తెల్లని పంచె, తెల్లని జుబ్బా, భుజంమీద ఒక తెల్లని తుండు, వేసుకుని…
“పొయ్యొస్తా మరి. నువ్వూ బేగొచ్చేయి…” అన్నాడు శీనయ్య, మంగతో.
“నువ్వెళ్ళులే మావా సంటోడు హాయిగా నిద్దరోతున్నాడు, బజ్జోనీ. నువ్వొచ్చేలోపు నీకోసం పచ్చిమిరపకాయల కారం నూరుంచుతా” అంది మంగి.
“లేదులేవే అయ్యగోరింటికే పోతా ముందు. ఇప్పటికే మండిపడతా ఉంటాడు నేనింకా పోలేదని” అని చెప్తూనే రబ్బరుచెప్పుల్లో కాళ్ళు దూర్చి బయల్దేరిపోయాడు శీనయ్య జెండాపండుగకి.
శ్రద్ధగా ఎగుర్తున్న జెండాకి సెల్యూట్ కొట్టి… జయహే అని అందరి కంటే గట్టిగా, మనసు మొత్తం పెట్టేసి మరీ పాడేసి… అక్కడోళ్ళు పంచిపెట్టే లడ్డూని ఒకటి తీసేసుకుని అయ్యగారింటికి లడ్డూ తింటూనే పరుగుపెట్టాడు శీనయ్య.
దొంగసచ్చినోడు పొగరు బాగా ఎక్కింది…పనుంది పట్నానికి పోవాలని తొందరగా వచ్చి తగలడమనీ నిన్ననే చెప్పా… మిడిగుడ్లేసుకుని చూస్తా నుంచున్నాడేకానీ ఏమీ మాట్లాడలా… అప్పుడే అనుకున్నా వీడు చెప్పినమాట వినేరకంకాదని…” దూరంనుంచీ వస్తున్న శీనయ్యని చూసే తిట్లందుకున్నాడు నరహరి.
“అయ్యా!” అన్నాడు శీనయ్య. విననట్లే ఉన్నాడు నరహరి.
“శాంతీ! కాఫీ తేవే, బయటకి పోవాలి నేను” అన్నాడు నరహరి. కాఫీ తాగాక లేచాడు. దువ్విన తలనే మళ్ళీ ఇంకోసారి దువ్వాడు. శీనయ్యవైపు చూసి, ఎదురుగా ఉన్న పెద్ద చీరలమూటని చూస్తూ “ఊ<” అన్నాడు మూటని తీసుకుని మొయ్యమన్నట్టుగా.
శీనయ్య మూట నెత్తికెత్తుకున్నాడు. చాలా బరువుగా ఉంది. చుట్టుపక్కల పది గ్రామాలనుంచీ చీరలు నేసి చేనేతకార్మికులు తెచ్చి నరహరికిస్తారు. ఒక్కఊరినుంచీ అయితే పట్టుచీరలుకూడా నేసి తెస్తారు. మూడునెలలకి ఓసారి అందరూ తెచ్చిచ్చిన చీరలన్నీ ఒకచోట మూట కట్టించి పట్టణంలో షాపులకి చేరవేస్తాడు నరహరి. చేనేతకార్మికులని మోసం అయితే చేయడుకానీ అహంకారం బాగా ఎక్కువ అతనికి. నోటికెంతొస్తే అంత అనేయ్యటమే.
శీనయ్య తరతరాల వారసత్వపు పనివాడు. నరహరి వంశానికి. అంటే శీనయ్య ముత్తాత, తాత, తండ్రి, ఇప్పుడు శీనయ్య పనోడు. నరహరి ముత్తాత తాత తండ్రి , ఇప్పుడు నరహరి యజమాని.
మాటంటే పడలేడు శీనయ్య. మాట అనకుండా ఉండలేడు నరహరి…
రచ్చబండ దగ్గరకి వచ్చాక అరుగు మీద కూచుంటూ శీనయ్యతో చెప్పాడు నరహరి.
“ఫో ఫో! ఇంటికి పొయ్యి బట్టలు మార్చుకుని రా ఫో..నువ్వూ నీ తెల్లబట్టలు…” శీనయ్యని ఈసడింపుగా అంటూ చుట్ట ముట్టించుకున్నాడు.
“ఎందుకయ్యా? ఏమయ్యింది ఈ బట్టలకి?” అని చెప్పబోతున్నాడు శీనయ్య.
“నోరుముయ్యరా కుక్కా చెప్పానుగా ఫో… చెప్పింది చెయ్యి” అన్నాడు ఇంకా పొగరుగా నరహరి.
“అయ్యా! మీరు సెయ్యమన్న పని, నేను సెయ్యాల్సిన పని… సీరలమూట మొయ్యటం. అది నేను బుద్దిగా చేత్తా… ఇయ్యాళ ఆగస్టు పదేను. నేను పెద్దపండుగ అనుకుని కొత్తబట్టలు కట్టినా. ఇయ్యాలంతా కొత్తవే వేసుకునుంటా” అన్నాడు శీనయ్య.
“అవునొరే! నువ్వూ నీ బాబే సొతంత్రం తెచ్చారురోయ్, నువ్వు పండుగ సేసేసుకోటానికి… ఎక్కువ వాగకురోయ్… పోయి చెప్పిన పని చెయ్” అన్నాడు తానూ పంతంగా, ఎగతాళిగా నరహరి.
“ఏందయ్యా ఇది? సిన్నపిల్లాడిలా పట్టు పడుతున్నావు. అస్సలు ఇయ్యాల శెలవు పెట్టేసి ఇంటికాడ మంగతో సేమ్యాలపాయసం సేయించుకొని తీపి తినాలనుకున్నా. నువ్వేమో పనుంది రమ్మనపడ్తివి. కాదనకుండా వచ్చినానా లేదా? ఇంక పా పని పూర్తి సేసుకుని వద్దాం” అన్నాడు శీనయ్య
“అయినా ఇయ్యాల దేసమంతా శెలవుదినంగందా నువ్వేడకీ నన్ను తీసుకెళ్తన్నావు? ఏ షాపుంటది ఇయ్యాల?” అని లాజిక్కులుకూడా శీనయ్య మాట్లాడుతుంటే నరహరికి కళ్ళు ఎర్రబడ్డాయి, కోపంతో.
బుర్ర వేడెక్కింది.
అరుగుకింద ఉన్న తన చెప్పులలో ఒక చెప్పుని కాలితో పట్టుకుని శీనయ్య మొహంమీదకి విసిరాడు. .చెప్పు మొహంమీదకైతే రాలేదుకానీ శీనయ్య పొట్టకి తగిలి కిందపడింది. మాటే పడని శీనయ్య చెప్పుదెబ్బని ఓర్వగలడా…పిచ్చికోపం వచ్చింది. అయినా తమాయించుకుని. నెత్తికి తలపాగలా కట్టుకున్న తుండుని తీసి విదిలించి భుజంమీద వేసుకుని,
“నేను నా ఇంటికి పోతన్నా సామీ… మళ్ళీ రాను యీపూటకి.ఈరోజు కూలిడబ్బులు జీతంలో తెగ్గోసుకో. కుక్కా అంటివి భరించా, నీ సెప్పు నామీదకెయ్యటమేంటి సామీ… నేను పని సేస్తున్నా, నువ్వు నా కూలీడబ్బులు నాకిస్తున్నావు….అంతే. నేను నీ బానిసనికానుగా సామీ… నా కష్టాన్ని నీకోసం వాడుతా…నువ్వేమో దానికి బదులుగా నీ డబ్బులిస్తావు… అంతేగానీ నను అవమానం సేస్తవేంటి దొరా…తిరగబడాలంటే నాకూ కాళ్ళుసేతులు లేకకాదు….దిగజారి ప్రవర్తించటానికి బుద్ధిపుట్టక నిన్నొగ్గేస్తున్నా…” అన్నాడు రోషంగా శీనయ్య.
“ఏం సేత్తావురా, డొక్కుగాడిదా నువ్వూ… నన్ను తంతావా…ఆ…” అంటూ ఊగిపోతున్నాడు నరహరి.
“సీ సీ! అట్టాంటి పని నేను సెయ్యను దొరా. ఎంత శ్రమ నేను సేసినా, నీ ఉప్పు తింటున్నా అన్నట్టే నేను అనుకుంటా…కానీ నీకు నేను బానిసనైతే కానయ్య. సొతంత్రం తెచ్చుకున్న ఈరోజే నీకు నేను నా సొతంత్రంగురించి నా స్వేచ్చ గురించీ సెప్పాలా? ఎవడు తిన్నా పొట్ట పట్టినంతే… ఎంత తిన్నా గొంతు నిండేవరకే…ఉందికదాని నువ్వు తింటూనే ఉండాలనుకున్నా అందరికి ఉండేది అదేపొట్ట, అంతే పొట్ట. ఆ పొట్టకి ఆకలేస్తే అయిదేళ్ళూ నోట్లోకెళ్ళాలంతే నీకైనా నాకైనా. నీకు డబ్బులిచ్చే ఆస్థులున్నాయి. నాకు శ్రమ చేసే శక్తున్నాది. నీది నాకూ రాదు, నాది నీకూ రాదు ఈ జనమకి. ఎవరికి ఉన్నదానితో వారికి జీవితం సాఫీగా గడిచిపోవాలా. ఎందుకీ అవమానించుకోవడం, మాటలనేసుకోవడం? నీకు సేతనయినట్టుగా, నువ్వన్నట్టుగా, అవమానిస్తున్నట్టుగా నేను అనను. ఎందుకంటే నేను అనాలి అనుకోను. నచ్చితే గమ్మున నాపని నేను సేసేసుకుపోతా, నచ్చకపోతే నామానాన నేను నా ఇంటికి పోతా” అని చెప్పాడు శీనయ్య స్పష్టంగా.
కెవ్వుమని పిల్లాడి ఏడుపు…
ఎక్కడినుంచీ అని పక్కకి చూసాడు శీనయ్య. సంటాడిని ఒకచేత్తో ఎత్తుకుని, ఇంకోచేత్తో మావకిష్టమైన పచ్చడన్నం అందిద్దామని తెచ్చిన టిఫినీగిన్నెతో మంగ. కళ్ళతోనే ఊరడిస్తోంది, బాధపడకు అన్నట్టుగా.
నరహరి అయిపోయిన చుట్టని కిందపడేసి కూర్చుని ఉన్నాడు…అనాల్సిన నాలుగుమాటలు ధైర్యంగా అనేసాడు శీనయ్య. ఏమాట ఎక్కడ ఎలా పనిచేసిందో మరి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు నరహరి.
“అయ్యా! మూట నువ్వు మొయ్యలేవుగా? నీ ఇంటికాడ నీమూట పెట్టేసి, నేనింక అట్నుంచటే నా ఇంటికి పోతా. దణ్ణాలు సామీ…” అని మూట నెత్తికెత్తుకున్నాడు. అవమానభారమే మొయ్యగాలేంది, ఈమూట బరువొక లెక్కా అన్నట్టుగా శీనయ్య, మావ వెనకాలే మంగ.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.