“దియా, ఎక్కడా? స్కూలుకి లేట్ అవుతుందమ్మా. ఎప్పుడూ అల్లరేనా…రా రా…” అని పిలుస్తోంది సహన పదమూడేళ్ళ కూతురిని.
ఆటో అతను ఒకటే హారన్ కొడుతున్నాడు. దియా దాక్కుని అమ్మని ఏడిపిస్తోంది. ఇల్లంతా వెతుకుతూ ఉంటే, ఫ్రిడ్జ్ పక్కనుంచీ భౌ అని అరుచుకుంటూ తల్లిని ఉలిక్కిపడేలా చేసి, నవ్వుకుంటూ బాగ్ పట్టుకుని “బై అమ్మా!” అని చెబుతూ ఆటో ఎక్కింది, అమ్మకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ.
అల్లరిపిల్ల. అని ముద్దుగా విసుక్కుని, ఇల్లు సర్దుకుని వేడిగా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది. ఎదురుగా ఫొటోలో పూలదండ మధ్యనుంచీ చూస్తూ చనిపోయిన భర్త దేవ్.
“ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. దియాకి అమ్మని, నేను తనకి తోడున్నాను సరే. మరి నాకు తోడెవరు? ఇలా నాకు అన్యాయం చేసి పోయావెందుకు? అది నువ్వు లేవన్న దిగులు మరిచేందుకు అల్లరి నేర్చుకుంది. అమ్మని నేను ఎంతైనా భరిస్తాను, స్కూలునుంచీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అవెలా పరిష్కరించాలో తెలీట్లేదు. అస్సలు మాట వినదు. మొండితనం అని కాదు కానీ, అల్లరిలో పడి,
దూరమయిన నాన్నవు , నిన్ను మరిచిపోతున్నాను అనుకుంటోంది…
అని రోజులానే డైరీ రాసుకున్నట్టుగా, మనసులో మాటలు భర్త ఫొటోను చూస్తూ తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది సహన. సహన పేరుకి తగ్గట్టు సహనవంతురాలు, కొంచెం భయస్తురాలు కూడా. కానీ దేవ్ చనిపోయాక భయపడుతూ భయపడుతూనే అన్నీ తెలుసుకుంది, అన్నీ నేర్చుకుంది. ఒంటిచేత్తో కూతుర్ని పెంచుతోంది.
దియా సాయంత్రం స్కూలు అయ్యాక వెంటనే ఆటో దగ్గరికి రాదు, ప్లే గ్రౌండులో ఆడుతూనో, దాక్కుంటూనో డ్రైవర్ రాజుని ఏడిపిస్తూ ఉంటుంది. రెండుమూడుసార్లు దియామీద కోపగించుకుని, సహనకి గట్టిగా చెప్పాడు, “ఇలా అయితే నేను దియాని ఆటో ఎక్కించుకోను. వేరే ఆటో చూసుకో” అని.
అప్పుడు సహన, “రాజు భాయ్! చిన్నపిల్ల , కోపం చెయ్యకు. నా మొహం చూసి నా బిడ్డను మాఫ్ చెయ్యరాదే?” అని బతిమలాడేది
“చల్ తియ్! నీ మొహం చూసి ఊరుకుంటున్నా, కానీ నీ బిడ్డకు గట్టిగా చెప్పమ్మా!” అన్నాడు రాజు.
దియా అల్లరి పెరగటమే తప్ప తగ్గే ప్రశ్నే లేదు.
ఆ రోజు, ఎప్పుడూ వచ్చే టైముకి, దియా ఇల్లు చేరలేదు. పావుగంట దాటాక రాజు వచ్చాడు.
“ఏమక్కా! దియా నాతో చెప్పకుండానే వచ్చేసినట్టుంది? ఎంతసేపు ఎదురుచూసినా ఆటో ఎక్కలేదు. వేరే పిల్లలు గొడవపెడుతుంటే ఆటో బయల్దేరదీసినాను. దియాని కాస్త మందలించమ్మా!” అన్నాడు రాజు..
“లేదన్నా! దియా ఇల్లు చేరనేలేదు” అంది సహన కంగారుగా.
“అదేంటి? తన ఫ్రెండు ఎక్కే, శామ్ ఆటోలో వస్తూ ఉంటుందిగా అప్పుడప్పుడూ? అలానే వచ్చి ఉంటుందనుకున్నా” అన్నాడు రాజు కూడా కంగారుగా.
దియా మొబైల్‍కి ఫోన్ చేసింది సహన. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. పిచ్చిదానిలా వెంటవెంటనే ఫోన్ చేస్తూనే ఉంది సహన, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా. సహన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.
“అన్నా! ఆటోలో వెళ్ళి, దియాని వెతుకుదాము. కాస్త వస్తావా?” అని రాజుని అడిగింది సహన.
“పదమ్మా, పదా! ” అన్నాడు రాజు ఆటో స్టార్ట్ చేసి. ఎనిమిదింటివరకూ వెతికారు. ఎక్కడా దియా లేదు. కనపడలేదు.
సహన నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తూ రోడ్డుమీదే కూలబడిపోయింది
“అమ్మా, దియా! ఎక్కడున్నావమ్మా? కనపడు తల్లీ” అని ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మనసు ముక్కలవుతున్నట్టు ఉంది. పోలీస్ స్టేషన్‍లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్సై ప్రసాద్ శ్రద్ధ పెట్టి అన్నివైపులా వెతుకులాట మొదలుపెట్టించాడు.
అన్నిచోట్లనుంచీ సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించి చూస్తున్నారు. ఒక వీధిలో ఒకవైపు సీసీటీవి పరికరం పాడయ్యింది. ఆ వీధిలో రెండోవైపు ఉన్న సీసీ టీవి ఫుటేజ్ చూస్తున్నారు. మొత్తం వీధిని ఆ కెమెరా కవర్ చెయ్యలేకపోయినా, దూరాన కనపడీకనపడనట్లుగా దియాలాంటి ఆకారం ఎవరితోనో నడిచి వెళుతున్నట్టు కనపడుతోంది.
“దియానే, అవును” అని సహన ఏడుపు, భయం, కంగారు కలగలిసిన గొంతుతో చెప్పింది. ఏడుపువచ్చి కళ్ళు మసకబారుతుంటే పవిటతో కళ్ళు తుడుచుకుని సీసీటీవి ఫుటేజ్ చూస్తోంది ఆత్రంగా. దియా నెమ్మదిగా అడుగులేస్తుంటే పక్కన ఎత్తుగా బలంగా ఒకతను మధ్యమధ్యలో చెయ్యిపట్టి తోస్తూ తీసుకెళుతున్నట్లు అనిపిస్తోంది. ఆ సీసీటీవి ఉన్నవీధికి, పక్కన ఉన్న వీధి తాలూకు సీసీటీవీ ఫుటేజ్‍లో ఏమీ సరిగ్గా తెలీట్లేదు. ఆ వీధిలోనే కనపడి ఆ వీధిలోనే మాయమయినట్టుగా ఉన్నారు దియా, దియా పక్కనున్న భారీమనిషి.
ఎస్సై ప్రసాదుకి అర్ధంకావట్లేదు, ఏమి జరిగిఉండవచ్చు అని…
రాజు ఫోన్ చేసి తన భార్య రాణిని పిలిచి సహనకి తోడుగా ఆమె ఇంట్లో ఉండమన్నాడు. దియా ఏ అర్ధరాత్రో వచ్చి తలుపు తడుతుందేమో అని రాత్రంతా ఎదురుచూస్తూ కూర్చుంది సహన.
దియా రాలేదు, దియా గురించి కబురూ తెలియలేదు.
మర్రోజు పొద్దున్నే ఏ వీధి సీసీటీవీలో అయితే, దియా కనపడిందో అక్కడికి చేరుకుంది సహన, రాజు ఆటోలో కాకుండా ఇంటిబయటకు రాగానే ఏదో ఒక ఆటో వస్తే అడ్రెస్ చెప్పి ఎక్కేసి అక్కడకు చేరుకుంది. ఆ వీధిలోని అణువణువూ వెతుకుతోంది. కళ్ళను భూతద్దాలు చేసి మరీ వెతుకుతోంది. రోడ్డు మీద దియా చేతిగొలుసు పడి ఉంది. ఇంకొంచెందూరంలో దియా తలకు ఇష్టంగా చుట్టుకునే రంగురంగుల బాండ్ పడి ఉంది.
“నా దియా!” అని తనలోనే కుళ్ళికుళ్ళి ఏడుస్తూ అన్ని షాపుల తలుపులూ గుచ్చిగుచ్చి దీక్షగా చూస్తోంది. దూరాన ఒక షాపు పక్కన తలుపులోంచీ ఒక ముసలాయన బయటకొచ్చాడు. ఎందుకైనా మంచిదని అతనికి కనపడకుండా ఒక స్థంభం పక్కకు తప్పుకుంది. ఆయన చేతిలో ఫ్లాస్కుతో వేరేవైపు వెళ్ళిపోయాడు. సహన ఆ షాపు తలుపువైపు వెళ్ళింది. ఇందాక ఆ తలుపు ముందే దియా బాండు దొరికింది ఆమెకి.
తలుపు తోసి చూసింది. కొంచెమే తెరుచుకుంది. ఆ కాస్త సందులోంచే దూరి వెళ్ళింది. తలుపు ఇంకొంచెం తెరిస్తే శబ్దం అవుతుందేమో అని సహన ముందుజాగ్రత్త పడింది. అక్కడ లోపల రెండు చిన్నచిన్న గదుల్లా ఉన్నాయి. ఆ గదుల పక్కన చెక్కమెట్లు ఉన్నాయి. పైన ఇంకొన్ని రూములున్నట్టున్నాయి. కిందరూముల దగ్గర శ్రద్ధగా వింటోంది ఏదైనా అలికిడి వినిపిస్తుందేమో అని. అయిదు నిముషాలు గడిచాయి.
ఆమెకి తన గుండెచప్పుడు తనకే వినిపిస్తోంది. ఏదో ఒకగదిలోకి ధైర్యం చేసి వెళదాము అనుకుంటోంది.
ఇంతలో…
సన్నగా ఓ గొంతు ఏదో అంటూ వినపడింది. పైనుంచీ వచ్చింది. ఆ శబ్దం..ఆ గొంతు తన దియాదే అని పసిగట్టింది ఆ తల్లిమనసు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుపు రాబోయింది. గొంతుని గట్టిగా తన చేత్తో నొక్కేసుకుంది శబ్దం బయటకు రాకుండా. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెళుతోంది. ఇంకొక్క మెట్టు ఎక్కితే పైన వరండాలోకి వెళ్ళచ్చు. సరిగ్గా అప్పుడే కింద తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. కింద ముసలాయన వచ్చాడు. కానీ కింద ఎవరు వచ్చారు అని కూడా చూడకుండా, ఆలోచించకుండా. సహన పైనున్న మొదటిగదిలోకి దూసుకెళ్ళింది. అక్కడ దియా నోట్లో బట్టలు కుక్కబడి ఉన్నాయి. ఒకభారీ అతను గోడకి తగిలించి ఉన్న చిన్న అద్దంలోకి చూసుకుంటూ గడ్డం చేసుకుంటున్నాడు. అలికిడికి వెనక్కి చూసాడు. దియాకూడా అప్పుడే అమ్మని చూసి కట్టేసిన చేతులు కాళ్ళను బలంగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ గింజుకుంటోంది. అతను ఒక క్షణం మాత్రమే కంగారుపడ్డాడు, తరువాత చాలా కుదురుగా , నింపాదిగా సహనని చూస్తూ నించున్నాడు. సహన ఒక్క అంగలో దియాను చేరుకుని అతన్ని ఒకవైపు చూస్తూ, మరోవైపు దియా కట్లను విడిపిస్తోంది.
ముసలాయన గదిలోకి వచ్చాడు. చాలా మామూలుగా ఫ్లాస్కు టేబుల్‍మీద పెట్టేసి తన మానాన తాను వెళ్ళిపోతున్నాడు. సహనకి భారీమనిషిని చూస్తే భయం వేసి గుండెలు అదురుతున్నాయి. ముసలాయన కూడా వచ్చాక టెన్షన్ ఇంకా పెరిగి తలలో నరాలు ఒక్కసారిగా లాగినట్లు అయ్యి తలలో నొప్పి మొదలయ్యింది, కళ్ళు మసకబారుతున్నాయి బీపీ పెరిగిపోతూ. కానీ తల్లిమనసు కూతురికోసం ఓడిపోవద్దని హెచ్చరించింది.
ముసలాయన చాలా మామూలూగా, తన మానాన తాను వెళ్ళిపోయాడు, దియా కట్లు తీసేసింది సహన, దియా నోట్లో బట్టను లాగేసింది సహన..అమ్మా అని చుట్టుకుపోయింది దియా భయంతో సహనని..సహన పందెంలోకి దిగిన ఆడపులిలా చాలా అప్రమత్తంగా ఉంటూ అతన్నే చూస్తూ దియా చెయ్యిపట్టుకుని గుమ్మం వైపుకు ఒక్కో అడుగు వేస్తోంది..సహన దియాను తీసుకుని బయటకెళ్ళే ప్రయత్నం చేయటం గమనించిన అతనికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడుతున్నాయి, చూపు కౄరంగా మారింది. తలదించి కళ్ళుమాత్రం వీళ్ళవైపు కేంద్రీకరించి సూటిగా దుర్మార్గంగా వికృతంగా కాఠిన్యం నిండిన చూపు చూస్తున్నాడు అతను. ఇప్పుడతని మొహం భయంకరంగా ఉంది. అతని మొహంలోకి వస్తున్న క్రూరత్వం చూస్తున్న దియా భయంతో వణికిపోయింది.
“అమ్మా, అమ్మా!” అని సహన చేతిని గట్టిగా పట్టేసుకుంది.
“పర్లేదు… పర్లేదు, దియా! నువ్వు భయపడకు” అని సహన దియాకి ధైర్యం చెబుతోంది.
పులి వేటాడే జింక దియా అయితే, ఆ కౄరపులిలాంటి అతన్నుంచీ కాపాడే ఆడపులిలా సహన మారింది. పైకి ధైర్యంగా ఉన్నా లోపల్లోపల వణుకుపుడుతోంది ఆమెకుకూడా. అయినా సరే, తన కూతురుకోసం ఎంతకైనా సిద్ధం అన్నట్టు పోరాడటానికి తయారుగా ఉంది.
అతను వికృతమైన మొహంతో దూకుడుగా ముందుకు రాబోయాడు. అంతే, సహన పిచ్చిబలం తెచ్చుకుని “ర్రేయ్!!” అని గట్టిగా అరుస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్ళి అతన్ని తన చేతులతో విసురుగా వెనక్కి తోసేసింది. అతను కింద పడనైతే పడలేదు కానీ, భయపడుతుందనుకున్న ఆడమనిషి అలా దూసుకొచ్చి దాడి చేస్తుందని ఊహించక రెండు అడుగులు వెనక్కి తూలాడు.
అదే అదునుగా సహన, “పదమ్మా దియా!” అని అంటూ దియా చెయ్యిపట్టుకుని మెట్ల వైపుకి పరుగు తీసింది. దియాని దాదాపు ఈడ్చుకెళుతోంది, ఎక్కడ మళ్ళీ అతని చేతికి చిక్కుతుందో దియా, అనే కంగారు, ఆమెకి పిచ్చిబలం, మొండిధైర్యం ఇచ్చాయి. వెనకాలే అతను పరిగెత్తుకొస్తున్నాడు.
వీధి తలుపు దాటింది…
అతనూ దాదాపు సహన భుజం అందుకోబోయాడు. అతని చేతికి తాకింది, ఎస్సై ప్రసాదు బలమైన దెబ్బ.
“అమ్మా!” అని భయంగా దియా సహనను పట్టేసుకుంది.
“భయం లేదు దియా, భయం వద్దు” అని కూతురిని గుండెల్లో పొదుముకుంది సహన.
ఎస్సై ప్రసాద్ అతన్ని జీపులోకి ఎక్కించమని పోలీసులకి చెప్పి, “ఏంటమ్మా, ఈ దూకుడు? మేము నిన్న రాత్రినుంచే, ఈ వీధిలోని సీసీటీవీని మా మానిటర్‍కు కనెక్ట్ చేసుకున్నాము, ఏ ఒక్క కదలికైనా మాకు అర్ధమయ్యేలా గమనించుకుంటున్నాము. ఎందుకంటే ఈ వీధి దాటి అయితే, మీ అమ్మాయి ఇంకెక్కడా కనపడలేదు అని మాకు స్పష్టంగా అనిపించింది. కానీ మీరు ఏ ధైర్యంతో వచ్చారమ్మా?” అన్నాడు ప్రేమగానే మందలిస్తూ,
“మీరు ఇక్కడికి రావటం మానిటర్‍లో గమనించిన మా కానిస్టేబుల్, నాకు చెప్తే వెంటనే మేమొచ్చాము కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమయ్యేదో!” అని అంటూ ఉంటే ప్రసాదుని మధ్యలోనే అడ్డుకుంటూ సమాధానమిచ్చింది సహన, “ఆడవారు ఎక్కడైనా పిరికివారూ బలహీనులూ కావచ్చు. కానీ పిల్లల విషయంలో, అదీ ముఖ్యంగా వారి భద్రతకోసం ఎంతకైనా తెగిస్తారు. నా జీవితమే దియా. తనే కనపడకుండా పోతే దొరికేదాకా నేనెలా ఊరికే ఉండగలను?” అంది నిర్భయంగా.
“అవునమ్మా నువ్వు బంగారుతల్లివి” అని సహనను మనఃస్ఫూర్తిగా మెచ్చుకుని, దియావైపు చూసి, “అసలు అతనితో ఎందుకు వెళ్ళావు నువ్వు?” అని కోప్పడ్డాడు ప్రసాద్.
“మా ఆటో రాజుని సరదాగా ఏడిపిస్తూ ఇలా ఈ వీధుల్లోకి వచ్చి కాసేపు దాక్కుని వెళుతుంటాను. అలానే నిన్న వచ్కాను ఇక్కడికి. ఆ బండోడు నా పొట్ట పక్కన కత్తి పెట్టి గుచ్చుతూ నోర్మూసుకుని నడుస్తూ ఉండూ, లేదంటే పొడిచేస్తా అన్నాడు. నాకు భయంవేసి అతను చెప్పినట్టే అతనితో వెళ్ళాను. ఆ రూములో నా చేతులు కాళ్ళు కట్టేసి, నా నోట్లో బట్ట కుక్కేసి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి… అతని ఫోన్‍లో ఎవరితోనో మాట్లాడుతూ, ఇక్కడ ఒక అమ్మాయి బావుంది, పదిలక్షలు చాలా తక్కువ ఏభైలక్షలు ఇస్తేనే అమ్ముతాను” అన్నాడు అని వెక్కివెక్కి ఏడుస్తూ దియా చెబుతుంటే, అప్పటిదాకా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఉన్న సహన, ఉన్నట్టుండి ఆపిల్ల భుజం మీద తలపెట్టుకుని భోరున ఏడ్చేసింది, అప్పటివరకూ లోపలదాచుకున్న భయం, బాధ కన్నీరుగా బయటకు జారుకోగా.
ఆ తల్లీబిడ్డలని చూస్తున్న ప్రసాదుకి కూడా కళ్ళు తడి అయ్యాయి.
“అందుకే, దియా! మన జాగ్రత్తలో మనముండాలి. చూడు నీకిప్పుడు, ప్రమాదం రాబోయి తప్పింది. అమ్మకీ చాలా బాధయ్యింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు” అని జాగ్రత్తలు చెప్పాడు.
“ఇంకెప్పుడూ జాగ్రత్తగానే ఉంటానమ్మా!” అని సహనని చూస్తూ చెప్పింది దియా. సహన ఆమెను దగ్గరకు తీసుకుంది.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.