రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.
ఉన్నట్టుండి అకాకీకి వీపులోనూ, భుజాల్లోనూ భయంకరమైన నొప్పి మొదలైంది. భరించలేకపోతున్నాడు. ఎంత వేగంగా నడిచి ఆఫీసుకి వస్తున్నా ఇలా ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్నించుకున్నాడు. ఇంటికి వెళ్ళాక తన ఓవర్‍కోటుని జాగ్రత్తగా పరీక్షించాడు. ఎక్కడైతే నొప్పిగా వుందో అక్కడ కోటు బాగా చీకిపోయి పల్చటి వలలా తయారైంది. లోపలి లైనింగ్‍బట్ట చిరిగి పీలికలై వేలాడుతోంది. వాస్తవానికైతే ఆ కోటుకూడా సహోద్యోగుల పరిహాసానికి బాగానే గురైంది. వాళ్ళెవరూ దాన్ని కోటుగా అంగీకరించలేదు. చేతుల్లేని కేప్‍మాత్రమే అని వెక్కిరిస్తారు. దాని పరిస్థితి చూసాక టైలర్ పెత్రొవిచ్ దగ్గరకి రిపేరుకి తీసుకెళ్ళాలనుకున్నాడు. పెత్రొవిచ్‍కూడా స్ఫోటకంమచ్చల ఒంటికంటివాడే ఐనా మృదుస్వభావి, వుద్యోగస్తుల దుస్తులని రిపేరు చెయ్యటంలో దిట్ట.
పెట్రొవిచ్ అసలు పేరు గ్రిగొరీ. అతనొక పెద్దమనిషి దగ్గర రైతుకూలీ. ఆ పెద్దమనిషి అతన్ని వెట్టినుంచీ విడుదల చేయగానే పెట్రొవిచ్‍గా పేరు మార్చుకున్నాడు. కొత్త పేరుతోపాటు కొత్త అలవాట్లనుకూడా నేర్చుకున్నాడు. ఏదో వంకను తాగటం మొదలుపెట్టాడు. భార్యను చిన్నచూపు చూసే పాతఆనవాయితీని మాత్రం మానలేదు. భార్యాభర్తలిద్దరూ ఒక అపార్టుమెంటు నాలుగో అంతస్తులోని మెట్లగదిలో కాపురం వుంటారు.
అతని దగ్గరకి బయల్దేరాడు అకాకీ తన ఓవర్‍కోటుకి మరమ్మత్తులు చేయించుకుందుకు. రెండు రూబుళ్ళకి మించి ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. పైనుంచీ పోసిన అంట్ల నీళ్ళతో మెట్లన్నీ నానిపోయి వున్నాయి. ఘాటైన రసాయనాల వాసనకి కళ్ళలో నీళ్ళొచ్చాయి. సెయింట్‍పీటర్స్‌బర్గ్‌లోని అన్ని అపార్టుమెంట్లలోనూ ఇలాంటి చీకటిగుయ్యారాల్లంటి మెట్లగదులు వుంటాయి. ఎక్కువ అద్దెలు ఇచ్చుకోలేనివారు వాటిల్లో వుంటారు. అసలీ అపార్టుమెంట్ల సంస్కృతి ఫ్రాన్స్‌లో పద్ధెనిమిదో శతాబ్దం మధ్యలో మొదలైంది. మరో వందేళ్ళు గడిచేసరికి యూరపుదేశాన్నిటిలో విస్తరించింది.
తలుపు తెరిచే వుంది. ఇంటావిడ చేపలకూరేదో వండుతున్నట్టుంది, గదంతా మిణుగుర్లు తిరిగినా కనిపించనంత పొగతో నిండిపోయింది. అకాకీ ఇంట్లోకి ప్రవేశించాడు. నెమ్మదిగా పెట్రొవిచ్‍ని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. అతను కుట్టుపనిలో నిమగ్నమై వున్నాడు. అకాకీ దృష్టి అతని బొటనవేలిమీద పడింది. వంకర తిరిగి, మొద్దుగా తాబేలుడిప్పంత దృఢంగా వున్నట్టనిపించింది. పెట్రొవిచ్ మెడకి సిల్కుదారపు కండె వేలాడుతోంది. ఒళ్ళో అతను మరమ్మత్తు చేస్తున్న పాతవస్త్రమేదో వుంది. సూదిలోకి దారం ఎక్కించాలని అతను విఫల ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికి మూడుసార్లైంది. సూది వేల్లో గుచ్చుకుంది కూడా. లోగొంతులో అసహనంగా తిట్టుకుంటున్నాడు. రాకూడని సమయంలో వచ్చినందుకు అకాకీ తనమీద తనే చిరాకుపడ్డాడు.
పెట్రొవిచ్ అలా వున్నాడంటే పూర్తి స్పృహలో వున్నట్టు. తాగి లేనట్టు. బేరం ఆడనివ్వడు. ఒక్క కోపెక్కు కూడా తగ్గించడు. పెట్రొవిచ్ భార్య మాటల్లో చెప్పాలంటే ఆ వొంటికన్ను దయ్యం తాగి వున్నప్పుడే ఎవరిమాటేనా వినిపించుకుంటాడు. లెక్కాపత్రం చూడడు. ఎంత తక్కువకి అడిగినా వప్పేసుకుని, తనకి పని యిచ్చినందుకు ధన్యవాదాలుకూడా చెప్తాడు. అతని భార్య ఆ వ్యవహారం మధ్యలోకి తలదూరుస్తుంది. ఇంకో పది కొపెక్కులు ఇమ్మంటుంది. ఆ పదీ ఇవ్వగలిగితే బేరం కుదిరిపోతుంది. ఇప్పుడైతే ఎంత అడుగుతాడో తెలీదు. అకాకీకి అక్కడినుంచీ పారిపోవాలనిపించింది ఒక్క క్షణం. కానీ పెట్రొవిచ్ అతన్ని చూడనే చూసాడు. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
అప్పుడింక మాటలు పేర్చుకుని, “బావున్నావా, పెట్రొవిచ్” అని పలకరించాడు.
“శుభోదయం మహాశయా! ” జవాబిచ్చాడు పెట్రొవిచ్ అకాకీ ఏం పట్టుకొచ్చాడో అని అతని చేతులకేసి చూపులు తిప్పి చూస్తూ.
అకాకీకి మాటలు తడబడ్డాయి. “ఇది…ఇది…” చెప్పలేకపోయాడు. కానీ చెప్పాననే అనుకున్నాడు.
“ఏమిటా ఇది?” పెట్రొవిచ్ అడిగాడు అకాకీ వేసుకున్న బట్టలని- కాలరు దగ్గర్నుంచీ చేతికఫ్‍లదాకా, ముందు, వెనకా, బొత్తాలు, కాజాలు, పటకాలు- అన్నీ అతని వంటిమీద వుండగానే పరీక్షగా చూస్తూ. వాటిని కుట్టిందీ పదేపదే మరమ్మత్తు చేసిందీ అతనే కాబట్టి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవర్నేనా కలవగానే టైలర్లు మొట్టమొదట చేసేపనే అది.
“ఇదంటే నా ఓవర్‍కోటు… పెట్రొవిచ్… కోటంతా బానే వుంది. గట్టిగా వుంది. కొంచెం దుమ్ముకొట్టుకుని వుండటంచేత పాతగా అనిపిస్తోందికానీ… కొత్తదే. ఇదుగో, భుజాలమీద, వీపుమీదా కాస్తంత మరమ్మత్తు చెయ్యాలి. అంతే… ” తడబడుతూ అన్నాడు.
పెట్రోవిచ్ ఓవర్‍కోటుని తీసుకున్నాడు. దానిని టేబుల్‍మీద పరిచి తల ఒకమాటు విదిలించాడు. కిటికీలో పెట్టిన నశ్యండబ్బా అందుకున్నాడు. దానిమీద ఎవరో మిలిటరీ జెనరల్ ముఖచిత్రం వుంది. నశ్యం తీసినప్పుడు వేలితో రాసిరాసి ఆ జనరల్ ముఖం చెరిగిపోయింది. తెల్లటి కాగితంముక్క అతుకుపెట్టినట్టుంది. చిటికెడు ముక్కుపొడుం తీసుకుని మళ్ళీ ఒకమాటు ఓవర్‍కోటుని వెలుతురుకి పెట్టి మరోసారి చూసాడు. నశ్యం పీల్చి, మిగిలినదాన్ని పొడుంపెట్టిలో పడేస్తూ తల మరోసారి బలంగా ఆడించాడు.
“దీన్ని మరమ్మత్తు చేయటం అసాధ్యం. అంత దారుణంగా వుంది” అన్నాడు.
ఆ మాటలతో అకాకీ గుండె జారిపోయింది.
“ఎందుకు సాధ్యపడదు పెట్రొవిచ్?” చిన్నపిల్లాడిలా బేలగా అడిగాడు. “సమస్యల్లా భుజాలదగ్గర చీకిపోయింది. ఏవేనా ముక్కలు అతుకేస్తే సరిపోతుంది…”
“ఆ< అతుకులు వేయచ్చు. కానీ దేనికి అతికించను?” అడిగాదు పెట్రొవిచ్. “అతుకుపెట్టడానికంటూ ఏమీ లేదు. కోటంతా చీకిపోయింది. కుట్టు వేస్తే పిగిలిపోతుంది” అన్నాడు.
“కావచ్చు. ఎక్కడ పిగిలితే అక్కడ మరో అతుకు వెయ్యి”
“కోటంతా అలాగే వుంది. అతుకులు పెట్టి లాభం లేదు. కోటులా లేదు. చీకిపోయి పల్చబడి గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేలా వుంది”
“కొంచెం మరమ్మత్తు చేస్తే బానే వుంటుంది”
“కుదరదు” కచ్చితంగా జవాబిచ్చాడు పెట్రొవిచ్. “దీన్నింకేమీ చెయ్యలేను. నాకు పనిదండగ. నీకు డబ్బు దండగ. చింపి చలికాలానికి గైటర్ల్‌లాంటివి తయారుచేసుకో. నీ స్టాకింగ్స్ చలిని ఆపవు. కొత్త ఓవర్‍కోటు మాత్రం కొనుక్కోక తప్పదు”
“కొత్తకోటు” అన్న మాట అకాకీ చెవుల్లో మార్మోగింది. కళ్లముందు చీకట్లు కమ్మినట్టైంది. కాస్త తేరుకునేసరికి పెట్రొవిచ్ నశ్యండబ్బామీది జనరల్ తెల్లమొహం మాత్రం కనిపించింది. అది అచ్చం అకాకీ మొహంలాగే వుంది.
“కొత్తదా?” అకాకీ కలలోలా అడిగాడు. “నాదగ్గర డబ్బులేదుగా, ఎలా?” అన్నాడు అమాయకంగా.
“ఔను కొత్తది కొనుక్కోవాలి” అన్నాడు పెట్రొవిచ్ మొరటుగా.
“కొత్తదా… కొత్తదంటే … ” అకాకీ మళ్ళీ తడబడిపోయాడు. మనసులో వున్నమాట స్పష్టంగా చెప్పలేకపోయాడు.
“ఎంత వుంటుందని అడుగుతున్నావా?”
“ఔను”
“నూటయాభై రూబుళ్ళేనా ఔతుంది” జవాబిచ్చాడు పెట్రొవిచ్. ఆ చెప్పటంలో ఎదుటివారిని ఆశ్చర్యపరిచి తమాషా చూద్దామనే కోరిక వుంది. అది అతని తత్వం.
“ఒక్క ఓవర్‍కోటు నూటయాభై రూబుళ్ళా?” దిగ్భ్రాంతితో దాదాపు అరిచినట్టు అడిగాడు అకాకీ. అతనంత గట్టిగా మాట్లాడటం బహుశ: అదే మొదటిసారి.
“ఔను మహాశయా! సాదా ఓవర్‍కోటైతే అంత తక్కువలో వస్తుంది. బొచ్చుకాలరు, సిల్క్‌టోపీ వున్నదైతే రెండువందలేనా ఔతుంది”
“పెట్రొవిచ్, దయచేసి మరోమాటు ఆలోచించు. కొంచెం ఓపికతో మరమ్మత్తు చేస్తే ఇంకొంతకాలం మన్నుతుందేమో!” అతని మాటలు పట్తించుకోకుండా తనదైన ధోరణిలో బతిమాలుతున్నట్టుగా అన్నాడు.
“లేదు మహాశయా! నాకు పని దండగ, మీకు డబ్బులు దండగ. అంతే” నిర్మొహమాటంగా అన్నాడు పెట్రొవిచ్. అకాకీ నిస్సహాయంగా చూసి, కోటు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే తదేకంగా చూసాడు పెట్రొవిచ్. అకాకీ మరమ్మత్తులకోసం మరో టైలరుదగ్గరికి వెళ్ళడనే పూర్తి నమ్మకం కలిగాక తిరిగి తన పనిలో నిమగ్నమయాడు.
కలలో మనిషిలా నడుస్తూ వీధిలోకి వచ్చాడు అకాకీ. “ఇలా జరుగుతుందనుకోలేదు. ఈ వ్యవహారం ఇలా దారితీస్తుందనుకోలేదు…” పదేపదే అనుకుంటూ నడుస్తున్నాడు. ఈ బేజారులో ఇంటివైపుకి బదులు పూర్తి వ్యతిరేకదిశలో వెళ్తున్నట్టుకూడా గమనించలేదు. ఒకచోట చిమ్నీ బూడిద మీదపడింది. ఇంకోచోట పై అంతస్తులోంచీ చెత్తవచ్చి అతని నెత్తిన పడింది. అతను గుర్తించనేలేదు. చేతిలో వున్న బరిసె పక్కన నిలబెట్టి, నశ్యండబ్బాని చేతిలోకి తీసుకుని పీల్చబోతున్న ఒక కాపలాదారుని డీకొట్టేదాకా అతనికి బాహ్యస్పృహే కలగలేదు.
“కళ్ళు కనిపించట్లేదా? దార్లోకొచ్చి నడుస్తున్నావు? పేవ్‍మెంటుందికదా, పాదచారులు నడవటానికి?” అని కోపంగా అడిగాడతడు. అప్పుడుగానీ తెలికిడి కలగలేదు అకాకీకి. తనెక్కడున్నాడో గమనించుకుని, నెమ్మదిగా వెనుతిరిగి, ఇంటిదారి పట్టాడు. ఇంటికెళ్ళాక జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. తన ఆలోచనలు, స్థితిగతులు అన్నిటినీ ఒక నమ్మకస్తుడైన, నిజాయితీపరుడైన ప్రాణమితృడితో చర్చించుకున్నట్టు తనతో తనే చర్చించుకున్నాడు.
“కొత్తకోటు కొనడమనేది తనకి సాధ్యమయే విషయం కాదు. అలాగని పెట్రొవిచ్‍కి మామూలుగానైతే నచ్చజెప్పడంకూడా కుదరదు. అతను వినడు. ఆదివారం పొద్దున్నైతే లొంగుతాడు. శనివారం రాత్రినుంచీ తాగాలనే కోరికతో అతను సతమతమైపోతాడు. భార్య కొట్టనేనా కొడుతుందిగానీ డబ్బులుమాత్రం ఇవ్వదు. అలాంటి సమయంలో వెళ్ళి పది కొపెక్కులు చేతిలో పెడితే చాలు, సాధ్యపడదన్న పనిని చేసి చూపెడతాడు” అనుకున్నాక అతనికి కొంచెం దిటవు చిక్కింది.
ఆదివారందాకా ఎదురుచూసి, ఆదివారం పొద్దున్నే పెట్రొవిచ్ ఇంటిముందు కొంత దూరాన నిలబడి అతని భార్య బైటికి వెళ్లటం గమనించి ఇంట్లోకి అడుగుపెట్టి, నేరుగా అతనిముందు వెళ్ళి నిల్చున్నాడు. అకాకీ అతన్ని గురించి అనుకున్నది నిజమే. అతను మత్తుతో జోగుతున్నాడు. ఐనాసరే, అతను అకాకీ ఎందుకొచ్చాడో వెంటనే పట్టేసాడు.
“మరమ్మత్తవదని చెప్పానుకదా మహాశయా? కొత్తది కొనుక్కో” నిక్కచ్చిగా చెప్పాడు.
అకాకీ పదికొపెక్కులనాణెం తీసి అతనికి ఇచ్చాడు. పెట్రొవిచ్ సంతోషంగా తీసుకుని ధన్యవాదాలు చెప్పాడు. “కానైతే ఒక్క విషయం మహాశయా! ఈ కోటు పట్టుకుని అక్కడికీ ఇక్కడికీ తిరిగి శ్రమపడద్దు. అది దేనికీ పనికిరాదు. మీరు బట్ట కొని తెచ్చుకుంటే నేను కొత్తది కుట్టిస్తాను. దాన్నిగురించి ఆలోస్తే మంచిది” అన్నాడు.
అకాకీ తన పట్టుదల విడవలేదు. పెట్రొవిచ్ ఏమాత్రం తగ్గలేదు. “నేను కొత్తది కుట్తిస్తానంటున్నానుకదా? కుదిరితే దానికి కాలరు, వెండి బొత్తాలు పెడతాను” అన్నాడు.
కొత్తకోటు కొనుక్కోక తప్పదని అకాకీకి అర్థమైంది. పూర్తి నిరాశలో కూరుకుపోయాడు. ఎలా? ఎక్కడినుంచి తీసుకురావాలి అంత డబ్బు? ఇదొక్కటేనా? కొత్తఫాంట్లు, షర్టులు, లోదుస్తులు కొనుక్కోవాలి. బూట్ల పైభాగం రెండుసార్లు మార్పించాడు. మోచీకి ఇంకా ఆ డబ్బు ఇవ్వలేదు. బాకీ ఎప్పట్నుంచో అలాగే వుంది. ఉన్న డబ్బంతా ఖర్చుచేసినా కోటుకి సరిపోదు. నెలకి నలభైరూబుళ్ళు కూడా వుండని తన జీతాన్ని డైరెక్టరు దయదల్చి నలభయ్యైదో యాభయ్యో రూబుళ్ళకి పెంచినాకూడా ఇవన్నీ కొనుక్కోవటం సాధ్యపడదు. ఇక కొత్తకోటు కొనుక్కోవడమంటే? అసలు పెట్రొవిచ్ చెప్పినంత ధర వుంటుందా, కొత్తకోటు? ఒకొక్కసారి అతను చాలా తిక్కతిక్కగా చెప్తాడు. అతని భార్యకూడ తెల్లబోయేలా. సరే, పెట్రొవిచ్ ఎక్కువే చెప్పాడనుకుందాం. కోటు ఎనభై రూబుళ్ళకే వస్తుందనుకున్నా, అది మాత్రం ఎక్కడినుంచీ వస్తుంది? సగం మొత్తాన్ని ఎలాగో కిందామీదా పడి పోగుచెయ్యగలడు. మిగతాది?
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.