ఆమె కనులు మూసుకుని ముందుకు పోతోంది. వెచ్చని గాలి సముద్రం మీద నుంచి ఉప్పుని మోసుకుంటూ బరువుగా వీస్తుంది. సాయంత్రం దాటి, రాత్రి అవుతోంది. బహుశా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపిన సంధ్య ఇలానే ఉండేదేమో, పూర్తి చీకటికాక, కనిపించేటంత వెలుగు కూడా లేక. ఇసుకలో అడుగులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆటో ఇంత వరకూ రాదని చెప్పాడు ఆటోవాడు. ఊరికి చాలా దూరంగా ఉందని రెండొందలు ఎక్కువగానే ఇచ్చింది వాడు అడగకుండానే. సముద్రమంటే ఆమెకు చాలా ఇష్టం. అది కూడా పౌర్ణమి రోజున సముద్రతీరంలో నడవడం అంటే మరీన్ను. జన ప్రవాహానికీ, రోజూవారీ రద్దీ జీవన ప్రళయానికీ దూరంగా చిక్కటి చీకటిలో కేవలం తనూ, చంద్రుడూ మాత్రమే సముద్రపు ఒడిలో ఊసులాడుకోవడం, ఊహలు పంచుకోవడం ఇష్టం. చిన్నప్పటినుంచీ అదే వరస. వాళ్ళ నాన్న రేవుకి పోయేటప్పుడు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటి వరకూ ఉండేది.
నాన్న కోసం ఎదురుచూడ్డం ఎంత ఇష్టమో, సముద్రపు అంచుల వెంబడి సుదీర్ఘ వ్యాహ్యాళులన్నా అంతే ఇష్టం. నాన్న తెచ్చిన వేటలో పెద్ద చేప తనకోసమే అని నాన్న అన్నప్పుడు తనెంత ప్రత్యేకమైనదో అని మురిసిపోయేది. అలానే చదువులో కూడా చాలా చురుకుగా ఉండేది. ఏడో తరగతిలో మండలం ఫస్టు అని నాన్నకి ఎవరో చెప్పారంట, వెంటనే ఆ రోజు వేట అంతా అందరికీ పంచేశాడంట, పక్కింటామె అప్పట్లో చెబితే ఆశ్చర్యంతో, ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చేశాయి.
నడక ఆపేసి ఒక ఎత్తైనచోట కాళ్ళు చాపుకొని కూచుంది ఇసుకలో. సముద్రం ఒక అలను పంపింది. సుతారంగా, అంత ఎత్తుకు కూడా, ఎన్నో రోజులకి కలిశామన్న ఆనందంతో కాబోలు.
పదో తరగతి వరకు జిల్లా పరిషత్ స్కూల్లో చదివింది, రోజూ బస్సులో వెళ్ళొచ్చేది. ఒక్కటే బస్సు రావడానికి, పోవడానికి. బస్సు తప్పితే ఆ రోజు సెలవే. కానీ, బస్సు ఎప్పుడూ తప్పనివ్వలేదు నాన్న. నాన్న తపన తనను చదివిద్దామని కాదు, గొప్పదాన్నేదో చేద్దామనీకాదు, ప్రేమ, కేవలం ప్రేమ. ఆమెకి చదువంటే ఇష్టం. నాన్నకి అదంటే అంతకన్నా ఇష్టం. అంతే, అదే కారణం అంత తాపత్రయపడ్డానికి. జిల్లా మొదటి మార్కు పదో తరగతిలో, ఆ రోజు కలెక్టరు చేతుల మీదుగా ప్రైజు తీస్కుంటుంటే నాన్న కళ్ళల్లో ఒక మెరుపు. అది చూసి చదువంటే ఇంకా ఇష్టం పెరిగిపోయింది.
చీకటి పడిపోయింది. చిన్నగా సముద్రం కాళ్ళని తడపసాగింది. ఆమె లేవలేదు. మెత్తగా తగులుతున్న నీళ్ళు, వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇసుకని కూడా మెల్లిగా తనతో తీసుకెళ్ళిపోతుంది. ఆ స్పర్శ కాళ్ళకు స్వాంతన ఇస్తుంది. బావుంటుంది చాలా, ఇలా ఎంతసేపున్నా అనుకొంది.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సముద్రం అక్కడికి కొంచెం దూరమే, కాకపోతే ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలు ఎప్పుడయిపోయాయో తెలీదు. సముద్రం గుర్తుకు రాలేదు, జ్ఞాన సముద్రంలో చేసిన యజ్ఞఫలం మాత్రం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు రూపంలో వచ్చింది. విశాఖపట్నం వెళ్ళాలి. వెళ్ళింది. చదువు మీద ఇష్టంతో కొంత, సముద్రం పై ప్రేమతో ఇంకొంత, నాన్న కళ్ళల్లో గర్వం కోసం మరికాస్తంత. తండ్రి మాత్రం వేట మానలేదు. వెళ్తూనే ఉన్నాడు, డబ్బు పంపడానికి, సంపాదించడానికీ కాదు, కూతురు దగ్గర లేని లోటు తీర్చుకోవడానికి. కూతురు తనకి కానీ ఖర్చు లేకుండా పెద్ద చదువులు చదువుతుంది. ఇంకే కావాలి ఈ జీవితానికి అనుకుని వేటకు వెళ్తూనే ఉన్నాడు.
పెద్ద అల పక్కనే ఉన్న రాళ్ళపై విసురుగా వచ్చి తగిలింది, పెద్ద శబ్దం చేస్తూ ఆమె పైకి కొన్ని తుప్పర్లను తుళ్ళిస్తూ.
ఆఖరు సంవత్సరం పరీక్షలైపోయాయి. క్యాంపస్ సెలక్షన్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. యధాతథంగా ఒక పెద్ద కంపెనీ పెద్ద మొత్తానికి ఉద్యోగం ఆఫర్ చేసింది ఆమెకి. సంతోషం పంచుకోవడానికి నాన్న లేడు. వేటకి వెళ్ళాడు, తిరిగిరాలేదు క్రితం సంవత్సరమే. కానీ, మనసు పాడు చేసుకోకుండా చదువుకొంది నాన్న కోసం, ఎక్కడ ఉన్నా ఆనందిస్తాడు తన ప్రగతి చూసి అని.
సముద్రం ఉప్పొంగి వరసగా అలలతో ఎగసింది. తను లేవలేదు అక్కడి నుంచి. నడుందాకా నీళ్ళు వచ్చాయి. తడిసిపోయింది పూర్తిగా. చంద్రుడు ఎర్రగా ఉన్నాడు కొంచెం, ఇప్పటిలా కాకుండా. భయం వేసింది ఆమెకు ఎందుకో. ఒంటరి దాన్నయిపోయాననిపించింది.
ఉద్యోగం కూడా ఏరికోరి విశాఖపట్నంలో వేయించుకొంది. సముద్రానికి దగ్గరగా ఉండొచ్చని. చదువుకొనేటప్పుడు సాధారణ యువ ప్రలోభాలకి దూరంగా ఉంది. ఇప్పుడూ అలాగే అనుకొంది. కానీ చదువు వేరు, ఉద్యోగం వేరు అని తెలుసుకొనేలోపు స్నేహితులు అనేవారు దగ్గరవసాగారు. కానీ, తను దూరం పెట్టింది. కానీ, మనసుతోడు కోరుకొంది. విప్పి చెప్పటానికి, ఊసులూ, ఊహలూ పంచుకోవడానికీ చంద్రుడు సరిపోవడం లేదు. వాడితో పరిచయం అయింది. అందరిలాంటివాడే, కానీ ఎందుకో ఇష్టం పెంచుకొంది ఆమె, మనసు పంచుకొంది ఆమె.
సముద్రం ఉధృతంగా మారుతుంది, అలలు కూడా ఎత్తు పెంచుకొన్నాయి. అప్పటికీ తడిసిన శరీరం, ఇంకా పూర్తిగా తడిసిపోతుంది. కింద ఇసుక, నీళ్ళతోపాటు వేగంగా లోపలికి పోసాగింది. అయినా ఆమె కదలలేదు.
సున్నితమైన భావోద్వేగాలు మనసుల్ని కలుపుతాయి, రాగరంజితమైన మనసులు, మనుషుల్ని దగ్గర చేస్తాయి. ఆమె ఎన్నో ఊహలు వాడితో పంచుకుంది. సర్వస్వం అతనే అనుకుంది, అతనికే అనుకుంది. గుడ్డిగా నమ్మానని ఈ రోజు ఉదయమే తెలిసింది, తన కొలీగ్ పంపిన లింక్ క్లిక్ చేసిన తర్వాత.
ఎప్పుడూ సెలవు పెట్టని ఆమె సెలవు పెట్టింది ఆఫీస్ కి. ఏవేవో రాయాలనుకుంది రూమ్ లో కూర్చొని, రాసింది, కానీ సిగ్గేసింది, బాధేసింది. భయం ఆ రెంటినీ పక్కకు తీసేసి మొత్తం మనసు ఆక్రమించుకొంది. భయం, జుగుప్సని తీసుకొచ్చింది, దానితోపాటు నిర్వేదాన్ని కూడా. నిర్వేదం ఆమెని ఇక్కడ ఇలా కూర్చోబెట్టింది. చిన్న కన్నీటి చుక్క కనురెప్పని అంటిపెట్టుకుని కింద పడదామా వద్దా అన్న సందిగ్ధంలో ఉంది. చంద్రుడు మసకబారాడు, కొంచెం కన్నీటివల్ల కొంచెం అప్పుడే పట్టిన మబ్బువల్ల.
పెద్ద అల తుఫాను వేగంతో పక్కనున్న బండరాళ్ళను ఢీకొట్టింది. ఇసుక వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. వీటితోపాటూ, ఆమె కన్నీటితోపాటూ.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.