అమృతం వలికింది by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

(21.12.2005 నవ్య లో ప్రచురించబడిన కథ)
అన్నయ్యా!
నాన్నకి నెలరోజుల్నించీ ఆరోగ్యం బాగా లేదు. దగ్గూ, జ్వరం విడవకుండా వస్తున్నాయి. గవర్నమెంటు హాస్పిటల్లో చూపిస్తే న్యుమోనియా అన్నాడు డాక్టరు. పరిస్థితి సీరియస్‍గానే వుంది. నీకు వుత్తరం రాస్తానని అమ్మ అన్నా, నాన్న వద్దన్నారు. వాళ్ళిద్దరికీ తెలీకుండా నేనే రాస్తున్నాను. దాదాపు రెండు సంవత్సరాలనుంచీ నువ్విటువైపు రావటంలేదు. ఇక్కడి విషయాలు కూడా పట్టించుకోవడంలేదు. నీకింత కోపం రావటానికిగల కారణమేమిటో నువ్వే మనసుపెట్టి కాస్త ఆలోచించన్నయ్యా!
ఇಲ್ಲು రిపేరు చేయించమని నాన్నకి నువ్విచ్చిన యాభైవేలూ మేం వాడుకున్నామనేగా, నీ కోపమంతా? వ్యాపారంలో పెట్టుబడి పెట్టాం. కలిసొస్తుందేమో తిరిగిచ్చేద్దామనుకున్నాం. అలా జరగలేదు. అందుకు నువ్వు బావని నానామాటలూ అని ఇంట్లోంచీ వచ్చేసినవాడివి మళ్ళీ యిటువైపు రాలేదు. నాన్నమీద ప్రేమ ప్రేమంటావు, యిదేనా నీ ప్రేమ? యాభైవేలనగా ఎంత? నీదీ వదినదీ కలిపితే రెండునెలల జీతమవదు…
నిద్రలోంచీ ఒక్కసారి వులిక్కిపడి లేచినట్టైంది ప్రహ్లాద్ పరిస్థితి. తండ్రికి వంట్లో సరిగాలేదన్న ఒక్క విషయం తప్పిస్తే యింకేదీ మనసుకెక్కలేదు. ఎంతో కష్టపడి పొదుపు చేసిన డబ్బు యిల్లు బాగుచేయించుకుని తండ్రి సుఖపడతాడని యిస్తే దాన్ని పద్మ భర్త అనుభవరాహిత్యంతో తగలేసాడని అప్పట్లో తనకి రావలసినదానికన్నా ఎక్కువే వచ్చింది కోపం. అలా యిచ్చినందుకు తండ్రినీ, అతనిదికాని డబ్బుని వాడుకున్నందుకు పద్మ భర్తనీ, వాళ్ళిద్దర్నీ వెనకేసుకొచ్చినందుకు తల్లినీ అందర్నీ మాటలని వచ్చాడు. మనసు విరిగినట్టై మళ్ళీ యింక వెళ్ళలేదు.
ఇప్పుడీ వుత్తరం…
“ఏమిటా వుత్తరం? ఎక్కడ్నుంచి?” పని ముగించుకుని వంటింట్లోంచి వస్తూ అడిగింది అతని భార్య రాధ. ఇంకా యీరోజుల్లో వుత్తరాలు రాసేవాళ్ళెవరన్న ప్రశ్నతో కూడిన చిన్ననవ్వు ఆమె పెదవులమీద.
“పద్మ రాసింది. నాన్నకి న్యుమోనియాట”
ఆమె పెదాలమీది నవ్వు మాయమైంది. స్వల్పంగా అతృత, బాధ చోటుచేసుకున్నాయి ముఖంలో. “ఎప్పట్నుంచీ? ఇప్పుడెలా వుందట?” అడిగింది.
క్లుప్తంగా పరిస్థితి చెప్పి, “ప్రయాణానికి సర్దు. నేను వెళ్ళి ట్రెయిన్ రిజర్వేషనేమైనా దొరుకుతుందేమో ప్రయత్నించి వస్తాను” అన్నాడు ప్రహ్లాద్. అరగంటలో తిరిగొచ్చాడు, రిజర్వేషన్ దొరకలేదని.
“జనరల్ కంపార్టుమెంటులో పిల్లల్ని పెట్టుకుని వెళ్ళలేం. బస్‍లో వెళ్ళిపోదాం” అన్నాడు. రాధ తలూపింది.
“స్కూల్లో చెప్పి వాళ్ళని తీసుకొస్తాను” మళ్ళీ వెళ్ళాడు. చాలా ఆందోళనగా వుందతనికి. ఎలా వుందో అక్కడ? తను వెళ్ళేవరకూ తండ్రి బ్రతుకుతాడా? ఒక్కసారి ఆయన్ని చూడగలుగుతాడా? చూసి… తన కోపం ఆయనమీద కాదనీ తమ కుటుంబాన్ని తొలుస్తున్న చీడపురుగులాంటి ఆ వ్యక్తిమీదనీ అతన్ని వదిలేసి వస్తే పద్మకోసం తనేమైనా చెయ్యగలడని నచ్చచెప్పాలి. అతని సహచర్యంలో పద్మకూడా సంస్కారాన్ని మర్చిపోయింది. అతడు…
ఆలోచనల్లో పడి స్కూలు దాటిపోయింది చూడలేదు. మళ్ళీ వెనక్కొచ్చాడు. హెడ్మాస్టర్‍తో మాట్లాడి పిల్లలని తీసుకుని ఇంటికొచ్చేనరికి రాధ అన్నీ సిద్ధం చేసి తను కూడా తయారైవుంది. మరో పావుగంటలో నలుగురూ బస్‍లో వున్నారు.


పిల్లలకి ముందే చెప్పి వుంచింది రాధ –
-తాతగారికి ఒంట్లో బాగాలేదు. అందుకని నాన్నని వూరికే ప్రశ్నలతో విసిగించకూడదని.
ఐతే వాళ్ళుకూడా ముందుగానే తమ అనుమానాలని తీర్చేసుకున్నారు. నాన్న యిప్పుడు ఏడుస్తారా? ఏడిస్తే యెవరు వోదార్చాలనేది అందులో ముఖ్యమైనవి. రాధ నవ్వి, “పెద్దవాళ్ళు యేడవరు” చెప్పింది.
వాళ్ళు అపనమ్మకంగా చూసినా గంభీరంగా వున్న ప్రహ్లాద్‍ని చూసాక నమ్మారు. తల్లిమాట ప్రకారం అతన్నేం మాటలతో విసిగించకుండా తమ కాలక్షేపం తామే చేసుకున్నారు. కొద్దిసేపు విండోలోంచి బైటికి చూసారు. తమతో తెచ్చుకున్న కామిక్ బుక్స్ చదువుకున్నారు. తల్లి కొనిచ్చిన పాప్‍డ్ కార్న్ తిన్నారు. ఇంకేమీ చేసేందుకు తోచక తండ్రి వళ్ళో ఒకరు, తల్లి వళ్ళో ఒకరు పడి నిద్రపోయారు.
చాలా అస్థిమితంగా వున్నాడు ప్రహ్లాద్. తండ్రికి అక్కడ ఎలా వుందో తెలీదు. ఫోన్ చేసినా నెంబరు కలవటంలేదు. ఫోన్ మారిందో లేక సిమ్ కార్డు మార్చుకున్నారో! ఆధునిక ప్రపంచం మనిషిని ఎంత దగ్గిరకి చేరుస్తోందో అంత దూరానికి విసిరేస్తోంది.
“అక్కడినుంచీ వచ్చాక మీరు ఫోనేనా చేసి మంచీ చెడూ కనుక్కోవలసింది. వెళ్ళినా వెళ్ళకపోయినా విషయాలు తెలిసేవి” అంది రాధ అతని మనసు చదివినట్టు. ఒక్క క్షణంసేపు మాట్లాడలేదు ప్రహ్లాద్.
తర్వాత నెమ్మదిగా అన్నాడు. “ఆ మనిషిని చూస్తే నాకు చాలా ఎలర్జీ రాధా! ఎవరేనా అసలంత బాధ్యతారహితంగా ఎలా వుండగలరో నాకర్ధంకాదు. ఉద్యోగం చెయ్యడు. భార్యని పోషించాల్సిన బాధ్యత అతనిదేనని తెలుసుకోడు. పోనీ యిద్దరూ నాన్నగారి దగ్గిర వుంటున్నారు, ఆయనకీ అమ్మకీ సహాయంగా వుంటారా అంటే అదీ లేదు. మన దగ్గిరకి తీసుకొచ్చి యీ పెద్దవయసులో అమ్మానాన్నలని చూసుకుందామంటే ఆ యిద్దర్నీ వదిలిపెట్టి వాళ్ళు రారు. రకరకాల వ్యాపారాలు చేసి నాన్నగారి డబ్బంతా తగలేసాడు. నేనుకూడా మొదట్లో కొద్దిగా యిచ్చాను. రెండు మూడుచోట్ల వుద్యోగం వేయించాను. వ్యాపారంలో ప్రావీణ్యతలేనప్పుడు వుద్యోగంలోనేనా నిలదొక్కుకోవాలా? అదీ లేదు. స్థిరత్వంలేని మనిషి!” అతని గొంతులో నిరసన.
“పద్మకీ అతనికి ఎలా పరిచయం?” కుతూహలంగా అడిగింది రాధ.
చిన్నగా నిట్టూర్చాడు ప్రహ్లాద్. రాధకి కొంతవరకూ తెలుసు. పద్మది పెద్దలు చేసిన ప్రేమ పెళ్లి. తమకన్నా చాలామందే వాళ్ల పెళ్ళైంది. తన పెళ్లిలో వాళ్ళ గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ముఖ్యంగా పద్మ భర్త విశాల్ గురించి. అత్తగారింట్లో వాతావరణం ఎలా వుండబోతోందోనని చాలా భయం వేసింది తనకి. ఐతే అక్కడి వ్యక్తులంతా స్వతహాగా మంచివాళ్ళు. పెళ్ళప్పుడుగానీ తర్వాతగానీ పెట్టుపోతల గురించీ, తెలిసీ తెలియక జరిగిన పొరపాట్ల గురించీ ఎప్పుడూ ఎత్తిచూపలేదు. మామగారిని చూడగానే గౌరవం కలిగింది. చెయ్యెత్తి నమస్కరించాలనిపించే వ్యక్తిత్వం. చాలా వాత్సల్యం చూపిస్తాడు. రిటైరైపోయినా తమనుంచీ ఏమీ ఆశించలేదు. అది గొప్ప విషయం. వాళ్ళ జీవితం వాళ్ళది తమ జీవితం తమదనే నిర్దుష్టమైన గీత… ఎవరో గీసినట్టు.
“మేమిద్దరం… అంటే నేనూ చెల్లీ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశగా వుండేది నాన్నకి. ఆడపిల్లనే భేదభావం ఎప్పుడూ చూపలేదు. ఇంటరుదాకా బాగానే చదివింది. తర్వాత మా కాలేజీలు వేరయాయి. విశాల్ పద్మావాళ్ళ కాలేజిలో పార్టుటైం లెక్చరర్‍గా చేసేవాడు. ఇద్దరికీ ఎలా పరిచయమైందోమరి… బాగా పుకార్లు వచ్చేసాయి. వెంటనే వాళ్ళ పెళ్ళిచెయ్యడం తప్పనిసరైపోయింది” అన్నాడు.
“పదిహేడు పద్దెనిమిదేళ్ళ వయసులో ప్రేమేంటి, మగవాడిని మగవాడనే కుతూహలంతో చూడటంతప్ప? ఆడపిల్లలమధ్యనైతే అది స్నేహం. ఆడా మగా అయితే అదే స్నేహం మరో కోణాన్ని బహిర్గతపరుస్తుంది. చాలా ప్రమాదకరమైన వయసది. ఆడపిల్లలు చాలా తొందరగా చెయ్యిజారిపోతారు” అంది రాధ.
“పోస్ట్ గ్రాడ్యుయేటు, పార్టుటైముదైనా ఏదో ఒక వుద్యోగమంటూ వుంది, రెగ్యులర్ కాకపోతుందా అనుకున్నాం. అతని పేరెంట్సు కూడా అలానే అన్నారు. బాగా చదువుకున్న కుటుంబం. అది చూసే, వాళ్ళ మాటలు నమ్మే, పెళ్ళిచేసాం. కానీ అతను స్థిరుడు కాదు. అది వాళ్ళకి తెలుసు. దాచిపెట్టారు. దానికి తగ్గట్టు పద్మది బాగా చిన్నవయసు. అనుభవరాహిత్యం. వాళ్ళు పట్టించుకునేవారుకాదు. నాన్న అలా వదిలిపెట్టలేకపోయారు”
“ఇంకా ఎంతకాలంట, యిలా?”
దానికి జవాబు ప్రహ్లాద్ దగ్గిరలేదు. ఆ ప్రశ్న అతన్ని చాలాకాలంగా అతన్ని బాధిస్తున్నదే. నిశ్శబ్దంగా సీట్లో వెనక్కి వరిగాడు. రాధ యింక అతన్ని
మాట్లాడించే ప్రయత్నం చెయ్యలేదు. బస్సు వూరు చేరేసరికి తెల్లవారింది. ఆటో మాట్లాడుకుని ఇంటికెళ్ళారు. ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. తలుపు తడితే ప్రహ్లాద్ తల్లి శ్యామల తీసింది.


ఇల్లు….
సగం కూలిన ప్రహరీ… విరిగిన గేటు… ఒక భాగం పూర్తిగా కూలి మొండిగోడలు తేలిన పెంకుటిల్లు.
మిగిలినవి మూడుగదులు. వీధిగదిలోకి గాలీ, వెలుతురూ బాగా వస్తాయి. దాన్ని పద్మావాళ్ళూ వాడుకుంటున్నారు. తర్వాతిది అన్నీ బావున్నరోజుల్లో స్టోరు రూంగా వుండేది. అందులో ప్రహ్లాద్ తండ్రిని పడుకోబెట్టారు. అంతా చీకటి చీకటిగా వుంది. దాని వెనకది వంటగది. ఇంటినీ, ఇంట్లోని మనుషుల్నీ అలా చూసేసరికి ప్రహ్లాద్ మనసంతా వికలమైంది. రాధకీ అలానే అనిపించింది. మనం ఎంతో గౌరవించేవాళ్ళు తక్కువగా బ్రతుకుతుంటే చూసి తట్టుకోవటం అందరికీ సాధ్యపడదు.
చెట్టంత మనిషి, టీచరుగా స్కూల్లోనూ తండ్రిగా యింట్లోనూ తన ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకున్న వ్యక్తి, నవారు మంచంలో మునగదీసుకుని మూలుగుతూ పడుకోవడం చూసేసరికి చలించిపోయాడు ప్రహ్లాద్.
“ఏంటమ్మా యిది? నాన్నకిలా వుంటే నాకు కనీసం ఫోనేనా చెయ్యలేదేం?”” తల్లిని నిలదీసాడు. శ్యామల ఏమీ మాట్లాడలేదు. ఏం చెప్పాలో తోచలేదు.
“ఎలా తెలిసింది? పద్మ రాసిందా?” అనడిగింది. అతను తలూపాడు. ఏం మాట్లాడాలన్నా ఆవిడకి సంకోచంగా అనిపిస్తోంది, అతను డబ్బుకి గొడవచేస్తాడేమోనని. ఇంతకిముందు అతన్లో అలాంటి బేధభావం లేదు. పెళ్ళయాక కొత్తగా వచ్చింది. ఓరగా రాధని చూసింది. చురుక్కుమనిపించింది రాధకి ఆ చూపు. వాస్తవం ఒకటే వుంటుంది. చూసే కోణం మనిషి మనిషికీ వేరేగా వుంటుంది. పెళ్లయ్యాక అంతకిముందులా అతను డబ్బు పెట్టలేకపోతున్నాడనేది అక్కడున్న నిజం. పెళ్ళితో అతనికి కొత్తబాధ్యతలు వచ్చి చేరాయి. జీతం మాత్రం అదే పాతజీతం. రాధకూడా సంపాదిస్తోంది. ఐతే ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులు, భవిష్యత్తు అనేది అదనపు భారం. వీటిని ఆవిడ చూడటానికి ఇష్టపడట్లేదు.
పద్మ లేచి వాళ్ళ దగ్గిరకొచ్చింది. తనే ముందు పలకరించింది. విశాల్ మాత్రం బావమరిది తనని మాట్లాడిస్తాడని ఆశించాడు. ప్రహ్లాద్ అలాంటి ప్రయత్నం యేదీ చెయ్యకపోవటంతో ముఖం ముడుచుకున్నాడు.


తండ్రిని మంచిడాక్టరుకి చూపించాడు ప్రహ్లాద్. ఆయన సలహామీద ప్రైవేటు నర్సింగ్‍హోంలో చేర్చించాడు. ఊళ్ళోకెల్లా ఖరీదైన నర్సింగ్‍హోం అది. కొడుకలా అన్నీ చూసుకుంటుంటే మనసులో వున్న దిగులంతా చేత్తో తీసేసినట్టనిపించింది శ్యామలకి. మరోవైపున రాధ చేతిలో పనందుకుని చేస్తోంటే పిల్లలు ఎలాంటి భేషజం లేకుండా ఆప్యాయతతో అల్లుకుపోతున్నారు. కోడలిమీద కోపం చాలావరకూ తగ్గిపోయింది. ఎవరుమాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అన్యాక్రాంతం చెయ్యాలనుకుంటారు? అనుకుంది మనసు సరిపెట్టుకుని.
ప్రహ్లాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశారు. వెనకటి ఓపిక లేకపోయినా మనిషి చాలావరకూ కోలుకున్నట్టే. తనకోసం అంతగా ఆరాటపడుతున్న కొడుకుని చూసి ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. అంతలోనే అపరాధభావన, తనమీద పరుచుకున్న విషచ్ఛాయలు అతనిదాకా కూడా విస్తరిస్తున్నాయేమోనని. చాలా బాధనిపించింది.
“పెద్దవారయ్యారు. ఇంకా మీరిక్కడెందుకు నాన్నా? నా దగ్గిరకొచ్చెయ్యండి” అన్నాడు ప్రహ్లాద్. ఆయన మాట్లాడకముందే తల్లి జవాబిచ్చింది. “అలా ఎలా కుదుర్తుందిరా? పద్మ భర్తకి ఇప్పటికింకా సరైన వుద్యోగమే లేదు. అందరం కలిసి ఒక దగ్గర వుంటున్నాం కాబట్టి యిబ్బంది లేకుండా గడిచిపోతోంది” అంది.
పద్మ అక్కడే వుంది. విశాల్ ఎక్కడికో వెళ్ళాడు. ప్రహ్లాద్ ఆమెని చూసాడు. గుండెల్లో అనిర్వచనీయమైన బాధ. చెల్లెలు తీసుకున్న పొరపాటు నిర్ణయంవల్ల బ్రతుకులెలా తారుమారయ్యాయి! బాధ్యతలన్నీ తీర్చుకుని జీవితపు చరమాంకాన్ని పెన్షను బెనిఫిట్సుతో ఎంతో నిశ్చింతగా గడపాల్సిన తండ్రి ఇప్పటికీ సమస్యలతో సతమతమౌతున్నాడు.
“ఎంతకాలం పద్మా, ఇలా నాన్న మీద ఆధారపడి? నాన్న బాగా పెద్దవారయ్యారు. ఇంకా ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తారు? ఏం ఆలోచించుకున్నారు?” సూటిగా అడిగాడు.
“ఏం చెయ్యమంటావన్నయ్యా? ఒకళ్ళమీద ఆధారపడి వుండటం మాకుమాత్రం యిష్టమా? ఏ వ్యాపారం మొదలుపెడితే అందులోనే నష్టం వస్తోంది. తనుకూడా ఎంతో బాధపడుతున్నారు” అంది ఆమె.
“వ్యాపారం చెయ్యాలంటే అనుభవం కావాలి. లౌక్యం కావాలి. అవి లేకుండా చేతులు కాల్చుకోవటం దేనికి? ఇప్పటికి ఎంత డబ్బు తగలేసారు?” నిర్మొహమాటంగా అడిగేసాడు ప్రహ్లాద్. చెల్లెలి బాధ్యతారహితమైన జవాబుకి కోపం వుబికి వచ్చింది. ఆమె తలొంచుకుంది.
“ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నాను. అతన్ని వదిలిపెట్టి నాతో రా. చిన్నదో పెద్దదో ఒక వుద్యోగం వేయిస్తాను. నిలదొక్కుకునేదాకా ఓపికపట్టు. ఆ తర్వాత నువ్వూ, మీ ఆయనా… మీ యిష్టం” అన్నాడు.
“అతన్నొదిలేసి అదొక్కర్తే ఎలా వస్తుందిరా? తప్పుకూడాను.” శ్యామల చప్పుని జవాబిచ్చింది. పైకి అనలేని మాట మరొకటి వుంది. కూతురు వెళ్తానన్నా అల్లుడు వదిలిపెట్టడు.
“అలాగైతే ఏదైనా వుద్యోగంలో చేరమను. ఇంతకుముందు ఏవో చేసాడుగా?”
“సెల్‍ఫోన్ ఏజెన్సీ తీసుకుందామనుకుంటున్నారు” అంది పద్మ. కొద్దిసేపు నిశ్శబ్దంగా వుండిపోయారందరూ. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమే మళ్లీ అంది. “లక్షరూపాయలు డిపాజిటు కట్టాలట. నువ్వెలాగా అమ్మావాళ్ళని తీసుకెళ్తానంటున్నావు. ఇల్లమ్మేసి, మా వాటా మాకిచ్చేస్తే మా తిప్పలేవో మేం పడతాం. మీకెవరికీ భారం కాకుండా మా బతుకు మేం బతుకుతాం””
ఆమె ఆలోచనలకి అంతా నివ్వెరపోయారు. ముందుగా తేరుకున్నది ప్రహ్లాద్ తండ్రే. “ఆ లక్షా మునిగాక ఏం చేస్తారమ్మా? అందరం కలిసి అన్నయ్య నెత్తిన పడదామా?”” కటువుగా అడిగాడు. ఆయనలా అడుగుతాడని ఎవరూ అనుకోలేదు. పద్మ చిన్నబుచ్చుకుంది.
“పాతదో బొక్కిదో ఒక ఇల్లంటూ వుందిగాబట్టి బజార్న పడకుండా బతుకుతున్నారు. అదికూడా అమ్మేస్తే చెట్టుకింద వుంటారా?”” శ్యామల గట్టిగా అడిగింది.
తల్లితండ్రుల్ని తనతో తీసుకెళ్ళడం అంత తేలిక కాదని అర్థమైంది ప్రహ్లాద్‍కి. వాళ్ళనలా వదిలెయ్యటమేనా? తనేం చెయ్యలేడా? చెయ్యటమంటే తండ్రిలాంటి నిస్సహాయస్థితిలోకి తనూ జారుకోవటంకాదు. విశాల్‍కి లొంగిపోయి అడిగింది యిస్తూ, కూర్చోబెట్టి మేపడం కాదు.
కూతురి అతితెలివినీ, కొడుకు సందిగ్ధాన్నీ వీక్షించాడు ప్రహ్లాద్ తండ్రి. విశాల్ నీడ కొడుకుమీద పడరాదనిపించింది. తెలీనివాళ్ళకి చెప్పచ్చు. తెలిసినవాళ్ళకి చెప్పచ్చు. కానీ తెలిసీతెలియనివాళ్ళకి చెప్పలేం. విశాల్‍కి ఎవరూ ఏదీ కూడా చెప్పలేరు. చెప్పి ఒప్పించలేరు. తనకి తోచిందేతప్ప ఎవరేం చెప్పినా వినడు. పద్మకోసం తాము సర్దుకుపోతున్నారు. అలా సర్దుకుపోవటంవలన ఎదురైన పరిణామాలన్నిటినీ భరిస్తున్నారు.
అదంతా కొడుక్కీ కోడలికీ ఏం అవసరం? కోరుకుని నష్టపోవటానికి ఎవరు సిద్దపడతారు? అక్కడికీ కొడుకు మంచివాడనే అనుకోవాలి. అతనికి తోచిందేదో యిస్తున్నాడే తప్ప లెక్కలడగటంలేదు. వాటా పంచమనడంలేదు. కొడుకు దగ్గిరకి వెళ్ళి చివరిరోజులని నిశ్చింతగా గడపాలని ఎంతగా వున్న ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు తను. ఇద్దరు పిల్లలనీ ఒకేలా కని, ఒకేలా పెంచినా ఒకరు పురోగతిలోకీ మరొకరు అధోగతిలోకి వెళ్తున్నారంటే దానికి ఎవరూ బాధ్యులు కారు. అది వాళ్ళ స్వయంకృతం ఔతుంది. లేని బాధ్యతని కొడుకుమీద రుద్దడం కంటే కన్నందుకు తనే తీసుకోవడం నైతికం. బాగుపడతారా మంచిదే. లేకపోయినా తను యింకా చెడిపోయేదేమీలేదు.
కుటుంబం బాగు కోసం ఒక వ్యక్తినీ, గ్రామం బాగుకోసం ఒక కుటుంబాన్నీ, రాజ్యం బాగుకోసం ఒక గ్రామాన్నీ వదిలెయ్యచ్చని శాస్త్రమే చెప్తుంది. అంతే. కొడుకూ, కోడలూ, మనవలూ పైకి రావాలంటే అలా చెయ్యక తప్పదు.
“నేనెక్కడికీ రావాలనుకోవటంలేదు ప్రహ్లాద్. నాజీవితం యిక్కడే ఈ యింట్లోనే గడిచిపోవాలని ఆకాంక్ష. ఇంక పద్మ విషయమంటావా, అమృతం ఒలికిపోయింది. దాన్ని ఎత్తడం సాధ్యపడదు. అలాగని చూస్తూ వదిలెయ్యలేం. దాని చుట్టే పరిభ్రమిస్తూ వుంటాం. అది తన జీవితామృతాన్ని ప్రేమమైకంలో పడి మట్టిలో ఒలకబోసుకుంది. అయోగ్యుణ్ణి ప్రేమించింది. వసంతం రాకుండానే కూసిన కోయిలలా పరిపక్వత రాకుండానే పెళ్ళిచేసుకుంది. దాని జీవితంతో మా జీవితాలిలా ముడిపడి వున్నాయి. ఇదో పీటముడి. విడదు. నువ్వు చెయ్యగలిగింది చేసావు. ఇంకేదైనా చెయ్యాలనిపిస్తే నీ మనశ్శాంతికోసం చేసుకో. అంతేగానీ మాకోసం కాదు” అన్నాడు.
అంతకన్నా మరో పరిష్కారం వుంటుందని ఇంకెవరూ అనుకోలేదు.