నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

మొబైల్ రింగ్ అవటంతో ఎవరాని చూస్తే… ఒకప్పటి మా పొరుగింటాయన.
ఇప్పుడే వంట పూర్తి చేసి కాసేపు రిలాక్స్ అవుదామని అనుకుంటే ఈయన ఫోన్‍లో. ఇక అమెరికానుండీ ఆముదాలవలసవరకూ అన్నీ ఆపకుండా మాట్లాడుతాడు.
“చెప్పండి సర్” అన్నాను మనసులోనే తిట్టుకుంటూ… యధాలాపంగా.
“మొన్న మీ ఇంట్లో పనిచేసిన కార్పెంటర్ నెంబర్ ఓసారిద్దురూ!” అని, నా జవాబు కోసం ఎదురు చూడకుండా “మీ అత్తగారు ఎలా ఉన్నారు?” అడిగాడు.
“అలాగేనండీ. ఇస్తాను… పెద్దవయసు అయిపోయింది కదా, ఏదో లాగిస్తున్నారు బండి” అన్నాను.
“బండి అంటే గుర్తు వచ్చింది. మీరు ఇంకా కార్ కొనలేదు ఎందుకూ? కొనేయండి వెంటనే” అన్నాడు భళ్ళున నవ్వుతూ. ఆయన తీరే అంత. పొంతన లేకుండా తోచిందంతా మాట్లాడేస్తూ ఉంటాడు, సమయం, సందర్భం లేకుండా అందరికీ ఫోనులు చేస్తూ. అలాగే ఎప్పుడూ నన్ను కార్ కొనేయమంటాడు. అదేం సరదావో ఆయనకిగానీ…
“నేను కొనను” అని ఎన్నిసార్లు చెప్పినా ఆ జీవుడుకి ఎక్కి చావదులెండి.
“దేనికి బాబూ కారు? నాకా డ్రైవింగ్ రాదు. డ్రైవర్ని పెట్టుకు వాడితో తిప్పలు. పైగా పెట్రోల్‍ధర చుక్కల్లో ఉంది. అది భరించే శక్తిగానీ కార్ కొనే స్తోమతకానీ, కారు అవసరంకానీ నాకు లేవు. మీ ఉచిత సలహాలు మరెవరికైనా ఇచ్చుకోండి” అన్నాను ఆయన ధోరణి తెలిసి, కాస్త లేని నవ్వు తెచ్చి పెట్టుకున్న స్వరంతో… కార్పెంటర్ నంబర్‍కోసం నా మరోఫోన్‍లో వెతుకుతూ…
ఆ మహానుభావుడు “పెట్రోల్ ధరలు గురించి మీ మోడీని అడగండి” అదో పెద్ద జోకులా మళ్ళీ గట్టిగా నవ్వుతూ అన్నాడు.
“మా మోడీ ఏమిటి? మీదీ దేశం కాదా? లేదా వేరే ఏదైనా గ్రహం నుండి ఊడిపడ్డారా?” రివర్స్‌లో నేనూ ఎగతాళిగా అడిగాను.
“భలే జోకు లేస్తారు అండీ మీరు. మరీ మోడీ ‘హర ఘర్ తిరంగా’ అనగానే మీలాటి భక్తులు ఆత్మాహుతిదళాల స్థాయిలో ఆవేశపడిపోయి సోషల్మీడియాలో ప్రొఫైల్ పిక్ జెండా పెట్టేశారుగా? దానితో మీరు మోడీ భక్తబృందసభ్యులని అర్ధం అయిపోయిందిలెండి. మీరు కమ్యూనిస్ట్ అనుకున్నాను ఇన్నాళ్లూ. కానీ మీరు పక్కా కమలదళం , కాషాయ కషాయం అని చెప్పకనే చెప్పేసారు” అన్నాడు వెకిలిగా.
“మనోళ్లందరినీ యేసుకొచ్చేయ్ అనే మీలాటివాళ్ళకి మరోలా అర్ధం అయితే ఆశ్చర్యపోవాలిగానీ ప్రొఫైల్‍పిక్ జెండాపెడితే, కాషాయకషాయం, భజనబృందం అంటే అందులో ఆశ్చర్యపోవటానికి లేదు. కానీయండి”అని అతడు అడిగిన నంబర్ అతనికి నా మరో ఫోన్‍నుండి వాట్సప్ చేసాను. అతనో కులసంఘం సెక్రటరీ.
అతను “నెంబర్ వచ్చిందండీ” చెప్పాడు. “మీలాటి మతపిచ్చి ఉన్నవాళ్ళవల్లే మోడీ, షాలు దున్నేస్తున్నారు దేశాన్ని. మళ్ళీ మాది ముఠామేస్త్రీ కల్చర్ అంటారుగానీ” అని కాస్త కినుకగానే అన్నాడు. నామాట ఎక్కడో తగిలినట్టుంది గురుడికి.
“మిమ్మల్ని నేనెందుకు అనాలి? మీరే నన్ను భజనబృందంలో చేర్చి మతపిచ్చిదానిగా ముద్ర వేసారు. మీరన్నమాటలు ఒకసారి గుర్తుచేసుకోండి. అయినా ఇదెక్కడి గోలండీ బాబూ! మొన్నేదో పోస్ట్‌కు స్పందిస్తే ఏకంగా నా పేరే మార్చేసుకోమని ఓ వీర సంప్రదాయపరిరక్షక శిఖామణి ఉవాచ. మరొకడు భారతవాసి అని చెప్పుకున్నాడులెండి. ఏకంగా fbలో తన అభిప్రాయంతో ఏకీభవించకపోతే చిత్తం వచ్చిన తిట్లు తినాల్సిందే నాలాటి సంప్రదాయవిరోధులని తీర్మానించేసాడు.
కానీ బాబూ తిట్టుకో, నీకు ఓపిక ఉన్నంతవరకూ. బయట తిడితే నాకు వినబడవు. Fbలో తిడితే రిపోర్ట్ చేస్తానన్నాను.
ఏమి ఆడాళ్ళురా బాబూ! అంటూ ముదరకించేడు.
నాయనా! నీలాటి భారతవాసిలు అసలు భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే పెద్దభారం, తలనొప్పి- అని చెప్పబోయి ఎందుకులే అతడికి నేను ఎంత గింజుకుని చచ్చినా అర్ధం అవదని, ఎందుకొచ్చిన టైం వేస్ట్ అనుకుంటూ…
ఈశ్వరా! ఇలాటి భారతవాసిలకు కాస్త ఇంగిత జ్ఞానం ప్రసాదించుదూ…
అని వెంటనే ఓ సారి మనసులో దేముడుని వేడుకున్నాను అప్పుడే ఎందుకైనా మంచిదని.
వాయిదావేస్తే మళ్ళీ మరిచిపోతానేమో అని భయంలెండి నాకు. ఈమధ్య మతిమరుపు జబ్బొకటి తినేస్తోందేమో. చాలా విషయాలు మరిచిపోతున్నాను కూడా” అన్నాను.
ఆయన ఏదో జవాబిచ్చేలోపు మళ్ళీ నేనే అందుకున్నాను.
“అయినా ఈరోజుల్లో మనుషులు మరీనండీ. తెల్లారి లేస్తే పబ్లిక్‍లో తిరుగుతారు. సోషల్ మీడియాలోనే అఘోరిస్తారు. అయినా ఎవరితో ఎలా మాట్లాడాలనే కనీస స్పృహలేని తీరు. అవగాహన, సహనం, సంస్కారాలులేని వ్యాఖ్యలు వీళ్ళవి. వీళ్ళా దేశాన్ని, భారతీయతని పరిరక్షించేదిని నాబోటివారికి ఒకింత బాధ కలుగుతున్నమాట మాత్రం వాస్తవమండీ. దేశప్రధాని ఒక పిలుపు ఇచ్చారు. దానికి స్పందిస్తే రకరకాలుగా వ్యాఖ్యానాలుచేయటాన్ని ఏరకం సంస్కారమనాలో నాకు అర్ధం కావటం లేదు” అన్నాను నా అసహనం బయటికి కనబడనీయకుండా..
“అదేమిటి మేడమ్! మీ భావాలు చూసి మీరు కమ్యూనిస్టేమో అనుకున్నాను. ఈ జెండా పెట్టాక మోడీ మీది అభిమానమనుకుని అన్నాను. తప్పేముంది?” అన్న అతని మాటలకి నాకు పూర్తిగా తారస్థాయికి చేరింది చిరాకు. అయినా అతికష్టంమీద నియంత్రించుకున్నాను.
“చూడండి మీరన్న కమ్యూనిజంకానీ మరో ఇజంకానీ స్పెల్లింగ్‍లు కూడా నాకు తెలియవు. అంత తొందరగా వ్యక్తులపట్ల అభిప్రాయలు ఏర్పరిచేసుకుని చిత్తం వచ్చిన వ్యాఖ్యానాలు చేయకండి. ఈ జెండా అన్నది ఇవాళ నిన్నటిది కాదు. ఎప్పుడో వచ్చింది. మోడీకి ముందూ ఉంది, తరవాతా ఉంటుందికనుక దాని పుట్టుపూర్వోత్తరాలపట్ల అవగాహన పెంచుకోండి తీరికగా. గూగుల్‍నిండా బోలెడు సమాచారం ఉంది. ఒక్క క్లిక్‍తో మీ కళ్ళముందుకొస్తుంది. ఇప్పటికా విషయం వదిలేసి మరోమాట చెప్పండి” అన్నాను.
ఆయన లోలోపల ఏమనుకున్నాడో తెలియదుగానీ….
“బాగా చెప్పారు. మాకూ తెలుసు గూగుల్లో సమాచారం ఉందనీ. కానీ ఆ సోది అంతా మీలా రిటైరయి ఇంట్లో పనీపాటా లేకుండా కూచున్నవాళ్ళు చూస్తారుగానీ, అలాటివి చూడటానికి మాకెక్కడ కుదురుతుంది? మాకు బోలెడు పనులు ఉంటాయి. ఖాళీ అన్నదే ఉండదు. ఉంటానండీ” అని ఫోన్ పెట్టేసాడు.
“నీదే ఆలస్యం వెళ్ళు బాబూ! నీకే కాదు నాకూ లేదు టైం. అయినా నువు టైం లేదు అన్నావన్న సంగతి మీ ఇంటావిడతో చెపితే నీ రోగం కుదురుతుంది. ఎప్పుడూ ఎవరో ఒకరితో పోచికోలు కబుర్లు వేసుకుంటావు, ఏ పనీ చెయ్యవని తిట్టిన తిట్టు తిట్టకుండా పుస్తి ముడి పడినరోజునుండీ నేటివరకూ తిడుతూనే ఉంటుందన్నది అందరికీ తెలిసినదే. అయినా పైకి బిల్డప్‍లకేమీ కొదవలేదు.
వాలుకుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. అతగాడి అసందర్భపు వాగుడు నన్ను నా గతంలోకి తీసుకుపోయింది.


అప్పుడు నాకు సుమారు పదకొండో ఏడు నడుస్తోంది. ఆరవ తరగతి చదువుతున్నాను. ఇప్పటి పిల్లలంత తెలివితేటలు, ముదరపోకడలు అప్పట్లో మాలో ఉండేవి కాదు. చాలా అమాయకత్వం ఉండేది
మాకు స్వతంత్రదినోత్సవం అని అనేక పోటీలు పెట్టారు. అవేమిటో తెలియకపోయినా అన్నిటికీ పేర్లు ఇచ్చేసాను. అందులో భాగంగా హిందీ వక్తృత్వానికికూడా. ఆ పోటీలు, స్కూల్ తీరుతెన్నులూ తెలియకపోవటానికి కారణం నేను ఆరవతరగతివరకూ స్కూల్లో పేరున్నా ఎప్పుడూ స్కూల్‍కి వెళ్ళేదాన్నికాదు. వెళ్ళనంటే బలవంతంగా పంపే ప్రయత్నం మా ఇంట్లో చేసేవారుకాదు. అందువల్ల సరాసరి ఆరోక్లాస్‍లో పరీక్ష పెట్టి నన్ను ఆ తరగతిలో చేర్చుకున్నారు.
ఆ సంవత్సరం హిందీ వక్తృత్వపోటీకి ఇచ్చిన అంశంకూడా హమారా ఝండా. మా టీచరు హిందీవాచకంలో హమారా ఝండా పాఠం కంఠస్తా పట్టేసి అక్కడ అప్పచెప్పెయ్యమన్నారు. నేనా పాఠం మా పెద్దక్క సహాయంతో కంఠస్తా పెట్టేసి గుక్కతిప్పకుండా అప్పచెప్పేసాను. మొదటి బహుమతి వచ్చేసింది. పట్టరాని సంతోషంతో ఇంటికివెళ్ళాక మా అమ్మగారికి అందరికన్నా నేనెంత అద్భుతంగా అప్పచెప్పానో చిలవలూ, పలవలూ చేర్చి వల్లిస్తూ, మధ్యలోఊపిరి తీసుకుందికి ఒక్క క్షణం విరామం ఇచ్చాను..
“నువు అప్పచెప్పినదానికి అర్ధమేమిటో ఎవరినైనా ఆడిగావా!” వెనకనుండి నాన్నగారి గొంతు.
నాన్నగారు అక్కడే ఉన్నారా! అయ్యో, నేను చూసుకోలేదు. మంచయినా, చెడయినా నాన్నగారి సమక్షంలో మాట్లాడటం మా ఇంట్లో పిల్లలకి అలవాటు ఉండేది కాదు. అన్నీ అమ్మతోనే చెప్పేవాళ్ళం. అలా అని ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఒక దెబ్బ వేయటంగానీ, పరుషంగా మాట్లాడటంగానీ చేయలేదు. ఐనా మాకు అలా అలవాటు అయిపోయింది.
నేను కాస్త నిదానంగా “క్లాస్‍లో ఆ పాఠం చెప్పారు”అన్నాను.
“చెప్పారు సరే. జెండా గురించి నీకేమి అర్ధం అయిందో చెప్పగలవా?” నాన్నగారు అడిగినదానికి నాకేదో జెండాగురించి అంతా తెలిసిపోయిన ఫీలింగ్‍తో టకాటకా “కాషాయ, ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, దానిమీద నీలంరంగులో అశోకుని ధర్మచక్రం” అన్నాను.
“జెండా ఎలా ఉంటుందో చెప్పావుకానీ, జెండాలో అవన్నీ ఎందుకు ఉంటాయో, ఏమి సూచిస్తాయో చెప్పగలవా?” నాన్నగారి ప్రశ్న.
మరి సౌండ్ లేదు. హిందీలో పాఠం అప్పచెప్పేసినట్లు తెలుగులో అవన్నీ అప్పటికప్పుడు చెప్పటం రాలేదు నాకు.
“అవన్నీ ఎందుకున్నాయో అత్తని అడిగి తెలుసుకుని రేపు చెప్పు” అని వెళిపోయారు.
అత్త అంటే నాకు మేనత్త. మా నాన్నగారి ఆఖరిచెల్లెలు. ఆయన గీసిన గీత తాను దాటదు, మమ్మల్ని దాటనివ్వదు. తొంభైరెండేళ్ళు బతికి రెండేళ్లక్రితం కాలం చేసింది. అన్నపిల్లలమైనా మేమూ అత్త మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. చిన్నప్పటినుండి అలా పెంచబడ్డాం మరి.
అత్తకి విషయం చెప్పాకా తాను నాకు జెండాగురించిన వివరాలు, అప్పుడు నా వయసుకు, అవగాహనకు తగినట్లు నాకు అర్ధమయే తీరులో వివరించింది.
అత్త నాకు చెప్పింది మర్నాడు నేను నాన్నగారికి నాకు అర్ధమైనమేరకు నా మాటల్లో చెప్పాను.
“బావుంది! ఈసారి ఇంకా బాగా చెప్పేందుకు ప్రయత్నించు. ఇకపై ఏదైనా చెప్పేముందు దానిగురించి తెలుసుకుని చెప్పు” అన్నారు.
“అలాగే!” అని బుర్ర ఊపి వెళ్ళి, “బావుందన్నారత్తా!” అని ఉత్సాహంగా అత్తతో చెబితే…
“తరవాత ఇంకా ఏమి చెప్పారో గుర్తుందా?” అడిగింది.
నాతో నాన్నగారు అన్నమాటలను తానూ విన్న అత్త ఆయన వాక్యాలను మళ్ళీ యధాతధంగా నాకు చెప్పి, నాచేత చెప్పించి మొత్తానికి జెండాగురించి నేను నా అవగాహనను మెరుగుపరుచుకోవాలనేది నా బుర్రకెక్కించి పోయి అడుకోమంది.
అంతే! నేను చింతపిక్కల డబ్బా పట్టుకు ఆడుకుందికి పరుగో పరుగు… నా ఫ్రెండ్ శంషాద్‌బేగం ఇంటికి.


కొంతసేపటిక్రితమే నాకు మతపిచ్చి, మోడీ భజనబృందసభ్యురాలు అనేవి చూసాక… అంతకు ముందురోజే నాపై పడ్డ ముద్రలు సెక్యులర్, సంప్రదాయవిరోధిని అన్నవి గుర్తుకొచ్చాయి. పదేళ్ళ పిల్లనికూడా మాట్లాడేముందు ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలని చెప్పిన ఆరోజులకీ, ఆ పెద్దలకీ ఇప్పటికీ, ఈ పెద్దలకీ ఎంత తేడా!
అన్నిముద్రలూ వేసేసి మళ్ళీ ఒక్కరోజులో మతతత్వవాదినీ, ఛాందసవాదినీ, మోడీ భక్తురాల్ని చేసేసింది సోషల్‍మీడియా ! అని నవ్వుకుంటూ …
“అవునులే, మనం ఏ రంగు కళ్ళద్దాలలోంచి చూస్తే ప్రపంచం ఆ రంగులో కనబడుతుందికదా మరి! ఇంతకూ అసలు నేను ఎవర్ని అన్నది బయటినుండి నన్ను చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎదో అదంతా వాళ్ళ నోటి, చేతి దురద తప్ప” అనుకున్నాను.
“నాలో ఉన్న మనసూ నాకుగాక ఇంకెవరికి తెలుసు !” అని గట్టిగా పైకే పాడుకుంటూ కుర్చీలోంచి లేచాను కాలింగ్‍బెల్ మోగితే తలుపు తీయటానికి.