నీలిమ, నవీన్ by Thulasi Bhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. తగిన శిక్ష by Thulasi Bhanu
  3. మల్లీశ్వరి by Thulasi Bhanu
  4. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  5. శోభ by Thulasi Bhanu
  6. సహన by Thulasi Bhanu
  7. బ్రతుకు దీపం by Thulasi Bhanu
  8. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  9. జ్ఞాపకం by Thulasi Bhanu
  10. కీర్తన by Thulasi Bhanu
  11. మనోరంజని by Thulasi Bhanu

శ్రావణి, సహజసిద్ధమైన అందంతో, ఏ ఆభరణాలూ లేకున్నా సన్నని చిరునవ్వు నిత్యాభరణంగా, వీలయినంత ప్రశాంతంగా ఉంటుంది. నలుగురు ఆడపిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఆమె పుట్టిల్లు.
కాలేజీకి వెళ్ళివచ్చేటప్పుడు ఆమె ఫ్రెండ్ అన్న ఒకరు, సిటీబస్సులో రోజూ శ్రావణిని ఆరాధనగా చూస్తూ ఉండేవాడు. అది శ్రావణికి తెలుసు. అతను కనపడగానే శ్రావణి మోము ఎర్రబడిపోయేది. పక్కనే ఉన్న ఫ్రెండ్ ప్రశాంతి-
“అరే, ఏమిటీ నీ మొహం టొమాటో రంగులోకి మారింది?” అని ఆటపట్టించేది.
అతను బాగా డబ్బున్న, శ్వేతవాళ్ళ అన్న. ప్రభాత్. శ్వేత శ్రావణి క్లాస్‍మేట్.
శ్వేత స్కూటీ మీద వచ్చివెళ్ళేది కాలేజీకి. ప్రభాత్‍కి బైక్ ఉన్నా కాలేజీకి మాత్రం శ్రావణికోసం బస్సు ప్రయాణం చేసేవాడు. అతనికి శ్రావణి అంటే చాలా ఇష్టం.
ఒకరోజు శ్వేత తన పుట్టినరోజని అందరినీ, పార్టీకి పిలిచింది ఇంటికి. శ్రావణి తనకున్న ఒకే ఒక మంచి చీర, ఆకుపచ్చ జార్జెట్ చీర కట్టుకుని, పొడుగైన జడ వదులుగా అల్లుకుని, అమ్మ కట్టిచ్చిన వత్తైన మల్లె, కనకాంబరం, మరువం కలగలిసిన ఒక మూర పువ్వులమాల పెట్టుకుని, ఎర్రని చిట్టిబొట్టుబిళ్ళ పెట్టుకుని, సన్నటి కాటుకరేఖ కనులకు దిద్దుకుని, అద్దంలో చూసుకుంటే తనకి తానే ముగ్ధమనోహరంగా కనిపించింది. ఆనందంగా నవ్వుకుంది. అమాయకమైన ఆ నవ్వు ఇంకా అందాన్ని ఇచ్చింది ఆమె వదనానికి.
వెనకనుంచీ కూతురిని అద్దంలో చూస్తున్న తల్లి రేఖ, “చాల్లేవే, నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేది. తొందరగా వెళ్ళొచ్చి చదువుకో” అని ముద్దుగా మందలించింది.
పార్టీలో అందరూ మెరిసిపోతున్నారు. వారి మధ్య తాను, తన చీర వెలవెలబోతున్నాయి అనిపించింది శ్రావణికి.
ప్రశాంతి అడిగింది. “ఏమయ్యింది, డల్‍గా ఉన్నావు?” అని.
“ఏం లేదు… ఏం లేదు” అని చెప్పింది శ్రావణి.
కూల్ డ్రింక్ తాగుతూ ఓ పక్కన కూర్చున్నారు ఇద్దరూ. పెద్దపెద్దవాళ్ళు వచ్చి బాగా హడావిడిగా జరుగుతోంది పార్టీ. ప్రభాత్ ఎంత బిజీగా తిరుగుతున్నా, శ్రావణిని కెమెరాలో బంధిస్తూ, శ్రావణిని కనులారా చూసుకుంటూ, శ్రావణి తనని చూసినప్పుడు, ఓ చిన్ననవ్వు నవ్వి పలకరిస్తూ, అన్నగా తన బాధ్యత, ప్రేమికునిగా తన సంతోషం రెండూ సమంగా చూసుకుంటున్నాడు. చివరిగా ఫ్రెండ్స్ అందరితో గ్రూప్ ఫొటో అంది శ్వేత.అందరూ ఖరీదైన డ్రెస్సులు వేసుకొచ్చారు. తాను అచ్చతెలుగందంలా ఉన్నా వాళ్ళందరి మధ్యా తీసికట్టుగా ఉన్నానేమో అనిపించింది శ్రావణికి.
కానీ నాలుగురోజుల తరువాత శ్వేత ఆల్బం తెచ్చి ఫొటోలు చూపించింది. ఫ్రెండ్స్ అందరూ దిగిన ఫొటోలో శ్రావణి నిరాడంబరంగా ఉన్నా కూడా, కుందనపుబొమ్మలా అందాలరాశిలా కనబడుతోంది.
“ఓయ్ శ్రావణి! ఇంత బావున్నావేంటీ… మేము వేలకివేలు పోసి కొనుక్కున్న డ్రెస్సుల్లోకూడా నీ అంత అందంగా లేము” అంది శ్వేత.
“మా అమ్మకి ఈ ఫొటోచూపించి తెస్తాను, నాకు ఇస్తావా?” అడిగింది శ్రావణి శ్వేతని.
“నువ్వే ఈ ఫొటోని దాచుకో, తెచ్చివ్వక్కర్లేదు. నేను ఇంకో కాపీ ప్రింటు వేయించుకుంటాలే” అంది శ్వేత.
శ్రావణి బుగ్గని అల్లరిగా పట్టి లాగుతూ, “అర్ధమొగుడుకదా, అందుకే ఇలా చిలిపివేషాలేస్తోంది” అని ప్రశాంతి శ్రావణి చెవిలో చెప్పింది.
“ఏయ్!” అని శ్రావణి ప్రశాంతిని భుజం మీద కొట్టింది.
ఆల్బంలో ఫొటో చూసుకుని, ఆపాతమధురాలను జ్ఞాపకం తెచ్చుకుంది ఈ నాటి శ్రావణి. కూతురు నీలిమ, భర్త జయ్ ఇంటికొచ్చే వేళయిందని టీ , పకోడీలు తయారుచేయాలని ఆల్బమ్ అల్మరాలో పెట్టేసి లేచింది. పకోడీలు చేసి మల్లెపూలు మాల కడుతూ మళ్ళీ పాత జ్ఞాపకాల్లోకి జారింది శ్రావణి.
బస్సు దిగి రోజులానే నడిచివెళుతున్నారు శ్రావణి, ప్రశాంతి.
“వీనూ!” అని మృదువైన గొంతు వినపడింది శ్రావణికి. తలతిప్పి చూస్తే ప్రభాత్. కంగారుగా అనిపించింది శ్రావణికి.
“వీనూ! అమ్మకి నిన్ననే నేను నీగురించి చెప్పాను. మీ ఇంటికి వస్తానంది. ఒక్కటి ముందుగా చెప్పు. నీకు నేనంటే ఇష్టమేనా?” అడిగాడు.
“ఊహూ<” అని తల అడ్డంగా ఊపేసింది శ్రావణి. స్పష్టంగా బాధ కనపడింది ప్రభాత్ కళ్ళల్లో. అయినా అతను వెంటనే తన మొహంలో, కళ్ళల్లో బాధ కనపడకుండా చిన్నగా నవ్వేసాడు.
“వీనూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అదే మాట నిన్న అమ్మకు చెప్పాను, మీ ఇంటికొచ్చి మీ అమ్మానాన్నతో మాట్లాడుతారు మా అమ్మ” అని చెప్పాడు ప్రభాత్.
“ఊ< సరే” అనేసింది ఈసారి నిజాయితీగా. ప్రభాత్‍మీద ఇష్టాన్ని మాటల్లో, కాటుకకన్నుల్లో తెలియచేస్తూ.
“శ్రావణి… ఏమయ్యింది? ఎందుకీ తడబాటు? కంగారు?” అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు ప్రభాత్. ఏం లేదు అన్నట్టు తలూపుతూ, సన్నగా నవ్వింది శ్రావణి.
ఆరోజు ఇంటికెళ్ళాక బియ్యం ఏరుతూ ఆలోచనల్లో పడి చేట పడేసింది. బియ్యం నేలమీద పడిపోతే అన్నీ శుభ్రంగా ఎత్తి కడిగింది. కాఫీ మరిగించేసింది. కూర తరుగుతూ చెయ్యి కోసుకుంది.
“ఏమయ్యింది వాణీ నీకు, వంట్లో బాగోలేదా?” అడిగింది తల్లి, నుదురు మీద చెయ్యేసి చూస్తూ.
“అమ్మా ప్రభాత్, శ్వేత అన్న. వారి అమ్మగారు మనింటికొచ్చి నన్ను చేసుకుంటానని అడుగుతారుట. ఇది విన్నప్పటినుంచీ అయోమయంగా ఉంది” అంది తల్లి భుజంమీద తలవాలుస్తూ.
“నీకెవరు చెప్పారు?” అడిగింది తల్లి.
“ఆ అబ్బాయే” అంది శ్రావణి.
“నీకెందుకే అబ్బాయితో మాటలు, తిన్నగా ఇంటికి రాకుండా?” మందలించింది తల్లి రేఖ.
“లేదమ్మా అతనే ఈమాట చెప్పేసి వెళ్ళిపోయాడు”అంది శ్రావణి.
“వాణీ! జాగ్రత్తగా ఉండాలమ్మా! ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదు” చెప్పింది రేఖ.
ఆరోజు ఇందుమతి, కొడుకు చెప్పాడని, శ్రావణి ఇంటికి వచ్చింది. కారులో దిగి వస్తున్న ఇందుమతిని, రేఖ గౌరవంగా ఆహ్వానించింది. వేడివేడిగా మినపరొట్టె, కారప్పొడి, అల్లంపచ్చడితో చేసి పెట్టింది. కమ్మటి ఆ రుచికి మొహమాటం వదిలేసి మరీ తింది ఇష్టంగా ఇందుమతి. కాఫీ తాగుతూ రేఖతో చెప్పింది. “నాకు మా అబ్బాయి ఇష్టానికి అడ్డుచెప్పాలని లేదు. కానీ మావారు స్థాయిని చూసే ఒప్పుకునే మనిషి. మీ సంబంధానికి ఆయన ఒప్పుకోరు, మీకు ఇప్పటికే అయిన సంబంధం ఉందని చెప్పేయండి మా అబ్బాయికి. బహుశా మీ అమ్మాయి వాడితో మాట్లాడుతూనే ఉంటుందేమో కదా?” అంది ఇందుమతి.
ఆవిడ మాటలు లోపల్నుంచీ వింటున్న శ్రావణికి గుండె భగ్గుమంది. కళ్ళల్లో నీళ్ళు ఎందుకు జారుతున్నాయో తెలియట్లేదు, కానీ ఏడుపు ఆగట్లేదు.
రేఖ మాత్రం, “అవునా ఇందుమతిగారు? సరే కానివ్వండి, అలాగే” అని సమాధానం చెప్పింది.
ఇందుమతి, “శ్రావణి ఉందా ఇంట్లో?” అని అడిగింది.
“వాణీ!” అని పిలిచిన అమ్మ పిలుపు విని కళ్ళు తుండుతో శుభ్రంగా తుడుచుకుని, మొహంలో ఏ భావమూ లేకుండా ముందుగదిలోకి వెళ్ళింది శ్రావణి.
“బంగారుబొమ్మలా ఉంది. అందుకే మావాడు అంతలా ఇష్టపడ్డాడు. కానీ, కలిమి లేదుగా మరి? మావారు ఒప్పుకోరు, అనవసరం ఆయనను ఒప్పించాలి అనుకోవటం కూడా. పెళ్ళి ఖర్చులకు నేనయినా డబ్బు ఇస్తాను, కానీ తరువాత ఈ ఇంటికి, ఆ ఇంటికి రాకపోకలప్పుడయినా ఆయన మిమ్మల్ని తక్కువ కడతారు. అప్పుడు మన అందరికీ మనసుకి బాధేగా? అందుకే ముందే సరయిన నిర్ణయం తీసుకుంటే మంచిదనీ…” అంది ఇందుమతి ప్రేమగానే శ్రావణి తల నిమురుతూ.
రేఖ శ్రావణిని చూసి, “వాణీ లోపలికి వెళ్ళమ్మా!” అంది. శ్రావణి వెళ్ళింది.
“మనసు కష్టపెట్టుకోవద్దు రేఖా! పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ తట్టవు కదా?” అని ఇందుమతి సంజాయిషీగా చెప్పింది.
“అవునండీ నిజమే! అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారుంటే మంచిదేగా?” అంది స్థితప్రజ్ఞతతో రేఖ. ఇందుమతి రేఖను దగ్గరకు తీసుకుని వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది..
శ్రావణి వెక్కివెక్కి ఏడుస్తోంది రేఖ లోపలికి వెళ్ళేటప్పటికి.
“వాణీ! ఎందుకమ్మా ఏడవటం? అంతస్థుల్లో ఉండే అంతరాలు, బంధాలను సరిగ్గా నడవనియ్యవు తల్లీ! అర్ధం చేసుకో. ఆవిడా ఒక తల్లే, నేనూ నీ తల్లినే. మాకు తెలుసు కదమ్మా మీకు ఏది మంచిదో కాదో” అని ఓదారుస్తోంది రేఖ శ్రావణిని. అప్పుడే వచ్చిన ప్రశాంతి అంతా అర్ధం చేసుకుంది.


ప్రభాత్ బస్సులో రావటం మానలేదు, శ్రావణి మాత్రం అతన్ని పట్టించుకోవటం మానేసింది. అందనివి అందుకోవాలని ఆశపడేతత్వం కాదు శ్రావణిది. ప్రశాంతి శ్రావణిని ఆటపట్టించే మాటలు మూగబోయాయి..
బీకాం చేసిన శ్రావణి ట్యూషన్లు చెప్పేది. డబ్బులు కూడబెట్టేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా సమయం కావాలి అనే సమాధానం మాత్రమే చెప్పేది. ప్రశాంతి, శ్వేత తమకు తగ్గవారితో పెళ్ళి చేసుకున్నారు. ప్రభాత్, శ్రావణి కాలేజీ చదువు అయ్యాక, బస్సులో రావట్లేదని, శ్రావణి ఇంటి చుట్టూ తిరిగేవాడు. శ్రావణి అస్సలు పట్టించుకునేది కాదు అతన్ని. తల్లి ఎంత నచ్చచెప్పినా ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోలేదు ప్రభాత్.
మనసు కుదుటపడి, మిగిలిన ముగ్గురు అక్కచెళ్ళెళ్ళ పెళ్ళిళ్ళు అయినా తన పెళ్ళి కాలేదని అమ్మానాన్నా దిగులు పడుతుంటే పెళ్ళికి సరే అంది శ్రావణి. జయ్ ఓ కాలేజీలో లెక్చరర్. శ్రావణికూడా ట్యూషన్ చెబుతుందని, ఇద్దరూ ఒకే ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఆర్ధికంగా హాయిగా జరిగిపోతుంది అనుకుని పెళ్ళికి ముందడుగు వేసారు.
పెళ్ళికి ముందు, పెళ్ళి సమయంలోనూ ప్రభాత్‍ని తమ ఇంటివైపు రాకుండా చూసుకోమని రేఖ కబురు పంపింది ఇందుమతికి. ప్రభాత్ మళ్ళీ కనపడలేదు.
ఏ రాతలూ మురికి చేయని తెల్లకాగితంలాంటి మనసుతో శ్రావణి జయ్‍కి అర్ధాంగి అయ్యింది. నీలిమ పుట్టింది. ముచ్చటయిన సంసారం. ఎప్పుడన్నా ఇలా ఆల్బంలో ఫొటో కనిపిస్తే కాసేపు ఆ పాతజ్ఞాపకాలు దోసిట్లో పట్టుకుని మనసు హెచ్చరించగానే పిడికెడు గుండెలోకి దాక్కోమని వాటిని తరిమేస్తుంటుంది శ్రావణి.


ఇప్పుడు శ్రావణి జయ్ మధ్యతరగతికంటే ఎగువన ఉన్నవారి కోవలోకి వస్తారు. నీలిమ ఓ రోజు చెప్పింది.
“అమ్మా! నవీన్ బాగా చదువుతాడు. పాటలైతే సూపర్‍గా పాడుతాడు. నాకు భలే ఇష్టం అతనంటే” అంది. అలా అలా నవీన్ నామజపం ఎక్కువగానే చేస్తోందీ మధ్య నీలిమ.
ఆమె బర్త్‌డే పార్టీకి వచ్చారు స్నేహితులు. వారిలో నవీన్ సాదాగా ఉన్నాడు మనిషి. పార్టీ అయ్యాక చెప్పింది నీలిమ.
“అమ్మా! అతను పల్లెటూరినుంచీ వచ్చాడు. రైతుబిడ్డ. పంటలు సరిగ్గా పండితే ఇల్లు బానే నడుస్తుందిట, లేదంటే అప్పులూ, తిప్పలూ పాపం వారింట్లో” అని వివరాలు చెప్పింది తల్లికి తనంతటతానుగానే.
“అవునా?” అంది శ్రావణి..
డాక్టర్‍గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది నీలిమ.
“అమ్మా! ఈ వారం, నాకు ఓ రెండ్రోజులు ఖాళీ దొరికింది. నవీన్‍వాళ్ళ ఊరు చూసొద్దాం. నాన్నకు చెప్పు” అంది.
“సరే” అంది శ్రావణి..
నవీన్ ఊరు శైలవరం. రోడ్డు బాలేదు. క్వాలిస్ బండిలో వెళ్తున్నారు కాబట్టి కానీ ఎత్తు తక్కువ కారు అయి ఉంటే ఎగుడుదిగుడు రోడ్డుకి కారు మధ్యలోనే ఇబ్బందిపెట్టేదేమో అనేలా అస్తవ్యస్తంగా ఉంది రోడ్డు. నవీన్ ఇల్లు పెంకుటిల్లు. ఇల్లు పెద్దది, పాతది. చూడటానికి చాలా బావుంది. బాగా ఆదరించారు నవీన్ తల్లితండ్రి. వేడిగా అన్నాలు తిని బయట వేసిన నులకమంచాలమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ.
అంబా అనే ఆవుల అరుపులు, మేకల మే అనే పిలుపులు…చుట్టూ ఖాళీస్థలం, గాలికి తాము ఊగుతూ ఇంకా మంచిగాలిని అందిస్తున్న పెద్దపెద్ద పచ్చని వేప, మామిడి చెట్లు… దూరంగా తాటిచెట్లు… ఎగిరే కాకులు, వాకిట్లో వాలి నుంచుని చిట్టితలను ఆహారంకోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిప్పే పిచ్చుకలు… చాలా అందమయిన అనుభూతిని కలిగించే ప్రకృతి ఆవాసనిలయంగా పల్లెటూరు…ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ నీలిమ, శ్రావణి, జయ్.
నవీన్ పొలంనుంచీ వచ్చాడు. నవ్వుతూ పలకరించాడు.
“ఎలా ఉండబోతోంది పంట ఈసారి?” అడిగాడు జయ్.
“సాధ్యమయినంత కష్టపడుతున్నానండీ! లాభంమాట దేవుడెరుగు, కనీసం నష్టపోకుండా అంతా ప్లాన్ చేసుకుంటున్నాను” అన్నాడు నమ్మకంగా, ఆత్మవిశ్వాసంగా. “చదివిన చదువుతో వచ్చిన జ్ఞానాన్ని వృధా పోనివ్వను” అన్నాడు ధైర్యంగా.
“అన్నం తిను నవీన్” ప్రేమగా గుర్తుచేసింది నీలిమ.
“సరే, మీరు తయారవ్వండి. మంచి గుడి ఉంది దగ్గరిలో. తీసుకెళతాను” అన్నాడు నవీన్.
రెండురోజులు ప్రశాంతంగా ఉండి సిటీకి బయల్దేరారు నీలిమావాళ్ళు. ఎంత చదువుకున్నా పల్లెటూరిలో ఉండి వ్యవసాయం చెయ్యాలనుకున్నాడు యువరైతు నవీన్.


మూడేళ్ళు గడిచాయి. నవీన్ తన స్వంత అనుభవాలతో వ్యవసాయంలోని లోటుపాట్లు, మెళకువలు అన్నీ బాగా అర్ధం చేసుకున్నాడు.
రైతుబిడ్డగా , యువరైతుగా మంచి అవగాహనతో నడుచుకుంటున్నాడు.
“అమ్మా! నేను పల్లెటూరులో డాక్టరుగా స్థిరపడతాను” అని నీలిమ శ్రావణినీ జయ్‍నీ ఒప్పించుకుని శైలవరంలో చిన్న హాస్పిటల్ కట్టించుకుని వైద్యం మొదలుపెట్టింది. ఇవ్వగలవారి దగ్గర ఫీజ్ తీసుకుంటుంది. డబ్బులు లేక ఫీజ్ తర్వాత ఇవ్వమా అని అడిగినవారికి డబ్బులు ఆశించకుండా వైద్యం చేస్తుంది.
ఇద్దరూ చిన్నవారైనా ఆదర్శవంతమైన జీవనశైలిని ఎంచుకున్నారు,యువతరానికి స్ఫూర్తిగా.
శ్రావణీవాళ్ళకి, నవీన్ తల్లితండ్రులకీ తమ పిల్లలంటే చాలా గర్వంగానూ, గౌరవంగానూ ఉంటుంది. నీలిమ, నవీన్‍ల పెళ్ళికి ఏ స్థాయీ అడ్డంకి కాలేదు, ఏ అంతరమూ వారికి అడ్డు రాలేదు. ఇరువైపుల పెద్దలూ పిల్లల ఆనందం మాత్రమే ఆలోచించారు. ఏదేనా దృష్టీ, దృక్పథమూ.