“రావే పెళ్ళికూతురా! ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకున్నాం” అంది సునీత. ఆ మాటల్లో ఎప్పట్లాగే అపహాస్యం… కనీ కనిపించనట్టు.
“బాబు ఏడి?” మాట మార్చేసింది సుమిత్ర. ఆమె ముఖంలోకి చూసీ చూడనట్టు చూసాడు మురళి. పెద్ద వుత్సాహంగానీ సంతోషంగానీ లేవు. కొద్దిరోజులుగా జరిగిన గొడవలకి బాగా నలిగింది. తామంతా ముందుకి తోస్తే తప్ప పెళ్ళి చేసుకునేలా అనిపించలేదు. మనిషి నెత్తికి పెద్దరికం చుట్టేస్తే అదొక ముళ్ళకిరీటంలా బిగుసుకుంటుంది. దాన్ని తియ్యటం మరిక సాధ్యపడదు. మనిళ్ళలో పెద్దకొడుకులూ, పెద్దకూతుళ్ళూ అలాంటివాళ్ళే. వాళ్ళకి బాల్యం, యౌవనం వుండవు. పుట్టుకనుంచీ వృద్ధాప్యమే.
మమత బాబుని సుమిత్రకి ఇచ్చి, కాఫీ తెచ్చింది. వాడిని ఆడిస్తూ కూర్చుంది సుమిత్ర.
అదేరోజు దేవకి, శంకర్ సూర్య యింటికి వచ్చారు. వాళ్ళిలా వస్తున్నారని సూర్యా ముందే చెప్పి వుంచడంచేత అతని తల్లిదండ్రులు ఇంట్లోనే వున్నారు.
“ఎవరు వాళ్ళు? ఎందుకు వస్తున్నారు?’ అని రుక్మిణి అడిగితే-
“వచ్చాక నీకే తెలుస్తుంది” అని సూర్య జవాబు. నిజానికి ఇంట్లో తనే చెప్పచ్చు. కానీ పెద్దరికం మీదేసుకుని వాళ్ళు వస్తున్నప్పుడు తొందరపడటం దేనికని ఆగాడు. అసలు పరిచయంలేనివాళ్ళు ఇల్లు వెతుక్కుని వస్తున్నారంటే ఎందుకో వూహించలేనంత తెలివితక్కువది కాదు రుక్మిణి. కానీ రోజులు మారాయి. ఇదివరకట్లా మధ్యవర్తులతోనూ, చుట్టాలని అడిగీ సంబంధాలు కుదుర్చుకోవటం లేదు. పొరిగింట్లోనో ఎదుటి ఫ్లాట్‌లోనో వున్న అమ్మాయి గురించికూడా మేరేజి బ్యూరోల్లోనే తెలుస్తోంది. తెలిసిన అబ్బాయి అందమైన ప్రొఫైలు కనిపిస్తోంది. ఆ పిల్లలు ఎలాంటివాళ్ళో, ఎలా ప్రవర్తిస్తారో ఎలాంటి గమనిక లేకుండానే పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ గోదాలోకి దిగిన వస్తాదుల్లా జీవనపోరాటం మొదలుపెట్టి గెలుపోటములు తేల్చుకుంటున్నారు. ఐనాసరే పాతకాలంలోలా వీళ్ళు ఇల్లు వెతుక్కుంటూ రావటం ప్రహసనంలా అనిపించింది.
పరిచయాలయ్యాయి. బాగా పలుకుబడి వున్నవాళ్ళే అని అర్థమైంది రుక్మిణికి. ఆడవాళ్ళు, మగవాళ్ళూ విడివిడిగానూ, కలగలుపుగానూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ సంభాషణలో కాస్తంత సుళువు వచ్చాక సూర్య మధ్యలో కొద్దిసేపు అక్కడినుంచీ లేచి వెళ్ళి, మళ్ళీ కాసేపటికి వచ్చాడు. దేవకి సంబంధంగురించి ప్రస్తావన చేసింది.
తండ్రి లేడు. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఆమె తర్వాతి ఇద్దరికీ పెళ్ళిళ్ళు తనే చేసింది. ఇంకో చెల్లి బాధ్యత వుంది. తల్లిని చూసుకోవాలి. క్లరికల్ జాబ్. తండ్రి స్థానంలో ఇచ్చారట. వాళ్ల కుటుంబానికి ఆమె ఉద్యోగం తప్ప ఇంకే ఆధారం లేదు. ఇదేం సంబంధం? దేవకి చెప్తుంటే ఆవిడ ముఖం ముడుచుకుంది. సుమిత్ర వివరాలన్నీ చెప్పాక, ఆఖర్లో దేవకి అన్నమాట ఆవిడని వులిక్కిపడేలా చేసింది. “ఆ అమ్మాయిని సూర్యా ఇష్టపడుతున్నాడు’” అని.
రుక్మిణికి ఆశ్చర్యం, అపనమ్మకం కలిగాయి.
“వాళ్లవైపునించీ అడగడానికి ఎవరూ లేరు. అందుకని మేం వచ్చాం. మా కోడలికి అక్క ఆ అమ్మాయి ” అంది దేవకి. ఇంత డబ్బున్నవాళ్ళు లోకం గొడ్డుపోయినట్టు ఆ సంబంధానికి వెళ్లటమేమిటి? వాళ్ళు చేసుకున్నది చాలక తమకి చెప్పడమేమిటి? అసహనంగా అనుకుంది.
“మాకు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి” అంది రుక్మిణి మొహమ్మీదే కుదరని అనలేక.
వాళ్ళు వెళ్ళాక సూర్యాని నిలదీసి అడిగింది రుక్మిణి.
“నీకు ఆ అమ్మాయితో ఎలా పరిచయం?”
“నీలిమావాళ్ళ ఆఫీసులో పని చేస్తుంది”
“అంటే ఈ గ్రంథమంతా అది నడిపించిందా? తనేమో కట్నం తీసుకునేవాడిని చేసుకోనని కూర్చుంది. నీకేమో ఈ బికారి సంబధం పరిచయం చేసింది”
“దాన్నెందుకంటావే? కట్నకానుకలు వద్దనే మగవాడు ఇప్పడికీ ఇంకా ఈ దేశంలో పుట్టలేదు. అంత ఆదర్శం వున్న పిల్లకి వరుడు దొరక్కపోవటం మగపిల్లంతా చేసుకున్న దురదృష్టం” అన్నాడు వాసుదేవ్. ఆయన తమ్ముడి కూతురు నీలిమ.
“అందుకే వీడికీ దిక్కూమొక్కూ లేని పిల్లని చూపించింది” అక్కసుగా అంది. పదేపదే తల్లి అలా అనటం సూర్యాకి నచ్చలేదు.
“ఎందుకలా తీసిపారేసినట్టు మాట్లాడతావు? సుమిత్ర చాలా మంచిది. నెమ్మదస్తురాలు. క్లర్క్‌గా చేస్తోంది. నీకు చక్కటి కోడలౌతుంది. వాళ్ళ సమస్యలతోటీ తన బాధ్యతలతోటీ మనని ఇబ్బంది పెట్టదు. నాకు తనంటే చాలా యిష్టం. చేసుకుంటే తననే చేసుకుంటాను. లేకపోతే ఇలాగే వుండిపోతాను” అంతాదాకా చెప్పి, “నీకోసమె నే జీవించునదీ అంటూ ఇక్కడ నేనూ, అక్కడ తనూ పాడుకుంటూ బతికేస్తాం” అన్నాడు.
“పోరా!” అంది రుక్మిణి. “ఎంత సీరియస్ విషయమేనా ఇలాగే నీరుగార్చేస్తావు” అంది. కొద్దిసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
“సమసమాజం రావాలని పెద్ద సోషలిస్టు సిద్ధాంతాలు చెప్తారు. కోడల్ని కాస్త తక్కువ ఇంట్లోంచీ తెచ్చుకుని కూతుర్ని అలాగే ఒక మెట్టు పైకి ఇవ్వమని మన సాంప్రదాయం. అంటే తన సంపద పంచుకొమ్మని ప్రతి మనిషికీ ఇంకో మనిషిని జత చేసి వుంచుతుంది. ఆచరించడానికి మీకు భయంకాబట్టే కత్తులూ తుపాకులూ పట్టుకుని విప్లవాలు చెయ్యాల్సి వస్తోంది. మనుషుల తెలివితక్కువతనంవల్లనో, తెలిసో తెలీకో చేసిన పొరపాట్లవల్లనో, వాళ్ళ చేతుల్లో లేని మరేవో కారణాలవలన పేదరికం సృష్టించబడుతునే వుంటుంది. దేశంలో ఎంత పేదరికం వున్నా, దాన్ని అనుభవించే మనుషులు మారిపోతూ వుండాలి. వాళ్ళు ఒక మెట్టో రెండు మెట్లో పైకి ఎక్కి అందులోంచీ బయటపడాలి. తండ్రి చనిపోవటంతో సుమిత్రమీద బాధ్యతలు పడ్డాయి. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళి సునాయాసంగా చేసింది. తను చాలా కేపబుల్. అందుకే నాకు తనంటే చాలా యిష్టం” అన్నాడు సూర్య. అతని మాటల్లోని పరిణతి వాసుదేవ్‌ని ఆశ్చర్యపరిచింది. ఎంతమంది ఇలా ఆలోచించగలరు? ఆదర్శాలు చెప్పడం వరకూ అందరూ చేస్తారు. ఆచరించమనేసరికి తడబాటు వచ్చేస్తుంది.
“ఉద్యోగం కూడా రిజైన్ చేసావు. స్థిరపడేదాకా ఆగు” అంది రుక్మిణి. ఆమెకి ఇంకా మనసు వొప్పుదలగా లేదు.
పూర్తి విషయాలు ఆవిడతో చెప్పలేడు. చెప్తే ఈ గొడవలు నీకెందుకనో, ఆ పిల్ల ఇలాంటిదా అనో అనేస్తుంది. అదంతా ఇష్టం లేదు.
“రెజిగ్నేషన్ వెనక్కి తీసుకుంటాను” అన్నాడు.
“వద్దులేరా! బిజినెస్ మొదలు పెడతానన్నావుకదా, అదేదో చూసుకో. నువ్వెలాగూ పైవాడివి కాదు. వచ్చే ఒక్క పిల్లకి మనం తిండి పెట్టలేమా?” అన్నాడు .
వాసుదేవ్
“ఆ పిల్లకి మనం పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఉద్యోగస్తురాలు…” వెటకారంగా అంది రుక్మిణి.
ఆఖరికి సూర్య బలవంతంమీద సుమిత్రని చూడటానికి వప్పుకుంది.
సుమిత్ర ఇంట్లో వాతావరణం బిగుసుకున్నట్టే వుంది. భార్గవ స్వరూపని తీసుకెళ్ళతానికి వచ్చాడు. మురళిని చూసి మాట్లాడుతూ వుండిపోయాడు.
“భోజనాలు చేసి వెళ్ళండి” అంది రాధ. అతని తల్లిపై మనసులో ఎంత కోపంగా వున్నా పైకి చూపించడం కుదరదు. మమత, స్వరూప వంట ప్రయత్నాలు చేస్తుంటే రాధ తలనెప్పని వెళ్ళి పడుకుంది. స్వరూప తనూ లోపలికి వెళ్తే, “ఈ కాస్త వంటకీ ఇంతమంది అక్కర్లేదు” అని పంపేసింది సుమిత్ర. సునీత కొడుకుని ఆడిస్తూ అసలు పట్టించుకోనే లేదు. వంటై భోజనాలకి కూర్చోబోతుంటే సూర్య వచ్చాడు. అతని చేతినిండా పేకెట్లు. మురళినీ సునీతనీ చూసి విషయం అర్థం చేసుకున్నాడు… సుమిత్రలాగే.
“మా అమ్మావాళ్ళూ మీయింటికి వచ్చారుకదా? ఏం జరిగింది” అడిగాడు భార్గవ. సుమిత్ర పనున్నట్టు అక్కడినుంచీ వెళ్ళబోతుంటే స్వరూప చెయ్యి పట్టుకుని ఆపింది.
“నీ గురించి మేం తలకాయలు బద్దలు చేసుకుంటుంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటే?” అంది.
“అమ్మకి తలనెప్పులూ, అలకలూ తగ్గితే చాలు” అంది సుమిత్ర.
“అమ్మ, నాన్న రేపు ఇక్కడికి వస్తున్నారు” అన్నాడు సూర్య. అతని ముఖంలో కనీకనిపించనట్టు సంతోషం. అందరూ తేలిగ్గా నిశ్వసించారు. తనేం చెయ్యాలో అర్థమవ్వలేదు రాధకి.
“మరి పెళ్ళికొడుకు రావట్లేదా?” పరిహాసంగా అడిగింది స్వరూప.
“రాకుండా ఎలా? పెళ్ళిపిల్ల తప్పించుకుపోతేనో? ” అన్నాడు సూర్య.
సునీత చెల్లెల్ని విస్మయంగా చూస్తోంది. పెళ్ళికి ముందు నోట్లో నాలుకే లేనట్టు, సుమిత్రకీ తనకీ వెనుక నక్కినక్కి తిరిగేది. అలాంటిది ఇంతటి వ్యవహర్త అయి, సుమిత్రని పెళ్ళికి వప్పించిందంటే ఆశ్చర్యం కలిగింది.
సూర్యకూడా భోజనం అక్కడే చేసాడు. కూతుళ్ళూ అల్లుళ్ళతో ఇల్లంతా సందడి నిండింది. రాధ మనసు కాస్త తేలికపడింది. సూర్య ఇచ్చిన పేకెట్లోంచీ స్వీట్స్ తీసి అందరికీ వేసింది మమత. మిగతావి తీసి మర్నాటికి వుంచమన్నాడు సూర్య. అతను అవన్నీ ఎందుకు తీసుకొచ్చాడో సుమిత్రకి అర్థమైంది. మనసు కృతజ్ఞతతో నిండింది. భోజనాలయ్యాక మరి కాసేపు వుండి స్వరూప, భార్గవా వెళ్ళిపోయారు. సాగనంపడానికి గేటుదాకా వచ్చిన తల్లితో అంది స్వరూప.
“అమ్మా! నాకన్నా, సునీతకన్నా కూడా సుమిత్ర తెలివితక్కువదనీ, అమాయకురాలనీ నువ్వే ఎన్నోసార్లు అన్నావు. దానికేం కావాలో దానికే తెలీదనీ అనేదానివి. ఇప్పుడుకూడా అవేవీ మారిపోలేదు. అదే సుమిత్ర… అదే నువ్వు. మారిందల్లా నీ ప్రేమ. అదింకా నీకు కోపం వచ్చిందని తల్లడిల్లుతోంది. కోరుకున్నవాడితో పెళ్లన్న సంతోషం కనిపించట్లేదు తన మొహంలో. మురళీబావ, భార్గవ, సూర్య నీకు కొడుకుల్లాంటివాళ్ళు. మేమంతా వుండగా నీకు ఎలాంటి అమర్యాదా జరగదు” అంది. తల్లి వెనుకే వచ్చిన సునీత, సుమిత్రా కూడా విన్నారు ఆ మాటలని.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.