నీలినక్షత్రం – 2 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

“ఆ నీలినక్షత్రాన్ని చూడు, చేతులు చాచి అందుకొమ్మని ప్రలోభపెట్టడంలేదు?” ఒక చీకటిరాత్రి ప్రణవితో అన్నాడు అభిజిత్.
“నాకలాగేం అనిపించడంలేదు. అదొక డెత్ ప్లానెట్ అంతే” నిర్మొహమాటంగా అందామె.
స్పేస్ రిసెర్చి సెంటర్లో సీనియర్ సైంటిస్టు. ఉమ్మడికుటుంబంలో పుట్టి , తల్లిదండ్రుల్తో కలిసి న్యూక్లియార్ కుటుంబంగా విడిపోయి , ఆఖరుకి సింగిల్ పర్సన్ కుటుంబంగా కుదించుకుపోతున్న వ్యవస్థకి ప్రతీక ఆమె. పెళ్ళిచేసుకుందిగానీ భర్తతో సరిపడక విడాకులు తీసుకుంది. ఇవన్నీ సమాజంలో కొత్తగా వస్తున్న మార్పులు.
అభిజిత్‍తో పరిచయమైంది. అయస్కాంతంలా ఆకర్షించాడతను. ఆరాటమంతా ఆమెదే. అతన్లో ఎలాంటి చలనం లేదు.
“అక్కడికి వెళ్ళాలనేది నా జీవితకాలపు కోరిక” నెమ్మదిగానే అయినా, స్థిరంగానే అన్నాడు.
ఆమె విషయంలో తనకీ శ్రీరాంకీ మధ్య జరుగుతుండే సంభాషణ గుర్తొచ్చింది. పెళ్ళిపట్ల తనకిగల భావాలనీ, విముఖతనీ స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే అలా అన్నాడు.
“అక్కడికా? ఏముందక్కడ?” వింతగా అడిగింది ప్రణవి.
“ఏమీలేకపోతే మరెందుకు ఆ గ్రహంమీదికి వెళ్ళటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎందర్నో ప్రలోభపెడుతోంది ఆ గ్రహం. అక్కడ మనుషులున్నారేమోనని అనుమానం అందరికీ”.
“అదే నాకూ అర్థంకావడంలేదు. వందలకోట్లు ఖర్చుపెడుతున్నారు ప్రయోగాలమీద. మనుషులెలా వుడగలరు? సీఎఫ్‍సీలూ, గ్రీన్‍హౌస్ వాయువులూ …వాటివలన మనుషులు భరించలేనంత వుష్ణోగ్రత. ఒకవేళ మనుషులు వున్నారనే అనుకుందాం. అలాంటి వాతావరణాన్ని తట్టుకోగలిగినవాళ్ళు ఎంత టఫ్‍గా వుంటారు? వాళ్ళు మనతో స్నేహం చేస్తారా? చేస్తారనే అనుకుందాం. దానివలన ఎవరికి లాభం? వెళ్ళాలన్నా రావాలన్నా ఒక జీవితకాలం పూర్తిగా పడుతుంది. వెళ్ళినవాడు తిరిగి రాలేడు. “
“ఏదో వుందక్కద. వెళ్తేగానీ ఆ ఆకర్షణ ఏమిటో తెలియదు” నవ్వేడతను.
“ఆడమ్స్ కేవ్‍లోంచీ ఆర్కియలఆజికల్ సర్వేవాళ్ళు ఏవో వస్తువులు, ఆర్గానిక్ శాంపిల్సు తెచ్చారట? రేడియోకార్బన్‍డేటింగ్‍లో అవి లక్షసంవత్సరాల క్రితంవని తేలిందట? అందులో ఒక చిప్ కూడా వుందట?”
“ఆ చిప్ ప్రస్తుతం నాదగ్గిరే వుంది. శ్రీరాం తెచ్చాడు”.
“నిజంగా కంప్యూటర్ చిపేనా అది? “
అతను తలూపాడు.
“అక్కడెందుకుంది?”
“అదే నాకూ అర్థంకావటంలేదు”.
“ఏముంది అందులో?”
వివరాలు చెప్పాలనిపించలేదు అభిజిత్‍కి ఇంకా అవి నిర్ధారించబడకపోవటంతో. “ఇంకా పూర్తిగా చూడలేదు” అన్నాడు.
ప్రణవి నవ్వింది.”చూసినంతవరకూ చెప్పు” అంది.
ఆమె మాటల్లో అల్లరీ వేళాకోళం వున్నాయి. భారతదేశపు సుప్రసిద్ధశాస్త్రవేత్తకికూడా వ్యక్తిగత జీవితం వుంటుంది. అందులోకి కొందరికి ప్రవేశం వుంటుంది. అభిజిత్ తన హృదయపు కవాటాలు ఎంత గట్టిగా మూసుకున్నా, ఏదో ఒక సందులోంచీ చొచ్చుకువచ్చే కాంతికిరణంలా ఆమె ప్రవేశించింది. ఆ చొరబాటుని గుర్తించి అతని ముఖం ఎర్రగా కందింది.
“అది లక్షసంవత్సరాలదని నువ్వు నమ్ముతున్నావా?” ఆమె ముఖంలో ఇంకా అల్లరి తగ్గలేదు.
“నీకెలా తెలుసు?”
“శ్రీరాం చెప్పాడులే. చెప్పి, నిన్ను కాస్త కనిపెట్టి వుండమని నాకొక బాధ్యత పెట్టాడు. అభీ! మనం పెళ్ళిచేసుకుంటే ఎలా వుంటుంది?” ఆరాటంగా అడిగింది.
“అంత బావుండదనుకుంటా. కనీసం శ్రీరాం, జీవనిల్లాకూడా వుండలేం మనం” అన్నాడు.
ఆమె నొచ్చుకుంది. విఫలమైన తన మొదటి పెళ్ళిగురించి చెప్తున్నాడనుకుంది. పల్చటి కన్నీటిపొర కదిలింది ఆమె కళ్ళలో. ఆ కన్నీటిని వింతగా చూసాడు అభిజిత్.
తను చెప్పాలనుకున్నది చెప్పేసాక అతనికి రిలీఫ్‍గా అనిపించింది. “ఒక టీంని ఈమాటు మనుషుల్తో పంపిస్తున్నారటకదా, అక్కడికి?” అడిగాడు.
“ఔను. త్వరలోనే” సర్దుకుని చెప్పింది.
“నాకందులో చోటు దొరుకుతుందా? …ఎందుకో తెలియదు, అక్కడికి వెళ్ళాలని బలమైన కోరిక. ఎంత బలమైనదంటే నేను చచ్చిపోతే భౌతికమైన ఇబ్బందులన్నీ దాటి నా ఆత్మ అక్కడికి వెళ్ళి రాగలదేమో, అలా వెళ్ళడానికి నా శరీరమే అడ్డేమోననిపించేంత.”
అతన్ని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడింది ప్రణవి. అది గుర్తించి అన్నాడు అభిజిత్.
“నేను నిన్ను సుఖపెట్టలేను ప్రణవీ! నాగురించి నాకు బాగా తెలుసు. ఎలాంటి అనుభూతులూ, మమకారాలూ తెలీవు నాకు. కనీసం నీ మనసేమిటో, నీకేం కావాలోకూడా గ్రహించలేను నేను.”
“అభీ!”
ఇద్దరూ మౌనంగా వుండిపోయారు చాలాసేపు.
“ఎందుకు నీకలాంటి కోరిక? ఎవరేనా పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూడాలనుకుంటారు, ఏవేనా కొత్త ప్రదేశాలకి వెళ్ళి వినోదాన్ని పొందాలనుకుంటారు, అంతేగానీ ఏమాత్రం సౌకర్యాన్నివ్వని సుదూరగ్రహంమీదికి వెళ్ళాలనుకోవదమేమిటి?” మెల్లిగా అడిగింది.
ఒక వ్యక్తి తనని ఆత్మనుంచీ వేరుగా చూసుకోగలిగేంత తాత్త్వికతని అలవర్చుకున్నాక అతన్ని వెనక్కి లాక్కురావటమనేది దాదాపుగా అసాధ్యం. అతనేమీ చిన్నపిల్లవాడూ, చదువుకోనివాడూ కాదు. అతని మాటల్లోనూ, ఆలోచనల్లోనూ పరిణతి వుంది. అలాంటివాడికి తనేం చెప్పగలదు?
“సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీదైతే వెళ్ళచ్చు. నలుగురికి అనుమతిస్తారనుకుంటా” మళ్ళీ తనే అంది.
“ఎవరేనా అప్లై చేసారా?”
“ఇంకా లేదు.”
“ఎంత రావచ్చు ఖర్చు?”
” వందకోట్లేమో!”
అతను కొద్దిసేపు ఆలోచించాడు. ఏవో లెక్కలు వేసాడు. “అంత డబ్బు నేను కట్టగలను. ప్రపోజల్ ఎప్పటికివ్వాలి ?” అడిగాడు.
“ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. అదయ్యాక నీకు చెప్తాలే” అంది. ఒకటి చెప్పాలి. సంకోచం అడ్డొస్తోంది. కానీ చెప్పాలి. ఎందుకంటే అతను ప్రేమికుడు కాదు. తనని ప్రేమించానని వచ్చిన అమ్మాయి మనసు చదివే శక్తి లేదని తనకి తనే వప్పుకున్నాడు. కాబట్టి తనే చెప్పాలి.
“వెళ్ళేముందు మనం పెళ్ళి చేసుకుందాం” మాటలు పేర్చుకుంటూ అంది.
“ప్రణవీ!”
“నిన్ను ప్రేమిస్తున్నాను అభిజిత్! నువ్వు నాకేమీ కావనుకోవడంకన్నా, నిన్ను చేసుకుని నీకోసం ఎదురుచూడ్డంలో నాకు సంతోషం వుంటుంది”.
“ఐతే తిరిగొచ్చాక చేసుకుందాం”
“లేదు, మనం పెళ్ళి చేసుకున్నాకే నువ్వు వెళ్ళటం”.
అభిజిత్ ఎటూ మాట్లాడలేకపోయాడు.
“ప్రణవి నామాట వినటంలేదు. పెళ్ళిచేసుకుందామంటోంది” ఇబ్బందిగా అన్నాడు అభిజిత్ శ్రీరాంతో.
“నాకు చెప్పినట్టే తనకీ చెప్పెయ్యలేకపోయావా?”
“చెప్పాను. వినటంలేదు. నేను నీలినక్షత్రంమీదికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు తనతో పెళ్ళి ఎలా కుదురుతుంది? ఎప్పటికి తిరిగొస్తానో! అసలు తిరిగొస్తానో, రానో!”
“రాననుకుంటే బాధగా లేదూ?”
“ఎందుకు బాధ?”
“ఔను! ఎందుకతనికి బాధ? ఉంటే తమకి వుండాలి. అతన్ని ఇష్టపడేవాళ్ళకీ, ప్రేమించేవాళ్ళకీ వుండాలి.


చిప్‍లోంచీ కాపీచేసుకున్న శ్రీసూక్తం, పురుషసూక్తం, గాయత్రీమంత్రం అలాంటివన్నీ చదివేసాడు. అవన్నీ అయాక చరిత్ర, కొన్ని నాగరీకతల వుద్భవ, వుత్థానపతనాలు. ఎప్పుడూ వినని వూర్లు, పేర్లు, రాజులు, రాజవంశాలు. అర్థంకాని తేదీలు. అదయ్యింది. సైన్సు, గురుత్వాకర్షణ సిద్ధాంతంనుంచీ అణ్వస్త్రాలదాకా. యంత్రం, బస్సు, రైలు, విమానం, రాకెట్, వుపగ్రహం, వాటి నిర్మాణాలు, బొమ్మలు.
అతనికి దిగ్భ్రమ కలుగుతోంది. అవన్నీ చదవాలంటే జీవితకాలం చాలదు. తన శక్తి చాలదు. ఒక రంగంలో అనికాదు, ఒక విషయంలో అనికాదు. అన్నిటి లోతుల్నీ అన్ని మూలాల్లోనూ పరిశోధించినట్టుగా వుంది.
శ్రీరాంని ప్రత్యేకించి పిలిచి చూపించాడు. అతనూ అలాగే చకితుడయ్యాడు. దాదాపుగా అవే సిద్ధాంతాలూ, సూత్రాలూ ఇప్పుడూ ఆచరణలో వున్నాయి. ఇంత నాలెడ్జి ఒకరిది కాదనిపించింది. అది లక్షసంవత్సరాలక్రిందటిదని మాత్రం ఏకీభవించలేకపోయాడు. వాళ్ళమధ్య ఆ వివాదం అలాగే వుండిపోయింది.


నీలినక్షత్రమ్మీదికి మనుష్యుల్ని పంపే ప్రతిపాదనమీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభిజిత్, ప్రణవి సివిల్ మేరేజి చేసుకున్నారు. ఒకరకంగా శ్రీరాం తన స్నేహంతోనూ, ప్రణవి తన కన్నీటితోనూ అతన్ని కట్టేసారు. ఆమె స్పర్శ అభిజిత్ అంతరంగంలో ఎక్కడో చిన్న కదలికకి కారణమైంది. చిన్నప్పుడెప్పుడో తన ఆంతరంగిక ప్రపంచంనుంచీ దూరంగా నెట్టేసిన అమ్మ లాలన గుర్తొచ్చించి. ఇంకా చిన్నప్పుడు అమ్మకి అటూఇటూ చెరొకరూ పడుక్కున్నప్పుడు చెల్లి వుంగరాల జుత్తులో విచ్చుకున్న మల్లెపూల పరిమళాలు గాల్లో తేలి వచ్చి తనని తాకడంకూడా.
“తనేమిటి? ఈ రాగబంధాలేమిటి?” వింతగా అనుకున్నాడు.
ప్రణవితో కలిసి తల్లిదండ్రులని చూడటానికి వెళ్ళాడు. అతన్ని మళ్ళీ తమదగ్గిరకి తీసుకొచ్చిన ప్రణవిని వాళ్ళెంతో ఆదరించారు. ఇంతలోనే అతను అశనిపాతంలాంటి తన నిర్ణయాన్ని ప్రకటించాడు, నీలినక్షత్రమ్మీదికి వెళ్ళబోతున్నానని. వాళ్ళు విచలితులయ్యారు.
“కష్టమో, సుఖమో వాడి దారిలో వాడు బతుకుతున్నాడు. బిడ్డ మాకు దూరమైనా వాడి ఖ్యాతి పిల్లతెమ్మెరలా వచ్చి మమ్మల్ని తాకి ఓదార్చిపోతుంది. నువ్వెందుకమ్మా, వాడి జీవితంతో ముడిపెట్టుకున్నావు? “కన్నీళ్ళతో ప్రణవిని దగ్గిరకి తీసుకుని అడిగింది అభిజిత్ తల్లి. చిరునవ్వే ప్రణవి జవాబైంది.
ఒకసారి విఫలమై మరోపెళ్ళి చేసుకున్న ప్రణవి మనోభావాలు ఎలా వుంటాయో ఆమె తల్లిదండ్రులకి తెలుసు. ఆమె సంతోషంగా వుంటే చాలుననుకున్నారు.


దేశాధినేత దగ్గిర్నుంచీ పోనొచ్చింది అభిజిత్‍కి , వచ్చి కలవమని. ఇద్దరూ ఒకేచోట రిసెర్చి చేసారు. అభిజిత్ సైన్సూ టెక్నాలజీవైపు వెళ్తే ఆయన పొలిటికల్ సైన్సూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో పీహెచ్‍డీ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాగానే అర్థమైంది, రాజకీయానికి కావలిసినది చదువుకన్నా ఎక్కువగా ఎత్తులూ పైయెత్తులూ జిత్తులూ అని. తనకి సరిపోని చొక్కాలో ఇరుక్కున్నట్టు కొద్దిగా ఇబ్బంది. ఐనా సమర్ధవంతుడిగానే ప్రజలచేత గుర్తించబడ్డాడు. దేశపు అత్యున్నత పదవికి రెండోసారికూడా ఎన్నికయాడు.
అభిజిత్ వెళ్ళి ఆయన్ని కలిసాడు. మిగిలిన మీటింగ్సూ , అపాయింట్ మెంట్సూ కేన్సిల్ చేసి దాదాపు నాలుగ్గంటలు మాత్లాడాడు ఆయన.
“ఆడంస్ కేవ్‍లో దొరికిన చిప్ మీదగ్గిరుందటకదా? నాకు తెలిసింది” అడిగాడు. అభిజిత్ తలూపాడు. “ఏం వుంది అందులో? అసలది అక్కడికెలా వచ్చింది? ఎనీ ఐడియా?” ఆయన ప్రశ్నలకి చాలా సుదీర్ఘంగా మాట్లాడాడతను.
“ఆ చిప్ నిజంగా లక్షసంవత్సరాలనాటిదైతే హ్యూమన్ ఇవల్యూషన్‍కి సంబంధించిన రహస్యాన్ని తనలో ఎక్కడో దాచుకుందనే నేననుకుంటున్నాను. ఇంకా నాకు అంతుచిక్కలేదు” అన్నాడు చివరికి.
అభిజిత్ అంత కాన్ఫిడెంట్‍గా చెప్పాడంటే అతని వూహ నిజమే ఔతుంది. కానీ హ్యూమన్ ఇవల్యూషన్ గురించి ఇప్పటికే చాలా సిద్ధాంతాలున్నాయి. వాటన్నిటినీ ఇది కాదంటే ఆయా శాస్త్రవేత్తలు ఎంతో బలంగా నిర్మించుకున్న నమ్మకాల పునాదులు కదుల్తాయి. అది వారి మనోభావాలని దారుణంగా దెబ్బతీస్తుంది. మతపరమైన విశ్వాసాలుకూడా దెబ్బతింటాయి. అది రాజకీయంగా గొడవలకి దారితీస్తుంది. తనని పదవినుంచీ తొలగించే ప్రయత్నం జరగచ్చు. దానివలన దేశం ఎంతో నష్టపోతుంది…తన దేశం…స్వార్థపరుల చేతుల్లోంచీ బైటపడి ఇప్పుడిప్పుడే నిజమైన ప్రగతిని సాధిస్తున్న తన దేశం… ఇదంతా జరగడం దేశాధినేతకి ఇష్టంలేకపోయింది.
“మీరు నాకొక మాట ఇవ్వాలి” అన్నాడు.
ఏమిటన్నట్టు చూసాడు అభిజిత్.
“ఆ చిప్‍లో వున్నవి మీకూ నకూ మధ్యనే వుండిపోవాలి. ఇప్పటికే దేశం ఎన్నో సమస్యల్లోంచీ బైటపడి ఇప్పుడే కుదురుకుంటోంది. ఇది మతానికీ మౌఢ్యానికీ సంబంధించిన విషయం. ప్రజలు వప్పుకోరు. వాళ్ళు వప్పుకున్నా రాజకీయనాయకులు వూరుకోరు. వాళ్ళని ఎగేస్తారు. మీరు అందులోని విషయాలు బైటపెడితే మీమీద దాడి జరగవచ్చు. మతకల్లోలాలకి కారణముతున్నారని బహుశ: నేనే మీ అరెస్టుకి ఆర్డరు ఇవ్వవలసివుంటుందేమో! అలా చేయటం నాకిష్టంలేదు. అలాంటప్పుడు మీకు మద్దతిస్తున్నానన్న కారణాన్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరగవచ్చు. అప్పుడుకూడా మీరు అరెస్టుకాక తప్పదు. నేను ప్రజాబలంమీద ఎన్నికైనవాడినేగానీ రాజకీయ శక్తులముందు ప్రజాబలం ఎందుకూ పనికిరానిది” అన్నాడు.
అభిజిత్‍కి అర్థమైంది. చిరునవ్వు నవ్వాడు. అతనికి ఇవన్నీ తెలీనివి కాదు. ప్రిమియర్‍కి ఎన్నో ఆశయాలున్నాయి. ఎన్నో ఆకాంక్షలున్నాయి. ఈ దేశప్రజలకి అవన్నీ కావాలి. అవన్నీ చెయ్యాలంటే పదవి వుండాలి. ప్రతిపక్షాలు దేశాధినేతని దింపాలని డెస్పరేట్‍గా వున్నాయి. ఏ చిన్న కారణమైనా చాలు, అల్లకల్లోలం సృష్టించడానికి. అందుకే సమ్మతిసూచకంగా తలూపాడు.
“అంటే ఆ విషయాలన్నీ అజ్ఞాతంలో వుండిపోవలసినదేనా? ” అడిగాడు అతని గొంతులో కొద్దిగా బాధ.
“కాదు. ముందుగా బయటపెట్టాల్సినది మీరుకాదు. మిగిలినవాళ్ళని మాట్లాడనిద్దాం. కొంత చర్చ మొదలౌతుంది. ఆ తర్వాత మీరు కూల్‍గా మీ పరిశోధన ప్రకటించండి. ఏ ఒకరిద్దరు రిసెర్చిస్కాలర్లో తప్ప ఎవరూ దాన్ని పట్టించుకోరు. వాళ్ళ థీసిస్‍లలో అది శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరు తెలుసుకున్న విషయాలలో తక్షణ ప్రజాప్రయోజనం అంటూ ఏదీ లేదుకాబట్టి దయచేసి విషయాన్ని వివాదాస్పదం చెయ్యద్దు” నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు.
కొద్దిసేపు ఇద్దరూ జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు అభిజిత్.
“నీలినక్షత్రం మీదికి మనుష్యులని పంపిస్తున్నారటకదా?”
“శాస్త్రవేత్తల ఫోరం కోరుతోంది.ఇంకా ఫైలుమీద నిర్ణయం తీసుకోవలసి వుంది. ఆర్థికశాఖ అనుమతికూడా కావాలి. చాలా ఖర్చుతోకూడిన వ్యవహారంకదా? ఇంకొకవిధంగా చెప్పాలంటే అనవసర వ్యవహారంకూడా” అన్నాడు ప్రిమియర్.
అభిజిత్ నవ్వి “మీరుకూడా అనవసరమని అనుకుంటున్నారా?” అని అడిగాడు.
“కాక? ఎక్కడో మనుష్యులున్నారేమోనని వెతకడానికి ఇంత ప్రజాధనం ఖర్చుపెట్టడం అవసరమంటారా?”
“నిజానికి అంత ఖర్చు అవసరంలేదనుకుంటా. లేజర్ టెక్నాలజీగానీ నానో టెక్నాలజీగానీ వుపయోగించి ఆ గ్రహంమీదికి ఒక బలమైన కిరణాన్ని లేదా తాడునీ పంపించి దాన్ని రోప్ వేగా వాడుకుని వెళ్ళవచ్చు. చాలా చవకైనది. తక్కువకాలంకూడా పడుతుంది”
“కానీ మన శరీరం అంత వేగాన్ని భరించలేదనుకుంటాను”.
“పాజిటివ్‍గా ఆలోచించి సాధ్యాసాధ్యాలగురించి ప్రయోగాలు చేస్తే బావుంటుంది. అక్కడి విషయాలు తెలుసుకోవటానికీ అక్కడికెళ్ళటానికీ ఇంకో ఆప్షన్ కూడా వుంది. అక్కడినుంచీ మనకి వస్తున్న కాంతి దాదాపు యాభై సంవత్సరాలనాటిది. ఆ కాంతి కిరణం మన గ్రహంమీద పడి పరావర్తనం చెంది దృశ్యంగా ఏర్పడుతుంది. అది ఆ గ్రహపు గతం. దూరంవలన మనకి ఆ దృశ్యం కనిపించదు. ఆ కాంతికిరణాలని పట్టుకుని వాటితో ప్రయాణించగలిగితే…”
ప్రిమియర్ చిరునవ్వు నవ్వాడు. “ఇప్పుడుకూడా వేగమే మనకి ఆటంకం. కాంతిని మించి కాదుకదా, కాంతివేగంతోకూడా మనం ప్రయాణించలేం”.
“యోగా అని ఒక ప్రాచీన ప్రక్రియ వుంది. అందులో సమాధిలోకి వెళ్ళి శరీరాన్నీ ఆత్మనీ విడగొట్టచ్చు. అలా విడుదల పొందిన ఆత్మ పదార్థం కాదుగాబట్టి దానికి భౌతికమైన హద్దులుండవు. వేగానికి సంబంధించిన నియంత్రణలు వుండవు. అది వెళ్ళి రాగలుగుతుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు అందుబాటులో లేదు…”
“ఒకవేళ ఎవరేనా అలా వెళ్ళినా అది ప్రామాణికంకాదు” అతన్ని మధ్యలోనే ఆపి తను పూర్తి చేసాడు ప్రిమియర్ .
అసాధ్యమైన విషయాన్ని సాధించడానికి మూడు అసాధ్యమైన మార్గాలని చెప్పిన అభిజిత్ దగ్గిర సాధ్యపడే మార్గం వుండకపోదని ఆయనకి తెలుసు.
“మనిషి జీన్స్…పుట్టుగుడ్డివాడికి కలలుండవు. ఎందుకంటే అతడికి దృశ్యాలు తెలియవుకాబట్టి. కానీ కలలలాంటి కొన్ని స్పందనలుంటాయి. అవి అతని జన్యువుల్లో నిక్షిప్తమై వున్న అనుభవాలు కావచ్చు. డీఎన్‍ఏని తొంభయ్యేడు శాతం డీకోడ్ చెయ్యగలిగాం. మనిషి మెదడుని పదిహేనుశాతం మాత్రమే వాడుకుంటున్నాం. ఆ మిగిలిన మూడు శాతం డీఎన్‍ఏని డీకోడ్ చేసి, మిగిలిన ఎనభయ్యైదు శాతం మెదడులో ఏముందో తెలిస్తే సృష్టిరహస్యం తెలియవచ్చు”.
ప్రిమియర్ చకితుడై చూశాడు అతన్ని. ఎంత అద్భుతమైన విశ్లేషణ.
“ఇవేవీ ఇప్పట్లో సాధ్యపడవుకాబట్టే మామూలుపద్ధతుల్లో నీలినక్షత్రంమీదికి వెళ్ళి రావాలనుకుంటున్నారు. నిజంగా అది ఒక అద్భుతమైన అనుభవంకదా?” అడిగాడు అభిజిత్.
“అందుకే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీద ఎవరేనా ముందుకి వస్తే పంపాలనుకుంటున్నాను. తన జీవితకాలాన్నీ , సంపాదించిన మొత్తాన్నీ ఖర్చుపెట్టి వెళ్ళాలనుకునేవాళ్ళు ఎవరూ వుండరని నా నమ్మకం”.
“నాకివ్వండి ఆ అవకాశం” నెమ్మదిగా అన్నాడు అభిజిత్.
ఒక్క క్షణం ఆ గదిలోని పరిసరాలన్నీ దిగ్భ్రాంతిచెందినట్టు మూగవోయాయి.
“మీరా?!!” తేరుకుని అడిగాడు ప్రిమియర్. ఆయన మనసు బాధతో నిండిపోయింది, ప్రణవి అప్పటికే అతని తాత్త్వికతతోసహా అన్ని విషయాలూ చెప్పి వుండటంతో.
“ప్రణవి నా ప్రతిపాదన చెప్పలేదా?”
“చెప్పింది” జవాబు అంత బలంగా లేదు. ఆ క్షణాన్నే తను సంతకం పెట్టాల్సిన ఆ ఫైలుగురించి నిర్ణయం తీసేసుకున్నాడాయన. ఆ చిప్ గురించి ఆయనా, తన అవకాశాన్నిగురించి అభిజిత్ మరోసారి చెప్పుకున్నాక పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు.