నీలినక్షత్రం 14 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

కొద్దిలో మారే పరిస్థితులని అంచనా వెయ్యలేక భూమిని వదిలిపెట్టిన తెలివితక్కువవాళ్లుగా గుర్తుంచుకుంటారా? ఎన్నో ప్రశ్నలు మీరాని వేధిస్తుంటాయి. అక్కడికి వెళ్లాలనీ, ఆ నేలని స్పృశించాలనీ బలంగా అనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఏడుస్తుంది. అలాంటి స్థితిలో ఆమెకి దగ్గరగా వచ్చాడు అమర్. సమవయస్కుడిలా ఓదార్చాడు. ఇప్పటికీ అతను ఆమెకి పసివాడే. నాన్నని వెతుక్కుంటూ వెళ్లిన అమాయక బాలుడే.
అందమైన భూమిని మనుషులు ఎలా పాడుచేసుకున్నారో, ప్రకృతిని ధ్వంసం చేసుకుని చివరికి ఎలా ఉనికిని పోగొట్టుకున్నారో, ఏ పొరపాటు చేస్తే అలా జరిగిందో, అలాంటి పొరపాటు పునరావృతం కాకూడదంటే ఏం చెయ్యాలో అన్నీ వివరంగా చెప్పింది. జరగాల్సినవి వివరించి చెప్పింది.
“మీరు కోరుకునే దిశగానే సమాజాన్ని నడిపిస్తాం అమ్మా! నేను దిశానిర్దేశనం చేస్తాను. అమ్మలా స్వచ్చందమరణం కోరుకోను. ప్రకృతి ఇచ్చిన ఆయువంతా వాడుకుంటాను. నా తర్వాతి తరానికి కూడా మీ సందేశాన్ని అందిస్తాను” అన్నాడు అతను.
తల్లి చిన్నతనంలోనే చనిపోయినా, తండ్రి తమని వదిలేసి వెళ్ళిపోయినా మీరా హర్షల సదాశయంలో తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెరిగాడతను. వాళ్లు చెప్పినవన్నీ నేర్చుకున్నాడు. తానుగా జిజ్ఞాసతో కనుగొని కూడా తెలుసుకున్నాడు. హర్ష చనిపోవడం చాలా దిగులనిపించింది. పెద్దదిక్కుగా ఉండి తమని చూసుకునేవాడు. ఇప్పుడు మీరా కూడా చనిపోతే దిక్కులేని వారవుతారు. ఇక తనే అందరినీ చూసుకోవాలి. వాళ్లు తన పెద్దరికాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరా తనమీద ఉంచిన బాధ్యతని నెరవేర్చాలి. వాళ్ళ ఆశయం పూర్తిచేయాలి. అతను దృఢంగా నిర్ణయించుకున్నాడు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మీరాకి విముక్తి దొరికింది. శరీరంలో బంధించబడి ఉన్న ఆత్మ విడుదలైంది. అది మూల పదార్థాలుగా విడిపోయి ప్రకృతిలో కలిసిపోయిందా లేక కర్మసిద్ధాంతం ప్రకారం తిరిగి జన్మనెత్తిందా అనే విషయం ఎవరికీ తెలియదు. ఆమె మిగిల్చింది మాత్రం కొంత దుఃఖం, కొన్ని జ్ఞాపకాలు. అంతే. అవి కూడా మనసుని కుదిపేంత బలమైనవి కావు. ఆ ఉద్వేగపు వయసు ఆమెతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నవాళ్ళకి దాటిపోయింది.
ఆమె ఉన్నప్పుడే వాళ్ల సమూహంలో గొడవలు మొదలయ్యాయి. ఆధిపత్య పోరు మొదలయింది. బయటపడకుండా దాచారు. పేపర్‍డైరీని మీరా అమర్‍కి ఇవ్వడంతో ఆ గొడవలు బయట పడిపోయాయి. మీరావాళ్ళు అమర్‍కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నది కొందరి అభియోగం. ఆ వర్గంవాళ్ళు సమూహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. వాళ్లకి నాయకుడు సమర్. వాళ్లు అడవులు పట్టి తిరుగుతున్నవాళ్ళనీ, వాళ్ల సంతతినీ. కలుపుకున్నారు. రాచరికం రాకముందే అరాచకం మొదలైంది. అరాచకం నుంచి రక్షించడానికే రాచరిక సిద్ధాంతానికి పునాది పడింది.
మీరా చనిపోయాక ఇంకా ఆ ప్రాంతంలో ఉండలేకపోయాడు అమర్. సమూహంలో అంతర్గత కలహాలు అతనికి చాలా అశాంతిని కలిగించాయి. కొంతకాలం తండ్రి ఆఖరిరోజులు గడిపినచోట ఉండాలనుకున్నాడు. ఆ నిర్ణయం మరో చీలికని తెచ్చింది. కొంతమంది హైదరాబాద్ వదిలేసి వెళ్ళటానికి ఇష్టపడలేదు. వాళ్లు అక్కడే వుండిపోయారు. వారికి నాయకుడు సాగర్. అమర్ వెళ్తుంటే కొంతమంది అతన్ని అనుసరించారు. అటావా అని పేరు పెట్టుకుని గౌతమ్ చనిపోయినచోటికి వెళ్లి అక్కడ వుండిపోయారు.
ఈ రాజకీయాలకీ, గొడవలకీ ఆడపిల్లలు దూరంగా ఉండిపోయారు. భర్తలు, తండ్రులు ఎలా చెప్తే అలా చేశారు. వాళ్లు కూడా తమ అభిప్రాయాలనీ నిర్ణయాలనీ ఆడపిల్లల మీద రుద్దలేదు. ఏం చెయ్యాలో వాళ్లకే వదిలేసారు. అప్పటికింకా విడిపోవడాల్లేవు. మొదలవలేదు. అన్నీ ఇష్టాన్ని అనుసరించి చేసుకున్న పెళ్లిళ్లే కాబట్టి ఏ జంటలోనూ భార్యాభర్తలిద్దరిదీ చెరోదారీ కాలేదు. వాళ్ళ సంతానం మాత్రం తమ మార్గాన్ని తామే ఎంచుకున్నారు.
వాళ్లు మీరావాళ్లూ తమతో తెచ్చుకున్న పితృస్వామిక భావజాలానికి వారసులు. వాస్తవానికి అది పితృస్వామ్యమా, మాతృస్వామ్యమా అనే చర్చకి అక్కడ అవకాశం లేదు. మీరా హర్షని అనుసరించి బతికింది. అతని కోసమే బతికింది. అతన్ని తలుచుకుని బాధపడుతూ చనిపోయింది. దాన్నే చూశారు వాళ్ళు. అవంతి మొదటే చనిపోయింది. ఆమెకీ గౌతమ్‍కీ మధ్య అనుబంధం ఎలా ఉండేదన్న విషయం విశ్లేషించే అవకాశం లేదు. ఆమె జ్ఞాపకాలలో తనని తను కోల్పోయిన గౌతమ్ ప్రేమని మాత్రమే చూశారు.
మొదట్లో పిల్లలంతా కలిసి ఆడుకుని తిరిగినా, వేటకీ ఆహారసేకరణకి వెళ్ళినా, ఆడపిల్లల్లో శారీరక మార్పులు మొదలవగానే వాళ్లని కొంచెం వేరుగానూ, సున్నితంగానూ చూసేది మీరా. పెళ్లవడం, పిల్లలు పుట్టడం, పిల్లల బాధ్యత, పిల్లల్ని తీసుకుని అడవుల్లోకి వెళ్లడం ప్రమాదం అన్న భయం… ఇవన్నీ వాళ్ళని ఇళ్లలోనే ఉండిపోయేలా చేశాయి. మగపిల్లలు కూడా దాన్ని ఒప్పుకున్నారు.
అయితే సాగర్‍కీ అమర్‍కీ మధ్య విభేదాలేమీ లేవు. వాళ్ల మధ్య స్నేహసంబంధాలు ఉండేవి. రాకపోకలు, వివాహసంబంధాలు ఏర్పర్చుకున్నారు. విందువినోదాలతో కాలక్షేపం చేసేవారు. ఆకాశంలో రెండు నిండు చందమామలు కనిపించిన రోజైతే పెద్ద పండుగే. అది మొదటి పండుగ. అలాగ వాళ్లవాళ్ళ ఉద్వేగాలను బట్టి రకరకాల పండుగలు మొదలయ్యాయి. అవసరాలను బట్టి జీవనశైలి, దాన్నిబట్టి సాంప్రదాయాలు మొదలయ్యాయి.
సమర్ వాళ్లూ వీరిని చూసి అసూయపడేవారు. వాళ్లలో తిరిగి కలిసిపోవాలని ఉన్నా అది ఎలాగో తెలిసేది కాదు. తరుచూ వాళ్లతో గొడవలు పడేవాళ్లు. వాళ్ల మీద దాడులు చేసేవాళ్ళు. బాణాలతోటీ రాతి పనిముట్లతోటీ వాళ్ళని గాయపరిచి వాళ్ళ ఆహార పదార్థాలనీ, వస్తువులనీ ఎత్తుకుపోయేవారు. వాళ్లనుంచి కాపాడుకోవడం సాగర్, అమర్ వర్గాల ప్రధమ కర్తవ్యం అయింది. అలాగ మూడు వర్గాలుగా విడిపోయిన వాళ్ళు రెండు భిన్నమైన సంస్కృతీ మార్గాలని ఎంచుకున్నారు.
కొన్ని తరాలపాటు కూర్చుని తిన్నారు. చుట్టూ ఉన్న అడవులు వాళ్లని పోషించాయి. సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆహారంకోసం పోటీ పెరిగింది. ఎక్కువ ఆహారాన్ని సంపాదించగలిగినవాడు సమూహం మీద పట్టు సాధించసాగాడు. ఆహారం కోసం, అడవుల మీది ఆధిపత్యం కోసం పోటీ మొదలైంది. బంధుత్వాలు కలుపుకున్నారు. తుంచుకున్నారు. సమీకరించుకున్నారు. కొత్తసమీకరణాలు ఏర్పరుచుకున్నారు. మళ్ళీ ముందుకు సాగిపోయారు. సంచారతెగలుగా మారిపోయారు. ప్రపంచమంతా విస్తరించారు. సంస్కృతి, నాగరీకత ఏమీ లేకుండా వట్టి ఆటవికుల్లా బతికారు.
సూదంటురాయి యాదృచ్చికంగా దొరికింది. దానితో ఇనుపరజను ఆటకోలుతనానికి పోగుచేసి నిప్పుల్లో వేస్తే మామూలు కన్నా వేడి పుట్టింది. నిప్పుల్లో కాలి ఎర్రగా మెరుస్తున్న ఇనుపరజనుని రాతిరోకలితో బాగా కొడితే అది ఒక అచ్చులా తయారైంది. అది చాలా దృఢంగా ఉండటంతో అనేక విధాల ఉపయోగపడింది. ఇనుము ఉపయోగం అర్ధమైంది. ఇనుము, రాగివంటి లోహాలకోసం వేట మొదలైంది. ఈ క్రమంలో బంగారాన్ని దొరికించుకున్నారు. దాన్ని చేజిక్కించుకున్నవాళ్ళు బలవంతులయ్యారు. మళ్లీ సమీకరణాలు మార్చుకున్నారు.
బలం ఉన్నవాడిదే పెత్తనం అనుకున్నారు. రాజ్యాలు స్థాపించారు. తాము రాజులమన్నారు. కోటలు కట్టుకున్నారు. కిరీటాలు ధరించారు. భుజకీర్తులు పెట్టుకున్నారు. ఏనుగులెక్కారు. గుర్రాలెక్కారు. యుద్ధాలు చేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. చచ్చారు.
కొన్ని వందల నాగరికతలు పుట్టాయి. కొన్ని వెయ్యేళ్ళు రెండువేలేళ్ళు నిలిచాయి. ఇంకొన్ని మఖలో పుట్టి పుబ్బలో ముగిసాయి. ప్రకృతి వైపరీత్యాలకి పునాదులతో సహా పెకిలింపబడి కాలగర్భంలో కలిసాయి. ఈ క్రమంలో మీరావాళ్లనుంచి అనువంశికంగా నేర్పబడిన ఎన్నో విషయాలు మరుగునపడ్డాయి. ఇంకెన్నో వచ్చి కలిసాయి.
మనిషి తనుగా దేన్నీ సృష్టించలేడు. ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నవాటిని తను కనిపెట్టి వెలికి తీస్తాడు. ఆ కనిపెట్టగలగడం అనేది ఒక ఇంపల్స్. మరుగున ఉన్న ఒక వాస్తవం దగ్గరికి ఆ వ్యక్తి చేరుకున్నప్పుడు దాన్ని గుర్తించేలా అతని ఆంతరంగిక శక్తి ప్రకృతి చేత ప్రేరేపింపబడుతుంది. ఆ వాస్తవం వెలుగులోకి వస్తుంది. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న మేధోపరమైన సింబయాసిస్ ఇది.
పేపర్ డైరీ కనీసం పదిసార్లు చేతులు మారింది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు విజేతలవుతారనే నమ్మకంతో దానికోసం యుద్ధాలు చేసుకున్నారు. దాన్ని చదివిన వాళ్ళు లేరు. అదొక పవిత్ర గ్రంధమని నమ్మకం తప్ప అందులో ఏముందో తెలుసుకునే జిజ్ఞాస ఎవరికీ లేదు. ఆఖరికి అది అవంతి శిల్పాలు ఉన్న గుహలో ఒక మూల పడి ఉండిపోయింది. ఆ గుహ కాలగర్భాన మరుగున పడిపోయింది. దాదాపు తొంభయ్యారువేల సంవత్సరాలు అదే తీరున గడిచాయి.
సౌరకుటుంబంలోని మూడో గ్రహంమీద రెండుమూడులక్షల సంవత్సరాలు మనిషి హోమో ఎరెక్టస్ నుంచి హోమో సేపియన్ గా మారటానికే పట్టాయి. ఈ మధ్యలో ఏం జరిగిందో!
మంచు యుగాలు….
ఒక సుదీర్ఘ సుదూర ప్రస్థానం.
మళ్లీ నాగరికతా ఆరోహణ అవరోహణలు.
ఈ గ్రహంమీద కూడా అలాగే జరిగింది. ఒకానొక నాగరీకత ఉచ్చస్థితిని చేరుతున్నవేళ మంచుయుగం వచ్చింది. దాన్నుంచి తప్పించుకోగలిగిన మనుషులు మళ్లీ ఆటవికులయ్యారు. రాతి పనిముట్లను వాడారు. కొత్తభూమిమీద మిగిలిన ఇతర నాగరికత అవశేషాలను బట్టి తొందరగానే ఎదిగారు. లోహాలని తెలుసుకున్నారు. చక్రాన్ని కనిపెట్టారు. అభిజిత్ తరం దాకా వచ్చి ఇంకా ముందుకు సాగుతున్నారు.


అక్కడ సౌరకుటుంబంలోని మూడో గ్రహంమీద నాగరికత నశించింది. మీరావాళ్లు వచ్చేసాక భూతాపం విపరీతంగా పెరిగి, మంచంతా కరిగి, హిమానీనదాలని చేరి, సముద్రమట్టాన్ని పెంచింది. తాటిచెట్టు ప్రమాణంతో కెరటాలు లేచాయి. సముద్రపు నీరు ఆవిరై కుంభవృష్టిగా వర్షాలు పడ్డాయి. ఆ వానలు మనుషుల్నితుడిచిపెట్టడానికేగాని మరెందుకూ ఉపయోగపడలేదు. వరదలు, ఉప్పెనలు వచ్చి ఊళ్లని ముంచెత్తాయి. ఆ నీళ్లలో మనిషి అంతదాకా సాధించిన ప్రగతి అంతా సమమట్టం అయింది.
హర్ష అమ్మానాన్నలు అమెరికా వదిలి వచ్చేసారు. అప్పటికే మీరా అమ్మ చనిపోయింది. మీరా నాన్నకి కేన్సర్ నిర్ధారించబడింది. భారతదేశంలోని వాతావరణంలో ఇమడలేనితనంతో సంగీత ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆ తర్వాత వచ్చిన వరదల్లో ఆనంద్ కొట్టుకుపోయాడు.
ప్రొఫెసర్ మిత్రా మీరావాళ్ళ దగ్గరనుంచి సందేశాలు వస్తాయని ఎదురుచూసేవాడు. అలాంటివేవీ రాకపోయేసరికి నిరాశతో కృంగిపోయాడు. వాళ్లు ఏమయ్యారు? ఆ గ్రహం కనిపించిందా? చేరుకోగలిగారా? ఆయన ఆశ క్రమంగా నిరాశగా మారి ఆ నలుగురి మరణానికి తనే కారకుడయ్యాడేమో తేల్చుకోలేని నిస్సహాయతలో పడిపోయి అలాగే ప్రాణం వదిలేశాడు.
ఇంకొంత విధ్వంసం జరిగాక శివనారాయణ మరణించాడు. ఇదంతా జరగడానికి పదేళ్లకన్నా ఎక్కువ పట్టలేదు. ఎక్కడో ఏ కొండకోనల్లోనో ఆటవిక జాతి ఏదైనా మిగిలి ఉంటే వాళ్లనుంచి నాగరికత ప్రస్థానం జరగాలి. లేదంటే పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం. మీరావాళ్లూ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ల గురించి తెలిసినవాళ్ళు ఎవరూ మిగల్లేదు. హైబర్నేషన్లోని వాళ్లు అలాగే కృశించి నశించిపోయారు.
గుండెలోతుల్లోంచి వచ్చే నిట్టూర్పులాంటి వాస్తవం.


“నాకు భూమ్మీదికి వెళ్ళాలనుంది. చాలా బలంగా…. అనిపిస్తోంది. నా ఇంటికి నేను తిరిగి వెళ్లాలన్న కోరికలా” అంది ప్రణవి..
అభిజిత్ ఆశ్చర్యంగా చూశాడు. అది తను అనాల్సిన మాట.
“అక్కడ ఇప్పుడు మనుషులు ఉన్నారా? ఉంటే వాళ్లకి మీరా హర్షలు, అవంతి గౌతమ్‍లు గుర్తుండి ఉంటారా? అభీ! వాళ్ళకసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? సైన్సూ, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందిన చోటినుంచి వచ్చి ఇక్కడ ఎలా ఉండగలిగారు? ఇక్కడినుంచి కూడా ఎవరైనా అలా వలస వెళ్లి ఉండి ఉంటారా? ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లా జరుగుతోందా?”” ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతోంది.
శ్రీరాం పరిస్థితి కూడా అలాగే ఉంది. అభిజిత్ చెప్తుంటే తను నవ్వులాటగా తీసిపారేసాడు. అతను నీలినక్షత్రాన్ని చూసి అక్కడికి వెళ్లాలని తపించిపోతుంటే అంతా సిల్లీగా అనిపించింది. ప్రపంచంలో ఇన్ని సుఖాలు, సంతోషాలు ఉండగా అన్నీ వదులుకుని అతనెందుకలా ఆలోచిస్తున్నాడనుకున్నాడు. అక్కడ తమ మూలాలు ఉన్నాయి. అందుకే అలా తపించి ఉంటాడు. ప్రణవి అన్నట్టు అతనికి ఏవో ప్రిమానిషన్స్ వుండి ఉంటాయి. ఆ వాస్తవం తెలుసుకోవడానికి తపించాడు.
జీవని అన్ని ప్రయోగాల్లాగే దాన్ని కూడా తీసుకుంది. అభిజిత్ ఒక విషయాన్ని గురించిన అంచనా వేశాడంటే అది నిజమవకపోతే ఆశ్చర్యపోవాలిగానీ ఇలా నిరూపణ అయినందుకు కాదు. తాను ఎక్కడినుంచో వచ్చినవాళ్ళ వారసురాలిగా ఈ గ్రహంమీద ఉంటోందన్న విషయం ఆమె మీద పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. చరిత్రకందని సుదూర గతంలో ఏం జరిగిందో తనకి అప్రస్తుతం అనుకుంది.