రింగ్ అవుతున్న మొబైల్ తీసి “హలో” అంది సీత.
“మీ పెండింగ్ అరియర్స్ బిల్ పాస్ చేయాలి. ఒకసారి మా అకౌంట్స్ సెక్షన్‍కి రండి . ఎస్సార్ వెరిఫికేషన్ చేస్తున్నాం. వస్తే మాట్లాడుదాం” అని అకౌంట్స్ సెక్షన్‍లో క్లర్క్ ఫోన్ చేసింది.
ఒక ఎయిడెడ్ కాలేజ్ ఆఫీస్‍లో యూడీసీగా పనిచేస్తున్న సీతకి పే ఎనామలీ రెక్టీఫై అయి ఆరేళ్ళ నుండి రావలసిన ఇంక్రిమెంట్స్ రావటంవలన
లక్షవరకు ఎరియర్స్ వచ్చాయి. ఆ బిల్లు పాస్‍చేయటంకోసమే ఆ ప్రాంతంలో గవర్నమెంట్ కాలేజ్‍లో ఆఫీస్‍లో అకౌంట్స్ సెక్షన్‍కి రమ్మన్నారు.
ఆ ఫోన్ వచ్చేసరికి సీత ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లివర్ పాడయిపోయి ఫైనల్ స్టేజి కాన్సర్‍తో ఉన్న తన భర్త దగ్గర ఉంది. ఆమె ఫ్రెండ్ లక్ష్మీ , సీత కూతురు శ్వేత కూడా అదే టైంకి అక్కడ వున్నారు.
సీత భర్త తాగి తాగి ఇలా హాస్పిటల్ పాలయ్యాడు. వాళ్ళకి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతురు, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు వున్నారు. అప్పుడే పదిరోజులయింది అతను హాస్పిటల్లో చేరి.
“కష్టమమ్మా!” అన్నారు డాక్టర్స్. ఉన్నన్నిరోజులు అతని బాధ తగ్గించే చికిత్సలు ఏవో చేయించటమేతప్ప చేయగలిగింది ఏమీ లేదని అర్ధంచేసుకుని గుండె రాయిచేసుకుని బాధ్యత నిర్వర్తిస్తోంది సీత. అసలే వాళ్ళ ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం. పులిమీద పుట్రలా ఇప్పుడీ హాస్పిటల్లో ఉండటం ,రోగాల ఖర్చు, ఆమె శక్తికిమించి ఖర్చు అవుతోంది.
ఎంత ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఇల్లుదాటి బయటికి వస్తే అదనపు ఖర్చులే. ఆపైన ఆసుపత్రిలో రోగికి ఏ చిన్నసేవచేసినా చేతులు చాపుతారు అటెండెన్ట్స్. ఇవ్వకపోతే మర్నాడు మరి పలకరు. ఇలా లెక్కా జమా తెలియని ఖర్చులకు డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతున్న తరుణంలో ఈ ఫోన్ సీతకు కాస్త ఊరట కలిగించింది.
కూతురును భర్త దగ్గర ఉండమని చెప్పి తన ఫ్రెండ్ లక్ష్మీతో కలిసి గవర్నమెంట్ కాలేజీ ఆఫీస్‍కి వెళ్ళింది. అక్కడ అకౌంట్ సెక్షన్‍లో క్లర్క్ “మేడమ్! మీ క్లెయిమ్ వెరిఫై చేసి పాస్‍చేస్తాంకానీ మాకు ఐదువేలు యివ్వాలి. అలా అయితే మీపని అయిపోతుంది త్వరగా” అంది.
“అయిదువేలా! నా భర్త ఆసుపత్రిలో వున్నారు. నాకీ డబ్బు ఈ సమయంలో చాలా అవసరం. ఆర్థికంగా సమస్యలలో వున్నాను. ఇవి ఇంక్రిమెంటల్ ఏరియర్స్. మీకు తెలియంది ఏముంది? దయజేసి కాస్త తగ్గించుకోండి ” అని ప్రాధేయ పూర్వకంగా అడిగింది.
ఆ క్లర్క్ ససేమిరా అంది. ఒక్క పైసా తగ్గేది లేదనడంతో చేసేదిలేక “బిల్ పాస్ చేయించమ్మా!” అని చెప్పి సీత, లక్ష్మి బయటికి వచ్చారు.
బస్‍స్టాప్‍లో బస్‍కోసం ఎదురు చూస్తూ ఉంటే లక్ష్మి ఫ్రెండ్ కలిసింది.
“హాయ్!” అంటూ పలకరించి, సీతని పరిచయం చేసి తాము అక్కడికి ఎందుకు వచ్చేరో,ఏమి జరిగిందో, సీత పరిస్థితి ఏమిటో పూస గుచ్చి చివరగా, “చూడు! ఆ క్లర్క్ రూపాయి తగ్గించనంది. మా పరిస్థితి చెప్పినా వినలేదు. గొడ్డును కోసేదానిలా ఎంత కఠినమో ఆ మనసు మరి” అంది ఆ క్లర్క్‌ని ఉద్దేశించి లక్ష్మి.
“ఆమె పేరు రుక్మిణేనా?” అడిగింది లక్ష్మి ఫ్రెండ్.
“అవును”లక్ష్మి సమాధానం.
“తనదీ మీ పరిస్థితే. ఇంకా దారుణంకూడా. మీకు పెర్మనెంట్ ఉద్యోగం ఉంది. తనకి అలాటిది ఏదీ లేక చాలా దుర్భరమైన ఆర్ధికస్థితి. తను నాకు బాగా తెలుసు. మా ఇంటికి రెండిళ్ళ అవతలే వాళ్ళ ఇల్లు. చాలా మంచిది. చాలా సమస్యలలో ఉంది. తాను అనాథ శరణాలయంలో పెరిగింది. అలాగే ఇంటర్ పాస్ అయింది. టైప్, షార్ట్‌హాండ్ నేర్చుకుంది. ఉద్యోగంకోసం చూస్తుంటే పరిచయం అయాడు శంకర్. అతను డిగ్రీ ఫెయిలయ్యాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్. పరిచయం ప్రేమగా మారి పెళ్ళి చేసుకున్నారు. శంకరంకి ఒక్క తల్లితప్ప ముందూ, వెనకా ఆస్తీ పాస్తీ ఏమీ లేవు. కోడలైనా కాస్త అన్నీ ఉన్న పిల్ల వస్తుందేమో అనుకుంటే అనాథని పట్టుకొచ్చాడు కొడుకని శంకరం తల్లికి కోపం. ఏమీలేని అమ్మాయిని చేసుకున్నాడని శంకరం తల్లి రోజూ రుక్మిణిని దెప్పుతుంది. పులిమీద పుట్రలా ఏళ్ళతరబడి తాగేవాళ్ళు దుక్కముక్కల్లా వుంటారు కొందరు. వీళ్ళ ఖర్మ ఏమిటో తాగుడు మొదలెట్టిన ఆరునెలలకే లివర్ సమస్య వచ్చింది శంకరానికి. మంచానపడి ఉద్యోగం మానేసాడు. గతి లేక ఇదిగో ఇలా లీవ్ వేకెన్సీలో మూడువేల జీతానికి చేరింది. ఈ సీట్లో వ్యక్తి మెటర్నిటీ లీవ్‍లో వెళ్ళింది. మొగుడి అనారోగ్యం ,అత్తపెట్టే ఆరళ్ళు చాలవన్నట్లు ఆఫీస్‍లో అకౌంట్స్ ఆఫీసర్ పెట్టే చిత్రహింస. అందరూ వెళిపోయినా ఈమెకి ఏదో పనిచెప్పి ఉంచేసి వెకిలివేషాలు వేస్తాడు. పోనీ జాబ్ మానేద్దాం అంటే మరోగతి లేదు. లేట్‍గా ఇంటికి వెళుతోందని భర్తా, అత్తగారు నానామాటలు ఆడుతారు. నాలుగురోజులక్రితం రుక్మిణి భర్తకి బాగాలేకపోతే ప్రభుత్వాసుపత్రిలో చేర్చింది. లివర్ కేన్సర్ అడ్వాన్సుడ్ స్టేజి అని బతకడని చెప్పేసారు. నిన్ను కట్టుకోవటంవల్లే ఇలా అయింది అని ఆమె అత్త చెరిగిపోస్తోంది. పాపం నాతో చెప్పి ఏడుస్తుంది. నానా బాధలుపడుతున్న తనని చూస్తే భగవంతుడా ఆమెకి ఈ పెళ్ళి ఎందుకు చేసావు అనిపిస్తుంది. పెళ్ళి అయిన మూడునెలలకే గర్భం వచ్చి తన పై ఆరళ్ళు, వత్తిళ్ళు తట్టుకోలేక నిలవలేదు. దానికి మళ్ళీ క్లీనింగ్, మందులు. ఇలా పాపం పెళ్లయి రెండేళ్లు అవలేదు పడ్డ బాధలు ఇన్నీ, అన్నీ కావు. ఇప్పుడు ఆ భర్త హాస్పిటల్లో రేపో మాపో అని వున్నాడు. ఈ ఆఫీసర్ ఇలా లంచం పుచ్చుకు వాడి చేతుల్లో పెట్టేస్తే ఈమెకి ఓ అయిదువందలు ఇస్తాడు. అక్కడే ఉన్న మరో యూడీసీకి ఓ వెయ్యి ఇచ్చి మిగిలింది వాడు మింగేస్తాడు. వాడు సీన్‍లోకి రాడు. ఎందుకంటే వాడిది పెర్మనెంట్ ఉద్యోగం. దొరికితే జాబ్ పోతుంది. ఇలా తనకింద పనిచేసేవాళ్ళని వాడుకుని వాడి పనులు చేసుకుంటాడు” అని అక్కడి భాగోతం అంతా వివరించి తన బస్ రావటంతో వెళిపోయింద” లక్ష్మి ఫ్రెండు.
అంతా విని సీత లక్ష్మీతో “నిజమే కదా! నాకు ఉద్యోగం ఉండి నేను ఇంతలా ఆర్థికంగా నలిగిపోతున్నాను. పాపం ఆ అమ్మాయి మరెంత బాధపడుతోందో” అంది బాధగా.
ఔనన్నట్లు తలవూపింది లక్ష్మి.
హాస్పిటల్‍కి వెళ్లే బస్ రావటంతో ఇద్దరూ ఎక్కేసారు.
లక్ష్మిని హాస్పిటల్లో ఉంచి మర్నాడు సీత డబ్బుపట్టుకు వెళ్ళింది.
రుక్మిణి ఎదో ఫైల్ చూస్తోంది. సీతని చూసి ఏమిటి సంగతి అన్నట్లు చూసింది. సీత చుట్టూ చూసి డబ్బు తెచ్చినట్లు సైగ చేసింది.
రుక్మిణి లేచి సీతనికూడా రమ్మని ఆఫీస్ బయట క్యాంటీన్‍కి నడిచింది. అప్పుడే లంచ్ విరామం అయి అంతా వెళిపోయారు. అక్కడ పెద్దగా ఎవరూ లేరు. అక్కడ ఓ టేబుల్‍దగ్గర కూర్చున్నాక సీత డబ్బు రుక్మిణి కిచ్చింది.
రుక్మిణి డబ్బు తీసుకుని అందులోంచి ఓ ఐదువందల నోట్ తీసి, “మేడమ్ మా ఫ్రెండ్ నిన్న చెప్పింది. మీరు చాలా బాధల్లో ఉన్నారని. నేను మీకు ఏమీ తగ్గించే వీలులేదు. ఒక్కపైసా తక్కువ తీసుకుంటే మా ఆఫీసర్ ఒప్పుకోడు. నన్ను అయిదు వందలు ఉంచుకుని మిగిలింది తనకిచ్చెయ్య మంటాడు. అందుకే నాకు అతనిచ్చే ఆ అయిదువందలు మీకు నేను తగ్గిస్తున్నాను. సారీ! మీకింతకన్న నేనేమీ చేయలేను” అంది.
సీత మనసు ద్రవించిపోయింది. ఆమె ఉన్న పరిస్థితిలో పాపం తనకొచ్చే ఈ అయిదువందలు వద్దనుకుని తన బాధని అర్ధంచేసుకోగలిగే ఔదార్యం ప్రదర్శించింది ఆమె. తనకన్నా ఆమెలో ఎన్నోరెట్లు ఔన్నత్యం కనిపించింది.
“వద్దమ్మా! నువ్వు ఉంచుకో. నాకూ నీ పరిస్థితి తెలిసింది. ఈ ఆఫీసర్‍తో నువు పడుతున్న బాధ నాకు తెలిసింది. ఇక్కడ ఎందుకుగానీ నాకు తెలిసిన ఒక ప్రైవేట్‍కాలేజీలో టైపు బాగావచ్చినవాళ్ళు కావాలి ఆఫీస్ పనిచేయడానికి అని అడిగారు. ఆరువేలు ఇస్తాము, ఎవరినయినా చూడండి అన్నారు. నీవు ఒకసారి వెళ్ళి కలవు. ఆ కాలేజీకి మీ ఇంటినుండి డైరెక్ట్ బస్ ఉంది. వీలయినంత త్వరగా వెళ్ళు. మళ్ళీ వేరే ఎవరయినా చేరిపోవచ్చు ఆలస్యం చేస్తే. ప్రయత్నించమ్మా” అని లేచింది లక్ష్మి.
“ఈ వెయ్యి ఉంచుకో. ఇవి నీకు నేను ఇస్తున్నాను. అందులో కలపకు” అని మరో వెయ్యి రుక్మిణికివ్వబోయింది.
రుక్మిణి వద్దు అని వారించి “మీరే చాలా బాధల్లో వున్నారు. వద్దు మేడమ్” అంది.
సీత “పరవాలేదు తీసుకో. నేను అలాటి బాధలో వున్నాను కాబట్టీ నీ పరిస్థితి అర్ధం చేసుకోగలిగాను. అయినా బిల్ పాసై నాకు డబ్బు వస్తుంది.
ఈ వెయ్యితో నీ కష్టం తీరదు. కానీ నాలాగే బాధపడే నీకు ఏమీ చేయలేదే అనే నా బాధకు చిన్న ఉపశమనం అమ్మా!” అంది.
“థాంక్ యు మేడమ్!” అని రుక్మిణి ఆఫీస్‍లోకి నడిచింది.
“కనబడేది చూసి తీర్పు ఇచ్చేస్తాం. నాణెం రెండోవైపు ఏముందో మనకి తెలియదు కద! .పాపం ఈ అమ్మాయికి ఇంత చిన్నవయసులో ఎంత కష్టం పాపం.” అనుకుంది సిత.
సీత భర్త పోవటం, తరవాత కార్యక్రమాలు అన్నీ అయిపోయి మళ్ళీ రెండునెలల తరువాత ఉద్యోగంకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆరోజు ఆఫీస్ అయిపోయాక దగ్గరలో ఉన్న రైతుబజార్లో కూరలుకొంటున్న సీతకు రుక్మిణి ఎదురైంది.
“బావున్నారా మేడమ్!” అని పలకరించి “థాంక్ యు మేడమ్. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను. మీరు చెప్పిన కాలేజీలో చేరాను. యాజమాన్యం పని సరిగాచేసేవాళ్లని చాలా బాగా చూసుకుంటారని అర్ధం అయింది నాకీ కొద్దిరోజుల్లోనే. ఎనిమిదివేల ఇస్తున్నారు. మీరు చెప్పగానే వెళ్ళి వారిని కలిసాను. నన్ను బాగా పరీక్షించాకా జాబ్‍లో చేరిపోమన్నారు. నా భర్త పరిస్థితి చెప్పి కాస్త గడువు అడిగాను. వారు అక్కరలేదమ్మా, చేరిపో. ఇప్పుడు వేసవిసెలవులే కనుక మీవారు కుదుటపడేవరకు ఒక పూట చెయ్యి అన్నారు. నేను జాబ్‍లో చేరిన వారానికే మావారు పోయారు. దినవారాలు ఆయాకా నేను మరి సెలవు తీసుకోలేదు. జాయిన్ అయిపోయాను. ఆర్ధికంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను మీ దయవలన. చాలా థాంక్స్ మేడమ్ మీకు అంది” భర్త పోయిన బాధ, కృతజ్ఞత రెండు కలిసిపోయి నీళ్ళు
నిండిన కళ్ళతో.
“నా భర్తకూడా పోయారమ్మా. కలిసి రాము కదా, కలిసి పోటానికి. ఏమి చేస్తాం? ఈ యాజమాన్యం మంచిది అని నేనూ విన్నాను. జాగర్తగా పనిచేసుకో. కాలమే గాయాలు మాన్పుతుంది” అన్నాను భారంగా నిట్టూర్చుతూ.
“అంతేనండీ, వస్తాను” అని సెలవు తీసుకు వెళిపోయింది.
“పట్టుమని పాతికేళ్ళు లేవు. దిక్కు మొక్కు లేరు. అప్పుడే ఎన్ని చేదు అనుభవాలో పాపం ఈమెకి. ఈ అమ్మాయిని చల్లగా చూడు దేముడా!” అని మనసులోనే ప్రార్ధించాను.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.