రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.
అతని అంత్యక్రియలు క్లుప్తంగా జరిగాయి. అతని వస్తువులంటూ పెద్దగా ఏమీ లేవు. బాతుయీకలతో చేసిన కొన్ని కలాలూ, కాసిని తెల్లకాగితాలు, మూడు జతల సాక్స్… ఇలాంటి ఇంకో రెండుమూడు. అంతే. వాటిని తీసుకెళ్ళేందుకు అతనికి వారసులు కూడా లేరు. అందుకని వాటిని అలాగే వదిలేసారు.
అకాకీ చనిపోయాడు. సెయింట్‌పీటర్స్‌బర్గ్ జనస్రవంతిలోంచీ నిష్క్రమించాడు. అతను లేకుండానే అన్నీ యధావిధిగా సాగిపోతున్నాయి. అలాంటి మనిషి ఒకడు ఆ వూళ్ళో కొన్ని దశాబ్దాలపాటు బతికి, కనిపించకుండాపోయిన ప్రభావం ఏమీలేదు. ఎవరి అండదండలూ, ప్రేమాప్యాయతలూ లేకుండా, ఎవరూ సాటిమనిషిగా కూదా గుర్తించకుండా, సైన్సువిద్యార్థుల మైక్రోస్కోపుకింద పరిక్షించబడే మామూలు యీగపాటికూడా చెయ్యకుండా ఆ మనిషి అదృశ్యమయాడు. న్యాయంకోసం వెళ్ళి ప్రభుత్వవిభాగంలో జరిగిన అవమానాన్ని నిశబ్దంగా భరించి, అంతే నిశబ్దంగా స్మశానంలోకి వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్రత్యేకతలూ లేకుండా వున్న మనిషి. అతని జీవితం మొత్తంలో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. కానీ జీవితపు చరమాంకంలో ఒక కోటు అతనికి అమితమైన ఆనందాన్ని రుచిచూపించింది. దానివెనుకే అంతులేని విషాదాన్నికూడా. ఎంతో బలమైన వ్యక్తిత్వంగలవారినికూడా దురదృష్టాలు వెంటాడతాయి. కానీ ఈ అసాధారణమైన వ్యక్తి తన జీవితంలో ఒకేఒక్కసారి వచ్చిన సంతోషాన్ని మింగేసిన ఆ కష్టాన్ని తట్టుకోలేకపోయాడు.
అకాకీ ఎందుకు రావట్లేదో తెలుసుకోవటానికి డిపార్టుమెంటునుంచీ మనిషిని పంపారు. అప్పుడు అందరికీ తెలిసింది, అతను చనిపోయి నాలుగురోజులైందని. ఆ వార్త తెలిసిన మరుసటిరోజే కొత్తకాపీయిస్టు వచ్చి అకాకీ సీట్లో కూర్చుని పని మొదలుపెట్టాడు. అతని చేతిరాత అకాకీ రాతంత గుండ్రంగా వుండేది కాదు, పైగా అక్షరాలు బాగా వొరిగిపోయి వుండేవి. ఐనా పని నడిచిపోతోంది.
మరణంతో అకాకీ కథ పూర్తైపోలేదు. బతికున్నప్పుడు ఎంత అనామకుడో చనిపోయాక ఒక్కసారి అంత సంచలనాన్ని సృష్టించాడు. అతని కథకి అదొక వింత ముగింపు అయింది.
అకాకీ చనిపోయిన వార్తా, అతని చావుకి దారితీసిన వింతకథా ఆనోటా యీనోటా నగరమంతా పాకింది.
చనిపోయిన అకాకీ కలిన్కిన్ వంతెనమీదా దాని చుట్టుపక్కలా రాత్రివేళల తిరుగుతున్నట్టూ, పోయిన తన ఓవర్కోటుని వెతుక్కుంటున్నట్టూ, పోయినదానికి బదులుగా దారినపోయేవాళ్ళూ ఎవరనేదీ, ఎంత పెద్దమనుషులనేదీ, వాళ్లకోటు తనదానికన్నా విలువైనదా అనేదికూడా చూడకుండా బలవంతంగా లాకుంటున్నట్టూ సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో ఒక పుకారు మొదలైంది. ఒక వుద్యోగి ఐతే ఏకంగా తను అకాకీని చూసినట్టుకూడా చెప్పేసాడు. తనకోటు లాక్కున్నది అకాకీయేనని భయపడి వేగంగా పారిపోవడంచేత మరీ అంతగా పోల్చుకోలేకపోయాననీ, దూరాన్నించీ అతడు తర్జనితో బెదిరించాడనీకూడా చెప్పాడు. ఈ విషయంమీద అనేక ఫిర్యాదులు రావటం జరిగింది. టిట్యూలర్ కౌన్సిలర్లే కాక కోర్టు కౌన్సిలర్లు కూడా ఇలా పదేపదే కోట్లు పోతుంటే కొత్తకోట్లు కొనుక్కోలేక చలికి గజగజలాడిపోతున్నారు.
అకాకీ శవాన్ని పట్టుకోవటానికి పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బతికున్నా చచ్చినా అతన్ని పట్టుకోవాలని పోలీసు యంత్రాంగమంతా ఆయత్తమైంది
ఒక దుర్బలుడైన మనిషి!
ఓవర్కోటు దొంగిలించబడితే మరోటి కొనుక్కునే స్తోమత లేక చలికి చచ్చిపోయాడు!! శవపేటికలో శాశ్వతనిద్రపోతూ స్మశానంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు!!
అతను దారిదోపిడీలు చేసి కోట్లెత్తుకుపోవటం!!!
అందుకుగాను అతన్ని పట్తుకుని శిక్ష వెయ్యాలనుకోవటం!!!!
ఈ వింతపనిమీద ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు పనిచేస్తున్నారు. మరొకరెవరూ ఇలాంటి పని తలపెట్టకుండా వుండేలా భయంకరమైన శిక్షకూడా వెయ్యాలని నిశ్చయించుకున్నారు. వారి ప్రయత్నం దాదాపు ఫలించిందికూడా. కిరిన్ష్కిన్ వీధిలోని గార్డ్ ఒకడు అకాకీ శవం ఒక విశ్రాంత సంగీతకారుడి కోటు లాక్కుంటుంటే అతడి కాలరు పట్టుకున్నాడు. వెంటనే తనతోటివారిని రమ్మని కేకలుపెడితే విని, మరో యిద్దరు వచ్చారు. వాళ్ళతో దొంగని గట్టిగా పట్టుకొమ్మని, తను వంగి, బూటులో దాచిన ముక్కుపొడుం డబ్బాలోంచీ కొంచెం నశ్యం తీసుకుని, చేతిలో పోసుకుని, ఒక ముక్కుతో పీల్చి, రెండోముక్కుకి పెట్టుకోబోతుంటే శవం గట్టిగా తుమ్మింది. దాంతో నశ్యం అంతా పైకి లేచి ముగ్గురి కళ్ళలో పడింది. పట్టుకున్నవాళ్ళు కళ్ళు తుడుచుకోవటంకోసం పట్టు సడలిస్తే అతను పారిపోయాడు. క్షణంలో ఎంతో గందరగోళం. అసలు శవాన్ని తాము చేతుల్తో పట్టుకున్నారా లేదా అనిపించేంత. దాంతో వాళ్ళు ముగ్గురికీ చచ్చిపోయిన మనుషులంటేనే కాదు, బతికున్నవాళ్ళని చూసికూడా భయం మొదలైంది.
అకాకీ ఇప్పుడు కలిన్కిన్ వంతెనకి అవతలకూడా తిరగడం మొదలుపెట్టాడని మరో పుకారు. పిరికివాళ్ళు మరింత భయపడిపోసాగారు.
అకాకీ కలిసిన వున్నతోద్యోగిని మర్చిపోవటానికి లేదు. అతను స్వతహాగా మంచివాడేగానీ పదవి అతన్ని కఠినుడిని చేసింది. తనంత గట్టిగా కోప్పడ్డప్పుడు అకాకీ స్పృహతప్పిపడిపోవటం కళ్ళముందు కదిలింది. తప్పుచేసినట్టనిపించింది. మితృడు వెళ్ళిపోగానే అకాకీగురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత మర్చిపోవాలనుకున్నా అతను గుర్తొస్తునే వున్నాడు. ఒక వారం గడిచేసరికి ఏదో ఒకటిచేసి అతని సమస్య తీరుద్దామని మనిషిని పంపించాడు అకాకీ చనిపోయాడని తెలిసి స్థాణువైపోయాడు. తనేనా, అతని అకాలమరణానికి కారణం? కొంచెం సౌమ్యంగా మాట్లాడి, కోటు వెతికించే ప్రయత్నం చేస్తానని చెప్పి వుంటే ఇంత జరిగేది కాదేమో! అతనికి చాలా బాధనిపించింది. అంతరాత్మకి జవాబు చెప్పుకోలేకపోయాడు. ఆరోజంతా అతను మామూలు మనిషి కాలేకపోయాడు.
మార్పుకోసం ఆ సాయంత్రం ఒక స్నేహితుడి యింటికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ఇతని సాటివాళ్ళు కలిసారు. కబుర్లు, విందులతో కాలం గడిచింది. షాంపెన్ తాగాక పూర్తిగా తేరుకున్నాడు. కరొలిన ఐవనొవ్న అనే పాత మితృరాలిదగ్గర గడపాలనుకుని ఆమె యింటిదారి పట్టాడు. మెట్లు దిగి రోడ్డుమీదకు వచ్చి స్లెడ్జిలో కూర్చుని, బడివాడికి చెప్పాడు.
అతనేమీ యువకుడూ, స్త్రీలోలుడూ కాదు. మంచి కుటుంబం వుంది. ప్రేమించే భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు వున్నారు. కొడుకుల్లో ఒకడు ఇప్పటికే వుద్యోగంలో వున్నాడు. అందరికీ అతనిపట్ల అపారమైన ప్రేమ వుంది. అతనికి తన కుటుంబంపట్ల సంతృప్తి వుందిగానీ ఎక్కడో కోరిక తనకి వివాహేతర బంధం కావాలని. అతను చేరదీసిన ఆ స్త్రీ అతని భార్యకన్నా అందంలో కాలిగోటికి కూడా పోలదు. వయసులోనూ చిన్నది కాదు. అతనలా ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియాలి. మనిషి మనసు యొక్క సంక్లిష్టతని తెలుసుకోవటం బయటివారెవరూ చెయ్యలేరు. ఎవరికివారే తెలుసుకోవాలి.
వెచ్చటి కోటు తొడుక్కుని మరింత వెచ్చగా స్లెడ్జిలో కూర్చున్నాక ఆలోచనలు అతన్ని వశపరుచుకున్నాయి. ఉదయపు విషాదం పూర్తిగా తొలగిపోయి, ఒకొక్క ఆలోచనా అతనిలో సంతోషాన్ని నింపుతోంది. సాయంత్రం తనెంత సరదాగా గడిపిందీ తలుచుకున్నాడు. కొన్ని సరదాసరదా సంభాషణలు, చతురోక్తులని గుర్తుచేసుకుంటూ లోగొంతుకలో పైకే అనేసాడు. అంటుంటే అతనికి మళ్ళీ నవ్వొచ్చింది. సరదాగా అలా నవ్వుకునేవాడేగానీ, వుండివుండి చలిగాలి విసిరికొడ్తోంది. మంచుజల్లు ముఖమ్మీద, కోటు కాలరుమీదా పడుతోంది. తలంతా నిండిపోతోంది. పదేపదే దులుపుకోవలసివస్తుండటంతో అతని ఆలొచనలకి అంతరాయం కలుగుతోంది.
హఠాత్తుగా ఎవరో తన కోటు కాలరు పట్టుకున్నట్టుగా అనిపించింది. వెంతనే వెనక్కి తిరిగిచూసాడు. పాతబడిన యూనిఫాం… చిన్న ఆకృతి… వున్న ఆ మనిషి అకాకీ అకాకియొవిచ్!!! ఆ అధికారి భయంతో బిగుసుకుపోయాడు. ముఖం పాలిపోయింది. అతనికి స్మశానంలో వుండేలాంటి వాసన కూడా అనిపించింది.
“మొత్తానికీ దొరికావు! నీ కోటు నాకు కావాలి ఇచ్చెయ్. ఆరోజు నేను ఫిర్యాదు చెయ్యడానికి వస్తే నా సమస్యే పట్టించుకోలేదు సరికదా, నోటికొచ్చినట్టు తిట్టి పంపించావు. దానికి అనుభవించు” అన్నాడు అకాకీ కఠినంగా.
అధికారికి భయంతో ప్రాణం పోయినంతపనైంది. అతను ధైర్యస్తుడే. ఆఫీసులోనూ, కింది వుద్యోగుల దగ్గరా. అతని ఆకారం వేషధారణా చూసినవాళ్ళందరికీ అతనెంతో గొప్ప వ్యక్తిత్వంకలవాడనిపిస్తాడు. ఇప్పుడుమాత్రం ఆ దర్పమంతా పైపూతలా కరిగిపోయింది. అతను వేసుకున్న ఓవర్కోటులా కేవలం బాహ్యాలంకారమైంది. ఉన్నట్తుండి భయంకరమైన అనారోగ్యం మీద పడ్డట్టు బలహీనుడైపోయాడు. కోటు ఇప్పి బండిలోంచీ బయటికి విసిరేసి,
“వెనక్కి తిప్పి, వేగంగా ఇంటికి పోనివ్వు” అని అరిచాడు. అతని గొంతు చాలా అసహజంగా వుంది. .. ఒక ప్రమాదం జరిగినట్టు. ఏదో జరిగిందని వూహించి, అతని ఆదేశాలప్రకారం సంధించిన బాణంలా స్లెడ్జిని ఇంటికి మళ్ళించాడు బండివాడు. ఆరే ఆరు నిముషాల్లో ఆ అధికారి తన యింట్లో వున్నాడు. తనదో కాదో గుర్తించలేని స్థితిలో ఒక గదిలో దూరి మంచానికి అడ్డంపడ్డాడు. రాత్రంతా ఆందోళనగా గడిపాడు. మర్నాడు పొద్దున్న టీ టేబుల్దగ్గర కూతురు అడిగింది, “అలా వున్నావేంటి నాన్నా? ముఖమంతా పాలిపోయిందేమిటి?” అని. అతను మాట్లాడలేదు. జరిగిందేమిటో ఒక్కమాట కూడా చెప్పలేదు.
ఆ సంఘటనతో అతన్లో చాలా మార్పొచ్చింది. చాలా సౌమ్యుడిగా మారిపోయాడు.
“నీకెంత ధైర్యం? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమౌతోందా?” అనే ఊతపదాలు కిందివాళ్ళతో అనటం బాగా తగ్గించేసాడు. ఎప్పుడేనా కోప్పడ్డా మొత్తం విషయమంతా తెలుసున్నాక లోపాలు కనిపిస్తేనే అంటున్నాడు.
చాలా విచిత్రంగా చనిపోయిన అకాకీ మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఆ అధికారి కోటు బహుశ: అతనికి సరిపోయి వుండచ్చు. అందుకే అతనికి వేరేవారి కోట్లు అవసరం లేకపోయిందనుకున్నారు కొంతమంది జనం. కానీ ఇంకొందరుమాత్రం ఆ విషయాన్ని నమ్మలేదు. చనిపోయిన వ్యక్తి ఇంకా అక్కడా ఇక్కడా కనిపిస్తున్నాడని చెప్తున్నారు.
కొలొమన్ అనే వాచ్‌మేన్ ఒకడు ఆ ఆకారం ఒక ఇంటి వెనుకనుంచీ రావటం తన కళ్ళతో తను చూసాడు. ఐతే అతడు చాలా బలహీనుడు. అందుచేత అరెస్ట్ చెయ్యడానికి భయపడ్డాడు. రహస్యంగా చీకట్లో నక్కి అతన్ని వెంబడించాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఆ ఆకారం తనని ఎవరో వెంబడిస్తున్నట్టు గమనించాడు. ఆగి, వెనక్కి తిరిగి, “ఏం కావాలి?” అని అడిగాడు. అనటమేకాదు, పిడికిలి ఎత్తి చూపించాడు. అంత పెద్ద పిడికిలి ఎవరికీ వుండదు! వాచ్‌మేన్ భయపడిపోయి, “ఏమీలేదు” అన్నాడు. అన్న వెంటనే వెనక్కి మళ్ళిపోయాడు. ఆ ఆకారం చాలా పొడుగ్గా వుంది, పెద్దపెద్ద మీసాలున్నాయి. అది ఒబుఖోవ్ వంతెనవైపుకి అడుగులు వేస్తున్నట్టుగా అర్థం చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.