గుండ్రని కిటికీలోంచి చూస్తూ, కూర్చున్నా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన ప్రయాణం మొదలైనట్టు అనిపిస్తుంది. కనుచూపుమేర నీలంరంగు, బూడిదరంగూ కలసిన రంగులో ఉన్న సముద్రం ఆవరించి ఉంది. సముద్రపు అలలకి కొంచెం కొంచెంగా ఎగిరెగిరి పడుతూ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తోంది నౌక. అవును ఇది చిన్న పడవ కాదు పెద్ద నౌక, ఎంత పెద్ద సముద్రాన్నయినా దాటేయగల నౌక. నా ముందు కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని ఉంది నా కాబోయే భార్య.
చిన్నప్పటి నుంచీ సముద్రం గురించి గొప్పలు వినడమేగానీ చూడలేదు. ఇప్పటి వరకూ నేను విన్నది, అనుకున్నదీ తప్పు కాదని అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. మా కొండ మీద వర్షాలు పడ్డప్పుడు తప్ప ఇంత నీరు ఎప్పుడూ చూడలేదు. ఆ పడ్డ నీరు కూడా ఎక్కువ నిలవ ఉండలేవు కూడా, అంత వాలుగా ఉంటుంది మా కొండ. ఈ ఇరవై సంవత్సరాల్లోనూ ఎన్నోసార్లనుకున్నాను, విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూడాలని, చాలాసార్లు అన్నాను కూడా మా వాళ్ళతో వాళ్ళకి పల్లే ప్రపంచం, ఇల్లే రాజ్యం’. ఎన్ని కష్టాలు వచ్చినా, పంటలు పండకపోయినా, రోగాలు తగ్గకపోయినా అక్కడే ఉంటామంటారు కానీ, కొండ కిందకి మాత్రం రారు. వాళ్ళకి భయం అనుకునే వాడిని చిన్నప్పుడు, భయపడడం అలవాటయింది పెద్దయ్యాక. ఏ కారణంతో అయినా కొండ కిందకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేవారు కాదు. ఎవరికీ తెలిసేది కాదు ఏమయిపోయారో.
మూడు తరాల నుంచీ ఎవరూ దిగలేదు కిందకి. ఉన్నదేదో తినడం, లేని రోజంటూ ఉండేది కాదు. ఏదో ఒకటి దొరికేది. తినడానికి, తాగడానికి కూడా. ఎన్ని చెట్లు, ఎన్ని ఏళ్ళ వృక్షాలూ మా తాత చెబుతుండేవాడు. ఒకప్పుడు ఇంకా పెద్ద చెట్లు చాలా దూరంవరకూ వ్యాపించి ఉండేవని, అక్కడి వరకూ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళమని. మా నాన్న కూడా చెప్పేవాడు అప్పటికీ ఇప్పటికీ చెట్లు చిన్నవయిపోయాయి, దగ్గరగా కూడా వచ్చేశాయని. సముద్రాన్ని గురించికూడా మా తాతలు వాళ్ళ తాతల దగ్గర నుంచి విన్నదే మాకు చెప్పేవారు. కానీ, వాళ్ళు కూడా ఎప్పుడూ చూళ్ళేదట. కొండమీద అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే, ఎంత పెద్ద చెట్టుమీదకెక్కి చూసినా ఇంకా చాలా పెద్దచెట్టే కనిపించేంత. మాకు లెక్కలు, భాష చాలా వేరుగా ఉన్నాయి, ఉంటాయి అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మా కొండేగాక, ఇంకా చాలా చాలా పేద్ద ప్రపంచం బయట ఉంది కూడా.
ఒక నెల రోజులైంది అనుకుంటా, అలాంటి ఆలోచన వచ్చి, ఎందుకంటే మొదటిసారి చూశాం మేము, మా కొండవాళ్ళలాంటి వాళ్ళను కాకుండా వేరేగా ఉండేవాళ్ళని. విచిత్ర వేషధారణ. ఒకరకమైన భాష వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. మాకు భాష తెలీదు, మా భాష వాళ్ళకు అవసరం లేదు. వరుసగా ఐదారు రోజులు వచ్చారు, తర్వాత వాళ్ళతోపాటు ఇంకేవో వచ్చాయి, పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ, చెట్లు కొట్టేశారు మొదట. తర్వాత తవ్వడం మొదలు పెట్టారు. కొన్ని రోజులకి మావాళ్ళు అక్కడినుంచి దూరంగా వెళ్ళిపోవడానికి తయారయ్యారు. అప్పుడు అనిపించింది కొండమీద చెట్లు ఇంకా తగ్గిపోతాయని. మావాళ్ళు ఆడుకునే ప్రదేశం కూడా చిన్నదైపోతుందని. నాకు వెళ్ళబుద్ధి కాలేదు, ఇంకొన్ని రోజులకి మేము వెళ్ళిన చోటకుకూడా వీళ్ళు వచ్చేస్తారేమో అని అనిపించింది. అదే చెప్పాను. మా వాళ్ళకి, వాళ్ళకి అర్థం అయిందో లేదో తెలియదుకానీ, వాళ్ళు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు.
నేను, కొంతమంది నేస్తగాళ్ళుమాత్రం ఉంటామని చెప్పాము. కొన్నిరోజులు చూసి ఆ తవ్వేవాళ్ళే వెళ్ళిపోతారని. కానీ, వాళ్ళు వెళ్ళలేదు. మమ్మల్ని వెళ్ళిపొమన్నారు. వెళ్ళమన్నాం చాలాసార్లు. కొన్నిరోజులు రాలేదు వాళ్ళు. మేం ఆనందంగా ఉన్నాం.
ఒకరోజు ఒకాయన ముందు వచ్చిన వాళ్ళకంటే ఎర్రగా ఉన్నాడు. వాడు ఇంకేదో బాష మాట్లాడుతున్నాడు, అతనితో వచ్చినవాళ్ళమీద కోపంతో అరుస్తున్నాడు, వాళ్ళు ఏం చెప్పాలో తెలియక బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయేసరికి, అప్పటి వరకూ దిగమింగుకొని ఉన్న ఆక్రోశాన్ని మా పైకి మరల్చారు. మొట్టమొదటిసారి నా ఒంటిపై దెబ్బపడింది లాఠీది.
ఆ రోజుకి అందర్నీ కొట్టారు, మా దగ్గర తన్నులు తినడానికి శరీరాలున్నాయి కానీ, తిరిగికొట్టాలనే ఆలోచన బుర్రలో లేదు, కొట్టడానికి కర్రలూ లేవు. ఆ తరువాత రోజు మాతోనే పనులన్నీ చేయించారు, మేము అంతకుముందు చేయనివీ, మనుషులు ఈ పనులు కూడా చేస్తారా అని అనిపించేవీనూ. సూర్యుడు దిగిపోతున్నాడు, ఆ సమయంలో మళ్ళీ వచ్చాడు. ఆ ఎర్రతోలు మనిషి ఈసారి అంత భయంకరంగా కనిపించలేదు. వాళ్ళందరూ చేతులు కొట్టుకొని శ్రద్ధగా విన్నారు, ఇంకో ఇరవై నిమిషాల్లో నాకు కాబోయే భార్య వాళ్ళ వాహనంలో ఉంది. నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలని కూడా ఆలోచన రాలేదు. ఒక్క ఉదుటున ఆ వాహనంలోకి గెంతి, తనని క్రిందికి లాగేశాను. పై నుంచి పడడంతో కొంచెం మోకాలు గీసుకుపోయింది నాకు, తలమీద చిన్నగా కొట్టుకుంది తనకి. అంతే ఆ మనుషులు వచ్చి మీద పడ్డారు. నన్ను తననుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యం అయిందనుకున్నాడేమో, ఆ ఎర్ర మొహంవాడు, అక్కడ వేసిన గుడారంలోంచి బయటికి వచ్చి, జరుగుతున్న గలాటాను చూశాడు. గభాలున వచ్చి గాల్లోకి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చాడు. ఆ శబ్దానికి అందరూ నిశ్చేష్టులై నన్ను వదిలి పక్కగా నిలబడిపోయారు, నేను మాత్రం తనని’’ వదలకుండా అలానే పట్టుకుని ఉండిపోయా.
ఆ ఎర్రమొహంవాడు నా దగ్గరకి వచ్చి, నా పట్టులోంచి తనను’ తప్పించబోయాడు. ఎక్కడ్నించి వచ్చిందో, పిచ్చికోపం, ఒక్కసారిగా ఎడమ చేతి పిడికిల్లోకి చేరి, ఆ ఎర్రమొహం వాడి కుడిబుగ్గ ఎముక మీదకి చేరింది, భళ్ళున రక్తం చిమ్మింది నా ముఖం మీదకి. ఒక్కసారిగా తనని’ వదిలేసి, తుపాకీని కూడా జార్చేసి కూలబడిపోయాడు. అదే అదనుగా అక్కడ్నించి పారిపోదామనుకొని లేచి, తనని లేపి ప్రక్కగా పడి ఉన్న తుపాకీని కూడా తీస్కున్నా. వాళ్ళ మనుషులు భయంతోనో, ఊహించని హఠాత్పరిణామానికో కొయ్యబారిపోయారు. కొంచెంసేపటికి తేరుకొని మమ్మల్ని వెంబడించడం మొదలు పెట్టారు. తుపాకీ గుళ్ళన్నీ అయిపోయేవరకూ కాల్చాను, ఎవ్వరూ కనిపించలేదు వెంబడిస్తున్నట్టు.
తర్వాత రెండురోజులకి చాలామంది వచ్చారు, అడవి అంతా గాలించారు, నేను దొరికేవరకూ. ఒక ఇరవైమంది ఒకేలాంటి దుస్తులు వేసుకున్నవాళ్ళు, చేతితో పొడుగాటి తుపాకులు పట్టుకొని, నన్ను పెట్టిన వాహనంలో నాతోపాటు కూర్చున్నారు. ఎక్కడికో తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, అంతలో ఆ వాహనం పైకి రాళ్ళు కురుస్తున్నాయి అన్నివైపులనుంచీ, వారితోపాటు వచ్చిన మిగతా మనుషులు వారివారి వాహనాల్లోంచి దిగి తుపాకీలు ఎక్కుపెట్టి కాల్చడం మొదలుపెట్టారు. రాళ్ళు కురవడం ఆగింది. మావాళ్ళని చాలామందినికూడా పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ వాహనాల్లో ఎక్కించారు, కొట్టి మరీ.
చాలాసేపు పోయాక కొండ దిగుతున్నట్టు అనిపించింది. మరి కొంతసమయానికి పల్లం అనిపించింది, బయటకు చూశా, చాలా కష్టపడి వాళ్ళని కొంచెం పక్కకునెట్టి మరీ. పచ్చదనం లేదు. ఎర్రని ఎండమీద, నల్లనిదుమ్ము మా చుట్టూతా. నేల సరిగా కనిపించలేదు ఆ ధూళికి. ఎక్కడికో పట్టుకుపోయారు మమ్మల్ని అందరినీ, ఒక చిన్న గదిలాంటి దాన్లో అందరినీ పెట్టారు, ఆడ మగ తేడా లేకుండా. రాత్రంతా అక్కడే ఉన్నాం, తిండి లేకుండానే. ఆకలి, దుఃఖం వచ్చాయి జీవితంలో మొదటిసారి. అందుకే కొండ దిగొద్దన్నారేమో పెద్దోళ్ళు అనుకున్నాను. తెల్లారేసరికి ఇంకెక్కడకో పట్టుకెళ్ళారు, అక్కడ నల్ల బట్టలేసుకుని ఒక పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్న ఒకాయన ఏదో చెప్పాడు.
అక్కడి నుంచి నన్నూ, తనని మాత్రం వేరుగా ఉంచి, మిగతా అందర్నీ ఎక్కడికో పట్టుకెళ్ళారు. మా ఇద్దర్నీ రెండోరోజు మధ్యాహ్నం, చాలా వేడిగా ఉంది, వేసవికాలం, చిన్న వాహనం ఎక్కించి తీసుకుపోతున్నారు. చాలా సమయం తర్వాత ఏదో హోరు వినిపిస్తోంది. దగ్గరకు రమ్మన్నట్టు ఆహ్వానంలా అనిపిస్తుంది. క్షణక్షణానికీ అంది ఎక్కవౌతూ, ఒక్కసారిగా పక్కనే వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నీరు, ఎక్కువ నీరు పెద్దపెద్ద అలలుగా నావైపు వస్తున్నట్టుంది. అదే మొదటిసారి నేను సముద్రం చూడడం. తనవైపు చూశా, తన ముఖంలో కూడా ఆనందం, ఆశ్చర్యం, రెండు నిమిషాలే. తర్వాత మరికొంత మంది మనుషులు వచ్చారు. మమ్మల్ని ఒక పడవలో కూర్చోబట్టి సముద్రం లోపలికి తీసుకుపోయారు, అక్కడ నుంచి ఈ నౌకలోకి, ఈ చిన్న ఇరుకైన గదిలోకి తీసుకొచ్చి పడేశారు. మొత్తానికి ఇరవై సంవత్సరాల కోరిక ఇలా తీరింది.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.