నీలినక్షత్రం – 5 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

అటావా వెళ్ళే ఫ్లైట్ ఎక్కాం. ఇండియాలో వున్నంతగా ఇక్కడ మేం ఔటర్‍స్పేస్‍లోకి వెళ్తున్నామన్న వార్త పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. స్పేస్‍లోకి వెళ్ళటం సామాన్యమైపోయిందికాబట్టి అలాంటిదే ఏదో ప్రయోగం అనుకుంటున్నారు ఇక్కడివాళ్ళంతా బాస్ రహస్యంగా వుంచడంచేత కొంతా, ఇక్కడివారి వుదాశీనతచేత కొంతా.
ప్రయాణమంతా గౌతమ్ ముభావంగానే వున్నాడు. అతన్లో ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది. అక్కడ దిగాక నేరుగా మమ్మల్ని ఒక స్కూలుకి తీసుకెళ్ళాడు. విశాలమైన ఆవరణలో వున్న అందమైన భవనాల సముదాయం. వింటేజి సౌందర్యం వుంది వాటిలో. ఒక విల్లో చెట్టుకింద బెంచిమీద కూర్చున్నాడు. ముందుగానే అనుమతి తీసుకున్నట్టున్నాడు, ఎవరూ అభ్యంతరపెట్టలేదు.
“మీకులాగా ఒక ఇల్లూ, అమా,నాన్నా, కుటుంబం బాంధవ్యాలు అనేవి నాకు వూహల్లోని విషయాలు. ఇదే నాయిల్లు. నా బాధలు, భావోద్వేగాలు, సంతోషాలు…అన్నీ వంటరిగా ఇక్కడే అనుభవించడానికి అలవాటుపడ్డాను” అన్నాడు. అతని మాటల్లో అంతులేని విషాదం. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మాకు తెలిసిన, మాతో రెండేళ్ళు పరిచయమున్న గౌతమ్ కాదు. ఒక కొత్త వ్యక్తి. బాధతో కదిలిపోతున్నాడు. ఇది వూహించని షాక్. ఇంట్లోవాళ్ళగురించి అతను ఏదీ చెప్పలేదంటే చిన్నప్పటినుంచీ హాస్టల్స్‌లో వుండటంచేత వాళ్ళతో ఎటాచిమెంట్స్ తక్కువని అనుకున్నాం తప్ప ఇలాగని వూహించలేదు. అసలితను ఎవరు? ఒక ఆర్కిటెక్ట్…అవంతి ప్రేమికుడు…చురుకైన, తెలివైన సహప్రయాణీకుడు… ఇవన్నీ బాహ్య విషయాలు. మరి లోలోపలివి?
“గౌతమ్ ఏమిటిది? మేమంతా లేమా? ” హర్ష అతని భుజాలమీద తడుతూ ఓదార్పుగా అన్నాడు.
“తనకెవరూ లేరన్నది తెలుసుకానీ ఇంత బాధ దాచుకున్నాడని తెలీదు. ఎప్పుడూ బైటపడలేదు. నవ్వుతూ నవ్విస్తూ తిరిగిన గౌతం మాత్రమే నాకు పరిచయం” అంది అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ.
“ఊరుకో గౌతమ్! నువ్వు బాధపడుతుంటే పాపం అవంతికూడా బాధపడుతోంది. ఐనా అన్నీ వదులుకున్నాక ఇప్పుడీ బాధేమిటి?” అని కోప్పడ్డాను. కాసేపటికి సర్దుకుని చెప్పసాగాడు.
“అమ్మకి ఆవిడ పంథొమ్మిదోయేట పెళ్ళైంది. వెంటనే నేను పుట్టానట. నాకు ఏడేళ్ళొచ్చాక నాన్న ఒకరోజు మా యిద్దర్నీ మోసంచేసి ఇంట్లోంచీ పారిపోయాడు. కొన్నాళ్ళు బాధపడ్డా తర్వాత సర్దుకుని అమ్మ మరొకతన్ని పెళ్ళిచేసుకుంది. అతను నాతోసహా అమ్మని స్వీకరించాడు… కొన్ని పరిమితులతో. నేను రెసిడెన్షియల్లోనే చదువుకోవాలి. ఇంట్లో వుండకూడదు. నాకో పద్ధెనిమిదేళ్ళు రాగానే నా సంపాదన నేను సంపాదించుకుంటూ నా బతుకు నేను బతకాలి. ఇంక అందులో అమ్మ జోక్యం వుండకూడదు. నామీద ఆమె ఖర్చుపెట్టినదాన్ని తిరిగి ఇచ్చెయ్యాలి. అమ్మకి నాకన్నాకూడా తన జీవితం, తన ఆనందం ముఖ్యమయాయి. వెరసి నేనొక నైతికమైన బాధ్యతగా… వదిలించుకోలేని బరువుగా మిగిలిఫొయాను.
మొదట్లో ఇవన్నీ నాకు తెలీవు. అర్థంచేసుకునే వయసు లేదు. రెసిడెన్షియల్లో చదవనని గొడవ చేసాను. బలవంతంగా వుంచారు. అమ్మమీద బెంగపెట్టుకుని సెలవులివ్వగానే ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళకి నేను రావటం ఇష్టం వుండేది కాదు. నాచేత గార్డెనింగ్, ఇంటిపనులు చేయించేవాడతను. అమ్మకి మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ గదిలో నన్ను వుంచేది అమ్మ. వాళ్ళ కంఫర్ట్స్ నాకు పంచడం అతనికి నచ్చలేదు. నేను శలవులకి రాగానే ఒక గది నాకు వదిలేసి ఇల్లంతా తాళంవేసుకుని వాళ్ళు హాలీడేయింగ్‍కి వెళ్ళిపోయేవారు. వాళ్ళు తిరిగొచ్చేదాకా నేనా యింటికి కేర్‍టేకర్ని. క్రమంగా ఇవన్నీ అర్థమవటం మొదలయ్యాక అక్కడికి వెళ్ళటం మానేసాను.
ఇక్కడే ఈ విల్లో చెట్లకింద … ఈ క్రోటన్ మొక్కలతో …నా వుద్వేగాలని పంచుకోవటానికి అలవాటుపడ్డాను. అమ్మ రుణాలన్నీ తీర్చేసుకున్నాను, ఒక్కటి తప్ప. నేను పసివాడిగా, నిస్సహాయుడిగా వున్నప్పుడు ఆమె నన్ను పెంచి పెద్దచేసింది. రేపెప్పుడేనా ఆమెకి ఇలాంటి నిస్సహాయత కలిగితే నేను ఎంతోకొంత సేవచేసి ఆ రుణాన్ని తీర్చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడింక ఆ అవకాశం లేదు. అందుకని నాకు మిగిలిన ప్రాపర్టీని ఆవిడ పిల్లల పేరుమీదికి ట్రాన్స్ఫర్ చేసేసాను, ఆవిడ్ని చివరిదాకా చూసుకోవాలన్న షరతుమీద”.
గౌతమ్ చెప్తుంటే అందరం చాలా బాధపడ్డాం. ఎవరూ లేకపోవడం వేరు, ఉన్న ఆత్మీయులే మనని వద్దనుకోవడం వేరు. ఎంతబాధని గుండెల్లో మోస్తున్నాడో! మరో ఆలోచనకూడా కలిగింది నాకు. అతని తల్లి చిన్న వయసులోనే భర్త మోసం చేస్తే అలాగే వుండిపోవాలా? మరో పెళ్ళి చేసుకోకూడదా? చేసుకుంటే దాని పర్యవసానాలు ఇంత చేదుగా వుండాలా? గౌతమ్‍ని ఇంత బాధపెట్టి ఆమె పూర్తి సంతోషంతో వుందని నేననుకోను. కుప్పకూలిన ఆ బాంధవ్యంలోంచీ బైటపడి తనొక్కర్తీ సంతోషకరమైన మరో సంబంధాన్ని ఏర్పరుచుకున్నా, సర్వైవల్ గిల్ట్ అనేది బాధించకుండా వుండి వుండదు.
స్కూల్ హెడ్‍టీచర్ కొందరు పిల్లల్ని వెంటబెట్టుకుని మా దగ్గిరకి వచ్చింది. పిల్లలంతా చాలా ముద్దుగా వున్నారు. మా ప్రయోగాన్నిగురించీ రోదసియాత్రగురించీ అడిగింది.
“పిల్లలు చాలా కుతూహలాన్ని చూపిస్తున్నారు. వివరించి చెప్పగలరా? ” అని అభ్యర్థించింది.
చెప్పటానికి మాకు అనుమతి వున్న విషయాలని అవసరమైనచోట వివరంగా, అవసరంలేనిచోట క్లుప్తంగా చెప్పాము. మేము మరో గ్రహాన్ని వెతుకుతూ విశ్వంలోకి వెళ్తున్నామన్న విషయం పిల్లల్లో చాలా సంచలనాన్ని రేపింది. ఎన్నో ప్రశ్నలడిగారు. చాలాసేపు మాట్లాడాక గులాబీపూల బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పారు. నలుగురం హోటలుకి బయల్దేరాము. ఈ పరిస్థితి అందర్లోనూ విషాదం నింపుతోంది. దాన్ని వెళ్ళగొట్టేందుకు ఏవేవో మాట్లాడుకున్నాం.
హోటల్లో సూట్ బుక్ చేసుకుని ఫ్రెషై, భోజనాలు చేసి, లాంజిలో కూర్చున్నాం. వచ్చినపనీ, అందుకు మాకిచ్చిన వ్యవధీ ఐపోయిందిగాబట్టి ఇండియా తిరిగివెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం.
ఇంతలో చిన్న మెసేజి-ఎవరో గౌతమ్‍ని కలవడానికి వచ్చారని. పంపమని అతను జవాబిచ్చాడు. ఎవరో మా ట్రిప్ గురించి తెలిసినవాళ్ళై వుంటారు. ఇది అతని ప్లేస్‍గాబట్టి అతని పేరు చెప్పి వుంటారు. అంతకన్నా మా ఆలోచనలు సాగలేదు. కానీ అనూహ్యంగా వచ్చింది గౌతమ్ తల్లి! కాకీ ఫాంటు, నల్లటి సింథటిక్ షర్టు వేసుకుంది. మనిషి ముఖంలో క్రష్‍లాంటిది కనిపిస్తోంది.
ఆమెని చూసి గౌతమ్ షాకయ్యాడు. ఏం మాట్లాడాలో తోచనట్టు మౌనంగా వుండిపోయాడు.
“ఏరా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో కనీసం ఒక్కమాటకూడా చెప్పాలనిపించలేదా? నాకు తెలుసు, నిన్ను బాధ్యతతోనే తప్ప ప్రేమతో పెంచలేదని. అలా పెంచగలిగే అవకాశాన్ని మీ నాన్న నాకివ్వలేదు. చిన్నప్పుడు కాకపోయినా కనీసం పెద్దయాకేనా అర్థం చేసుకుంటావనుకున్నాను. నా నిస్సహాయతని గ్రహిస్తావనుకున్నాను” అంది సూటిగా చూస్తూ.
గౌతమ్ తల తిప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారేమోనని మేం లేచి వెళ్ళబోయాము. కానీ అతను ఆపాడు.
“చాలా డబ్బున్న కుటుంబంలో పుట్టాను. పంథొమ్మిదేళ్ళ వయసులో నా పెళ్ళైంది. నా కివ్వవలసినదంతా మా నాన్న పెళ్ళప్పుడే మేరేజిగిఫ్టుగా ఇచ్చేసాడు. వెంటనే నువ్వు పుట్టావు. అంతా సరిగా, సంతోషంగా జరిగిపోతోందనుకుంటే మీ నాన్న మనల్ని వదిలేసి పారిపోయాడు. వెళ్తూవెళ్తూ నా బేంకు కార్డులు, పాస్ బుక్కులు, ఖరీదైన వస్తువులు అన్నీ తీసుకెళ్ళిపోయాడు. జరిగిన మోసాన్ని గ్రహించి సర్దుకునేలోపు అతడు ఎక్కడా చిల్లిపైసా మిగలకుండా డ్రా చేసుకున్నాడు. పోయిన డబ్బుకోసం పాకులాడనా? అతను చేసిన ద్రోహాన్ని తట్టుకుని నిలబడనా? పూర్తిగా నామీదే ఆధారపడి వున్న నీకు చేయూతనిచ్చి నిలబెట్టనా? నా మనసంతా గజిబిజిగా ఐపోయి ఏ నిర్ణయమూ తీసుకోలేని నిర్వేదపు స్థితిని చేరుకుంది.
మావాళ్ళు ఒకసారి దింపుకున్న నా బాధ్యతని మళ్ళీ తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితుల్లో జానకిరాం పరిచయమయ్యాడు. నన్ను ఓదార్చాడు. నా కన్నీళ్ళు తుడిచాడు. నీతోసహా నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. నాకందులో తప్పులేదనిపించింది. నన్ను మోసంచేసినవాడు ఎక్కడో ఒకచోట నా డబ్బుతోనే సుఖంగా వుంటాడు. నేనుమాత్రం ఏడుస్తూ వంటరిగా మిగిలిపోవాలా అనే ప్రశ్న నన్ను అతన్ని పెళ్ళిచేసుకునేలా చేసింది. నా జీవితాన్ని సరిదిద్దుకోవాలని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను.
ఆ తర్వాత అతన్లో మార్పొచ్చింది. నీ వునికిని సహించలేకపోయేవాడు. ఎందుకని నిలదీసాను. నిన్ను చూస్తుంటే అతనికి మీ నాన్న … అంటే అప్పటికే నా జీవితంలో వున్న మరో వ్యక్తి గుర్తొస్తాడు. అతను తిరస్కరిస్తేనేకదా, మాకిద్దరికీ పెళ్ళవగలిగిందనే ఆలోచన వస్తుంది. అప్పుడతనిలో అసంతృప్తి నిద్రలేచేది. అంటే జరిగిన రెండు పెళ్ళిళ్ళనీ వాటి తాలూకూ పర్యవసానాలనీ బేలన్స్ చేసుకోవలసిన అదనపు బాధ్యత నాకు మొదలైంది. ఆ ప్రాసెస్‍లో నీకు అన్యాయమే జరిగింది. కాదనను. కానీ నీ మంచికోసమే ఇదంతా జరిగిందని నువ్వు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడేనా నువ్వు గ్రహిస్తావనుకున్నాను.
సరే, జరిగిందేదో జరిగిపోయింది. అయాం సోసారీ ఫర్ యూ. నన్ను క్షమించగలిగితే క్షమించు. నువ్వు తమ్ముళ్ళపేరిట రాసిన ఆస్థి కాగితాలు వెనక్కి తీసుకో. నీ ఆస్థిని నువ్వు ఇంకెలాగేనా ఖర్చుపెట్టుకో. నీకు సంతృప్తి కలిగేలా ఏదేనా చెయ్యి. ఇలామాత్రం వద్దు. అది నిన్నింకా బాధపెడుతుందని నా నమ్మకం” అంది.
ఆవిడ మాటల్లో, బాధలో నిజాయితీ వుంది. తప్పు ఆవిడది కాదు. ఆవిడ భర్తది. ఇద్దరు భర్తలదీ కూడా. ఎవరూ కాదనలేరు. కానీ, పిల్లలు తల్లితండ్రులని క్షమించవలసిన పరిస్థితి వచ్చిందంటే ఆ గాయాలలోతు కొలవడానికి ఎలాంటి కొలమానం వుండదనే వాస్తవం, అందులో వుండే విషాదం, గౌతమ్‍ని చూస్తుంటేగానీ అర్థమవలేదు.
ఆవిడ వెళ్ళిపోయింది.
రెండుచేతులమధ్యా తలని పెట్టుకుని గౌతం అలా వుండిపోయాడు. అతని భుజమ్మీద చిన్నగా తట్టి హర్షా, తన వెనుక నేనూ అక్కడినుంచీ కదిలాం , సిట్యుయేషన్ని అవంతికి వదిలేసి.


డైరీ ఆగిపోయింది. కళ్ళు మిరుమిట్లుగొలిపే వెలుతుర్లోంచీ చిమ్మచీకట్లోకి జారిపోయినట్టైంది అభిజిత్ పరిస్థితి. ఎంతో వుత్కంఠతో సాగుతున్న నవల మధ్యలో ఆపేసినట్టు అసంతృప్తి, అసహనం. ఆ నలుగురూ ఎవరు? వాళ్ళు కొత్త గ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళారా? ఆ గ్రహాన్ని వెతికి పట్టుకున్నారా? ఏ గ్రహమ్మీంచీ ఇంకే గ్రహం మీదికి వెళ్ళారు? అసలిది నిజమా? ఏదో సైన్స్ ఫిక్షన్ నవలలోని భాగమా? అసలలా జరగడం సాధ్యమా? శ్రీరాం అన్నట్టు తప్పుదారిపట్టించడానికి ఎవరేనా ఇదంతా చేసారా? అదే నిజమైతే తనంత ఫూల్ మరొకడుండదు. భయంకరమైన నిస్పృహ ఆవరించిందతన్ని.
భుజమ్మీద మృదువైన స్పర్శతో ఈ లోకంలోకి వచ్చాడు. ప్రణవి.
“నీ యజ్ఞం పూర్తైందా? మూడురోజులైంది, నువ్వు నీ ప్రపంచంలోకి వెళ్ళి. ఈ మూడురోజుల్లో నువ్వు కనీసం నాలుగుసార్లు భోజనం స్కిప్ చేసావు. మొత్తమంతా కలిపి ఎనిమిదిగంటలుకూడా నిద్రపోలేదు” అంది తన రెండో చేతిని అతని ఇంకో భుజంమీద వేసి తను అతని వెనక్కి వచ్చి ఆనుకుని నిలబడుతూ. అతని తల ఆమె వక్షానికి తాకుతోంది. ఆమె స్పర్శలోని లాలిత్యానికీ, గొంతులోని మార్దవ్యానికీ అతను అతను కదిలిపోయాడు. చిన్నపిల్లవాడిలా సిగ్గుపడ్డాడు.
“మనం మాట్లాడుకుని డెబ్భైగంటలపైనే అయింది” ఆమె వ్యక్తపరచని ఇంకో భావాన్ని అతని మనసు గుర్తించింది. పెళ్ళంటే ఈ ఏకీకరణే అన్న ఆలోచన అతన్ని సుతారంగా తాకింది. ఆమె చేతులు తనచేతుల్లోకి తీసుకుని పెదవులకి తాకించుకున్నాడు.
“ఇలాగైతే ఎలా అభీ? రెగ్యులర్‍గా తినాలి. రెగ్యులర్‍గా నిద్రపోవాలి. లేకపోతే ఆరోగ్యం ఏమౌతుంది? నువ్వంటూ వుంటేకదా, ఏదైనా సాధించగలిగేది? ” మెత్తగా అడిగింది.
“చాలా అలిసిపోయాను ప్రణవీ! నా వెతుకులాట అర్థంలేనిదనిపిస్తోంది. దానికోసం ఎన్నో పోగొట్తుకున్నాను. ఈమధ్య మరీ తెలుస్తోంది ఆ విషయం. కొద్దిరోజులు ఎటేనా వెళ్దామా, మార్పుగా వుంట్టుంది. నీక్కూడా బావుంటుంది” అడిగాడు.
ఆమె అతన్ని నిశితంగా చూసింది. ఇలాంటి క్షణంకోసమే ఎదురుసూస్తోంది. ఇప్పటిదాకా అతనికి వ్యతిరేకంగా ఏదీ చెప్పలేదు. అలా చేస్తే తననీ దూరం నెట్టేస్తాడు. అందుకని అతనికి నచ్చినవిధంలోనే వెళ్ళి అతన్ని మార్చాలనుకుంది. పైసా పైసా కూడబెట్టి లక్షాధికారి కావాలన్నది ఒకరి జీవితాశయం కావచ్చు. ఉన్న కోట్లన్నీ ఖర్చుపెట్టి ఒక వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించాలన్నది ఇంకొకరి జీవితధ్యేయం కావచ్చు. తన మూలాలు వెతుక్కొవడం ఇతని ఏకైక జీవితగమ్యం కావచ్చు. కాకపోతే … మైగాడ్! నిద్రాహారాలు మానేసి కంప్యూటర్ ముందు ఇన్ని గంటలా? అతనిది మెదడా? లేక ఇనుపగుండా? ఇంకొకరెవరేనా ఐతే ఈపాటికి ఏ పిచ్చాసుపత్రిలోనో చోటు వెతుక్కునేవారు.
నిజంగా ఆమెకిది దిగ్భ్రమే. లేబ్‍లలో రోజులతరబడి కూర్చునేవాళ్ళనీ, లైబ్రరీల్లో పుస్తకాలకి అతుక్కుపోయేవాళ్ళనీ చూసింది. అయిష్టంగానేనా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఇతనిలా బయలాజికల్ క్లాక్‍నే మార్చేసుకోరు.
“ఎక్కడికెళ్దాం?” అడిగింది.
“ఎలాంటి టెక్నాలజీ లేనిచోటికి. అసలలాంటి చోటు మిగిలుందా, భూమ్మీద?” అడిగాడు.
ఆమె తలూపింది. అతను ప్రశ్నార్థకంగా చూసాడు.
“అవనతేశ్వరం” నెమ్మదిగా అంది.
అతను విస్మయంగా చూసాడు. “అక్కడికి… అక్కడికి నువ్వు రాగలవా? వచ్చి వుండగలవా? వచ్చి ఆ నిరామయ ఏకాంతాన్ని భరించగలవా?” అలాంటిచోటికి వెళ్ళాలని ప్రతిపాదించింది తనేనని మర్చిపోయి గబగబ అడిగాడు.
తదేకంగా అతనికేసి చూసింది ప్రణవి. ఆ చూపులకి అర్థం అతను తనుగా గ్రహించేలోపు తనే చెప్పింది. “నీతో గడిపే క్షణాలు నాకు చాలా అపురూపమైనవి అభీ! ఆ సమయంలో నా చుట్టూ వుండే భౌతికప్రపంచం తన వునికిని కోల్పోతుంది. ఆ కొద్దిసమయం మాత్రమే వాస్తవంలా అనిపిస్తూ నా జీవితమంతా నిండిపోయిన భావన కలుగుతుంది. అలాంటి అనుభవంకోసం నేను అవనతేశ్వరమైనా, అంతరిక్షంలోకేనా, దిగంతాల అవతలకేనా రాగలను”.
అప్పుడనిపించింది అతనికి మరోసారి, అప్పటికే తను చాలా పోగొట్టూకున్నాడని. ఇంకా పోగొట్టుకోకూడదనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నాడు.
లేచాడు. ఫ్రెషవడానికి వెళ్తూ అన్నాడు,” చాలా ఆకలిగా వుంది. స్నానం చేసి వచ్చేసరికి తినడానికి ఏమైనా పెట్టు.”
అతనలా ఎప్పుడూ తనకి ఆకలిగా వుందని గుర్తించలేదు. ఇప్పుడుకూడా. కానీ ప్రణవిని సంతోషపెట్టడానికి అన్నాడు. అతని భోజనమయాక జీవని, శ్రీరాంలని కలవటానికి వెళ్ళారు. నలుగురూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాక జీవని ప్రణవిని తన గదిలోకి తీసుకెళ్ళింది విడిగా మాట్లాడుకోవడానికి.
“అభీ ఏమైనా మారాడా?” అడిగింది జీవని కొద్దిసేపు వాళ్ళ వాళ్ళ వృత్తులకి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాక.
“అలిసిపోయాను, మార్పు కావాలి అనుకుంటున్నాడంటే మార్పు మొదలైందనే అనిపిస్తోంది. తనున్న ఫ్రేంలోంచీ బైటికి రావటానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు” అంది ప్రణవి.
జీవని సుదీర్ఘంగా నిశ్వసించింది. “నాకతన్తో పదేళ్ళకి పైబడి పరిచయం. అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. అంత తెలివిగలవాడికి మనిషి ఇంటలెక్చువల్‍గా వుండకపోతే ఎలాంటి నష్టం లేదుగానీ, ఆరోగ్యంగా వుండకపోతేమాత్రం తీరని హాని జరుగుతుందని తెలీకపోవటమేమిటో నాకర్థమవదు”
“కాలేజిరోజులప్పటినుంచీ అతన్నిగురించి వినటం జరగడం జరిగింది జీవనీ! అతనంటే ఆరాధన నాలో. పెళ్ళిచేసుకోవాలని అప్పుడెప్పుడూ అనుకోలేదుగానీ, మొదటిసారి దెబ్బతిన్నాక ఇతన్ని గమ్యంగా పెట్టుకునే నేను ఎదిగాను. అతని స్థాయిని నేనెప్పటికేనా చేరుకోగలుగుతానా అనుకునేదాన్ని. ఇప్పటికి ఆరోజు వచ్చింది. ఇద్దరం దగ్గిరదగ్గిరగా వున్నాం. అప్పుడు నాకతనిగురించి ఎలాంటి భయాలూ లేవు. అతనొక రోల్ మోడల్ అంతే. ఇప్పుడుమాత్రం ప్రతిక్షణం భయమే. తిండి సరిగా తినడు. నిద్ర సరిగా పోడు. ఏమైపోతాడోనని క్షణక్షణం ఆందోళనే” అంది ప్రణవి కన్నీళ్ళతో.
“వద్దు. ఏడవకు. ప్రెగ్నెంటుగా వున్నప్పుడు దిగులుపడితే పాపాయికి మంచిది కాదు. అతనిగురించి తెలిసే చేసుకున్నావు. అతనుకూడా తనగురించి అన్నీ చెప్పి, నిన్ను పెళ్ళిచేసుకోకుండా వుండే దిశగానే ప్రయత్నించాడు. రాజీతప్ప మరో మార్గం లేదు. కొంతకాలం ఓపికపట్టు. అతనికే అర్థమౌతుందేమో! ఐనా పాపాయిని కనేదాకా వచ్చాడంటే మారినట్టేగా అర్థం?” అని అర్థవంతంగా నవ్వింది జీవని. అందులో ప్రణవిని ఛీరప్ చేసే ప్రయత్నం వుంది. ప్రణవి చిన్నగా సిగ్గుపడింది.
“స్కానింగ్ చేయించుకున్నావా? అంతా నార్మలేగా?” అడిగింది. ఆమె కొడుక్కి రేబిట్ లిప్ వుందని తెలిసి ప్రీనాటల్ సర్జరీ చేయించారు. గుండెకి వుండే చిల్లులు సైతం ఫీటల్ సర్జరీతో సరిచేస్తున్నారు. పిల్లలిప్పుడు చాలా ఆరోగ్యంగా పుడుతున్నారు. శిశుమరణాలు చాలావరకూ తగ్గిపోయాయి.
ప్రణవికూడా టెస్టులన్నీ చేయించుకుంది. పాపాయి ఆరోగ్యంగా వుందని రిజల్టు వచ్చింది. అది ఆమెకి నిశ్చింతనిచ్చింది. ఐతే అన్నింటికన్నా ఎక్కువగా ఆమెకి నవ్వుతెప్పిస్తున్న విషయం భర్త అమాయకత్వం. జీవాన్ని సృష్టించడం ఇంత తేలికా అనే ఆశ్చర్యంలోంచీ అతను తేరుకోలేకపోతున్నాడు.
“ప్రిమియర్ నాతో మాట్లాడారు జీవనీ! ఆడమ్స్ కేవ్ చిప్ లక్షసంవత్సరాలానాటిదని అతనన్నాడంటే ఏదో ఒక ఆధారంలేకుండా వుండదు, నిజమే అయుంటుందని అన్నారు. ఇతనికోసమే ప్లానెట్ ఎక్స్ మీదికి మనుషుల్ని పంపించే ప్రతిపాదనని వాయిదా వేసారట. ఎందుకో తెలీదు, అతన్నా గ్రహం విపరీతంగా ఆకర్షిస్తోంది. తన మూలాలు అక్కడున్నాయనే ఇన్స్టింక్చువల్ బిలీఫ్ అతన్లో బలంగా వుంది. ఐతే అతనింకా దాన్ని గుర్తించలేదు. తనకి తెలీకుండానే వ్యక్తపరుస్తున్నాడు. అతని వూహలు సరైనవేనేమో ! కాదని నేననలేను. కాదని అతన్ని నిరుత్సాహపరచలేను. కాదంటే నన్నూ దూరంగా తోసేస్తాడేమోనని భయం. అతను తన దార్లో ముందుకి వెళ్తుంటే నేను వెనుక నడుస్తున్నాను”.
ప్రేమగా చూసింది జీవని ఆమెని. ఒక బాధలాంటిదికూడా కలిగింది. “నీలాంటి మంచి అమ్మాయిని ఎందుకు కాదనుకున్నాడో శ్రీనివాస్ అర్థం కావడంలేదు” అంది.
వీళ్ళంతా పెద్దపెద్ద ఇన్స్టిట్యూషన్స్‌నుంచీ వచ్చారు. పదోతరగతిదాకా ఒక దగ్గిర చదువుకుని ఇంటర్లో వేర్వేరు కాలేజీలకి వెళ్ళి అక్కడ కొత్త స్నేహితుల్ని ఏర్పరుచుకుని అక్కడినుంచీ డిగ్రీలోనూ, మాస్టర్స్‌లోనూ, ఆతర్వాతా ఇంకెక్కడెక్కడో చదివి, చదివినచోటల్లా కొందరు పాతవాళ్ళని కలుసుకుంటూ, ఇంకాఇంకా కొత్తస్నేహాలని ఏర్పరుచుకుంటూ ఇలా ఒక నెట్‍వర్కులాగా వ్యాపించారు. వీళ్ళ బేచిలే కాకుండా వీళ్ళ జూనియర్లు, సబ్ జూనియర్లు, సీనియర్లు, సూపర్ సీనియర్లు, ఏడాదికి నాలుగైదు అలుమినీ ఫంక్షన్లు… ఇలా చాలా విస్తృతమైన పరిచయాలు. ఏ కాలేజి కేంపస్‍లో ఏది జరిగినా ఏదో ఒకదార్లో అందరికీ తెలిసిపోతుండేది. అలా ప్రణవీ, శ్రీనివాస్‍లగురించి జీవనికి తెలుసు. అప్పట్లో వాళ్ళది ఒక లవబుల్ ఎపిసోడ్.
“ఇద్దరం వేరువేరు కేంపస్‍లలో చదువుకుంటూ ఒక సెమినార్లో కలుసుకున్నాం జీవనీ! ప్రేమించుకున్నాం. పెళ్ళికూడా చేసుకున్నాం. మేం విడివిడిగా వున్నప్పుడు మా కేంపస్‍లలో మేమే టాపర్స్‌మి. పెళ్ళయాక ఒకదగ్గిర వచ్చి చేరాము. ఎవరు పెద్ద గీత, ఎవరు చిన్నగీత అనేదానిమీద క్లాష్ వచ్చింది. నాకు వచ్చినన్ని అవకాశాలు అతనికి వచ్చేవి కావు. అతను జీర్ణించుకోలేకపోయాడు. దీనికి సింపుల్‍గా ఇగో సమస్య అని పేరు పెట్టేస్తాంగానీ వాస్తవరూపం అది కాదు. మనతో సమానం లేదా, మనకన్నా ఒక మెట్టు తక్కువ అని భావించిన వ్యక్తి మనకన్నా వున్నతుడు కావటాన్ని భరించలేనితనం. ఈరోజుని అభీ శాస్త్రవేత్తల ఫోరంలో ఎదుర్కొంటున్నదీ అదే. ఆ బాధ తెలుసుకాబట్టి, స్వయంగా అనుభవించానుకాబట్టి అతన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను” ప్రణవి చెప్పింది.
“అభీతో నీ పరిచయం?” కుతూహలంగా అడిగింది జీవని.
భర్తతో విడిపోయిన చాలాకాలందాకా అతన్ని మర్చిపోలేకపోయింది ప్రణవి. అతనో చేదుజ్ఞాపకంలా ఆమె మనసులో కదుల్తూ వుండేవాడు. పెళ్ళంటే ఒకరకమైన అసహ్యాన్ని పెంచుకుంది. జీవితంలో మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దనుకుంది. అభిజిత్ సంస్కారం ఆ నిర్ణయాన్ని సడలించింది.
“మన పరిచయాలు, ప్రేమలు కాలేజి కేంపస్‍లని దాటిపోయాయి. చదువుకుంటూ ఎవరేనా ప్రేమలో పడ్డారంటే అది అపరిపక్వతగా అనిపించే స్టేజికి వచ్చాము. ప్లానెట్ ఎక్స్ గురించి ఏవో వివరాలకోసం అతను స్పేస్ సెంటర్‍కి వస్తే అతన్ని నా దగ్గిరకి పంపించారు. నేను చెప్తుంటే అతని కళ్ళలో ఆరాధన. అదే నన్ను కట్టిపడేసింది. అలాంటి ఆరాధన నేనెప్పుడూ శ్రీనివాస్ దగ్గిర చూడలేదు. నేనేదైనా కొత్తవిషయం చెప్తే అతనికి అయిష్టంగా వుండేది. తనకి ముందే తెలుసునన్నట్టు పోజిచ్చేవాడు. అలాంటి భేషజం ఇతన్లో లేదు. అందుకే మా సంబంధం శాశ్వతంగా వుంటుందని నాకు నమ్మకం కలిగింది”
జీవని ఆమెకేసి చూసి నవ్వింది. “అభీకి గొడవపడటం రాదు. అసలతనికి తీసుకోవటమే తప్ప ఇవ్వటం అసలే రాదు, సంతోషాన్నీ దు:ఖాన్నీకూడా”.
అక్కడ మరోగదిలో అభిజిత్, శ్రీరామ్ మాట్లాడుకుంటున్నారు. “నువ్వన్నట్టే జరిగింది. ఏదో సైన్స్ ఫిక్షన్ నవలని ఫీడ్ చేసి వదిలారు ఆ చిప్‍లో” అన్నాడు అభిజిత్ చిన్నబుచ్చుకున్న మొహంతో. శ్రీరామ్ పెద్దగా నవ్వేసాడు. అభిజిత్ ముఖం ఎరుపెక్కింది. అలిగిన చిన్నపిల్లాడిలా కూర్చున్న అతన్ని చూస్తుంటే శ్రీరామ్‍కి క్షణక్షణానికి నవ్వు ఎక్కువౌతోందిగానీ ఆగడంలేదు.
“కంప్యూటర్లు… లక్ష సంవత్సరాలు… ” అతనింకా నవ్వుతునే వున్నాడు.
“కొద్దిరోజులు ఎక్కడికేనా వెళ్ళి రాకూడదూ?” అడిగింది జీవని, ప్రణవిని.
“నేనూ అదే ఆలోచిస్తున్నాను. అతన్ని ఆ చెత్తపెట్టెకి దూరంగా కొన్నాళ్ళు ఎటేనా తీసుకెళ్ళాలి. అప్పుడైతేగానీ బాగుపడడు” కోపంగా చెప్పింది ప్రణవి.
“లాప్‍టాప్ కూడా తీసుకురానివ్వకు” ఆ కోపాన్ని చూసి నవ్వి సలహా ఇచ్చింది జీవని.
“సెల్ ఫోన్ సిగ్నల్ కూడా దొరకనిచోటికి తీసుకెళ్తాను. ఇంకా ప్రణవి కోపం తగ్గలేదు.
జీవని తన జీవితాన్ని పోల్చుకుంది. ఉన్నంతసేపూ శ్రీరామ్ సరదాగా వుంటాడు. కబుర్లు చెప్తాడు, జోక్స్ వేసి నవ్విస్తాడు. అతనికి వచ్చిన వంటలు చేసి తినిపిస్తాడు. తనకైతే ఒక్క క్షణంకూడా వదిలిపెట్టి వుండాలనిపించదు. కానీ చదువుకున్న చదువు, ఎంచుకున్న వృత్తి ఇంటికే అంకితమై వుండనివ్వవు. అదీకాక వుద్యోగంతో అతను, చదువుతో పిల్లలు బిజీగా వున్నప్పుడు తనొక్కర్తీ ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలనే ప్రశ్న తలెత్తుతుంది. చదివిన చదువు, చేతినిండాగల తీరిక ఏదో ఒకటి చెప్పమని ప్రేరేపిస్తాయి. అలా ఏదో ఒకటి చెయ్యడం మొదలుపెట్టాక ఇంక కాలం తన చేతుల్లో వుండదు. అప్పుడప్పుడు ఈ విషయంలో అసంతృప్తిగా అనిపించినా , వ్యాపకంలేకుండా వుండటం అసాధ్యంకాబట్టి రాజీ పడిపోయారు. కచ్చితంగా నెలలో మూడురోజులు- ఒకటి తామిద్దరే వంటరిగా, రెండోది పిల్లలతో కలిసి, మూడోది స్నేహితులూ బంధువులని కలుపుకుని… తప్పనిసరిగా గడపడానికి కేటాయించుకున్నారు.
అభిజిత్ అలాకాదు. ప్రపంచంతోటీ, మనుషుల్తోటీ విడివడిపోయి తనదార్లో తను బతుకుతున్న వ్యక్తి. అలాంటివాడితో సహవాసానికీ వంటరిజీవితానికీ పెద్దగా తేడా వుండదు. పైగా అతని బాధ్యతొకటి ప్రణవికి. శ్రీనివాస్‍తో తనేమీ సుఖపడలేదని చెప్పింది ప్రణవి. కాబట్టే విడిపోయారు. ఇప్పుడీ అభీ యిలా. ఇతను మారి ప్రణవిని సంతోషపెడితే బాగుండును. చిన్నగా నిట్టూర్చింది.
“ఎక్కడికెళ్దామని?” ఆలోచనల్లోంచీ తేరుకుని అడిగింది జీవని.
“అవనతేశ్వరం” ఠక్కున వచ్చింది జవాబు. ఆశ్చర్యంగా చూసింది జీవని.
“ఔను. అక్కడి గుహల్లో ఒకమాటు ఏడ్చి వస్తే అతనికున్న తిక్క కాస్త వదుల్తుందేమో చూడాలి”.
అవనతేశ్వరం… దాదాపు ఐదువేల చదరపుమైళ్ళమేర విస్తరించి వున్న రక్షితారణ్యం. మొదటంతా సెలయేళ్ళూ, జలపాతాలూ , రకరకాల పూలచెట్లతో పొదలతో నిండివున్న అడవి.
బయాలజీ విద్యార్థులకైతే అది అక్షయపాత్రే. అంత వృక్షవైవిధ్యం వుంటుందక్కడ. ఆ పొదలమధ్య విశాలమైన వసతిగృహాలు. అన్నీ అడవిలో దొరికే కర్రలతో, చెక్కలతో తీగలతో నిర్మించినవేకాబట్టి ఆ ప్రకృతిలో భాగంగా వుంటాయి. ప్రేమికులకీ కొత్తగా పెళ్ళైనవాళ్ళకీ గొప్ప హనీమూన్ స్పాట్. ఈ తోటలూ వనాలూ దాటి లోపలికి వెళ్తున్నకొద్దీ అడవి చిక్కబడుతుంటుంది. నిరామయ సంతోషం నిర్వికారమైన దు:ఖంలోని భాగమని చెప్తున్నట్టు రాతిగుహలుంటాయి.
అక్కడ దేవత అవ్వనాతి నిలువెత్తు విగ్రహం వుంటుంది. అవికాకుండా చిన్నాపెద్దా కొన్ని వందల విగ్రహాలు. పిల్లలవీ, పెద్దవాళ్ళవీ… ఆ శిల్పి ఎవరోగానీ నిర్విరామంగా చెక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతోదూరందాకా విస్తరించి వున్నాయి ఆ శిల్పాలు. అవన్నీ యాభైవేలయేళ్ళకన్నా ముందువని ఆర్కియాలజిస్టులు చెప్తారు. అన్నిటిలో ఒక విషాద స్పర్శ. ఆ దు:ఖాన్ని తట్టుకోవడం కష్టం. సంతోషంగా హనీమూన్‍కనో పిక్నిక్కన్నో వచ్చినవాళ్ళెవరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. అందినంతమేరకి మనసులో ప్రకృతిసౌందర్యపు ఆనందస్పర్శని పదిలపరుచుకుని వెళ్తారు. ఏ ఒకరిద్దరో లోపలిదాకా వెళ్ళినా విచలితులైపోయి కోలుకోవడానికి వ్యవధి తీసుకుంటారు.
అవ్వనాతిముందు అవనతమనస్కులై వుంటారుగాబట్టి అవనతేశ్వరం అనే పేరు వచ్చిందని తాత్త్వికులు అంటారు. అవ్వనాతి పేరుమీద ఆ పేరు వచ్చిందనీ చెప్తారు. ఏమైనా అక్కడికి అభిజిత్‍తో కలిసి వెళ్ళాలనుకుంది ప్రణవి. గుహల్లోకి కాదు, హనీమూన్ స్పాట్‍కి.
“తనని చాలా బాధపెడుతున్నాను. అవసరంలేని విషయాలకోసం మథనపడుతూ తనని హర్ట్ చేస్తున్నానని అనిపిస్తోంది” అన్నాడు అవతలిగదిలో అభిజిత్ శ్రీరాంతో. “కొన్నాళ్ళు అవనతేశ్వరం వెళ్ళి తనతో గడిపి వస్తాను… కనీసం నేను మారానని స్పష్టపరచడానికి.”
అతను ఆశ్చర్యంగా చూసాడు. అతన్లో ఇంత మార్పు… ఇలా ఆలోచించగలుగుతున్నాడంటే చాలా మారినట్టే లెక్క.
“లోపలికి వెళ్ళరుగా?” అడిగాడు శ్రీరామ్.
“….”
“వద్దు అభీ! ఈ వెతుకులాట, ఈ నైరాశ్యం, డిటాచిమెంట్సు మనిషికి అవసరంలేనివి. పుట్టుకంటూ పుట్టాక ఇష్టంతోనే బతకాలి. ఆ పుట్టుకకి ప్రత్యేకించి కారణం వున్నా లేకున్నా కూడా బతకడం అనివార్యం. అలాంటప్పుడు ఏదో బరువు మోస్తున్నట్టెందుకు? నీ సిద్ధాంతాలూ నమ్మకాలూ తప్పని నేననను. కానీ వాటిలో పడి నిన్ను నువ్వు కోల్పోకు. ప్రణవి నిన్ను ఇష్టంగానే చేసుకుంది. అలాగని తన కర్మానికి తనని వదిలెయ్యకూడదు. నీకు తెలీదని నేను చెప్పడంలేదు. నువ్వూ అందర్లా సంతోషంగా వుంటే మాకూ సంతోషంగా వుంటుంది” అన్నాడు.
అభిజిత్ అర్థంచేసుకున్నట్టు తలూపాడు.
ప్రణవీ, జీవనీ వచ్చారక్కడికి.
“నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు ప్రణవీ! మీరక్కడికి వెళ్ళడం నాకిష్టం లేదు. వేరే ఎక్కడికేనా ఐతే సంతోషంగా వుండేది. కానీ వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నాక వద్దని చెప్పలేను. హనీమూన్ స్పాట్ దాటి లోపలికి వెళ్ళద్దు. మామూలువాళ్ళకే మనసు చాలా విచలితంగా వుంటుందట. ఇంక వీడిలాంటివాళ్ళైతే ఆ మూడ్‍లోంచీ బైటికి రావడం కష్టం” జీవనితో అభిజిత్ మాట్లాడుతున్నప్పుడు శ్రీరాం ప్రణవితో చెప్పాడు.
“మీరు వెళ్ళారా, అక్కడికి?” అడిగింది.
“కాలేజిలో చదువుతున్నప్పుడు పిక్నిక్కి వెళ్ళాము. నేను దారి తప్పాను. చాలా లోపలికి వెళ్ళిపోయాను. వర్షం పడుతుంటే ఒక గుహలోకి వెళ్ళాను. గాలి వీచినప్పుడల్లా ఒక మగవాడు హృదయవిదారకంగా ఏడుస్తున్న శబ్దం వస్తుంది. నువ్వూహించలేవు. చాలాకాలం అది నన్ను వెంటాడుతునే వుంది. ఇప్పటికీ గుర్తొస్తే చలించిపోతాను.”
“ఎందుకలా?”
“ఇవన్నీ అభీకి తెలీవని నేననుకోను.ఆ గుహల్లో చిత్రాలూ , శిల్పాలూ కొన్ని యుగాలనాటివని నమ్మకం. మగవాడి రోదన అక్కడెక్కడో నిక్షిప్తమైపోయి గాలి చేసే చిన్నపాటి కదలికలకి ప్రకంపించి ప్రతిధ్వనిస్తుందని ఒక సైన్స్ జర్నల్లో చదివాను. రిజొనెన్సా, ఏమంటారు ఆ ఎఫెక్టుని?”
ప్రణవి అతని ప్రశ్నకి జవాబివ్వలేదుగానీ ఆ మాటల్ని మననం చేసుకుంది. ఎందుకో ఆమెకి అనిపించింది, ఆ గుహల్లోనే అభిజిత్ వెతుకులాటకి జవాబు దొరుకుతుందని. అప్పుడతను ఏమౌతాడు? అతనుగా మిగుల్తాడా? ఊహించడానికి కొంచెం భయమేసింది. అతనుగా అడిగితే తప్ప గుహల్లోకి వెళ్ళకూడదని నిశ్చయించుకుంది.
ఇంకొద్దిసేపు వుండి తిరిగి వెళ్ళిపోయారు అభిజిత్, ప్రణవి.


పొద్దుట భోజనం చేసి ఫ్లైట్ ఎక్కితే రెండౌతుంటే అవనతేశ్వరానికి నాలుగుగంటల దూరంలో దిగారు. అక్కడినుంచీ కారు అద్దెకి తీసుకుని బయల్దేరారు. అవనతేశ్వరం దగ్గిరపడుతుంటేనే వాతావరణం చాలా మార్పుగా అనిపించింది ఇద్దరికీ.
జనసమ్మర్దం మాట అటుంచితే జనసంచారమే లేదు. ఎక్కడా నాగరీకత వాసనలే లేవు. ఎక్కడో వుండుండి ఒక పిట్ట కూస్తున్న కూత గాలి అలలమీదుగా తేలి చెవులని తాకుతోంది. అదే గాలి పూలవాసనలని మోసుకొస్తోంది. ఏదో అర్థంకాని ఆహ్లాదం మనసునిండా చెమ్మలా పరుచుకుంటున్నట్టుంది. ఆ వెనుకనుంచీ ఏదో అలజడి. అది అలజడికూడా కాదు. అర్థంకాని భావోద్వేగాల కదలిక… సుదూరపు జ్ఞాపకాలు అస్పష్టంగా తెర వెనుకనుంచీ తొంగి చూస్తున్నట్టు. ముఖ్యంగా నీలి నక్షత్రాన్ని తరచు గమనిస్తుండే అభిజిత్‍లో. ప్రణవి మామూలుగానే వుంది.
అభిజిత్ ఆమెకి దగ్గిరగా జరిగి ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తునే మరోచేతిని భుజాల చుట్టూ వేసాడు.
“చాలా బావుందికదూ, ఇక్కడ?” అడిగాడు ఉద్వేగంగా.
నవ్విందామె.
“రెండు కిలోమీటర్లదూరందాకానే వాహనాలు అనుమతిస్తారు. మిగిలిందంతా నడవాలి. నువ్వంత దూరం నడవగలవా?” అడిగాడు.
“ఎందుకు నడవలేను? నాకేమైంది? “
“ఇలాంటప్పుడు అసౌకర్యంగా వుండదా?” ఆమెకి మరింత దగ్గిరగా జరుగుతూ అడిగాడు.
“అలాంటివేం వుండవు. మీరనుకున్నంత దుర్బలంగా వుండరు ఆడవాళ్ళు. కానీ…” కొద్దిపాటి సంకోచంతో ఆగింది. చెప్పాలనుకున్న విషయం ఆమెకి ఇబ్బందిని కలిగిస్తోంది. కారణం అలాంటివి ఎవరికి వారు అర్థం చేసుకోవాలిగానీ ఒకరు చెప్పి వివరించలేరు.
“చెప్పు” అన్నాడు, గాలికి ఆమె చెంపలమీదికి జారి సుతారంగా కదుల్తున్న వెంట్రుకలపాయని చూపుడువేలితో కదుపుతూ.
“కొద్దిగా కన్సర్న్ కావాలనిపిస్తుంది. పెద్దవాళ్ళతో ఇంకా చెప్పలేదు. వెళ్ళి ఈ విషయాన్ని చెప్పివద్దామా?” అడిగింది. అతను తలూపాడు. సగమే చెప్పింది. ఇంకో సగం తనలోనే దాచుకుంది. అదింక మాటల్లో వ్యక్తపరచవలసిన అవసరం లేదనిపించింది. అమ్మవొళ్ళో తలదాచుకోవాలనివుందని నోరువిడిచి ఎలా చెప్పగలుగుతుంది? తను చెప్పినా అతనికి అర్థమౌతుందా?
చెక్ పోస్టు దగ్గిర దిగి కారు అక్కడ అప్పగించారు. సెల్ ఫోన్ ఇచ్చేసేముందు ఆఖరిగా ఒక కాల్ శ్రీరాంకి చేసాడు అభిజిత్.
“సంతోషంగా గడిపి రండి. తిరిగి వచ్చాక నిన్ను నేను డిఫరెంటుగా చూడాలనుకుంటున్నాను” అన్నాడు శ్రీరామ్. అభిజిత్ నవ్వి ఫోన్ పెట్టేసాడు.
చెక్‍పోస్టునుంచీ లోపలికి కాలినడక. చెట్లు వాటిని అల్లుకున్న పూలతీగలతో రానురాను సందులేని పొదలుగా చిక్కబడి అడవిగా రూపుదిద్దుకుంటున్న దృశ్యం చాలా అందంగా వుంది. అనేకరకాల పువ్వులు విరబూసి వున్నాయి. ఆ మధ్యని చెదురుమదురుగా కాటేజిలు.
“భయం వుండదా?” అడిగింది ప్రణవి కుతూహలంగా.
“ఇరవైనాలుగ్గంటల సెక్యూరిటీ వుంటుంది. గార్డ్స్ తిరుగుతుంటారు” అక్కడికి వద్దామనే నిర్ణయం తీసుకునేముందు ఆమె తనతో అన్నమాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు.
“ఆ భయం కాదు, నేననేది. పాములు, జంతువులు…”
“పాముల్ని పసిగట్టడానికి కుక్కలు తిరుగుతుంటాయి. కౄరమృగాలనుంచీ రక్షణకోసం అడవంతా తొలిచి మనం తిరిగే ప్రదేశమంతా బార్బ్ డ్ వైర్ తో ఫెన్సింగ్ పెట్టారు”
“వీళ్ళకోసం కేటాయించబదిన కాటేజి నెంబరు ఇరవైమూడు. వెదుళ్ళతోటీ, ఇంకా అక్కడ అడవిలో దొరికే ఇతరవస్తువులతోటీ నిర్మించబడి ఒక కళాఖండంలా వుంది. అందులోని ఫర్నిచర్ కూడా కలపదుంగలు, వెదుళ్ళ అల్లికలు… అంతే.
” ఈమధ్య ఒక ఆర్టికల్ చదివాను. మన పరిసరాలలో దొరికే వస్తువులతో కట్టుకుంటే ఇల్లుకట్టడానికి చాలా తక్కువ ఖర్చౌతుందట. అలాగే పర్యావరణహితంగా వుంటాయట. ఈ కాటేజి కట్టడానికి వాస్తవంగా ఏమీ ఖర్చైవుండదు, కొంత శ్రమతప్ప” అంది ప్రణవి అవి చూస్తూ.
“కానీ ఈ యిళ్ళని మెయింటేన్ చెయ్యటం చాలా కష్టం. తరుచూ రిపేర్లు చేస్తుండాలి. ఆర్సీసీ ఐతే ఒకసారి కట్టాక దానికేసి చూడాల్సిన అవసరం వుండదు. అందుకే అందరూ శాశ్వతంగా వుండే ఇళ్ళనే కట్టుకుంటారు. దాన్నేకదా, మనం ప్రగతి అనేది?” అన్నాడు అభిజిత్.
ఇద్దరూ చాలా విషయాలని మాట్లాడుకున్నారు. అక్కడ నిత్యజీవితంలో లేని … ఎప్పుడూ దొరకని కొత్త సాన్నిహిత్యం. ఇద్దరూ ఒకరికొకరు కొత్తగా పరిచయమైనట్టు … అతను తన సబ్జెక్టుగురించీ ఆమె తన సబ్జెక్టుగురించీ… కొంతసేపు అతను వక్త, ఆమె శ్రోత… మరికాసేపు ఆమె వక్త, అతను శ్రోత. అతనికి దేన్లోనైతే ఆసక్తో అదే ఆమె సబ్జెక్టు. నీలినక్షత్రానికి వెళ్ళేదారి కావాలతనికి. ఆమె దగ్గిర అలాంటిదారులకి పునాదులున్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు అతని దగ్గిర వూహలున్నాయి. ఆ వూహల్ని నిజం చేసే అవకాశాలు ఆమెకి వున్నాయి.
“నాతో జీవితం బోరు కొట్టడంలేదా? “అడిగాడు అభిజిత్ వున్నట్టుండి.
“లేదు. కొత్త పుస్తకాన్ని చదువుతున్నట్టుంది. చాలా ఆసక్తిగా వుంది”
అతను ఆశ్చర్యపడుతూ ఆమె కళ్ళలోకి సూటిగా చూసాడు. వాటిలో నిజాయితీ వుంది.
“నేను స్పేస్ రిసెర్చియొక్క శాస్త్రీయకోణాన్నిమాత్రమే చూస్తున్నాను. నువ్వు మానవీయకోణాన్ని పరిచయం చేస్తున్నావు” అంది.
అతనికి చాలా సంతోషం కలిగింది. అలా ఇప్పటిదాకా తనతో ఎవరూ అనలేదు. ఆశ్చర్యంతోనో, అపనమ్మకంతోనో ,గౌరవంతోనో, భయంతోనో, విసుగుతోనో తను చెప్పినవి విన్నవాళ్ళనే అతను చిన్నప్పట్నుంచీ చూసాడు. ఎంత ప్రాణస్నేహితుడైనా, శ్రీరాంకి ఆ విషయాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడు ప్రణవి ఇలా అనేసరికి అతనికి ఆమెమీద చాలా ప్రేమ కలిగింది. ఆమెతో మమేకం కావడానికి అతని మనసు ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయి. అప్పటిదాకా పెళ్ళి విషయంలో ఇంకా ఏమూలో స్వల్పంగా మిగిలిపోయిన ఇబ్బంది పూర్తిగా తొలగిపోయింది. చిప్ గురించి సంకోచం లేకుండా చెప్పాడు.
“అందులో నేను చదివినది చాలా ప్రాచీనమైన భాష. ఆ డైరీలో వాడినదేకాదు, అందులోని గ్రంథాలలోదికూడా. అదిప్పుడు అసలే వాడుకలో లేదు. నాకుతప్ప ఇంకెవరికీ అర్థంకాదు. అలాంటి భాషలోకి అన్ని గ్రంథాలు తర్జుమా చెయ్యగలిగారంటే నేను నమ్మలేకపోతున్నాను. సైన్స్ ఫిక్షన్ నవలేమోనని మొదట అనిపించినా, ఆ భాషలో రాయాల్సిన అవసరం, రాసి అంత జాగ్రత్తగా దాచాల్సిన అవసరం వుండదుకదా?”విశ్లేషిస్తూ అన్నాడు. ఆమెతో అన్నట్టుగా కాకుండా తనలోకి తను చూసుకుంటూ ఆలోచించుకుంటున్నట్టుగా వున్నాయి ఆ మాటలు. మారడానికి అతనెంత ప్రయత్నించినా ఆ ఆలోచనలు, ఆ సంఘర్షణ అతన్నుంచీ తొలగిపోవని స్పష్టమైంది ప్రణవికి. శ్రీరాం సంతృప్తికోసమో, తాత్కాలిక వుపశాంతికోసమో దాన్ని సైన్సు నవల అన్నా, అతని మనసు ఆ విషయాన్ని వప్పుకోలేదు.
“నువ్వసలా లేంగ్వేజి మిషను ఎలా తయారుచేసావు? నీలో ఆ ఆసక్తి ఎలా కలిగింది? ఎవరికీ రాని ఆలోచనలు నీకే ఎందుకు వస్తాయి? ఎవరికీ అర్థంకాని విషయాలు నువ్వొక్కడివే ఎలా గుర్తించి అర్థంచేసుకుంటావు? ” కుతూహలంగా అడిగింది.
జవాబు చెప్పడానికి అతనికి కొంత వ్యవధి పట్టింది. “చాలా చిన్నప్పట్నుంచీ అంటే వూహ తెలిసినప్పట్నుంచీకూడా నేనుండే పరిసరాలు నాకు చాలా అపరిచితమైనవిగా , ఏదో కొత్త ప్రదేశానికి వచ్చి వుంటున్నట్టుగా అనిపించేవి. ఏవో గమ్మత్తైన ఆలోచనలు. కొంత అలజడిగా చాలా అశాంతిగా వుండేది. ఎప్పటికీ ఏదో వెతుకులాట. చాలా ఇబ్బంది పడేవాడిని”
“మీకసలు ఈ ఫీల్డులో ఆసక్తి ఎలా కలిగింది?”
“మా తాతగారివలన” ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పాడు. “ఆయనవల్లనే నేనిలా అయ్యానని అమ్మకి ఆయనంటే కోపంకూడా. నేను పెరిగి పెద్దౌతుంటే ఆ విషయం అర్థమైంది ఆవిడకి”
విస్మయంగా చూసింది ప్రణవి.
“ఆయన చాలా గొప్ప మేథావి. నిజమైన జ్యోతిష్యం తెలుసును. జ్యోతిష్యం అంటే దాని మూలాలు అటు ఆస్ట్రానమీలోకీ , ఇటు సైకాలజీలోకీ మరోవైపు ఫిజియాలజీలోకీ , ఆఖరుగా ఫిలాసఫీలోకీ విస్తరించి వుంటాయని నమ్మిన వ్యక్తి”.
ఊపిరి తీసుకోవడం కష్టమైంది ప్రణవికి ఆ మాటలు వింటుంటే. చెప్పినది మరెవరేనా ఐతే ట్రాషని కొట్టిపారేసేది. కానీ చెప్తున్నది అభిజిత్. అతని మాటల్ని చాలా జాగ్రత్తగా వినసాగింది.
“మనిషి ఒక కాస్మిక్ బాడీ. విశ్వంలోని వివిధ కాస్మిక్ బాడీస్ మధ్య ఆకర్షణ వికర్షణలెలా వుంటాయో , మనుషుల విషయంలోకూడా అంతే. భూమ్మీది వస్తువులని పట్టి వుంచేది భూమ్యాకర్షణ శక్తి. అది లేకపోతే అవన్నీ … మనంకూడా విశ్వంలో గిరికీలుకొడుతూ వుండేవాళ్ళం. కేవలం భూమ్యాకర్షణ శక్తి మాత్రమే వుండి దానికి వ్యతిరేకంగా కాస్మిక్ అట్రాక్షన్స్ లేకపోతే పరిణామాలు మరోలా వుండేవి. అంటే ఈ రెండు శక్తులూ మనమీద పరస్పర విరుద్ధంగా పనిచేస్తున్నాయన్నమాట. మనిషి భూమ్మీద వుంటాడుకాబట్టి జ్యోతిష్యంలో భూమిని కేంద్రంగా చూపిస్తారు.
ఇక ఈ రెండు విరుద్ధ శక్తుల్లో మొదటిది స్థిరంగా వుంటుంది. రెండోదీ స్థిరంగానే వుంటుందిగానీ వివిధ కాస్మిక్ బాడీస్ ప్రదర్శించే శక్తుల సమీకరణంవలన ఏర్పడుతుందికాబట్టి ఆ శక్తుల నిష్పత్తిలో తేడా వుంటుంది. అవి మనిషిని ప్రభావితం చేసే తీరు మారుతుంది. అది అతని తత్త్వం. మనసుని ఆకాశతత్త్వానికి ప్రతీకగా భావిస్తాము. అంటే ఈ కాస్మిక్ పవర్సన్నీ అక్కడ తమ ప్రభావాన్ని చూపించగలుగుతాయి. ఆ మనసుని స్థిరంగా వుంచుకోవాలనీ చంచలంగా వుండకూడదనీ అందుకే చెప్తారు. అది మానవ ప్రయత్నం.
ఒక మనిషి జన్మించిన సమయాన్నిబట్టి అతని జీవితకాలంలో ఖగోళపరంగా రాగల మార్పులని అంచనా వేసి దానికి అతడేవిధంగా స్పందించగలడో వూహించి ఆ స్పందనని నియంత్రించుకోగలిగితే పర్యవసానం ఎలా వుంటుందో … ఇవన్నీ సూక్ష్మంగా చెప్పగలిగేవారు మా తాతగారు. ఇది మనిషి భౌతిక జీవితానికి సంబంధించినది కాదు. భౌతిక జీవితాన్ని నియంత్రించగలిగే వ్యవస్థకి సంబంధించినది. ఇవన్నీ ఆయన నాకు చెప్తూ నీలినక్షత్రాన్ని చూపించి ఎందుకనో ఆ గ్రహం మన ఆలోచనలని ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నారు. అలా మొదలైంది ఆ గ్రహంపట్ల నాకు కుతూహలం”.
అభిజిత్ చెప్పడం పూర్తైనా ప్రణవి చాలాసేపటిదాకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. జ్యోతిష్యంమీద అమెకి నమ్మకంలేదు. అసలిదీ జ్యోతిష్యం అని ఎవరూ ఆమెకి ఇంత వివరంగా చెప్పలేదు. ఎవరేనా చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళకి ఇంత అవగాహన వుండదుకాబట్టి ఆమెని నమ్మించలేకపోయేవారు.
ఇంకే ప్రశ్నలూ అడగలేదు. అలా అడగడమంటే అతన్ని విశ్వసించలేకపోవడమేనని ఆమెకి ఎక్కడో లోతైనచోట అనిపించింది. అతనిలో మమేకం కావడమే తనకి అతన్ని అర్థం చేసుకునే శక్తినిస్తుందనికూడా అనిపించింది. చాలాసేపు ఇద్దరూ మౌనంగా వుండిపోయారు. ఏవో మాట్లాడుకోవాలని ఇద్దరికీ అనిపించినా , భావాలు మాటలకన్నా బలమైనవిగా మారి మౌనాన్ని పట్టుతివాచీలా ఇద్దరిమధ్యా పరిచాయి. ఇద్దరి అంతరంగాల స్పర్శ ఆ తివాచీని అధిష్ఠించి మానవీయ హద్దుగీతల్ని చెరుపుకుని ఒకదాన్లో ఒకటి కలిసిపోయాయి.
“బైట నడుద్దామా?” అడిగాడు. వెంటనే లేచింది ప్రణవి. రోజులకొద్దీ తన గదిలో బందీగా వుండిపోగలిగిన అతనిప్పుడు బైటి ప్రక్రుతిలో తిరగాలని అభిలషిస్తున్నాడు. అందులో ఏదో వింత కనిపిస్తోంది. అతని మనసుని ఆకర్షిస్తోంది. అప్పటికింకా పూర్తిగా చీకటిపడలేదు. ఆకాశం సంధ్యవెలుగులు చిమ్ముతోంది.
ఇద్దరూ నడవడం ప్రారంభించారు. చుట్టూ విరబూసిన పువ్వులు. నేలంతాకూడా తివాచీ పరిచినట్టు రాలిపడి వున్నాయి. ఈ పుష్పసౌందర్యాన్ని ఇంటర్నెట్‍లోనూ వాల్‍పేపర్లుగానూ చూసాడు అభిజిత్. అవే కళ్ళతో ఇప్పుడు వాస్తవంగా చూస్తున్నాడు. తేడాని అతని మనసు గుర్తించి వుత్తేజితమైంది. అలా చాలా దూరం నడిచాక సెలయేటి వడ్డుని కూర్చున్నారు. అప్పటికి చీకటి చిక్కబడి పల్చటి వెన్నెల పరదాల చాటుకి జారుతోంది. తన వునికిని కోల్పోతోంది.
వెన్నెలబాలలా వుంది ప్రణవి. ఆహ్లాదకరమైన ప్రకృతి, పక్కనే ఇష్టసఖి, భావోద్వేగాలతో తొణికిసలాడుతున్న మనసు.ప్రంచాన్ని కొత్త ఫ్రేంలోంచీ చూపిస్తున్నాయి. అతను ఇప్పుడొక సాధారణ యువకుడు.భావుకుడు. ప్రేమోన్మత్తుడు. తన హోదానీ , విజ్ఞానాన్నీ అన్నిటినీ తాత్కాలికంగా మర్చిపోయాడు. లేత వూదారంగు పువ్వులగుత్తి కోసి ప్రణవి జడలో పెట్టాడు. నీలిరంగు పువ్వులతీగల్ని తెంపి రెండుకొసలూ ముడేసి ఒకటి తన మెడలో వేసుకుని మరొకటి ఆమె మెడలో వేసాడు. సెలయేట్లో దిగి అంత దూరాన్న వున్న కలువపువ్వు కోసి బహుమతిగా ఇచ్చాడు. దాన్ని రెండు చేతుల్తో అందుకుని అపురూపంగా వళ్ళో వుంచుకుంది. ఆమె మనసులో ఏవో మథురోహలు. ఆ కలువల ఎర్రదనం ఆమె ముఖంలో ప్రతిబింబించింది. తెల్లటి వెన్నెల్లో అరుణకాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె ముఖాన్ని వింతగా చూసాడు. రాత్రి చాలా పొద్దుపోయేదాకా అక్కడ గడిపి కాటేజికి వచ్చారు. అటెండెంటు వచ్చాదు.
“మీకు భోజనంలో ఏమేంకావాలో చెప్తే వండించుకుని వస్తాను”.
అభిజిత్ ప్రణవికేసి చూసాడు. అతనికి అలాంటివేం తెలీవు. ఏం పెడితే అది తింటాడు. తను తింటున్న పదార్ధమేమిటో అది దేన్నుంచీ ఎలా తయారౌతుందోననే ప్రాథమిక ఆసక్తినికూడా చూపించడు.అప్పటికే చాలా రాత్రైందనికాబట్టి ఎక్కువగా ఏమీ చెప్పలేదు ప్రణవి. మరుసటిరోజుకేం కావాలోకూడా అప్పుడే ఆర్డర్ బుక్‍లో రాసేసింది. ఇద్దరూ ఫ్రెషై కూర్చునేసరికి భోజనం వచ్చింది.
నిప్పులమీద కాల్చినవీ, కట్టెలపొయ్యిమీద వండినవీ … నిజంగానే చాలా రుచిగా వున్నాయి. అలాంటి వంట ఇద్దరూ ఎప్పుడూ తినలేదు. అభిజిత్ మనసుతోపాటు తనువుకూడా సంతృప్తి చెందుతోంది చాలాకాలం తర్వాత. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వూహ తెలిసాక మొదటిసారి అంత ప్రశాంతంగా వున్నాడు. పెళ్ళయ్యాక మొదటిసారి ప్రణవితో అత్యంత సన్నిహితంగా గడిపాడు. ఆ సాన్నిహిత్యం మానసికమైనదిమాత్రమే కాదు, ఆంతరంగికమైనదికూడా. తన భావాలని ఆమె పూర్తిగా అర్థంచేసుకుందన్న తృప్తితో వచ్చిన సాన్నిహిత్యమది. తనూ ఆమే వేరువేరు కాదన్న ఏకీకృత భావనతో వచ్చిన సాన్నిహిత్యమది. గాడమైన నిద్రలోకి జారుకున్నాడు.