నీలినక్షత్రం – 13 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

అక్కడినుంచి ఏ సంకేతం అందిందో మరి!
పిల్లల్లో ఇంకొకడు స్తబ్దుగా ఉంటాడు. ఎవరే పని చెప్పినా చేస్తాడు. కాదనడు. కానీ తనుగా ఏది చెయ్యడు.వాడికి చదువు కూడా పెద్దగా రాలేదు. వీళ్ళలాగే ఆడపిల్లలు. మగ పిల్లలకి ఏమాత్రం తీసిపోరు. ఏ లక్షణాలైతే వర్ణాశ్రమ ధర్మానికి భూమ్మీద కారణాలయ్యాయో అవే లక్షణాలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. అవి జన్మజాత లక్షణాలు. ఒకరు చెప్తే నేర్చుకునేవి, ఒకరు రుద్దితే వచ్చేవి కాదు. అలాంటి లక్షణాలు చూపాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవి బహిర్గతమవుతాయి. తమలో ఉన్న లక్షణాలను బట్టి తమ అవసరాలను బట్టి
మిగతావాళ్ళతో గుంపు కడుతున్నారు. ఈ పిల్లల్లో కొందరు చెడ్డ పిల్లలు ఉన్నారు. వాళ్లు చదువుకోకుండా అడవుల్లో పడి తిరుగుతుంటారు. వాళ్లని కోప్పడ్డా దండించినా అంతే,
కొత్తకొత్త తరాలు తయారవుతూ ఉంటే వాళ్లకి ఏఏ పేర్లు పెట్టాలో హర్ష జాబితా తయారు చేశాడు. పుట్టబోయే తరాల కోసం కూడా పేర్లు తయారయ్యాయి. ఇదంతా విజ్ఞానానికి శాశ్వతత్వం ఇచ్చే ప్రయత్నం. భూమ్మీద ఉన్న అన్ని మతాల దేవుళ్ళు, దేవదూతలు, దేవతలు, నదులు, ముఖ్యమైన రాజులు… సాగర్, వసంతలాంటి ప్రకృతి సంబంధమైన పేర్లు, సంవత్సరాలు, నక్షత్రాల పేర్లు ఇలా అన్నీ కవర్ చేసాము.
రెండువేలమందికి పైగా తయారయ్యారు. మేం పునాది వేసిన హైదరాబాద్ ఒక చిన్న గ్రామంగా ఏర్పడింది. ఎవరిల్లు వాళ్లు కట్టుకుంటున్నారు. మట్టితో గోడల్ని నిలబెట్టి పైకప్పుగా తాటాకుల్నీ, రెల్లుగడ్డినీ పరుస్తున్నారు. మట్టితో కుండలు చేయడం, వాటిని కాల్చడం, అందులో వండుకోవడం, చెట్ల నారతో సన్నని దారం తయారుచేయటం, వాటిని ముళ్ళు వేసి బట్టలు చేసుకోవడం… సామాన్లు మోసుకెళ్ళడానికి చక్రాలతో చేసిన తోపుడుబండ్లు తయారు చేసుకోవడం… మేం పుస్తకాలలో చదువుకున్నవన్నీ వాళ్లకి నేర్పిస్తున్నాము. వాళ్ళు ప్రాక్టికల్స్ చేసి మాకు చూపిస్తున్నారు. ఇంకా ఇనుములాంటి లోహాలు మాకు కనిపించలేదు. అవీ ఎక్కడో కనిపిస్తాయి. వాటిని మొదలుపెట్టాక అవంతి అన్నట్టు పారిశ్రామిక విప్లవం వస్తుంది.
ఒకడు నారబట్టలు అందరికీ తయారుచేసిస్తే ఇంకొకడు అందరికీ కుండలు తయారు చేస్తాడు. ఎవరికి చేతనైనదీ నచ్చినదీ వాళ్ళు చేస్తున్నారు. కులాలూ, కులవృత్తులూ ఏర్పడటానికి మార్గం పడింది. అలా ఒక ప్రిమిటివ్ సమాజం తయారయింది. పారిశ్రామిక విప్లవం ముందునాటి పల్లెటూరిలా ఉంది. వ్యవసాయం ఇంకా అవసరం అవలేదు. అడవుల్లో దొరికినవీ, వేటాడుకుని తెచ్చుకున్నవి కుండల్లో వండుకుని తింటున్నారు. కుక్కలని పెంచుతున్నారు. ఆవుల్ని మచ్చిక చేసుకున్నారు. సిద్ధాంతాల చదువుతోపాటు అవంతి అన్న బతుక్కి ఉపయోగపడే చదువు వాళ్లే నేర్చుకుంటున్నారు. ఇక మా అవసరం వీళ్ళకి తీరిందనిపించింది.
వాతావరణంలోని స్వచ్ఛత వల్ల వృద్ధాప్యంగానీ మృత్యువుగానీ ఇంకా మా దగ్గరికి రాలేదు.
హర్ష వంశవృక్షాలని తయారు చేసాడు. ఎవరెవరు ఎవరెవరిని పెళ్లిళ్లు చేసుకోవచ్చు ఎవరెవరి మధ్య పెళ్లి కుదరదో వివరంగా రాసి ఉంచాడు. రోజులు గడుస్తున్నాయి. పిల్లలంతా మా అంతవాళ్ళు అయ్యారు. దాదాపు మూడువందల సంవత్సరాలు, అమర్ కి రెండువందల డబ్బయ్యైదు. మేం వచ్చినప్పటినుంచి పౌర్ణములు అన్నీ ఒక రాతి మీద చెక్కుతుంటే ఈ లెక్క తయారయింది. ఇదే మేం జరుపుకునే పౌర్ణముల పండగ.
వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. ఇళ్లన్నీ బాగు చేసుకోవడం, రకరకాల తినుబండారాలు తయారుచేసుకోవడం… తేనెలో వూరేసిన పుల్లటి పండ్ల గుజ్జు ప్రత్యేకమైన ఆహారం. ఇంక మాంసం ఐతే లెక్కలేనంత, తినగలిగినంత. ఆ రోజున అందరూ ఆరుబయట చేరతారు. ఆటలు, పాటలు, పద్యాలు… రెండు నిండు చందమామల మధ్య ఉన్నతంగా గడుస్తుంది రోజు. ఇంకా కల్లు సారాయివంటివి మాకు
కనిపించలేదు. కాబట్టి ఇదంతా మనసులు చైతన్యవంతమయ్యే ఉల్లాసం, ఒక్క పౌర్ణమికే ఉద్వేగంగా ఉంటుంది.
భూమ్మీద. ఇక రెండు నిండు చందమామలు… ఉవ్వెత్తున లేచే సముద్రపు అలల హోరు. ఎవరి మనసూఅదుపులో ఉండదు. తుళ్ళి తుళ్ళి కేరింతలే…
అంత కోలాహలం మధ్యా చెదిరిపోయిన శకలాల్లా అవంతి, గౌతమ్ ల జ్ఞాపకాలు. బాధ్యతల్ని తీర్చుకుని అమర్‍నీ, సృజననీ గురుస్థానాల్లో ఉంచి మేము గౌతమ్‍ని వెతుక్కుంటూ బయలుదేరాము. అతను ఏమయ్యాడో తెలీదు. దాదాపుగా అతన్ని అందరూ విస్మరించారు. మేము ఆశించినట్టే అమర్ కూడా తన కుటుంబ వ్యవహారాల్లోనూ హైదరాబాద్ నిర్వహణకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మునిగిపోయాడు. మేము
గౌతమ్‍ని వెతకడానికి బయలుదేరుతున్న విషయం చెప్పగానే అతని కళ్ళలో పశ్చాత్తాపం. గాఢనిద్ర నుంచి మెలకువ వచ్చినవాడిలా ఉలిక్కిపడ్డాడు.
“నేనూ వస్తాను” అన్నాడు..
“వద్దు. మా తర్వాత ఇదంతా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నాన్నని వెతికి పట్టుకొస్తాము” అన్నాను.
“వద్దమ్మా! వెళ్ళకండి. ఆయన ఉన్నారో లేదో తెలీదు. ఎక్కడని వెతుకుతారు? ఉంటే ఇన్నేళ్లలో ఒక్కసారైనా వచ్చేవారు కదా? ఆయన కోసం మీరు ప్రయాస పడవద్దు” వారించే ప్రయత్నం చేశాడు.
“నలుగురం వచ్చాము. ఒకరు చనిపోయారు. ముగ్గురం మిగిలాము. అందులోంచీ ఒకరు విడిపోయారు. విడిపోయిన ఆ మూడోవ్యక్తి గురించి తెలుసుకోకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. ముందుతరాలకి ఈ కథ తెలిస్తే మమ్మల్ని క్షమించరు. మా అంతరాత్మలు కూడా మమ్మల్ని క్షమించవు. చరిత్రలో మేము దోషులుగా మిగిలిపోతాం” అన్నాడు హర్ష,
అమర్ ఇంకేం అనలేదు. దారిలో తినడానికి మాకు ఆహారం కట్టిచ్చింది సృజన, ఆ చెట్లు పుట్టలమ్మట వెతుక్కోలేమని. అందరి దగ్గరా సెలవు తీసుకుని అందరికీ జాగ్రత్తలు చెప్పి బయలుదేరాము. దారంతా గుర్తులు పెట్టుకుంటూ నడిచాం. రోజులు గడిచాక కొన్ని రాతి బొమ్మలు కనిపించాయి. ప్రాణం లేచివచ్చినట్టయింది. ఆ బొమ్మలు కనిపించిన దారంతా వెతుకుతూ వెళ్తే అలా చాలా రోజులు ప్రయాణం చేశాక ఇంకో గుహలో అతను కనిపించాడు.
దుఃఖంతో శుష్కించిపోయి ఉన్నాడు. ఎముకల గూడు… మనిషి ఆనవాలు తెలీకుండా గడ్డాలూ మీసాలూ… ఎన్నేళ్లయింది అతనిని చూసి? దగ్గరగా వెళ్ళి భుజంమీద తల పెట్టి ఏడ్చేశాను. హర్షకూడా దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. అవంతి నిలువెత్తు విగ్రహాలు చెక్కాడు. నావీ హర్షనీ పిల్లలవీ ఎన్నో చెక్కాడు. అవంతి విగ్రహంలో అతని ఆత్మ ప్రతిబింబిస్తోంది.
“మనం వచ్చిన పని పూర్తయింది గౌతమ్! పిల్లలు పెద్దవాళ్లయ్యారు. దాదాపు రెండువేల మంది తయారయ్యారు. ఇదే భూమ్మీదైతే ఇంత పెద్ద కుటుంబాన్నీ ఇన్ని తరాలనీ చూడగలిగేవాళ్ళం కాదు. వాళ్లని చూడవా? నీ రెండో కూతురు అచ్చం అమ్మలాగే ఉంటుంది. దాని కొడుకు కూడా అలాగే ఉంటాడు” ఎన్నో చెప్పాం.
అన్నీ ప్రశాంతంగా విన్నాడు. విని అడిగాడు. “అవంతి లేకపోయినా ఇవన్నీ జరిగాయా మీరా? నాకైతే కాలం అక్కడే ఆగిపోయినట్టనిపించింది” అన్నాడు.
అతన్ని ఎలా ఓదార్చాలో అర్ధమవలేదు. అతని గుహలో రెండు రోజులు ఉన్నాం. గుహ లోపలి చివర్నన సన్నగా మూలలాగా ఉండి వెలుతురే రానిచోట అతను ముడుచుకుని కూర్చుని వుండి ఏడుస్తాడు. ఆ దుఃఖాన్ని మేం తట్టుకోలేకపోయాం. అతను ఇన్ని సంవత్సరాలుగా ఏడుస్తూ ఒంటరిగా గడిపాడన్న ఊహ మమ్మల్ని బాధపెట్టింది. కర్తవ్యానికి లోబడి ఇతన్ని విస్మరించినందుకు చాలా బాధ కలిగింది.
“మాతో రా, గౌతమ్! ఒక్కడివీ ఉండటంచేత ఈ దుఃఖం. అక్కడికి వచ్చి అందరి మధ్యనా గడిపితే బాధని మర్చిపోగలుగుతావు” అన్నాను.
అతను నిర్జీవంగా నవ్వి, “అవంతి వద్దనుకుని వదిలేసినవి నాకెందుకు?” అన్నాడు.
మేము వచ్చిన రెండోరోజున అతను చనిపోయాడు. ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుండే చోట, అలాగే ఏడుస్తూ చచ్చిపోయాడు. హృదయ విదారకమైన అతని ఏడుపు గుహలో నిక్షిప్తమై పోయింది. మేం రావడం ఆలస్యమైతే అతను చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు. గుండె బరువెక్కింది. తిరిగి వెళ్లాలనిపించకపోయినా అక్కడ ఉండలేక మళ్లీ వెనక్కి వచ్చేసాం.
“నాన్న కనిపించలేదా!?” అవంతి పిల్లలు అడిగారు.
జరిగింది చెప్పాము. అంతా కలిసి ఆ గుహ చూడటానికి వెళ్లారు. అక్కడ అవంతి విగ్రహాన్ని చూసిన అమర్, “అమ్మ గడ్డం మీద చిన్న మచ్చ ఉండేది. దాన్ని నాన్న ఎందుకు మర్చిపోయారో!” అంటూ మచ్చని చెక్కి వచ్చాడు. అంత పసితనంలోనే చచ్చిపోయినా అమ్మ వాడికి ఎంత గుర్తో!
అది ఒక జాతరకి మొదలు.
నాకు, హర్షకి జీవితంమీద విరక్తి మొదలైంది. కానీ మృత్యువు దగ్గరికి రావడం లేదు. తిండి తగ్గించేసుకున్నాం.
“మీరు కూడా వెళ్ళిపోతారా?” అని దుఃఖించారు పిల్లలు. హర్ష నిర్ణయం మారలేదు. “అంతా సరిగా ఉన్నప్పుడే మనం పోతే మంచిది” అన్నాడు.
వృద్ధాప్యంలోని నిస్సహాయత ఎక్కడైనా ఒకటే.
“అవంతి నాయనమ్మతో నీకు ఇప్పుడే గొడవా లేదుగా?”ఎప్పటిదో విషయం గుర్తు చేసుకుని అడిగాను. అతను కూడా గుర్తు తెచ్చుకుని నవ్వాడు.
చావు అంత తేలిగ్గా రాలేదు. మాకు ఇంకొన్నేళ్ళు పెట్టింది. పిల్లల విషయం పట్టించుకుంటుంటే అది దూరదూరంగా జరుగుతోంది.
దాదాపు మూడువందలేళ్ళు బతికాక పదిహేను తరాలు చూసాక ఒకరి తర్వాత మరొకరం పోయాము.
నేను చనిపోయేముందు పేపర్ డైరీ అమర్‍కి ఇచ్చాను. దాన్ని జాగ్రత్తగా కాపాడి ముందు తరాలలకి అందజెయ్యాలని చెప్పాను. కంప్యూటర్ చిప్ గురించి చెప్పలేదు. దాన్ని అక్కడే అలాగే వదిలెయ్యాలనుకున్నాను.
“నిప్పు తగలకూడదు. జాగ్రత్త” అన్నాను పేపర్ డైరీ గురించి.
అవే నేను మాట్లాడిన ఆఖరి మాటలు. ఎంతో ధైర్యంతో అందరినీ వదులుకొని ఇంత దూరం వచ్చి ఒక నాగరికతని స్థాపించగలిగిన నేను చెయ్యి కూడా కదపలేనంత నిస్సహాయంతో మృత్యువు ఒడిలోకి జారిపోయాను.
ఎన్నో ఏడుపులు నా చెవుల్లో పడి క్రమంగా ఏదీ వినిపించని స్థితికి చేరుకున్నాను.

శ్వేతపత్ర గ్రంధం చదవడం పూర్తయింది. ప్రణవి, అభిజిత్ అందులోని విషాదంనుంచి తేరుకోలేకపోయారు. ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చి మానవప్రస్థానాన్ని కొనసాగింపజెయ్యటం…
మనిషి అంటే ఆకాంక్షలు, ఆశయాలు.
మనిషి అంటే అనుభవాలు, ఆలోచనలు…
మనిషి అంటే ఉద్వేగాలు, దుఃఖాలు…
చివరిగా మనిషి అంటే మెటబాలిజం, మైటాసిస్, మయాసిస్,
సుదూరగతంలో జరిగిన ఒక వాస్తవం ఉంది. వర్తమానం ఉంది. ఈ రెండింటి మధ్య అనుసంధానం లేదు. ఏవేవో జరిగాయని ఊహించుకోవడమేగానీ ఇవి జరిగాయన్న ఖచ్చితమైన రికార్డు లేదు. కానీ ఆ జరిగినవి. కాలగర్భంలో ఉన్నాయి. వాటిని ఎవరూ బయటికి తీయలేరు. కాలఘోష వినవలసిందే.


కాలగర్భంలో కలిసిపోయిన వాస్తవాలు.
ముందు హర్ష చనిపోయాడు. అతని మరణం మీరాని చాలా కదిలించింది. నలుగురు కలిసి ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరుగా మిగిలిన ముగ్గురూ తరలిపోయారు. అమర్, పృథ్వి ఇంకా మిగిలిన మొదటితరం పిల్లలు తమకి సమవయస్కులనిపించుకోగలిగే అనుభవం సంపాదించినా, వాళ్ళు ఇంకా పిల్లల్లాగే అనిపిస్తారు తప్ప సమానహోదాలో కనిపించరు. వాళ్లతో తన ఆంతరంగిక విషయాలను పంచుకోలేకపోయింది. ఒక్కర్తీ విషాదాన్ని మోస్తూ మిగిలింది. హర్ష ఉన్నప్పుడు తెలియని భారం ఇప్పుడు తెలుస్తోంది. రోజంతా
దుఃఖమే.
రాత్రంతా నీలినక్షత్రాన్ని చూస్తూ కూర్చుంటుంది. పగలంతా ఆ నక్షత్రం కరిగిపోయిన ఆకాశాన్ని చూస్తుంది. అక్కడ ఏవో కదలికలు కనిపిస్తుంటాయి. తన అమ్మానాన్నలు, మహేష్, హర్ష తల్లి, ప్రొఫెసర్ మిత్ర, ఇంకా హైబర్నేషన్లోకి వెళ్లి ఏదో మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న శాస్త్రవేత్తలు. వీళ్లంతా గుర్తొస్తారు.
జరిగింది అక్కడ? ఇప్పుడేం జరుగుతోంది? అక్కడి పరిస్థితులు మామూలుగా మారాయా? ప్రకృతికి తనని తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంటుందంటారు. అలా జరిగిందా? అంతా మామూలుగా మారిపోయిందా?