నీలినక్షత్రం – 11 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

ఆహారానికి సమస్యేమీ లేదు. నాకు మాంసాహారమే కావాలని ప్రత్యేకంగా అనిపించలేదు. అవంతికి చాలా అలవాటు. హర్ష, గౌతమ్‍లు
పుల్లలతో బాణాలు తయారుచేసుకున్నారు . వాటి సాయంతో వేటాడుతున్నారు. నిప్పులమీద కాల్చుకుని ఉప్పు రాసుకుని ఆ మాంసం తింటున్నారు. సముద్రపు నీటిని ఇసుకలో ఎండబెడితే ఉప్పు తయారవుతోంది. సముద్రం ఒడ్డున చిన్న మళ్ళలా తయారుచేసి రోజూ నాలుగైదు దోసిళ్ళు అందులో పోస్తున్నాము. ఒకటి అయిపోయాక ఇంకొకటి వాడుతున్నాము.
మాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వేసుకోవడానికి బట్టలు. మాతో స్పేస్‍షిప్‍లో కొన్ని బట్టలు వచ్చినా అవి షిప్‍తోపాటు పోయాయి. ఒంటిమీద ఉన్నవి అసౌకర్యంగా ఉన్నాయి. అవైనా ఎన్ని రోజులు వస్తాయో! ఈలోగా కొత్తబట్టలు తయారు చేయాలి.
చెట్లూ పుట్టలూ తిరిగి ఒక ఆకుని కనిపెట్టాము. అది చాలా పెద్దది. ఎండిపోయాక పొడి రాలిపోగా మిగిలిన ఈనెలవీ వలలాగా ఏర్పడుతోంది. అది చాలా దట్టంగా ఉంది. దాన్ని సముద్రపు నీళ్ళలో నానబెట్టితే మెత్తగా అయింది. అలాంటివి నాలుగైదు ఆకుల్ని జతచేసి కుడితే చీరంత తయారైంది. అలాగే ఒక రకమైన తీగలు చాలా సన్నగా ఉంటాయిగానీ దృఢమైనవి. వాటిని చెట్టు పుల్లలకి చుట్టి నిట్టింగ్ చేసింది అవంతి. కాశ్మీర్లో ఉండటంవల్ల తనకి నిట్టింగ్ చాలా బాగా వచ్చును. అరవైనాలుగు కళలు అన్నారు. ఇవి ఇన్హేరెంటుగా వచ్చేవి. మనిషిలో దాగి ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు బయటపడతాయి. గౌతమ్ మంచిశిల్పిగా మారుతున్నాడు.
“ఈ రాళ్ళమీద చెక్కితేనే మన తర్వాతి తరాలకు ఏదైనా మెసేజి అందేది” అంటాడతను. కనిపించిన ప్రతి రాతి మీదా అవంతి పేరు చెక్కుతాడు. అందుకోసం ఎంతో శ్రమపడతాడు.
” ఇలా ఎంతకాలం? నాకు రొట్టెలు తినాలని ఉంది” అంది అవంతి ఒక రోజు.
తను కాంట్రాసెప్టివ్స్ మానేసిందని నాతో అనలేదు. తనిప్పుడు ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు. అలాగే నాకు వరి అన్నం తినాలని ఉంది. నేనూ ఇంకా బయటికి అనలేదు.
“అవకాశం లేదు. గోధుమలని సంపాదించగలిగినా వాటిని దంచడం, పొట్టు తీయడం, పిండిగా మార్చడం సాధ్యపడుతుందని అనుకోను” అన్నాడు హర్ష.
గౌతమ్ ఒక రాతిని ఎంచుకున్నాడు. మరో పదునైన రాతితో దాని మధ్యలో గుంటగా చెక్కడం మొదలుపెట్టాడు. అతని ఆలోచన మాకెవరికీ అర్ధం అవ్వలేదు. గత శతాబ్దాల మనుషులు ఉపయోగించిన రోలులా తయారయ్యేదాకా అది ఏంటో, ఏం చేస్తున్నాడో అర్ధమవలేదు. దాంట్లో దంపడానికి ఇంకో రాయిని తయారుచేశాడు. ఎక్కడినుంచో గోధుమలలాంటి గింజలని పట్టుకొచ్చి అవంతికి చూపించి, “ఇవి తినొచ్చా?” అని
అడిగి, “తినచ్చు” అన్నాక వాటిని తను తయారు చేసిన రోట్లో పోసి దంచడం మొదలుపెట్టాడు. ఒక ఆకులో పోసి పొట్టు ఊదాడు. మళ్ళీ వాటిని బాగా దంచి పిండిలా తయారు చేసి నీళ్లు పోసి తడిపి రొట్టె ఆకృతికి తెచ్చేసరికి అవంతికి ప్రసవం జరిగిపోయింది. తనిచ్చిన శిక్షణతో నేనే డెలివరీ చేసాను. హర్ష, గౌతమ్ సాయం చేసారు.
మగపిల్లవాడు. చాలా అందంగా ఉన్నాడు. చురుకైనవాడు. అమర్ అని పేరు పెట్టుకున్నాము.
అవంతి తండ్రి పేరు అది. బాబు పుట్టినందుకు అవంతి పెద్దగా సంతోషించలేదు. వాళ్ళ నాయనమ్మని తలుచుకుని ఏడ్చింది. మేము ఎంత ఓదార్చినా ఊరుకోలేదు. తను డిప్రెషన్లోకి వెళ్ళకుండా గౌతమ్ చాలా కష్టపడ్డాడు. క్రమంగా తనలో మార్పు వచ్చింది. పసివాడి కదలికలు చైతన్యాన్ని నింపాయి. పెరుగుతున్న కొద్దీ వాడి ఆటపాటలు మాకు సంతోషాన్నివ్వసాగాయి. వాడి కోసం రెండు రాటలు పాతి నార ఉయ్యాల తయారుచేశాడు హర్ష. వాడిని ఒక్కక్షణం వదలకుండా ఎవరో ఒకరు కంటికి రెప్పలా కాపలా కాసేవాళ్ళం.
ఆ తర్వాత నాకు పాప పుట్టినప్పుడు నేను కూడా అవంతిలాగే దిగులుపడ్డాను. తనని నీలినక్షత్రం వైపు ఎత్తి చూపిస్తూ, “అమ్మా! చూడు, నీ మనవరాలిని. ఏ కాన్సర్లూ ఉండనిచోట పెరుగుతుంది. ఆరోగ్యంగా పెరిగి వృద్ధాప్యం దాకా బతుకుతుంది” అని చెప్తూ ఏడ్చాను.
ఇద్దరూ చిన్నచిన్నపిల్లలయ్యేసరికి నాకు, అవంతికి అసలు తీరిక ఉండేది కాదు. ఆహారం సంపాదించడానికి హర్షావాళ్ళతో వెళ్ళడం మానేశాము. పిల్లల్ని తీసుకుని అడవిలోకి వెళ్లాలన్నా భయమే. వాళ్ళని హర్ష, గౌతమ్‍ల మీద వదిలి వెళ్లాలన్నా భయమే, వాళ్ళు ఏమరుపాటుగా ఉంటే ఏదైనా జరుగుతుందని. ఇన్స్టింక్చువల్‍గా స్త్రీకి తన పిల్లలపట్ల ఉండే జాగ్రత్త కావచ్చు.
అలా ఒకరి తరువాత ఒకరు చొప్పున ఇద్దరికీ ఆరేసిమంది పిల్లలు పుట్టారు. ఉన్న పిల్లల్లో ఆరుగురు ఆడపిల్లలు, ఆరుగురు మగపిల్లలు. నాకూ అవంతికీ చెరి ముగ్గురేసి చొప్పున.
“ఈక్వేషన్ సరిగ్గా సరిపోయింది. ఇంక పిల్లలు వద్దు” అన్నాడు హర్ష.
అంటే మేము వానప్రస్థాశ్రమంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని సూచన. కొత్త జీవితానికి బాగా అలవాటుపడ్డాము. మమ్మల్ని మేము జంతువుల బారిన పడకుండా కాపాడుకోవడం వచ్చింది. ఈ మధ్యలో నాలుగైదు పెద్ద తుఫాన్లు. తాటిచెట్ల అంత ఎత్తు ఎగిసిపడే సముద్రపు అలలు చెలియలికట్ట దాటి గుహదాకా వచ్చేసినా, పాములూ అవీ కొట్టుకొచ్చినా మేము ఆ గుహ వదిలిపెట్టలేదు. అక్కడే రక్షణగా అనిపించింది. ఒక ఇంటిలా అక్కడ మాకు అలవాటైపోయింది. ఇంకోచోటికి వెళ్లి మళ్లీ స్థిరపడటానికి ఇంత ప్రయాసపడలేమనిపించింది.
కర్రలతో ఒక ఇల్లు కూడా కట్టారు గౌతమ్, హర్ష. కానీ అందులో రక్షణ లేదు. ఏనుగుల గుంపు వచ్చి దాన్ని సునాయాసంగా కుదిపి కూల్చి పారేసింది. ఆ సమయానికి మేమెవరం అందులో లేము. అందుకని మేము ఉంటున్న గుహే మాకు సురక్షితమైనదని అనిపిస్తోంది. మళ్ళీ ఇల్లు కట్టే ప్రయత్నాన్ని వాళ్లు మానలేదు. కొన్ని చెట్ల మధ్య స్థలాన్ని చదును చేసి చెట్లని ఆధారంగా తీసుకుని కంచెలాంటిది కట్టారు. ఆమధ్యలో మట్టిగోడలతో ఇల్లు కట్టడం మొదలుపెట్టారు… పిల్లలకోసం.
పాలరాతిగచ్చుమీద పసిడివుయ్యాలలో అని కాకపోయినా అపురూపంగా పెరగాల్సిన ఈ పిల్లలు ఆకులతో చేసిన బట్టలు కట్టుకుని మట్టిలోనూ నేలమీదా పెరుగుతున్నారు. నా గుండెనిండా విషాదం నిండిపోతోంది. ఏం కాబోతున్నారు వీళ్లు? డాక్టర్లూ ఇంజనీర్లూ అవరు. వీళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలు లేవు. కంప్యూటర్లు లేవు. హర్షని పట్టుకుని ఏడ్చేశాను.
హర్ష ఒకప్పటి స్మార్ట్ యంగ్ బాయ్ కాదు. గడ్డాలు, మీసాలు పెరిగి రాతి గొడ్డళ్లు బాణాలు పట్టుకుని తిరుగుతూ పూర్తి ఆటవికుడిలా కనిపిస్తున్నాడు. గౌతమ్ కూడా అంతే. ఎన్నో విషయాలు తెలిసినా, ఎన్నో చేయగలిగిన తెలివి ఉన్నా వాళ్లిద్దరే ఎన్నని చెయ్యగలరు? అక్కడికీ రాళ్ళని సానపట్టి కత్తులు, చాకులు చేస్తున్నారు. రాళ్ల మధ్య భాగం తొలిచి వండుకోవడానికి చిప్పలు తయారు చేస్తున్నారు. మెత్తటి బంకమట్టి దొరికితే తెచ్చి చేతుల తోటి కుండలుగా మలిచారు. వాటిని నీడలో ఆరబెట్టి నిప్పులమీద కాల్చి ఉపయోగానికి తెచ్చారుగానీ చేతులతో చేయడంవలన ఏదీ కూడా చాలా టైము తీసుకుంటోంది. తయారైనవి పర్ఫెక్ట్ గా వుండట్లేదు.
నా మనసునిండా బాధ ఉంది. కానీ దాన్ని బయటికి అనను. ఒకసారి ఎప్పుడో అంటే, “”నో రిగ్రెట్స్ మీరా! మృత్యువు అనివార్యమైనప్పుడు దాన్ని చిరునవ్వుతో స్వీకరించమని మా అమ్మ అన్న సూక్తిని నేను చాలా ఇష్టపడతాను. ఇంతదాకా వచ్చాము. వెనక్కి తిరిగి పోలేము. ముందరికే సాగాలి. మన చేతుల్లో ఉన్నంతవరకు మంచి సమాజానికి పునాది వేద్దాం… అదేదో సంతోషాన్ని గుండెల్లో నింపుకుని” అన్నాడు.
“…”
“నీ ప్రేమని కూడా కాదనుకుని నాతో వచ్చావు. ఆ స్ఫూర్తి ఏమైంది నీలో!” మృదువుగా అడిగాడు.
నా దగ్గర జవాబు లేదు. బాధని దిగమింగే ప్రయత్నమే తప్ప సంతోషం పుట్టడం లేదు. అందర్లోకీ ఎక్కువగా అవంతి బాధపడుతోందన్న విషయాన్ని మేమెవరం గుర్తించలేదు.
“మనకి తిండికీ బట్టలకీ ఇబ్బంది లేదు కదూ మీరా? ఇంకా నావంతుగా కనిపెట్టాల్సినవి ఏమైనా వున్నాయా?”అడిగింది.
అలా ఎందుకు అడుగుతోందో నేను గ్రహించలేదు.
“పన్నెండుమంది పిల్లలు అవంతీ! వీళ్లందరినీ చదివించాలి. మనకి తెలిసినవన్నీ వీళ్ళకి నేర్పించాలి”
“ఏం లాభం? వాళ్లకి తమ తిండిని తాము గుర్తించి సంపాదించుకోగలిగే విజ్ఞానం, జంతువులకి దొరికిపోకుండా తమని తాము కాపాడుకోగలిగే తెలివి ఉంటే చాలు” అంది విరక్తిగా.
నేను తన మాటల్లోని విరక్తిని గమనించలేదు. ఒకప్పుడు తనే ఎంతో ఆశాజనకంగా మాట్లాడి కనీసం రెండు శతాబ్దాల వెనుకటి మానవులలా ఉండగలమన్న ఆశని నింపింది.
బట్టల కొరత లేకుండా మాత్రం తను బ్రహ్మాండంగా చూసుకుంటోంది. ఏది దొరికినా దాన్ని గోళ్ళతో చీల్చి నారగానో, పురిపెట్టి దారంగానో మార్చేసి చెట్టుపుల్ల నీడిల్స్‌తో నిట్టింగ్ చేసి దృఢమైన బట్టగా మారుస్తోంది. నలుచదరపు బట్టని రెండు చివరలు కలిపికుట్టేసి పైన నాడాల ఏర్పాటు చేసుకుని అందులోకి దిగి ముడి పెట్టుకోవడమే. అలాగే జాకెట్లు, భూమ్మీద మోడ్రన్ డ్రస్సులలా తయారవుతున్నాయి. అవి కాకుండా ఆకులనారతో తయారైన చీరలు, తనకి సులువుగా ఉండడం కోసం దబ్బనమంత ఉండే తుమ్మముళ్ళని విరుచుకువస్తున్నారు హర్ష,
గౌతమ్‍లు. వాటి ములుకు కొద్దిగా అరగదీసి వాడుకుంటోంది అవంతి.
“ఇవి మేము వేసుకోము. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ ఒకేలాంటి డ్రెస్సంటే ఎలా?” అని హర్ష ప్రతిఘటించాడు.
“భూమి మీద ఉన్నప్పుడు మేము ఫ్యాంటు షర్టులు వేసుకోలేదా? నేను తయారుచేసి ఇచ్చేవివే. వేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం” అని ఎదురు వాదనకి దిగుతుందని అనుకున్నానుగానీ తను నవ్వేసి ఊరుకుంది. ఆ మరుక్షణం నుంచే వాళ్లకి అనువుగా ఉండే బట్టలకి డిజైనింగ్ మొదలుపెట్టింది. తనలో వచ్చిన మార్పు చూస్తుంటే హర్షకే కాదు, నాకే ఆశ్చర్యం కలిగింది. తన టెండర్‍నెస్‍తో మాకొక చిన్న చెల్లిలా
అనిపించేది. ఇప్పుడు ఎదిగినట్టనిపిస్తోంది.
పిల్లలకి తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాను. రాయటం, చదవటం అన్నీ వస్తున్నాయి. నాకు తెలిసినవన్నీ వాళ్లకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. పనిలోపనిగా సుదూరంగా కనిపించే నీలినక్షత్రాన్నిగురించి, అక్కడినుంచి మేము ఎలా వచ్చింది కథగా కూడా వినిపిస్తున్నాను. రామాయణం, భారతంలాంటి కథలన్నీ వివరిస్తున్నాను. వాళ్లు నేలమీద కర్ర పుల్లలతో రాస్తూ నేర్చుకుంటున్నారు. అవంతి పెద్దకొడుకు తనుకూడా శిల్పం నేర్చుకుని గౌతమ్ వెనక వాడికి వచ్చినవన్నీ వాడు కూడా గోడలమీద చెక్కేస్తున్నాడు. మాకు తెలిసిన సైన్సు రహస్యాలని వాళ్లకి చెప్తున్నాను. మేము వచ్చిన స్పేస్‍షిప్ బొమ్మ, సైన్సుకి సంబందించిన సూత్రాలు, స్పేస్ కి సంబందించిన రహస్యాలు.. అన్నీ కుడ్యచిత్రాలుగా మార్చిపారేశాడు గౌతమ్. పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటున్నారు. అవి వాళ్లకి సిద్ధాంతాలుగానే తెలుసు. వాటి వాస్తవాలు వాళ్లకి ఊహకి కూడా అందనివి.
మళ్లీ కంప్యూటర్ల దాకా రావడానికి ఎన్ని యుగాలు పడుతుందో!
హర్ష చెప్పిన ప్రకారం వీళ్లు ఈ నాలెడ్జిని త్వరగానే మర్చిపోతారు. అందులో లోతు లేదు కాబట్టి.