“అందరు ఆడపిల్లల్లాగే తనూ పెళ్ళి చేసుకుంటే తప్పేంటి? మీయింటితో సంబంధం కలుపుకున్నామంటే మనం మనం పైవాళ్ళం కాదు. భేషజాలు వదిలేసి మాట్లాడుకుందాం. ఇల్లు అమ్మెయ్యండి. అప్పేదో వుందంది స్వరూప. తీర్చి, ఉన్నంతలో పెద్దపిల్ల పెళ్ళి చెయ్యండి. చిన్నదానికి ఇంకా పెళ్ళీడు లేదు. ఇంకో ఐదేళ్ళేనా ఆగచ్చు. ఈ ఐదేళ్ళూ సుమిత్ర ఏం చేస్తుంది? ఆ తర్వాత ముప్పయ్యేళ్ళు దాటాక తనని ఎవరు చేసుకుంటారు? మా ఫ్లాటు ఖాళీగా వుంది. అందులో వుండండి. ఉత్తిగా ఉండటం ఇష్టం లేకపోతే మీరు ఇవ్వగలిగిన అద్దె ఇవ్వండి”
“నిజమేకదమ్మా? సూర్యా సుమిత్రని ఇష్టపడుతున్నాడు. పెళ్ళి చేసుకుంటానని వెంటవెంట తిరుగుతున్నాడు. ఇంతకాలానికి మనసు మారి అదీ వింటోంది” అంది స్వరూప.
ఒక్కొక్కసారి ఇంట్లో తలెత్తే సమస్యలకి బైటి ప్రమేయం చాలా అవసరం వుంటుంది.అన్యాయం జరిగేవాళ్ల పక్షాన మాట్లాడేవాళ్ళూ, ఉభయతారకమైన పరిష్కారం చూపేవాళ్ళూ వాళ్ళే ఔతారు. సుమిత్రకి చేసుకోవాలనీ, రాధకి చేసుకోవద్దనీ వుంటే అదొక పీటముడిలా బిగుసుకుంటుందే తప్ప విడదు. బాహాటంగా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకోవచ్చు. రాధలో ఎలాంటి సానుకూలతా లేదు. ఇప్పుడు కూడా. వియ్యపురాలికి ఎదురుచెప్పలేక గిజగిజలాడుతోంది. ఇదేం పరిష్కారం? ఇల్లూవాకిలీ అమ్ముకుని తను వీళ్ళింట్లో వుండాలా? మరి మమత విషయం?
“ఇంటిమీద అప్పు చేసారు. జీతంలోంచీ వడ్డీ కడుతున్నారు. అలా ఎంతకాలం కట్టినా వడ్డీయే తప్ప అసలు తీరదు. అమ్మేసి అప్పు తీర్చి మిగిలింది వడ్డీకి వేసుకో” అంది స్వరూప. అత్తగారి మాటకి మాట జోడిస్తూ మాట్లాడుతున్న ఆమెని చూసి రాధకి వింతగా వుంది. తను కన్న కూతురేనా అనిపించింది. సునీత విషయంలో కలిగిన బాధ ఒకరకం, ఇప్పుడు కలుగుతున్నది మరోరకం. పిల్లలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సుమిత్ర దీనికి మినహాయింపు కాదు. అది మరీ కష్టంగా అనిపిస్తోంది. ఈ బంధాలూ బాంధవ్యాలూ ఇంతేనా? స్వార్థం ముందు తల్లీ, ప్రేమా వుండవా? తన నిస్సహాయత అర్థం చేసుకోరా? ఆవిడకి కళ్ళమ్మట నీళ్ళు తిరిగిపోతున్నాయి.
మాట్లాడుతున్నది వియ్యపురాలు. పెత్తనం చేతిలోకి తీసుకుంది. ఏం చెప్తే ఏది ఎటు తిరుగుతుందో తెలీదు. తనుమాత్రం అనుకోలేదా, మొదట సుమిత్ర పెళ్ళే చేద్దామని? పరిస్థితులు కలిసిరాలేదు. ఈ పరిస్థితులకి భయపడే మానేసింది. ఇప్పుడూ అవే పరిస్థితులు. కానీ కూతురు తెగబడుతోంది. లేకపోతే సూర్యకి అంత చనువు ఎందుకు ఇవ్వాలి? చనువు వచ్చాక ఏ మగవాడు ఆగుతాడు?
“ఇంతకుముందు తనకేదో సంబంధం అనుకున్నారట? ఆ పిల్లాడు డ్రగ్స్‌కీ వాటికి అలవాటుపడి జైల్లో వున్నాడట? అతను జైల్లోంచీ వచ్చి, సుమిత్రని చేసుకుంటాను, చేస్తారా చస్తారా అని ఇంటిమీదికి వస్తే ఏం చేస్తారు?” ఖంగుమంది దేవకి గొంతు. స్వరూప మనసులో వున్నదీ, సూర్య బయటికి చెప్పలేనిదీ, సుమిత్ర ఇంకా ఆలోచించనిదీ అదే. అతనితో తను ఇదివరకట్లా వుండగలదా అని తన కోణంలోంచే ఆలోచించిందిగానీ అతనివైపునించీ ఇలా జరగచ్చని అనుకోలేదు. భయంతో చిన్నగా వణికింది సుమిత్ర. రాధ బిగుసుకుపోయింది ఆ మాటలకి.
“సూర్యాని పెళ్ళిలో చూసాము. చక్కగా వున్నాడు. సుమిత్రకి చక్కటి జోడీ. మీరు మరేమీ మాట్లాడకండి. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సంబంధం కుదుర్చుకు వస్తాం. పెళ్ళి చేసి పంపండి మీ పిల్లను” అంది దేవకి.
“మీవారు నలుగురు పిల్లల్తో మిమ్మల్ని వదిలేసి పోయినప్పుడు లేని అధైర్యం ఇప్పుడు మీకెందుకు పట్టుకుంది? పిల్లలని నిలబెడితేనేకదా, వాళ్ళు మనకి ఆసరా అయేది? మీకేం తక్కువ? చక్కటి పిల్లలు… మిమ్మల్ని వదిలిపెట్టరు. అలా మీ పిల్లలు పెరగలేదు” అని లేచింది. సూర్య వివరాలు తీసుకుని స్వరూపని అక్కడే వదిలేసి వెళ్ళింది.
దేవకి భర్త శంకర్. భార్యాభర్తలు ఒకరికొకరు అనువైనవారు. స్వరూప భార్యకి నచ్చినట్టే ఆయనకీ నచ్చింది. ఆత్మీయంగా అనిపించింది.
“ఈరోజుల్లో ఆడపిల్లలంతా ఎగిరెగిరి పడుతున్నవాళ్ళే. అందరం అనేకరకాలుగా సమస్యలు అనుభవిస్తున్నాం. మీ కోడలు చాలా నెమ్మదైనది. అదృష్టవంతులు” అని బంధుమితృలు, స్నేహితులు అన్నమాటలు సంతోషాన్నిచ్చాయి. ఒక హెచ్చరికలాకూడా అనిపించాయి. కోడలు సంతోషాన్నివ్వాలంటే ఆమెని పుట్టింటి కష్టసుఖాలతోపాటుగా స్వీకరించాలి. భర్తని ఆడవారు ఎలా స్వీకరిస్తారో అలా. స్వరూప పుట్టింటి విషయాలన్నీ భార్యద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పెద్దపిల్ల పెళ్ళి ఆ యింట్లో ఒక సమస్యగా మారిందని, అక్క అలా వుండగా స్వరూప పూర్తిసంతోషంలో వుండదని అర్థమైంది. నిజమే! ఒకరికి చెందిన సుఖసంతోషాలని మనం అనుభవిస్తున్నాం అనే ఆలోచన మనిషికి వస్తే ఆ సుఖం సుఖంగానూ, సంతోషం సంతోషంగానూ అనిపించదు. వాటిలోకి యాంత్రికత వచ్చి చేరుతుంది. నేను సంతోషంగా వున్నానని పదేపదే మనసుకి గుర్తుచేసుకోవలసిన అవసరం వుంటుంది. స్వరూపది అదే పరిస్థితి. ఇటు అత్తగారింట్లో తను అనుభవిస్తున్న గౌరవమర్యాదలు, ప్రేమాభిమానాలు ఒకవైపూ, అటు పెళ్ళికాకుండా మిగిలిపోయిన సుమిత్ర మరోవైపూ ఆమెని తూకానికి సూచికముల్లుగా నిలబెడుతున్నాయి.
“సూర్య గుర్తున్నాడా, మీకు? భార్గవ పెళ్ళిలో చురుగ్గా తిరుగుతూ పనులన్నీ చక్కబెట్టాడు… ఆ అబ్బాయి. అతను సుమిత్రని చేసుకుంటానని అంటున్నాడట. అటూ యిటూ ఎవరికీ ఇష్టం లేదు. సుమిత్ర ఎటూ తేల్చుకోలేకపోతోంది. తప్పుచేసినట్టు బాధపడుతోంది. తండ్రి వుద్యోగం తను చేస్తోందికదూ? నిజానికి వాళ్ళు సమస్య అనుకుంటున్నది సమస్యే కాదు. ఒకళ్ళతో మరొకరు ముడిపెట్టుకొవటంవలన అలా అనిపిస్తోంది. నేను వెళ్ళి మన వియ్యపురాలిని వప్పించి వచ్చాను. మీరు సూర్యతో మాట్లాడి రండి. అతనేం చెప్తాడో విని, వాళ్ళవాళ్ళని కలుద్దాం” అంది దేవకి భర్తతో.
శంకర్ సూర్యని స్టేషన్లో కలిసి ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చాక భార్గవ కూడా అతన్ని గుర్తుపట్టి బాగానే పలకరించాడు. తరువాత వ్యవహారం దేవకి నడిపించింది. తమ పెళ్ళిలో వీళ్ళు సహకరిస్తారని ఎంతమాత్రం అనుకోలేదు సూర్య.
“అసలు మీ యిద్దరికీ ఎలా పరిచయం?” కుతూహలంగా అడిగింది దేవకి. సునీత విషయం చెప్పలేదు అతను. నీలిమగురించి చెప్పాడు.
“నీలిమద్వారా పరిచయం” అన్నాడు.
“కొన్ని వ్యవహారాలు వాటంతట అవి నడవ్వు. ఎవరో ఒకరు ముందుకి తొయ్యాలి. మీ అడ్రస్ ఇవ్వు సూర్యా! నేను మీ అమ్మగారిని పరిచయం చేసుకుని మాట్లాడి వస్తాను” అంది దేవకి.
అతను నవ్వాడు. తన కుటుంబం గురించి చెప్పాడు.
“అసలు ఈ పెళ్ళికి నా వొక్కడికీ తప్ప అందరికీ విముఖతే. ముందు అభ్యంతరమే సుమిత్రది. ఆమెచేత సరే అనడానికి ఇంతకాలం పట్టింది. ఆమె సమస్యలు, వాటివెనుక ఆమె తల్లి. మా అమ్మకూడా వప్పుకోదు. ఆవిడ ప్రతీదీ మా అన్నావదినలతో తూస్తుంది. సుమిత్ర సరేనంటే అమ్మకి ఇష్టం లేకపోయినా చేసుకుందామనుకున్నాను. ఆవిడని బాధపెట్టాలనో, అవమానించాలనో కాదు. మా వదిన బాగా చదువుకుంది. అంత చదువుకున్న అమ్మాయి నన్ను చేసుకోదు. అలాంటప్పుడు సాధారణమైన అమ్మాయిని మాత్రమే చేసుకోవాలి. ఆ అమ్మాయి సుమిత్రైతే నేను సంతోషంగా వుంటాను. ఇంక ఆస్తులంటారా, అవసరాలన్నీ తీరాక మన వెనుక కోటి వున్నా, పదికోట్లున్నా ఒకటే. ఇలాంటివి తనకి అర్థమవ్వవు” అన్నాడు.
దేవకికూడా నవ్వింది. “అప్పటిదాకా తన కనుసన్నల్లో తిరిగిన కొడుకు ప్రేమించి పెళ్ళిచేసుకుంటానంటే ఏ అమ్మా వప్పుకోలేదు. డబ్బు, ఆస్తి అంతస్తులు పెద్ద సమస్య కాదు. ఈ అసలు సమస్యని వాటి వెనుక దాచి చూపిస్తారు తల్లిదండ్రులు” అంది.
“ఇప్పటివరకూ యూయస్ వెళ్లాలనే ఆలోచన వుండేది. కానీ ఆ ఆలోచన మానుకున్నాను. పెళ్ళయాక కూడా సుమిత్ర వుద్యోగం చేసుకోవచ్చు. తన జీతంకూడా నాకు అవసరం లేదు. మమత బాధ్యత మాదే. వాళ్ళ అమ్మనికూడా మేం వదిలిపెట్టము. ఇవన్నీ నావైపునించీ సుమిత్రకి హామీలు” అన్నాడు సూర్య. అతని మాటల్లో చాలా స్పష్టత వుంది. ఎటువంటి శషభిషలూ లేవు. మరో విషయంకూడా చెప్పాడతను. అది తేజాగురించి.
“తేజా నాకు ఒకప్పుడు స్నేహితుడు. సుమిత్ర గొడవచేస్తే ఇద్దరం అతన్ని కలిసి వచ్చాం. రేపటిరోజుని అతను ఎలా వుంటాడో తెలీదు. అలాంటివాడి నీడకూడా ఆమెమీద పడటం నాకు ఇష్టంలేదు. నా ప్రేమ, సుమిత్ర బాధ్యతలు… వీటన్నిటికన్నా అది నాకు చాలా ముఖ్యం. ఇది ఒకరకంగా వాడిమీద పోరాటం” అన్నాడు. దేవకి అతన్ని ప్రశంసగా చూసింది.
“సుమిత్రవైపునించీ అంతా సర్దుకుంది సూర్యా! ఇప్పుడింక మీవాళ్ళతో మాట్లాడతాము. సంబంధం అడుగుతాము. వాళ్ళేనా కాదనరనే అనుకుంటాను. మా ప్రయత్నం మేము చేస్తాం. అప్పటికీ పొసగకపోతే అప్పుడు ఆలోచిద్దాం” అంది. తాము వెళ్ళి అడిగితే ఇంతదాకా వచ్చాక సూర్య తల్లిదండ్రులుకూడా కాదనరనిపించింది.
రుక్మిణికి కొడుకు పెళ్ళిపట్ల చాలా ఆలోచనలు వున్నాయి. పెద్దకొడుకూ కోడలూ యూయస్‍లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇద్దరికీ కలిపి కోటిదాటి సంపాదన. చిన్నకొడుకు సూర్య.
అతను అన్నలా చదువులో పైకి తేలలేదు. చిన్నప్పుడు తిట్టేది, కొట్టేది. హాస్టల్లో వేసింది. ఎలాగేనా సానపెట్టాలని చూసింది. తెలివితేటలనేవి ఒకటి వుంటాయనీ, అవి ఇష్టమైన విషయాల్లోనే వికసిస్తాయనీ అర్థం చేసుకోవటానికి ఆవిడకి చాలా సమయం పట్టింది. అప్పటికి అతను ఇంకోలా మలచడానికి వీలుకుదరనంత పెద్దవాడయ్యాడు. ఏదో ఒకలా అమెరికా పంపేద్దామనుకుంది.
“బేక్‍లాగ్స్‌తో బీటెక్ పూర్తిచేసినవాడికి ఏ వుద్యోగం వస్తుంది? కప్పులు కడుక్కుంటూ బతకమంటావా అక్కడ?” అని కోప్పడ్డాడు ఆవిడ భర్త వాసుదేవ్. తమ్ముళ్ళ దగ్గరికి మలేషియా పంపించాలనుకుంది. అక్కమాట కాదనలేక వాళ్ళేదో వుద్యోగం చూపించినా, అది సగం మనసుతోటే. వాళ్ళకి ఆవిడ పెద్దకొడుకు, చదువులవజ్రం కావాలిగానీ సూర్యా కాదు. తనే నిర్ణయం తీసుకుని సూర్య పోలీస్ డిపార్టుమెంటులో చేరాడు. స్వంత అన్నదమ్ములే అయినా యిద్దరికీ హస్తమశికాంతరం కనిపిస్తోంది. అదే బాధ ఆవిడకి.
“ఎవరికి వున్నది వాళ్లకి వుందిలేవే! నేను సంపాదించినదంతా వీళ్ళకేగా? ఎక్కువుందని డాలర్లు విస్తట్లో వడ్డించుకుని తింటాడా, పెద్దాడు? రెండు ఫ్లాట్లు వున్నాయని రోజుకోదాంట్లో వుంటాడా? అమెరికా వదిలిపెట్టి వస్తాడా? నువ్వూరికే బాధపడుతున్నావుగానీ సూర్యాకి చీమకుట్టినట్టు కూడా లేదు. వాడినలా హాయిగా బతకనీ” అన్నాడు.
ఇవన్నీ ఇలా వుండగా ఇప్పుడీ సంబంధం…
మర్నాడు స్వరూప వెళ్ళిపోయింది. రాధకి మనసు మనసులో లేదు. పెద్ద ప్రమాదం తనమీద విరుచుకుపడ్డట్టుగా వుంది. సుమిత్ర పెళ్ళితో ముడిపడి వున్న విషయాలన్నీ కలగలుపుగా ఆవిడని అతలాకుతలం చేస్తున్నాయి. తేజాగురించి దేవకి అన్నది ఎంతగా భయపెట్టినా, ఇంకో మార్గం లేదా అనేది ఆవిడ ప్రశ్న. సునీతకి ఫోన్ చేసింది.
“నువ్వూ, మురళీ వెంటనే బయల్దేరి రండి” అంది.
“ఏమైంది?” తల్లి గొంతులోని కోపాన్ని గుర్తించి అడిగింది సునీత ఆత్రంగా.
“నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. మీకు దారి చూపించి నడిపించాల్సింది, సుమిత్ర ఇలా సమస్యలు సృషిస్తోందేమిటో అర్థమవటం లేదు. దానికి స్వరూప వత్తాసు”
“ఏం జరిగిందే?” మరోసారి అడిగింది సునీత.
“ఇక్కడికి వచ్చాక అన్నీ చెప్తాను. ఆలస్యం చెయ్యద్దు” అందావిడ.
సునీత భర్తకి చెప్పింది. అతనికి అప్పటికే విషయాలన్నీ తెలుసు. స్వరూప ఫోన్లో చెప్పింది.
“తేజా గురించి భయంకరమైన నిజాలు తెలిసాయి బావా! అతనిప్పుడు జైల్లో వున్నాడు. అటువైపు ఆశ అసలే లేదు. ఇటు సూర్యా అక్కని చేసుకుంటానని పట్టుదలగా వున్నాడు. ఇలాంటి టైంలో వత్తిడి చేస్తే అక్కకూడా వప్పుకుంటుంది. అది పెళ్ళి చేసుకుని వెళ్ళడంకన్నా ముఖ్యమైన విషయాలు ఇంకేవీ లేవు. మా పెళ్ళికి ఇంటిమీద అప్పు చేసింది. నాకూ, సునీతకీ గొప్ప జీవితాలు ఇవ్వటానికి చాలా ఖర్చు చేసింది. ఇల్లమ్మి ఆ అప్పులు తీర్చి దాన్ని విడుదల చేస్తే సుఖపడుతుంది. మా నాన్నేనా ఇల్లమ్మకుండా నలుగురు ఆడపిల్లల పెళ్ళి చెయ్యగలిగేవాడు కాదు. అమ్మకి అర్థమవటంలేదు. నీకు చెప్తుందేమో! నువ్వే ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి” అంది. అతని అనుమానాలన్నిటికీ జవాబులు చెప్పింది. ఇప్పటికి ఆ ఇంటికి పెద్దల్లుడు తనేకాబట్టి బాధ్యతకూడా వుంది. ఒక మధ్యవర్తిలా అత్తగారివైపునించీ కూడా ఆలోచించాడు. ఆవిడ భయాలు, ఆందోళనలు… వాటినీ కాదనటానికి లేదు. అందుకే సునీత చెప్పగానే బయల్దేరాడు. వీళ్ళు చేరేసరికి సుమిత్ర ఆఫీసుకి వెళ్ళింది. మమత తల్లిని కనిపెట్టుకుని ఇంట్లోనే వుంది.
రాధ మనవడిని అందుకుంది. వళ్ళు చేసి ముద్దొస్తున్నాడు. కొత్త ఇంకా తెలీడం లేదు. తల్లి దగ్గర్నుంచీ మమత తీసుకుంది. కుశలసమాచారాలూ, కాఫీ టిఫెన్లూ అయ్యాయి.
“ఏంటమ్మా? ఏం జరిగింది?” ఇంక ఆగలేక సునీత అడిగింది.
“ఏం చెప్పనే? ఇల్లూ వాకిలీ అమ్మి, నన్ను నడిబజార్లో వదిలేసి సుమిత్ర పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుందట. ఇలాంటిది ఎక్కడేనా వుందా? కన్నతల్లికి నిలువ నీడ లేకుండా చేస్తానన్నదాన్ని దీన్నే చూస్తున్నాను” అని, “మీరు కాస్త కలగజేసుకోండి. అంతగా చేసుకోవాలంటే చేసుకొమ్మనండి. దాని జీవితం దానిష్టం. నేనెవర్ని కాదనడానికి? ఇల్లు అమ్మేస్తే స్వరూపావాళ్ళు దయదల్చి వాళ్ళ ఫ్లాట్లో వుండనిస్తారట. నాకేం ఖర్మ? నాన్న వుద్యోగం నాకే ఇస్తామన్నారు. తెలివితక్కువగా వదులుకున్నాను. లేకపోతే దర్జాగా నా బతుకు నేను బతికేదాన్ని” అంది మురళితో.
అతను అంతా సావధానంగా విన్నాడు.
“నేను చెప్పలేదా? తేజాకోసం ఎదురుచూడదు, దాని దారిని అది చేసేసుకుంటుందని. అతను జైల్లో వున్నాడనేది ఒక వంక. అతన్నలా వదిలేసి తనదారి తను చూసుకుంటోంది. వట్టి స్వార్ధపరురాలు. ఉద్యోగం తనకే వుంది. ఇంకా మమత బాధ్యత వుంది. తన దారిన తను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే ఎలా? పెళ్ళికోసం ఇల్లుకూడా అమ్మమంటోంది. అన్నీ తనకే. మనకేం మిగులుతుంది? ” అంది సునీత.
మురళి భార్యనీ అత్తగారినీ మార్చిమార్చి చూసాడు. సుమిత్ర పెళ్ళి చేసుకుని వెళ్ళాలని ఈ యిద్దరికీ లేదా? తమ స్వార్థంకోసం అలా ఆలోచించగలరా ఎవరేనా? సుమిత్ర కుటుంబంకోసం ఎంత ఆరాటపడుతుంది? ఆమె త్యాగాలు చేస్తేనే ఆ ఆరాటానికి విలువ వుంటుందా? సమస్యలని పరిష్కరించుకుని, తనుకూడా సుఖంగా వుండాలనుకుంటే అది ప్రేమ కాదా? ఇది పొరలుపొరలుగా పేరుకుపోయిన అజ్ఞానం… అంతే. దాన్ని తను జాగ్రత్తగా తొలగించాలి.
రాజారావు బతికి వున్నా ఆయన జీతంలోనే ఈ నలుగురు పిల్లల పెళ్ళీ చేయగలిగేవాడు కాదు. అలాగని ఆడపిల్లలని వుద్యోగాల్లో పెట్టి కొన్ని బాధ్యతలు వాళ్ళమీదికి బదలాయించేలా బతికిన కుటుంబం కూడా కాదు. మారిన కాలానికి అనుగుణంగా మారకుండా, పాతపద్ధతుల్లో బతికారు. ఆయన పోయాక వచ్చిన వుద్యోగంలో రాధ చేరినా, అప్పటికే ఆమెకి నలభయ్యైదు. ఏ పదిపదిహేనేళ్ళో చేసి విరమించుకోవాలి. సుమిత్రైతే కనీసం నలభయ్యేళ్ళ సర్వీసు చేస్తుంది. పెళ్ళి చేసుకుని వెళ్ళినా బాధ్యతలని తప్పించుకునే మనస్తత్వం కాదు ఆమెది. అదే ఆవిడకి వివరంగా చెప్పాడు.
“పెళ్ళంటూ అయాక అవన్నీ మన చేతిలో వుండవు” నిర్మోహమాటంగా అనేసింది ఆవిడ. అప్పటికి సంభాషణ ఆగిపోయింది.
వీళ్ళు వచ్చారని కలవటానికి స్వరూప వచ్చింది. అందరికీ పెద్ద ఆకర్షణ సునీత కొడుకే. వాడిని వళ్ళో పెట్టుకుని కూర్చుంది స్వరూప. చర్చ మళ్ళీ మొదలైంది.
“మా అత్తగారి ఎదురుగా సూర్య అన్ని విషయాలూ వప్పుకున్నాడు బావా! అక్క ఎలా చేసినా తనకి సమ్మతమేనన్నాడు. అక్క బాధ్యతల్లో అడ్డు రానన్నాడు” అంది.
“పెళ్ళయేదాకా అలానే అంటారు” అంది రాధ.
“అతను చెప్పినట్టు విని, సుమిత్ర గుళ్ళో పెళ్ళి చేసుకుని వచ్చేస్తే ఏం చేసేదానివమ్మా?” సూటిగా అడిగింది. “నువ్వొప్పుకోవని తెలిసినా అతన్ని ఆపింది” అంది.
“అలా ఎలా చేసుకుంటుందే?”
“ఏం? ఎందుకు చేసుకోకూడదు?”
“చేసుకుంటే చేసుకోమను. ఇల్లు అమ్మటం దేనికి?” సునీత కలగజేసుకుంది.
“అమ్మ అప్పులు తీర్చుకుంటుందా?” సూటిగా అడిగింది స్వరూప.
“నా దగ్గిరేముంది?” చప్పుని అంది రాధ.
“నీకసలు ఏం కావాలమ్మా? పిల్లలం నలుగురం నీ పిల్లలం. బాధ్యతలు నీవి. సుమిత్ర నీకు ఆసరాగా నిలబడింది. అంతే. దాని బాధ్యతకూడా నీదే. ఇల్లు అమ్మి అప్పులు తీర్చి, దానికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తే ఏ లోనో తీసుకుని ఫ్లాటేదైనా కొంటుంది”
“ఆ లోనేదో ఇప్పుడే తీసుకుని ఇంటి అప్పు తీర్చేయచ్చు కదా?” అంది సునీత.
“అలా ఇవ్వరు. ఇల్లు అమ్మ పేర్న వుంది. అమ్మినట్టు అక్క పేరున రాస్తుందా? రాసినా కొంత శాతం డౌన్‍పేమెంటు చెయ్యాలి. ఆ డబ్బు ఎక్కడినుంచీ వస్తుంది? అందుకే అమ్మటం” అంది స్వరూప.
ఏదైతే జరుగుతుందని సునీత భయపడిందో అదే జరగబోతోంది. తనకి ఇంక ఏమీ రాదు… ముఖం ముడుచుకుపోయింది.
ప్రభుత్వం ప్రజల మంచి కోరి కొన్ని సదుపాయాలు చేస్తుంది. అనుకోకుండా వచ్చి పడిన కష్టాలనుంచీ గట్టెక్కడానికి కొన్ని అవకాశాలిస్తుంది. అప్పటిదాకా కష్టాల్లో కొట్టుకుపోతూ ఒకరికి ఒకరం వున్నామనుకుంటున్న మనుషులు ఆ అవకాశాలని అందుకునే సమయం వచ్చేసరికి స్వార్థం మొదలౌతుంది. ఎవరి లెక్కలు వాళ్ళే చేసుకుంటారు. సుమిత్రకి వుద్యోగం వచ్చి తామంతా గట్టెక్కేదాకా అందరూ ఒకటి. ఇప్పుడు ఎవరి స్వార్థాలు వాళ్ళవి.
వప్పుకోవటం తప్ప తనకి మరో అవకాశం లేదని రాధకి అర్థమైంది. ఒకవైపుని వియ్యపురాలు నిలబడి వ్యవహారం నడిపిస్తోంది. మరోవైపుని సూర్య సుమిత్రకి కొండంత అండగా నిలబడ్డాడు. ఇటు మురళి చూస్తే పైకి తనమాట విన్నట్టు కనిపించినా మొగ్గు అటే వుంది. వంటరిది తను…
“ఎవరి తలరాత ఎలా వుంటే అలా జరుగుతుంది. మమత రాతెలా వుందో!” అంది ఆఖరికి రాజీకి వచ్చినట్టు.
“ఇల్లమ్మిన డబ్బు నీదగ్గిరున్నప్పుడు దాని తలరాతకేం? నీ చేతిలోనే వుంటుంది” అంది స్వరూప.
సుమిత్ర సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఈ రాజీ వప్పందం జరిగిపోయింది. ఆమె మురళీ సునీతలని చూసింది. తల్లే వాళ్ళని పిలిపించిందని గ్రహించింది. స్వరూపని చూసింది. అస్త్రాలన్నీ వెంటబెట్టుకుని వచ్చిందనుకుంది. ఎంత ప్రేమ, దీనికి నేనంటే! అంతే ప్రేమగా అనుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
I was pretty pleased to discover this great site. I need to to thank you for your time for this particularly fantastic read!! I definitely appreciated every part of it and I have you book marked to see new stuff on your blog