“ఎప్పుడు వచ్చావ్ చంద్ర?” అని వినపడగానే వెనక్కి తిరిగాడు ఆ యువకుడు.
తన వెనకే వస్తూ ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్న రామారావు కనపడగానే చిరునవ్వుతో చేతులు జోడిస్తూ ముందుకు వంగి ఆయనకి పాదాభివందనం చేసాడు చంద్ర. అతని భుజాలు పట్టుకొని లేపుతూ “అభీష్టసిద్ధిరస్తు” అని దీవించి సోఫా చూపించాడు రామారావు. ఎంతో వినయంగా సోఫా అంచునే కూర్చుని ఆయన మాట్లాడతాడేమో అని చూస్తున్నాడు చంద్ర. ముందుకు వంగి టేబుల్మీంచీ కంటి అద్దాలు తీసుకొని పెట్టుకొని, ఎదుటి సోఫాలో కూర్చొంటూ-
“లక్ష్మీ! చంద్ర వచ్చాడు, ఏదైనా తినడానికి తీసుకురా” అని చెప్పి “చంద్ర , ఎలా వున్నావు? ” అని అడిగాడు రామారావు.
“మీవల్ల బాగున్నాను మాష్టారూ ! ఆర్మీలో చేరాను” అన్నాడు.
“వెరీ గుడ్! ఎక్కడ పోస్టింగ్?”
“జమ్మూలో ఇచ్చారు. ట్రైనింగ్ అయ్యి మొన్ననే వూళ్ళో అడుగుపెట్టానండీ” చంద్ర జవాబు.
“శుభం, మీ అమ్మానాన్నలకి సంతోషమేనా?” అంటూ చేతిలో స్వీట్స్‌తో వచ్చింది లక్ష్మి. వెంటనే లేచి ఆమె పాదాలు స్పృశించాడు. “ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. లేవవయ్యా” అన్నది లక్ష్మి.
“మీ ఆరోగ్యం బాగుంటుందా అమ్మగారు?” అడిగేడు.
“బాగున్నాను చంద్ర. నువ్వు చెప్పు, అమ్మానాన్నలు ఎలా ఉన్నారు? అన్న, అక్క?” అంటూ యోగక్షేమాలు అడిగింది లక్ష్మి. ఆమెకు సమాధానాలు చెప్తూ, మధ్యమధ్యలో రామారావు అడిగే ఆర్మీ జీవితం గూర్చి చెపుతూ ఓ గంటసేపు కూర్చున్నాడు. రామారావుగారి పిల్లలు అమెరికాలో ఉంటున్నారంటే ఆనందపడ్డాడు. వెళ్లే ముందు తాను తెచ్చిన బట్టలు, పళ్ళు రామారావుదంపతుల చేతిలో పెట్టి మరోసారి నమస్కారం చేసి వెళ్ళాడు.
“కృష్ణ, రాధ పడ్డ కష్టానికి ప్రతిఫలం, చక్కగా స్థిరపడ్డాడు చంద్ర” అని ఆనందపడ్డారు రామారావుదంపతులు.
ఒక్కసారి చిన్నప్పటి చంద్ర కళ్ళముందు కనబడ్డాడు రామారావుకి. హైదరాబాద్ నగరానికి దగ్గరలోని షాద్‌నగర్ దగ్గర తండాలనుండి సిటీకి వచ్చి కృష్ణ, రాధ వాళ్ళ అపార్ట్మెంట్లో పనికి చేరారు. రాధ ఇండ్లలో పనులు చేసుకునేది. కృష్ణ వాచ్‌మాన్‌గా కుదురుకొన్నాడు. పొద్దుటే లేచి కార్లు తుడుస్తూ, కొంత అదనపు ఆదాయం సమకూర్చుకొనేవాడు. వాళ్ల ముగ్గురు పిల్లల్లో చంద్ర చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరినీ ప్రభుత్వహాస్టల్లో ఉంచి, చిన్నకొడుకుని తమ దగ్గర ఉంచుకొని చదివించేవారు. స్కూల్‌కి వెళితే ఒక పూట భోజనం గడిచిపోతుంది అని పంపేవారు అంతే. వర్షాలు లేక, పొలాలు పండక, ప్రభుత్వసహాయం అందక, సిటీదారి పట్టిన కుటుంబాలలో వీళ్ళుకూడా ఒకరు.
చంద్ర ఎప్పుడూ కూడా బయట పరిగెడుతూ,ఆడుతూ కనిపించేవాడు. ఒక రకమైన కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కనిపించేది. ఏదైనా అడిగే తీసుకోవాలని తెలిసేది కాదు. స్వేచ్ఛగా తీసుకోవడం లేదా పోట్లాడి తీసుకోవడం. అపార్టుమెంట్‌లోని పిల్లల ప్రభావంలో ఎక్కువగా ఉండేవాడు. వాళ్ళుకూడా చంద్రని రెచ్చగొట్టి ఏదో ఒక అల్లరిచిల్లర పని చేయించేవాళ్ళు. సీసీటీవీలో రికార్డింగ్ దొరకగానే వీపు చిట్లిపోయేది తండ్రి చేతులో.
“ఎందుకురా అలాంటి అల్లరి పనులు? కుదురుగా చదువుకొంటే దెబ్బలు తగలవు కదా!” అంటే వినేవాడు కాదు.
తండ్రి, తల్లి ఇద్దరూ వాడిగురించి ఎప్పుడూ బాధపడేవాళ్లు. స్కూల్లో మార్కులు బాగానే వచ్చేవి. రోజు ఒక గంట హోమ్‌వర్క్ చేసేవాడికి డెబ్భైశాతం మార్కులు రావడం వాడి తెలివితేటలకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో వాడి ఏకాగ్రత చదువుమీద అంతకన్నా సాగదని రామారావుకి తెలుస్తుండేది. చంద్ర శక్తిని ఏదైనా మంచి దారిలోకి నడిపించాలనిపించేది.
ఒకరోజు కృష్ణ కొడుకుని తిడుతూ, కొడుతూ ఇంట్లోకి తీసుకువెళ్లడం చూసాడు. అప్పుడే ఆపితే చంద్రకి తండ్రి అంటే భయం పోతుందని నిశ్శబ్దంగా బయటకి వెళ్ళిపోయాడు. సాయంకాలం రాధ ఇంట్లో గిన్నెలు తోముతూ లక్ష్మికి కష్టసుఖాలు చెప్పుకొంటోంది.
“అమ్మా, ఆ పిల్లలందరూ డబ్బున్నోళ్ళు. వాళ్ళతో ఆడవద్దు అంటే నా కొడుకు వినడు. వాళ్లేమో పేదోళ్ల బిడ్డని వీడిమీద అన్నీ తోసేస్తారు” అంది.
“ఏమైంది రాధా, కృష్ణ ఈరోజు చంద్రని కొడుతుంటే సార్ చూశారట?” అని లక్ష్మి అడగగానే-
“అందరు పిల్లలు కలిసే సెల్లార్లోకి వెళ్ళారటమ్మా! సీసీ టీవీ కెమెరాలో కూడా అదే కనపడుతుంది. లోపల ఏదో టైర్ దొరికిందట. దాన్ని అంటించి సరదా చూస్తున్నారు. పొగ రాగానే సార్లకి తెలిసి అరవగానే అందరూ పారిపోయారు. వీడు దొరికిండు” అంటూ ముగించింది.
ఒకరోజు రాధ పనిలోకి రాలేదు ఏమైందా అని ఫోన్ చేస్తే, కొడుకు కనపడట్లేదు అని చెప్పింది. మర్నాడు పనిలోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా పనిలో పడింది. ఇంక లక్ష్మి ఉండబట్టలేక అడిగింది.
“ఏమైంది రాధా?”
“ఏమున్నదమ్మా ! రోజూ ఉన్నదే. ఆ రెండో ఫ్లోర్లో పిల్లగాడి పుట్టిన దినం. వీళ్లందరినీ అదేదో బేకరీ అంట, రాజేంద్రనగర్‌కు తీస్కపోయిండు. మస్తు కేకులు, డ్రింకులు తిని, తాగి రాత్రి తొమ్మిదిగంటలకి వచ్చిండు. ముందే చెప్తే పోనీయరని చెప్పకుండా తీస్కపోయిండ్రు. వచ్చినాక వీపు పగలదీసిండు మా ఆయన” అంటూ వాపోయింది.
తరువాత వాడిని దగ్గరకి పిలిచి అడిగితే తెలిసింది. తీసుకెళ్లిన పిల్లలుకూడా ఇంట్లో చెప్పకుండా డబ్బు తీసుకొని పార్టీ చేసుకున్నారని. ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు రామారావు. అందరూ ఎదుగుతున్న పిల్లలు. తల్లితండ్రుల అదుపు లేదు. పాకెట్‌మనీ ఇచ్చి తమ ఉద్యోగాల్లో తీరిక లేకుండా తిరుగుతారు వాళ్ళు. ఎవరైనా వీళ్ల అల్లరి గురించి చెపితే తమ పిల్లలు బెస్ట్ అన్నట్టు మాట్లాడుతారు. నాగరికత ముసుగులో, కోక్, బర్గర్లు కొనిచ్చి రాయల్‌గా పెంచుతున్నామని అనుకొంటారు! నిట్టూర్చాడు.
అంతలోనే మరో సంఘటన.
కొత్త కారుమీద గీతలు గీసారని పార్కింగ్‌లో వాచ్మాన్మీద అరుస్తున్నాడు మా ఎదురింటి అతను.
“ఏమైంది సుభాష్?” దగ్గరగా వెళ్ళాడు.
“చూడండి సర్, కొత్త కారు, వన్ వీక్ కూడా కాలేదు. మేకుతో గీతలు గీశారు” అని వాపోయాడు.
“అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు, మీరు అటు తిరగగానే మళ్ళీ ఏదో చేస్తారు, వదిలేయండి” అని చెప్పి వాకింగ్ వంకతో తప్పుకున్నాడు.
పిల్లల్లో ఎనర్జీ ఎక్కువయ్యి ఇవన్నీ చేస్తున్నారని, కొంతమంది శ్రమదానం పేరుతో అపార్ట్మెంట్ అంతా శుభ్రం చేయించారు. ఓ రెండుసార్లకి అందరు అలసిపోయి వదిలేశారు. ఇంతలో పులి మీద పుట్రలాగా వేసవి శెలవులు వచ్చాయి. ఇంక పిల్లల్ని పట్టుకోవడం కష్టం అయిపోయింది.
రామారావు స్నేహితుడు పదవీవిరమణ తర్వాత స్వస్థలం విజయనగరం చేరుకొని చిన్న ట్యుటోరియల్ నడుపుతున్నాడు. ఆడపిల్లలను మగపిల్లలను సైనిక్ స్కూల్, గురుకుల పాఠశాలకు వాళ్లకిగల అవకాశాలనిబట్టి ప్రవేశపరీక్షలకు తయారుచేస్తూ కాలం గడుపుతున్నాడు.
రామారావు లక్ష్మిని దగ్గర కూర్చోబెట్టుకొని తన ప్లాన్ చెప్పాడు.
“ఈ వేసవిసెలవలు రెండునెలలు రఘు దగ్గరికి వెళదాము. రాధని, చంద్రని తీసుకెళ్దాం. చంద్రకి కోచింగ్ ఇప్పిందాం. వాడి అదృష్టం బాగుంటే సీటు దొరుకుతుంది. సగం ఫీజు ప్రభుత్వం కడుతుంది” అన్నాడు.
లక్ష్మి రాధని పిలిచి అడిగింది.
ఇక్కడ అల్లరిగా తిరగకపోతే చాలనుకొన్నదో ఏమో వెంటనే ఒప్పుకుంది. కృష్ణని కూడా ఒప్పించింది.
చలో విజయనగరం అని బయలుదేరారు. చంద్రకి ఆరవతరగతిలో సీట్ రావాలని రఘు చాలా శ్రమపడి, ముందు కుదురు నేర్పి, ఆనక వజ్రాన్ని సానపెట్టినట్టు పెట్టాడు. ఆ సంవత్సరం ప్రవేశపరీక్ష డిసెంబర్లో వ్రాసేవరకు చంద్రని అక్కడే ఉంచే ఏర్పాటు చేసి, రామారావు, లక్ష్మి, రాధ వెనక్కి వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్ర చాలా చిత్రంగా బుద్ధిమంతుడైపోయాడు. మిగతాపిల్లలతో కలిసి తీరైన ఆటలు, చదువు మొదలుపెట్టాడు. పిల్లలు ద్రవపదార్థంలాంటివారు. ఏ నమూనాలో వేస్తే ఆ అచ్చులోనే తయారౌతారు. సైనిక్స్కూల్లో ప్రవేశం దొరకగానే చంద్రని చేర్పించారు కృష్ణ, రాధ.
ఈమాత్రం సాయానికి అపార్ట్మెంట్లో వాళ్ళందరి దృష్టి రామారావు కుటుంబంమీద పడింది. చిన్నచిన్న గుసగుసలు, కృష్ణ కాస్త వాళ్ల చేతిలో సంచి అందుకున్నా-
“కొడుక్కి ఎక్కడో అడ్మిషన్ ఇప్పించారుకదా అందుకే వెనకవెనకే తిరుగుతారు, మేము పిలిస్తే పలకనే పలకరూ” అంటూ దీర్ఘాలు తీయడం, రాధ ఏదైనా నవ్వుతూ మాట్లాడినా-
“అబ్బో! అప్పుడే కొడుకు ఇంజనీర్ అయిపోతాడని అనుకొంటున్నట్టుంది. ఆర్మీ స్కూల్లో మసలడం మామూలా?” అని అనడం చెవిలో పడుతుండేవి భార్యాభర్తలిద్దరికీ.
అన్నీ దేనిదేనికో ముడిపెడుతూ, మూడోవాళ్ళ జీవితాలలోకి తొంగిచూస్తూ ఒకరకమైన ఆనందం పొందేవాళ్ళు ప్రతీచోటా ఉంటారు. కులమత ప్రాతిపదికలు, గ్రూపిజం, లాబీయింగ్లాంటి రాజకీయదురంధరులు ఉండే అపార్ట్మెంట్లలో ఇవన్నీ సర్వసాధారణం.
చంద్ర దెబ్బలు తిన్నన్ని రోజులూ వాడిని ద్వేషించి, చాక్లెట్లు తెచ్చి పక్క వాచ్మాన్ కొడుక్కి ఇచ్చి ఏడిపించడంలాంటి చిన్నబుద్ధులు చూపించేవాళ్ళు, వాడిని తండ్రి కొడుతుంటే, తమ పిల్లలు ఆ అల్లరిలో సమానభాగస్వాములైనాకూడా వారించనివాళ్ళు, అనుకునే మాటలకి భయపడేదేముంది? ఆ చిన్నవాడికి మంచి జరిగితే చాలనే ఉద్దేశ్యంతో, సహజంగానే సరళస్వభావులైన రామారావుదంపతులు తమ పనుల్లో బిజీ అయిపోయి అందరికీ కొంచెం దూరం మసలడం నేర్చుకొన్నారు.
ఆ తర్వాత రెండేళ్ళకి కాస్త అప్పులు తీరాక, రాధ, కృష్ణ వాళ్ళ ఊరి దారిపట్టారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ పిల్లల ప్రగతిని చెబుతూ, పండే పంటల కష్టసుఖాలు చెబుతూ ఉంటారు.
ప్లస్ టూ పూర్తయిన తర్వాత NDAలో చేరాడు చంద్ర . మెకానికల్ ఇంజనీరయ్యాడు. మిగతా ఇద్దరు పిల్లలనికూడా, గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించారు. పెద్దకొడుకు, అప్పుడే పెట్టిన కంప్యూటర్కోర్సులు చదువుకొని స్థిరపడ్డాడు. కూతురు ఇంకా చదువుతానంటే డిగ్రీ చదివించి, టీచర్ ట్రైనింగ్ చేయించారు. ఇంక పెళ్లి సంబంధాలు చూస్తూండగా చంద్ర ఆర్మీలో చేరాడు.
“నీకు ఏర్‌ఫోర్స్, నేవీలో కూడా అవకాశాలు వచ్చాయని తెలుసు. ఆర్మీనే ఎందుకు ఎంచుకొన్నావు?” మళ్ళీ కలిసినప్పుడు రామారావు అడిగిన ప్రశ్నకి కొంచెం ఆలోచించి “ఏమో మాస్టారూ, నాకు చిన్నప్పటినుండి ఈ నేల ఇష్టం. నదులు, సముద్రాలు ఎప్పుడూ చూసినది లేదు. కాళ్ళు భూమిమీద నిలవడానికి, ఉన్న పొలాలని పండించడానికి, పొలం ఎండిపోతే బోరులకోసం అప్పులకి, అప్పులు తీర్చడానికి పట్నం దారిపట్టడానికి తప్ప, ఈ బ్రతుకుఘర్షణలో మాకు తల ఎత్తి ఆకాశంవేపు చూడడానికి ధైర్యం చాలలేదు. అప్పుడంతా భూమి మీదే ఆధారపడి, అవకాశం దొరికిందని ఆకాశంలోకో, అనంతసముద్రజలాల్లోకో వెళ్లిపోవాలని అనుకోలేదు. ఇప్పటికీ, నా పాదాలకి భూమిస్పర్శ ఎంతో మెత్తగా, హాయిగా ఉంటుంది. కాశ్మీర్లోయలైనా, ఎండిన మా పొలం అయినా! భూమిని కాపాడుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. దాయాదులనుండి, కరువుకోరలనుంచి, అప్పులవాళ్లనుంచి…” అన్నాడు చంద్ర.
భుజం తట్టి పంపగలడుగాని, ఇంకేమి ఇవ్వగలడు తను ఈ సైనికుడికి, భూమిపుత్రుడికి?
పేరు: శైలజా రాంషా
నివాసం: హైదరాబాద్
కార్పొరేట్ ఉద్యోగం
చదువు: తెలుగు సాహిత్యం లో B.A.
అమ్మ సాహిత్య ప్రయాణంలో తోడు వెళుతూ హాజరైన అనేక సాహితీసభలనుండి అందుకున్న చిన్నచిన్న మెరుపులతో సాహిత్యంపట్ల అభిలాష పెరిగింది. కొన్ని సంవత్సరాల జాతీయ పోలీసు అకాడెమీ వుద్యోగం, అక్కడి గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు కధలు వ్రాయాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్నగారు, శ్రీవారి ప్రోత్సాహంతో వ్రాయడం మొదలైంది. పత్రికలు ప్రచురించడం మొదలైనప్పటినుండీ మామయ్య కళ్ళల్లో కనిపించిన ప్రశంస, అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ప్రైడ్, బైలైన్లో పేరు చూసుకొన్నప్పుడు కలిగిన సంతోషం ఇంకా వ్రాయాలనే ఆలోచనను పెంచాయి అంటారు శైలజా రాంషా. వీరి కధలు, వ్యాసాలూ, కవితలు వివిధపత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు ఆన్లైన్
ఫోరమ్‌లలో కధలు, బ్లాగులు ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్న చిన్న బహుమతులు గెలుచుకొన్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.
పలు ఆన్లైన్ ఫోరమ్‌లలో కధలు, బ్లాగ్స్ ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్నచిన్న బహుమతులు గెలుచుకున్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.
Thank you!
చాలా మంచి భావన వాస్తవానికి దగ్గరగా వుంది హృదయపూర్వక అభినందనలు