వప్పందం by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

సాయంత్రపు ఆకాశం నెమ్మదిగా చీకటి మునుగేసుకుంటోంది . ఆ ముసుగులోంచీ ఆశావాదికి ఉదయించబోయే మరో ఉషస్సు , నిరాశావాదికి గడిచిపోయిన ఒక దినం గోచరిస్తున్నాయి . ఆశ నిరాశల మధ్య వూగిసలాడుతున్న సురేంద్రకి మాత్రం ఆ క్షణం చాలా ఉద్విగ్నంగా అనిపిస్తోంది .
“మీరొద్దంటే ఆ జాబ్ నాకొస్తుంది” ” నిస్సహాయంగా అన్నాడు . అతనిలో ఉక్రోషం … కసి …. కనీకనిపించనట్టు .
“నేనెందుకు వద్దనాలి ?” ” మైత్రేయి ఎదురు ప్రశ్న వేసింది .
ఆమె అలా అడుగుతుందని అతను ముందే ఊహించాడు . అందుకే జవాబు సిద్ధం చేసుకున్నాడు . కొన్ని కొన్ని కృత్రిమ విలువల్ని , ఊహాధారమైన నమ్మకాలనీ వదిలేస్తే మనిషి ఎంతో సుఖపడచ్చు . ఆ వొదిలెయ్యడానికి కొంత సంఘర్షణ తప్పదు . ఆమెని కలవటానికి దాదాపు గంట ముందుదాకా రెండురోజులపాటు అతనలాంటి సంఘర్షణని అనుభవించి , వొరిపిడి పడిపడి ఆఖరికి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు . ఇప్పుడతని మనసులో ఎలాంటి సంఘర్షణా లేదు . నిశ్చలంగానే ఉంది చాలావరకూ … ఆ విషయంలో.
“మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం”” అన్నాడు . మైత్రేయి షాకైంది . క్షణం సేపు చెవుల మీద మెదడుకున్న నియంత్రణ సడలిపోయింది . తర్వాత తేరుకుని విస్మయంగా అడిగింది . ”
“జాబ్‍కోసం నన్ను పెళ్ళి చేసుకుంటారా ? “
“ముప్పైనాలుగేళ్ళ నిరుద్యోగిని . నాకు ఉద్యోగం విలువేంటో బాగా తెలుసు . ఈ ఛాన్స్ మిస్సైతే నాకింక గవర్నమెంటు వుద్యోగాలకి వయసు దాటిపోతుంది”
“అందుకని?” “
“మీ భర్త సర్వీస్‍లో ఉండి చనిపోయారు . అందుకు మీకు గ్రాట్యుటీ, పెన్షన్ , ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చాయి . కారుణ్యనియామకం కూడా ఇవ్వబోతున్నారు . నిజానికి అలా ఇవ్వటానికి అభ్యర్థి ఆర్థికస్థితిగతులు చూడాలి . కానీ చూడరు . ఎందుకంటే మన సమాజంలో హక్కుల్ని కాలరాసి దానాలివ్వటమంటే చాలా ఇష్టం” “
“యూ మీన్ ? ““
“యస్ . ఐ మీనిట్ . నిజానికి మీక్కావల్సినది కొంత డబ్బు , ఇంకొంత డబ్బు , ఇంకా యింత డబ్బు . అంతేనా ? పాతికేళ్ళ వయసులో వున్న మీరు కోరికలనీ, సరదాలనీ చంపుకుని తోడనేది లేకుండా ఆ డబ్బుతో సంతృప్తిపడి బతకాలి””
అతని మాటలకి మైత్రేయి ముఖం ఎర్రబడింది . కోపం రాలేదుగానీ మనసు గాయపడింది. అతనలా బహిరంగంగా అనేసరికి సిగ్గనిపించింది. ఐనా వాస్తవాన్ని గుర్తించింది . నిజానికి ఆమెకూడా ఎన్నోసార్లు అనుకుంది, యీ డబ్బంతా తీసేసుకుని భర్తని ఎవరేనా తిరిగి యిచ్చేస్తే బావుణ్ణని. ఓ పూట పస్తున్నా అతని తోడుంటే అదే చాలునని .
“మీరుగనుక అడ్డులేకపోతే ఈ జాబ్ నాకు కచ్చితంగా వచ్చేది . ఒక పౌరుడిగా ఈ దేశసార్వభౌమత్వానికి కట్టుబడి ఉండాల్సిన నైతిక, రేప్పొద్దున్న పెళ్ళైతే భార్యాపిల్లల్ని పోషించాల్సిన ప్రాథమిక, బాధ్యతలు నాకు వున్నప్పుడు ఒక ఉపాధిని కోరుకునే హక్కు నాకు లేదంటారా ?” ” ఆవేశంగా అడిగాడతను .
కొద్దినిముషాలక్రితం తను ఇబ్బందిపడింది మర్చిపోయి మైత్రేయి అతన్ని దిగ్గున తలతిప్పిచూసింది . అతనిలో ఒక విశిష్టత కనిపిస్తోందామెకి. అతనికేం కావాలో అతనికి తెలుసు . ఎదుటి వ్యక్తికేం కావాలో కూడా గ్రహించగలడు . మార్పిడిని ప్రతిపాదించగలడు. ఆ అవసరాలు ఎలాంటివైనా.
“మీతో ఒక్క పదినిమిషాలు మాట్లాడాలి . ప్లీజ్ మేడమ్ !” ” అనే అభ్యర్ధనతో ఒక అత్యవసర సమావేశాన్ని అతను ఏర్పాటు చేశాడు .
అతనితో ఆమెకి గల పరిచయం చాలా తక్కువ . ఆమె ఇప్పుడు పని చెయ్యబోయే ఆఫీసులో అదే ఖాళీలో అతను డెయిలీవేజెస్‍మీద పనిచేస్తున్నాడు . ఆరునెలల పీరియడ్‍లో కనీసం నూటయిరవైరోజులు పని చేస్తే డిపార్టుమెంటు నిబంధనలప్రకారం రెగ్యులరైజ్ చెయ్యాలి. ఇప్పటికి ఎంతోకాలంగా చేస్తున్నాడు. మంచిపనిమంతుడని పేరుంది. కానీ రెగ్యులరైజ్ కావటానికి ఎప్పటికప్పుడు ఏవో ఆటంకాలు. ఈ వేకెన్సీలో అతన్ని తీసుకుంటారని ఎంతో ఆశతో వున్నాడు. ఇప్పుడు మళ్ళీ తను అడ్డుపడింది. తను చేరగానే అతన్ని ఇంటికి పంపిస్తారట. మళ్ళీ ఎప్పటికి వేకెన్సీ రాను? అప్పుడు మళ్ళీ ఎవరూ అడ్డు రాకపోతే అతని ప్రతిపాదన పంపిస్తారట.
ఈ ఉద్యోగంలో చేరితే తన బతుకు బాగుపడుతుందని కాదు. అదో వ్యాపకమౌతుందని. ఇంట్లో కూడా అలాగే ఆలోచిస్తున్నారు . భర్త పోయిన దు:ఖం, లోటు ఎలా వున్నా, పుష్కలంగా డబ్బొచ్చింది . ఆపైన ఉద్యోగం. భుక్తికి ఏ లోటూ వుండదనే ఎంతసేపూ వాళ్ళ ధ్యాస. తనకింకో కోరిక వుంటుందని వాళ్ళనుకోలేదు. వాళ్ళేంటి, సురేంద్రతో మాట్లాడేదాకా తనే అనుకోలేదు .
“అతన్ని చేసుకుంటే ?” ఆమెకి వొళ్ళు జలదరించింది . అదోలాంటి భావన .
“సారీ!”” అంటూ వెళ్ళడానికి వుద్యుక్తురాలైంది .


ఇంటికొచ్చాక తండ్రితో క్లుప్తంగా చెప్పింది .
“అతనెవరో గమ్మతైన మనిషిలా ఉన్నాడు . ఉద్యోగంకోసం నన్ను చేసుకుంటానన్నాడు”” అని, క్షణం ఆగి , “”అతనికి జాబ్ బాగా అవసరమనుకుంటా. ఏజి బారైపోతోందని చెప్పాడు”’ అంది .
గోపాలరావు కూతురి మొహంలోకి తీక్షణంగా చూశాడు.
“ఎవరి అవసరం వారిది . నీకుమాత్రం ఓ ఆధారం అవసరం లేదా ?”” అన్నాడు . అంతకుమించి ఆయన ఆలోచన పోలేదు.
“నేనిప్పుడు చేరలేనని చెప్పేసి ఈ వేకెన్సీ వదిలేస్తే అది అతనికిస్తారు . తరువాతి వేకెన్సీకి నేను ట్రై చేస్తే సరిపోతుందేమో” ” అంది మైత్రేయి .
“ఓవైపు సెంట్రల్లో సరైన గవర్నమెంటు లేదు . మరోవైపు ప్రేవేటైజేషనూ , కంప్యూటరైజేషను . మారుతున్న పాలసీలు. ఇప్పట్లో ఇంక ఖాళీలు రావు . తన్ను మాలిన ధర్మం మంచిదికాదు” ” అనేశాడు గోపాలరావు .
ఆయనకి కూతురి మనసు చదివే శక్తి లేదు . తననెంతో ఉత్తేజపరచి , అన్నీ అయిపోయాయనుకున్న జీవితానికి వసంతసమీరంలా అతను తెచ్చిన ప్రతిపాదనని తండ్రి ఒక్క మాటలో తేల్చి చెప్పేసరికి హతాశురాలైపోయింది మైత్రేయి . కూతురి ముఖంలో వచ్చిన మార్పుని పసిగట్టింది మైత్రేయి తల్లి.
వసంతం వస్తుంది – కోయిల కూస్తుంది .
వసంతం వెళ్తుంది – కోయిల మూగవోతుంది .
అదొక చక్రభ్రమణం . మనిషి కొన్ని కృత్రిమవిలువలనీ రాగద్వేషాలనీ సృష్టించుకుని త్రిశకుస్వర్గంలాంటి తన సృష్టిలో తనే చిక్కుకుని ఇబ్బందిపడుతున్నాడు. కూతురికి పెళ్ళైంది. భర్తపోయాడు. పిల్లల్లేరు. మిగిలిన జీవితమంతా ఇలా మోడులా గడపాల్సిందేనా? ఎంత డబ్బు యిస్తే ఆమె జీవితంలోని వెల్తి పూడుతుంది? ఆ రెండో మనిషి లేని లోటు తీరుతుంది? ఏ వుద్యోగం, ఏ వ్యాపకం ఆమె వంటరితనాన్ని పంచుకోగలవు?
మైత్రేయి నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది . ఆమెకీ మరొకరి మనను చదివే శక్తి లేదు . వాస్తవానికి ఒకరి అవసరాలు మరొకరికి అర్ధమౌతాయనేది భ్రమే . మనిషి దృక్పథం పారదర్శకంగా వుండదు . చూసే వ్యక్తి తాలూకు అనుభవాల రంగులు అందులో జీర్ణించుకుపోయి ఉంటాయి .
“మీరోసారి ఆ కుర్రాడిని కలిసి మాట్లాడితే బావుంటుందేమో!” ” మైత్రేయి అక్కడినుంచి పూర్తిగా వెళ్ళిపోయాక అంది ఆమె తల్లి .
“ఏం మాట్లాడాలి ?” ” తెల్లబోయాడు గోపాలరావు .
“యోగ్యుడైతే ఉద్యోగాన్ని వదులుకుని మైత్రేయిని యిచ్చి చేద్దాం” ” నిదానంగా అందావిడ .
“దానికి మళ్ళీ పెళ్ళా?” “
“తప్పేముంది ? ఎంతకాలం ఇలా ఉంటుంది ? ఎంతమంది చేసుకోవటంలేదు ?””
ఆయన ఆలోచనలో పడ్డాడు . మైత్రేయి ఆ విషయం తనకి ప్రత్యేకించి చెప్పటంలోని కారణం అవగతమైంది . రెండోపెళ్ళి చేసుకునే మగవాడైనా కేవలం శారీరక సుఖం కోసం చేసుకోడు . తను చివరిదాకా ప్రశాంతంగా బతకడంకోసమో , పిల్లలకోసమో , ఏదేనా బలహీన క్షణంలో తప్పటడుగులు వేసి బురదలో కూరుకుపోకుండా ఉండటంకోసమో … ఇలా ఎన్నో కారణాలుంటాయి . మైత్రేయికికూడా అలాంటి కారణాలు కొన్ని ఉండవచ్చు.


“మైత్రేయిని పెళ్ళి చేసుకోవటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు”” స్థిరంగా అన్నాడు సురేంద్ర .
అతని మాటల తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది . చివరికి దాన్ని భంగపరుస్తూ అన్నాడు గోపాలరావు .
“మైత్రేయి వదులుకుంటే నీకొచ్చే ఉద్యోగాన్నో, తన వెనకున్న డబ్బో చూసి ప్రలోభపడుతున్నావేమో ! అలాంటి ప్రలోభంతో చేసుకున్న పెళ్ళిలో వుండే సుఖం ఎండమావిలాంటిది””
సురేంద్ర చిన్నగా నవ్వాడు .” లక్షో రెండు లక్షలో కట్నమిచ్చి ఆమెకి చేసిన మొదటి పెళ్ళిలో మాత్రం ప్రలోభం లేదంటారా ? అసలు ప్రలోభం, పరస్పరలాభం లేకుండా ఏవి సాధ్యమౌతాయంటారు ?” ” సూటిగా ప్రశ్నించాడు .
గోపాలరావు డంగయ్యాడు . నిజమే . కట్నం చూసేగా, వాళ్ళు తన కూతుర్ని చేసుకున్నది ? అది చాలదని అలకపాన్పుమీద స్కూటరు , మొదటి పండక్కి కలర్‍టీవీ అడిగారు . అవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళది ప్రలోభమనిపించలేదు . పైగా ఆ సంబంధం కుదరటం అదృష్టమనిపించింది. కేవలం వుద్యోగంకోసం ఈ కుర్రవాడు ముందుకొస్తుంటే ఎందుకిన్ని సందేహాలు? తను చెయ్యబోతున్నది తప్పేమోనన్న అనుమానంచేతనా? పెళ్ళనేది మొదటిసారేనా రెండోసారేనా లాటరీయే. మరో టికెట్ కొంటే తప్పేమిటి? తన ఆలోచనలు ట్రాక్ తప్పుతున్నట్టు గ్రహించి కంట్రోల్ చేసుకున్నాడు .
“మీ యిద్దరికీ యిష్టమైతే మాకెలాంటి అభ్యంతరం లేదు”” అనేసాడు. “”మరి మీయింట్లో?””
సురేంద్ర నవ్వాడు. అతను తల్లితో ఆ విషయం అప్పటికే చెప్పాడు. ఆవిడ వప్పుకోలేదు. తన నిర్ణయం తను తీసుకున్నాడు. తప్పలేదు. మొదటిది తన జీవితం నిలుపుకోవలసిన బాధ్యత తనదే కావటంచేత , రెండవది మైత్రేయి అంటే కలిగిన యిష్టంచేత.


“అదేంట్రా? వితంతువివాహం మనింటావంటా లేదు. అనాచారం కూడాను. ఐనా, రేపోమాపో వుద్యోగం వస్తుంది. లక్షణంగా కట్నకానుకలతో లక్ష్మీదేవిలాంటి కోడలు వస్తుందనుకున్నాను”” మెళ్ళో పూలదండలతో ఆటో దిగిన సురేంద్ర, మైత్రేయిలని చూసి. అంతా జరిగిపోయాక గొడవెందుకని లోపలికి రానిచ్చి అంది సురేంద్ర తల్లి. అతని పెళ్ళిమీద ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆవిడకి అనువైన ఆశలు. మనసులో మాటలన్నీ మరో ఆలోచన లేకుండా అనేసింది.
మైత్రేయికి చివుక్కుమంది. తల్లికి యిష్టంలేదనీ, ముందుగా చెప్పి చేసుకునే అవకాశం లేదు కాబట్టి గుడిలో పెళ్ళి చేసుకుని తీసుకొచ్చాడు. దాన్నిబట్టే వూహించుకుంది తనని అక్కడెలా చూస్తారో! చూడటానికంటూ ఎవరూ లేరు, అతని తల్లి, ఆవిడని చూడటానికి వచ్చిన ఒక బంధువు.
సురేంద్ర అర్థం చేసుకొమ్మన్నట్టు చూసాడు. సర్దుకుని, పర్వాలేదన్నట్టు తలూపింది మైత్రేయి. ఆ తర్వాత అతను తల్లితో అన్నాడు, “”ఇద్దరు స్త్రీపురుషులు ఆజీవనం అన్ని విషయాల్లో కలిసి వుంటామని చేసుకున్న వప్పందం పెళ్ళికి ప్రాథమిక దశ. తర్వాత నాగరీకత పెరిగింది. సంస్కృతీసాంప్రదాయలంటూ వచ్చి ఎన్నో చోటుచేసుకున్నాయి. పెళ్ళికి ఎన్నో హంగులొచ్చాయి. పలానా అమ్మాయిని లేదా అబ్బాయిని అని ఎంపిక చేసుకోవటం రెండో దశ. ఆపైన వ్యక్తిగత, సామాజిక అవసరాలు ఆ ఎంపికని శాసించడం మనం వున్న ప్రస్తుతపు దశ. నాకు వుద్యోగం లేదు. వచ్చే అవకాశాలు తక్కువ. మైత్రేయి తన జాబ్ అవకాశాన్ని నాకోసం వదులుకుంది. జాబ్ ద్వారా వచ్చే సెక్యూరిటీని నేనిస్తానన్నాను””
సురేంద్ర తల్లి మరో తెలివితక్కువదేం కాదు, కొడుకుచేత మరీ విడమరిచి చెప్పించుకోవటానికి. భార్యాభర్తలమధ్య వుండే వప్పందంలాంటిదే తల్లీపిల్లల మధ్య కూడా వుంటుంది. ఈ తరుణంలో కొడుకుని దూరం చేసుకుంటే నష్టపోయేది తనేనని అర్థం చేసుకుని మైత్రేయికేసి చూసింది. తలొంచుకుని నిలబడి వుందామె. పెళ్ళిచేసుకుని భర్తపక్కని నిలబడి వుండగా ఇంకా వితంతువేమిటి? తంతువులన్నీ సరిచేసాడుకదా, కొడుకు?
“రామ్మా!”” అంది మృదువుగా.
(ఆంధ్రభూమి 24.10.1999)