఆస్తినీ నిన్నూ కాపాడుకునే నీ భార్యని ప్రేమించుకో. నీకిష్టం లేదనే, నువ్వు సృష్టిస్తున్న అరాచకానికి భయపడే నేనీ పెళ్లి కూడా మానేసాను. మరో తిరస్కారాన్ని సహించే శక్తి నాకు లేదు.”
“వసంతా! నేనడిగిన రెండు ప్రశ్నలకీ నువ్వు జవాబు చెప్పలేదు.”
“…”
“పిల్లల్ని చూడటానికి నేను రాకూడదని అతను నిర్దేశించాడా?”
ఎంత కోపంగా వున్నప్పటికీ యీ ప్రశ్న వింటూ అతని ముఖంలోకి చూడలేకపోయాను.
“ఎందుకలా తల దించుకుంటావు? తప్పు చేస్తున్నట్టు? అంటే నువ్వు చేస్తున్న పనిలో నీకే విశ్వాసం లేదన్నమాట!”
నేను చివ్వుమని తలెత్తాను.“”అతనుకూడా పిల్లల మంచిని కోరే చెప్పాడు. తండ్రిగా ఒకరు, అమ్మకి భర్తగా మరొకరూ వుండరుకదా, కుటుంబాలలో?” అన్నాను క్లుప్తంగా. రాజ్ దెబ్బతిన్నట్టు చూసాడు.
“వాళ్లకి తండ్రినౌతానని అతను నాకు హామీ యివ్వలేదు. ఆ స్థానంలోకి రావటానికి అభ్యంతరం లేదని మాత్రమే చెప్పాడు. వాళ్లని మంచి స్నేహితుడిలా చూసుకుంటానన్నాడు. అతనివల్ల ఏది సాధ్యపడుతుందో అదే చెప్పాడు.”
రాజ్ ముఖం ఎర్రబడింది. “నా రెండో ప్రశ్నకి జవాబు చెప్పు. రేపు మీకు పిల్లలు పుడితే వీళ్ల పరిస్థితేమిటి?”
“అప్పుడు కూడా నేను వీళ్లకి తల్లినే”
“కానీ, అతను వాళ్లకి తండ్రౌతాడు. వీళ్లకి మాత్రం ఏమీకాడు. స్నేహం తప్పనిసరికాదు. ఐచ్చికం. అప్పుడు వీళ్ళు అతనికి బాదరబందీగానూ ఆహ్వానించబడని అతిథుల్లానూ అనవసరం అనిపిస్తారు. నువ్వుకూడా ఎటూ న్యాయం చెయ్యలేవు. మగవాడికి వున్నన్ని అవకాశాలు ఆడవాళ్లకి లేవు. చూడు, వసంతా, నీ విషయంలో జరిగినదానికి నేను ఇప్పటికే ఎన్నోమాట్లు చెప్పాను. ఇంకా ఎలాంటి వివరణా యివ్వలేను. నాకు హార్టెటాక్ రావటం అనేది ఒక పెద్ద అలజడి. నేను వుంటానో పోతానో అనే సందిగ్ధం వున్నప్పుడు అనుకున్న కొన్ని విషయాలు. అలాంటి సమయంలో పిల్లల బాధ్యత తీసుకుంటానని ముందుకి వచ్చినందుకు ప్రమీలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను”
“ఔనౌను. బాగా చెప్పుకో. నా చర్మం వలిచి చెప్పులు కుట్టివ్వనా, రుణం కొంచమేనా తీరుతుందేమో!”
అతను నా మాటలు విననట్టు కొనసాగించాడు.