చిన్నప్పుడే తల్లి చనిపోతే, తండ్రి ఒక్కడూ తనను పెంచలేడని, బాబాయ్, పిన్ని, శోభను చేరదీసి పెంచుతున్నారు.
బాబాయ్ కూతురు శ్రావణి, శోభ, ఇద్దరూ బాగా చదువుకునే పిల్లలు . తండ్రి కొంతకాలం తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసింది శోభకి . నెలకోసారి చుట్టపుచూపుగా వచ్చి శోభతో కాసేపు కబుర్లు చెప్పి పరామర్శించి వెళ్ళేవాడు తన తండ్రి అన్నంతవరకే, శోభకు తన ఆయనతో అనుబంధం.
అయినంతలో పిన్ని బాబాయ్ బాగానే చూసుకుంటున్నారు, శ్రావణికి, తనకి పెద్ద తేడా ఏమీ చూపించరు అన్నంత స్ప్రృహ ఉంది శోభకి. అంతకుమించి ఎక్కువగా ఆలోచించే తత్వం కాదు ఆమెది. అందుకే తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోవటంలో, తనకొచ్చే లాభం నష్టం గురించి పెద్దగా అవగాహన లేదు. పిన్ని బాబాయ్ శ్రావణిలానే, తానూ తండ్రి పెళ్ళికి వెళ్ళింది, వచ్చింది.
చదువుకోసం తన సమయాన్ని మొత్తం వినియోగించుకునేది. సంగీతం క్లాసులకుకూడా కోర్సులో చేరింది. అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా తన జీవనాన్ని తాను పద్ధతిగా మలుచుకుంది.
పిన్ని కూడా ” మరో తల్లి కన్నబిడ్డ, నేనెందుకు నా కూతురుతో సమానంగా, శోభను చూడాలి?” అనే ఇరుకుమనస్తత్వాన్ని అంతమరీ స్పష్టంగా ఏనాడూ ప్రదర్శించలేదు.
కాస్తంత తేడా చూపిస్తున్నారు, శ్రావణికి, తనకూ మధ్యన అని ఎక్కడయినా ఎప్పుడయినా అనిపించినా కూడా, శోభ తన సంగీతసాధనతో తనను తాను బిజీ చేసుకునేది. అలా అలా పెళ్ళీడుకి వచ్చారు ఇద్దరూ. ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఇద్దరికీ వయసులో తేడా .
శ్రీకాంత్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కడే కొడుకు సావిత్రి, సుమన్‌లకు. ఫొటోలు పంపించుకున్నారు. జాతకాలు చూసుకున్నారు. శ్రావణికి శ్రీకాంత్. అన్నీ బాగా కుదిరాయి. పెళ్ళి చూపులకు తేదీ ఖరారు చేసుకున్నారు.
ఇల్లంతా అలంకరిస్తూ హుషారుగా హడావుడిగా తిరిగేస్తోంది శోభ. శ్రావణికి సన్నని ఎర్రంచు ఉన్న పసుపు మైసూర్ సిల్క్ శారీ కట్టారు. తన గదిలోనే కూర్చుని ఉంది గంటనుంచీ శ్రావణి. ఇహ పెళ్ళివారు పావుగంటలో ఇల్లు చేరుతున్నారు అనగా అందరూ చకచకా రెడీ అవుతున్నారు.
నీలం అంచున్న ఎర్రని పట్టుపరికిణీ, నీలం వోణీ, నీలం జాకెట్టులో మరింత తెల్లగా మెరిసిపోతోంది శోభ.
పిన్ని శోభను చూసి, చెప్పింది “అమ్మాయ్, నువ్వు మేడమీదనే ఉండు. నేను పిలిచేదాకా కిందకు రాకు ” అని.
” పైన నేనొక్కదాన్ని ఏమి చెయ్యను పిన్నీ? బోర్ కొడుతుంది. అయినా బావగారు ఎలా ఉన్నారో నేను చూడాలి తరువాత శ్రావణికి వర్ణించి చెప్పాలి.. ” అని ఇంకా ఏదో అనబోతున్న శోభకు అడ్డుపుల్ల వేస్తూ పిన్ని కాస్తంత కోపంగానే చెప్పింది.
” శోభా! నా మాట వినమ్మా ! తోచకపోతే సన్నజాజిపూలన్నీ కోసి బుట్టలో వేసి నిండుగా మాల కట్టు. నీకు చాలా ఇష్టం అయిన పని కదా? ” అని.
సరే అంటూ ఇష్టం లేకపోయినా మెట్లు ఒక్కొక్కటీ నెమ్మదిగా ఎక్కి మేడ మీదకు వెళ్ళింది శోభ.
దూరంగా పెళ్ళివారి కారు సందుమలుపు తిరుగుతుండగా, కారులో కిటికీ పక్కనే కూచున్న శ్రీకాంత్‌కి, మేడమీద పిట్టగోడ దగ్గరున్న శోభ మొహం, సాయంత్రపు నీరెండలో తెల్లగా మెరుస్తూ కనపడింది.
కారు ఇంటి ముందు ఆగింది. ఆడపెళ్ళివారు ఆహ్వానాలు పలకటం, మగపెళ్ళివారు పలకరింపులు చేయడం జరుగుతున్న హడావుడిలో
శ్రీకాంత్ కామ్‌గా మేడమెట్లు ఎక్కేసాడు.
చిరుకోపంలో ఉన్న శోభకు కారు రావటం తెలియలేదు. తన మానాన తాను ” మరుగేలరా ఓ రాఘవా ” అని పాడుకుంటూ సన్నజాజిపూలు కోసి బుట్టలో వేసుకుంటోంది. ఆమె పాటను ఆస్వాదిస్తూ అలా ఆమెనే చూస్తూ నుంచుండిపోయాడు అతను. వెనుకన ఎవరో నుంచున్నట్లుగా అనిపించి వెనక్కి తల తిప్పి చూసింది శోభ. చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు.
” బావా మీరు ఇక్కడ … ” అంది శోభ ఫొటోలో చూసిన పెళ్ళికొడుకుని గుర్తుపడుతూ.
“అప్పుడే నన్ను బావా అని పిలవటంకూడా మొదలుపెట్టేసారే. చాలా బావుంది ” అన్నాడు శ్రీకాంత్.
” ఓ సారీ! బావగారు బావున్నారా? కింద ఉండకుండా ఇక్కడకు వచ్చారేంటీ ” అంది శోభ.
” తమాషాగా మేడమీద మనకు మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసారేమో అనిపించింది. ఎలానూ మనకోసం చేసినదేకదా మళ్ళీ చెప్పించుకోవటం ఎందుకూ అని వస్తూనే ఇక్కడకు వచ్చేసాను, పాట చాలా బాగా పాడుతున్నారు. శాస్త్రీయ సంగీతమేనా,
లలితగీతాలు, సినిమాపాటలు కూడా పాడతారా? ” అన్నాడు శ్రీకాంత్.
” ధాంక్యూ బావగారూ! మీరు కిందకి వెళ్ళండి. పదండి కిందకి వెళదాం ” అంది కాస్త అయోమయానికి గురవుతూ శోభ.
ఇంతలో బాబాయ్ పెళ్ళిళ్ళపేరయ్యగారు మేడమీదకి వచ్చారు.
” ఇక్కడున్నావా బాబూ. గుమ్మందాకా వచ్చిన అబ్బాయి ఉన్నట్టుండి మాయం అయిపోయాడేంటీ అనుకున్నాము. మేడమీదకి వెళ్ళాడేమో అనిపించి ఇప్పటికి ఇక్కడికి వచ్చాము. పద, శ్రీకాంత్ కింద అందరూ నీకోసం చూస్తున్నారు ” అన్నాడు బాబాయ్.
” పెళ్ళికూతురు కూడా ఇక్కడే కదండీ ఉన్నారు? పర్లేదు, మేము కాసేపు మాట్లాడుకుని వస్తాము ” అన్నాడు శ్రీకాంత్.
వెంటనే బాబాయ్ మొహంలో చిన్నపాటి అసౌకర్యం తెలిసింది శోభకి.
“అయ్యో బావగారూ! మీరు పొరపాటుపడ్డారు. శ్రావణి పెళ్ళికూతురు. తను మీకోసమే కింద గంటన్నరనుంచీ ఎదురుచూస్తోంది. నేను తన చెల్లెలిని ” అంది శోభ స్పష్టంగా .
శ్రీకాంత్‌కి నిరాశగా అనిపించింది. ” అరె మీరే కదా ఫొటోలో ఉన్నది, ఇప్పుడు మీరు కాదంటారేమిటీ? ” అన్నాడు.
” అక్కాచెల్లెళ్ళకి పోలికలు బాగా కలుస్తాయిలే బాబూ! ఎంతయినా మా అన్నదమ్ముల పిల్లలు కదా. రక్తసంబంధం, పోలికలు కలవకుండా ఉంటాయా? అందుకే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. పర్లేదులెండి. పదండి కిందకి ” అన్నాడు బాబాయ్.
అవునా అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసాడు శ్రీకాంత్, శోభని.
“కిందకు వెళ్ళండి బావగారు, అక్క ఎదురుచూస్తోంది ” అని మరోసారి స్పష్టం చేసింది శోభ.
మెట్లు దిగబోతూ మరోసారి శ్రీకాంత్, శోభని దీక్షగా చూసాడు. తన కళ్ళల్లో ఆమె పైన కలిగిన ఇష్టాన్ని తెలియచేస్తూ. శోభకు అతని కళ్ళల్లో తనపై ఇష్టం స్పష్టంగా తెలిసింది. ఒక్కసారి మనసు కాస్త ఝల్లుమంది కానీ “తప్పు తప్పు. అతను అక్కకోసం నిర్ణయింపబడ్డవాడు” అని మళ్ళీ మనసే హెచ్చరించింది.
అంతే అతన్నుంచీ కన్నులు పక్కకి తిప్పేసుకుని మళ్ళీ సన్నజాజులు కోసి బుట్టలోకి వేసుకునే పనిలో పడింది.
శ్రీకాంత్ శ్రావణికి పెళ్ళి చూపులు జరిగాయి.
శ్రావణికి అసలు ఈ సంబంధం ఇష్టం లేదు. హైదరాబాదు వెళ్ళకుండా ఇదే ఊర్లోని కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉన్న రాజ్‌కుమార్‌ని పెళ్ళి చేసుకోవాలని ఆమె ఆలోచన. తల్లీతండ్రికి తెలియచేయటానికి భయపడుతోంది.
శ్రీకాంత్ కూడా వద్దని చెప్పటంతో శ్రావణికి వేరే సంబంధాలు చూస్తున్నారు పిన్నిబాబాయ్.
తండ్రి వచ్చి శోభను తీసుకెళ్ళాడు. తన భార్యకు బీపీ షుగర్ పెరిపోయి నీరసంగా అయిపోయింది మరియూ కుడి చెయ్యి కాలు స్వాధీనం తప్పిపోయి పనులేవీ చేసుకోలేకపోతోందని. శోభ పిన్నమ్మకు సేవలు చేసి ఇల్లు చూసుకుంటోంది. మధ్యమధ్యలో శ్రీకాంత్ సంఘటన గుర్తొచ్చి మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది.
మధురమైన జ్ఞాపకమది. జీవితాంతం మరిచిపోను… అని అపురూపంగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ సాయంత్రపు మధురక్షణాలను.
సంవత్సరం తరువాత ఒకరోజు…
శ్రీకాంత్ ఫోన్ చేసి, “మీతో ఒకసారి మాట్లాడాలి” అని అడిగాడు శోభ బాబాయ్‌ని. శోభని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు.
అప్పటికి శ్రావణి పెళ్ళి రాజ్‌కుమార్‌తో జరిగిపోయింది.
శోభను తానే వలచి వస్తున్నాడు శ్రీకాంత్, చాలా మంచి విషయమేకదా అని అనుకున్న బాబాయ్
” సరే బాబు శోభతో, మా అన్నతో మాట్లాడాక ఏ విషయమూ చెబుతాను ” అన్నాడు.
మర్రోజే అన్న దగ్గరకు వెళ్ళి శ్రీకాంత్ విషయం చెప్పాడు. శోభకు వంటింట్లోకి వినపడ్డాయి బాబాయ్ మాటలు. ఆనందంతో ఆమె మానసం నాట్యమాడింది.
” సరేలేరా! ఇప్పుడిప్పుడే మీ వదినకు కూడా బాగవుతోంది. శోభకు కూడా వయసు పెరుగుతోంది, పెళ్ళి చూపులకు రమ్మను ” అన్నాడు అన్న.
శ్రీకాంత్ బాబాయ్‌కి తన ఆశ చెప్పుకున్నాడు. ” అదే మేడమీద సన్నజాజిపూల సాక్షిగా తమ పెళ్ళి చూపులు జరిగేలా ఏర్పాటు చెయ్యండి ” అని.
అది విన్న శోభకు బుగ్గలు సిగ్గుతో ఎర్రబారిపోయాయి. చిన్ననాటినుంచీ అలా అలా సాగిపోతున్న తన జీవితంలో, శ్రీకాంత్ ప్రవేశించిన దగ్గరనుంచీ తీపితీపి అనుభూతులే వర్షిస్తున్నాయని మనసు సంత్రృప్తితో నిండగా…
మరో మూడునెలలకు శ్రీకాంత్, శోభాపతిగా మారిపోయాడు.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.