కీర్తన by Thulasi Bhanu

  1. ఈశ్వర్ by Tulasi Bhaanu
  2. తగిన శిక్ష by Thulasi Bhanu
  3. మల్లీశ్వరి by Thulasi Bhanu
  4. నీలిమ, నవీన్ by Thulasi Bhanu
  5. శోభ by Thulasi Bhanu
  6. సహన by Thulasi Bhanu
  7. బ్రతుకు దీపం by Thulasi Bhanu
  8. ఆత్మీయ హాసం by Thulasi Bhanu
  9. జ్ఞాపకం by Thulasi Bhanu
  10. కీర్తన by Thulasi Bhanu
  11. మనోరంజని by Thulasi Bhanu

“నా బర్త్‌డే ఫంక్షన్‍లో అందరూ ఉన్నా, నువ్వు లేని లోటు నన్ను చాలా బాధ పెట్టింది. ముందురోజు అర్ధరాత్రికూడా, పన్నెండింటికి నీ ఫోన్ కాల్ వస్తుందని , కనీసం నీ మెసేజ్ అయినా వస్తుందని నేనెంత ఎదురుచూసానో తెలుసా? నా బర్త్‌డే నీకు ముఖ్యమైన విషయం కాదా? అలా ఎలా నిర్లక్ష్యం చేయగలవు?” అని అంటూ కీర్తన, సంజీవ్‍ని అడుగుతోంది.
నెక్లెస్ రోడ్ పార్క్ బల్లమీద కూర్చుని ఉన్నారు ఇద్దరూ. కీర్తన మాటలు విని సంజీవ్ “హే వెయిట్ చాకోబార్ తెస్తాను, తిందాము” అని లేచి వెళ్ళి రెండు చాకోబార్స్ తెచ్చాడు.
మనసుకి చాల కష్టంగా అనిపించింది కీర్తనకి.
ఇంత పట్టనట్టుగా ఇతను ఎలా ఉండగలడు, ఏమిటితను అనుకుని కీర్తన, సంజీవ్ “తీసుకో” అంటూ అందిస్తున్న చాకోబార్‍ని గమనించుకోలేదు.
“అరే, ఇప్పుడు నేను నిన్ను బతిమాలాడాలా? సారీలు చెబుతూ నీ వెంట తిరగాలా? కలిసిఉన్న కాసేపూ సరదాగా ఏదైనా కలిసి తిన్నామా, కాసిన్ని తీపికబుర్లు చెప్పుకున్నామా, అన్నట్లు ఉండాలి కానీ ఈ తిక్క పంచాయితీలు నాతో నడవవు కీర్తనా!” అనేసాడు సంజీవ్.
కీర్తన అతని మాటలు విని నెమ్మదిగా అతని చేతిలోని చాకోబార్ తీసుకుని తింటోంది. ఒకమ్మాయి తట్టలో మల్లెపూల మాలలు తెచ్చి అమ్ముతోంది , రెండు మాలలు కొని కీర్తనకి ఇచ్చాడు సంజీవ్. కీర్తన తీసుకుంది.
కాసేపు కొత్త సినిమాల గురించీ , కాలేజీలో సంగతులూ మాట్లాడుకున్నారు. సంజీవ్ ఒక నిముషం దీక్షగా మల్లెపూలు పెట్టుకున్న కీర్తన మోముని ఇష్టంగా చూసుకుని కీర్తన చేతిని తన చేతితో అపురూపంగా, ఆప్యాయంగా పట్టుకుని కూర్చున్నాడు ఇంకో పదినిముషాల్లో పార్కు నుంచీ వెళ్ళిపోతాము అనగా.
వచ్చేటప్పుడు సంజీవ్ పైన కోపంతో , అతనిమీద కంప్లయింట్లతో వచ్చిన కీర్తనకు వెళ్ళేముందు మనసులో కోపంపోయి సంజీవ్ స్నేహం తాలూకూ ఆనందంతో మనసు కుదుటపడింది. అతనంతే, కొంచెం ప్రత్యేకంగా ప్రవర్తిస్తాడు, ఆమెకి వచ్చిన కోపాన్ని సారీ చెప్పి పోగొట్టడు, అసలు ఆ కోపమే సమసిపోయేట్టు స్నేహమధురిమను అందిస్తాడు. అందుకే అతని సమక్షంలో ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది.


కీర్తన, సంజీవ్‍ల చదువులు పూర్తయ్యాయి.
కీర్తనకి పెళ్ళి చేయాలి అనుకున్నారు స్రవంతి, నారాయణ. కీర్తన , తనకు సంజీవ్‍మీద ఉన్న ప్రేమని తల్లిదండ్రులతో చెప్పింది. వెంటనే నారాయణ చెప్పేసాడు, తాను తేబోతున్న సంబంధం చాలా ఉన్నవాళ్ళని, ఆ సంబంధమే తనకు చాలా ఇష్టం అయినది అని.
కీర్తన నారాయణకు చెప్పింది తాను సంజీవ్‍నే చేసుకుంటానని. నారాయణకు కోపం వచ్చింది. స్రవంతి సర్దిచెప్పబోయినా, ఇద్దరూ వినలేదు.
కీర్తన సంజీవ్‍కి చెప్పింది, “నువ్వుకూడా మీ ఇంట్లో చెబుతావా మన సంగతి?” అని.
సంజీవ్, “కీర్తనా! నేను ఎమ్ ఎస్ చదవటానికి ఫారెన్ వెళుతున్నాను కదా, ఇప్పుడు పెళ్ళి ఊసే వద్దు. ఈ రెండేళ్ళూ నేను చదువు తప్ప వేరే జంఝాటం ఏదీ పట్టించుకోలేను” అని చెప్పేసాడు.
“సంజీవ్ , నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పెళ్ళి నాకు మాత్రమే సంబంధించిన విషయంలాగా మాట్లాడుతావేంటి, నీకు అవసరం లేదా?” అడిగింది.
“కీర్తనా! చూడూ, నీకు నా మీద ప్రేమ ఉంది , నన్ను మాత్రమే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే , దానికి సంబంధించిన ఏ ప్రయత్నం , పోరాటం అయినా నువ్వే ధైర్యంగా చేయాలి” అన్నాడు సంజీవ్ స్పష్టంగా.
“సంజీవ్! ఇప్పుడే నాకో సందేహం కలుగుతోంది, ఒకవేళ ఈ రెండేళ్ళల్లో నీకు ఏ అమ్మాయి అయినా నచ్చేస్తే నన్ను వదిలి ఆ అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసేసుకుంటావేమో కదా?” అని అడిగింది కీర్తన. అది విన్నాక అతని మొహంలో ఒక నిముషం కోపం, బాధ కనిపించాయి. తరువాత యధాప్రకారంలాగా చెదరని భావంతో స్థిరంగా చెప్పాడు. “ఇది నీ సందేహం కీర్తనా! సమాధానం నీకే తెలియాలి” అనేసి, “నెక్స్ట్ వీక్ గురువారం నేను ఫారెన్‍కి బయలుదేరే రోజు కదా , ఆ రోజంతా నువ్వు నాతోనే ఉండగలవా? మళ్ళీ నేను ఇండియాకి, మీ అందరిదగ్గరికీ ఎప్పుడు వస్తానో” అన్నాడు దిగులుగా.
కీర్తనకి ముందు ఆశాభంగంగా , కోపంగా, బాధగా అనిపించినా సంజీవ్ దిగులుగా అడిగిన తీరుతో అతని ప్రేమభావాన్ని అర్థం చేసుకుని సంజీవ్ దగ్గరకు వచ్చి మృదువుగా దగ్గరకు తీసుకుని , నుదుటన చిన్నగా, ప్రేమతో ఓ ముద్దు పెట్టి, “ఆరోజు రాగలనో లేదో మరి, కానీ ..కానీ.. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ సంజూ..నువ్వు జాగ్రత్తగా ఉండు…నేను నీకోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. పోరాటమే చేస్తానో, ఓపికే పడతానో కానీ నువ్వు నాదగ్గరకు వచ్చే రోజుకోసం ఎదురుచూస్తు ఉంటానురా బంగారం” అనేసి గుండె బరువెక్కగా, కళ్ళు నీళ్ళతో నిండిపోగా , చున్నీతో కళ్ళు బాగా తుడుచుకుంటూ, సంజీవ్‍ని కళ్ళారా చూసుకుని “బై! టేక్ కేర్” అని మనసారా చెప్పేసి ఇంటికి బయలుదేరింది. సంజీవ్‍కి కూడా మనసుకి దిగులయ్యింది.


నారాయణ స్రవంతికి , కీర్తనకి చెప్పాడు, “ఈ ఆదివారం వాళ్ళు చూసుకోవటానికి వస్తున్నారు” అని.
కీర్తన స్పష్టంగా చెప్పేసింది, “నాన్నా, అమ్మా! సంజీవ్ అంటే నాకు చాలా ఇష్టం , ఇప్పటికి నా జీవితభాగస్వామిగా అతనే నాకు సరైనవాడు అనుకుంటున్నాను , ఇలాంటి సమయంలో నేను ఎలాంటి పెళ్ళి చూపులకూ సిద్ధంగా లేను. నాన్నా! ప్లీజ్, మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి…నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి” అని.
“కీర్తనా! ఇంత పెద్ద నిర్ణయాలు స్వయంగా తీసుకునేంత పెద్దదానివి అయిపోయావా నువ్వు? నీ పెళ్ళి విషయంలో మా ఇష్టంతో నీకు పని లేదా?” అడిగాడు కోపంగా నారాయణ.
అలాంటి ప్రశ్నే బాధగా స్రవంతికూడా అడిగింది.
అప్పుడు కీర్తన తల్లిదండ్రులకు చెప్పింది, “మీ ఇష్టం లేకుండా నేను ఎవరినీ పెళ్ళి చేసుకోను. సంజీవ్ మీ ఇద్దరికీ ఇష్టం అయితేనే అతన్ని నేను పెళ్ళి చేసుకునేది” అని.
“సంజీవ్ మాకు ఇష్టం లేడు” అనేసాడు నారాయణ.
“సరే నాన్నా! మీకు ఇష్టం అయినపుడే సంజీవ్‍తో నా పెళ్ళి జరుగుతుంది, నేను మిమ్మల్ని తొందరపెట్టట్లేదుకదా?” అంది స్థిరంగా కీర్తన.
“అతను నాకు ఎప్పటికీ నచ్చడు” అనేసాడు నారాయణ. కీర్తన కామ్‍గా తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆదివారం రానే వచ్చింది. కీర్తన ఇష్టంతో ప్రమేయం లేకుండా పెళ్ళిచూపులకు పెళ్ళివారు వచ్చారు. స్రవంతి కీర్తన రూమ్‍లోకి వచ్చి చెబుతోంది. “కీర్తనా! చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా! కనీసం ఫామిలీ ఫ్రెండ్స్‌ని కలిసినట్టు అయినా వచ్చి వారిని పలకరించమ్మా! లేదంటే నాన్నకు పరువు పోయినట్టు అవుతుంది కదా?” అని కీర్తనని ఒప్పించబోయింది.
“లేదమ్మా! నేను నాన్నకు ముందే స్పష్టంగా చెప్పాను కదా? సారీ నేను రాలేను. నా మనసుకి చాలా కష్టం అమ్మా! ఇష్టం లేకుండా వారి ముందుకు వెళ్ళడం” అని స్పష్టంగా చెప్పేసింది కీర్తన. స్రవంతికి అయోమయంగానూ, భయంగానూ ఉంది. తండ్రీకూతుళ్ళ మధ్య ఈ పంతం, పోరాటం ఎంతదూరం వరకూ వెళతాయో అని.
మనసులో వణుకు పుడుతున్నా , మొహాన ఓ ప్లాస్టిక్ నవ్వు తగిలించుకుని స్రవంతి అతిధిమర్యాదలు చేస్తోంది. భర్తవైపు మాత్రం చూడటంలేదు, ఎందుకంటే అతనివైపు చూస్తే చాలు, కీర్తనను తీసుకురమ్మన్నట్లుగా సూచనలు చేస్తున్నాడు కళ్ళతోనూ, సైగలుగానూ.
ఓ అరగంట గడిచాక ఆదిత్య , అతని తల్లి నీలిమ అడిగారు, “కీర్తన ఏది?” అని.
స్రవంతి చెప్పింది, “తనకు వంట్లో అస్సలు బాగోలేదు , లేవలేకపోతోంది , ఏమీ అనుకోకండి , తను కొంచెం సున్నితం మనిషి , చిన్న అనారోగ్యం కూడా తట్టుకోలేదు” అని.
“అరే అలాగా? పర్లేదులెండి, తనని రెస్ట్ తీసుకోనియ్యండి” అన్నాడు ఆదిత్య.
పెద్దవారు అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటుంటే, ఏమీ తోచక ఆదిత్య ఇంటి కాంపౌండ్‍లోనూ, గార్డెన్‍లోనూ తిరుగుతున్నాడు. గార్డెన్‍లో బల్లమీద కూర్చుని పువ్వులను, మొక్కలను చూస్తూ ఉన్న ఆదిత్య దూరంగా ఉన్న రూమ్‍లో కీర్తన కిటికీకి ఆనుకుని నుంచుని ఉండటం చూసాడు. అతను ఆమెను ఫొటోస్‍లో చూసి ఉన్నాడు. గుర్తించాడు. తన ఫోన్ కెమెరాలో జూమ్‍చేసి మళ్ళీ చూసాడు.
కీర్తన బాగా ఆలోచిస్తున్నట్టు, కోపంగానూ, అసౌకర్యంగానూ ఉన్నట్లు గ్రహించాడు. ఆదిత్య సమవయస్కుడు కాబట్టి కీర్తనకి తమ సంబంధం ఇష్టం లేదని, తాను పెళ్ళిచూపులను నిరాకరించిందనీ బాగా అర్థం అయ్యింది. ఇహ కీర్తన గురించి ఆలోచించకూడదని గట్టిగా నిర్ణయించేసుకున్నాడు ఆదిత్య.
ఆదిత్యావాళ్ళు వెళ్ళిన కాసేపటికి నారాయణ, కీర్తన గదిలోకి వెళ్ళాడు. కీర్తన తన ఆఫీసుపని చేసుకుంటోంది. స్రవంతికూడా నారాయణ వెనకాలే వెళ్ళింది కీర్తన గదిలోకి.
“ఇదేకదా, నువ్వు నీ తండ్రికి ఇచ్చే గౌరవమూ, విలువా…? ఇప్పుడు సంతోషంగాఉందా , పెద్దవాళ్ళ మాటకిచ్చే విలువ ఇదేనా? నీ స్వార్ధబుద్ధి నాకు బాగానే తెలిసొచ్చింది. పాపిష్టిదానా! “అని కోపంతో ఊగిపోతూ కూతురిని తిడుతున్నాడు.
భర్తకి బీపీ పెరిగిపోతోంది, అతను ఏమయిపోతాడో అని, కీర్తన తండ్రి మాటలకు బాధపడి తనేమయిపోతుందో అని స్రవంతికి రెండువిధాలా భయం వేస్తోంది.
కీర్తన లేచి నుంచుని తండ్రిని చూస్తూ మౌనంగా నుంచుని ఉంది. నారాయణకి ఇంకా చాలా తిట్టాలనిపిస్తోంది కానీ కోపంతో శ్వాస భారమై మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడకుండా , సమాధానం చెప్పకుండా కీర్తన అలా నుంచునిఉండటం నారాయణకు మరీ పుండుమీద కారంలాగా మండిస్తోంది.
“ఛీ!!!” అనేసి వెనక్కితిరిగి వెళ్ళబోయాడు.
“నాన్నా! మీకు నేను ముందుగానే చెప్పాను, పెళ్ళిచూపులకు సిద్ధంగా లేనూ అని. అయినా సరే మీరు వాళ్ళని ఎందుకు రమ్మన్నారు?” అడిగింది కీర్తన.
“మరే! ప్రతీది తమరి అనుమతితో చేయాలికదా? సరే మేడమ్, ఇకనుంచీ మీరెలా చెబితే అలా నడుచుకుంటాను” అన్నాడు నారాయణ ఎగతాళిగా.
“నాన్నా, నేనూ ఒక వయసుకు వచ్చాను. నా అభిప్రాయాలకూ, ఇష్టాలకూ విలువ ఇవ్వమని అడుగుతున్నాను. అంతేకానీ మీరంటే నాకు ప్రేమ, గౌరవం లేక కాదు…” అని అంటున్న కీర్తన ముందుకి వచ్చి రెండు చేతులూ శబ్దం వచ్చేలా జోడించి, “అమ్మా! తల్లీ! నీ ప్రేమకి గౌరవానికి ఒక దణ్ణం” అని విసురుగా చెప్పేసి వెళ్ళాడు.
అది చూసిన కీర్తనకి గట్టిగా ఏడుపు వచ్చేసింది. కిందకి జారిపోయి నేలమీద ముడుచుకుని కూర్చుని ఏడ్చేస్తోంది.
“అయ్యో కీర్తనా! ఏడవకమ్మా” అని అంటూ స్రవంతి , కీర్తనని పొదివిపట్టుకుంటూ తానూ ఏడుస్తోంది. నారాయణకు గది బయటకు వెళుతుండగా భార్యా కూతుళ్ళ ఏడుపులు వినిపిస్తుండగా మనసుకి బాధనిపించింది.
“ఈ పాడు ప్రేమలు నాశనం అయిపోనూ! కుటుంబాలను అల్లకల్లోలం చేసి పారేస్తున్నాయి” అని తిట్టుకున్నాడు.


అలా అంత రభస జరిగాక నారాయణ మళ్ళీ కీర్తనకు పెళ్ళి చూపుల ప్రయత్నం చేయలేదు. కీర్తనతో మాట్లాడటంలేదుకూడానూ. ఆమె పార్ట్ టైమ్‍లో ఎమ్‍బీఎ చదువుతూ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తోంది.
సంజీవ్ ఫారెన్‍లో బాగా సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఫోన్‍లో మాట్లాడుకోవటాలు , వీడియో ఛాటింగ్‍లు చేసుకుంటున్నారు కీర్తన, సంజీవ్‍లు.
నారాయణ బర్త్‍డే ఆ రోజు. అర్ధరాత్రి కీర్తన , స్రవంతి, విషెస్ చెప్పారు. క్యాడ్‍బరీ చాక్లెట్ తినిపించారు. నారాయణ కీర్తనని అడిగాడు. చాలారోజుల తరువాత కూతురితో మాట్లాడుతున్నాడు.
“కీర్తనా! నాకు పుట్టినరోజు బహుమతి ఏమిస్తున్నావు?” అని. కీర్తన తండ్రి తనతో మాట్లాడుతాడని ఊహించలేదు. తండ్రి తనతో మాట్లాడటం సంతోషంగా , సంబరంగా అనిపించింది.
ఆ ఆనందంలో, “మీరే చెప్పండి నాన్నా! ఏం కావాలి మీకు? అని అడిగింది నవ్వుతూ.
నారాయణ తన టేబుల్ సొరుగులోంచీ ఒక ఫొటో తీసి కీర్తనకు చూపించి, “రేపు సాయంత్రం వీరి ఫామిలీని రమ్మంటాను. అందరం కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుందాము” అన్నాడు.
తండ్రి ఆలోచన అర్థం అయి కీర్తన, భర్త ఉద్దేశ్యం తెలిసి స్రవంతి కొంచెం కోపంగానే నారాయణవైపు చూసారు. పుట్టినరోజు పూట ఆయన్ని బాధ పెట్టడం ఎందుకూ అనిపించి “సరే నాన్న” అనేసింది కీర్తన.
మర్రోజు ప్రియతమ్, అతని తల్లిదండ్రులు వచ్చారు. నారాయణ చేసే హడావుడికి అంతే లేదు. కీర్తన చాలా సింపుల్‍గా చుడీదార్‍లో ఉంది. ప్రియతమ్, అతని తల్లి కీర్తనతో అవీ ఇవీ అడగాలనీ , చాలా మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసారు. కీర్తన నేర్పుగా వారితో మాట్లాడకుండా తప్పించుకుంది.
నారాయణ కీర్తనను ప్రియతమ్‍కి దగ్గరగా ఉంచేలా చాలా ప్రయత్నించాడు. మర్యాదగానే తండ్రి ప్రయత్నాలు ఫలించనీయలేదు కీర్తన.
ప్రియతమ్‍వాళ్ళు వెళ్ళేముందు చెప్పేసారు కీర్తన తమకు బాగా నచ్చింది అని. కీర్తన వెంటనే తానూ చెప్పేసింది తనకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఆలోచన అస్సలు లేనే లేదు అని.
ప్రియతమ్ ఏవన్నా అవసరాలుంటే సర్దుకోవచ్చు అని కీర్తనకు నచ్చ చెప్పబోయాడు , కీర్తన స్పష్టంగా చెప్పేసింది తాను పెళ్ళికి ససేమిరా సిద్ధంగా లేనని కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పేసింది.
ఆరోజు రాత్రికూడా నారాయణ ఆగ్రహాన్ని పూర్తిస్ధాయిలో రుచి చూడాల్సి వచ్చింది కీర్తనకు, స్రవంతికి.


పెళ్ళి విషయం సంజీవ్ ఏరోజూ కీర్తనతో ప్రస్తావించలేదు, కీర్తనకూడా పెళ్ళిమాటలు అనేవి ఒక్కటికూడా సంజీవ్‍తో చెప్పలేదు, అడగలేదు.
వారిద్దరూ స్నేహంగా మాట్లాడుకునేవారు , ఒకరి జాగ్రత్తలు ఒకరు చెప్పుకునేవారు తప్పితే పెళ్ళి అనే తొందర వారిరువురికీ లేదు.
నారాయణ ఎన్ని ప్రయత్నాలు చేయాలని చూసినా కీర్తన సహనంగానో , సామరస్యంగానో అవి ఫలించనప్పుడు కోపం , అసహనం ప్రదర్శించో తండ్రి ప్రయత్నాలను తిప్పికొట్టేది.
స్రవంతికి కూతురి వివేకం మీద నమ్మకం ఉంది. కూతురికి తన జీవితం గురించి సరైన అవగాహన , స్పష్టత ఉందని గ్రహించి , ఏ రోజూ భర్తకీ ఎదురుచెప్పలేదు, కూతురికీ సలహాలు ఇవ్వలేదు, ఇలా చెయ్యి ఆలా చెయ్యి అని.
ఒకరోజు ఆర్ధికంగా బాగా స్థిరపడిన సంజీవ్, నారాయణ ఇంటికి మొదటిసారి వచ్చాడు.
నారాయణ అసహ్యంతో అతనిని వెళ్ళిపొమ్మన్నాడు.
“నాన్నా! అతనితో నేను జీవితం పంచుకోవాలి అనుకున్నాను, మీరు కనీసం అతనితో మాట్లాడకపోతే అతని గురించి మీకేమి అర్థం అవుతుంది?” అని కీర్తన అడిగింది.
“నువ్వు నేను చెప్పిన పెళ్ళిచూపులను తిరస్కరించావు, నేను ఇతనితో ముఖాముఖీ ఇష్ట పడటంలేదు” అనేసి నిర్లక్ష్యంగా వెళ్ళబోయాడు.
కీర్తన తండ్రికి చెబుతోంది, “నాన్నా! నా జీవితాన్ని అతనితో పంచుకోవాలి అనుకుంటున్నాను, ఇటు నువ్వు, అమ్మ , అటు అతని తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మేము పెళ్ళి చేసుకుంటాము. నేనూ స్థిరపడ్డాను, అతనూ మంచిగా స్థిరపడ్డా డు. ప్లీజ్, నాన్నా! మాతో మాట్లాడండి. మా పెళ్ళికి అనుమతిని ఇయ్యండి” అని కీర్తని తండ్రిని బతిమలాడుతోంది.
“అవును నీ ఇష్టాన్ని నేను గుర్తించాలి , ఒప్పుకోవాలి కానీ, నువ్వు మాత్రం నా మాట వినవు, నేను చెప్పిన వాళ్ళని చేసుకోవు” అన్నాడు నారాయణ సాధింపుగా.
“నాన్నా! జీవితం పంచుకోవాల్సిన నాకుకదా ముందుగా నచ్చాల్సింది?” అడిగింది కీర్తన.
సంజీవ్ తన వివరాలు చెబుతున్నాడు నారాయణకి. సంజీవ్ ఇంటిపేరు , కులమూ వింటూనే నారాయణ మండిపడ్డాడు.
“నేను ఒప్పుకోను కులాంతరవివాహానికి. పైగా ఇతని కులం మన కులం కంటే చాలా తక్కువ” అని గట్టిగా చెప్పేసాడు.
అప్పుడు సంజీవ్ చెప్పాడు. “నేను ముందే ఊహించాను మీ ఈ వ్యతిరేకతని. అందుకే నాకంటూ ఒక స్థాయిని, ఒక అస్తిత్వాన్ని ఏర్పరుచుకున్న తరువాత, ఈరోజు మీ ముందుకి వచ్చాను , మీ అమ్మాయికి ప్రశాంతంగా ఉండగలిగేలా ప్రేమను పంచగలను, సౌకర్యంగా ఉండగలిగేలా జీవితాన్ని అందించగలను, ఒక మనిషికి వీటినిమించి ఏవీ అవసరం లేవు. కులం, జాతి అనేవి నేను పట్టించుకోను. అవి పట్టించుకుని మూర్ఖంగా బతికే మనుష్యులకి నేను దూరంగానూ ఉంటాను. కానీ ఈరోజువరకూ నేను మీ ముందుకొచ్చి ఉండుంటే నేను ఫలానా అని చెప్పేందుకు నాకు ఏవీ లేవు , కానీ ఈరోజు నేనే ఒక కంపెనీ పెట్టబోతున్నాను , నా చదువుతో నా ఆర్ధికస్థితినీ పెంచుకుంటూ వెళతాను, నాతో ఉండే మీ అమ్మాయిని అన్నివిధాలా బాగా చూసుకుంటాను. ఒక మంచి భర్తలాగా… నిజంగా మీరుకూడా ఒక మంచి తండ్రి అయితే, మీరు ప్రేమించే మీ కూతురికి ఇంత మంచి జీవితాన్ని ఎలా కాదనగలరు?” అనేసి కీర్తనకు బై చెప్పి , స్రవంతి కాళ్ళకు, నారాయణ కాళ్ళకు దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయాడు సంజీవ్.
సంజీవ్ ఇదివరకు మొదట్లో, ఎందుకు తమ ఇంటి పార్టీకి రాలేదో, ఎందుకు తన తల్లిదండ్రులతో మాట్లాడలేదో కీర్తనకి బాగా అర్థం అయింది. అంత ఆలోచన, అంత వివేకం ఉన్న సంజీవ్‍ని నాన్న ఒప్పుకుంటే బావుంటుంది అని కీర్తన ఎదురుచూస్తోంది.


దాదాపుగా రెండేళ్ళు కీర్తన , సంజీవ్ తమ ఉద్యోగాలు, తమ కంపెనీ పనులు చూసుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఆరోజు నారాయణకి మొదటిసారి గుండెపోటు వచ్చింది. కీర్తన, స్రవంతి నారాయణ ఏమయిపోతాడో అని తల్లడిల్లిపోయారు. నాలుగురోజులు ఐసీయూలో ఉండివచ్చాక నారాయణ నీరసంగా తన ఈజీ చెయిర్‍లో కూర్చుని ఉన్నాడు.
కీర్తన తండ్రి దగ్గరకు వచ్చి ఆయన చేతిని అపురూపంగా పట్టుకుని కూర్చుంది. తండ్రి దక్కకపోయుంటే అని అనిపిస్తే చాలు ఆమెకి కళ్ళు నీళ్ళతో నిండిపోతున్నాయి. కీర్తన ఏడుపుని గ్రహించుకున్న నారాయణ.
నెమ్మదిగా అడిగాడు. “కీర్తనా! నాన్న దాదాపు చచ్చి బతికాడు కదమ్మా, మరి నాన్నకి నీ పెళ్ళి చూడాలని ఉంది” అని.
“నాన్నా!” అంది కీర్తన ఏమి చెప్పాలో, ఏమి చెయ్యాలో తోచనట్లు.
“నాకు, సంజీవ్‍కి మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేకపోతున్నావా?” అడిగాడు ఆమెవైపు సూటిగా చూస్తూ.
“నాకు మీ ఇద్దరిలో ఎన్నుకునే అవసరం ఏముంది నాన్నా? నాకు మీ ఇద్దరూ కావాలి” అంది స్పష్టాస్పష్టంగా. మళ్ళీ తండ్రి ఆవేదనకు లోనైతే ఏమయిపోతాడో అనే భయంతో.
“నాన్నా! మరి మీరు కూతురి పెళ్ళి చూడాలనుకుంటే, సంజీవ్‍ని కులంతోనో, పరువుదృష్టితోనో చూడకండి. నన్ను మీరు, అమ్మ చూసుకున్నంత ప్రేమగా, పదిలంగా చూసుకుంటాడా లేదా అనే కోణంలో చూడండి. మీకు స్పష్టత రాగలదు” అంది కొంచెం సంశయంగానే. తండ్రి నొచ్చుకోకూడదనే ఉద్దేశ్యంతో.
నారాయణకి ఆశాభంగంగానూ ఉంది, కూతురి ఆశ, ఆవేదనకూడా అర్థం అవుతున్నాయి. పైగా ఈ స్పీడుయుగంలోనూ కూతురు ఇన్నేళ్ళు సహనంగా ప్రేమకోసం వేచి ఉంది. ఆమె స్ధాయికి , సంజీవ్ హోదాకి వారిద్దరూ ఎప్పుడో స్వతంత్రించి, తనకు దూరంగా వెళ్ళో, తనను ఎదిరించో, మోసం చేసో, ఏమైనా చేసుండచ్చు కదా అని అనుకుంటూ, ఒప్పుకోనని ఎదురుతిరుగుతున్న మనసుని జో కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.


అతికష్టంమీద ఒక ఆరునెలలు తనతో తాను యుద్ధం చేసి, తనతో తాను చర్చించుకుని ఇహ తప్పక ఒప్పుకున్నాడు సంజీవ్‍తో కీర్తన పెళ్ళి జరిపించేందుకు నారాయణ.