అలారం నాలుగు కొడుతుంటే మెలుకువ వచ్చింది రావుకి. పక్కకి తిరిగి చూసాడు. డబల్ కాట్ ఆ అంచుకి పడుకుని ఉంది వసుంధర. కళ్ళమీద చెయ్యేసుకుని ఉన్నా కదలికలను బట్టి ఆమె ఎప్పుడో లేచిందని అర్థమైంది అతనికి. ఎప్పుడో ఏ మధ్యరాత్రో లేచిందా లేక రాత్రసలు నిద్రపోలేదా? చిన్నగా నిట్టూర్చాడు.
“వసూ! ” మృదువుగా పిలిచాడు.
” ఊ <” చెయ్యి తీయకుండా అలాగే జవాబిచ్చింది. గొంతు భారంగా ఉంది.
” వాకింగ్ కి వెళ్దాం పద. చల్లగాలికి హాయిగా ఉంటుంది” అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి.
” మీరెళ్ళండి” ముక్తసరిగా జవాబిచ్చింది.
” ఎంతకాలం ఇలా? నీలో నువ్వే బాధపడుతున్నావు. ఎవరికోసం ఈ బాధ? ఏం జరిగిందని?” లాలనగా అడిగాడు.
” కన్నకొడుకే గుండెలమీద తన్నినట్టు నీలెక్కేమిటని వెళ్లిపోయాక ఇంకా ఏమి జరగాలి?”” వసుంధర గొంతు రుద్ధమైంది. రావు సుదీర్ఘంగా నిట్టూర్పు విడిచి మంచం దిగి దోమతెర సరిచేసి ఇవతలికి వచ్చాడు. భారీ మూర్ఖత్వం పట్ల అతనికి కోపంగానూ అసహనంగానూ ఉంది. అయినా సంయమనం పాటిస్తున్నాడు .
వారంరోజులైంది, కొడుకూ కోడలూ వేరుపడి. అప్పటినుంచీ ఒక్కర్తీ కుమిలిపోతోంది. అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనిపించలేదు.. రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గూటిలో ఎంతకాలం ఉంటారు? వయసు వస్తున్నకొద్దీ మనిషి స్వేచ్ఛని కోరుకోవడం సహజం. ప్రేమ, వాత్సల్యంలాంటివన్నీ బంధాల్లా అనిపించి ఊపిరి అందనట్లు గిజగిజలాడతాడు. భార్య, ఆమెపట్ల నిబద్ధత, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు జీవితాన్ని ఆక్రమించేసుకుని అతని పరిధిని కుదించేస్తాయి.
కాలం మారుతోంది. ఈ మార్పు అతని తల్లిదండ్రులు జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ విస్తారంగా ఉంటుంది. తన ముప్పయ్యారేళ్ళ జీవితం… అది కాంక్రీటుగా తనవైన అనుభవాలతో కనిపిస్తుంటుంది. ఆ పునాదిమీద తర్వాతి తరం భవిష్యత్తుకి బాట వేయాలి. దానికి కొంత స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ దొరక్క సంఘర్షణ.
రావు కొడుకూ కోడలూ వేరుపడింది అందుకే. ఇంట్లో పెత్తనమంతా వసుంధరదే. కొడుకూ కోడలూ ఉత్సవవిగ్రహాలు. ఇక్కడ అలా జరగకుండా ఉండేందుకు వీలు లేదు. ఈ సంసారం అంతా ఆమె పొందిగ్గా పొదుపుగా అమర్చుకున్నది. ఇంటిని కట్టుకోవడంలోనూ, కొడుకుని తీర్చిదిద్దటంలోనూ అన్నిటిలోనూ ఆమె అభిరుచి ప్రతిబింబిస్తుంది. కొడుక్కి పెళ్లి చెయ్యక తప్పదు కాబట్టి చేసింది కానీ కోడలిని ఆంతరంగికంగా ఎప్పుడూ స్పృశించలేదు. కొడుక్కి సంబంధించిన వ్యక్తిగా భావించింది. తన కుటుంబంలో భాగమని కాదు. అది ఒక సాంప్రదాయిక దూరం. వైరం. వెనుకటి రోజుల్లో అత్తాకోడళ్ళు బాహాటంగా అనుకునేవారు. ఇంటి నాలుగ్గోడల హద్దుల్లో బలాబలాలు తేల్చుకునేవారు. ఇప్పుడు గొడవలేవీ లేకుండా డిప్లమాటిగ్గా వేర్లు పడుతున్నారు. రావు దృష్టిలో ఈ పని పెళ్లయిన వెంటనే జరగాల్సింది.
జాగింగ్ షూ వేసుకుంటూ వసుంధరకి చెప్పాడు. “వసూ! నేను వెళ్తున్నాను. తలుపు వేసుకో” అని, ఆమె లేచి రావడం కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరకు వేసి, గేటు తీసుకుని బయటికి నడిచాడు. సరిగ్గా అదే సమయానికి ఎదుటి కాంపౌండులోంచి వకుళ వస్తూ చిన్నగా నవ్వి పలకరించింది.
” ఈరోజూ రాలేదా, వసుంధర?” అడిగింది.
” చెప్తే అర్థం చేసుకోదు” కొంచెం విసుగు ధ్వనించింది రావు గొంతులో.
” మనిషి తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఇందులోనూ అతిగా ఇన్వాల్వ్ కాకూడదు”
ఆమెని చూస్తే గొప్ప ఆరాధన రావుకి. ముప్పయ్యేళ్లక్రితం తమ డిపార్ట్మెంటువాళ్ళంతా కలిసి కోపరేటివ్ సొసైటీ ఏర్పరుచుకుని ఈ కాలనీలో స్థలాలు కొనుక్కుని యిళ్ళు కట్టుకున్నప్పుడు ఆమెకూడా అలాగే యూడీసీ.
ఇద్దరు కొడుకులు. భర్త ఇంకేదో డిపార్ట్మెంట్ లో ఎల్‍డీసీగా చేసేవాడు. భార్య ఉద్యోగం తనకన్నా పెద్దదని అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆపైన జీతాల సర్దుబాటు దగ్గర భార్యాభర్తలకి నిత్యం కొట్లాటే. అయినా ఆమెలో పోరాటపటిమ తగ్గలేదు. అదే రావుకి ఆశ్చర్యం కలిగించే విషయం. పిఏవో ఎగ్జామ్ రాసి గెజిటెడ్ ర్యాంక్‍కి చేరుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లో అందరికీ ఆమె చర్చనీయాంశం అయింది. అందరూ ఆమెని ముందూ వెనకా విమర్శించేవారు. అయినా కుంగిపోలేదు. కొడుకులిద్దర్నీ బాగా చదివించింది. ఒకడు డాక్టరు. స్టేట్స్ లో ఉన్నాడు. రెండోవాడు రూర్కెలాలో ఇంజనీరు. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆమె ఏమీ పోగొట్టుకున్నట్టు కనిపించలేదు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరింది.
ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. మధ్యలో ఎవరో ఒకరు కలుస్తున్నారు. పలకరించుకోవడం, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు విడిపోవడం. ఎవరూ ఎవరికోసం ఆగటం లేదు. రావు వేగం పెంచాడు. వకుళ వెనకబడింది. చెయ్యూపి ముందుకు సాగిపోయాడు. రెండు రౌండ్లు కాలనీలో జాగింగ్ చేసేసరికి చెమటలు పట్టేశాయి. తెల్లగా తెల్లవారింది. ఇంటిముఖం పట్టబోతూ ఆగాడు. వసుంధర ఈ పూటేనా టిఫిన్ చేస్తుందని నమ్మకం లేదు. అందుకే రెండు ప్లేట్లు ఇడ్లీ కట్టించుకుని వచ్చాడు.
అతని ఆలోచన నిజమే. వసుంధర తలుపే వేసుకోలేదు. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, రోజూ దేవుని పూజకు కొనే పువ్వులు … అన్నీ వాకిట్లో దర్శనం ఇచ్చాయి. వాటన్నిటినీ ఏరుకుని, తలుపు తీసుకుని లోపలి వెళ్ళాడు. టీపాయ్ మీద వాటిని పెట్టి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళేసరికి అతను వెళ్ళినప్పుడు ఎలా ఉందో, వసుంధర ఇప్పుడూ అలాగే ఉంది.
“లే! బ్రష్ చేసుకో” అన్నాడు. అతని గొంతులో కొంచెం కాఠిన్యం ధ్వనించినట్టుంది, చివ్వుమని కళ్ళమీది అడ్డు తీసి చూసింది . ఎర్రగా మంకెనపువ్వుల్లా ఉన్న ఆ కళ్ళను చూసేసరికి అతని కాఠిన్యం కరిగిపోయింది.
” చూడు, ఏదో జరిగిందని బాధ పడిపోతున్నావు నువ్వు. కానీ ఈ రోజు నీ కొడుకు చేసిన పని ముప్పయ్యేళ్ల క్రితం మనమూ చేశాము. మరోతరం వెనక మా నాన్న. అంతకు ముందు మా తాత చేశారు . లేకపోతే ఈసరికి మనం మా ముత్తాతల ఊరు అడ్డతీగలలోనో ఇంకా మాట్లాడితే వాళ్ల ముత్తాతలు ఏ అడవుల్లోనుంచి నాగరిక ప్రపంచంలోకి అడుగు పెట్టారో ఆ అడవుల్లోనే ఉండాల్సినవాళ్ళం” అన్నాడు నచ్చజెప్తున్నట్టు.
” నిజమే! మనం మన అవసరాలకొద్దీ వున్న వూరు వదులుకుని వచ్చాము. వీళ్ళకి ఏమి అవసరం ముంచుకొచ్చిందని వున్న వూళ్లోనే వేరుపడ్డారు?” రోషంగా అడిగింది వసుంధర.
” నేను ఉద్యోగంకోసమని మా స్వగ్రామం వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న కూడా అలాగే అన్నాడు, ఉన్న పొలం చూసుకోక వూరు వదిలి వెళ్ళటమేమిటని”
” మన పెళ్ళికి ముందే మీరొచ్చేశారు. అంతేగానీ నేను వచ్చి వేరు పెట్టలేదు”
” అయితే ఏమంటావు?”
” కోడలే వాడి బుర్ర చెడగొట్టింది. లేకపోతే సొంత ఇల్లూ వాకిలీ అన్నీ వదులుకుని తల్లిదండ్రులని కాదనుకుని వెళ్లడమేమిటి? మీరు వెళ్లి నాలుగు కేకలేసి వాళ్ళని వెనక్కి రమ్మనండి. మనవలు దగ్గర లేకపోతే నాకు ఏమీ బాగాలేదు”
” నేను ఆ పని చెయ్యను” ఖచ్చితంగా అన్నాడు రావు. “ఒంటి కాపురంలోని కష్టసుఖాలను వాళ్ళని అనుభవించనీ”
” అంటే? నేను ఇక్కడ ఆరళ్లు పెట్టాననా?”
” వాళ్ల స్వేచ్ఛకి మనం అడ్డుగా ఉన్నామేమో! మన కోణనుంచి కాకుండా వాళ్ళవైపునుంచి ఆలోచించు. అన్నీ అమర్చి పెడుతుంటే తిని కూర్చోవడం మెదడుగల ఏ మనిషికేనా సమస్యే. వాళ్ళకీ ఒక వ్యాపకం కావద్దూ? “
చాలాసేపటిదాకా వసుంధర మాట్లాడలేదు. ముక్తాయింపుగా రావే అన్నాడు,” ఎవరి జీవితాలు వాళ్లవి. వాళ్లనే తీర్చిదిద్దుకోనీ”
ఆ మాటలతో ఆమె ఆలోచనలో పడింది. కొడుకు వైపునుంచి తెరుచుకున్న కోణంలోంచీ వెలుతురు క్రమంగా తన మనసులోకి చొరబడుతున్నట్టు అనిపించింది.
” మా నాన్నని చూడాలనిపిస్తోంది . వెళ్లి వస్తాను “అంది కొంతసేపటికి మౌనాన్ని వీడి.
రావు అంగీకారసూచకంగా తలూపాడు. వారంరోజులుగా రద్దయిన దినచర్య పున:ప్రారంభమైంది.
వసుంధర తండ్రి ఓల్డ్‌ఏజ్‍హోమ్‍లో ఉంటాడు. తల్లి పోయి చాలా కాలమైంది. ముగ్గురు కొడుకులున్నా ఏ ఒక్కరి దగ్గరా ఇమడలేకపోయాడు ఆయన. వాళ్లే ఆయన్ని వుంచుకోలేకపోయారని వసుంధరకి కోపం. తమ దగ్గరకు వచ్చి ఉండమంది. ఆయన వప్పుకోలేదు.
ఆమె వెళ్లేసరికి ఆమె తండ్రి ఏదో పుస్తకం చదువుకుంటూ కాటేజీలోనే ఉన్నాడు.
” రామ్మా!” వాత్సల్యంగా కూతుర్ని ఆహ్వానించాడు.” అల్లుడు రాలేదా? పిల్లలు బాగున్నారా?” అని కుశలప్రశ్నలు వేశాడు.
” అంతా కులాసాయే. మీరు?” ఆయనకు ఎదురుగా మోడా లాక్కుని కూర్చుంది.
” అయిదేళ్లో, ఇరవయ్యైదేళ్ళో దర్జాగా బతుకుతాను” నవ్వాడాయన. చాలా సరదా మనిషి. అనవసర బాదరబందీలనీ, దు:ఖాన్నీ తన దరిదాపుల్లోకి రానివ్వడు. ఆయన వచ్చాక ఆశ్రమం జీవాన్ని నింపుకుంది. వృద్ధాప్యం శాపం కాదనీ, సరైన వ్యాపకం లేకనే అది శాపమౌతోందనీ తను నమ్మి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆశ్రమంలో గార్డెన్, లైబ్రరీ మొదలు పెట్టించాడు. అవేకాక క్యారమ్స్, చదరంగం, షటిల్ ఇలాంటి ఆటల్ని కూడా. ఆడవాళ్ళకి కుట్లు, అల్లికల్లో సాధారణంగా ఆసక్తి ఉంటుంది. ఆశ్రమం ఆదాయానికి పక్కవనరుగా హేండీక్రాఫ్ట్స్ స్టోరు వెలిసింది. అవసరమైతే డబ్బు కూడా ఖర్చుపెడతాడు. తను సుఖపడటంకన్నా తన తరం సుఖపడటంమీద ఆయనకి ఆసక్తి ఉంది.
” ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకుందామని వచ్చాను నాన్నా!” అంది వసుంధర.
” ఏమిటది?”
” మీకు ఇక్కడ సంతోషంగా ఉందా?” సూటిగా అడిగింది.
” చాలా”
” అమ్మ లేకపోవటం, అన్నయ్యలు సరిగ్గా చూడకపోవటంతో మీకు అలా అనిపిస్తుందేమో!”
” అన్నయ్యలు సరిగ్గా చూడలేదని ఎందుకు అనుకుంటున్నావు? నా అలవాట్లు, అవసరాలు గుర్తుపెట్టుకుని తీర్చేవారు వదినలు”
” మరి ఎందుకని అక్కడెక్కడా ఉండలేకపోయారు? “
” వాళ్లకి అతిథిగా ఎంతకాలం ఉండగలను? ” నవ్వేసాడు ఆయన. ఆయనకి ఆ జీవితం… అంటే భార్య పోయాక కోడళ్ళ దగ్గర గడిపిన జీవితం దాదాపు ఎనిమిదేళ్ళు… తలుచుకుంటే నవ్వే వస్తుంది. అన్నీ వేళకి అమర్చేవారు. ఏమి తక్కువైతే తనెక్కడ బాధపడతాడోనని చాలా జాగ్రత్తపడేవారు. ఆఫీసుకి వెళ్లి వచ్చినంతకాలం ఇబ్బందిగా అనిపించలేదు. రిటైరయ్యాక మాత్రం ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది. అందులోంచి బయటపడేదాకా తోచలేదు. ఆశ్రమానికి వచ్చాక హాయిగా ఉంది. తనదైన జీవితం. తనకి నచ్చిన శైలి.
” బాబీవాళ్లు వేరే వెళ్ళిపోయారు” వసుంధర చెప్పింది.
” మంచిపని చేశారు. లేకపోతే ఒకళ్ళ జీవితాల్లో మరొకళ్ళు ఇరుక్కుపోయి ఎంతకాలం ఉండగలరు కృత్రిమ విలువలని పాటిస్తూ?”
” కలిసి ఉండడంలో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటంట? ఆ పిల్లచేత ఒక్క పనికూడా చేయనివ్వలేదు నేను. నా కన్నకూతురిని చూసుకున్నంత అపురూపంగా చూసుకున్నాను” వసుంధర గొంతు వణికింది.
“నిజంగానేనేనా?”” లోతుగా చూశాడు ఆమె తండ్రి.” “అయి ఉండదు వసూ! ఆ పిల్లని ఒక అతిథిని చూసినట్టు, బాబీకి సంబంధించిన వ్యక్తిని చూసినట్టు ప్రాముఖ్యం ఇచ్చి చూసి ఉంటావు. ఎక్కడైనా జరిగేది అదే. ఆ ఇల్లు నీ సామ్రాజ్యం. అందులో ఆమెకి చోటు ఉండి ఉండదు. వాళ్ల పిల్లల్ని పెంచటంలో కూడా నీదైన అభిరుచి. ఇంక ఆ అమ్మాయికి మనోవికాసానికి ఆస్కారం ఎక్కడ ? అన్నయ్యల దగ్గర ఇదంతా నేను అనుభవించాను”
వసుంధర తలొంచుకుంది.” పిల్లలని దగ్గరికి తీయడం తప్పుతుందా ? వాళ్ళు నా మనవలు. నా కొడుకు రక్తం . వాళ్ళని వదిలి పెట్టి ఉండలేకపోతున్నాను”
” కానీ వాళ్ళు ఆ అమ్మాయి కన్నపిల్లలు. ఆమె తర్వాతే నువ్వు”
” మీరూ ఇలాగే అంటున్నారా నాన్నా?” వసుంధర ఏడ్చేసింది. ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది.
“పుట్టుకతో వచ్చింది వ్యక్తిత్వం. మధ్యలో వచ్చిన భర్త, పిల్లలకోసం ఈ వ్యక్తిత్వాన్ని బైటికి నెట్టేస్తారు మీ ఆడవాళ్లు. పిల్లలు పెద్దవాళ్లౌతున్నకొద్దీ వాళ్ల వ్యాపకాలు, వాళ్ల జీవితాలు వాళ్లకి ఏర్పడతాయి. అలా మీలో కొంత శూన్యం ఏర్పడుతుంది. బాధ్యతలన్నీ తీరేసరికి భర్త కూడా కాస్త ఎడం జరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించేసరికి పూర్తిగా శూన్యమౌతుంది. వసూ! కొడుకు కాపురంలోనూ, కూతురి కాపురంలోనూ జోక్యం చేసుకున్నంతమాత్రాన ఈ శూన్యం నిండదు. దేనికి దాన్ని విడివిడిగా చూడ్డం అలవాటు చేసుకోవాలి”
“…”
“పెళ్ళి, బాధ్యతలు, భర్త, పిల్లలు, నీ వ్యక్తిత్వం… ఇలా దేని ప్రాధాన్యత దానికి యిస్తే నీలోని నువ్వు కూడా మిగిలి ఉంటావు. ఆ నువ్వు క్రమంగా ఎదుగుతూ వచ్చి శూన్యం ఏర్పడినప్పుడల్లా ఆమేరకి ఆక్రమిస్తూ వస్తావు. వ్యక్తిత్వం అంటే నీలోని సృజనాత్మకత, క్రియాశీలత, నిర్మాణాత్మక, నీ హాబీ… అన్నీ కలిపి”
” ఈ పాఠాన్ని ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి నాన్నా? నాకు ఇప్పుడు చేతనైందల్లా భర్తనీ పిల్లల్నీ ప్రేమించటమే. బాబీ తిరస్కారాన్ని నేను భరించలేకపోతున్నాను”
” అది తిరస్కారం అని ఎందుకు అనుకుంటున్నావు మొక్కలకి నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసుకుంటాంగానీ చెట్లని కాదు కదా? వాడు పెద్దయ్యాడు. వసూ! ప్రేమించడానికి నీకు ఒక ఆలంబన కావాలి. అందుకు ఎవరితోనూ పోటీ పడకు. ప్రేమ కోసం తపించిపోతున్నవాళ్ళని వెతుకు”
తండ్రి మాటలు వసుంధర గుండెల్ని సూటిగా తాకాయి. వకుళ గుర్తొచ్చిందామెకి. భర్త తిరస్కరించాడు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. అయినా పెదాల మీది చిరునవ్వు చెక్కు చెదరదు. కళ్ళలోని మెరుపుల్ని కన్నీటి పొర ఎప్పుడూ కప్పదు. ఆమెకి కూడా మరోలాంటి జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుందేమో. కానీ సాధ్యపడనిదాన్ని వదిలేసి అందినదాన్ని మాత్రం ఆమెకి అనువుగా మలుచుకుంటోంది. తనకి కూడా ఏదో ఒక మార్గం ఉండకపోదు, ఈ తపన చల్లారడానికి.
ఆలోచిస్తూ లేచి నిల్చుంది.
“వెళ్లొస్తాను నాన్నా!” అంది.
” జీవితాన్ని అమృతప్రాయం చేసుకున్నా విషతుల్యం చేసుకున్నా అంతా మన చేతుల్లోనే ఉంది వసూ!” హెచ్చరించాడు.
” ఇప్పుడు ఈ బాధ్యత దేనికి?” కొంత అయిష్టంగా అన్నాడు రావు. అంత తేలిక వ్యవహారం కాదేమో! పిల్లలు ఏమంటారో! అనేక సందేహాలు వెలిబుచ్చాడు.
” బాధ్యతలన్నీ తీరిపోయి ఏ వ్యాపకం లేక వెలితిగా ఉంది. ఎప్పుడో మర్చిపోయిన చదువుని ఇప్పుడు పునరుద్ధరించాలని లేదు. అలాగని బయటికి వెళ్లి సోషల్ సర్విస్ చేయటం కూడా నా వల్ల కాదు. నాకు ప్రేమించడం తప్ప మరేదీ రాదు. ప్రేమించడానికి ఒక ఆలంబన కావాలి. నాన్నే అన్నారు, ఇంకా ఐదేళ్లో పాతికేళ్ళో బతుకుతానని. నేను మాత్రం బతకనా? ఒక పాపని పెంచుకుందాం” స్థిరంగా అంది వసుంధర.
ఆమె మాటల్లో సబబు కనిపించింది రావుకి. ఆ మాటల వెనుక మామగారి సలహా ఉందంటే భార్య కోరికలో కాదనటానికి ఏమీ లేదు. తాము ఇంత సంఘర్షించి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలు మన్నించకుండా ఉండరు.
ఇంట్లో మరో కొత్తపిల్ల తప్పటడుగులు, దోబూచులు మొదలవుతాయంటే తమాషాగా అనిపించింది. ఆ సాయంత్రమే ఆర్ఫనేజికి వెళ్లారు వివరాలు తెలుసుకుందుకు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.