ఎన్ని ఇళ్ళలో పనిచేసినా సంయుక్తకి గాయత్రి అంటేనే చాలా ఇష్టం. ఆడపిల్లల తల్లి అని సంయుక్తని చాలా బాగా చూసుకుంటుంది గాయత్రి.
ఈరోజుల్లో చాలా ఇళ్ళలోలాగే గాయత్రి ఒక్కతీ ఉంటుంది. కూతురు రాగిణి. ఆమె చిన్నదిగా వున్నపుడే భర్త చనిపోడంతో భర్త ఆఫీసులో వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది.
ఇప్పుడు రాగిణికి పెళ్ళయి అమెరికా వెళిపోయింది.
సంయుక్తకి ముగ్గురూ ఆడపిల్లలే. భర్త ఇంక పిల్లలు చాలు అన్నా, సంయుక్తే ఒప్పుకోలేదు. కొడుకంటే ఆశ.
“పిచ్చా ఏమిటి సంయూ, ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా, మళ్ళా ఆడపిల్ల పుడితే ఏం చేస్తావ్?” గాయత్రి చాలాసార్లు మందలించింది.
“మాది రాజపుత్ర వంశం అమ్మా, వారసుడు మగపిల్లడే. ఉండాలమ్మా” అని గాయత్రి మాట కొట్టిపారేసింది.
పిల్లలకి భర్తకి ఏం పెడుతుందో సంయుక్త, ఏవీ తినదు, తాగదు. గాయత్రి బలవంతంగా పాలు పెద్ద గ్లాసుడు తాగిందికి ఇస్తుంది.
“అవి ఇక్కడ తాగితేనే మిగిలిన అన్నం టిఫినూ ఇంటికి ఇస్తాను” అన్న షరతు పెట్టి మరీ ఇస్తుంది. అలా సంయుక్తకి పాలు తాగడం బాగా అలవాటు అయిపోయింది.
తన చెల్లెళ్ళ పిల్లల బట్టలు తెచ్చివ్వడంతోపాటు, రాగిణి పాత చుడీదార్లు కూడా ఇస్తుందని, వాటన్నిటికన్నా గాయత్రి చూపించే ప్రేమకీ, ఇచ్చే గౌరవానికీ సంయుక్త మిగిలిన అందరికన్నా గాయత్రినే ఇష్టంగా చూడ్డం మొదలెట్టింది.
సంయుక్తకి నాలుగోసారికి కొడుకు పుట్టేడు. సరదా తీరిందిగానీ పోషణ చాలా కష్టం అయింది.
ఆమె భర్త హోమ్‌గార్డ్‌గా చేస్తూ ఒక పెద్ద ఆఫీసర్‌కి ఎన్నో సేవలు చేసి అతని నమ్మకం సంపాదించేడు. కొడుక్కి రెండేళ్ళు వచ్చేసరికి మెల్లిగా సంయుక్త ని కూడా హొమ్గార్డ్ ఉద్యోగంలో పెట్టేడు. అప్పటికి పెద్దకూతురు వాసవి తొమ్మిది చదువుతోంది. రన్నింగ్ రేస్‌లో ఫస్టు వస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగయినా పోలీసు ఉద్యోగంలో పెట్టాలని సంయుక్తకి ఆశ.
ఠాణాలో ఉద్యోగం, ఇంటిపని చేసుకోలేక పనిచేసే ఇళ్ళు మానేసింది. గాయత్రి ఇల్లు మాత్రం మానలేదు. గాయత్రే దెబ్బలాడింది
“చెయ్యలేక చిక్కిపోతున్నావ్ సంయూ, మా ఇల్లు మానీ, నీకు నేను ఇచ్చేది ఏదీ మానను” అన్నాది.
“నిన్ను చూడక ఉండలేనమ్మా” అంటూ కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది సంయుక్త.
ఇంట్లో ఏరోజూ చేసుకోలేక గోలే. కొడుకు అల్లరివెధవట. తోమిన గిన్నెలు మళ్ళా అంట్లలో పడిస్తాడట. నీళ్ళు ఒంపిస్తాడట. కోపం ఆగక కొట్టీస్తున్నాదిట.
“సంయూ, ఉద్యోగం ముఖ్యం నీకు. పోనీ, మీ అత్తగారో ఎవరో కాస్త నీకు సాయం చెయ్యరా?” అంది గాయత్రి.
“ఆమె మంచం దిగలేదమ్మా, పల్లె వదిలి రాదు. నీకు తెల్వదు. ఆడపిల్లలే పుట్టేరని నన్ను కొట్టీది కూడా” అంది సంయుక్త.
ఆరోజు ఆదివారం. సంయుక్త చక్కగా ముస్తాబయి వచ్చి కూనిరాగాలు తీస్తూ, తాపీగా గిన్నెలు తోమి గుడ్డ పెట్టి తుడవడం మొదలెట్టింది.
గాయత్రి ఆశ్చర్యంగా “ఎంత ఆదివారం అయినా, ఇంత తాపీగా ఎలా చేస్తున్నావ్ సంయూ, నీ ఇంటి పనులో?” అంది.
సంయుక్త గర్వంగా “మా ఇంటిపనికి అంటే బేసన్లు తోమి గదులు చిమ్మేటందుకు పనమ్మాయిని పెట్టుకున్నానమ్మా. మా ఆయన కర్రీలు తెచ్చేస్తడు. పర్లేదు. నా పాణం హాయిగుంది” అంది.
గాయత్రి ఉలిక్కిపడింది. “అయ్యో ఇక్కడ చేస్తూ ఈ కర్మేంటి, మీ ఆయనన్నా అడగడా?” అంది ఆశ్చర్యంగా.
“నీకు తెల్వదమ్మా. నీ ఇంటపని తక్కువ. ఎట్టనో చేసీగలను. మా ఇంట చేయలేనమ్మా. ఇదే బాగుంది” అంది
“హాసి నీ తెలివి బంగారం కానూ..” అంటూ ముక్కుమీద వేలేసుకుంది గాయత్రి.
నేను మంగు కృష్ణకుమారి. ఇండియన్ నేవీలో 37 సంవత్సరాలు సర్వీస్ చేసి, ఆఫీస్ సూపరింటెండెంట్ గా రిటైర్ అయేను. చిన్నప్పుటినించీ కథల పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటు. చదువుకొనే రోజుల్లో ఓ కథ ఆంధ్రపత్రిక వార పత్రికలో వచ్చింది. ఆ తరవాత మళ్ళా రిటైర్ అయిన తరువాత ఫేస్బుక్ లోకి వచ్చి మళ్ళా కథలు రాయడం మొదలెట్టేను. మాకు ఒక అమ్మాయి. అమెరికాలో ఇద్దరు పిల్లలతో ఉంది.