మూలస్తంభాలు by S Sridevi

  1. చీలినదారులు by S Sridevi
  2. పరంపర by S Sridevi
  3. నేను by S Sridevi
  4. పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi
  5. దయ్యం వూగిన వుయ్యాల by S Sridevi
  6. ఆ ఒక్కటీ చాలు by S Sridevi
  7. తప్పిపోయిన పిల్ల by S Sridevi
  8. నువ్వా, నేనా? by S Sridevi
  9. ఏదీ మారలేదు by S Sridevi
  10. మూడుముక్కలాట by S Sridevi
  11. మూలస్తంభాలు by S Sridevi
  12. రూపాయి చొక్కా by S Sridevi
  13. అమృతం వలికింది by S Sridevi
  14. ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

నాగమణిని చూడాలనే, నేను సుబ్రమణ్యం కూతురి పెళ్ళికి వెళ్ళాను. సుబ్రమణ్యం స్కూలప్పట్నుంచీ డిగ్రీదాకా నా క్లాస్‍మేటు. తర్వాత మాకిద్దరికీ వేరేవేరేచోట్ల వుద్యోగాలు వచ్చాయి. స్వంతవూరు అనే అనుబంధం ఒకటి వుండటంతో ఉద్యోగాలు వచ్చిన కొత్తలో బాగానే కలుసుకునేవాళ్ళం. అమ్మానాన్నలు బాగా పెద్దవాళ్లైపోయి, నా దగ్గిరకి వచ్చెయ్యటంతో అక్కడి యిల్లు, రెండెకరాల పొలం అమ్మేసాను. ఆపై వూరితో దూరం పెరిగింది.
సుబ్రమణ్యానికి ముగ్గురు అక్కలు, ఒక చెల్లెలు. నాగమణి, ఆ చెల్లెలు. మాకన్నా రెండుక్లాసులు తక్కువ. నాకు తనంటే మొదట్నుంచీ చాలా యిష్టం. ప్రతియిష్టం ప్రేమకాదు, ప్రతిప్రేమా శృంగారాన్ని కోరుకోదు. రోడ్డుపక్కన పూసిన గడ్డిపువ్వు, కాళ్లగజ్జెలు ఘల్లుఘల్లుమంటుండగా గునగున పెరట్లో తిరిగే పనమ్మాయి కూతురు కూడా మనసుని మురిపిస్తారు. మన చుట్టూ వుండే సమాజం ఆ యిష్టానికి విలువల్ని నిర్దేసిస్తుంది. గడ్డిపువ్వు దేవుడి పూజకి పనికిరాదని చెప్తుంది. పన్నమ్మాయి కూతుర్ని ఎత్తుకోవడానికి సంకోచాన్ని నేర్పిస్తుంది. ఈ హద్దుల్ని అర్థం చేసుకోలేక ఒక యిష్టాన్ని ప్రేమనుకునీ, ప్రేమనుకున్నదాన్ని ప్రకటించుకోలేక దాచుకునీ వుక్కిరిబిక్కిరౌతున్నారు మనుషులు.
నాగమణిమీద నాకున్నది యిష్టమే. తను మగపిల్లాడై వుంటే వాళ్ళన్నకన్నా ఎక్కువ తనతోటే స్నేహం చేసేవాడిననుకుంటా. అలాంటిది ఆ అమ్మాయి పెళ్ళయ్యాక తనని కలవటం, ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవటం తగ్గింది. కలవటం… ఇలాంటి పెళ్ళిళ్లలోనే.
నేను పెళ్ళికి వస్తున్నానని ముందే తెలియడంచేత, ఎదురొచ్చి సాదరంగా తీసుకెళ్ళాడు సుబ్రమణ్యం ముహూర్తం రాత్రికి. మగపెళ్ళివారు ఇంకా రాలేదు. వీళ్ళ పనులూ ఏర్పాట్లూ జరుగుతున్నాయి. పదెకరాల భూస్వామి. చాలా ఘనంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు. ఐనా ఏదో తేడా కనిపిస్తోంది. ఏ శుభకార్యం వచ్చినా అతని అక్కచెల్లెళ్ళు నలుగురూ, ఇద్దరు మేనత్తలూ వచ్చేసి హడావిడిని పంచేవారు. అసలు వాళ్ళలా తిరుగుతుంటేనే పెళ్ళిసందడి వచ్చేసేది. ఎదురుసన్నాహంలో వీళ్ళు చేసే సరదా, హడావిడీ అంతా యింతా కావు. వాళ్ల భర్తలు సుబ్రమణ్యానికి అన్నదమ్ములు లేని లోటు తెలీకుండా తలోపనీ అందుకునేవారు. ఇప్పుడు వాళ్ళెవరూ కనిపించలేదు.
“నేనే ముందొచ్చానా? మీవాళ్ళెవరూ కనిపించట్లేదేమిటి?” అడిగాను ఆశ్చర్యంగా. “పెళ్ళి ఈ రాత్రికేకదూ?” అని కూడా. నిర్ధారణకోసం. అతని ముఖం కళతప్పింది.
“అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అన్నీ కేటరింగ్‍కీ ఈవెంటు మానేజిమెంటుకీ ఇచ్చేసాం. పైనుంచీ చూసుకోవడమే” అన్నాడు.
“పైన విడిది గదులున్నాయి. ఇలా ముందుకెళ్తే టిఫెన్ సెక్షనుంది. తినేసి వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాత్రి పెళ్ళికదా, ఓ నిద్రకూడా తీస్తే ఇంకా మంచిది” అని ఎవరో పిలుస్తుంటే వెళ్ళాడు.
అతను చెప్పినట్టే టిఫెన్ చేసి, పైకి వెళ్ళాక తలుపులు వెయ్యని ఒక గదిలో వాళ్ళమ్మ కనిపించింది. ఒక్కర్తే వుంది.
“బావున్నారా, పిన్నీ?” పలకరిస్తూ లోపలికి వెళ్ళాను.
“శరత్తూ! రా,రా, ఎలా వున్నావు? ఇదేనా, రావటం? టిఫెనైందా? మీ ఆవిడ్ని తీసుకురాలేదా?” అడిగింది.
ఆవిడ ప్రశ్నలకి జవాబిచ్చి, “అమ్మానాన్నా పెద్దవాళ్లయ్యారుకదా, అందుకని తను ఆగిపోయింది” నా భార్య రాకపోవటానికి గల కారణాన్ని
చెప్పాను.
“మీరు పొలం, యిల్లూ అమ్మేరుకదా, ఆ డబ్బేం చేసారు?” అడిగింది. ఆవిడ ఆ ప్రశ్న ఎందుకడిగిందో నాకు అర్థం కాలేదు.
“నాన్న దగ్గిరే వుంది. చెల్లికి ఆడపిల్ల కట్నంగా అందులోంచీ పది తీసిస్తే అది తీసుకోలేదు. మాదగ్గిరే వుంచమని చెప్పి వెళ్ళిపోయింది” చెప్పాను.
“అక్కడే వుంది శరత్తూ, తిరకాసంతా. దిక్కుమాలిన ప్రభుత్వం చట్టాలు చేసి, కుటుంబాలనీ బంధుత్వాలనీ నిలువునా చీల్చేస్తోంది. స్వంత అన్నదమ్ముడి కూతురి పెళ్ళా, అదీ వాడికి ఒక్కగానొక్క కూతురా, ఆడపిల్లలెవరూ రాలేదు. అలిగారు. మావారి చెల్లెళ్ళిద్దరూ వాళ్లకి మద్దతు. గుండెల్లో ఇంత దు:ఖం మూటకట్టుకుని వాడు పెళ్ళిపనులు చేస్తున్నాడు” అందావిడ బాధగా. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గొంతు రుద్ధమైంది.
“ఏమైంది పిన్నీ? అలక దేనికి? అదీ ఇలాంటి సందర్భంలోనా?” అడిగాను.
“మాయదారి డబ్బు… మనుషులమధ్య ఎడాన్ని ఎలా పెంచుతోందో! ఉన్నదేదో పెట్టి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం. ఆ తర్వాత ఏడాదికోమాటు ఇంత పసుపూకుంకం యిచ్చి చీరాసారీ పెట్టి పంపిస్తాం. తల్లి పోయాక బంగారం వాళ్లకే ఇస్తాం. అంతేగానీ, పెళ్ళిళ్ళైన యిన్నేళ్ళకి ఆస్తుల్లో వాటాలు ఇవ్వటం ఎక్కడేనా వుందా? తండ్రి ఆస్తిలో వాటా కావాలని ఆడపిల్లల గొడవ. వాళ్లకి ఒక్కొక్కరికీ పెళ్ళప్పుడు రెండేసి ఎకరాలు యిచ్చారు. వాళ్ళకి యిచ్చింది ఇచ్చేసాక, ఇక మిగిలింది వీడిదేగా? అలా కాదట. వీడుకూడా రెండెకరాలు వుంచుకుని, పెళ్ళి ఖర్చులకి అయింది మినహాయించుకుని మిగిలింది వాళ్ళకీ పంచాలట. ఎకరా కోటి పైమాటే. ఎందుకు పంచుతాడూ? ఇప్పుడీ పెళ్ళికి ఎకరా అమ్మేసరికి గొడవలు మొదలయ్యాయి. కోర్టుకి వెళ్తారట… అంతా కలికాలం…” అందావిడ. నాకు ఎక్కడో చురుక్కుమంది. ఈ కాస్త వివరం మాట్లాడుకోవటానికి ఐదునిముషాలు పట్టింది. ఇంతలో ఎవరో రావటంతో నేను లేచి ఇవతలికి వచ్చాను.
సుబ్రమణ్యం ఎదురొచ్చాడు. “పద, నీకు గది చూపిస్తాను” అంటూ నావెంట వచ్చి, “అమ్మతో మాట్లాడావా? చెప్పిందా, గొడవేంటో! ఇంత అన్యాయం ఎక్కడేనా వుందా? పెళ్లప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందేదో ఇచ్చాంకదా? ఇంకా ఏంటి? కక్షకట్టి ఒక్కళ్ళు రాలేదు చూడు ” అన్నాడు ఆవేదనగా. కూతురి పెళ్ళి చేస్తున్నానన్న సంతోషంకన్నా ఈ బాధ ఎక్కువ కనిపించింది నాకు. ఇందాకా పిన్నితో మాట్లాడుతున్నప్పుడు చురుక్కుమనిపించిందేదో ఇప్పుడు ఇంకాస్త మంటగా మారింది.
“అదేమిటో కోర్టులోనే తేల్చుకుంటాను. ఇదివరకూ సివిల్ లావాదేవిలు మగవాళ్ళమధ్యని వుండేవి. ఇప్పుడిక ఆడాళ్ళు కోర్టులెక్కుతారుకామోసు… సంతోషం, మనశ్శాంతీ లేకుండా అయాయి” అని,
“సరేమరి, నువ్వు రెస్టు తీసుకో” అని గది చూపించాడు.
“ఏవేనా పనులుంటే చెప్పు” అంటుంటే తలూపి వెళ్ళిపోయాడు.
పెళ్లయాక ఆ తెల్లారే తిరిగి వచ్చేసాను. మనసు అస్థిమితంగా వుంది. నాగమణిని చూడలేదన్న అసంతృప్తి కొద్దిగా అనిపించినా, తనమీద వున్న సున్నితమైన భావం చచ్చిపోయి, ఆ అసంతృప్తిని మింగేసింది.


ఆడపిల్లలకి ఆస్తి పంచడమనేది కొంచెం గొడవగానే వుంది. నా ఫ్రెండ్స్‌లో చాలామంది తండ్రులు, తల్లులు బతికుండగానే విల్లు రాయమని నిస్సిగ్గుగా అడిగి రాయించుకుని ఆస్తుల్ని కాపాడుకుంటున్నారు.
పెళ్ళి హడావిడంతా అయాక నెలరోజులకి సుబ్రమణ్యం నాకు ఫోన్ చేసి అదే విషయం చెప్పి, “దీపం వుండగానే యిల్లు చక్కబెట్టుకో. కోటిన్నరేనా వుండవూ బాబాయి ఆమాంబాపతులు? పొలాల విలువలు రెక్కలొచ్చి పెరగడంతో ఇంత డబ్బుగానీ లేకపోతే ఏముంది?” అన్నాడు.
అతనే మరో విషయం చెప్పాడు.
“తెగబడిపోయార్రా, ఆడపిల్లలు… మా చిన్నాన్న పోయినప్పుడు చూసాను. పాడె లేవనివ్వలేదనుకో, అల్లుళ్ళు. దాంతో మా అన్నయ్యకి వళ్ళు మండి,
మరైతే ఆస్తుల్లో వాటా కావాలనుకుంటే మీరూ పాడె మొయ్యండి, గుండు చేయించుకుని పిలక పెట్టించుకుని, కర్మ చెయ్యండి- అన్నాడు చెల్లెళ్ళతో.
ఐతే ఆస్తికోసమే నువ్వు ఇవన్నీ చేస్తున్నావా- అని అడిగారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతాడు?
కర్మ చేసే బ్రాహ్మడు కలగజేసుకుని- మీ నాన్నకి ఆస్తి లేకపోతే ఇవన్నీ చెయ్యవా? నీ భార్యకీ అన్నదమ్ములు వుండే వుంటారు. ఆమెని వాళ్ళూ ఇలాగే అడిగితే? ఆడవాళ్లకీ, మగవాళ్ళకీ ఎవరికి వుండే ధార్మికవిధులు వాళ్ళకే వుంటాయి. ఒకరు చేసేవి ఇంకొకరు చేస్తే అనర్ధం- అని సర్దిచెప్పాడు” అన్నాడు.
చాలాసేపు మాట్లాడాడు సుబ్రమణ్యం. ఈ విషయాలే. అతని మానసికస్థితిని అర్థం చేసుకోగలిగాను. ఆరోజుని పదిలక్షలు గొప్పగా చేతిలో పెడితే చెల్లి ఎందుకు వద్దందో నాకు నెమ్మదినెమ్మదిగా అర్థమౌతోంది. ఇల్లూ, పొలం అమ్మిన డబ్బుచుట్టూ నాకు చాలా కలలున్నాయి. గేటేడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలని వుంది. నెలకి యాభైవేలేనా కిరాయి వస్తుంది, మరొ ఆరులక్షల పేకేజి అని ఆలోచిస్తున్నాను.
నా చుట్టూ జరుగుతున్నవీ, నాకు తెలుస్తున్నవీ విషయాలు నాన్నకి కూడా తెలుస్తాయని నేను అనుకోలేదు. నాన్న ఇంకోలా ఆలోచిస్తారని కూడా.
చెల్లిని రమ్మని ఫోన్ చేసారు. వచ్చింది. మూడువాటాలేస్తూ రాసి, రిజిస్టర్ చేయించిన విల్లు కాగితాలు ముందు పెట్టారు.
“రెండుకోట్ల ఆస్తి అమ్ముకుని, నీ చేతిలో పదిలక్షలు పెట్టి సరిపెట్టేసాననుకున్నావా, అమ్మలూ? ఆరోజునించీ ఈరోజుదాకా మాట్లాడలేదు? ఇప్పటికి ఏదేనా ఖర్చు పెట్టుకుంటావు, తర్వాత వాటాలు వేసేప్పుడు లెక్కలు చూసుకోవచ్చనుకున్నాను. నాకు మీ యిద్దరూ రెండుకళ్ళు. నీకు అన్యాయం ఎలా చేస్తాననుకున్నావు?” అన్నారు కంటతడి పెట్టుకుని. తను సిగ్గుపడింది.
“సారీ నాన్నా! మా ఫ్రెండ్స్ చాలామంది యిళ్లలో ఇలాంటి గొడవలుపడుతున్నారు. పైగా మమ్మల్నే తప్పుపడుతున్నారు. గొడవలు, హక్కుగా ఆడపిల్లలు అడగటంవలన వస్తున్నాయా, హక్కు ప్రకారం పంచడానికి మగపిల్లలు సుముఖంగా లేకపోవటంవలన వస్తున్నాయా అనేది ఎవరు ఆలోచించడం లేదు” అంది.
నాన్న నవ్వారు.
“పిల్లలని సమంగా చూడకపోవటం తల్లిదండ్రులదే తప్పు. ఆడపిల్లలు కుటుంబాలకి మూలస్తంభాలు. ఇంతకాలం ఏ హక్కులూ లేకుండానే కుటుంబాలని నిలబెట్టారు. ఇప్పుడేవో హక్కులంది ప్రభుత్వం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం చెసిన చట్టాన్ని మనమే గౌరవించకపోతే ఎలా?” అన్నారు.
నాన్న యిలా మాట్లాడతారనీగానీ చేస్తారనిగానీ వూహించలేదేమో, నేను షాకయ్యాను. పురుషాధిక్యత అనే శిఖరంమీంచీ దొర్లి పడుతున్న భావన కలిగింది.

“ఆస్తులున్నాయికాబట్టి పంచమని నిలదీస్తున్నారు. లేకపోతే? అప్పుడు మీ బాధ్యత మాదేకదా?” అడిగాను అక్కసు దాచుకోలేక.
“చదువుకుని వుద్యోగాలు చేస్తున్నాం. ఇంకా మా బాధ్యతలేం వుంటాయి మీకు?” అంది. “త్యాగాలమీద కుటుంబాలు నిలబెట్టడం ఇప్పటిదాకా చూసారు, హక్కులమీద ఎలా నిలబడతాయో ఇప్పుడు చూద్దురుగాని” అంది నవ్వి.