మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao

  1. స్ఫూర్తిప్రదాత by Maddala Sakunthala Devi
  2. నిను తలచి – నను మరచి by Rakesh Yallamilli
  3. భూమిపుత్రుడు by Sailaja Ramshaw
  4. మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao
  5. నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao
  6. నా దారిలోనే నేను!! by Savitri Ramanarao
  7. బిందువు by Sailaja Ramshaw
  8. ఓన్లీ వన్ by Shailaja Ramshaw
  9. బీజం by Sailaja Ramshaw
  10. పనిమనిషి by Mangu Krishna Kumari
  11. నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao
  12. చెద by Sailaja Ramshaw

ఆంగ్లమూలం Excusing Weaknesses -Fullfilling Lives by Prabhakar Dhoopati

సాయంత్రం సుమారు ఏడుగంటలవేళప్పుడు నేను గుడిమెట్లు దిగాను. ఈ రోజు తన పుట్టినరోజు. గుడిలో తన పేర అర్చన చేయించాను. తను ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా దేముడిని వేడుకున్నాను.
తను నానుండి దూరం అయి సుమారు నాలుగేళ్లు కావొస్తోంది. తను వెళిపోయాక నేను గుడికి ఇంచుమించుగా రావటంలేదనే చెప్పవచ్చు. ఎప్పుడైనా తప్పిదారి వచ్చినా ఎవరో వృద్ధులయిన దగ్గరి బంధువులు వచ్చినపుడు వారి ప్రోద్బలంవల్ల మాత్రమే. ఈ రోజెందుకో తనని చూడాలని చాలా తీవ్రంగా అనిపించింది. అప్పుడే గుర్తువచ్చింది ఈరోజు తన పుట్టినరోజని కూడా.
గుడిలో “దేముడా! నేను తనని ఏదీ ఎంచకుండా యధాతథంగా స్వీకరించటానికి సిద్ధంగా వున్నాను అని చెప్పే అవకాశం నాకు కలిగించు” అని ప్రార్ధించాను.
నా షూస్ తీసుకుందికి వెళ్ళి అక్కడ ఉన్న ఆమెకి నా టోకెన్ ఇచ్చాను. బలహీనంగా ఉన్న ఆమె టోకెన్ తీసుకుని నా షూస్ ఇస్తున్నపుడు చూసాను ఆమెని. నన్ను చూస్తూనే ఆమె పైటను తన ముఖం కనబడకుండా ఉండేలా తలమీదుగా లాక్కుంది. అందులోంచి కనిపిస్తున్న ఆమె ముఖభాగం చాలు ఆమె ఎవరో గుర్తుపట్టడానికి నాకు. సందేహం లేదు, ఆమె పద్మావతే.
పట్టలేని ఆనందం కలిగింది నాకు. అప్రయత్నంగా “పద్మా!” అని దాదాపు అరిచినట్లు పిలిచాను. నా ప్రార్ధన ఆలకించిన భగవంతుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటూ. కళ్ళ కన్నీళ్లు కారుతుంటే మళ్ళీ “పద్మా!” అని పిలిచాను. ఈసారి నా గొంతులో నాకే తెలియని మార్దవం.
ఆమె ముఖాన్ని దాచుకుందుకు మరింతగా పైటను ముఖముమీదికి లాక్కుంటూ సన్నని గొంతుకతో వినీ వినబడనట్లుగా “నేను పద్మని కాదండీ!” అంది. నేను అదేమీ వినిపించుకోకుండా “పద్మా అంతా చూస్తున్నారు. బావుండదు. పద వెళదాం” అని అక్కడున్న
ఇంకో స్త్రీతో “అమ్మా! పద్మ నాతో వస్తున్నాది. ఇక్కడ తన పని కొంచెం మీరు చూసి పెట్టండి” అని చెప్పి, ” పద! పద!” అంటూ కారువైపుకు నడిచాను. నన్నేమీ అనలేక తను నలుగురి దృష్టిలోపడటం ఇష్టంలేక పద్మ నన్ను అనుసరించింది. పార్కింగ్‍లాట్ చేరాక నేను గతంలో తనకి కార్ డోర్ ఎలా తీసిపట్టుకునేవాడినో అలాగే కారు తలుపు తీసిపట్టుకున్నాను. ఆమె మౌనంగా కారు ఎక్కి తన సీట్లో కూర్చుంది. మా ఇద్దరి కళ్ళనుండి కన్నీరు ధారగా జారుతోంది. నేను కార్‍లో కూర్చుని టిస్యూ‌పేపర్స్ తీసుకుని తనకి ఇచ్చి నా కళ్ళు తుడుచుకున్నాను.
వాటర్‍బాటిల్లో నీళ్లు కొన్ని నేను తాగి తనకి బాటిల్ అందించాను. ఆమె నీళ్ళు తాగాకా కారు స్టార్ట్ చేసాను. త్రోవలో రెస్టౌరెంట్‍లో బిరియానీ పాకెట్స్ తీసుకుని ఇంటికి వచ్చేము. త్రోవంతా నిలువునా కోసేస్తున్న పదునైన కత్తిలాంటి మౌనం మామధ్య.
అపార్ట్మెంట్ లాక్ తీసి మేము లోపలికి వచ్చాక తలుపు వేసేశాను. ఆమెను కూర్చోమని చెప్పి నా షూస్, టై, జాకెట్ విప్పేసాను. ఫ్రిజ్‍లోంచి ఒక వాటర్‍బాటిల్ తీసి ఆమె కిచ్చాను. కాస్త “ఫ్రెష్ అవు!” అంటూ మాస్టర్ బెడ్‍రూమ్ తాళంతీసి ఆమెను రమ్మన్నట్లుగా సైగచేసి లోపల అడుగుపెట్టాను.
నాలుగేళ్ళ తరవాతకూడా ఆ రూమ్ అలాగే ఉంది. కాస్త దుమ్ము పేరుకుంది కానీ. నేను డ్రెస్సింగ్ టేబుల్లో డ్రాలో వున్న చిన్న ట్రావెల్‍కిట్ తీసాను. అందులో టూత్‍బ్రష్, టంగ్ క్లీనర్, షవరింగ్ జెల్, షాంపూ ఉన్నాయి. పక్కనే ఉన్న, ఇన్నాళ్లుగా నేను , తను వెళ్లినదగ్గరనుండీ
నా బెడ్‍రూమ్‍గా వాడుకుంటున్న గదిలోనుండి కొత్తసబ్బు, టవలు తెచ్చి అన్నీ తన కిచ్చి “రిఫ్రెష్ అవు.” అన్నాను. కబోర్డ్ తెరిచి తాను వెళ్ళినప్పుడు ఎలాగ వుందో అలాగే ఉన్న కబోర్డు తనకి చూపించి బయటికి వచ్చాను.
నా రూమ్‍కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి నేను పాల్గొనవలసిన టీవీ చర్చాకార్యక్రమంకోసం మళ్ళీ డ్రెస్ చేసుకుని టై కట్టుకు పైన జాకెట్ వేసుకున్నాను.
కిచెన్‍లోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీ చేసాను. ఇదంతా అయేసరికి దాదాపు ఒక గంట పట్టింది.
తను స్నానం చేసి వేరే బట్టలు వేసుకుని వచ్చింది. తనకేసి తేరిపారా చూసాను. చాలా బలహీనంగా కనిపించింది. అప్పట్లో ఉన్నదానికి దాదాపుగా సగం అయిపోయింది మనిషి. ఇంతసేపూ ఏడ్చింది అనటానికి గుర్తుగా ఆమె కళ్ళు ఎర్రగా వాచిపోయి, ఆమె ముఖం పాలిపోయి, ఉన్నాయి.
నేను ఆమెను కూర్చోమని చెప్పి ఓవెన్‍లో కాఫీ వేడిచేసి ఆమెకి ఒక కప్పు ఇచ్చి నేను ఒక కప్పు తీసుకున్నాను.
నేను కాఫీ సిప్‍చేస్తూ ” కాఫీ తాగి రిలాక్స్ అవు” అన్నాను.
“నన్ను ఎందుకు తీసుకువచ్చారు?”దాదాపుగా వణుకున్న గొంతుతో అడిగింది.
“అవన్నీ తరవాత మాట్లాడుదాం. నేను ఇపుడు టీవీలో ఒక చర్చాకార్యక్రమానికి వెళ్ళాలి. నువు ముందు రిలాక్స్ అవు” అని చెప్పి నా
కాఫీ కప్ సింక్‍లో కడిగి పెట్టి టీవీచర్చకోసం వెళ్ళాను.
టీవీ చర్చ మొదలయింది. చర్చ సమన్వయకర్త ప్రేక్షకులకు నన్ను పరిచయం చేసి ” గుడ్ ఈవెనింగ్ ప్రొఫెసర్ శ్రీనివాస్! ప్రస్తుతం పెరిగిపోతున్న కరంట్ అకౌంట్ డెఫిసిట్ అదే సీఏడి పరిస్థితిని చక్కబరచటానికి ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమం ఏమిటి అనుకుంటున్నారు.” అని అడిగాడు.
“గుడ్ ఈవెనింగ్. మన సీఏడీ పెరిగిపోయింది అన్నమాట వాస్తవం. మన ప్రభుత్వం సీఏడీ పొజిషన్ మెరుగుపరిచేము అని ముందు అతిగా ప్రచారం చేసుకున్నా చమురుధరలు పెరగడంతో చతికిలబడింది. చమురుధరలు పెరగటంగానీ, అవి పెరగటంవలన కలిగే ప్రభావాలుగానీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి కాకపోయినా , మన దేశంలో ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిననాటినుండి నేటివరకూ దేశనిర్మాణంలో పౌరులు పాల్గొనేట్లు చేయటంలో పూర్తిగా విఫలం ఆయాయి. ఈ ప్రభుత్వంకూడా దానికి మినహాయింపు ఏమీకాదు. ఇక నేటి ప్రపంచీకరణ కొన్ని ఉన్నతవర్గాలవారికీ, ఏవో తంటాలుపడి పిల్లలని చదివించి వృత్తివిద్యానిపుణులుగా, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌గా విదేశాలకు పంపించుకోగలిగిన కొద్దిపాటి మధ్యతరగతీ, దిగువమధ్యతరగతీ వర్గాలకు ఉపయోగపడింది కానీ అసంఖ్యమైన అల్పాదాయవర్గాలకు ఒరిగిందేమీ లేదు. వాళ్లంతా నేటికీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలమీదే ఆధారపడి బతుకుతున్నారు. వారు దేశీయ అవసరాలకు, మనం చేసే ఎగుమతులకు అవసరమైన అన్నిరకాల ఉత్పత్తి, సేవారంగాలలో క్రియాశీలపాత్ర పోషించనంతవరకు ఈ దేశ అభివృద్ధి సాధ్యపడదు. మనదేశం మనం దిగుమతి చేసుకుంటున్న, మన దేశపు మార్కెట్లను ముంచెత్తుతున్న ఇతరదేశాల వస్తువులతో సరితూగగల వస్తువులను, అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగగల సేవలను దేశీయంగా అందించగలగాలి. మన సాంకేతికవిధానాలు ఆ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపుచేసుకోవాలి. మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పీహెచ్‍డీలకన్నా ఎక్కువగా పంట పండించేగలిగే రైతులను, తోటలు పెంచగలిగే మాలీలను తయారుచేయాలి. అధికజనాభా, అత్యధిక యువశక్తి గలిగిన మనదేశంలో ప్రతివ్యక్తి మన ఎగుమతులద్వారా విదేశీమారకద్రవ్యం వచ్చేవిధంగా శ్రమపడితే మనకి ద్రవ్యలోటు అనే సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి పౌరులను దేశ అభివృద్ధికి కావలసిన అన్నిరంగాల్లో భాగస్వాములను చేయటం ఒక్కటే మార్గం. ఏ ఇతర విధానమైనా తాత్కాలిక ప్రయోజనం మాత్రమే కలిగిస్తుంది.
డీమోనిటైజేషన్ తరవాత వర్కింగ్ కాపిటల్ క్రంచ్ పరిశ్రమలను ఇంకా దెబ్బతీస్తూనే వుంది. జీఎస్టీవల్ల అనిశ్చితత్వం ప్రభావం బలంగా ఉంది.
బ్యాంకింగ్‍రంగంమీద ప్రజల విశ్వాసం సడలిపోవటం జరిగింది. దీన్ని మించిన దుస్థితి ఏ దేశానికీ ఉండదు. మన ఎగుమతుల సప్లై చైన్ చాలా బలహీనమైనది. ప్రస్తుతం ఉన్న బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితి కొనసాగితే రూపాయి విలువ పడిపోతుంది. దాని వలన ఎగుమతులపరంగా మెరుగవుతాము. కానీ దేశీయంగా రూపాయి విలువ తగ్గటం ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
ఇది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటి పరిస్థితి. ఏవో తాత్కాలిక సర్దుబాట్లు, సవరణలు ఈ సమస్య ని పరిష్కరించలేవు. అవన్నీ ఏదో గాయంమీద తాత్కాలిక ఉపశమనంకోసం పూసిన పూతల్లా పనిచేస్తాయిగానీ మూలాల్లోంచి నివారణకు ఉపకరించవు. దిగుమతులు నియంత్రించే ప్రయత్నంచేస్తే వాటివలన ఎగుమతులు దెబ్బతింటాయి. మనదేశంలో విధిగా కొనబడే బంగారంకూడా మన అధీనంలో ఉండకుండా పోతుంది. దాన్ని నియంత్రించే ప్రయత్నం బంగారం స్మగ్లింగ్‍కి దారితీస్తుంది. దాన్ని అరికట్టడం అంత సులభం కాదు. ఇది
హజీ మస్తాన్ టైంనుండి నేటివరకు మనదేశంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు”
నావరకూ చెప్పవలసింది చెప్పటంతో చర్చ ముగిసింది. స్విచ్చాఫ్ చేసి నా గదిలోకి వెళ్ళి ట్రాక్స్, టీ షర్ట్ వేసుకుని బయటికి వచ్చి తనకి కొంచెం వైన్ ఇచ్చాను. తను మృదువుగా తిరస్కరించింది.
“డిన్నర్ చేసేద్దాం. నాకు ఆకలిగా ఉంది” అన్నాను.
ఆమె “నేను తినలేను. నేను నాన్‍వెజ్ తినటం మానేసాను” అంది.
“అలా అయితే డిన్నర్‍కి బయటికి వెళదాం” అన్నాను.
“ఇంట్లో సరుకులు లేవా ?” అని ప్రశ్నించింది.
“అన్నీ ఉన్నాయి. మా ఊరినుండి ఒక ముసలి అతను వచ్చాడు. నాతోనే ఉండి ఇల్లు శుభ్రంచేయటం, వంటచేయటం అతనే చేస్తాడు. అతను కింద వాచమేన్ క్వార్టర్స్‌లో పడుకుంటాడు. ఈరోజుకూడా ఏదో వండే ఉంటాడు. అది నీకు నచ్చుతుందో,లేదో మరి” అని ఆగాను.
ఆమె ఫ్రిజ్‍లోంచి ఏవో కూరలు తీసి బియ్యం,పప్పుకోసం వెతికి తీసింది.
ఆ ముసలి అతను వంటగది చాలా తీరుగా ప్రతిదీ కనబడేట్లు సర్ది, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాడు. అందికే కావలసినవి సులభంగా తొందరగా దొరికాయి.
ఆమె బియ్యం కడిగి ఎలక్ట్రిక్ కుక్కర్లో పడేసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూరలు కోయటం మొదలుపెట్టింది.
నేను డైనింగ్‍టేబుల్ దగ్గర కుర్చీ ఒకటి లాగి దానిమీద కూర్చుని ఆమెనే పరిశీలించసాగాను. తడిగా ఉన్న కురులనుండీ ఇంకా నీరు బొట్లుబొట్లుగా జారుతోంది. స్నానం చేసి ఇస్త్రీ చేసిన చీర, జాకెట్టులో ఎంతో హుందాగా కనిపించింది. నుదిటిమీద చిన్న స్వేదబిందువులు మెరుస్తున్నాయి. చీరకొంగు నడుము చుట్టుతిప్పి కుచ్చిళ్ళు పక్కగా దోపుకుంది. కుడిచేత్తో నుదిటిమీది చెమటని తుడుచుకుంటోంది.
నా మనసులో నా వశంలేకుండా ఆమె జ్ఞాపకాలదొంతరలు. ముందు మధురమైనవి ఒకటొకటిగా. తరవాత నేను ఆమెను ఆమె బంధువుతో సన్నిహితంగా చూసిన అతిచేదుఘటన.
అది చూసాకనే నేను బాగా చెదిరిపోయాను. నా మనసు తీవ్రంగా గాయపడింది. అప్పటినుండి ఆమెతో నేను మాట్లాడలేదు. మా ఇద్దరిమధ్య రోజులతరబడి కమ్ముకున్న సుదీర్ఘకాళరాత్రిలో అలముకున్న అతిభయంకరమైన నిశ్శబ్దంలాంటిది ఏర్పడి మనసులో ఎడతెగని రంపపుకోత.
అలా ఎన్నిరోజులో నాకు గుర్తులేదు. మామధ్య ఏర్పడిన ఈ దారుణస్థబ్దతవల్ల తనలో చిత్రహింసను, భరించలేక ఆమె ఇల్లు విడిచి వెళిపోయింది. తరవాత మళ్ళీ ఆమెని చూడటం ఈరోజే. నేను ఆమె తన బంధువుతో వెళిపోయివుంటుందనుకుని ఆమెను గురించి వెతికే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు వేరే ఏదో ఊరులో ఉండివుంటారఅనుకునేవాడిని.
ఈరోజు ఆమెను కృశించిపోయి దయనీయస్థితిలో చూసి నాకు చెప్పలేనంత బాధ కలిగింది. నాకెందుకో మామధ్య ప్రేమలేదని కానీ, తాను తన బంధువుతో ఆనందంగా ఉండగలుగుతుందని కానీ అనిపించలేదు ఎప్పుడూ. అయితే ఆ విషయాన్ని నేను అక్కడికి వదిలేసాను. మగవాడుగా నా పురుషాహంకారాన్ని ప్రదర్శించాను.
ఆలోచనలు ఆగాయి.
ఆమె దగ్గర వెళ్ళాను. మృదువుగా ఆమెని స్పృశించాను. తాను ముందు వెక్కుతూ తరవాత బిగ్గరగా ఏడ్వ సాగింది. నిలబడలేక అక్కడే నేలపై కూలబడిపోయింది. తోటకూరకాడలా వడిలిపోయిన ఆమెను మెల్లగా లేవనెత్తాను. నన్ను చుట్టుకుపోయింది. నేను నా ఎడమచేతితో
ఎలక్ట్రిక్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేసి కుడిచేతితో తనను దగ్గరగా తీసుకున్నాను. ఆమె నన్ను గట్టిగా హత్తుకుపోయింది.ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దుపెట్టుకుని ఆమె కురులను నావేళ్ళతో సవరించాను.
” నన్ను మన్నించండి” అంది. ఇన్నిరోజులుగా ఆమె అనుభవించిన మనోవేదన, పశ్చాత్తాపంతో ఆమె తనువు, మనసు పూర్తిగా ఏ కల్మషంలేకుండా స్వచ్ఛపడ్డాయనిపించింది నాలో నాకు.
“వదిలేయ్. అవన్నీ నేను పూర్తిగా మరిచిపోయాను. నావలన అటువంటిది జరిగితే నువు నన్ను మన్నించివుండేదానివి కాదా?” అన్నాను.
ఆమె నా భుజంమీద ఆనుకుని ఉండిపోయింది నడవటానికికూడా శక్తిలేని వివశత్వంతో. నేను ఆమెను మెల్లిగా నడిపించుకు పూజగదిలోకి తీసుకు వెళ్ళి ఆమె నుదిటిపై కుంకుమదిద్దాను. ఆ కుంకుమబొట్టుతో ఆమె ముఖం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ” హ్యాపీ బర్త్ డే స్వీట్ హార్ట్” అన్నాను.
పద్మావతీవెంకటేశ్వరుల అపారకృపాకటాక్షాలు మా దంపతులపై వర్షిస్తున్న అనుభూతి.