రాగిణి, గలగలలాడే మాటల మూట. ఒక్కసారి విన్న పాటని అంతకంటే అందంగా పాడేసేది.
“అమ్మో! నా బిడ్డకి దిష్టి తగులుతుందేమో!” అని రోజుకి ఒక్కసారైనా ఉప్పు తీసి తిప్పేది వాళ్ళ అమ్మ సుమతి.
రాగిణికి పెళ్ళయ్యింది. కట్నం డబ్బులు తప్ప, అమ్మాయి మనసు అర్థం చేసుకోని యంత్రాలు అత్తింటివారు. శరీరం తప్ప, మనసుని పట్టించుకోని కఠినాత్ముడు భర్త. షర్ట్ సరిగ్గా ఇస్త్రీ చేయలేదన్న చిన్నకారణానికే చెంప పగలగొట్టాడు భర్త, పెళ్ళైన నెలరోజుల్లోపే. మాట్లాడేందుకు మనిషే కరువయ్యింది, రాగిణికి అత్తారింట్లో.
పిల్లాడిది పెద్ద ఉద్యోగం అని చూసారేకానీ, అల్లుడికి పెద్దమనసు ఉందా లేదా అని చూసుకోలేదు, రాగిణి తల్లీతండ్రి. అస్సలు మనసే లేని మగాడు విష్ణు.
అలా అలా చిన్నచిన్నగా, డిప్రెషన్‌తో మాటలు మూగపొయ్యాయి రాగిణికి. చిన్నతనంలో గారాలపట్టిలా పెరిగి, పెళ్ళయ్యాక కష్టాలకొలిమిలో అడుగిడి మూగబోయింది.
కడుపుతో ఉంది రాగిణి. తాను ప్రాణం పోయబోయే బిడ్డ, అడవిలాంటి ఇంట్లో పుట్టకూడదని, పుట్టింటికి వెళ్ళిపోయింది. జీవం లేనట్లుగా మారిన… మూగబోయిన గోదారి గలగలల జీవనదిలాంటి రాగిణిని చూసి, తల్లీతండ్రి కుమిలిపోయారు. శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కూతురికి ఎలా చేయూతనివ్వాలి అని ఆలోచించారు..
” ఏమ్మా, నీ దిగులు తీరే మార్గం ఏమనుకుంటున్నావు?” అని రాగిణిని అడిగారు.
“ఈ గాయాల బాధతో, నేను బతకలేను, బిడ్డ పుట్టాక నేను బతకను ” అని సైగ చేసి చెప్పింది. తల్లి సుమతి భోరున ఏడ్చేసింది, కూతురి బాధను చూసి తట్టుకోలేక.
తండ్రి చెప్పాడు “తప్పమ్మా, గాయాలున్నాయని జీవితాన్ని ముగించేయాలనుకోవటం చాలా తప్పు. గాయాలెన్నున్నా వేణువు మధురమైన పాటలను అందిస్తుంది. అలానే నీ గాయాలకు ఊరటగా ఏదైనా మంచివ్యాపకాన్ని ఎంచుకుని, నువ్వుకూడా అందమైన భవిష్యత్తుని సృష్టించుకోవటం మొదలుపెట్టి, ఒక మధురమైన పాటలాగా జీవితాన్ని మలచుకో తల్లీ ” అని తండ్రి, రాగిణికి హితవు చెప్పాడు.
“మాటలకుకూడా దూరమయ్యాను, నా బాధను బయటకుకూడా చెప్పుకోలేను ” అంది రాగిణి సైగలతో, వెక్కివెక్కి ఏడుస్తూ.
తండ్రి, ఒక టీచర్ని పెట్టాడు, రాగిణికి వేణువుని నేర్పేందుకు. పాటల జ్ఞానం చిన్నప్పటినుంచీ ఉన్న రాగిణి, త్వరగానే నేర్చుకుంది ఫ్లూట్ వాయించడం. రోజుకి ఆరుగంటలు సాధన చేస్తూ చేస్తూ, బాగా నేర్చుకుంది.
బాధ వేసి, మనసు కుంగినట్లుగా అనిపించగానే ఫ్లూట్ తీసి పాడుకునేది. ఆమె ఫ్లూట్ గానానికి పక్క ఇళ్ళవాళ్ళు వచ్చి విని , చాలా బావుందని మెచ్చుకునేవారు. అలా అలా గుడి ప్రోగ్రామ్స్‌లోనూ, వినాయక పందిళ్ళల్లోనూ ఫ్లూట్ వాయించేది.
ఒకరోజు డిస్ట్రిక్ట్ లెవల్లో, వాయిద్యపోటీలలో పాల్గొంది రాగిణి. మూడోబహుమతి వచ్చింది. తరువాత రాష్ట్రస్ధాయిపోటీల్లోనూ పాల్గొంది. బహుమతి ఏదీ రాలేదు కానీ, మాటలు మూగబోయిన రాగిణి, పట్టుదలగా ఫ్లూట్ వాయించడం నేర్చుకుందీ అని తెలిసి, ఒక భక్తి
ఛానల్‌వారు, వారి రోజువారీ పాటల ప్రసారంలో, ఫ్లూట్ వాయించేలా, రాగిణికి అవకాశం ఇచ్చారు. ఒక్కో ప్రోగ్రామ్‌కి మూడువేలు ఇస్తామన్నారు. సంతోషంగా ఒప్పుకుంది.
సంగీతంతో ప్రశాంతత, ఆర్ధికభద్రత రెండూ పొందింది రాగిణి. తనకీ, పుట్టిన తన కూతురికి, మంచిగా జరిగేలా సంపాదన ఉంది. దిగుళ్ళు తగ్గుతున్న కొద్దీ, మనసు దృఢమై, నెమ్మదినెమ్మదిగా మాటలు వస్తున్నాయి. మనవరాలికి వస్తున్న ముద్దుముద్దు మాటల్లాగే, రాగిణికి కూడా చిన్నచిన్న మాటలు వస్తుంటే, వింటున్న సుమతి, ఇద్దరినీ చంటిపిల్లల్లా గుండెలకు పొదువుకుంది అపురూపంగా, ఆనందంగా, కాస్తంత ప్రశాంతంగా.
రాగిణి అనుకుంది, గాయపడ్డామని ఆగకూడదు, గెలిచాకే ఆగాలి. అంతేగానీ, దిగుళ్ళున్నాయని, అందమైన జీవితాన్ని వదిలేసిపోగూడదు, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేయాలని అస్సలు అనుకోకూడదు అని.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.