బ్రతుకు దీపం by Thulasi Bhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. తగిన శిక్ష by Thulasi Bhanu
  3. మల్లీశ్వరి by Thulasi Bhanu
  4. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  5. శోభ by Thulasi Bhanu
  6. సహన by Thulasi Bhanu
  7. బ్రతుకు దీపం by Thulasi Bhanu
  8. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  9. జ్ఞాపకం by Thulasi Bhanu
  10. కీర్తన by Thulasi Bhanu
  11. మనోరంజని by Thulasi Bhanu

ఇరవై ఏడేళ్ళ మనోహర్, అపార్ట్‌మెంట్ మెట్లమీద దిగులుగా కూర్చుని తన ఫ్లాట్ ఉన్న కారిడార్‍లోనే ఉన్న మిగిలిన నాలుగు ఫ్లాట్లముందూ నిండుగా వేసి ఉన్న ముగ్గులనీ, ఆ ముగ్గుల్లోనూ గుమ్మాల పక్కనా పెట్టుకున్న దీపాలనూ చూస్తున్నాడు.
“అమ్మా …” అని బాధగా కిందటేడు దూరమైన తల్లి శిల్ప గురించి తలుచుకుని దిగులుపడుతూ మోకాళ్ళమీద తల ఆనించుకుని గతపు జ్ఞాపకాలను తలుచుకుంటున్నాడు.
ముఫ్ఫయేళ్ళ కిందట ప్రేమపెళ్ళి చేసుకున్నారు శిల్ప , గౌతమ్.
పెళ్ళైతే అయిందిగానీ, శిల్పకు భర్త అందంగా ఉంటాడని వేరే అమ్మాయిలతో కూడా సన్నిహితంగా ఉంటాడేమోనని అనుమానం. ఆమె అనుమానానికి తగినట్లుగానే అతని చుట్టూ శ్రావణి , మంజుల ఎప్పుడూ స్నేహం స్నేహం అంటూ తిరిగేవారు. దాంతో మనసు పాడుచేసుకుని శిల్ప, గౌతమ్‍తో తరుచుగా గొడవలు వేసుకునేది. గౌతమ్‍కి సహనం తక్కువ. సున్నితమైన మనిషి. ఒక హద్దువరకూ భరించాడు. తరువాత శిల్పను తిట్టడం, కొట్టడం చేసేవాడు.
అలా అలా వారి గొడవలు పెరిగిపోయాయి. మనోహర్ పుట్టాక, శిల్పకు మరీ అనుమానం ఎక్కువైపోయింది.
తల్లిదండ్రుల గొడవలనే ఎక్కువగా చూసాడు మనోహర్. ఒకరోజు భార్య అనుమానాన్ని నిజం చేస్తూ మంజులను, గౌతమ్ రెండోపెళ్ళి చేసేసుకున్నాడు.
ఇహ అది తట్టుకోలేని శిల్ప, మనోని తీసుకుని వేరే వచ్చేసింది. పెద్దల తోడు లేదు. పిచ్చికోపంతో చెడగొట్టుకున్న స్నేహాలతో శిల్ప నెమ్మదినెమ్మదిగా ఒంటరి అయిపోయింది. మనో తప్ప మరో లోకం లేదు.
ఒక్కో యేడు ముందుకు నడుస్తున్నకొద్దీ శిల్పకు పరిణితి పెరిగింది. తన తప్పులు, తొందరపాటు పనులు, పొరపాట్లు… ఒకటొకటిగా తెలిసొచ్చాయి. మంచీచెడు అవగాహన తెలిసింది.
తాను చేసే బ్యాంకు జాబ్ ఆర్ధికంగా ఆధారం. మనసుని కుదురుగా ఉంచుకునేందుకు యోగాను అలవాటు చేసుకుంది. మనోకి చిన్నవయసునుంచే మంచీచెడు తేడా తెలుసుకుని ప్రవర్తించేలాంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకునేలాగా మంచిగా, సరైనతల్లిలాగా పెంచుతోంది.
నాలుగేళ్ళముందు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది శిల్పకి. మనో తల్లడిల్లిపోయాడు తల్లికి ఏమవుతుందో అని ఒక్కడే కూర్చుని తల్లికోసం ఏడ్చేవాడు. అతని ఫ్రెండ్స్ వచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు.
తల్లి ఐసియూలో ఉన్న మూడోరోజున గౌతమ్, శిల్పను చూడటానికి వచ్చాడు. మనోని దగ్గరకు తీసుకున్నాడు. రక్తసంబంధం వల్లనేమో గౌతమ్ స్పర్శ, అతనికి ఊరటని ఇచ్చింది. అంతవరకూ లోలోపల కుములుతున్నవాడల్లా తండ్రిని కౌగలించుకుని ఏడ్చేసాడు. గౌతమ్, శిల్ప పరిస్థితినంతా బాగా తెలుసుకుని ట్రీట్మెంట్ చేయించాడు.
నెమ్మది నెమ్మదిగా శిల్ప, చావు అంచులదాకా వెళ్ళిన మనిషి తిప్పుకుంది. తేరుకుంది. హాస్పిటల్‍నుంచీ డిశ్చార్జ్ అయ్యేరోజువరకూ గౌతమ్ ఆమెకు కనపడలేదు, తనని చూసి మళ్ళీ ఆమె ఆవేశంతోనో, ఆవేదనతోనో, ఆరోగ్యంమీదకు ఎక్కడ తెచ్చుకుంటుందో అనే భయంతో. హాస్పిటల్ బిల్లు సెటిల్ చేసేటప్పుడు తెలిసింది శిల్పకి, గౌతమ్ బిల్లుతో సహా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడని.
శిల్ప అది గౌతమ్ బాధ్యతేకదా అన్నట్లు మామూలుగా తీసుకుంది. మనోకి బావుంది ఇలా చెరోవైపూ అమ్మా, నాన్న ఇద్దరూ పక్కనుంటే. కానీ ఆ సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు, మంజుల స్వార్ధంతో.
బుద్ధిలేకుండా మూడోమనిషిని తమ మధ్యకు రానిచ్చేలా చేసుకుంది తానే అని అనుకుంది శిల్ప. తను గౌతమ్‍కి విడాకులు ఇవ్వనేలేదు. నిజానికి మంజుల చట్టప్రకారం భార్య కిందకే రాదని ఆమెకు తెలుసు. తనమానాన తాను దూరంగా ఉండిపోయింది అంతే. అయినా సరే ఎందుకో ఇప్పుడు ఆమెకు గౌతమ్‍కోసం పోరాడాలి అని అనిపించలేదు.
మనో జీవితంలో తండ్రిలేని లోటు ఒక్కటే. అదికూడా ఎప్పుడన్నా మాత్రమే మనోని బాధించేది. అదొక్కటీ తప్ప శిల్ప మనోని చాలా బాగా చూసుకుంది. మనోకి తల్లి ఉంటే చాలు అన్ని సంతోషాలు తనతోనే ఉన్నట్టుగా ఉండేవాడు. కానీ కిందటేడు శిల్పకి మరోమాటు స్ట్రోక్ వచ్చి, మనోకి దూరమైపోయింది.
ఇప్పుడు మనోకి, ఇవాళ, ఈ దీపావళి రోజున, చాలా వెలితిగా అనిపిస్తోంది.
“ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నన్ను ఒంటరిని చేసేసి?” అని దిగులుపడుతున్నాడు. మోకాళ్ళమీద తల పెట్టుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు
“మనో…ఓయ్ మనో” అంటూ పక్క ఫ్లాట్‍లో ఉండే రోహిత్ మనో భుజంమీద తట్టిలేపాడు. అతను కళ్ళు తెరిచి చూసాడు.
“హ్యాపీ దీపావళి” అంటూ నాలుగు ఫ్లాట్లలో ఉండేవాళ్ళు షేక్‍హ్యాండ్ ఇచ్చి కొందరు, దగ్గరకు తీసుకుని కొందరూ విషెస్ చెప్పారు.
మనో తన ఫ్లాట్ దగ్గరకు వచ్చి చూస్తే గుమ్మం ముందు ముగ్గులు, గుమ్మం పక్కన అటూ ఇటూ దీపాలు పెట్టి ఉన్నాయి. కళగా ఉంది.
“పదపదా, క్రాకర్స్ కాల్చుదాం” అంటూ రోహిత్‍వాళ్ళు అతన్ని కిందకి తీసుకెళ్ళారు. రాత్రి భోజనాల సమయంలో ఒక ఫ్లాట్‍వారు తమింటిలోనే మనోని కూడా తినమని ఆహ్వానించారు. మొత్తానికి దీపావళిని కాస్త సంతోషంగానే జరుపుకున్నాడు.
రాత్రి పడుకునేముందు…
“అమ్మా! నువ్వు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. కానీ ఓ నలుగురు ఈరోజు నాకు, నువ్వు ఒంటరిని కావులే అన్నట్టుగా, తోడుగా నిలిచారు. బంధువులే కానవసరంలేదు, స్నేహితులే కానవసరం లేదు, నా బాధని అర్థం చేసుకునే ఓ నలుగురు నా చుట్టూ ఉండటం నిజంగా నా అదృష్టం” అని మనసులోనే తల్లితో కబుర్లు చెప్పుకుని సంతృప్తిగా, ప్రశాంతంగా పడుకున్నాడు.
అదే జీవితం. ఉన్నదానిలో ఆనందాన్నీ, ప్రశాంతతనూ, సంతృప్తినీ వెతుక్కుని జీవిస్తే బ్రతుకుదీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. పోగొట్టుకున్నది కొండంతైనా, ఈ చిరుదీపం ఆశని నిలబెడుతుంది.