కాలభ్రమణం by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant
  13. దివ్యశక్తి by Manas Krishna Kant

రూమ్‍లో కూర్చుని ఆరోజు అన్ని క్లాసులనుంచీ వచ్చిన రిపోర్టులు చూస్తున్నాను. మొదట పీరియడ్ తర్వాత అందరు క్లాస్‍టీచర్లూ తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ క్లాస్‍రిపోర్టులు ప్రతిరోజూ నాకు సబ్మిట్ చేయాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది హోంవర్కు చేయలేదు,
క్లాస్‍టెస్టుల్లో వచ్చిన మార్కులులాంటివి, ఇంకా చాలా చాలా. ముప్ఫై ఏళ్ళకుపైగా ఉన్న టీచర్ అనుభవం రిటైర్ అయిన తరువాత నన్ను ఖాళీగా ఉండనివ్వలేదు. పిల్లలకూ, చదువుకూ దూరంగా ఉండలేకపోయా ఎక్కువరోజులు. మనం గట్టిగా కోరుకుంటే ప్రకృతికూడా మన మనోఫలం సిద్ధింప చేయడానికి నడుం బిగిస్తుందని ఎక్కడో చదివాను. నేను అలాంటివన్నీ నమ్మే మనిషినికానుకానీ, ఏడాది క్రితం ఈ స్కూలు యాజమాన్యం వచ్చి వారి స్కూల్ ప్రిన్సిపాల్‍గా చేరమని అన్నప్పుడు, ఒక్కసారిగా అది నిజం అనిపించింది. నిజమేనేమో..
అన్ని సంవత్సరాలు ప్రభుత్వబడుల్లో పనిచేశానేమో, ఈ కార్పొరేట్ జీవితం బొత్తిగా సరిపోవట్లేదనిపించింది మొదట్లో. కానీ, రాను రాను నేనుకూడా కంటెంట్‍కంటే కటింగ్, కలరింగే బాగుందనుకునేలా చేశారు వాళ్ళు. ఆకర్షణీయమైన ప్రచారాలు, ర్యాంకుల మోత, హడావిడి, పాఠ్యేతర కార్యకలాపాలు, ఏడాది ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. కానీ, మనసుకి స్వాంతన లేదు. యాంత్రికంగా అలసటగా అనిపిస్తుంది. అలసట వయసువల్ల కావచ్చు. కానీ, యాంత్రికత??
ఎప్పుడూ ఈ ఆలోచన రావడానికికూడా ఆస్కారం లేకుండా పని. అనవసరమైన పని. రిపోర్టులు క్లాస్‍రిపోర్టులుమాత్రమే అయితే ఫర్వాలేదు, టీచర్లమీద టీచర్లు, పిల్లలమీద టీచర్లు, టీచర్లమీద పిల్లలూ, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసినా ముప్పై ఏళ్ళల్లో చూడనన్ని రిపోర్టులు వచ్చిన మూడునెలల్లోనే చూసేశాను. వినడం అలవాటు చేసుకున్నాను. పరిష్కరాలకోసం ఎవరూ రారు. కేవలం వారి వివరణ వినిపించేందుకే అని తెలుసుకున్నా, అలానే మసలుకుంటున్నా. అదే నా ప్రతిష్ఠను ఇంకా పెంచింది. పెంచుతూనే ఉంది. నిష్కర్షయైన ప్రిన్సిపాల్‍గానే కాదు, ఒక అరుదైన విద్యాసంస్థ పరిపాలనా అధిపతిగాకూడా.


ఎప్పుడూ ఊపిరిసలపని పని ఉంటుంది అనుకోవడం భ్రమో లేక కార్పొరేట్ లైఫ్‍స్టైల్‍లో భాగమో తెలియట్లేదు. తెలుసుకోవాలన్న ఆలోచనకానీ, ఆసక్తికానీ కలగకుండా చేయడంకూడా ఆ వేగవంతమైన లైఫ్‍స్టైల్‍లో భాగమేనేమో. కానీ, ఈరోజు జరిగిన ఒక వింత సంఘటన నన్ను జీవితంలో వెనుకకి కొంతదూరం తీసుకెళ్ళి కొంతభాగాన్ని నెమరువేసుకోవడానికి అవకాశం కల్పించింది.
తల్లిదండ్రులూ, క్లాస్‍టీచర్ల ఇష్టాలే పిల్లలపై రుద్దే ఈ సంస్కృతిలో విద్యార్థి వ్యక్తిత్వానికి, వ్యక్తిగత ఇష్టాలకీ, మాటకీ విలువ లేదని, ఇవ్వరనీ రూఢీ పరచుకుంటున్న సమయంలో, జరిగిన ఈ సంఘటన చిన్నదే, చాలా సామాన్యమైనదేకానీ, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అదొక విప్లవాత్మకమైనది.
నిన్న క్లాస్‍టీచర్ హోంవర్కు ఇచ్చింది. ఎలా చేయాలో చెప్పింది. అందరూ అలానే చేశారు అచ్చుగుద్దినట్టు. ఒక్కడు తప్ప. టీచరు కొట్టింది, ఇంట్లో చెప్పకపోయినా తెలిసేలా ఉంది ఆ కొట్టడం. ఈరోజు పొద్దున్న వాళ్ళమ్మా, నాన్నా వచ్చారు స్టూడెంటుని పట్టుకొని. వాడు ఇవేమీ తెలియనట్టు, అనవసరమనట్టూ ఒక పక్కగా నిలుచొని ఉన్నాడు. టీచరుని పిలిపించాను, అడిగాను కొట్టడానికి కారణం. ఆమె చెప్పింది. కార్పొరేటైజ్ కాబడిన నాకు అది సమంజసంగానే తోచింది, వాళ్ళ పేరెంట్స్‌కికూడా. కానీ, నేను స్కూల్‍రూల్స్ ప్రకారం చర్య తీసుకోవాలి. కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎల్లోడ్ ఇన్ దిస్ స్కూల్ అని ప్రోస్పెక్టస్‍లో పెద్ద అక్షరాలతో ఉంటుంది మరి.
టీచర్‍ని వాళ్ళ పేరెంట్స్ క్షమాపణ చెప్పమన్నారు. అప్పుడు జరిగింది అనుకోనిది. అంతవరరకూ పట్టనట్టున్నవాడు, దగ్గరగా వచ్చి “టీచర్‍ది తప్పెందుకవుతుంది మేడం? నేను హోంవర్క్ చేయలేదు, అందుకనే కొట్టారు మా క్లాస్‍టీచర్. నేను ఇంటికి వెళ్ళాక కూడా దాని గురించేం చెప్పలేదు మేడం. కానీ చేతిమీద వాత చూసి మా పేరెంట్స్ అడిగితే చెప్పాను మేడం. టీచర్‍ది తప్పుకాదు. నేను వర్క్ చేయలేదు. ఇది మొదటిసారికూడా కాదు, చాలాసార్లు చేయలేదు. టీచర్ చెప్పారు ముందుకూడా. చేద్దామనుకున్నాగానీ ఇంటికెళ్ళాక ఎవరూ హెల్ప్ చేయట్లేదు మేడం. నాన్న, అమ్మ ఇద్దరూ లేట్‍గా వస్తారు. అందుకు కావటం లేదు. అది నేను క్లాసులో అందరి ముందూ చెప్పలేకపోయాను మేడం. టీచర్‍గారు కొట్టారు, తప్పు తెలిసింది నాకు. అంతే మేడం. టీచర్ అపాలజీ చెప్పకూడదు” అన్నాడు గట్టిగా.
ఒక్కక్షణంపాటు అర్థం కాలేదు, రెండవతరగతి కుర్రాడేనా అని. తప్పు ఎవరికి తెలియాలి? పేరెంట్స్‌కా? టీచర్‍?, వాడికా? ఈ ఒక్క సంఘటన నన్ను దాదాపు ముప్పై ఏళ్ళ గతానికి తీసుకెళ్ళింది. అది ఆ ఊరికి నేను కొత్తగా పోస్టు చేయబడిన రోజుల్లో జరిగిన విషయం. మూరుమూల ఊరు.
రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, ఆ ఊరు దానిలో ఇంకా వెనుకబడిన ప్రాంతం. అక్కడి జనాబా అంతా కూలీవాళ్ళు. రెక్కాడితేకానీ, డొక్కాడని పరిస్థితి వాళ్ళది. ఇక వారి పిల్లల పరిస్థితి చెప్పేదికాదు. ఒకసారి ఒక పిల్లాడిని కొట్టాను, ఇచ్చిన పని పూర్తి చేయలేదని. వాడు ఏడవలేదు. ఆతర్వాత వచ్చిన పరీక్షల్లో ఫస్ట్‌ర్యాంక్ వాడే.
అప్పుడొచ్చి చెప్పాడు, “మేడం! మీరు కొట్టడం నాకు పనికొచ్చింది. రోజూ స్కూల్ తర్వాత, మేపడానికి వెళ్ళే టైంలో పుస్తకంకూడా పట్టుకెళ్తున్నా ఇప్పుడు. ఈ బుద్ధి నాకు ముందెప్పుడూ కలగలేదు” అని.
తర్వాత ఇరవయ్యేళ్ళకి మళ్ళీ వచ్చాడు జాయినింగ్ ఆర్డరుతో కొత్తప్రాజెక్టు ఆఫీసరుగా అదే జిల్లాకి, ఆ వార్త నాకే ముందు చెప్పడానికి. నేను వేసిన దెబ్బ ఇంత ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అది వాళ్ళు తీసుకొనే విధానంలో ఉంటుందని. చిన్నవాడినుంచి నేను నేర్చుకొన్న అద్భుత పాఠం అది. అప్పటి నుంచి కొట్టలేదు ఎవ్వరనీ, దెబ్బే అంత మార్పు తీసుకొస్తే, మాట ఇంకెంత ప్రభావం చూపిస్తుంది పసిమనసులమీద అని, ద్విగుణీకృతమైన శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో మాటే మంత్రంగా చేసి చెప్పాను, చదువుని నిర్విరామంగా, నిరాటంకంగా ముప్పై ఏళ్ళు.
చాలా మార్పులు, చాలామంది విద్యార్థులు, చాలామంచి జీవితపాఠాలు నేర్చాను, నేర్పించాను. కానీ, కార్పొరేట్ కాబడిన విద్యలో, రిటైరైన నేను నన్ను కోల్పోయాను ఇప్పటివరకూ. కోల్పోవడానికి చాలా కొద్దికాలమే పడుతుంది. ముప్పై ఏళ్ళలో నేర్చుకున్నది, మూడునెలల్లో మర్చిపోయానా? విలువలు మర్చిపోయానా? మనిషి ఎప్పుడూ సుఖంగా, సులభంగా జీవించడానికే మొగ్గు చూపుతాడా? కాలం నిజంగా ఒక చక్రమేమో?? నన్ను నాకు గుర్తు చేయడానికి ఈ సంఘటన జరిగిందేమో !