అక్కడ సోఫాలో ఒక దయ్యం కూర్చుని వుంది. ఆవిడ పేరు శ్వేతలతా అవంతీపురం.
గార్డెన్లో వున్న వుయ్యాల ఎవరూ లేకపోయినా అప్పుడప్పుడూ వూగుతూ వుంటుంది.
చాలా ముఖ్యమైనవాళ్ళని మాత్రం పిలుచుకుని, గృహప్రవేశం చేసుకుని కొత్తగా కొనుక్కున్న యింట్లోకి మారాము. ఇల్లు అందరికీ బాగా నచ్చింది. ఫంక్షనయాక ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. హడావిడంతా అయి, సామాన్లు సర్దడం మొదలుపెట్టాను.
నాలుగువందల గజాల స్థలంలో చుట్టూ ఖాళీజాగా వదిలిపెట్టి కట్టుకున్న డ్యూప్లెక్స్ మోడలు. కింద రెండు, పైన మూడు, పడగ్గదులు, కింద విశాలమైన హాలు, పైన అంతే పెద్ద లాంజి, ఓపెన్ కిచెన్… ఇంటి చుట్టూ గార్డెన్… అన్నిటికికన్నా నన్ను ఆకర్షించినది రోడ్డువైపుని వున్న ప్రహరీకి ఆనుకుని పిక్నిక్ గొడుగు, దానికింద వుయ్యాల… ఆ వుయ్యాలే ఎవరూ లేకపోయినా వూగేది… గాలికేమోననుకున్నాను. బొమ్మరిల్లులా అంతా అమిరినట్టు వుంది. సామాన్లన్నీ సర్దడం అయాక పుస్తకాలు పెద్దపిల్ల గదిలోనూ, బొమ్మలు రెండోపిల్ల గదిలోనూ సర్దేసి హాల్లో కాఫీటేబుల్ బుక్స్ మాత్రం వుంచాను.
ఎవరికి వాళ్ళకే ఒకొక్క గది. ఇక్కడకి వచ్చినప్పుడు వుండటానికి అత్తమామమలకి ఒకటి, పిల్లలిద్దరికీ చెరొకటీ, మాదొకటి, వచ్చివెళ్ళే అతిథులకోసం ఒకటి. అమ్మానాన్నలు వచ్చినా, ఇద్దరు మనవరాళ్ళనీ ఒక గదిలోకి చేర్చుకుని అందరూ కలిసి ఒకచోటే వుంటారు. రెండోది ఖాళీయే. వాళ్ళిద్దరికీ వుద్యోగాలు కావటంతో వచ్చినా ఎక్కువరోజులు వుండరు.
మాకు ఇల్లు అమ్మినాయన భార్య యాక్సిడెంట్లో చనిపోయిందట. కొన్నాళ్ళు ఒక్కడే వుండి, విదేశాల్లో వున్న కొడుకుల దగ్గిరకి వెళ్ళిపోతూ ఇది మాకు అమ్మేసాడు. మిగిలిన వస్తువులన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేసినా ఆసక్తి వుందని పుస్తకాలు మాకు వదిలిపెట్టేసాడు. దాదాపు ఐదువందల పుస్తకాలు… అవన్నీ ఏమిటో చూడాలి. మృష్ఠాన్నభోజనానికి కూర్చున్నాక, మొదలుపెట్టడానికి ముందుండే చిన్నవ్యవధిలాంటి ఆలస్యం.
“హాంటెడ్ హౌస్లా వుందే అమ్మా!”అనేసింది పెద్దది పుసిక్కున. వచ్చినవాళ్ళందరూ వెళ్ళిపోయాక. పేరు తిరుమలదేవి. ఫైర్ బ్రాండ్. చిన్నదానికి చిన్నాదేవి అని పెట్టుకోవాలనుకున్నానుగానీ,
“ఇద్దరం ఒకర్నే చేసుకోవాలా” అని వీళ్ళడిగినా, వచ్చేవాడికి అనిపించినా కష్టమని, మానేసి తనకి జానకీదేవి అని పెట్టుకున్నాను. రాపిడ్ ఫైర్ బ్రాండ్ ఇది.
సరే, ఇప్పుడు దేవికి ఎందుకలా అనిపించిందో తెలీలేదు. అలాంటి మాట అనేసిందేమిటా అనిపించింది. చాలా తమాషాగా, దేవి అలా అన్నప్పుడు చిన్న అలికిడేదో అయింది. ఇద్దరం దాన్ని గుర్తించలేదు.
రెండురోజులు కొత్తింటి మురిపెం, సర్దుళ్ళ అలసట తగ్గాక యశ్వంత్ ఆఫీసుకి, పిల్లలు స్కూలుకీ వెళ్ళారు. నేనొక్కదాన్నే ఇంట్లో వున్నాను.
అందర్నీ పంపించాక పెద్ద కప్పునిండా టీ పోసుకుని ఇంటికి కొసరుగా వచ్చిన పుస్తకాల బీరువాముందు కూర్చున్నాను. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా వుంది. ఐనా ఎవరో తిరుగుతున్నట్టు సన్నటి అలికిడి. దేవి మాటలు గుర్తొచ్చాయి.
“ఎందుకలా అనిపించింది తనకి?” మళ్ళీ అదే ప్రశ్న కదిలింది. ఇన్స్టింక్టు అలా అనిపించిందని నాకు తోచలేదు.
ఉన్నట్టుండి ఒక పుస్తకం గాల్లోకి లేచింది!!!
దేవి చెప్పింది కరెక్టేనని అర్థమైంది నాకు. ఒక్కక్షణం భయంలాంటిదేదో నా వొంట్లో నరనరాన్నా కరెంట్ షాక్‌లా ప్రవహించినా వెంటనే సర్దుకున్నాను.
పారానార్మల్ పరిశోధనలగురించి నాకు కొద్దిగా తెలుసు. మనిషికి భౌతికదేహంతోపాటు, సూక్ష్మశరీరంకూడా వుంటుంది. దాన్ని ఆత్మ అని మతపరంగా అంటే ఈథరల్ బోడీ అని పారానార్మల్ రిసెర్చర్స్ అంటారు. కాన్షియస్నెసని క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడిప్పుడు చెప్తోంది. భౌతికశరీరం నశించిపోతుంది. ఆత్మకూడా మరో ప్లేన్‌లోకి వెళ్ళిపోవాలి. కానీ ఒకొక్కసారి అలా జరగదు. ఏవో కొన్ని కారణాలచేత ఆత్మ ఇక్కడే వుండిపోయి కొన్ని అవసరాలు, జ్ఞాపకాలు, సంఘటనల చుట్టూ తిరుగుతుంటుంది. ఆ ఆత్మని కలిసి దాని సమస్య తీర్చితే మన ప్లేన్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదంతా చాలా మర్యాదగా జరగాల్సిన వ్యవహారం. వేపమండలూ, ఎండుమిరపకాయల పొగతో జరిగేది కాదు. ఈ ఆత్మ అనేది ఒకప్పుడు బతికిన మనిషియొక్క అవశేషం. కాబట్టి మనుషులకి వుండే గౌరవాన్ని కోరుకుంటుంది.
ఇప్పుడీ యింట్లో వున్న ఆత్మ ఎవరిది? ఏమి ఆశించి ఇక్కడ తిరుగుతోంది? మాతో వచ్చిందా? మేము రాకముందునించీ వుందా? ఈ సమస్య వుందనే ఇల్లు అమ్మేసారా? ఎన్నో ప్రశ్నలు.
ఇవన్నీ నేను ఆలోచిస్తుంటే చిన్న నవ్వులాంటిది వినిపించింది. చుట్టూ చూసాను. అక్కడ సోపాలో కూర్చుని వున్న ఆకృతి లీలగా కనిపించింది. మా సంభాషణకి మాధ్యమం అవసరం లేదనిపించింది.
“మీ పేరు?” అడిగాను.
“శ్వేతలతా అవంతీపురం”
తర్వాత మా సంభాషణ సులువైంది. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఇదే యింట్లో ఆర్నెల్లనుంచీ వుంటోందట.
“ఎందుకు?” అడిగాను.
జవాబు చెప్పలేదు. ఇష్టంలేదనుకుని వదిలేసాను. తర్వాత ఆవిడ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తోన్న దారంతా పుస్తకం గాల్లో తేలుతూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్తోందోనని వెనుకే వెళ్ళి చూసాను. గేటుదగ్గరి వుయ్యాల వూగుతోంది. కొద్దిసేపు అలాగే చూసి చిన్నగా నిశ్వసించి వెనక్కి వచ్చాను. పుస్తకాలు ఇంక చూడలేకపోయాను.
రాత్రి యశ్వంత్ వచ్చాక చెప్పాను. తను పెద్దగా నవ్వేసాడు.
“నాన్సెన్స్ రేఖా! ఏ కాలంలో వున్నావు? దెయ్యాలుండటమేమిటి? కొత్తింట్లో ఒక్కదానివీ వుండేసరికి అలా అనిపిస్తోంది” అన్నాడు. ఇటువంటి అతీంద్రియ సంఘటనలకి ఎలాంటి ఆధారం వుండదు. ఎవరికివారు స్వయంగా అనుభవించి నిర్ధారించుకోవాలి.
ఆ అనుభవాలు అందరికీ అతిత్వరలోనే సంభవించాయి.
మర్నాడు పొద్దున్నే వాష్‌రూమ్‌లోకి వెళ్ళిన దేవి నల్లా ఆన్ చేసి వుండటంతో ఆఫ్ చేసింది. అది మళ్ళీ వెంటనే తిరిగిపోయింది. అది ఆఫ్ చెయ్యడం, నల్లా మళ్ళీ నీళ్ళు పొయ్యటం ఇలా పదిపదిహేనుసార్లు జరిగాక హాల్లో వున్న యశ్వంత్‌తో చెప్పింది.
“నా వాష్‌రూమ్‌లో నల్లాలో స్ప్రింగేదో పాడైనట్టుంది నాన్నా! కట్టేసినా మళ్ళీ తిరిగిపోతోంది” అంది.
నేను వంటింట్లో వున్నాను. మాకు కాఫీ, పిల్లలకి బోర్నవిటా కలుపుతున్నాను. ఒక కాఫీగ్లాసు అందరం చూస్తుండగానే గాల్లో తేలుతూ వుయ్యాలదగ్గరికి వెళ్ళిపోయింది.
“నిజంగానే?” అది చూసి అడిగాడు యశ్వంత్ ఆశ్చర్యంగా.
“మాజిక్ నేర్చుకున్నావా అమ్మా?” రాత్రి నేను వాళ్ళ నాన్నకి చెప్పిన విషయం తెలీక అడిగింది దేవి. అప్పుడే నిద్ర లేచి ఇవతలికి వచ్చిన జానకి కుతూహలంగా చూసింది.
“అమ్మ మేజిక్ చేస్తోందే చెల్లీ! నువ్వు మిస్సయ్యావు. కాఫీగ్లాసు గాల్లో తేలుతూ వెళ్ళింది” అంది చాలా వుద్విగ్నంగా. వాళ్ళు అలా అనుకోవడమే మంచిది. ఈలోగా ఈ సమస్యకి పరిష్కారం వెతకాలనుకున్నాను.
పిల్లలని స్కూలుకి వెళ్ళిపోయారు.
“ఉండనా?” అడిగాడు యశ్వంత్.
“ఈవేళ వద్దు. ఏమైనా వివరాలు చెప్తుందేమో ప్రయత్నిస్తాను. కమ్యూనికేషన్లో వున్నాం కదా?” అన్నాను.
ఆలోచించుకొమ్మని నాకు మరో అఫర్ ఇచ్చి, వద్దని నేను మళ్ళీ చెప్పాక వెళ్ళిపోయాడు. ఈరోజంతా ఇంట్లో నేను ఒక్కదాన్నే. మా దయ్యంగారి అలికిడి లేదు. ఏం జరిగిందో? సాయంత్రానికి తనొచ్చినట్టు గుర్తించాను. నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. నాకోసం చేసుకున్న టీ కప్పు, రెండు బిస్కట్లు గాల్లో తేలుతూ వుయ్యాలదగ్గిరకి వెళ్ళిపోయాయి.
రెండురోజులు గడిచాయి.
దయ్యంగారి అల్లరి ఎక్కువౌతోంది. బతికున్నప్పుడు వయసులో పెద్దదే ఐనా దయ్యాలకి సహజంగా వుండే చిలిపితనంతో అల్లరిపనులు చేస్తోంది. పిల్లలతో మరీను. ఒకళ్ల వస్తువు మరొకళ్ళ దగ్గిర పెట్టేస్తుంది. నాది నువ్వెందుకు తీసావంటే, నువ్వెందుకు తీసావని ఇద్దరూ దెబ్బలాడుకోవడం. నాకూ యశ్వంత్కీ తెలిసినా దయ్యంకదాని అదీ యిదీ అనకూడదు. కోపం వస్తుంది. అసలు దయ్యమనే అనకూడదు. చింతనిప్పుల్లా మెరుస్తూ ఓ రెండు కళ్ళు గాల్లో కనిపిస్తాయి. ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. డబ్బాలమూతలూ అవీ తీసుకోలేదుగానీ, డైనింగ్ టేబుల్మీద ఏవి పెడితే అవి ఎత్తుకుపోతుంది. డ్రెస్సింగ్రూంలోకి వెళ్ళి పౌడరవీ పారబోసేస్తుంది. నా చీరలూ, జాకెట్లూ, పిల్లల బట్టలూ దండెంమీద ఆరేసి వున్నవి కట్టేసుకుంటుంది. మనుషులు కట్టుకున్న ఆకృతిలో అవి గాల్లో తిరుగుతూ వుంటే నవ్వొస్తోంది. ప్రమాదకరమైన దయ్యంకాదనే విషయం అర్థమైంది. నాతో దోబూచులాడుతుందిగానీ వివరాలేం చెప్పదు.
ఇప్పుడంటే మేమే. నలుగురు వచ్చిపోయే యిల్లు. దయ్యంతో సహజీవనం ఎలా కుదురుతుంది?
“చెప్పొచ్చుకదా, సమస్యేమిటో?” అంతా వెళ్ళిపోయాక నాలో నేను అనుకుంటున్నట్టు కొంచెం గట్టిగానే అన్నాను.
చిన్న అలికిడి.
“నాకూ మీమధ్య వుండటం కష్టంగానే వుంది” సాధింపు.
“ఎందుకూ?”
“మీ ఆయన్ని చూస్తుంటే ఒళ్ళుమండిపోతోంది” అంది. ఒళ్ళే లేదుగా? అనబోయి ఆగాను. అనవసరంగా కోపం తెప్పిమ్చడం ఎందుకు, పని నడిపించుకోవాలిగానీ?
“నన్ను దయ్యం అన్నాడు” అంది. దయ్యాన్ని దయ్యం అనక ఇంకేం అంటారు? అనబోయికూడా ఆగిపోయాను.
“అలా అనొద్దని చెప్తాను” నచ్చజెప్పాను. శాంతించింది. పెద్ద పట్టుదలగలదికాదు. మనిషి అనడానికి లేదు. దయ్యం అనకూడదు. ఆత్మ అంటే సినిమాటిక్‌గానూ, సోల్ అంటే మతం మారినట్టుగానూ వుంది. మాతో కలిసి వుండటంలో తనకీ చాలా కష్టాలు వున్నాయట.
ఇదివరకు అంటే ఇంటాయన ఒక్కడే వుండేవాడు. పిల్లలు ఎక్కడో వుండేవారు. ఆయన ఒక్కడూ పేపరు చదువుకుంటూనో, టీవీ చూస్తూనో ఓమూల కూర్చుని వుండేవాడట. లేకపోతే గార్డెన్లో తిరుగుతూ వుండేవాడట. ఈవిడ కాళ్లకీ చేతులకీ అడ్డంపడేవాడు కాదట. ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తిరిగేదట. ఇప్పుడు అలా కాదు.
“మా వొళ్ళు మీకులా నిండా పదార్ధంతో తయారై వుండదు. ఎలక్ట్రాన్లతో తయారైన మాగ్నటిక్ ఫీల్డులా వుంటుంది. నేనక్కడ కూర్చున్నాననికూడా చూడకుండా ఎవరెవరో వచ్చి మీద కూర్చుంటారు. వస్తువులు విసిరేస్తారు. ఎంత చిరాగ్గా వుంటుంది? నా ఆకారమంతా చెదిరిపోతుంది. మళ్ళీ సర్దుకోవడం నువ్వు చీరకుచ్చెళ్ళు సర్దుకున్నంత తేలిక కాదు” అంది.
అవేనా? ఇంకా చాలా కష్టాలు. చీపురుతో తుడిచినప్పుడూ వాక్యూమ్ క్లీనింగ్ చేసినప్పుడూ చాలా జాగ్రత్తగా అక్కణ్ణుంచీ తప్పుకోవాలి. సాంబ్రాణి పొగా, వూదొత్తుల పొగా పనికి రాదు. ఇలాంటివి చాలా చెప్పింది.
“మరి ఇలా వుండటం దేనికి? అసలు మీ సమస్యేమిటి? నాకు చెప్తే ఏదేనా దారి చూస్తానుకదా?” అడిగాను మృదువుగా.
“చూడబోతే నీకు నన్ను పంపించెయ్యాలనే ఆత్రం ఎక్కువగా వున్నట్టుంది” అలిగింది.
“అలాకాదు, ఈ ప్లేన్‌లో భౌతికపదార్ధంతో తయారైన మనుషులుంటారు. మీది వేరే ప్లేన్. మీరు మాకు కనిపించరు. కనిపించకపోతే వాళ్ళుమాత్రం ఏం చేస్తారు? లక్కీగా మనిద్దరికీ కమ్యూనికేషన్ కుదిరిందిగానీ లేకపోతే ఎలా? ” బుజ్జగింపుగా అడిగాను.
“ఇక్కడ కాకపోతే ఇంకో యిల్లు చూసుకుంటాను. ఇలా ఇల్లూవాకిలీ లేకుండా యిల్లిల్లూ తిరుగుతూ వుండటం కష్టంగానే వుంటుందికానీ, వెళ్ళాలనుకుంటే నాకు ఇళ్ళేలేవా? ఇంకొన్నాళ్ళు ఇలాగే వుండాలి”
“ఎందుకో చెప్పచ్చుగా?”
“చెప్పేదాకా వదిలిపెట్టేలా లేవు” అని సుదీర్ఘంగా నిశ్వసించింది.
“ఇప్పటికి సరిగ్గా ఏదునెలలక్రిందట నేను డ్రైవ్ చేస్తుండగా కారుకి యాక్సిడెంటైంది” చెప్పింది. కుక్కపిల్ల అడ్డొస్తే తప్పించబోతే స్టీరింగ్ కంట్రోల్ తప్పి చెట్టుకి కొట్టుకుందట. ఆ టైముకి పక్కసీట్లో కోడలుందట. ఆపిల్లకి మరీ అంత పెద్ద దెబ్బలు తగల్లేదుగానీ, అప్పటికే పీరియడ్స్ రాక నెలన్నర. గర్భం నిలిచింది. మనవడో మనవరాలో పుడితే చావుతప్పి, బతికి బట్ట కట్టిన ఆ ప్రాణిని చూడాలని మా దెయ్యంగారి కోరిక.
“మరి మీయింటికే వెళ్లకపోయారా?” అని అడిగాను.
“మనిషిగా చచ్చిపోయాక కొన్నాళ్ళు స్మశానంలోనే వుండేదాన్ని. అంతేనేమో జీవితం అనుకున్నాను. నాతోటివాళ్ళు కొందరు చూస్తుండగానే వేరే ప్లేన్‌లోకి వెళ్ళిపోయారు. నేనిలాగే వుండిపోయాను. కొత్తకొత్త దయ్యాలు వస్తున్నాయి. అక్కడి దయ్యాలన్నీ మరీ చిల్లర ఆటలు ఆడటంతో వాటితో కలిసి వుండలేక మా యింటికి వెళ్ళాను… వాళ్ళు నన్ను రానివ్వలేదు… నన్ను వెళ్లగొట్టడానికి ఏవో పూజలవీ చేసారు. నేనిప్పుడు దయ్యాన్నికదా? ” అంది. మనిషైతే తన కళ్ళలో నీళ్ళు చూసి వుండేదాన్ని.
“నేనేమీ మీ పూజలకీ వాటికీ భయపడి పారిపోయి వచ్చేననుకునేవు. అదేమీ కాదు. వెళ్ళిపొమ్మని వాళ్ళంత గట్టిగా అంటుంటే ఎలా వుంటాం? అవమానం కదూ?” అంది తనేమళ్ళీ.
“ఒక నెలో రెండునెలలో వుంటుందట” రాత్రి యశ్వంత్‌తో చెప్పాను.
“పిల్లలని అమ్మావాళ్లదగ్గిరకి పంపిద్దామా?” అడిగాడు.
“స్కూలు?”
“అన్నిరోజులు స్కూలు పోతుందంటే కష్టమే. మనం వచ్చేసిన యిల్లు ఖాళీగానే వుంది. మనకి రెంట్కూడా ఈ నెలాఖరుదాకా వుంది. ఇంకో నెలకూడా అక్కడే వుందాం” అన్నాడు. నాకూ ఆ ఆలోచన నచ్చింది.
“ఈలోగా దయ్యంగారి కోడలెవరో, డెలివరీ అయిందోలేదో తెలుసుకుంటుండాలి” అన్నాడు.
“ఆవిడిని రానివ్వట్లేదందికదా, మరి వెళ్ళి ఎలా చూస్తుంది? చంటిపిల్లలుంటే అసలే రానివ్వరు”
మా దయ్యంగారి సమస్యా, మా సమస్యా ఒకదానిచుట్టూ ఇంకొకటి తిరుగుతుండగా, మర్నాడు పొద్దున్న వూహించనివిధంగానూ అమర్యాదాకరంగానూ పరిష్కారమైపోయింది.
పొద్దుట ఎనిమిదిగంటల వేళ… మేం హాల్లోనూ, మా దయ్యంగారు ఉయ్యాల్లోనూ కాఫీ తాగుతున్న వేళ… కాలింగ్ బెల్ మోగింది. తీసాను. పక్కింటాయన. గృహప్రవేశానికి పిలిచాం. వచ్చాడు. మళ్ళీ ఇదే రావటం.
“రండి” ఆహ్వానించాడు యశ్వంత్.
“రావటం, కూర్చోవటం కాదు. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపొండి. ఇందులో దయ్యాలున్నాయి. మీకు అమ్మినాయన భార్య దయ్యమై తిరుగుతున్నట్టుంది. మీరు రావటం యిష్టంలేదేమో! మీ బట్టలవీ గాల్లో తిరుగుతుంటే చూసాను. ఒకసారి కాదు, అనేకసార్లు… మీ యింట్లోంచీ వస్తువులు గాల్లో తేలుతూ రావటంకూడా చూసాను. మా ఆవిడైతే గజగజ వణికిపోతోంది. ఆంజనేయ దండకం వదలకుండా చదువుతోంది” అన్నాడు.
దయ్యం సంగతి నాకు తెలుసనీ, ఇల్లమ్మినాయన భార్య కాదనీ, ఇంకో నెలో రెండునెలలో వుండి వెళ్ళిపోతుందనీ ఎలా చెప్పను? నన్ను తీసుకెళ్ళి ఏ పిచ్చాసుపత్రిలోనో పడేసే ప్రమాదం వుంది.
“దయ్యమా, అమ్మా? నువ్వు మేజిక్ చేస్తున్నావనుకున్నాను. నేననలేదా, ఇది హాంటెడ్ హౌస్లా వుందని?” అక్కడే వున్న మా ఫైర్‌బ్రాండు అంది. పిల్లలిద్దరి కళ్ళలో భయం. నేను యశ్వంత్కేసి చూసాను. ఏం మాట్లాడద్దన్నట్టు సౌంజ్ఞ చేసాడు.
“ఔనమ్మా! ఈ యింట్లో దయ్యం వుంది. మిమ్మల్నేమీ చెయ్యలేదు. అదృష్టవంతులు. ఇక్కడినుంచీ వెళ్ళిపోయి శాంతీ అదీ చేయించుకుంటే వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ రావచ్చు” అన్నాడు. అది భయంతో నన్ను అతుక్కుపోయింది.
అదేసమయానికి నాకు ఎదురుగా రెండు చింతనిప్పుల్లాంటివి గాల్లో కనిపించాయి. ఆ తర్వాత చేతిగోళ్ళు కనిపించాయి అవి చాలా వాడిగా వున్నాయి.
“వద్దు” పక్కింటాయనవైపుకి సాచుతుంటే నెమ్మదిగా అన్నాను. కళ్ళలోకి చూడకూడదు. నన్ను పొసెస్ చెయ్యటానికి అవకాశం వుంది. నామాటకి విలువ యిచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆ రెండుకళ్ళూ క్రమంగా దూరమౌతూ గేటుదాటి వెళ్ళిపోవటం చూసాను.
పక్కింటాయనకి భయం. దగ్గరుండి శాంతులన్నీ చేయించాడు. మేము మా పాతయింట్లో రెండునెలలుండి వచ్చాము. మేము వెళ్ళిన సమయంలో దయ్యంగారు మా యింట్లోనే వుందా? కోపం వచ్చిందికదా, ఇంకెక్కడికేనా వెళ్ళిపోయిందా? కోడలికి డెలివరీ అయిందా? పుట్టిన బిడ్డని చూసిందా? మరో ప్లేన్‌లోకి వెళ్ళిపోయిందా? ఎన్నో సందేహాలు.
మళ్ళీ ఎప్పుడూ మాయింట్లో టీ, కాఫీకప్పులూ, బట్టలూ గాల్లో ఎగరలేదు. ఖాళీ వుయ్యాల వూగలేదు. పిల్లలు మాత్రం వాళ్ళ వస్తువులు తారుమారవటంగురించి చెప్పుకుంటూ పెరుగుతున్నారు.
“దయ్యాలేమిటి? తెలివితక్కువగా…” అనుకుని ఇంకాస్త పెద్దయ్యాక నవ్వుకుంటారు. దేవికి తను చూసిన గాల్లో తేలే కాఫీకప్పు గుర్తొచ్చినా, “దాని వెనుక వున్న సైన్సేమిటి?” అని ప్రశ్నించుకుంటుంది తప్ప, నిజమని నమ్మదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
కొత్తదనంతో, బాగుంది
Thank you a di