నీలినక్షత్రం – 6 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

అతనంత ప్రశాంతంగా లేదు ప్రణవి. పక్కని నిద్రపోతున్న అతన్ని చూస్తూ చాలాసేపు కూర్చుంది. ఎంతో విషాదంగా వుంది ఆమెకి. ఇక్కడికి వచ్చాక అంతరంగంలో మొదలై ఇంకా గుర్తించబడని అలజడి ఆ విషాదాన్ని పుట్టించింది. దానికి కారణాన్ని ఆపాదించుకుంటోంది. తను కోరుకున్నదే అయినా అభిజిత్‍లోని ఈ మార్పు ఆమెకి సంతోషాన్నివ్వలేదు. పసిపిల్లాడిని ఏమార్చినట్టు అతన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది తను. అతను ఆ భ్రమలో వున్నంతవరకూ సంతోషంగానే వుంటాడు. ఎప్పుడో ఒకరోజు అందులోంచీ బైటికి వచ్చాక ఏమనుకుంటాడు? అలాంటిరోజున అతను చూపిస్తున్న ఈ ప్రేమా అవీ తిరస్కారంగా మారిపోతాయి. తనని అసహ్యించుకుంటాడు. తక్కువగా వూహించుకుంటాడు.
ఆమె తల బలంగా తల విదిల్చింది.
రాత్రి కావడంతో నక్షత్రాలు చంద్రకాంతిలో ఒదిగిపోయాయి. నీలినక్షత్రం కూడా. కానీ దాని వునికి తెలుస్తునే వుంది.
ఏమిటా గ్రహం? ఎందుకలా నీలంగా వుంది? అభిజిత్ వూహలు సరైనవేనా? అక్కడినుంచీ వాళ్ళు ఇక్కడికొచ్చారా? ఎలా ? అది సాధ్యమేనా?అంతా చిక్కుముడిలా వుంది. అలాగే నిలబడి నీలినక్షత్రాన్ని తదేకంగా చూడసాగింది. ఏవో భావప్రకంపనలు. గుండెల్లో నిశబ్దంగా పెరుగుతున్న విషాదపు స్థాయి.
లోపలికి వెళ్ళాలనిపించలేదు. ఇంతకాలం అది ఒక విలక్షణమైన, పరిశోధనలు చెయ్యడానికి ఎన్నో వింతలుగల గ్రహం మాత్రమే. కానీ ఇప్పుడు? ఎన్నో చిక్కుముళ్ళనీ సవాళ్ళనీ దాచుకున్న ఒక ఖగోళరహస్యం. తనకే ఇలా వుంటే అభిజిత్‍కి ఎలా వుంటుంది? అతని దారికి తను అడ్డు వెళ్ళకూడదు. అతను కోరుకున్నదేగానీ తనుగా ఏదీ ఇవ్వకూడదు. అతన్ని డైవర్టు చెయ్యకూడదు. ఆమె మనసు అప్పటిదాకా జరిగినవాటికి పశ్చాత్తాపంతో రగిలిపోయింది.
“సారీ, శ్రీరాం! అతనేమవ్వాలనుకుంటాడో అదే ఔతాడు. అలా అవడానికే అతను పుట్టాడు. దాన్ని మార్చే హక్కు నాకుగానీ నీకుగానీ లేదు” మనసులోనే శ్రీరాంకి సారీ చెప్పుకుంది.
భుజంమీద చెయ్యిపడేసరికి వులిక్కిపడి ఆలోచనల్లోంచీ బయటికి వచ్చింది.
“ఏం చేస్తున్నావు, ఇంతరాత్రివేళ ఒక్కదానివీ ఇక్కడ?” అడిగాడు అభిజిత్. ఆమె పక్కన లేకపోయేసరికి మెలకువ వచ్చేసింది. ఆమె సాన్నిహిత్యాన్ని నిద్రలో కూడా గుర్తిస్తున్నాడు. అందుకే ఆమె పక్కనిలేకపోవడాన్ని సెన్స్ చేసాడు.
” చాలా డిస్టర్బ్‌డ్‍గావుంది” అంది ప్రణవి కొద్దిగా వెనక్కి జరిగి అతని గుండెకి తన తల ఆనించి.
అతను నవాడు. “ఏం చేస్తున్నావని అడిగాను”
“నీలినక్షత్రాన్ని చూస్తున్నాను. ఏదో తెలీని అలజడి… నువ్వన్నట్టే…”
“నిన్నూ ఆకర్షించిందా?” చకితుడై అడిగాదు.
తలూపింది. “నువ్వు చెప్పాక నేను ఆ ఆలోచనల్లోంచీ బైటికి రాలేకపోతున్నాను. అభీ! నువ్వు చెప్పినట్టు జరగడానికి అవకాశం వుందా? ఎవరు వాళ్ళు? ఈ గ్రహంమీద నీళ్ళున్నాయని ఎలా తెలుసుకున్నారు? ఇంత దూరం ఎలా రాగలిగారు? వచ్చినా అందర్నీ వదిలేసి తమ హేబిటట్ వదిలేసి ఎలా వుండగలిగారు? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకా ఎన్నో ప్రశ్నలు అంతూదరీ లేకుండా పుట్టుకొస్తున్నాయి” అంది.
అభిజిత్‍కి సంతోషం , బాధా రెండూ కలిగాయి. మొదటిది ఆమె తన దార్లోకి అడుగుపెట్టినందుకు. రెండోదికూడా అందుకే. తనని అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏ సుఖశాంతులూ ఇవ్వని దార్లోకి ఆమె వచ్చినందుకు బాధ. ఒకరికి ఇద్దరై ప్రయోగాలు చేస్తే ఫలితాలు ఇంకా కచ్చితంగా వుంటాయన్న ఆశకూడా కలిగింది. అది స్వార్థమా అనే అనుమానమూ వచ్చింది. అన్ని భావాలూ ఒక్కసారి కలగాపులగంగా కలిగేసరికి వుక్కిరిబిక్కిరయాడు.
మళ్ళీ కాటేజిలోకి వెళ్ళాలనీ నిద్రపోవాలనీ ఇద్దరికీ అనిపించలేదు. ప్రణవి అక్కడున్న ఒక రాతి తిన్నె మీద కూర్చుంది. అతను ఆమె ఒళ్ళో తలపెట్టుకుని కింద కూర్చున్నాడు ఎంతోసేపు. ఎడతెగని ఆలోచనల్ని పంచుకున్నాక ఆఖర్లో అడిగింది ప్రణవి, “గుహల్లోకి వెళ్దామా?” అని. అతనికీ అలాంటి కోరిక కలిగిందికానీ దీనంతట్లోకీ ఆమెని లాగటం ఎంతవరకూ సమంజసమనేది నిర్ణయించుకోలేకపోయాడు. కానీ గుహల్లోకి వెళ్ళాలనే కోరిక అన్ని సంకోచాలనీ జయించింది.
“మంచుపడుతోంది. లోపలికి వెళ్ళి పడుక్కుందాం పద” అని లేచాడు. అప్పటికే తెలతెలవారుతోంది.


రాత్రంతా నిద్రలేకపోయినా ఇద్దరూ వుదయాన్నే తయారైపోయారు. ఫారెస్ట్ ఇన్‍చార్జిని వెళ్ళి కలిసి, గుహలు చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. అతనికి వాళ్ళిద్దరూ ఎవరో తెలుసు. ఎంతోమందిని వారించినట్టు వాళ్ళని వారించలేకపోయాడు. అందులోనూ అభిజిత్ అంటే గౌరవం. ప్రణవిగురించీ తెలుసు. ఐతే అభిజిత్‍గురించి తెలిసినంత వివరంగా కాదు.
“అసలక్కడికి ఎవరేనా వెళ్తారా? ” అడిగింది ప్రణవి కుతూహలంతో.
ఫారెస్ట్ ఇన్‍చార్జి పేరు కతిక్య. అభిజిత్ దాన్ని కార్తికేయగా అన్వయించుకున్నాడు.
కార్తికేయ చెప్పాడు. “చాలామంది ఇక్కడికి వస్తారు. గుహలు చూడాలనికూడా అనుకుంటారు. కానీ ఇక్కడి వాతావరణానికి భయపడి వచ్చిన రెండోరోజునే వెళ్ళిపోతారు. భయమంటే… నాగరీకతకి దూరంగా వుండలేరు చాలామంది. ఇక గుహల విషయానికొస్తే రిసెర్చికోసం చాలామంది వచ్చారు. వాళ్ళలో కొందరు భయపడి వెళ్ళిపోయారు. కొందరికి ఎందుకో మతిభ్రమించింది. ఇంకొందరు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఒక్కడుమాత్రం నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే వుంటున్నాడు. ఫారినరు. ఆ శిల్పాలని ఫోటోలు తీస్తుంటాడు. ముందునించీ, వెనకనించీ తిరిగితిరిగి చూస్తుంటాడు. ఆ శిల్పాలచుట్టూ గుండ్రంగా తిరుగుతుంటాడు. నోట్సు రాస్తుంటాడు. వారానికోసారి వెళ్ళి మెసేజిలు పంపించి వస్తుంటాడు. అసలు వాడికేం అర్థమైందో, ప్రపంచానికి ఏం చెప్తున్నాడో తెలీదు”.
“అసలీ గుహలు ఎలా బైటపడ్డాయి? ఎప్పుడు తెలిసింది వీటిగురించి?”
“ముఫ్ఫైరెండు సంవత్సరాలక్రితం ఒక విమానం ఈ ప్రాంతంలో కూలిపోయింది. అప్పుడు తెలిసింది వీటిగురించి. పురావస్తుశాఖవాళ్ళు వచ్చి చూసారు. అక్కడినుంచీ కొన్ని వస్తువులు తీసుకెళ్ళారు. వాటిల్లో ఒక శ్వేతపత్రగ్రంథం వుంది.”
“శ్వేతపత్రగ్రంథమా? ఇప్పుడెక్కడుంది?” అభిజిత్ ఆతృతగా అడిగాడు.
“ఆర్కియాలజీవాళ్ళు తీసుకెళ్ళారు. బహుశ: వాళ్ళ మ్యూజియంలో వుండవచ్చు. అందులో ఏం రాసి వుందో తెలీదు. ఆ స్క్రిప్టూ ఎవరికీ తెలీదు. అదేం భాషో ఎవరూ చెప్పలేకపోయారు. ఈ గుహలూ, ఆడమ్స్‌ కేవ్స్ ఒకే కాలానికి చెందినవని చెప్తారు. ఏవో కొన్ని ఆధారాలు దొరికాయట”
“అంటే జియాలజీపరంగానా?” అడిగింది ప్రణవి.
“కాదు. అందులో దొరికిన వస్తువులనిబట్టి. ఆ గుహల్లో వుండిన మనుషులు ఒకే నాగరికతకి చెందినవాళ్ళని నమ్మకం.”
“ఎప్పటివని అంచనా?” కావాలనే అడిగింది.
“కార్బన్, రేడియొమెట్రిక్ డేటింగ్‍ల ప్రకారం యాభైవేలపైమాటే అనుకుంటున్నారు. అది నిజమే కావచ్చు. అన్ని సంవత్సరాలక్రితం అంటే ఎన్నో నాగరీకతలు పుట్టి కాలగర్భంలో కలిసిపోయివుంటాయి. గుహలూ, శిల్పాలూ, చిత్రాలూ సరే, అప్పటి వస్తువులు ఎలా మిగిలివున్నాయనేది పెద్దపజిల్.”
తెలుసుకోవలసినది చాలా వుందనిపించింది ప్రణవికి.
ఇద్దరూ బయల్దేరారు. వాళ్ళకోసం జీపు రెడీగా వుంది. అందులోకి వాళ్ళు ఎక్కుతుంటే చెప్పాడు కార్తికేయ, “జీపులో కొంతదూరంవరకూ వెళ్ళగలరు. ఆ తర్వాత నడిచి వెళ్ళాలి. దారితప్పే అవకాశం వుంది. అలాంటి సమస్య ఏదైనా ఎదురైతే అక్కడక్కడ అలారాలున్నాయి. వాటిని నొక్కి అక్కడే వుంటే మీరు ఎక్కడున్నదీ మాకు తెలుస్తుంది. వచ్చి తీసుకెళ్తాం. ఆకలేస్తే తినడానికి కొన్నిచెట్లకి పేర్లు రాసిన బోర్డులుంటాయి. వాటి పళ్ళూ కాయలూ మాత్రమే తినండి. అలాగే నీళ్ళుకూడా ఎక్కడంటే అక్కడ తాగద్దు” ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. వాళ్ళు జీపెక్కి కూర్చున్నాకకూడా అతను కదల్లేదు.
కొద్దిగా సంకోచించి చెప్పాడు,”అక్కడ కొన్ని చెట్లున్నాయి. నారచెట్లు. అవ్వనాతి వాటితో బట్టలు తయారుచేసుకుని కట్టుకుందని ఒక కథ. నమ్మకం వుంటే చూడచ్చు. ఈ క్షేత్రం ఆమె తిరిగిన ప్రదేశంగా చెప్తారు. ఆ కోణంలోంచీ చూస్తే ఆసక్తికరమైన విషయాలు చాలా కనిపిస్తాయి” అన్నాడు.
ఎంతటి విజ్ఞానాన్నీ మతపరమైన నమ్మకంగా మార్చేస్తే దానికి శాశ్వతత్వం వస్తుంది. అవ్వనాతిని దేవతగా పూజించి, ఆమె అక్కడ తిరిగిందని చెప్పి, ఆ నారచెట్లగురించి చెప్తే ఎంతవాళ్ళేనా వెళ్ళి చూడకమానరు. దేవతనే నమ్మకంతో కాకపోయినా, కుతూహలంతో.
దైవత్వంతోటీ మతంతోటీ ముడిపడివున్నవికాబట్టి ఐచ్చికంగా కాపాడుతారు. అవ్వనాతిగురించి అనుశ్రుతంగా ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. జీపు కదిలింది. కార్తికేయ చెయ్యూపి వెనక్కి తిరిగాడు. అతనికి వాళ్ళిద్దర్నీ చూస్తుంటే చాలా ఆరాధన కలిగింది. అతని భార్య పెద్దగా చదువుకోలేదు. వృత్తిపరంగా తనకి కలిగే అనుభవాలనీ, భావాలనీ ఆమెతో పంచుకోలేడు. అదతనికి బాధగా వుంటుంది. తన జీవితంలో వున్న పెద్ద లోటుగా అనిపిస్తుంది. ఇటువంటి భార్యాభర్తల్ని చూసినప్పుడు ఆ విషయం గుర్తొచ్చి ఆ బాధ మరీ ఎక్కువౌతుంది. ఇలాంటి దు:ఖాలనుంచీ మనిషికి ఎప్పటికీ విమోచన వుండదు. నచ్చలేదని ఇంకొక స్త్రీని వివాహంచేసుకుంటే ఆ స్త్రీలో ఇంకేదో నచ్చని అంశం వుండవచ్చు. అందుకే పెళ్ళిళ్ళు మానవీయమైన విషయాలుగా కాకుండా దైవికమైనవిగా భావిస్తే సహజీవనంలోని అనివార్యమైన రాజీ అంతగా బాధించదు. కార్తికేయ అలాంటి ధోరణికి అలవాటుపడిపోయాడు.


జీపులో అడవిలో ప్రయాణం చాలా నచ్చింది ప్రణవికి. జీపు వెళ్ళేదారికి అటూఇటూ బార్బ్‌డ్‍వైర్‍తో చాలా ఎత్తుదాకా కప్పులా మూసేసివుంది. కౄరమృగాలు రాకుండా. దారి చదునుచేయబడింది. ఇవన్నీ ప్రిమియర్ రెండోమాటు ఎన్నికయ్యాక జరిగినవి. విద్యకీ విజ్ఞానానికీ చాలా ప్రాధాన్యత ఇచ్చాడతను. ఎన్నో ప్రాచీన విశ్వవిద్యాలయాలని పునరుద్ధరించాడు. చదువుకుంటామని ముందుకొచ్చిన ఎందరో పిల్లలకి వాళ్ళ అర్హతనిబట్టి వుచితంగా చదువుకునే ఏర్పాటుచేసాడు. శాస్త్రవేత్తలకి ఎంతో సహకారాన్నిస్తున్నాడు. వాళ్ళు కావాలని అడిగినవన్నీ కాదనకుండా ఇస్తున్నాడు. ఈ గుహల్లో ప్రయోగాలకి ఎన్నో అవకాశం వుందని తెలుసుని వచ్చేవాళ్ళకి సురక్షితంగా వుండే ఏర్పాట్లు చేసాడు. మనిషి మంచితనానితో సంబంధంలేనివి రాజకీయాలు.
కొన్ని కోట్లమంది మనుషులు. వీళ్ళందరి అవసరాలూ తీరాలికాబట్టి ఒక వ్యవస్థ ఏర్పాటు అనివార్యం. అది రాచరికపువ్యవస్థైనా ప్రజాస్వామికవ్యవస్థైనా మరొకటైనా లక్ష్యం ఒకటే. అది ఏర్పడ్డాక సాఫీగా సాగాలంటే ఎన్నో సూత్రాలుంటాయి. వెరసి రాజ్యాంగం. కోట్లమనుషున్నట్టే కోట్లమనస్తత్వాలు. ఒకరికి మంచిచేసేవాళ్ళూ, చెడుచేసేవాళ్ళూ, మంచీచెడూ ఏదీ చెయ్యనివాళ్ళూ, నేరప్రవృత్తిగలవాళ్ళూ, సాత్త్వికులు. ఈ అందరికీ సమానన్యాయం, రక్షణా ఇవటానికి ఒక చట్టం. ఇదంతా ఏ దేశానికైనా మౌలికరూపమైతే దాన్ని నిర్దేశించేవి రాజకీయాలు.
రాచరికంకన్నా ముందుపుట్టిన అరాచకం, రాజకీయంగా మారి మనిషి ప్రవృత్తిలోకి తన వేర్లని విస్తరించుకుంది.
జీపు సాఫీగా సాగుతోంది. పచ్చటి ప్రకృతి. పచ్చదనం సృష్టంతా పరుచుకున్నట్టు ఎత్తైన మహావృక్షాలు. ఆకాశాన్ని తాకుతున్నట్టు. రకరకాల పువ్వులమీంచీ వస్తున్న సువాసన గుండెలనిండా నిండుతోంది. అడవి క్రమంగా చిక్కబడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే వీళ్ళు పంజరంలో వుండి ప్రయాణిస్తున్నారు. కౄరమృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
ఒకచోట ఎనుగులగుంపు కదిలి వెళ్ళడం కనిపిస్తే ఆగి చూసారు. అన్ని ఏనుగుల్ని ఒకచోట చూడటం వింతైన అనుభవం. ఆ వెంటనే కొన్ని జింకలు కనిపించాయి. చెట్లకి వేళాడుతున్న పాముల్నీ, ఒక చెట్టుమీంచీ ఇంకో చెట్టూమీదికి దూకుతున్న కోతుల్నీ చూసారు. ఒకటేమిటి, టీవీ ఛానెల్స్‌లో కనిపించేవన్నీ వాస్తవంగా చూసారు. చాలా థ్రిల్‍గా అనిపించింది ఇద్దరికీ. అభిజిత్ చాలా ఎగ్జైటైపోయాడు.
దాదాపు రెండుగంటలు ప్రయాణించాక మొదటి శిల్పం కనిపించింది. అక్కడ జీపు ఆపుకుని దిగారు. అంత నైపుణ్యత లేదు, అందులో. కళ్ళూముక్కూ ఆనవాళ్ళు పెద్దగా తెలీడంలేదు. నెమ్మదిగా ముందుకి సాగారు. ఒకటి తర్వాత ఒకటి. అలా శిల్పాలు కనిపిస్తునే వున్నాయి. ఒకొక్క శిల్పానికీ నైపుణ్యం పెరుగుతోంది. అలా ఒకొక్కటి చూస్తూ నడుస్తుంటే గుహని చేరుకోవడానికి మరో గంట పట్టింది. చాలా పెద్ద గుహ. అందులో అడుగుపెడుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది ప్రణవికి.
అభిజిత్ అనుకుంటున్నది నిజమా? తమ పూర్వీకులా వాళ్ళు? అవే ప్రశ్నలు. అదే విస్మయం. గుహలోపకి వెళ్ళాక కనిపించింది అవ్వనాతి నిలువెత్తు విగ్రహం. రాశిపోసిన అద్భుత సౌందర్యం. గుహద్వారంలోంచీ కాకుండా ఇంకెక్కడినుంచో వెలుతురు సన్నటి కిరణాల రూపంలో పడి ఆ సౌందర్యాన్ని దేదీపమాన్యంగా వెలిగిస్తోంది. కట్టుకున్న చీరమడతల దగ్గిర్నుంచీ ముంగురులదాకా సుస్పష్టంగా వున్నాయి. రాతిని ఇంతందంగా మలచటం సాధ్యమా? ఆ రోజుల్లో? ఆ మొదటి శిల్పాన్ని చెక్కిందీ , దీన్ని చెక్కిందీ ఒకరేనా? అంత పరిణతి ఎలా సాధ్యం? సాధించడానికి ఎంతకాలంపట్టింది? తన జీవితమంతా ధారపోసాడా? ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఆరోజుల్లోకూడా మనుషులు ఇప్పట్లాగానే వుండేవారా, నగలు పెట్టుకుని, చీరలుకట్టుకుని? అపనమ్మకంతోకూడిన ఇంకొన్ని ప్రశ్నలు.
తలతిప్పి అభిజిత్‍ని చూసింది. అతనూ ఆమెలాగే ప్రశ్నలతో సతమతమౌతున్నాడు.వాస్తవాలకీ తనకి తెలిసిన విషయాలకీ మధ్య ఏదో లింకు తప్పిపోతున్న భావన. అతని భృకుటి ముడిపడింది, తీవ్రమైన ఆలోచనలో నిమగ్నమైవున్నాడన్నందుకు చిహ్నంగా. ఇద్దరూ నెమ్మదిగా గుహ లోపలికి నడుస్తున్నారు. గుహద్వారంనుంచీ వస్తున్న వెలుతురు మందగించిందికానీ లోపలెక్కడినుంచో సన్నటి వెలుగుకిరణాలింకా ప్రసరిస్తునే వున్నాయి. ఆ కిరణాల వెలుతుర్లో అవ్వనాతి విగ్రహం తళుక్కుమంటోంది. అవెక్కడ్నుంచీ వస్తున్నాయో అర్థమవ్వలేదు. వాళ్ళకి వాటిమీదికి పెద్దగా ధ్యాసకూడా పోలేదు. కాళ్ళకీ చేతులకీ తగుల్తున్న పిల్లలవీ, పారాడే పాపలవీ. ఇంకాఇంకా ఎన్నో శిల్పాలు. .. నేలమీదా గుహగోడలమీదా ఎక్కడ చూసినా అవే. కొంచెం దగ్గిరగా చూస్తే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అన్నిటిలోనూ ఒక దు:ఖపురేఖ అంతర్లీనంగా.
విహ్వలమైంది ప్రణవి మనసు. ఈ దు:ఖాన్నేనా, జనం తట్టుకోలేక పారిపోతున్నది? ఎందుకు ఆ దు:ఖం? ఏం జరిగింది? ఎవరతను? ఇన్ని బొమ్మల్ని చెక్కింది ఒకరేనా? ఎంతకాలం పట్టింది? జీవితకాలమంతా దీనికే వెచ్చించాడా? అసలంత ఆటవికమైనరోజుల్లో … గుహల్లో బతికిన మనుషులకీ భావాలుండేవా? ఉంటే ఇంత సున్నితంగా ప్రకటించగల నేర్పుండేదా?
సరిగ్గా అప్పుడు వీచింది, బైటనుంచీ పెద్దగాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక శబ్దం. మగవాడు ఏడుస్తున్నట్టు. అభిజిత్ ప్రణవి చేతిని పట్టుకున్నాడు వుద్వేగంగా. శబ్దం ఆగిపోయి, మళ్ళీ గాలి వీచగానే మొదలైంది. ప్రణవికి గుండె చిక్కబట్టినట్టైంది. ఆ రోదనలో ధ్వనిస్తున్న దు:ఖపుజీర తనకు అనుభవంలోకి వచ్చినదే. శ్రీనివాస్‍తో గొడవలైన మొదట్లో అలాంటి దు:ఖమే తనని వెంటాడుతుండేది. ఆ మనిషిని ద్వేషిస్తునే అతనికోసం మనసు తపించిపోయేది. అతన్ని ద్వేషించడం బాహ్యప్రవర్తన. అతనికోసం తపించడం ఆంతరంగికమైనది. ఆమెకి అర్థమైంది. భగ్నప్రేమికులు , విరహంతో వేగిపోతున్నవాళ్ళు ఇక్కడికి వచ్చి తమని తాము కోల్పోయేవారు. అలాంటి దు:ఖపుఛాయకూడా ఎరగని శ్రీరాంలాంటివాళ్ళు చలించారు. ఆ దు:ఖాన్ని అనుభవించిన తను పోల్చుకోగలుగుతోంది. తనలాగా ఇంకెవరేనా పోల్చుకున్నారేమో తెలీదు.
ఎవరిదా రోదన? ఈ శిల్పాలు చెక్కినవ్యక్తిదా? ఇంకెవరిదేనానా? ఎందుకా దు:ఖం? అంత దు:ఖం? ఆ విగ్రహంలోని స్త్రీ , అవ్వనాతి ఎవరు? అతని భార్యా? ప్రేయసా? ఎలా కలిగింది వాళ్ళిద్దరికీ వియోగం? ఈ ప్రశ్నలన్నిటిమధ్యా నలిగిపోతూ, “వెళ్దాం పద అభీ!” అంది బలహీనస్వరంతో.
అతనింకా దిగ్భ్రాంతిలోనే వున్నాడు. ఒక వాస్తవాన్నిగురించి ఎవరో చెప్తేనో, ఎక్కడో చదివో తెలుసుకోవడం వేరు. దాన్ని ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకోవడం వేరు. నిలువెత్తు అవ్వనాతి విగ్రహాన్ని మరోమారు చూసి అక్కడినుంచీ కదిలారు. అతనికి రావాలని లేదు. కానీ యాంత్రికంగా ఆమెని అనుసరించాడు.
గుహ ఇవతల ఒక వ్యక్తి వాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడు.
“నమస్తే. నాపేరు క్రిస్” అని పరిచయంచేసుకున్నాడు. నాలుగేళ్ళుగా గుహని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిగా అతన్ని గుర్తించడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. అతను చాలా విషయాలు చెప్పాడు. ఆ గుహగురించీ, విగ్రహాలగురించీ, ఆడమ్స్‌కేవ్స్‌గురించీ … సంచారసమాచారాలయం అనవచ్చునతన్ని. అతనికంత ఆసక్తి ఎందుకో వాళ్ళిద్దరికీ అర్థమవలేదు.
“అక్కడ నేలమీద కొన్ని అక్షరాలు చెక్కివున్నాయి చూసారా? అవి ఏ భాషకి చెందినవో తెలీడంలేదు. అలాంటి లిపికూడా ఎక్కడా లేదు నాకు తెలిసి” అన్నాడు.
“ఎక్కడున్నాయి ఆ అక్షరాలు? మాకు కనిపించలేదు” ఆతృతగా అడిగాడు అభిజిత్.
“గుహలో గోడలమీదా నేలమీదా చెక్కి వున్నాయి. గోడలమీదివి కనిపించకపోవచ్చు. వీళ్ళు టార్చిలు అవీ అనుమతించరుకదా! నేను కాగడా తయారుచేసుకుని చూసాను. గుహంతా తిరిగేలోగానే గార్డులు నన్ను పట్టుకుని వెళ్ళగొట్టేసారు. నెమ్మదిగా మంచిచేసుకున్నాను. అగ్గిపుల్లలు వెలిగించుకోనిస్తున్నారు. ఆ వెలుతుర్లో చూస్తున్నాను. నేలమీదివి చాలావరకూ చెరిగిపోయాయి”
“ఎందుకలా?” అడిగింది ప్రణవి.
“వాళ్ళ జాగ్రత్త వాళ్ళది. కాగడాలవీ వెలిగిస్తే పొగచూరిపోతాయని భయం. కరెంటు దీపం పెట్టమని సలహా ఇచ్చాను. పవిత్రత పోతుందట. ఆ చీకట్లో ఏమీ కనిపించవు” విసుగ్గా అన్నాడతను.
“ఏం అక్షరాలవి?” అభిజిత్ అడిగాడు.
“తెలీదు. ఇదుగో, ఇలా వుంటాయి అవి” అని వంగుని ఒక పుల్లతీసి మట్టిలో రాసి చూపించాడు.
అభిజిత్‍కి పరిచయమైన అక్షరాలు…అ..వం..తి..
అతనికి వూపిరి ఆగిపోయినట్టైంది. అవ్వనాతి… అవనతేశ్వరం…అవనతి…అవంతి… ఎన్నో భాషల ముడులని అవలీలగా ఇప్పగలిగిన తను ఈ పేరుని ఎందుకు పోల్చుకోలేకపోయాడు? ఈ సారూప్యతలని ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? అతనికి దు:ఖంవేసింది. దీనినే మాయ అని వేదాంతులు అంటారు. కళ్ళముందు వున్నదాన్ని గుర్తించలేకపోవడం. ఏదో ఒక అనుభవం తటస్థిస్తేతప్ప వాస్తవం ఏర్పడకపోవటం.
ప్రణవికికూడా అలాగే దిగ్భ్రాంతిగా వుంది. అవంతి… లక్ష సంవత్సరాలక్రితం ఎక్కడినుంచో ఈ గ్రహానికి వచ్చిందని అభిజిత్ చెప్పిన అమ్మాయి…ఒక వ్యక్తికి ప్రేయసి. ఈరోజుని ఈ గుహల్లో ఇలా. ఒక దేవతగా కొలవబడుతూ. ఈ దేవుళ్ళూ, దేవతలూ అంతా ఇంతేనా? అభిజిత్‍కేసి చూసింది. ఒక ట్రాన్స్‌లో వున్నట్టుగా వున్నాడు. రెండుచేతుల్తో మొహం రుద్దుకుంటున్నాడు. పదేపదే కణతల్ని నొక్కుకుంటున్నాడు.
“నమ్మలేకపోతున్నాను” అన్నాడు ఆమె తనని చూడగానే.
మృదువుగా అతనిచేతిని పట్టుకుని నొక్కి వదిలింది.
“ఆ అక్షరాలు?” అడిగాడు క్రిస్ వాళ్ళని వింతగా చూస్తూ.
“అవంతి…” చిన్నగా అంది ప్రణవి.
“మీకు ఆ స్క్రిప్ట్ తెలుసా?” అడిగాడు క్రిస్ ఆతృతగా.
తనకి తెలిసిన విషయాలు బయటపెట్టద్దన్న ప్రిమియర్ అభ్యర్ధన గుర్తొచ్చింది అభిజిత్‍కి. ఎన్నో చెప్పాలనుకున్న అతని వాక్ప్రవాహం గొంతుదగ్గిరే ఆగిపోయింది.
“ఆటవికుల తెగ ఒకటి అలాంటి స్క్రిప్టు వాడుతుంది. నేను కొంత అధ్యయనంచేసాను” క్లుప్తంగా అన్నాడు.
క్రిస్ అభిజిత్‍గురించి అడిగి తెలుసుకుని చాలా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. అలాగే ప్రణవి పరిచయంకూడా చేసుకున్నాడు. అతను గుహలగురించి తెలుసుకున్న విషయాలన్నీ దాపరికంలేకుండా చెప్తుంటే తనుమాత్రం దాచి వుంచడం తప్పనిపించింది అభిజిత్‍కి. కానీ తప్పదు.
“శ్వేతపత్రగ్రంథాన్నిగురించి తెలుసా?” అడిగాడు.
క్రిస్ తలూపాడు.
“నకలు గవర్నమెంటు మ్యూజియంలో వుంది. అందులో అన్నీ ఇలాంటి అక్షరాలే వుంటాయి. ఏమీ అర్థమవదు” అన్నాడు.
“అసలు ప్రతి ఎక్కడుంది?” ప్రణవి అడిగింది.
“మీ స్పేస్‍వాళ్ళ దగ్గిరుందట” అన్నాడు క్రిస్. అతని గొంతులో అదొకలాంటి నిరసన. దాన్ని వాళ్ళేం చేసుకుంటారు, పాడుచేస్తారేమోనన్న భయంతో వచ్చిన నిరసన. అదే అనుమానం ప్రణవికీ వచ్చింది.
ముగ్గురూ నడుస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. “ఎన్నాళ్ళుంటారిక్కడ? మీ కాటేజికి రావచ్చా నేను?” అని అడిగాడు క్రిస్. ఇంచుమించు తమకి సమవయస్కుడైన వ్యక్తి అలా అడుగుతుంటే చిన్నపిల్లవాడిలా అనిపించాడు. “మేమిక్కడ వుండబోవటంలేదు. బహుశ: కాసేపటికి వెళ్ళిపోతామేమో! మాట్లాడుకునేంత వ్యవధి వుండదు. మళ్ళీ వస్తే తప్పక కలుసుకుందాం. లేదా మాయింట్లో కలుసుకుందాం” అంది ప్రణవి. అతని కాంటాక్ట్ నెంబరు అడిగి తీసుకుంది .
ఈ సంభాషణతోగానీ జరుగుతున్న విషయాలతోగానీ సంబంధంలేనట్టు తన ఆలోచనల్లో తనున్నాడు అభిజిత్.
క్రిస్‍కి ఈ గుహలగురించి ఎలా తెలిసింది? ఇక్కడే వుండిపోవాలన్నంత ఆసక్తి ఎందుకు కలిగింది? తనలాగే ఆలోచించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా వున్నారా? వాళ్ళందర్నీ ఈ గుహలు ఏదో ఒకమార్గంలో రప్పించుకుంటాయా? ఇక్కడికి రాకపోతే ఈ చిక్కుముడి విడేది కాదు. థేంక్స్ టు ప్రణవి.
ఈ గుహలగురించి ప్రచారంలో వున్న రకరకాల కథలు చెప్పాడు క్రిస్. తనగురించి చెప్పాడు. అతనొక అమ్మాయిని ప్రేమించాడట. ఆమె చనిపోతే ఆ దు:ఖంనుంచీ మనసు తిప్పుకోవడంకోసం ఆర్కియాలజీలో రిసెర్చి మొదలుపెట్టి అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడే వుండిపోయాడట. “జేన్ నన్నెంతగా తనలో కలుపుకుందో ఈ గుహలుకూడా అలాగే నన్ను పీల్చేసుకుంటున్నాయి” అన్నాడు. అదే విరహం. అదే బాధ. అనుభవించాడుకాబట్టి తట్టుకుని వుండగలుగుతున్నాడు. ప్రణవి నిట్టూర్చింది.
జీపుదగ్గిరకి వచ్చారు. “మీరూ వస్తారా? వదిలిపెడతాను” అడిగాడు అభిజిత్. క్రిస్ తలూపి ఎక్కి కూర్చున్నాడు.
“మీరు మా కాటేజికి వస్తానన్నారు. ఇప్పుడైతే రావచ్చు. కాఫీతాగే సమయం వుంటుంది ” అంది ప్రణవి.
అతను నవ్వాడు” కాఫీకోసం సమయం లేదు. ఇప్పుడు కాదు. గుహలగురించి చర్చించుకునే సమయం వున్నప్పుడు వస్తాను. ఆ అక్షరాలగురించి మా గైడ్‍తో మాట్లాడాలి. మీగురించీ చెప్తాను. మీరిద్దరూ ఆయనకి తెలిసి వుండవచ్చు” అన్నాడు. అతనికికూడా అభిజిత్‍లాగే బాహ్యమర్యాదలు తెలీవు. వదిలేసాడు. జేన్ చనిపోయాక వదిలేసాడు. తర్వాత మర్చిపోయాడు.
“శ్రీరాంతో మాట్లాడాలి” అంది ప్రణవి అభిజిత్‍తో.అతను తలూపాడు. క్రిస్ దార్లో దిగిపోయాడు. వీళ్ళు మొదటి గేటు దగ్గిరకి వచ్చారు. ఇద్దరి సెల్‍ఫోనులూ చక్కగా ఛార్జిచెయ్యబడి వున్నాయి. “ముందు నేను” అంది ప్రణవి చిన్నపిల్లలా. అభిజిత్ నవ్వి తలూపాదు. ఆమె శ్రీరాం నెంబరు డయల్‍చేసింది.
“నేను, ప్రణవిని” అంది అతను ఎత్తగానే.
“తెలివి. నీ సెల్‍లోంచీ నువ్వుకాక ఇంకెవరు చేస్తారు?” అడిగాడు శ్రీరాం నవ్వుతూ.
“మేం గుహల్లోకి వెళ్ళాము శ్రీరాం. అభీ ఎంత సంతోషంగా వున్నాడో తెలుసా? అది కచ్చితంగా సంతోషమని కాదు. రిలీఫ్. అతని పజిల్ విడిపోయింది. నేనే వెళ్దామని ప్రపోజ్‍చేసాను. అక్కడి దేవత… అవనతి…అభీ కథలోని అవంతి” అంది గబగబ.
శ్రీరాం స్తబ్దుడయ్యాడు. కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. “అక్కడికి వెళ్ళొద్దన్నానుగా?” అడిగాడు కోపంగా.
“నువ్వన్నట్టేం జరగలేదు. ఇద్దరం చాలా సంతోషంగా వున్నాం శ్రీరాం”
“…”
“ఇక్కడికొచ్చాక చిన్నపిల్లవాడిలా అతను పొందిన సంతోషమవీ చూసాక అతనెప్పటికీ అలాగే వుండిపోతే బావుండునని కొద్దికాలం అనిపించింది. ఆ తర్వాత నాకే అర్థమైంది, చిన్నపిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే వుండిపోరు, పెద్దౌతారు, వాస్తవం తెలుసుకుంటారని. అభీ ఈ మత్తులోంచీ బైటికి వచ్చేస్తాడు. అప్పుడు? అతనిని డైవర్టు చేసినందుకు అసహ్యించుకుంటే? అప్పటికి అతను వదిలిపెట్టేసినది మళ్ళీ అందుకోలేనంత దూరం జరిగితే? ఈ ఆలోచన రాత్రంతా నన్ను తినేసింది. అతని దార్లోకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. చెప్పానుకదా, అతను కన్నైతే నేను రెప్పనని. అవంతిని గుర్తుపట్టాడు. అతనికి కాదు, నాకే చాలా సంతోషంగా వుంది” అంది.
అభిజిత్ ఆమె భుజాలచుట్టూ చెయ్యేసి దగ్గిరకి తీసుకుని శ్రీరాంతో చెప్పాడు. “ప్రణవిని నా జీవితంలోకి రప్పించినందుకు కృతజ్ఞతలు”.
ఇద్దరూ ఏమీ కాకుండా వున్నందుకు శ్రీరాం సంతోషించాడు. “అసలేం జరిగింది?” కుతూహలంగా అడిగాడు. అతనికి ఇప్పటికీ నమ్మకం కలగటంలేదు, చిప్‍లోని విషయాలు నిజమంటే.