వసంత ఆరోజు పొద్దుటే ఫోన్ చేసి చెల్లెలు వేద దగ్గరికి వచ్చింది. వేద వయస్సు యాభై పైన. ఓ అయిదేళ్ల క్రితం భర్త సంతోష్ ఆక్సిడెంట్లో పోయాడు. అప్పటికే ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు విక్రమ్, టీనేజ్‌లో అడుగుపెడుతున్న రెండో కొడుకు విశ్వాస్ తల్లిని జాగ్రత్తగా చూసుకొన్నారు. భర్త పోయినప్పటినుండి, వేద ఎక్కడికీ రావడం మానేసింది. భర్త అకాల మరణాన్ని భరించలేకపోయింది. ఎంత బతిమాలినా, బలవంతపెట్టినా వచ్చేది కాదు. అప్పుడప్పుడు తల్లి, తండ్రి, తోబుట్టువుల బాధని చూడలేక వచ్చినా, ఎవరితో కలిసేది కాదు. ఇంకా దుఃఖంలోనుంచి తేరుకోనట్టుగానే ఉండేది. ఆమె ఏకాంతప్రియత్వాన్ని అందరూ ఆమోదించారు. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం అనుకొని వేద మనస్సు సర్దుకుంటుంది అని అందరూ వేచి ఉన్నారు.
పిల్లలిద్దరూ హాస్టల్స్‌లో ఉండి చదువుకోవడంతో, వేద తన సైంటిస్ట్ ఉద్యోగం చేసుకుంటూ అందులో పూర్తిగా మునిగిపోయింది. పిల్లలుకూడా వాళ్ళ పరిధిని పెద్దగా పెంచుకోలేదు. స్కూలు, కాలేజీ తప్ప మరో ప్రపంచం లేకుండా తయారు అయ్యారు. వేద చాలా సెన్సిటివ్‌గా అయ్యి, ప్రతీ చిన్న విషయానికి ఇరిటేట్ అవుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు. పిల్లలిద్దరూ కూడా ఆమెను నొప్పించే పనులేమీ చేయరు. చాలా సపోర్ట్ చేశారు. విక్రమ్ పెళ్లి క్రిందటి సంవత్సరం అయ్యింది.
విక్రమ్ ఈమధ్యనే ఫోన్ చేసి “పెద్దమ్మా ! ఒక్కసారి అమ్మతో మాట్లాడు. తాను ఏదో వ్యధను కల్పించుకొని, తనను తానే హర్ట్ చేసుకుంటుంది, మమ్మల్ని కూడా పదే పదే హర్ట్ చేస్తుంది. మేమెంత సర్దుకున్నా, తాను విసిరే మాటలు పెద్ద గాయాలే చేస్తున్నాయి. మా అందరికీ పెద్దదానివి, కొంచెం అమ్మకి అర్ధమయ్యేటట్టు చెప్పు, ప్లీజ్ పెద్దమ్మా!” అన్నాడు. ఆ పని మీదే ఈరోజు వేద దగ్గరికి వచ్చింది. భోజనాలు అయిన తర్వాత నాలుగు మాట్లాడుకుందాం అని మంచంమీద కూర్చోపెట్టింది వసంత.
వేదకి కాస్త సినిమాలు అంటే ఇష్టం ఉండేది. అమెజాన్ ప్రైమ్‌లో కొత్త సినిమాలు దగ్గర మొదలుపెట్టి, ఈ మధ్యనే రిలీజ్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా దగ్గర ఆగారు. “ఆనర్ కిల్లింగ్” చాలా దారుణం అన్నది వేద.
“అవును, ఎవరి గౌరవార్ధం ఈ హత్యలో” అని నిట్టూర్చింది వసంత.
“ఇవన్నీ చట్టపరిధిలోకి వచ్చే నేరాలు. ధన, ప్రాణ, మాన హాని జరిగినట్లయితే ప్రభుత్వం నేరంగా గుర్తిస్తుంది. అహంకారంతో, సాంప్రదాయకంగా కుటుంబంలో జరిగే మానసిక హింసని, చట్టమూ, సమాజమూ గుర్తించదు. ముఖ్యంగా మనదేశంలో. సానుభూతి చట్రంలో బిగుసుకొని, సెల్ఫ్పిటీతో, జీవితం నాశనం చేసుకున్నవాళ్ళు ఎందరో” అన్నది వసంత.
ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది వేద.
కొంచెం ముందుకు వంగి వేద చేతిమీద చేయి వేసి, “ఏమైంది?” అని అడిగింది.
చాలాసేపు మాట్లాడకుండా అలాగే నిశ్చలంగా కూర్చుని, తర్వాత తనే మొదలుపెట్టింది మాట్లాడడం వేద.
“ఈమధ్య చాలా నిస్సత్తువగా ఉంటోంది అక్కా, జీవితం అంతా ఆగిపోయినట్టుంది. నామీదే నాకు కోపం. పిల్లలమీద కోపం. చాలా చిరాకు. ఎవరు పలకరించినా కరుగ్గా మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళని హర్ట్ చేయాలనిపిస్తుంది. నేను ఏమైనా అనేస్తానేమో అని అందరూ భయపడుతూంటే ఏదో తృప్తి. అంతలోనే, ఎవరిని ఏమనేసి, ఏ ఉపద్రవం తెచ్చుకొంటానో అని భయం. విక్రమ్, విశ్వాస్ ఇద్దరూ ఫోన్ చేస్తారు. సరదాగా మాట్లాడుదామని అనుకొంటారు. నేనేదో అనగానే, హుషారు అంతా మాయం అయిపోతుంది. అసందర్భంగా కాల్ కట్ అయిపోతుంది. నాలో నాకే అసంతృప్తి… ఈ ఒంటరి జీవితంపట్ల” అంది. మాట్లాడుతూ, మాట్లాడుతూ… అలాగే నిద్ర పోయింది. వేద తల నిమురుతూ ఆలోచనలో పడింది, వసంత.
ఆమెకి సమస్య కొంచెం అర్ధమయ్యింది. కొన్ని సంవత్సరాలుగా ఒంటరిజీవితం, భర్తతో వియోగం, పిల్లలు తనని అర్ధం చేసుకోవట్లేదేమో అనే అనుమానం, అయిన వాళ్లందరూ జీవితంలో బిజీ అయిపోయి, తనకు సమయం ఇవ్వలేరేమో అనే సందేహం, అందరూ వారివారి జీవితాల్లో సంతోషంగా ఉంటే, తనకే ఎందుకిలా అయ్యిందని బాధ. ఎదుటివాళ్ళ ఆనందానికి తాను ఆటంకమేమో అనే భయం…వీటన్నిటితో బాధపడుతూ, తనని తానే ధ్వంసం చేసుకుంటోంది. ఇలా ఆలోచిస్తూ తనుకూడా నిద్రపోవడానికి ప్రయత్నించింది వసంత. ఆలోచనలు ఆగలేదు.
అంతర్గతంగా ఉన్న వ్యధ తినేస్తోంది వేదని. చిన్నప్పటినుండీ ఎంతో బాగా చదువుకుంది. సీనియర్ అయిన సంతోష్ సంబంధం వచ్చింది. ఒకర్నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొన్నారు. ఉద్యోగరీత్యా కాస్త ట్రాన్స్ఫర్లతో బాధపడినా, ఇద్దరు పిల్లలతో చక్కగా కనిపించేవారు. అలాంటిది అతను అకస్మాత్తుగా పోవడంతో ఖేదంలో పడిపోయింది. పూర్తిగా… తాను, కుటుంబంతోసహా! కుటుంబం చుట్టూ మహాదుఃఖంతో కోట కట్టింది. ఈ కోట ఎలా పడగొట్టడం? ఇందులో పడి తాను, పిల్లలు ఊపిరి అందకుండా అల్లాడుతున్నారని తెలియట్లేదు. కొత్తగా జీవితం మొదలుపెడుతున్న పిల్లలు ఈ దుఖఃపు ఒరవడిని ఎలా తట్టుకుంటారు? లాభం లేదు, వేదతో మాట్లాడాల్సిందే. అనుకొని పక్కకు తిరిగి పడుకొంది.
సాయంకాలం టెర్రస్మీదకి వెళ్ళింది. చుట్టూ కుండీలు ఓ నూటయాభై ఉండి ఉంటాయి. ఎన్నో మొక్కలు, అన్నీ ఎండిపోయి చచ్చిపోయాయి. ఓ నాలుగు రోజులు పని చేస్తే గాని, సరయిన తోట తయారవ్వదు… అనుకొని నిట్టూర్చింది వసంత.
కాఫీ పట్టుకొని మేడ మీదకి వచ్చింది వేద, “అక్కా! నేను మారాలని అనుకుంటున్నాను, కాస్త సహాయం చేయి” అని అడిగింది.
“ముందు నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్నది” అన్నది వసంత.
“ఏదో శూన్యం అక్కా! సంతోష్ పోయిన తర్వాత పనితో ఆ లోటుని పూరించుకోవాలని అనుకొన్నాను. ఎంతో పని, పిల్లల్ని పట్టించుకోకుండా చేశాను. మామూలుగాకూడా పనిలో ఎప్పుడూ ముందుండేదాన్ని. ఇంటికి వస్తే అంతా ఖాళీ, అందుకే ఇంకాస్త వుద్యోగంలో కూరుకుపోయాను. ఆ మాటకు వస్తే సంతోష్ ఉన్నప్పుడు కూడా మాకు కుటుంబజీవనం తక్కువ. మా ఇద్దరిదీ వీకెండ్ సంసారం, ఇద్దరివీ వేరువేరు ఊర్లు, సెలవులకి ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు. డబ్బు ఖర్చు అని కొంత, ఆఫీసులో మా పని ఎవరైనా ఎత్తుకుపోతారని కొంత. హోమ్‌లోన్ తీర్చుకోవడం, పిల్లలకు ఆస్తులు సమకూర్చుకోవడం వీటితోనే సరిపోయింది. అయినా ఒకరికి ఒకరు ఉన్నామనే ధీమా, నలుగురికన్నా, ఆ మాటకి వస్తే మీ అందరికన్నా కూడా బాగా సంపాదిస్తున్నామనే గర్వం. సిబ్లింగ్ రైవల్రీ. ఇవన్నీ ఎప్పుడూ ఇలా చెప్పాల్సి వస్తుందనిగానీ, అసలు ఇలాంటి స్థితి వస్తుందనిగానీ అనుకోలేదు. చాలా పర్ఫెక్ట్ చిత్రం మా కుటుంబం అనే భ్రమలో ఉండేవాళ్ళం నేను, సంతోష్”
“…”
“ఇద్దరం విడివిడిగా ఉండడం వలన పిల్లలు వాళ్ళవాళ్ళ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఈ ఇద్దరి వేరువేరు ప్రపంచాలలోకి తొంగిచూడలేక నేనొక ప్రపంచం తయారుచేసుకున్నాను. మీ అందరినీ దూరం చేసుకొన్నాను. ఎంత దూరం జరిగితే అంత గొప్పదాన్ని అనుకున్నాను. నా రీసెర్చ్ అసిస్టెంట్లు, సహోద్యోగులు, వచ్చే ప్రశంసలు ఇవే జీవితం అనుకొన్నాను. విక్రమ్ పెళ్లి అయిన తరువాత రాగిణి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి వచ్చింది. నన్ను తల్లిలా ప్రేమగా చూసింది. నేనే ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. మాట్లాడలేదు. అయినా విక్రమ్ ఏమీ కంప్లైంట్ చేయలేదు. నా బుర్రకి ఆ అమ్మాయి అణకువ, ప్రేమ అర్ధం అయ్యాక ఇప్పుడు మాట్లాడాలంటే బెదురు. కాకపోతే నా అహం అడ్డొస్తుంది. ఏం చేయమంటావక్కా? ఏ కొంచెం సరదా మనస్సుకి కలిగినా సంతోష్‌కి ద్రోహం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ బాధ నుండి నాకు విముక్తి లేదనిపిస్తుంది ” అని ఆగింది వేద.
“నీ బాధ అంతా అర్ధం అవుతోంది వేదా! నువ్వు గట్టిగా ఇందులోనుండి బయటపడాలని అనుకుంటే నీవల్ల జరుగుతుంది. అయినా ఇప్పటికిప్పుడు ఇదంతా సర్దుకోవాలంటే కూడా కష్టం కదా! పద డిన్నర్ తయారు చేసుకొందాం” అన్నది వసంత.
క్వినోవా పొంగలి చేసుకొని శనివారం ముగించారు ఇద్దరూ. మర్నాడు ఆదివారం, రిలాక్స్డ్గా లేచి బ్రెడ్‌తో అల్పాహారం ముగించి కూర్చున్నారు అక్కా చెల్లెళ్ళు. “లంచ్ ఏం తిందాం అక్కా?” అని అడిగింది వేద. “ఈరోజు స్విగ్గి చేసుకొందాం” అంది వసంత. ముందురోజు సంభాషణతో కొంచెం మనసు సర్దుకొన్నదేమో నవ్వి “ఓకే!” అన్నది వేద.
“పిల్లలు ఎలా ఉన్నారు?” అని అడిగింది వేద. “బాగున్నారు వేదా! నిన్ను అడిగామని చెప్పమన్నారు ” అన్నది వసంత.
“ఈ మధ్య ఏమైనా పుస్తకాలు కొన్నావా?” అని అడిగింది వసంత. తల దించుకొని కూర్చుంది వేద ఉలుకు, పలుకు లేకుండా! ఏదో ఆలోచన, మొహం దుఃఖంతో నిండి పోయింది.
“లేదక్కా! సంతోష్ పోయిన దగ్గరినుండి, పుస్తకం ముట్టుకోలేదు” అన్నది.
వసంత వేదని దగ్గరికి తీసుకొని, “ఈ ఒత్తిడి నుండి బయటపడు వేదా! సమస్తమైన దుఃఖాలకు, మంచి పుస్తకం, సత్సాంగత్యం, డైరీ రాసుకోవడం ఉపశమనాన్నిస్తాయి. సంతోష్‌ని నువ్వు మర్చిపోయావేమో అని ఎవరూ సందేహించరు. అతను లేకపోవడం నీ వ్యక్తిత్వలోపం కాకూడదు. ప్రపంచానికి, నువ్వు అసంపూర్తిగా కనపడాల్సిన అవసరం లేదు. ఒంటరిని హింసించే గుణం మన సమాజంలో ఉంది. నిస్సహాయంగా కనిపిస్తే హింసించాలనే మానవప్రవృత్తి సహజం. ఆ సహజత్వాన్ని ఆమోదించనూ అక్కర్లేదు. మనల్ని మనం హింసించుకోనూ అక్కర్లేదు. తిరస్కారాన్ని భరించే శక్తి నీకు లేదని అనుకోను. నీలో నువ్వు ముడుచుకొని, నీ పిల్లలని నీ ప్రేమనుండి వంచించకు. ఒక చిన్న పొదరిల్లులా ఉన్న నీ కుటుంబం చెదిరిపోతూ ఉంటే, విక్రమ్ బాధపడుతున్నాడు. కుటుంబపెద్దగా బాధ్యత పంచుకో. విక్రమ్, రాగిణిల ఆనందమయ సంసారం చూస్తూ నువ్వూ సంతోషంగా ఉండు. ఈ రోజుల్లో పిల్లల సంతోషమయ జీవితాన్ని దగ్గరినుండి చూసే అదృష్టం అందరికీ దక్కటం లేదు. దానికి వివిధ కారణాలు. ముందు నిన్ను నువ్వు నిలబెట్టుకో. ఆర్ధికంగా కాదు, హార్దికంగా. నువ్వు ఇచ్చే ఆస్తులకన్నా నీ పలకరింపు నీ పిల్లలకి ఆత్మ స్థైర్యం కలిగిస్తుంది. ఇలా చెద పట్టిన శిధిలభవనంలా కాకుండా, నిన్ను నువ్వు పునర్నిర్మించుకో. నీకింకా ముందు ఎంతో జీవితం ఉంది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్లతో కుటుంబం విస్తృతం చేసుకో. ముభావంగా ఉండడం, భర్తో, భార్యో పోతే ఏదో అనర్హత, న్యూనత అనుకోవడం మానుకో. నీ భుజాల మధ్య, నీ ఒడిలో పిల్లలకు దొరికే నిశ్చింతని వాళ్ళకి కరువు చేయకు. ఎలాంటి సందేహాలు లేకుండా నీ జీవితాన్ని ఆహ్లాదభరితంగా చేసుకో. బాధ్యతలనుండి మొహం తిప్పుకోకు. బాధ్యతంటే ఎల్లవేళలా నీ బ్యాంకు బ్యాలెన్స్ అంతా పిల్లలకు పంచడం కాదు” కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది వసంత.
మొహంలో ఎలాంటి చిరాకు లేకుండా వింటున్నది వేద. ఆకళింపు చేసుకుంటున్నట్లుగా కనబడుతున్న ఆమె మొహంలో ప్రశాంతత వసంతకి రవ్వంత ఆనందాన్ని కలిగించింది. ముప్పయ్యేళ్ళుగా అనుభవం వున్న ఆ సైకాలజీ ప్రొఫెసర్‌కి వేదలో కనిపిస్తున్న స్వీకృతి ఆనందాన్ని కలిగిస్తున్నా, ఇది అప్పటికప్పుడు ఏర్పడిన మార్పు అని, ఇలాంటి సమావేశాలు ఎన్నో అయితేగాని వేద ఈ ఆత్మన్యూనతలోనుండి, ఆత్మగ్లానిలోనుండి బయటపడదనే విషయం వసంతలోని సైకాలజిస్ట్‌కి తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి వారిలో వ్యక్తిత్వం చాలా బలం గా ఉంటుంది. నిరంతరం తమ వాదన నిరూపించుకోవడానికి, తమదే అత్యంత బాధాకరమైన జీవితమని బలంగా నమ్ముతారు. వేద విషయంకూడా అంతే. సంతోష్‌ని ఎంతో ప్రేమించింది. అతనితోటి జీవితం తనివి తీరకుండానే ఒంటరి అయ్యింది. ఆ ఒంటరితనం వివిధరకాల అనుభవాలను, నిరాశను కల్పించింది. వాటన్నిటికీ పరిష్కారమార్గంగా తనని తానే బాధించుకోవడం, కరుగ్గా మాట్లాడడం అలవాటుచేసుకుంది. మనస్సుతో కల్లోలాన్ని ఆహ్వానించింది. ఇప్పుడు ఆ తుఫానులో కొట్టుకుపోతుంది. దరి చేరడానికి ఎంత సమయం పడుతుందో అనుకొంది.
కొంతకాలం సెలవుపెట్టించి తనతో తీసుకువచ్చింది. వేద కొడుకు విక్రంకూడా భార్య రాగిణితో వచ్చాడు. తల్లితో కొంత సమయం ఆనందంగా గడిపాడు. వేద మనసులో ఏముందో తెలియదుగానీ వాళ్ళతో సంతోషంగానే గడిపింది. కోడలితో కారమ్స్ ఆడింది. కొడుక్కు ఇష్టమని బిరియాని చేసి పెట్టింది. కొడుకు, కోడలు వెళ్లిపోతుంటే, దారిలో తినడానికి మురుకులు చేసి ఇచ్చింది.
వాళ్ళు వెళ్ళాక వేద కూడా రెండురోజులుండి ఇంటికి చేరింది. ప్రతిరోజు వసంతతోటి మాట్లాడటం మొదలుపెట్టింది. మెల్లగా మెడిటేషన్ సెంటర్లో చేరింది. చిన్నప్పటి హాబీ క్రోషియా మొదలుపెట్టింది. ప్రతివారం లైబ్రరీకి వెళ్లి పుస్తకాలమధ్య కొంచెంసేపు గడపడం అలవాటు చేసుకుంది. వారంలో డాబామీద ఉన్న మొక్కలు మార్పించింది. ఓ నెలరోజులు గడిచాక, ఉగాది వస్తూ ఉంటే, రాగిణి ఫోన్ చేసి, “వస్తాం అత్తయ్యా!” అని అడిగింది. తప్పకుండా రమ్మని చెప్పింది వేద. ఆ ఉగాది ఎన్నో సంవత్సరాల తర్వాత వేద ఇంట్లో పండగ. కొడుక్కీ కోడలికీ కొత్తబట్టలు కొన్నది. తాను కూడా మంచి జరీచీర కొనుక్కుంది. విశ్వాస్‌తో వీడియో కాల్, ఉగాది పచ్చడి, పులిహోర, బొబ్బట్లతో ఆనందంగా గడిచింది. ఉగాది అయిన తరువాత, బయల్దేరుతూ “నా దగ్గరికి ఎప్పుడు వస్తావు?” అని అడిగాడు విక్రమ్.
“శ్రీరామనవమికి లాంగ్ వీకెండ్ వస్తుంది. అప్పుడు వస్తాను నాన్నా!” అన్నది వేద నవ్వుతూ.
ఫోన్ చేసి అక్క వసంతతో తన మార్పును ఆస్వాదిస్తూ… ఆహ్లాదంగా మాట్లాడుతోంది. చిన్నచిన్న సూచనలు సలహాలు ఇస్తూ వసంత, వేద పోరాటాన్ని, తనని తానే గెలవటానికి చేసే పోరాటాన్ని గమనిస్తూ, మధ్య మధ్యలో సహాయం చేస్తూ వేదని కాచుకొంది. సెలవులకు భయపడే వేద ఇప్పుడు వీకెండ్ కోసం ఎదురుచూస్తూ కొడుకు దగ్గరకు వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తూంది.
తరచుగా మాట్లాడుతున్నా, వేదని కలవడానికి ప్రయత్నించలేదు వసంత. చెల్లెలు తనంతట తానే ఈ మానసికస్థితినుండి బయటకు వచ్చి కుటుంబంతో అనుసంధానం కావాలని ఆశించింది. కొన్ని నెలల తరువాత, తన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకి, సంతోష్ అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకి, చిన్నపార్టీ ఇచ్చింది వేద విక్రమ్ ఇంట్లో, విశ్వాస్ ఎం.స్. పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన సందర్భంగా.
వేద మొహం లో కనబడుతున్న నిశ్చింత, విక్రమ్, రాగిణి కళ్ళల్లో కనిపిస్తున్న సంతృప్తి, విశ్వాస్ నవ్వులో కనిపిస్తున్న సంతోషంలో వేద కుటుంబం సంపూర్తిగా కనిపించింది వసంతకి.
ఎంతమంది పిల్లల్లో తల్లిదండ్రుల గురించి, వారి మానసిక సమస్యలు వాటి పరిష్కారమార్గాలు, ఆరోగ్యసమస్యలు గుర్తించే ఆలోచన, పరిణితి ఉంటుంది? సరైన సమయానికి, విక్రమ్ తెలియచేసాడు కాబట్టి, వేదకూడా సలహా వినడానికి, సమస్యని అర్థం చేసుకోవడానికి, ప్రయత్నించింది కనుక, సులువుగా తేలిపోయింది. ఇలా ఎంతమంది నిష్కారణంగా తమకు తామే హాని తల పెట్టుకుంటున్నారో అనుకొని నిట్టూర్చింది వసంత.
పేరు: శైలజా రాంషా
నివాసం: హైదరాబాద్
కార్పొరేట్ ఉద్యోగం
చదువు: తెలుగు సాహిత్యం లో B.A.
అమ్మ సాహిత్య ప్రయాణంలో తోడు వెళుతూ హాజరైన అనేక సాహితీసభలనుండి అందుకున్న చిన్నచిన్న మెరుపులతో సాహిత్యంపట్ల అభిలాష పెరిగింది. కొన్ని సంవత్సరాల జాతీయ పోలీసు అకాడెమీ వుద్యోగం, అక్కడి గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు కధలు వ్రాయాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్నగారు, శ్రీవారి ప్రోత్సాహంతో వ్రాయడం మొదలైంది. పత్రికలు ప్రచురించడం మొదలైనప్పటినుండీ మామయ్య కళ్ళల్లో కనిపించిన ప్రశంస, అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ప్రైడ్, బైలైన్లో పేరు చూసుకొన్నప్పుడు కలిగిన సంతోషం ఇంకా వ్రాయాలనే ఆలోచనను పెంచాయి అంటారు శైలజా రాంషా. వీరి కధలు, వ్యాసాలూ, కవితలు వివిధపత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు ఆన్లైన్
ఫోరమ్‌లలో కధలు, బ్లాగులు ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్న చిన్న బహుమతులు గెలుచుకొన్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.
పలు ఆన్లైన్ ఫోరమ్‌లలో కధలు, బ్లాగ్స్ ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్నచిన్న బహుమతులు గెలుచుకున్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.