పరంపర by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

(2000కి ముందు కథ)

ఒక్కసారి మూడు సందిగ్ధాలలో ఇరుక్కుపోయాను. మూడిటి వెనుకా వున్నది ఒకటే. డబ్బు. ఏ ఒక్క అవసరానికీ చాలనంత డబ్బు.
“ఇంటి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అన్నయ్యా! ఒక్కసారి కట్టించుకుంటాంగానీ పదేపదే కట్టించుకోము కదా? గ్రానైట్ వేద్దాం అంటోంది అశ్విని. అలాగే గోడలకు డిస్టెంపరుకూడా. డాబా పిట్టగోడ, ప్రహరీ మిగిలిపోయాయి. మళ్లీమళ్లీ పని పెట్టుకోకుండా అన్నీ ఒక్కసారే పూర్తి చేసేద్దామని అనుకుంటున్నాము. ఇంకా రెండుమూడు లక్షలయినా అవసరం అయ్యేలా ఉంది. దొరికినచోటల్లా అప్పు చేశాను. ఇంకెక్కడా పుట్టే అవకాశం లేదు. నా జీతంకూడా పర్మిట్ చెయ్యదు. నువ్వే పిఎఫ్‍లోనో, బ్యాంకులో పర్సనల్‍లోనో తీసుకుని సర్దాలి. నేను కొంచెం సర్దుకోగానే తిరిగి ఇచ్చేస్తాను” అని ఉదయ్ ఫోన్ చేసిన కాసేపటికే మంజు చేసింది.
వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరేలా ఉందిట. పదిదాకా అడుగుతున్నారట. ఎనిమిదిమించి ఇవ్వనని వాళ్ళాయన కిషోర్ కచ్చితంగా చెప్పేశాడట.
“అలా అనుకుంటే ఎలా కుదురుతుందిరా? మంచి సంబంధం. వదులుకుంటే మళ్లీ అలాంటిది దొరుకుతుందా? అన్నయ్యా! నువ్వే ఎలాగైనా ఆ రెండూ సర్దాలిరా. చిన్నన్నయ్యని అడుగుదామంటే వాడు ఇల్లు కడుతున్నాడు. నిండా అప్పులతో ఉన్నాడు. ఎలా అడగను? ఖర్చులో ఖర్చని వాడనుకున్నా వదిన పడనివ్వదు. నీమీదే నా ఆశలన్నీ. ఈ సంబంధం కుదిరిపోతే నిరూ సుఖపడుతుంది. ఇంక మనం తిరిగి చూసుకోనక్కర్లేదు” అంది.
ఈ రెండూ విన్నాక నా భార్య విజయ అల్టిమేటం ఇచ్చేసింది.
“మీ తమ్ముడు ఇరవైలక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాడు. గృహప్రవేశానికి మనం వెళ్ళాలి. నాకు నగలు ఏమీ లేవు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెపుతున్నారు. అసలే మీ మరదలికి నెత్తిమీద ఉంటాయి కళ్ళు. ఈ అవతారంతో ఇలాగే వెళ్లానంటే పనివాళ్ళమధ్య కూర్చోబెట్టి మర్యాదలు చేసి పంపుతుంది. ఇక మీ చెల్లెలు… అమెరికా అల్లుడిని తెచ్చుకోబోతోంది. కనీసం సెకండ్‍హ్యాండ్ కారేనా లేకపోతే వాళ్లకార్లలోనూ వీళ్ళకార్లలోనూ తిరిగే దేభ్యంముఖాలలా కనిపిస్తాం. అప్పే చేస్తారో, మరేం చేస్తారో మీ ఇష్టం. నాకుమాత్రం రెండుజతల గాజులు, వసంతహారం, నెక్లెస్ కావాలి. మా తమ్ముడు కారు మారుస్తాడట. పాతది మనం తీసుకుందాం. లేకపోతే ఈ ఫంక్షన్స్‌కి నేను రాను. మీరొక్కరూ వెళ్లి వచ్చేయండి”
నాకు ఎటూ తోచలేదు. మహా అయితే లక్షన్నరో రెండులక్షలో ఉంటాయి నా దగ్గర. ఎక్కువగా లోన్లు తీసుకుంటే తీర్చగలిగే శక్తి లేదు. విజయ మాటల్ని తీసిపారేయడానికీ లేదు. అశ్విని మనుషుల్ని డబ్బుతో కొలుస్తుంది. ఆ విషయం నాకు తెలీనిది కాదు. మంజు అలాంటిది కాకపోయినా కార్లున్న పదిమందిమధ్య కారు లేకుండా మేము ఉండటమనేది మాకూ వాళ్లకీ కూడా ఇబ్బంది కలిగించే విషయమే. ఎవరిది ఖచ్చితమైన అవసరమో తేల్చుకోలేకపోతున్నాను.
ఈలోగా మళ్లీ ఫోన్లు.
“ఏం చేశావన్నయ్యా? లోన్‍కి అప్లై చేశావా?” అని ఉదయ్ ….
“వాళ్లకి మాట ఇచ్చెయ్యమంటావా?” అని మంజు…
“నన్ను కొంచెం ఆలోచించుకోనీవే. ఉన్నపళంగా రెండులక్షలంటే ఎక్కడినుంచి తేను? మీ అందరికన్నా చిన్న ఉద్యోగం నాది, అంతంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?” నా మాటల్లో కొంచెం విసుగు కనిపించిందేమో తను చిన్నబుచ్చుకుంది.
“మీ పిల్లలు చిన్నవాళ్లు. నీకు బాధ్యతలు కూడా లేవు. అందుకని ఆపాటి ఉండకపోతాయాని అడిగాను. అంత ఇబ్బంది అయితే వద్దులే. ఏదో ఒక తలకి మాసిన సంబంధమే కుదుర్చుకుంటాం” నిష్టూరంగా అంది.
“ఉదయ్‍కూడా వాడి ఇంటి విషయంలో డబ్బు సర్దమని అడిగాడు” అర్ధంచేసుకుంటుందని అన్నాను.
“ఇంటి పని వేరు, పిల్ల పెళ్లి వేరు. డబ్బు చాలకపోతే ఇంటిపని ఆపుకోవచ్చు” అంది తను.
“కిషోర్‍తో నేను మాట్లాడనా?”
“ఏం మాట్లాడుతావు? ఆ రెండూ మీరిచ్చేట్లైతే సంబంధం వప్పుకుందామన్నారు. అందరిమధ్యలో ఒక్క ఆడపిల్ల”
నేను జవాబేమీ చెప్పకుండా ఫోన్ పెట్టేసాను. విజయ అక్కడే ఉంది. విషయం గ్రహించినట్లుంది, కోపంగా వెళ్ళిపోయింది. అమ్మకూడా అక్కడే ఉంది. తనకేసి సాలోచనగా చూశాను.
“మా పెద్దన్నయ్యని సలహా అడుగు” అంది నెమ్మదిగా.
నేను ఆశ్చర్యంగా చూశాను. ఒక గొడవ కారణంగా వాళ్లకీ మాకూ మధ్య రాకపోకలూ, పరామర్శలూ ఆగిపోయాయి. చాలా కాలమైంది. గొడవ….
ఇంటర్మీడియట్ పాసయ్యానప్పటికి. మంచిమార్కులు వచ్చాయి. ఎంసెట్‍లో మంచిర్యాంకూ వచ్చింది. అప్పట్లో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. మాకు దగ్గర్లో అంటే వరంగల్లోనూ, హైదరాబాద్‍లోనూ ఉండేవి. ఎంసెట్ రాయడమైతే రాసానుగానీ అంతంత ఫీజులు కట్టి హాస్టల్లో పెట్టి చదివించటం తనవల్ల కాదన్నారు నాన్న. అమ్మ ఆశలన్నీ నామీదే. ఏడ్చింది. గొడవ చేసింది. నాన్న వినలేదు. తనకి పెళ్లప్పుడు ఇచ్చిన అరెకరం అమ్మి చదివించమంది. మంజుకి పెళ్లి ఏం పెట్టి చేస్తావని అడిగారు నాన్న. ఆయనది ఎల్‍డి‍సి ఉద్యోగం. నెలాఖరులో చేబదుళ్లు తీసుకోకుండా ఏ నెలా గడిచేది కాదు. ఏదో ఒకలా నాకు పెద్ద చదువు చెప్పిస్తే మంచి ఉద్యోగం వచ్చి కుటుంబపరిస్థితులు బాగుపడతాయని ఆమె ఆలోచన, పద్దెనిమిదేళ్లు నిండగానే తనలాగే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని కుటుంబానికి ఆసరా అవాలని నాన్న కోరిక. ఇద్దరూ బాగా గొడవపడ్డారు. అమ్మ తాతయ్య దగ్గరికి బయల్దేరింది. వాళ్ళూ, పెద్దమామయ్యావాళ్ళూ కలిసే వుంటారు.
“నీమీద కొండంత ఆశతో వచ్చాం అన్నయ్యా! వీడికి చదువు చెప్పించి నీ అల్లుడిని చేసుకో” అంది.
మామయ్య నవ్వి, “రెండు విషయాలూ కలపకమ్మా! బావ చెప్పించలేని చదువు నేను మాత్రం చెప్పించగలనా? నాదీ చిన్నజీతమే కదా? నాకూ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు ఎదుగుతున్నారు. బావ చెప్పినట్టు బియ్యేలో చేరి పద్దెనిమిది నిండగానే ఏదైనా జాబ్ వెతుక్కుని ఈవినింగ్ కాలేజీలో చదువుకుంటే సరిపోతుంది” అన్నాడు.
అమ్మ హతాశురాలైపోయింది. “తెలివైనవాడు. పైకి రావలసినవాడు. నువ్వూ అలాగే అంటే ఎలా అన్నయ్యా ! నువ్వు కాదనవని ఎంతో ఆశతో వచ్చాను. అప్పుగానే సర్దన్నయ్యా! వాడికి ఉద్యోగం రాగానే తీర్చేస్తాడు. లేకపోతే నీ కూతుర్ని ఇచ్చి చెయ్యి” అంది.
“అవన్నీ జరగని పనులేవే! మన తాహతెంతో అంతలోనే ఆలోచనలు ఉండాలి. అందని ఎత్తుకి ఎగరడం దేనికి?” అన్నాడు.
బామ్మా, తాతయ్యా అక్కడే ఉన్నారు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మామయ్యకి నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఎంతో నిరాశతో తిరిగొచ్చాం. ఆరోజు తర్వాత మామయ్యావాళ్ళతో మాకు తెగిపోయినట్టే. రాకపోకలు ఆగిపోయాయి. పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లలోనూ బయటివాళ్ళలాగా కలుసుకునేవాళ్ళం. వాళ్ళు ఏమేం కొనుక్కున్నారో, అత్తయ్యకి ఏమి నగలు చేయించాడో, వాళ్ల పిల్లలు ఎలా చదువుతున్నారో, ఎక్కడ చదువుతున్నారో డేగకళ్లతో గమనించేది అమ్మ.
“నిన్ను చదివించడానికి డబ్బుల్లేవన్నాడా, అత్తయ్యకి చూడు, నానుతాడు, గాజులు చేయించాడు… స్కూటర్ కొనుక్కున్నాడు. చదువుకుంటానని ఏడ్చిన పిల్లాడికి చదువుమాత్రం చెప్పించడానికి చేతులు రాలేదు” అనేది.
నాకుకూడా అలాగే అనిపించేది. మామయ్య ఆరోజున సాయం చేసి నన్ను చదివించి ఉంటే ఈరోజుని నేను ఎంతో ఎత్తుని ఉండేవాడినని ద్వేషిస్తూనే గడిపాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. తనమీది పంతంతోటే నాన్న వద్దన్నా తమ్ముడు బీటెక్ చదువుతానంటే కొంచెం కష్టమైనప్పటికీ చదివించాను. మంజుకి మంచిసంబంధం చూశాను. కిషోర్, ఉదయ్ ఇద్దరూ సాఫ్టువేర్ ఇంజనీర్లు. బాగా సంపాదించుకుంటున్నారు. నా కళ్ళముందు పెరిగి నేను చేయూతనిస్తే ఎదిగిన ఇద్దరూ ఈ రోజున నాకన్నా ఎత్తున ఉన్నారు. సంతోషమే కానీ మా జీవనశైలిలో స్పష్టమైన బేధం. ఈ బేధం ఇలా ఉండటానికి కచ్చితమైన కారణం ఉంది. మామయ్య ముందుకు వచ్చి నన్ను చదివించకపోవడం. అది నన్నెప్పుడూ గుచ్చుతునే ఉంటుంది. అమ్మకూడా ఆ విషయాన్ని చాలాకాలందాకా మర్చిపోలేదు. అలాంటిది, ఇప్పుడు తను ఇలా అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
“కొన్నికొన్ని విషయాలు అర్థం కావడానికి వయసు రావాలి. భ్రమలూ, ప్రలోభాలూ తగ్గాలి, మా నాన్నకి ఐదుగురు పిల్లలం. ఇద్దరు మగ, ముగ్గురు ఆడ. నాన్నది పల్లెటూరు. వ్యవసాయం ఉండేది. వరుసకరువులతో అల్లాడిపోతున్నరోజుల్లో అన్నయ్య బిఏ చదువుతూ ఆపేసి ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పల్లెటూరునుంచి తీసుకొచ్చి మా ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాడు. తమ్ముడిని చదివించాడు. వదినకూడా చాలా మంచిది. మమ్మల్ని సొంత చెల్లెళ్ళలా చూసుకుంది. మాకుమాత్రం తను పరాయిదనిలాగే అనిపించేది. అన్నయ్యమీద మాకు పూర్తి హక్కు ఉన్నట్టూ, తను అప్పనంగా మామీద పడి తింటున్నట్టూ అనిపించేది, అన్నయ్యకు మాత్రం తనింటి చాలా ఇష్టం, గౌరవం. తన సలహా లేకుండా ఏదీ చేసేవాడు కాదు”
“…”
“నిన్ను ఇంజనీరింగ్ చదివించాలనే తపన తప్ప అందులోని సాధ్యాసాధ్యాల గురించి నేను ఆలోచించలేదు. మీ నాన్న కాదన్నారు. అన్నయ్య చదివిస్తాడని పిచ్చినమ్మకం. అన్నయ్య దగ్గర మాత్రం ఎక్కడిది అంత డబ్బు? తనకీ పెళ్లయింది. భార్యాభర్తలిద్దరికీ కొన్నికోరికలూ ఆకాంక్షలూ ఉంటాయి. వాళ్ల పిల్లల్ని చదవించుకోవడానికి పునాదులు చేసుకోవాలి. తన జీవితం తనది… ఇవన్నీ నేను ఆలోచించలేదు. నాకు నువ్వు ముఖ్యం, అలాగే వాళ్లకి వాళ్ల పిల్లలు ముఖ్యం అవుతారనిపించలేదు. చదివించినన్నాడని చాలాకాలం వాడిని ద్వేషించాను. మీ నాన్న కాదన్నప్పుడు నేను అక్కడితో ఆగిపోవలసినది. అన్నయ్యని అడిగి లేదనిపించుకున్నాను. అది మీ నాన్న అహాన్ని గాయపరిచింది. దూరాన్ని పెంచుకున్నారు. నాకు నిర్దేశించారు. ఇప్పుడు అలోచిస్తే అనిపిస్తుంది, ఎంత తెలివితక్కువతనమో!”
“తను కొంచెం రిస్కు తీసుకుని నన్ను చదివించి ఉంటే చాలా బాగుండేదికదమ్మా! ఉద్యోగం రాగానే తిరిగి ఇచ్చేసేవాడిని” అనకుండా ఉండలేకపోయాను.
“వాళ్ల అవసరాల టైంకి నీకు ఉద్యోగం రాకపోతే? నువ్వు తిరిగి ఇవ్వకపోతే? వాళ్ల పిల్ల నీకు నచ్చకపోతే?”
ఇబ్బందిగా అనిపించింది నాకు. నేను అంత చెడ్డవాడినా?
“మన మధ్యతరగతి కుటుంబాల్లో జీవితాలు సుఖసోపానాలు కావు. మనకన్నా పెద్దవాళ్లు మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలనీ బాధలనీ మనకన్నా ముందే అనుభవించి బయటపడి ఉంటారు. వాళ్లు కాస్త రిలాక్స్ అవుతున్న సమయం చూసి మనకన్నా వాళ్లు సుఖపడిపోతున్నారనుకుని వాళ్లకి మన సమస్యలని బదలాయించాలని చూస్తాం. అది తప్పు. ఇవన్నీ వయసుమీద అర్ధం కావాల్సిందే తప్ప ఒకరు చెప్తే తెలియవు. నిన్ను చూశాక పూర్తిగా అర్ధమయ్యాయి. ఇంటర్ పాసవగానే ఉద్యోగంలో చేరావు. ఉదయ్, మంజూల చదువులోనేగానీ, మంజు పెళ్లికిగానీ నాన్నకి సహకరిస్తూనే ఉన్నావు. దానివలన నువ్వేం లాభం పొందావు? వాళ్ళిద్దరూ పైకి వచ్చారు. సంతోషం. దానివలన నీకూ నీ భార్యాపిల్లలకీ ఏం వొరిగింది? ఒక్క పాతికవేలు తనవి కావనుకుని నీకు కానుకగా ఇవ్వగలిగాడా ఉదయ్ ఎప్పుడైనా? పెళ్లవగానే వేరు వెళ్ళిపోయారు. అప్పట్నుంచీ వాళ్ల డబ్బు వాళ్లదే. నా పెన్షన్‍కూడా లెక్క అడుగుతుంది అశ్విని. ఎప్పుడూ ఒక చీరకూడా నాకు కొనివ్వలేదు తను. అన్నీ విజయ చూసుకుంటుంది. ఐనా ప్రతిదానికీ లెక్కలే” బాధపడుతూ అంది. ఈ విషయాలు నాకు తెలియవు. నాదాకా రానివ్వదు విజయ.
“అన్నదమ్ములు సాయం చేసుకోవడం తప్పదు. కానీ మన సమాజంలో అవి పారస్పరికరంగా ఉండవు. ఒకళ్ళు ఎప్పటికీ తమకి సాయపడుతూ ఉండాలని ఆశిస్తారు. అది సంస్కృతిలో ఉన్న లోపమేమో! వాళ్ళిద్దరికీ చెయ్యగలిగినంత చేశావు. ఇంక మీ పిల్లల గురించి ఆలోచించుకోవడం మంచిది. విజయకూడా అన్నిటికీ మనతో సమానంగా సర్దుకుంటూనే గడిపింది. దాన్ని సంతోషపెట్టడం నీ బాధ్యత. తాహతుకిమించి ఖర్చుపెట్టి ఇల్లు కట్టడం ఉదయ్ తప్పు. ఇవ్వలేనంత డబ్బుతో అల్లుడిని కొనాలనుకోవడం మంజు తప్పు. మరొకళ్ళ శక్తిని అంచనావేసుకుని ఎగరాలనుకోవటం ఇద్దరూ కలిసి చేస్తున్న తప్పు”
అమ్మ మాటలు నన్ను కదిలించాయి. తనని తదేకంగా చూశాను. చాలా పెద్దదైపోయింది. వాళ్ళ పెద్దన్నయ్యని చూడాలన్న తపన కళ్ళలో కనిపిస్తోంది. అది భౌతికంగా కాదు. మనసులో వున్న హద్దులన్నీ చెరుపుకుని.
“అలాంటి తప్పు చేసి నేను తండ్రి తరువాత తండ్రిలాంటి అన్నయ్యని దూరం చేసుకున్నాను. వాడు మమ్మల్ని చాలా ప్రేమించేవాడు. ఆ ప్రేమే లేకపోతే మా పెళ్లిళ్లకోసం అప్పులు చెయ్యడు. పొలం అమ్మడు, ఏదో ఒక సంబంధమని చేసి వదిలించుకునేవాడు. మా పెళ్లిళ్లయ్యాకకూడా పండగలకీవాటికీ వెళ్ళినప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది వదినచేత చేయించి పెట్టేవాడు. అవన్నీ పైపై ప్రేమలని హేళన చేశాను. వాడితో మాట్లాడాలనీ, వాడి ఇంటికి వెళ్లాలనీ ఇప్పుడు ఎంతగానో అనిపిస్తుంది కానీ ఆ ప్రేమలు మళ్లీ తిరిగి రావు” అమ్మ గొంతు రుద్దమైంది.
నేను పెద్దమామయ్య ఇంటికి వెళ్లాను. చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్యా మామయ్యాను. మామధ్య ఏమీ జరగనట్టే నన్ను ఎంతో అభిమానంగా ఆహ్వానించారు. వాళ్ల పిల్లల్లో పెద్దవాడు బొంబాయిలో చేస్తున్నాడట. రెండోది మణి. తననే నాకు చెయ్యమని అప్పట్లో అమ్మ అన్నది. మణికి పెళ్లయి ఢిల్లీలో ఉంటుందట. చిన్నవాడు వాళ్ల కంపెనీనుంచి అమెరికా వెళ్ళాడట.
“పిల్లలకోసం అంత ఆరాటపడతాం. పెద్దయి వాళ్ల దారి వాళ్లు చూసుకున్నాక కానీ తెలిసిరాదు, మన ఆరాటం ఎంత అర్థరహితమైనదో” అంది అత్తయ్య.
“హాయిగా ఝామ్మంటూ ఉన్నాంలేవే. ఎక్కడికంటే అక్కడికి వెళ్లి వస్తున్నాం” అని వోదార్చాడు మామయ్య.
“మా ఇంటికి రావాలని ఎప్పుడూ అనిపించలేదా?” అని అడగాలనిపించిందిగానీ అడగలేకపోయాను.
“ఏవో అనుకుంటాం. అప్పట్లో మాదగ్గర అంత డబ్బు లేదు, చదివించలేనన్నారు మామయ్య. దానికే సంబంధాలు తెగ్గొట్టుకుంటారా? భలే పట్టుదల మీఅమ్మకి, మళ్లీ మా గడప తొక్కింది కాదు. మాటలూ ఏదో మొక్కుబడిగానే. తప్పనిసరైతేనే. అమ్మమ్మ, తాతయ్య పోయినప్పుడు ఆ పల్లెటూరు వచ్చి అట్నుంచి అటే తిరిగి వెళ్ళిపోయింది. మీ నాన్న పోయాకకూడా బాబాయ్య ఇంటికి వెళ్ళింది కానీ మా ఇంటికి రాలేదు. ఇంతకీ ఎలా ఉంది?” అడిగింది అత్తయ్య.
అక్కడ జరిగిన విషయాలు చెప్పాను.
“నేననే మాటలు నీకు కష్టం కలిగిస్తాయేమో! అనుభవంమీద చెప్తున్నాను. ఎవరైనా ఒంగి ఉంటే చాలు, వాళ్ల వీపు ఎక్కేద్దామని చూస్తారు. ఎవళ్ళేనా మరొకళ్ళ బరువు ఎందుకు మొయ్యాలి? మీ అమ్మావాళ్లలాగే నేనూ పుట్టాను. అందరికన్నా పెద్దవాడినికాబట్టి నాన్నకి సాయపడవలసిన బాధ్యత వుంటుంది, ఎంతదాకా? మరొకళ్ళు అంది వచ్చేదాకా. ఆడపిల్లలకి పెళ్లిళ్లు అయ్యాయి. పెట్టవలసినవేవో పెట్టి పంపించాము. వాళ్ల జీవితాలు ఆపైన భర్తలని అనుసరించుకుని. అది అర్థంచేసుకోకపోతే ఎలారా?”
“ఇప్పుడవన్నీ ఎందుకులెండి? రాక రాక వచ్చాడు. పాత విషయాలన్నీ తవ్వుకోవడం దేనికి?” అంది.
“చెప్పనీ అత్తయ్యా! నేనిప్పుడు అవే పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను. అందుకే తల తిరిగి చేతికొచ్చి మీ ఇల్లు కనిపించింది” అన్నాను నవ్వుతూ.
“ఏమిటి? ఉదయ్ డబ్బు సర్దమంటున్నాడా? చాలా బాగా కట్టిస్తున్నాడట కదా, ఇల్లు? ఇరవైదాకా వచ్చిందని విన్నాను. ఇంకా పూర్తవలేదట. కాస్తంత వెసులుబాటు కలిగాక అద్దె తప్పుతుందని రెండుగదులు వేసుకోవాలి. అంతేగానీ ఎందుకురా, అంత పెద్దిల్లు, అన్ని హంగులు? ఊరినిండా అప్పులు చేసి, నిద్రలేని రాత్రులనీ, అనారోగ్యాలనీ కొనుక్కోవడం తప్పిస్తే?” అన్నాడు.
సరిగ్గా నాకూ అలాగే అనిపించటం విశేషం. ఎవరి ఆలోచనలేనా స్వంత కష్టం వచ్చాకే సంస్కరించబడతాయి.
“ఇంకా మూడులక్షలదాకా అవసరం పడతాయన్నాడు. ఆ డబ్బు నన్నిమ్మంటున్నాడు” అన్నాను.
“తిరిగొస్తాయని ఆశపడకపోతే ఇవ్వచ్చు. వాడు ఇప్పటప్పట్లో కోలుకోవడం కష్టం. అందులో వాడి భార్యది చాలా భారీ చెయ్యి “
“నీకు తెలియనిది ఏముంది మావయ్యా? నా దగ్గర అంతెక్కడిది? మా పిల్లలు అప్పుడే ఎనిమిదీ తొమ్మిదీను. వాళ్లకి టెన్త్‌కీ ఇంటర్‍కి ఎంత కావాలో! ఇప్పటినుంచీ దాస్తేనేకదా, అప్పటికి ధైర్యం చెయ్యగలిగేది? అదీకాక విజయకి సూత్రాలగొలుసు తప్ప పెద్దగా బంగారం ఏమీ లేదు. నలుగురిలోకీ వెళ్లాలంటే చిన్నతనం పడుతోంది. ఇప్పుడు బంగారంమీద పెడితే తర్వాత కావాలంటే దానిమీదే లోన్ తీసుకోవచ్చని ఆలోచన” అన్నాను.
సరిగ్గా ఇలాగే మామయ్య కూడా అప్పట్లో మాట్లాడినట్టు గుర్తొచ్చింది. తగ్గట్టుగా అన్నాడు. “మీ అమ్మ నిన్ను చదివించమని అడిగింది. నిన్నొక్కడినీ చదివిస్తే సరిపోతుందా? మిగిలినవాళ్లు వాళ్ళ పిల్లలని పట్టుకొస్తారు. ఇలా ఎంతకాలం? నేనూ వాళ్లలాంటివాడినే. నాకూ కోరికలుంటాయి. భార్యా పిల్లలతో సరదాగా గడపాలని ఉంటుంది. పసుపుతాడుతోటీ ముతకచీరతోటీ సంతోషంగా వుండమని నాభార్యకెలా చెప్పను? ఆమె అలా బతకడానికి నా ఇంటికి రాలేదు. పిల్లలున్నారు. కనమని వాళ్లు అడగలేదు. వాళ్లని చదివించకుండా భవిష్యత్తు తీర్చిదిద్దకుండా ఎలా? మీకోసం తలకు మించిన అప్పులు చేసి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటే ఈ రోజున ఈ నిశ్చింతా, ప్రశాంతతా ఉంటాయా?”
అందరినీ మధ్యతరగతి జీవితాలే. ఎవరి దగ్గరా అవసరాలకు మించిన డబ్బు ఉండదు. ప్రాథమ్యాలని మనమే నిర్ణయించుకోవాలి. దేనికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామనేదానిమీద మన సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయి.
“మనం తింటూ తోటివాడు పస్తులుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు. ఆడపిల్లకి పెళ్ళే చేయలేని పరిస్థితిలో ఉన్నారనుకో, పట్టనట్టు ఊరుకోవడం తప్పు. అంతేగానీ వాళ్ల విలాసాలకి సర్దుబాటు చేయలేకపోతే బాధపడక్కర్లేదు” అన్నాడు.
నా మనసు తేలికపడింది. అస్పష్టంగా వున్న నా ఆలోచనలే ఆయన నోటినుంచీ వినిపించడంతో నాది తప్పుదారి కాదని అర్థమైంది.
ఆరోజుకి అక్కడే ఉన్నాను. మామయ్య పిల్లలతో ఫోన్లో మాట్లాడాను. వాళ్ల నెంబర్లు తీసుకున్నాను. మనసు ఎంతో తేలిక పడింది. పునరుద్ధరించబడిన ఈ అనుబంధం హాయినిచ్చింది. ఆరోజున నేను బియ్యేలో చేరి మామయ్యకి చెప్పడానికి వెళ్లి ఉంటే నాకు ఒక జత బట్టలు, వాచీ కొనిచ్చి ఆశీర్వదించి పంపివాడేమో! ఆ బంధాలు అలాగే నిలిచి ఉండేవి. మానవ సంబంధాలలోని మర్మం అర్ధమైంది.
నేను తిరిగి వచ్చాను. విజయ అడిగినవి కొన్నాను.
“నువ్వు కొంచెం ముందుగా అడిగి ఉంటే బావుండేదిరా! చేతిలో కొద్దిగా డబ్బుంటే ఖర్చయిపోతుందని వదినకి బంగారం కొనేసి, చవకలో సెకండ్ హ్యాండ్ కారొస్తే తీసుకున్నాను” అన్నాను ఉదయ్‍తో.
“అవన్నీ ఇప్పుడు అంత అవసరమా అన్నయ్యా? ఇక్కడ డబ్బు చిక్కక నేను అవస్థ పడుతుంటే?!!” విసుక్కున్నాడు వాడు. చివుక్కుమనిపించింది.
మంజుకీ అదే చెప్పాను.
“మేనమామలు ఉన్నారని ఆశపడ్డాను. దాని అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది” అంది నిరాశగా… తను కన్నబిడ్డ అదృష్టానికి నన్ను కర్తని చేస్తూ.
మా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి… అప్పుడు మామయ్యతో జరిగినట్టే .