నీలినక్షత్రం – 4 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

నాన్న రిపోర్టులు వచ్చాయి.కేన్సరు నిర్ధారణైంది.నా నిర్ణయం బలపడింది. ఈ భూమ్మీద వుండటానికి నాకింక ఏ కారణం కనిపించలేదు.
అనేక వడపోతలతర్వాత ప్రీఫైనల్ సెలక్షనైంది. పన్నెండుమందిని ఎన్నుకున్నారు. అందులో నేనున్నానన్న విషయం… నేనుండటానికి కారణం ప్రొఫెసర్ మిత్రా అన్న విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసాయి. ఆయన్ని కలిసి కృతజ్ఞతలు చెప్తే నవ్వి…
“ఇలాంటి ప్రయోగానికి ముందుకు వచ్చినందుకు నీకు మన దేశమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరా! నువ్వు ఫైనల్స్ దాకా వెళ్ళాలనీ, ఆ తర్వాతకూడా అనుకున్నది సాధించి తిరిగి రావాలనీ నా ఆకాంక్ష. నీకంత ఆయువునివ్వాలని దేవుణ్ణి కోరుకుంటాను” అన్నాడు.
“ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? చంద్రుడిమీదికో, రోదసిలోకో ఒకసారి వెళ్ళి రావటం వేరు. ఇంక తిరిగిరావటానికి అవకాశమేలేని చోటికి అసలలాంటి చోటు వుందోలేదో అని వెతుక్కుంటూ వెళ్ళటం వేరు” అన్నారు స్నేహితులు. అందర్లోనూ కదలిక. అందర్లోనూ బాధ.
“అమ్మకి కేన్సరు. నాన్నకి కేన్సరు. బామ్మకి ఇప్పటికి మూడుచోట్ల వచ్చింది. పక్కింటివాడికి కేన్సరు. ఎదురింట్లోవాడికి కేన్సరు. నాకు రాదనేమిటి? ఇక్కడే వుందామనుకున్నా, ఇక్కడ వున్నదేమిటి? ఇక్కడే వుండాలని మనకి ఆసక్తి పుట్టించేదేమిటి? ఆక్సిజెన్ మాస్కులు పెట్టుకుని, ఇన్సులేషన్ సూట్లు వేసుకుని, ఏసీగదుల్లో బంధించుకుని వుంటున్నాం. అలా నిరర్ధకంగా బతికి చచ్చిపోవడంకన్నా ఒక ప్రయోజనంకోసం వెళ్ళటంలో తప్పులేదుకదా? ” అన్నాను.
“కేన్సరుకి భయపడి వెళ్తాననకు. అందులో అర్థంలేదు. స్టెమ్ సెల్ టెక్నాలజీ బాగా డెవలప్ ఔతోంది. శరీరంలోని ఏ భాగానికి కేన్సరు వచ్చినా, అది తీసేసి కొత్త అవయవాన్ని సృష్టించేదిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. చాలావరకూ విజయవంతమయ్యాయికూడా” అన్నాడు మహేష్.
“ప్రయోగాలతోటీ, వైద్యాలతోటీ తప్ప మనిషికి సహజమైన మనుగడలేదా?” అన్నాను.
అతను మాట్లాడలేదు. అతనికి నేనంటే చాలా ప్రేమ. నన్ను నా ప్రయత్నంనుంచీ విరమింపచెయ్యడానికి చాలా ప్రయత్నించాడు. అతన్ని నాదారిలోకి లాకురావాలని నేను ప్రయత్నించలేదు. ప్రేమ అనేది నాకిప్పుడు చాలా చిన్న విషయంలా అనిపిస్తోంది.


రెండేళ్ళ కఠిన శిక్షణ మొదలైంది. వ్యోమనౌకల్లో ఏళ్ళతరబడి గడపడానికీ , సమాజానికీ మనుష్యులకీ అలవాటైన పరిసరాలకీ దూరంగా వంటరిగా గడపడానికీ ముందు శిక్షణ మొదలైంది. అలా అంచెలంచెలుగా శిక్షణ పూర్తయేసరికి నలుగురమే మిగిలాం. మిగిలినవారు తట్టుకోలేక మధ్యలోనే వెళ్ళిపోయారు. నలుగురం తెలుగువాళ్ళమేకావటం యాదృచ్చికమని పూర్తిగా చెప్పలేను. అదొక విశేషం. ప్రపంచప్రఖ్యాతిగాంచిన ఐఐటీలనీ , ఐటీ ఇండస్ట్రీనీ తమ ప్రతిభతో నింపి, ప్రపంచంలో ఏమూల ఏ కొత్త వొరవడి మొదలైనా దాన్ని అందిపుచ్చుకుని ఆస్వాదించే జాతి విషయంలో అది కేవలం యాదృచ్చికం కాదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వున్న కోట్లమంది తెలుగువాళ్ళలో మేం నలుగురం సెలక్టవ్వడం, మిగలటం యాదృచ్చికం.
అవంతి, గౌతమ్ కాలేజిలో చదువుకుంటున్నప్పటినుంచే ప్రేమికులు. అవంతికోసం అతనీ నిర్ణయం తీసుకున్నాడు. శిక్షణ తట్టుకోలేకపోయినా ఆమెకోసమే వుండిపోయాడు. నాకు మిగిలిన ఆప్షన్ హర్ష. అలాగే అతనికి నేను. ఈ పరిస్థితి ఇద్దర్లోనూ ఇబ్బందిని కలిగించింది. పెళ్ళిప్రస్తావన మామధ్య రాకుండా జాగ్రత్త పడేవాళ్ళం. కానీ అది అనివార్యమని తెలుసు.
“నీ ఫ్రెండ్ ఎవరేనా వుంటే చెప్పు మీరా, నేను తప్పుకుంటాను. గ్రహాంతరయాత్ర ఒకటే కాదుకదా, దీతో ఎన్నో ముడిపడి వున్నాయి” అన్నాడు ఆఖరికి ఒకరోజు.
నేను నవ్వి, “నాకలాంటి స్నేహితులెవరూ లేరు. నీదగ్గిర చనువు పెరగటం లేదు. అంతే” అన్నాను.
“ఎలా పెరుగుతుంది? నువ్వలా మాట్లాడకుండా గిరిగీసుకుని కూర్చుని వుంటే?” అల్లరిగా అడిగాడు. “నాకు నువ్వంటే ఇష్టమే. మనవి పెళ్ళిచూపులనుకుందాం. వెనుకట వుండేవటకదా?” చిన్నగా నవ్వి అన్నాడు. అది మొదలు, అతనిపట్ల ఆకర్షణ మొదలవ్వటానికి. ప్రేమపుట్టిందని నేననను. కానీ అతన్ని జీవిత భాగస్వామిగా స్వీకరించటానికి నా మనసు సిద్ధమవసాగింది. నాకు నా ప్రయోగం ముఖ్యం. అలాగే అతన్నిక్కూడా. అదే మాయిద్దరినీ కలిపి వుంచే బంధమైంది.
చివరికొచ్చేసరికి మేము భూమ్మీద వున్నామన్న విషయాన్ని దాదాపుగా మర్చిపోయాం. శిక్షణ పూర్తయేసరికి ఎన్నో అనూహ్యమైన మార్పులు. పంజరంలోని చిలుకల్లాంటి మనుషులస్థానంలో అస్థిపంజరాల్లాంటివాళ్ళు మిగిలారు. భూమ్మీద ఇంకా మిగిలి వున్న వనరుల్ని కబ్జా చేసేందుకు ప్రపంచదేశాలమధ్య యుద్ధం జరిగిందట. అణ్వస్త్రాల ప్రయోగంకూడా జరిగింది. కొన్ని దేశాలు, ప్రాంతాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇంకొన్ని దేశాలు నామావశిష్ఠంగా మిగిలాయి. యుద్ధాన్ని ప్రేరేపించి లాభాన్ని పొందాలనుకున్న దేశంకూడా తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింది.
సామాన్యపౌరులని పట్టించుకోకుండా నిర్లజ్జగా వదిలేసారు పాలకులు. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో బ్రతకడానికి అనువైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించుకుని బ్రతుకుతున్నారు. పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశగల ఇంకొందరు వెయ్యీ రెండువేల సంవత్సరాలకి హైబర్నేషన్లోకి వెళ్ళారు. వాళ్ళ వివరాలన్నీ మాదగ్గిర వున్నాయి. మేం తిరిగి వచ్చాక వాళ్ళని నిద్రలేపాలి.
ఇళ్ళకి వెళ్ళి కుటుంబసభ్యులని ఆఖరిసారి కలుసుకోవడానికి మాకు అనుమతినిచ్చారు. నలుగురం కలిసే తిరగాలని నిర్ణయించుకున్నాం. ముందుగా మాయింటికి వెళ్ళాం. చివరిసారి అమ్మనీ, నాన్ననీ చూసాను. అమ్మ జీవితంపట్ల విసిగిపోయి వుంది. నా ప్రయాణంగురించి విన్నట్టుంది, ఏడ్చేసింది.
“చదువులు, చదువులనుకున్నాంగానీ మీకు మనుగడలేకుండా చేస్తున్నామనుకోలేదు. మీతరం మమ్మల్ని క్షమించదు. అదొక వూబి అని ఇప్పుడే తెలిసింది” అంది.
“అలా బాధపడకండి. మీరా తీసుకున్నది చాలా మంచి నిర్ణయం. ప్రపంచంలో ఎవరికీ దొరకని అవకాశం తనకి దొరికింది” హర్ష వోదార్చాడు. అతను మాయింట్లో వున్న దు:ఖపు వాతావరణాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు.
“మైగాడ్, మీరా! ఇక్కడి వాతావరణం , పరిస్థితులు ఇంత భయంకరంగా వున్నాయేమిటి? ఒక్క మీ యింట్లోనేనా, అంతటా ఇలానే వుందా? మీతో పోల్చుకుంటే మేము చాలా మెరుగు” అన్నాడు. అతనిది కాలిఫోర్నియా. నాలుగోతరం పౌరుడతను. అక్కడినుంచీ ఎంపికయ్యి నేరుగా ట్రేనింగ్ సెంటరుకే వచ్చేసాడు.
నేను కొంచెం పదునుగానే జవాబిచ్చాను. “ఇక్కడి మధ్యతరగతి ప్రజలు తిండి తినడంవల్లనే ప్రపంచంలో ఆహారకొరత వచ్చిందని మీ దేశాధినేత కొన్ని దశాబ్దాలక్రితం చెప్పాడట. అలాగే మాదగ్గిర పెట్రోలు వాడకం పెరగదంవల్లనే ప్రపంచంలో ఇంధనంకొరత వచ్చిందనికూడా చెప్పాడట. ఆయన అప్పుడేం చెప్పాడోగానీ చాలా కరెక్తుగా చెప్పాడు హర్షా! మేం తిండికూడా తినలేని పరిస్థితుల్లో వున్నంతకాలం, మాకు కార్లూ, బైకులూ లేకుండా వున్నంతకాలం మీరుమాత్రమే గ్రీన్‍హౌస్ వాయువుల్ని వదుల్తూ క్యోటో వప్పందాన్ని ధిక్కరిస్తూ చాలా హాయిగా వుండగలిగారు. ఇప్పుడుకూడా మీ ఈ వేస్ట్‌ని మామీద డంప్ చేస్తున్నారుకాబట్టే అక్కడ సురక్షితంగా వుండగలుగుతున్నారు” అన్నాను.
అతని ముఖం మ్లానమైంది. “అయాం సో సారీ!” అన్నాడు, రెండుచేతుల్లో ముఖం దాచుకుని. చాలా హర్టయాడు.
“అది వాళ్ళ తప్పుకాదు. మనం వప్పుకోబట్టే వాళ్ళలా చెయ్యగలిగారు. దేశాధినేతల్లో ప్రజాసంక్షేమంపట్ల చిత్తశుద్ధి వుండాలి. అదిలేని దేశంకానీ, జాతిగానీ ఇలాగే వుంటాయి. మనం సరైన నేతల్ని ఎన్నుకోవటంలో పొరపాటు చేసాం” అమ్మ నా మాటల్ని విబేధించింది.
నేను వచ్చిన విషయం తెలిసి మహేష్ నన్ను కలవటానికి వచ్చాడు.
“నువ్వు వెళ్ళబోయేముందు నిన్ను కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అడుగుదామనుకున్నాను మీరా! నీలో ఎక్కడో చిన్న బలహీనత ఏర్పడి నిర్ణయాన్ని మార్చుకుంటావనుకున్నాను. కానీ నిన్నిప్పుడు చూస్తుంటే నీముందు నేను చాలా చిన్నగా, కొండముందు ఎలుకలా అనిపిస్తున్నాను. ప్రేమకన్నా ధ్యేయం గొప్పది. నేను నిన్ను డైవర్టు చేసి వుంటే ఇటువంటి రోజుని నన్ను నేను క్షమించుకోగలిగేవాడిని కాదు” అన్నాడు నన్ను ఆరాధనగా చూస్తూ. హర్షని పరిచయం చేసాను. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
“నన్ను మర్చిపోయి పెళ్ళిచేసుకో మహేష్! నాకు నువ్వెప్పుడేనా గుర్తొస్తే గుండె బరువెక్కకూడదు” అన్నాను.
“తప్పకుండా మీరా! ఒక చక్కటి పాపని కని నీగురించి అందమైన కథ చెప్తాను. సుదూరంగా వున్న నక్షత్రాలని చూపిస్తూ నా స్నేహితురాలు అక్కడ వుందని చెప్తాను” అన్నాడు వుద్వేగంగా. నేను నవ్వాను. ఇంకా తెలిసినవాళ్ళూ, బంధువులూ చాలామంది వచ్చారు. ఎలాంటి జీవలక్షణాలు లేనివాళ్ళందరినీ చూసి హర్ష కదిలిపోయాడు.
అమ్మ నాకూ అవంతికీ కొత్త చీరలిచ్చింది. “ఈ చీరతో నిన్ను పెళ్ళికూతుర్ని చెయ్యాలనుకున్నాను” అంది. నేను నా చీరని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. నాన్న కాళ్ళకి నమస్కరించాను. ఆయన ప్రేమగా దగ్గిరకి తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. అమ్మ ఇచ్చిన చీరని చేతిలోనూ నాన్న స్పర్శని గుండెలోనూ అపురూపంగా దాచుకుని గడప దాటబోతుంటే –
“ఒక్క క్షణం మీరా!” అని ఆపాదు హర్ష.
ఏమిటన్నట్టు చూసాను.
“ఆ చీర కట్టుకుని రా!” అన్నాడు.
నాకతని అభిప్రాయం అర్థమైంది. తృటిసేపు నాలో సంకోచం. దాన్ని గెలిచి చీర మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంటే అతనూ నాతో వచ్చాడు. గది తలుపులు దగ్గిరగా వేసి, నా రెండు భుజాలనీ తన చేతుల్తో పట్టుకుని, తనవైపు తిప్పుకుని కళ్ళలోకి చూస్తూ అన్నాడు,” జరిగినదంతా ఏ ప్రభుత్వ విధానాలవల్లేనా జరగనీ, నీకూ మీదేశానికీ ఇలాంటి ఎన్నో దేశాలకీ జరిగిన అన్యాయానికీ, నీ గుండెల్లోని విషాదానికీ, నీ కళ్ళలోని కన్నీటికీ , ఒక మనిషిగా క్షమార్పణ చెప్పుకుంటున్నాను” అన్నాడు . అతని కళ్ళలో కన్నీళ్ళు. “నిన్ను చివరిదాకా గుండెల్లో దాచుకుని నాతో గడిపే ప్రతి క్షణాన్నీ ఎంతో ఆనందదాయకంగా వుండేలా చూసుకుంటాను”
అ క్షణంనుంచే అతను నాలో ఆనందాన్ని సృజించినట్టు అనిపించాడు. ఇప్పుడు అతన్ని చేసుకోవడంపట్ల నాకు ఎలాంటి సంకోచమూ లేదు.అతను గదిలోంచీ బైటికి వెళ్ళగానే చీర మార్చుకుని వచ్చాను.
“మీకు సంతోషమా?” నా చెయ్యిపట్టుకుని , వంగి అమ్మ కాళ్ళకి నమస్కరిస్తూ అడిగాడు. ఇద్దరం వుంగరాలు మార్చుకున్నాం. అంటే ఏం లేదు. అప్పటికప్పుడు కొత్త వుంగరాలు ఎక్కడినుంఛీ వస్తాయి? అందుకని మా చేతి వుంగరాలని తీసి మళ్ళీ మేమే ఒకరికొకరం తొడుక్కున్నాం.”మేం వెళ్ళేచోట ఎలాంటి ప్రభుత్వమూ, చట్టాలూ వుండకపోవచ్చు. కాబట్టి ఎలాంటి అతిక్రమణలుకూడా వుండవు” చట్టబద్ధంగా కాని మా పెళ్ళిగురించి హామీ ఇచ్చాడు .
“మాకన్నా మీరు చాలా ఫాస్ట్. మేం ఇంకా ప్రేమించుకుంటునే వున్నాం. మీగురించి ఆలోచిస్తున్నాం. అప్పుడే పెళ్ళికూడా చేసేసుకున్నారు ” అంది అవంతి కినుకగా. మహేష్ మన:పూర్వకంగా అభినందించాడు.
“మళ్ళీ ఎప్పుడొస్తారు? ఎనీ ఐడియా?” అడిగాడు.
“తెలీదు” జవాబిచ్చాను.
“ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయని ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎవరూ అనుకుని వుండరు. అయాం సో సారీ!” అన్నాడు. అందర్లోనూ ఏదో తెలియని పశ్చాత్తాపం.
వచ్చినవాళ్ళంతా ఏవేవో ప్రశ్నలడుగుతున్నారు. వాళ్ళందరికీ చెప్పగలిగినంత చెప్పాను.
“ఐనా ఈ పరిస్థితుల్లో అమ్మనీ నాన్ననీ ఇలా వదిలేసి వెళ్ళటం అవసరమా?” అని అడిగారు ఒకరు. ఆ ప్రశ్న ఎదుర్కుంటానని నాకు తెలుసు. జవాబు తెలుసు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగే శక్తి లేదు.
“ఈరోజు నా భార్య, రేపు నేను. ఇద్దరికీ డెత్ సెంటెన్సు రాసే వుంది. మా తర్వాత? అప్పుడీ అవకాశం రాదుకదా? ఏదో చేస్తానంటోంది. చెయ్యనిద్దాం. ఇక్కడుండి మాకు తను చేసేదేముంది?” నాన్న స్థిరంగా చెప్పారు. ఈ మాటలకి నేనెక్కడా కదిలిపోకూడదన్న ఆకాంక్ష వుంది ఆ మాటల్లో.
భూమ్మీద ఇంకెంతోకాలం మనుషులు వుండలేరన్నది ఎవరికీ అర్థంకాని విషయం. ఇప్పుడు బతకట్లేదా, ఏదో ఒకలా బతక్కపోతామా అనుకుంటున్నారు. విజ్ఞానానికీ అజ్ఞానానికీ మధ్య తేడా స్పష్టంగా అర్థమైంది మా అందరికీ. ఐతే ఒక సెకనుపాటు వాళ్ళన్నదే సరైనదేమోననిపించింది. తెలీనితనం తెలివిడిని మంచులా కప్పేస్తుంది. తర్వాత సర్దుకున్నాను.
అమ్మానాన్నల కన్నీళ్ళు, ఐనవాళ్ళ విషాదం మధ్య ఇంట్లోంచీ వీడ్కోలు తీసుకున్నాను.
****4
అవంతీవాళ్ళది కశ్మీరు. తల్లీతండ్రీ అక్కడ జరిగిన అల్లర్లలో చనిపోయారు. నాయనమ్మ ఒక్కర్తే వుంది. ఆవిడే అవంతిని పెంచింది.అక్కడ విపరీతమైన ఎండలు. గ్లేషియర్లన్నీ కరిగి వరదల్తో ముంచెత్తుతున్నాయి. హిమాలయాలు మంచుదుప్పటిని తొలగించుకుని ఏ క్షణాన్నేనా పేలడానికి సిద్ధంగా వున్నట్టు పొగలూ ఆవిర్లూ చిమ్ముతున్నాయి.
అవంతి ఇంక తిరిగిరానిచోటికి వెళ్తోందంటే కొద్దిసేపు మాటలు రానట్టు వుండిపోయింది. ఆవిడకిదంతా ఇంత వివరంగా తెలీదు. అవంతి చెప్పలేదు. చెప్తే వెళ్ళనివ్వదని.
“నువ్వు పెళ్ళిచేసుకుని భర్తతో ఎక్కడికేనా వెళ్ళు. నాకెలాంటి అభ్యంతరం లేదు. నీగురించి ఆలోచించేవాళ్ళు, నీ మంచికోరేవాళ్ళు ఇంకొకరున్నారంటే నాకు నిశ్చింత. నిన్ను వంటరిగా పంపి, ఇక్కడుండి నువ్వెలా వున్నావోనని నీగురించి బెంగపడలేను” అంది , కొద్దిసేపటికి తెప్పరిల్లి.
అవంతి గౌతమ్‍ని చూపించింది.
“మరి పెళ్ళి?” అడిగిందావిడ.
ఇది నా దేశం. నా సంస్కృతి. ఏ మూలకి వెళ్ళినా అనైతికతని ప్రోత్సహించే తల్లిదండ్రులు లేరు. గర్వంగా అనిపించింది. ఇలాంటి దేశంకోసం , ఇలాంటి జాతికోసం ఏదేనా చెయ్యచ్చు.
గౌతం ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులని వప్పించి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్ళి చేసుకునేంత వ్యవధిలేదు. అందుకని అక్కడి కాళికాదేవి గుళ్ళో అతికొద్దిమంది తెలిసినవాళ్ళ సమక్షంలో పెళ్ళిచేసుకున్నారు. ఆ రాత్రి వాళ్ళకి ప్రథమ సమాగమం. అవంతి నాయనమ్మ గదిని అలంకరిస్తుంటే_
“వీళ్ళ పెళ్ళి పొద్దున్న జరిగింది నాయనమ్మా!” అంది అవంతి అల్లరిగా.
“అదేంటి? పెళ్ళవగానే ఇలా వచ్చేసారా?” ఆవిడ ఆశ్చర్యపోయింది. నేను సిగ్గుగా నవ్వేసాను. హర్షకూడా సిగ్గుపడిపోయాడు.
“ఏమిటో! ఈ పిల్లలు ఏం చేస్తారో తెలీడం లేదు. హాయిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సుఖంగా ఇక్కడే వుండి నలుగురేసి పిల్లల్ని కనక ఎక్కడికో వెళ్తామని బయల్దేరారు. మేమంతా బతకట్లేదా? అలాగే వీళ్ళూను” అని గొణుక్కుంది.
“ఈ ప్రతిపాదనేదో బావున్నట్టుంది. ప్రొఫెసర్ మిత్రాకి చెప్దామా? ” అన్నాడు హర్ష పెద్దగా నవ్వేసి.
“నీకూ నచ్చిందా? నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది” అన్నాడు గౌతమ్ నవ్వుతూ.
“ఇప్పుడిలా హేండిచ్చామంటే మిత్రాగారి గుండె ఆగిపోతుంది. అప్పుడింక ఇలాంటి ప్రయోగాలుండవు. అసలీ ప్రతిపాదన బాస్ ముందు పెట్టిందే ఆయనట” అన్నాడు హర్ష.
అవంతి చురుగ్గా చూసింది. “నలుగురుకాదుగానీ, ఒక్కొక్కర్ని కనిచ్చేసి మేం వెళ్ళిపోతాం. మీరు వాళ్ళని పెంచుకుంటూ ఇక్కడే వుండండి” అంది.
“దేశంకోసం చేసే పనిలో ఆత్మనిరతి. వెనుకంజ వెయ్యకూడదు” అంది అవంతి నాయనమ్మ. ఆవిడ భర్త కార్గిల్ దగ్గిర జరిగిన యుద్ధంలో చనిపోయాడట. తెలుగువాళ్ళే అయినా ఆయన ఆఖరుసారి గడిపిన ఇంటినీ, పరిసరాలనీ వదలలేక ఇక్కడే వుండిపోయింది.
పువ్వుల్తో అందంగా అలంకరించబడిన రెండుగదుల్లో ఒకదాన్లో నేనూ, హర్షా ఒకరికొకరం పూర్తిగా పరిచయమయ్యాం. చాలా అద్భుతమైన సమయమిది. అతని ఆత్మసౌందర్యాన్ని చూడగలిగాను. నాకెంతో సంతృప్తిగా అనిపించింది. రాత్రి చాలా తొందరగా గడిచిపోయినట్టనిపించింది.
ఉదయం లేచేసరికి నాలో కొత్త వుత్సాహం. అవంతి నాయనమ్మకి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. హర్షకికూడా. అతను మా పెళ్ళి జరిగిందని పెద్దవాళ్ళముందు అనకపోతే, ఈరోజు ఇలా గడవకపోయివుంటే మాకిలాంటి అవకాశం మళ్ళీ దొరికేది కాదు. మాకు మేముగా యాదృశ్చికంగానో, తప్పదన్నట్టో కలవటంలో ఇంత సంతోషం వుండేదికాదు. ఈ భూమ్మీద మేము భార్యాభర్తలం. భార్యాభర్తలుగానే అంతరిక్షంలోకి వెళ్తున్నాం. అతనికి నేను, నాకు అతను…
అవంతికి మాత్రం దిగులు. నాయనమ్మని పట్టుకుని ఏడ్చేసింది. “నేను దగ్గిరుండను. కనీసం ఫోన్లోకూడా దొరకను. ఎలా వుంటావు నువ్వు?” అడిగింది కన్నీళ్ళతో.
“మీ తాతని యుద్ధానికిచ్చాను. ఈరోజుకీ యుద్ధాలు ఆగలేదు. మీఅమ్మానాన్నలు అల్లర్లకి బలైపోయారు. అల్లర్లు ఇప్పటికీ ఆగలేదు. నువ్వేదో కొత్తదార్లో వెళ్తున్నావు. ధైర్యంగా వెళ్ళు. ఈ ముసలమ్మ ప్రాణంకన్నా జాతి మనుగడ ముఖ్యం” అని ఓదార్చిందావిడ.
ఆవిడ ధైర్యం మా అందర్లోనూ స్ఫూర్తి నింపింది. ఆవిణ్ణి వదల్లేక వదిలింది అవంతి.
గౌతమ్ వుండేది అటావాలో. ముందు హర్ష ఇంటికి వెళ్ళి అటు వెళ్ళాలనుకున్నాం.
హర్ష తల్లిదండ్రులు నన్ను చూసి చాలా ఆనందించారు. కానీ అతని తల్లి మా నిర్ణయాన్ని ఎంతమాత్రం సమర్ధించలేదు. “అప్పటికీ ఇప్పటికీ ఒకటే పరిస్థితి. ఆరోజుల్లోనే అక్కడ బతకలేక ఇక్కడికి వచ్చేసాం. మీరూ అదే పనిచెయ్యాల్సింది. ఇంత పెద్ద ప్రపంచంలో మీకు బతకడానికి చోటేలేదా? ఇంత పెద్ద ప్రపంచాన్ని మీ నలుగురి ప్రయోగం కాపాడుతుందా? ఇదంతా తెలివితక్కువతనం. చదువుకున్నారు. పెళ్ళిళ్ళుకూడా చేసుకున్నారు. మీ బతుకు మీరు బతక్క ఇదేమిటి? ఈ ప్రయోగాలకి మీరే దొరికారా? యూ ఆర్ ట్రాప్‍డ్” అంది.
“నా నిర్ణయం మారదు. నువ్వున్న చోటు స్వర్గమనీ, ఇక్కడ సురక్షితంగా వున్నాననీ అనుకుంటున్నావు. కానీ ఈ స్వర్గంకూడా ప్రమాదం అంచునే వుందమ్మా! గ్రీన్‍లేండు కరుగుతోంది తెలుసా? అంటార్కిటికా కరుగుతోంది. ఇవన్నీ కరిగితే మంచుయుగం వస్తుంది. సైబీరియా మంచు ఎడారి కరిగితే దానికింద వున్న మీథేన్ వాయువు ప్రపంచాన్ని ముంచెత్తుతుంది. అమ్మా! నువ్వొక్కదానివీ గట్టునివుంటే క్షేమంగా వున్నట్టు కాదు. నీ పొరుగువాడు క్షేమంగా వుంటేనే నువ్వు క్షేమంగా వున్నట్టు” అన్నాడు హర్ష.
“నాకు సూక్తులు చెప్పద్దు. నేను, నా కుటుంబం క్షేమంగా వుంటే చాలు. నేనుగా ఎవరికీ ఎలాంటి అపకారం చెయ్యలేదు. గ్రీన్‍లేండు, అంటార్కిటికా, సైబీరియాలు కరగటంలో నా ప్రమేయంలేదు. నేనొక్కదాన్నే కార్లూ కంప్యూటర్లూ వాడటంలేదు. అందరితోపాటే నేనూను. అలాంటప్పుడు నా కొడుకొక్కడే ఎందుకు ఈ ప్రపంచంకోసం త్యాగం చెయ్యాలి?” ఆవిడ గట్టిగా అడిగింది.
“ఈ తెలుగుపిల్ల నిన్నేదో మాయచేసింది. వాళ్ళ కష్టాలూ సమస్యలూ నీనెత్తిన రుద్దుతోంది. కష్టాల్లో వున్నది వాళ్ళు. వాళ్ళ దేశపు విధానాలవలన. నీకసలు తనతో ఎలా పరిచయం జరిగింది? ఏ ప్రాతిపదికన జరిగింది?” అని నన్నూ తప్పుపట్టింది.
“ఒక అమెరికన్‍లా మాట్లాడకమ్మా!” అన్నాడు హర్ష.
“నువ్వే స్టుపిడ్‍లా మాట్లాడకు హర్షా! నాలుగు తరాలక్రితం ఇక్కడికి వచ్చారు మీ తాతగారి తండ్రి. అలాగే నా తల్లిదండ్రులుకూడా మా తాతగారి టైంలో వచ్చారు. ఇక్కడపుట్టి ఇక్కడ పెరిగి ఈ దేశపు తిండి తిని , గాలిపీల్చుకుని బతుకుతున్న మనం అమెరికన్లలా కాకపోతే ఇంకోలా ఎలా వుంటాం? అది హిపొక్రిసీ కాదా?”
“మేం చిన్నపిల్లలుగా వున్నప్పుడు నువ్వూ, నాన్నా ఏవో గొడవలొచ్చి కొన్నాళ్ళు విడివిడిగా వున్నారు. తర్వాత సర్దుకుని కలిసిపోయారు. ఏం? అమెరికన్లమని చెప్పుకునే మీరు మమ్మల్ని గాలికొదిలేసి విడాకులు తీసుకుని వేరే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోలేదు? “
ఆ ప్రస్తావన ఆవిడకి నచ్చలేదు. “ఐతే?” టఫ్‍గా అడిగింది.
“మమ్మల్ని ప్రతిక్షణం నైతికంగా గైడ్ చేస్తునే వున్నారు. అమెరికన్లలా స్వేచ్ఛనిచ్చి వదిలెయ్యలేదు. మమ్మల్ని మాలానే పెంచారు. మాకూ వాళ్ళకీ స్పష్టమైన తేడా వుండేలా పెంచారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే నువ్వు ఇండియన్‍వికాబట్టి. ఈ కుటుంబం నీదనుకుని దీన్ని నువ్వెలాగేనా నిలబెట్టుకోవాలనుకున్నావు. మేం పైకొస్తేనే మీరు లైఫ్‍లో సక్సెసైనట్టు. అందుకని మాకోసం కాంప్రమైజ్ అయావు. నాన్నకూడా అలాగే ఆలోచించారు. నీ మూలాలు అక్కడున్నాయి. అక్కడినుంచీ మంచుని మాత్రమే తీసుకుని నీదగ్గిరున్న చెడుని అక్కడ పారబొయ్యడం తప్పుకాదా?”
“…”
“అక్కడ చదువుకుని ఈ దేశానికి వచ్చారు గ్రేట్ గ్రాండ్ పా. ఏం? అక్కడే వుండి సర్వీస్ చెయ్యచ్చుకదా? తను వలసని త్యాగంచేసి, తనకి ఇక్కడ దొరికిన అవకాశాన్ని తన తరువాతితరంవారికి అక్కడ దొరికేలా చెయ్యచ్చుకదా? అది సాధ్యపడలేదు. అప్పటి కారణాలు ఏవేనా కావచ్చు. అలాగ ఆ దేశం ఎందరో మేథావుల్నీ, ఎంట్రప్రెనర్స్‌నీ కోల్పోయింది. వాళ్ళందర్నీ ఈదేశం తనవైపు ఆకర్షించింది. అది తప్పని నేననను. కానీ ఆ దేశంపట్ల మీకు నైతికమైన బాధ్యత ఏదీ లేదా? ఈరోజుకీ నువ్వు పాటిస్తున్న … వదిలిపెట్టలేనంతగా జీర్ణించుకుపోయిన గొప్ప సంస్కృతిని నేర్పిన దేశం అది. నువ్వు దానికోసం ఏదీ చెయ్యవా?”
ఆ ప్రశ్నలు ఆవిడని సూటిగా తాకాయేమో ఆలోచనలో పడింది.
“నీ పేరు సంగీత. నాన్న పేరు శివనారాయణ. ఆ దేవుళ్ళు ఇక్కడివాళ్ళు కారు. మన పేర్లు ఇక్కడివి కావు “
“నువ్వు చెప్పినది నిజమే. కాదనను. నీకు వాళ్ళకోసం ఏదేనా చెయ్యాలనుంటే కొంత డొనేట్ చెయ్యి. ఈ మిషన్‍లోంచీ మీరుద్దరూ తప్పుకోండి. ఇంకెవరేనా వెళ్ళేందుకు ముందుకొస్తే ఆ ఖర్చు మనం భరిద్దాం. వాళ్ళ కుటుంబాన్ని మనం అడాప్ట్ చేసుకుందాం”.
ఆవిడ మాటలకి హర్షకి తీవ్రమైన ఆవేశం వచ్చింది. “ఇదే ఒక అమెరికన్ని తన దేశంకోసం చెయ్యమని అడిగితే ముందూవెనుకా ఆలోచించకుండా ముందుకి వచ్చేవాడు. అలాంటివాళ్ళకోసం ఈ దేశంకూడా అంతే కమిటెడ్‍గా వుంది. కానీ…” అన్నాడు నిరసనగా. “నువ్వు వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నించమ్మా! మనం ఈ దేశానికి సంపదని సృష్టించే మానవవనరులం. అది ఒకప్పుడు. మరి ఇప్పుడు అనవసర భారం. ప్రపంచంలో మిగిలివున్న కొద్దిపాటి వనరులు తమ పౌరుల అవసరాలు తీర్చాలనేది ఈ దేశప్రభుత్వపు ఆకాంక్ష. ఇమిగ్రెంట్స్‌కి గ్రీన్‍కార్డ్సు ఇవ్వడం ఆపేసారు. కొత్తగా వీసాలు ఇవ్వడంలేదు. ఇక్కడికి వచ్చి వుంటున్నవాళ్ళని ఏదో ఒక రకంగా తిప్పి పంపేస్తున్నారు, లేదా ఇక్కడ వుండలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇక్కడివాళ్ళు తమ అవకాశాలని మనం గుంజుకుంటున్నామన్న ద్వేషంతో రగిలిపోతున్నారు. నువ్వూ ఏదో ఒక రోజుని నీ అడుగుజాడలని వెతుక్కుంటూ వెళ్ళిపోవలిసిందే”.
అతని మాటలు ఆవిడని తీవ్రమైన షాక్కి గురిచేసాయి. ఒక విషయం జరుగుతుందని సూచనాప్రాయంగా తెలిసినా మనసు దాన్ని అంగీకరించేందుకు ఇష్టపడదు. అలాంటి స్థితిలో వున్నప్పుడు ఆ విషయం హఠాత్తుగా జరిగిపోతే ఎలాంటి షాక్ తగులుతుందో అలాంటి షాక్ అది.
హర్ష తండ్రి ఆ స్థితిలోకి ఎప్పుడో వెళ్ళి దాటినట్టున్నారు. “వాడిని వెళ్ళనివ్వు సంగీతా!” అన్నారు.
ఆవిడ తేరుకుని అక్కడినుంచీ వెళ్ళిపోయింది. తమ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. హర్ష తండ్రి నిర్వికారంగా మమ్మల్ని చూసి బైటికి వెళ్ళిపోయారు.
“సారీ!” అన్నాడు హర్ష జరిగినదానికంతకీ నొచ్చుకుంటూ.
“ఎవరింట్లో రియాక్షనేనా ఇలాగే వుంటుంది” అన్నాడు గౌతమ్.
హర్ష గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. అతని తమ్ముడు ఆనంద్ మాతో వచ్చి కూర్చున్నాడు. అప్పటిదాకా అతను తన గదిలోనే వున్నాడు. అన్నదమ్ములిద్దరికీ రెండేళ్ళు తేడా. ఇద్దరూ ఒకే మూసలోంచీ తీసిన బొమ్మల్లా వున్నారు. ఒకే ఒడ్డూ, పొడవూ. ఆనంద్ నన్ను చాలా కుతూహాలంగా చూసాడు… బహుశ: హర్షకి భార్యననేమో! సిగ్గనిపించింది. నా ముఖం ఎర్రబడటం నాకే తెలుస్తోంది.
“హర్ష ఎంతో సైలెంటు. వాడిలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమే. వాడిమీద అమ్మ ప్రభావం చాలా వుంటుందని అనుకుంటుంటాము. మా ఫేమిలీ స్ప్లిటైనప్పుడు వాడు అమ్మతో వెళ్ళిపోయాడౌ. నేను నాన్న దగ్గిర వుండిపోయాను. అలాంటిది అమ్మ ఇష్టానికి విరుద్ధంగా ఇలా చేసాడంటే నమ్మలేకపోతున్నాను” అన్నాడు.
“మీకోసమేనా?” అన్నట్టు నన్ను చూస్తుంటే మరింత సిగ్గుగా అనిపించింది. హర్ష నవ్వేడు. అతనికళ్ళలో నాపట్ల ప్రేమ తొణికిసలాడింది.
“నాకూ అలాంటి మెసేజి వచ్చింది. నా సబ్జెక్ట్ లైఫ్ సైన్సెస్. నేను స్పేస్‍లో ఏం చెయ్యగలుగుతానని వూరుకున్నాను” అన్నాడు.
లేకపోతే హర్ష స్థానంలో ఇతనుండేవాడా? నాకా ఆలోచన నచ్చలేదు. ఉహూ. నాకోసం పుట్టినవాడు హర్షకాబట్టి ఈ ఎక్స్పెడిషన్లో నేనూ వుండేదాన్ని కాదేమో! అసలు ఈక్వేషన్సే మారిపోయేవి.
చాలాసేపు మాట్లాడుకున్నాం.
“రేపటి తర్వాత నిన్నింక చూడనన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు?” అడిగాడు ఆనంద్ ఆఖర్లో.
“మళ్ళీ మొదటికి వచ్చావా?” హర్ష సున్నితంగా విసుక్కున్నాడు.
“కాదురా! ” ఆనంద్ కళ్ళల్లో నీళ్ళు.” చాలాకాలమైంది మమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళి. సడెన్‍గా పెళ్ళిచేసుకుని వచ్చావు. వదినతో ఇంకా పూర్తిగా పరిచయం అవనేలేదు. మనం సరదాగా మాట్లాడుకోనేలేదు. తిరిగిరానిచోటికి ఇద్దరూ వెళ్ళిపోతున్నారు. నాకేమిటో చాలా బాధగా వుంది”.
“తిరిగి రానని ఎందుకనుకుంటున్నావు? వస్తానేమో! అలా రావాలనేకదా, మా ఆకాంక్ష?” మృదువుగా అడిగాడు హర్ష. అది నిజంకాదని నాకు తెలుసు.
వాళ్ళమ్మ వచ్చారక్కడికి. ఎవరెన్ని చెప్పినా హర్ష తన నిర్నయం మార్చుకోడనే విషయం అర్థమైంది ఆమెకి, అప్పటికి. తన మనసుని సంసిద్ధంచేసుకుంది.
“వాడి నిర్ణయాన్ని బలహీనపరచద్దు ఆనంద్! ప్రకృతిని శోధించి సంపదంతా ఇళ్ళలో నింపుకున్నాం. విచక్షణ లేకుండా కలుషితంచేసాం. నిలవడానికి ఇంత నీడ లేకుండా చేసుకున్నాం. ఇవన్నీ నాకు తెలీవని కాదు. నా కొడుకు అందుకోసం బలిదానం ఔతున్నాడంటే ఆందోళనపడ్డాను. ఉన్నట్టుండి చెప్పేసరికి తట్టుకోలేకపోయాను. ఇదితప్ప మరో మార్గాంతరం లేదన్నప్పుడు వప్పుకోక తప్పదు. మృత్యువు అనివార్యమైనప్పుడు దాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి” అంది.
అదొక రాజీ. అనివార్యమైన రాజీ. సమయం విలువ తెలుసుకుని, అతి తక్కువ వ్యవధిలో చేసుకున్న రాజీ. లేకపోతే విషాదంతో విడిపోయేవాళ్ళం. అది మమ్మల్నీ, వాళ్ళనీకూడా జీవితాంతంవరకూ బాధించేది.
“రండి. బోజనాలు చేద్దాం” అంది.
నిజానికిది ఎంత అందమైన అనుభవం! ఎవరికివాళ్ళు టేబుల్‍ముందు కూర్చుని టీవీ చూస్తూనో, పాటలు వింటూనో తిన్నామనిపించి లేవటంకన్నా అందరం ఒకేసారి మాట్లాడుకుంటూ తినటం. గౌతమ్ ముఖంలో ఏదో దిగులు మొదలవ్వటం గమనించాను. రేపు తన తల్లిదండ్రులని కలవాలి. అందుకు టెన్స్‌గా వున్నాడేమో! హఠాత్తుగా గుర్తొచ్చింది, అతను తనవాళ్ళగురించి ఏమీ చెప్పలేదని. మాలో మేము అనుకుంటూ అతన్ని కలుపుకోవడమేగానీ, అతను ఎప్పుడూ ఓపెన్ అప్ కాలేదు.
ఆ రాత్రి ఆనంద్ తన గదిని అవంతి, గౌతమ్‍లకి ఇచ్చాడు. తను గెస్ట్‌రూంలో సర్దుకున్నాడు.
“హేవే నైస్ డే ఆన్ ద యెర్త్. ఈ భూమ్యాకర్షణ స్థితిలో , మనుషులూ మనుషులూ స్వేచ్ఛగా ఒక దగ్గిర కూర్చుని మామూలుగా మాత్లాడుకోగలిగే అవకాశం మళ్ళీ మీకు ఎప్పుడొస్తుందో!” అన్నాడు.
ఎవరి గదుల్లో వాళ్ళు సర్దుకున్నాంగానీ , ఎవరం సరిగ్గా నిద్రపోలేదు.
హర్ష తన కుటుంబ విషయాలని ఇంకొంచెం వివరంగా నాతో పంచుకున్నాడు. “అమ్మకీ, నానకీ మధ్యని ఒక స్పర్థ వుందని మాకు తెలీదు. మేమిద్దరం స్కూలింగ్‍లో వున్నాము. ఒకరోజున వున్నట్టుండి విడిపోవాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. నేను అమ్మతో వచ్చేసాను. తమ్ముడు నాన్నతో వుండిపోయాడు. అలా విడిపోయాక అమ్మ చాలా బాధపడేది. బాధని తట్టుకోలేక ఏడ్చేసేది. నేనే పెద్దవాడిలా తనని ఓదార్చేవాడిని. పెద్దవాడిలాగే వాళ్ళిద్దర్నీ కాంప్రమైజ్‍వైపు నడిపించాను. ఈరోజుకీ ఇమోషనల్ నర్చరింగ్‍కి తను నామీదే ఆధారపడుతుంది. అదంతా మామూలు కుటుంబవిషయంగా అనిపించవచ్చుగానీ ఇంకో కోణంలో నాకు కనిపించేది దేశభక్తి. ఆ దేశపు సాంప్రదాయం వాళ్ళలో జీర్ణించుకుపోయిందికాబట్టే వాళ్ళు దానికి కట్టుబడిపోయారు. లేకపోతే ఎన్నో కుటుంబాలలాగే మేమూ తిరిగి కలుసుకోలేని తీరాలకి చేరిపోయేవాళ్ళం. ఆ ఆలోచనే నాకు ఈ ఎక్స్‌పెడిషన్లో చేరేందుకు నైతికబలాన్నిచ్చింది” అన్నాడు.
“ముందుగా చెప్పలేదా?” అడిగాను.
“అలా చెప్తే ఎవరు వప్పుకుంటారు? ఇలాంటివాటిలో ఆలోచనకీ చర్చకీ అవకాశం ఇవ్వకూడదు. సెంటిమెంట్సు వర్కౌట్ అవుతాయి.” అని నేను ఆలోచనలో పడటాన్ని గమనించి, అదేంటో గుర్తించినట్టు. “మీయింట్లో పరిస్థితులు వేరు మీరా! పేరేంట్సిద్దరూ మృత్యువు అంచుని వున్నారు. నీ జీవితాన్ని నడుపుకునే స్వేచ్ఛ నీకిచ్చారు. అవంతి విషయానికి వస్తే నీకులా తనది తక్షణ అవసరం కాదు” అన్నాడు.
వ్యక్తులు కేవలం ప్రేమించుకోవడంవలన దగ్గిరవరు. కష్టసుఖాలని పంచుకోగలిగినప్పుడే పూర్తి దగ్గిరితనం ఏర్పడుతుంది.
కొద్దిగా నిద్రపోయాక వున్నట్టుంది సన్నగా ఏడుపు వినిపించడంతో మెలకువ వచ్చింది. పక్కకి చూసాను. హర్ష లేడు. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడ సోఫాలో కూర్చుని వున్నారు తల్లీకొడుకులు. ఆవిడ అతని భుజమ్మీద తలవాల్చి ఏడుస్తోంది. అతను ఓదార్చుతున్నాడు.
“నువ్వు చెప్పేది నిజమా? మనం ఈదేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వన్న విషయాలు నెట్‍లో చూసి నిర్ధారించుకున్నాను. కొన్ని మిలియన్ల వీసాలు కేన్సిలౌతున్నాయి. నువ్వు లేకపోవటమే నేను తట్టుకోలేను. తరాలుగా అలవాటుపడిపోయిన ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటె ఎలారా?” అంటోంది.
“తప్పదమ్మా! ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది. చాలా వీసాలు కేన్సిలయ్యాయి. మీలాగ ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయినవాళ్ళ విషయంలో అలా జరగకపోవచ్చు. కానీ ఇక్కడ వుండలేని పరిస్థిరులనిమాత్రం కల్పిస్తారు. అదే జరుగుతుంది. ఆరోజుని మనం బాధ్యతారహితంగా వదిలిపెట్టేసి వచ్చిన దేశం, చదువుకున్నవాళ్ళ అనాదరణకి గురైన దేశం మనని రావద్దనదుగానీ వెళ్ళి సంతోషంగా వుండగలిగే పరిస్థితులుమాత్రం లేవక్కడ” అన్నాడు.
“వాళ్ళూ వలసవచ్చినవాళ్ళేకదా?”
“జాతిబేధం వుంది. వాళ్ళు ముందుగా ఇక్కడికి వచ్చి చట్టాన్ని రాసుకున్నారు. అది వాళ్ళకిమాత్రమే అనువుగా వుంటుంది”.
నేనా మధ్యలోకి వెళ్ళటం అసంగతంగా అనిపించి తిరిగి గదిలోకి వచ్చేసాను. చాలాసేపటిదాకా ఆమె ఏడుస్తునే వుంది. అతను ఓదార్చుతునే వున్నాడు. జీవనసరళిని మార్చుకోవడమనేది ఎవరికీ ఆమోదయోగ్యమైన విషయంకాదు. నూటికి తొంభైతొమ్మిదిమంది తాము బతుకుతున్న సరళిలోనే రోజులు గడిచిపోతే చాలనుకుంటారుతప్ప తాము వాటికనుగుణంగా మారరు. ఇప్పుడొచ్చినది అలా జరగడానికి ఎలాంటి అవకాశం లేని పరిస్థితి.
తెల్లారింది. అందరూ లేచాం. కాఫీ , టిఫెన్…అంతా మామూలు రొటీన్. కానీ హృదయాలు చాలా బరువుగా వున్నాయి. నా మనసులో ఎక్కడో ముల్లులా గుచ్చుకుంది ఆ దు:ఖం.
హర్షతో అన్నాను.
“ఇది మాకు తక్షణసమస్య హర్షా! డూ ఆర్ డై లాంటి సమస్య. కానీ మీకలా కాదు. ఇంకొన్నేళ్ళు … బహుశ: నీ తరంవరకూ హేపీగా గడిపెయ్యవచ్చు. ఈలోగా వాతావరణంలో మార్పులు వస్తాయేమో! ప్రకృతి తనని తను కాపాడుకుంటుందని అంటారుకదా?” అన్నాను. అలా అడగటం ఎంత అసంగతమైన విషయమో అడిగాకకానీ అర్థమవ్వలేదు.
“మరి నువ్వేం చేస్తావు? నా స్థానంలో వచ్చినతన్తో సర్దుకుపోతావా?” షార్ప్‌గా అడిగాడు.
నేను తలదించుకున్నాను. ఇద్దరు జంటలుగా వెళ్ళాలనేది బాస్ నిర్ణయం. దానికి చాలా కారణాలున్నాయి. అదలా వుంచి, మామధ్య ఇంత జరిగాక మరొకర్ని నేను భర్తగా స్వీకరించగలనా? అలా చెయ్యలేక నేనుకూడా హర్షతోపాటు బైటికి వచ్చేస్తే ఇద్దరికీ స్వార్థపరులన్న ముద్రపడుతుంది. మళ్ళీ ఇంకో జంటని తయారుచెయ్యటం…బాస్‍కి చాలా నష్టం. డబ్బులోనేకాదు, కాలంలోకూడా. బాస్‍కే కాదు, అవంతీ గౌతమ్‍లకికూడా మరో రెండేళ్ళు వేచి వుండటం అనేది చాలా నష్టం.
“మూల్యం అనేది ఎవరు చెల్లించినా మూల్యమే మీరా! నా తల్లి దు:ఖం నిన్ను కదిలించింది. అలాంటి కొన్ని లక్షలమంది తల్లుల దు:ఖం నన్ను కుదిపేసాకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. బాస్‍కి జవాబిచ్చాక కొన్ని వందల గంటలు నెట్ ముందు కూర్చున్నాను. ఎంతోమంది పిల్లలు చర్మాన్ని కప్పుకున్న అస్థిపంజరాల్లా …వాళ్ళ నిస్తేజమైన చూపులు నన్ను నిలదీసాయి. తమ తప్పేమిటని ప్రశ్నించాయి” అన్నాడు. ఇంక అతనికి నేనేం చెప్పలేదు.
“మీరు తిరిగొచ్చేరోజుకోసం ఎదురుచూస్తుంటాం” అంది హర్ష తల్లి.
“మూలాలు వెతుక్కుంటూ మేం ఇండియా వెళ్ళాల్సిన పరిస్థితి తొందర్లోనే వస్తుందనుకుంటాను” అన్నాడు హర్ష తండ్రి. “ఇక్కడి యూత్ చాలా ఎగ్రెసివ్‍గా వున్నారు. మనవాళ్ళు దొరికితే షూట్ చేసేస్తున్నారు. వాళ్ళ అవకాశాలన్నీ మనం కొల్లగొట్టేసుకుని ఆఖరికి వాళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చామని నమ్ముతున్నారు” అన్నారు. అని,
“నీకు తెలీదు. నువ్విక్కద లేవు. ఇక్కడ ఈ తరహా హత్యలు ఎక్కువైపోయాయి. ఈరోజు వుదయాన్న నేను వాకింగ్‍కి వెళ్ళినప్పుడు నా కళ్ళెదుటే ఒక జంటని చంపేసారు” బాధపడ్డాడు. అలాంటి దృశ్యాలకి అలవాటుపడ్డట్టుగా వుంది ఆయన స్పందన. మంచేనా చెడేనా పదేపదే జరుగుతుంటే ఆ సంఘటనలకి మనిషి అలవాటుపడిపోతాడు. ఈ రాగద్వేషాలకి దూరంగా వెళ్ళిపోతున్న హర్షని వదిలేస్తే మిగిలిన ముగ్గుర్నీ తనతోసహా కాపాడుకోవటం ఆయన ముందున్న సమస్య.
“అక్కడికి వెళ్ళి మీ పేరెంట్సుని తప్పకుండా కలుసుకుంటాం మీరా! కేన్సర్ ట్రీట్‍మెంటులో కొత్తకొత్త డెవలప్‍మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అందేలా చూస్తాం. వాళ్ళని మేం చూసుకుంటాం. అవంతీ! మీ నాయనమ్మగారినికూడా” వాత్సల్యంగా అన్నారు.