ప్రశ్న మనిషి మనసులోంచీ పుడుతుంది. అనుభవంలోంచీ కూడా పుడుతుంది. మనసులోంచీ పుట్టినప్పుడు కుతూలంతోటీ, అనుభవంలోంచీ పుట్టినప్పుడు జ్ఞానంతోటీ జవాబుని వెతుక్కుంటూ వుంటుంది. ఏదో జరిగాక తెలిసిన నిజంకన్నా ఏమీ జరక్కుండా దొరికే సమాధానం చాలా విలువైనది.
“జీవితం బోర్‍డ్తోందే!” అంది సౌగంధ లంచ్‍టైమ్‍లో స్వరూపతో.
“ఐతే ఓ పన్చెయ్” అంది స్వరూప.
“ఏంటది?”
“మంచి టూరిస్టు స్పాట్ చూసుకుని దానిమీంచీ దూకెయ్. థ్రిల్లుకి థ్రిల్లూ, బోర్ లైఫ్‍కి ముగింపూ”
సౌగంధ ఆ మాటలకి వుక్రోషం పట్టలేక భుజం మీద గట్టిగా గిచ్చింది.
“అబ్బా!” కెవ్వుమంది స్వరూప.
“అందరూ మననే చూస్తున్నారు. జోక్స్ వద్దు. సీరియస్‍గా చెప్తున్నాను” అన్న సౌగంధ మాటలకి –
“లేకపోతే ఏమిటే? బోర్ కొడ్తోందని ఈ మొగుణ్ణిదిలేసి యింకొకడిని చేసుకోవడానికి యిదేం అమెరికా కాదు. నోట్లకట్టలు తగలేసి నావెల్టీ వెతుక్కోవడానికి మనకేం బిల్‍గేట్స్ పవరాఫ్ ఎటార్నీ లేదు” కోప్పడింది స్వరూప.
సౌగంధ కళ్ళలో నీలినీడలు కదిలాయి. “నీలా నవ్వుతూ జోక్స్ వేస్తూ సరదాగా గడిపెయ్యటం నాకు రాదు. ఒక్కొక్కసారి చచ్చిపోదామన్నంత విసుగు కలుగుతుంది. ఎందుకో తెలీదు, జీవితం వెల్తిగా అనిపిస్తోంది” అంది.
“…”
“నీకు తెలీదు. రోహిత్ చాలా డిటాచ్‍డ్‍గా వుంటాడు. అది భరించలేకపోతున్నాను” అంది సౌగంధ. “ఆఫీసులో అలసిపోయేంత పని చేస్తాడు. ఇంటికొస్తూ మళ్ళీ కొంత తెచ్చుకుంటాడు. ఆఫీసు వాతావరణాన్ని యింటిదాకా ఎందుకు తెస్తావని అడుగుతాను. వోటీ వర్కు మిగిలిపోయిందంటాడు. టియ్యే డియ్యేలొస్తాయని కేంపులకి వెళ్తాడు. ఎందుకిదంతా అని నేను వాదిస్తే మనందరికోసమేనని అతను జవాబిస్తాడు”
“రోహిత్ వోటీ వర్కు యింటికి తెచ్చుకుంటే మావారు పొద్దుపోయేదాకా ఆఫీసులోనే వుండిపోతారు. ఫ్రెండ్సూ సర్కిలూ ఎక్కువే. ఒక్కోసారి వాళ్ళతోటే బైట ఏ హోటల్లోనే తినేసి యింటికొస్తారు. వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా వుంటేనే మనం హేపీగా వుండగలుగుతాం. లేకపోతే అసంతృప్తే”
“నువ్వు చెప్పింది నిజమేనేమో! కానీ వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా ఎలా వుంటాం? చిన్నచిన్న సరదాలన్నీ చంపుకుని బతుకు భారంగా యీడ్చటం దేనికి? తనకో పదివేలు జీతం. నాకింకో పది. దాంతో సుఖంగా బతకలేమా?”
“అతన్తో ఈ విషయాలు చెప్పావా?” “
“ఎన్నోసార్లు. రోజూ మామధ్యని అదే ఘర్షణ. వయసులో వున్నవాళ్ళం. సరదాలన్నీ మానుకుని ఎంత సంపాదించి, ఎంత దాచి ఏం లాభం? మధ్యతరగతివాళ్ళం, మళ్ళీ మధ్యతరగతే అనిపించుకోవడానికి యింత కష్టం దేనికి?”
సౌగంధ పదేపదే అదే పాయింటు దగ్గరికి రావటం గమనించింది స్వరూప. సుఖమంటే? దానికి సౌగంధ యిచ్చే నిర్వచనం… లేనిపోని బాదరబందీలేవీ పెట్టుకోకుండా సరదాగా గడిపెయ్యటం. భర్తకామె మాట్లాడేదంతా అర్ధరహితంగా అనిపిస్తోంది. ఆ విషయాన్ని ఎన్నోసార్లు స్వరూపతో చెప్పింది. సౌగంధ ఎంత చెప్పినా అతను పట్టించుకోడా లేక అతను పట్టించుకునేలా ఆమె చెప్పలేకపోతోందా?
“ఏమిటి, అంత ఆలోచనలోపడ్డావు?” కుదిపింది సౌగంధ. స్వరూప తేరుకుంది.
“ఇదింత అర్జెంటుగా లంచి రూమ్‍లోనో ఐస్క్రీమ్ పార్లర్లోనో తేలే విషయం కాదు, సీట్లోకెళ్లాం పద” అని లేచింది సౌగంధ. ఇద్దరూ కదిలారు.
“పిల్లల్ని దృష్టిలో వుంచుకుని తొందరపాటు పన్లేం చెయ్యకు” హెచ్చరించింది స్వరూప నడుస్తూ. సౌగంధ నవ్వేసింది.
సౌగంధ చాలా తెలివైనది. ఆఫీసులో వర్క్ డిష్ట్రిబ్యూషన్లో ఎనిమిదిగంటలకని ఇచ్చిన పనిని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుని మూడునాలుగ్గంటల్లో పూర్తిచేసి, అసలు ఆ బ్రాంచిలో పనే లేదనిపించుకుంది. బ్రాంచి మారిస్తే అక్కడా అంతే.
“ఇలాగైతే పోస్టులు పోతాయి తల్లీ! నీ పాత బ్రాంచిలోనే చేసుకో. కాస్తంత చేస్తున్నట్టు నటించు…” అని హెడ్‍క్లార్క్ మళ్ళీ పాత బ్రాంచికే వేసి, మరికాస్త వర్కు ఇచ్చాడు. పుస్తకాలపురుగు. దొరికిన పుస్తకమల్లా చదువుతుంది. ఆ చదివింది చర్చించేవాళ్ళు లేక అదో సమస్య ఆమెకి. గవర్నమెంటు ఆఫీసుల్లో ఇంక్రిమెంటు, జీతాలు, బోనస్‍ల లెక్కలు వేసుకుంటారుగానీ, పుస్తకాలు చదవటం, వాటినిగురించి చర్చించుకోవడం తక్కువ. మగవాళ్ళెవరైనా చదువుతారేమోగానీ, ఆడవాళ్లైతే ఎంతసేపూ ఏం వండుకున్నాం, ఇంట్లో అత్తగారేమంది, పిల్లల జ్వరాలు, చదువులు, ఇంకా కాదంటే చీటీలు, ఇన్స్టాల్‍మెంటులో చీరలు కొనుక్కోవటం, నగలు చేయించుకోవటం… లంచిరూమ్‍లోనూ, ఇంకా ఇతరత్రా కలుసుకున్నప్పుడూ జరిగే ఈ స్మాల్‍టాక్‍ని స్వరూప బాగానే ఆస్వాదిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే సౌగంధ ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చుంటుంది.
కార్తీక్ మళ్ళీ కలవకపోతే సౌగంధ ఏ నిర్వేదపు వూబిలో కూరుకుపోయేదో! రోజూ రోహిత్‍తో దెబ్బలాట వేసుకోవటం అందులో ఓడిపోవటం… ఉక్రోషం… చిరచిర… వాటిని పిల్లలమీద చూపించటం… ఇవన్నీ ఒక సుడిగుండంలా ఆమెని తమలోకి లాక్కుంటున్నాయి.
కార్తీక్!
ఒక సుడిగాలిలా ఆమెని చుట్టేసాడు. వ్యక్తిత్వపు పునాదుల్లో సైతం కదిలిపోయిందామె. ఇద్దరూ టెన్త్‌లో క్లాస్‍మేట్స్. ఒకేచోట చదువుకున్నారు. స్కూలు వదిలి పెట్టేసాక ఒక పెళ్ళిలో కలిసారు. అప్పటికే సౌగంధకి పెళ్ళైంది.
“మై హజ్బెండ్” అని రోహిత్‍ని పరిచయం చేసేసరికి కార్తీక్ ఆమెని విస్మయంగా చూసాడు. అప్పుడతనికి పంథొమ్మిదేళ్ళు. పెద్దవాళ్ళ దృష్టిలో చాలా చిన్నవాడు. తన వయసే వుండే సౌగంధ పెళ్ళై మరొకరి భార్యగా బాధ్యతాయుతమైన స్థానంలో కనిపించేసరికి తికమకపడ్డాడు.
ఆ తర్వాత యిద్దరూ ఒక యింటర్వ్యూలో కలిసారు. తనకి యిద్దరు పిల్లలని చెప్పి అతన్ని మరోసారి షాక్ చేసింది సౌగంధ. అప్పటికి అతనింకా ఆడపిల్లల గురించి ఆలోచించడం లేదు. తన కెరీర్ గురించే చూసుకుంటున్నాడు.
ఆ యింటర్వ్యూలో యిద్దరూ సెలక్టవలేదు. కార్తీక్ కలిసినట్టు రోహిత్‍కి చెప్పి తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయిందామె. మళ్ళీ అతన్ని కలుస్తాననిగానీ ఇకపై కలవనే కలవననిగానీ అనుకోలేదు. అదంత అప్రస్తుతమైన విషయం ఆమెకి ఆ సమయాన.
ఆరోజు…
సౌగంధకి యింటి దగ్గర బాగా లేటైంది. లూనా పార్క్ చేసి, బేగ్ తీసుకుని గబగబా లిఫ్ట్‌వైపు వస్తుంటే సరిగ్గా అదే వేగంతో ఎదుటివైపునుంచీ వచ్చి డీకొట్టబోయి ఆగాడు ఒక వ్యక్తి.
“సారీ!” ఇద్దరూ ఒకేసారి వెనక్కి జరిగి అన్నారు అప్రయత్నంగా. అతను కార్తీక్.
“హాయ్ ! సౌగంధా, వాటే సర్ప్రైజ్!” అన్నాడు.
“నువ్వేంటి.. యిక్కడ?”” అంతే ఆశ్చర్యపోతూ అడిగింది సౌగంధ. అలా అడుగుతూనే ” లిఫ్టు పైకి వెళ్ళిందంటే మళ్ళీ కిందకి రావటానికి చాలా టైం పడ్తుంది” అంది.
“ఆలస్యంగా వచ్చేవాళ్ళకోసం మెట్లుకూడా వేసింది మన సంస్థ” ఓదార్పుగా అన్నాడు కార్తీక్ తనే ముందు దారితీస్తూ. అతన్ని అనుసరించింది.
ఇద్దరూ మాటల్లో పడ్డారు. తను పర్చేజేస్ సెక్షన్లో చేస్తున్నట్టు చెప్పాడు కార్తీక్. అన్ని రోజులుగా ఒకే బిల్డింగ్‍లో పనిచేస్తూ కూడా ఒకరికొకరు కలవకపోవటంపట్ల ఆశ్చర్యాన్ని ప్రకటించింది సౌగంధ. థర్డ్‌ఫ్లోర్ చేరేసరికి అతనికి బై చెప్పి సీట్లో కూర్చుంది. లంచి టైమ్‍లో కలుద్దామని చెప్పి అలాగే వచ్చాడు. అతన్ని స్వరూపకి పరిచయం చేసింది. ఇద్దరికీ చిన్న ట్రీట్ యిచ్చాడు. అతని విషయం రోహిత్‍తో చెప్పింది సౌగంధ ఆరాత్రి. అతను మామూలుగా విని వూరుకున్నాడు.
కార్తీక్ రాకతో సౌగంధ రొటీన్లో మార్పొచ్చింది. మధ్యమధ్యలో అతనొచ్చి ఆమె బ్రాంచిలో కూర్చుంటాడు. లంచి ఆమెతో కలిసి తీసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యా స్వరూపకి యిరుగ్గా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు వింటుంటే మాత్రం సౌగంధ యింత అమాయకమా అనిపిస్తుంది స్వరూపకి. సౌగంధ కార్తీక్ స్నేహాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. చిన్నప్పటి జ్ఞాపకాలు.. అప్పటి స్నేహాలు.. అప్పట్లో తామున్న వూరు.. వాళ్ళ మాటల్లో దొర్లిపోతుంటాయి. అతను సౌగంధతో యింటికి రావటంపట్ల రోహిత్‍కి ఎలాంటి అభ్యంతరం లేదు.
శ్రీశ్రీ కవిత్వం గొప్పదా. సినారె కవిత్వం గొప్పదా అని వాళ్ళ స్కూల్లో టెన్త్ క్లాస్‍లో పెట్టిన డిబేట్‍గురించి యిప్పుడు వాదించుకుంటారు. ఇదంతా సిల్లీగా అనిపిస్తుంది రోహిత్‍కి. స్కూల్ ఆల్బం ముందు పెట్టుకుని ఒకరినొకరు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం పిచ్చితనంలా అనిపిస్తుంది.
గండిపేట పిక్నిక్కి వెళ్దామనుకున్నారు స్టాఫ్ అంతా. కుటుంబాలతో. చాలా వుత్సాహపడింది సౌగంధ వెళ్ళాలని. తీరా ఆ సమయానికి రోహిత్‍కి కేంపు పడింది. సౌగంధనీ పిల్లల్నీ వెళ్ళమనేం అనలేదు. పైగా “పిక్నిక్‍లకీ టూర్లకీ తిరిగితే ఏమొస్తుంది? డబ్బు వేస్ట్… టైమ్ వేస్ట్… పైగా అలసట. అంతగా అయితే నేను తిరిగొచ్చాక అందరం కలిసి పిక్చర్ కెళ్లాం” అన్నాడు.
ఆమె వుత్సాహమంతా వుఫ్‍మని వూదేసినట్లు ఎగిరిపోయింది. “పదిమందితో కలిసి పిక్నిక్కి వెళ్ళిందీ, నోరు గట్టిగా మూసుకుని చీకట్లో సినిమా తెరకి కళ్ళప్పగించినదీ ఒక్కటెలా ఔతుంది?” అంది విసుగ్గా.
“నీకర్థమవదులే. ఎంతసేపూ డబ్బు తగలేద్దామనే ఆలోచిస్తావు” అంతకంటే విసుగ్గా అన్నాడతను. అతని నిర్ణయంలో ఏ మార్పూ లేదు.
జీవితమంతా యితన్తో యిలాగే గడపాలా అని దిగులేసింది సౌగంధకి. ఈమధ్య మరీ వేస్తోంది. అప్పటిదాకా సంఘర్షిస్తూనే ఐనా సర్దుకుపోయిన అతని వ్యక్తిత్వం, తప్పనిసరిగా వప్పుకున్న అతని మనస్తత్వం, యిప్పుడు.. అంటే కార్తీక్‍తో పరిచయం పెరిగాక లోపాలుగా కనిపించడం మొదలుపెట్టాయి. ఎందుకు, రోహిత్ కార్తీక్‍లా నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా తిరగడు? యార్డ్‌లీ పరిమళాలు వెదజల్లడు? తననీ పిల్లల్నీ గుండెల్లో పొదువుకుని ప్రేమబాసలు చెప్పడు? ఎంతసేపూ డబ్బు… కోరిక తప్పుకాదు, ప్రయత్నం తప్పుకాదు. కానీ యావ చికాకుపుట్టిస్తుంది. కార్తీక్‌తో అతన్ని పోలిస్తే అన్నీ వైరుధ్యాలే. జవాబులకోసం, సమన్వయంకోసం ఆలోచించి, ఆలోచించి అలిసిపోతుంది తప్ప అవి దొరకటం లేదు.
కార్తీక్‍కూడా గండిపేట వెళ్ళలేదు. ఎందుకని అడగలేదు సౌగంధ. అతని జవాబు వినాలంటే భయం వేసింది. తామిద్దరి మధ్యా అవాంఛనీయమైనదేదో చోటు చేసుకుంటోందనిపించింది.
అతన్తో పరిచయాన్ని అక్కడితో తుంచేస్తే బావుంటుదనీ వుంది. అతని స్నేహం తెచ్చిన వసంతం అతనితోటే వెళ్ళిపోతుందనే భయమూ వుంది.
అన్నిట్లో ఆసక్తి తగ్గిపోతోంది సౌగంధకి. ఏదో కావాలనే ఆరాటం వుంది. కార్తీక్ ఆమెని దీపశిఖలా ఆకర్షిస్తున్నాడు. బలమైన అయస్కాంతంలా తనవైపు లాక్కుంటున్నాడు. పర్యవసానం ఏమిగా వుండబోతోందో అర్థం కావడం లేదు. ఆకర్షణ, అందులోంచీ విడివడటం… ఈ రెండూ చాలా బలమైన వైరుధ్యాలు.
సౌగంధలో వచ్చిన మార్పుని గమనించింది స్వరూప. కార్తీక్‍తో పరిచయానికి ముందు అశాంతితో రగిలిపోవటానికీ, యిప్పుడు సంఘర్షణలో కొట్టుకుపోవటానికీగల తేడాని కూడా.
“ఏమిటో.. కొంపలంటుకుపోతున్నట్టు పంథొమ్మిదేళ్ళకి పెళ్ళిచేసేసారు మా అమ్మా నాన్నా. నా వయసువాళ్ళకి యిప్పటికింకా ఏ బాధ్యతా లేదు” అంది సౌగంధ కళ్ళలో నీళ్ళు తిరుగు తుండగా.
“ఎవరి గురించి సౌగంధా?”” అడిగింది స్వరూప. “
“కార్తీక్ లేడూ?””’
“అతను మగవాడు”
“ఐతే మాత్రం? అంత తొందరగా పెళ్ళి చేసేసుకుని, పిల్లల్ని కనేసి, వూపిరాడక గిజగిజలాడిపోవాలా? కనీసం పెళ్ళంటే ఏమిటో, ఎందుకో అర్థం చేసుకుని ఎలాంటివాడు కావాలో ఒక నిర్ణయానికొచ్చేదాకా ఆగక్కర్లేదా?”
స్వరూప నవ్వుతునే అంది “అప్పుడుమాత్రం నీకు నచ్చిన వ్యక్తిని చేసుకునే స్వేచ్ఛ వుంటుందంటావా? అస్సలే వుండదు. మనకేం కావాలో కచ్చితంగా తెలిసుండీ ఎదుటివాళ్ళిచ్చినదాంతో సర్దుకుపోవటం యింకా నరకం. పెళ్ళప్పటికి నీకైతే పంతొమ్మిదిగానీ నాకు యిరవై నాలుగు. రమణగారిని పెళ్ళిచూపుల్లో చూసినప్పుడు నాకెందుకో అతన్ని చేసుకోవాలనిపించలేదు. నచ్చలేదని చెప్పాను”
ఆశ్చర్యంగా చూసింది సౌగంధ.
“ఐదునిమిషాల పెళ్ళిచూపుల్లో అవతలి వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? అన్నీ మేము తెలుసుకున్నాం అన్నారు నా పేరెంట్సు. ఫేస్ యీజ్ ద యిండెక్స్ టు మైండ్ అంటారు. కొద్దిగా మనలో యిన్సైటు వుండాలిగానీ ఎదుటివ్యక్తిని చదవటానికి క్షణం చాలదూ?”
“నీకు రమణగారు నచ్చలేదా?”
“నువ్వడిగినట్టే అడిగారు అమ్మా నాన్నా… ఎందుకు నచ్చలేదు? కన్నోంకరా? కాలొంకరా? ఉద్యోగం లేదా? ఆస్తిలేదా? ఏం తక్కువ? అని రకరకాల ప్రశ్నలడిగి అన్నిటికీ పాజిటివ్ జవాబులు లాగి, నా నోరు మూయించి పెళ్ళి చేసారు”
“నిజంగానే అడుగుతున్నాను. ఆయన నీకెందుకు నచ్చలేదు?”
“మనసుకి అలా అనిపించింది. పెళ్ళిచేసుకోవలసిన వ్యక్తిమీద కలగాల్సిన శృంగారభావన కలగలేదు”
“మరి? బాగానే వున్నారు కదే, యిద్దరూ?”
“బాగా అంటే?”
ఆ ఎదురు ప్రశ్నకి సౌగంధ తికమకపడింది. అసలు స్వరూప ఆమె వైవాహిక జీవితాన్ని గురించీ, అందులోని రహస్యపుకోణాలని గురించీ చెప్పటమే పెద్ద ఆశ్చర్యం.
“అంటే అతను చెడ్డవాడనా?” అర్థం కాక అడిగింది. స్వరూప నవ్విందిగానీ జవాబివ్వలేదు.
“ఏంటో సరూ! ఈ పెళ్ళిళ్ళూ, వ్యవస్థా అన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయి”
“ఎప్పట్నుంచీ కార్తీక్‍తో పరిచయం పెరిగాకా?” సూటిగా అడిగింది స్వరూప. సౌగంధ ముఖం పాలిపోయింది. ఏదో చెప్పబోయిందిగానీ మాటలు దొరకలేదు.
“నచ్చని వ్యక్తిని చేసుకోనని తెగించి చెప్పే ధైర్యస్వతంత్రాలే లేని మనకి భర్తని వదిలేసే స్వతంత్రం వుంటుందంటావా?” స్వరూప గొంతు పదునుగా వుంది. “ఒకవేళ అలాంటి స్వేచ్ఛ వుందనే అనుకుందాం. ఏవో ప్రలోభాలకోసం పెళ్ళిచేసుకుని ఆ భార్య నచ్చలేదని మరో స్త్రీవెంట తిరిగే మగవారికీ మనకీ తేడా ఏమిటి? సమానత్వం అంటే అది కాదనుకుంటాను. ఇద్దరూ నైతికంగా వుండటం సమానత్వం. సౌగంధా! ఇప్పటికే మీ యిద్దరిగురించీ రకరకాలుగా అనుకుంటున్నారు. అవన్నీ రోహిత్‍కి తెలిస్తే ఎలా వుంటుందో ఆలోచించు” అంది. సౌగంధ ముఖం మరింత పాలిపోయింది.
స్వరూప మళ్ళీ అంది. “రోమునగరం ఒక్కరోజులో నిర్మించబడలేదంటారు. స్త్రీ స్వాతంత్య్రం కూడా అంతే. మా అమ్మమ్మ తల్లికి మూడేళ్ళకి పెళ్ళై ఏడేళ్ళకి భర్తని కోల్పోయి అప్పట్నుంచీ జీవచ్ఛవంలా బతికిందట. తొంభై సంవత్సరాలు. ఆవిడ మా అమ్మమ్మని పెంచుకుందట. అంతా ఎన్నన్నా వినకుండా అమ్మమ్మకి రజస్వలానంతర వివాహం చేసిందట. మా అమ్మ కొద్దిగా చదువుకున్నా, ఆ చదువు ఆర్ధిక స్వావలంబనని యివ్వలేదు. అందుకని నాకు చదువుతోపాటు వుద్యోగం వుండాలని ఆశించింది. ఆర్థికస్వాతంత్య్రంతోపాటు జీవితభాగస్వామితో అనుగుణ్యత వుండాలనేది నా ఆకాంక్ష. అది నాకు సాధ్యపడలేదు. కనీసం మన తర్వాతి తరానికి ఆ అవకాశాన్ని యివ్వగలమేమో! సౌగంధా! అభిరుచులు కలిసిన వ్యక్తిని పెళ్ళిచేసుకోవటం మన ఆకాంక్ష. అది మంచి కుటుంబానికి పునాది కావాలిగానీ కుటుంబవిచ్ఛిత్తికి కాదు. ఎన్నో ఆకర్షణలు మనచుట్టూ వుంటాయి. అందుకే పెళ్ళిని ప్రామాణికంగా తీసుకుని, పెళ్ళికిముందూ తర్వాతాకూడా దాన్నే గమ్యంగా నిర్ణయిస్తారు. కుటుంబం అంటే అమ్మా నాన్నా పిల్లలు. అంతేగానీ కొందరు వ్యక్తులు కలిసి వుండటం కాదు. పిల్లలకోసం బంగారు భవిష్యత్తు చూపించాల్సి వుంటే మన స్వార్ధంకోసం దాన్ని చెదరగొట్టడం ఎంతవరకూ సరైనదో?” ఆమె మాటలు సౌగంధని మరింత తపనలోనూ సందిగ్ధంలోనూ పడేసాయి.
రమణకీ, రోహిత్‍కీ పరిచయం వాళ్ళ భార్యలద్వారానే. రమణ షేర్ కన్సల్టెంటు. ఆపైన సేవింగ్స్ ఏజెంటు. రోహిత్ తన పెట్టుబడులగురించి తరుచు అతన్ని సలహాలడిగేవాడు. ఇద్దరిమధ్యా ఏర్పడిన పరిచయానికి సౌగంధా, స్వరూపల స్నేహం వ్యక్తిగత స్పర్శని అద్దింది. ఇద్దరూ యిప్పుడు మంచి స్నేహితులు.
అలాంటి రమణకి సౌగంధా, కార్తీక్‍ల గురించి తెలిసింది. షాకయ్యాడు. అర్ధంకాని భావసంచలనం అతన్ని ముంచెత్తింది. ఎదుటివారి జీవితాలూ, అనుభవాలూ ఒక్కొక్కసారి మనకోసం దర్పణాలౌతాయి. సౌగంధమీద వెదజల్లబడిన పుకార్లలోంచీ అతనింకేదో వెతుక్కుంటున్నాడు. సౌగంధకీ రోహిత్‍కీ మధ్యని బలహీనపడిన వివాహబంధాన్ని తనకీ స్వరూపకీ మధ్యనున్నదానితో పోల్చుకుని చూస్తే సారూప్యత కనిపించి అతన్ని కలవరపెడ్తోంది.
ఏం కావాలి అసలీ ఆడవాళ్ళకి? భర్తనుంచీ, పెళ్ళినుంచీ ఏం ఆశిస్తారు? ఆస్తివద్దు. ఐశ్వర్యం వద్దు. భర్త అక్కర్లేదు. అంతర్ముఖులై తమలోకి తాము చూసుకుంటూ బ్రతికేస్తుంటే ఆ మౌనాన్ని బద్దలుకొట్టి తమవైపు తిప్పుకోవడం ఎంతమంది మగవారికి సాధ్యపడుతుంది? అలాకాని సంసారాలన్నీ యింతేనా?
ఎంతో యిష్టపడి చేసుకున్నాడతను స్వరూపని. పెళ్ళయ్యాక తెలిసింది, ఆమెకి తనంటే యిష్టం లేదని. అంతా అయ్యాక తెలిసిన ఆ నిజాన్ని ఎలా హేండిల్ చెయ్యాలో తెలీక తను బాధపడ్తుంటే తల్లి అంది, “చిన్నతనంకదూ, అలాగే వుంటుంది ఆడపిల్లలకి. చిన్నప్పట్నుంచీ పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులూ, తోబుట్టువులూ అందర్నీ వదిలిపెట్టి కొత్తచోట, కొత్తవారితో కలిసి వదిలి వుండాలంటే బాధకాదూ? అలా చెప్పలేక ఇలా అనేస్తుంటారు. నువ్వు ప్రేమగా చూసుకుంటే అది ఎంతలో మారిపోతుంది?”
అప్పట్నుంచీ తను స్వరూపని ప్రేమిస్తూనే వున్నాడు నిశ్శబ్దంగా. ఆమెకి తనంటే ఇప్పటికైనా ఇష్టం పుట్టిందో లేదో తెలీదు. ఒక మితృడితో అంటే అతనన్నాడు, “దేన్ని నువ్వు ప్రేమని అనుకుంటున్నావు? నువ్వేమైనా మన్మథాకారుడివా, చూడగానే మోహపడిపోవడానికి. కాదు. అడుగు తీసి అడుగు పెట్టనివ్వకుండా ధనకనకవస్తువాహనాలని అమర్చగల స్థితిమంతుడివా? కాదు. సామాన్యమైన మనిషివి. ముందు పరిచయంకూడా లేదు. పెళ్ళితో నీ యింటికి వచ్చింది. నిన్ను అర్థం చేసుకుని, తన మనిషివనుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఐనాకూడా బైటపడదు. తెలుసుకుని ఏం చేస్తావు? అది నిగూఢంగానే వుండనివ్వు. ఐ లవ్యూ, ఐ లవ్యూ అని నిముషానికోమాటు అనుకుంటున్న భార్యార్తలుకూడా సుఖంగా ఏమీ లేరు. అలా చెప్పుకోనివాళ్ళు కష్టాలుపడిపోతున్న దాఖలాలూ లేవు. అలా చెప్పుకోనివాళ్ళకి పుట్టిన సంతతేగా, మనమంతా? ” అన్నాడు. బుర్రకి పట్టిన తుప్పేదో వదిలిపోయింది.
మళ్ళీ యిప్పుడు ఆ ప్రశ్నేదో లోలోపల కెలుకుతున్నట్టు అనిపించింది. సౌగంధకిలాగే స్వరూపకూడా ఎప్పుడో ఒకప్పుడు తనని వదిలి వెళ్ళిపోతుందా? లేక తెరచాటు మనిషిలా మనసు బయటపెట్టకుండా దూరంగానే వుండిపోతుందా? మానవసంబంధాలలోని సారూప్యత కొన్ని సమస్యలని పరిష్కరిస్తే ఇంకొన్నిటిని జటిలం చేస్తాయి. చాలామంది మగవాళ్లకి వుండే అభద్రతాభావం యిది. వాళ్ళ వ్యక్తిత్వాలలో భాగంగా భార్యంటే అదో స్కీమాలాగా మారిపోయింది.
ఇదంతా జరిగాక సరిగ్గా కొన్ని గంటల తర్వాత కార్తీక్‍కీ సౌగంధకీ మధ్య ఒక ముఖ్యమైన సంభాషణ జరిగింది.
“కార్తీక్! నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు?” అడిగింది. సౌగంధ. నవ్వుతూ చూసాడుగానీ జవాబు చెప్పలేదు. ఆమె రెట్టించింది. ఏదో తెలుసుకోవాలని ఆమె కోరిక అతని అంతరంగంలోకి దారి వెతుక్కుంటోంది. వెళ్ళాలనీ వుంది. వద్దనీ వుంది. అదే వైరుధ్యం.. ఆకర్షణ.. రెండిటిలోంచీ విడివడాలనే ఒకసగానికీ మరోసగానికీ ఎలాటి పొంతనా కలవని కోరిక.
“పెళ్ళంటే ఏమిటో అనుభవంగలదానివి, ఎందుకు చేసుకోవాలో నువ్వు చెప్పు”
నిస్సహాయంగా చూసింది. తన అనుభవం తననే సందిగ్ధంలో పడేసి జవాబు వెతుక్కోమంది. ఇంక అతనికేం చెప్పగలదు?
“నువ్వేకాదు ఎవరూ చెప్పలేరు సౌగంధా! ఎట్టకేలకి సంసారసాగరం యీది వొడ్డుకి చేరగలిగాం అని జీవితపు చరమాంకంలో సుదీర్ఘంగా నిశ్వసించిన మహామహులు ఎంతోమంది, ఏం సాధించారంటే జవాబు చెప్పలేక ఖాళీగా మిలిగిన చేతులకేసి చూసుకుంటారు. ఏ అనుభూతీ మిగిలిలేని మనసులోకి చూసుకుంటారు. అంత అయిష్టంగా పెళ్ళి చేసుకోవడం దేనికి? అందులో ఏదో వుందనే ఆశ చేత. అదేదో అందీఅందనట్టు వూరిస్తుంది”
“…”
“సుఖపడటానికే పెళ్ళైతే నీ కళ్ళలో ఆ నీలినీడలెందుకు? ఏదో కోల్పోయినట్టు ఆ వెతుకులాట దేనికి? మీ యిద్దరిమధ్యనీ అగాధమంత దూరమెందుకు?”
“కార్తీక్!” సౌగంధ పెదవులు వణికాయి. గుండెలోతుల్లో ఎక్కడో మొదలైన ప్రకంపనాలు గొంతులోకి ఎగదన్నుకొచ్చి అలా బహిర్గతమయ్యాయి. అతను… అతను తనని పూర్తిగా చదివే సాడా? విభ్రాంతిగా అనుకుంది. ఏమీ తెలీనివాడనుకుంది. అన్నీ ఎలా తెలుసుకున్నాడు? స్త్రీ తనకి తారసపడిన మగవాడికి ఏమీ తెలీదనుకుంటుంది. ఆమెలోని ఆ తెలినితనాన్నే అతను ఎంజాయ్ చేస్తాడు.
సౌగంధకి పెళ్ళైందని మొదటిసారి తెలిసినప్పుడు అతన్లో వున్నది పసితనమే. ఆమెకి పిల్లలు పుట్టారని తెలిసినప్పటికి యింకా అతనిలో మెచ్యూరిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం అతను పరిపూర్ణ యువకుడు. ఆమె వైవాహిక జీవితంలోని చీకటికోణాలని స్పృశించి, ఆమెలోని అసంతృప్తిని తట్టి లేపి, తను దానికి స్వాంతన కావాలనుకుంటున్నాడు. చాలాసేపు యిద్దరూ మౌనంగా వున్నారు. సౌగంధకైతే అతని ముఖంలోకి చూడాలన్నా భయంగానే వుంది. ముఖంనిండా చిరుచెమట్లు అలముకున్నాయి.
“నాకు నిన్నెప్పుడు చూసినా ఆశ్చర్యంగా వుంటుంది సౌగంధా! స్కూల్‍మేట్స్‌గా విడిపోయాక మనం మళ్ళీ కలుసుకునేసరికే నీకు పెళ్ళైపోయింది. ఐ వజ్ స్టన్డ్. తరువాత కూడా నిన్నెప్పుడు చూసినా అదే ఆశ్చర్యం.. ఇద్దరికీ ఒకటే వయసు…అప్పుడే నీకు పెళ్ళీ…పిల్లలూ…”
“ఔను. జీవితంలో అన్నీ అయిపోయాయనిపిస్తోంది” సౌగంధ గొంతులో విషాదం.
“విడాకులతో కొత్తజీవితాన్ని మొదలుపెట్టు” అన్నాడు కార్తీక్ నిదానంగా.
ఆమె వులిక్కిపడింది. తను నిజంగానే విందా అని ఆశ్చర్యపోయింది. తమలో అలాంటి ఆకాంక్ష వుందా అని కూడా ఆశ్చర్యపోయింది. ఒకవేళ వున్నా వుత్పాతంలాగో కనీసం పెనుతుఫానులాగో వచ్చి పడుతుందనుకున్న ఈ ప్రస్తావన యింత ప్రశాంతంగా జరిగిందేమిటని కూడా ఆశ్చర్యం కలిగింది.
“మీరిద్దరూ విడాకులు తీసుకునే విషయాన్ని గురించి ఆలోచించు. రోహిత్‍కి చెప్పు. తర్వాత పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి రండి. వాళ్ళని తను తీసుకుంటానంటే ఏ సమస్యా వుండదు. అలాకాకుండా మనమే తీసుకోవాలంటే వాళ్ళకోసం మంచి రెసిడెన్షియల్ స్కూల్ చూడాలి. కనీసం కొన్నాళ్ళు. మనం సెటిలయేదాకా. సౌగంధా! పెళ్ళంటే జీవితానికి ముగింపుకాదు. ఫ్రెష్ బిగినింగ్. అలాంటిది నేను నీకివ్వగలనని అనుకుంటున్నాను”
అతనంత స్పష్టంగా చెప్పేసరికి ఆమె వుక్కిరిబిక్కిరైంది. అప్పుడు మొదలైంది. ఆమె మనసులో వుప్పెనలాంటి అలజడి. కార్తీక్ స్నేహాన్నించీ తను ఆశించింది యిదేనా? రోహిత్తో విడిపోయి అతని దగ్గరకి వెళ్ళి పోవడం. పర్యవసానం? అతను చెప్పినంత తేలిగ్గా వుంటుందా తామిద్దరూ పెళ్ళిచేసుకోవడం? సౌగంధ ఆలోచనలో పడటం చూసి కార్తీక్
చిన్నగా నవ్వాడు. “తొందరేం లేదు. బాగా ఆలోచించుకుని చెప్పు. ఎటూగాని వూగిసలాటకన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం బాగుంటుంది కదూ?” అన్నాడు.
ఆమె వెళ్ళిపోయింది. జవాబు ఏం వస్తుందోననే ఆలోచనలో వుండిపోయాడు అతను.
సౌగంధ అడిగిన ప్రశ్ననే సరిగ్గా యిరవైనాలుగు గంటల తర్వాత రోహిత్ కార్తీక్‍ని అడిగాడు. రూమర్ నిప్పుకణికలాంటిది. దాని వేడి ఎక్కడికో వ్యాపిస్తుంది. రోహిత్‍నికూడా ఆ సెగ తాకింది. ఆఫీసులో తన వెనుక అనుకునే మాటలు విని నిర్విణ్ణుడయాడు. తనదార్న తను కేంపులు తిరుగుతుంటే భార్య మరెవరితోనో తిరుగుతోందని… కోపం, బాధ, అవమానం… ఎన్నో భావాలు కలగాపులగంగా కలిగిన స్థితి. సౌగంధ కార్తీక్‍ని ప్రేమించిందా? పెళ్ళికి ముందునించే వాళ్ళిద్దరిమధ్యా ప్రేమవుందా? అతను నమ్మలేకపోతున్నాడు. అమాయకమైన ఆమె ముఖం, కదిలే కనులు… ఎందుకో… తప్పుపట్టలేకపోయాడు. ఎదుటివ్యక్తి మీదగల నమ్మకం సమస్యని పరిష్కరిస్తే అపనమ్మకం కొత్తసమస్యల్ని సృష్టిస్తుంది. రోహిత్ పరిష్కారం దిశగా నడవాలనుకున్నాడు. అందుకే అడిగాడు కార్తీక్‍ని, “నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు?” అని.
కార్తీక్ తడబడలేదు. అతను తన దగ్గరికి వచ్చి ఇలా ఎందుకడిగాడో కారణాన్ని కొంత వూహించగలిగాడు. “నచ్చిన అమ్మాయి దొరకలేదు”
రోహిత్ సూటిగా అడిగాడు. “సౌగంధలో నీకు నచ్చినదేమిటి?”
కార్తీక్ అప్పుడూ తడబడలేదు. రోహిత్ అన్నీ తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికో లేక తీసుకున్నదాన్ని తెలియపరచడానికో వచ్చి వుంటాడని అర్థమైంది. “షీ యీజే గుడ్ కంపెనీ” అన్నాడు నిదానంగా.
ఇప్పుడు సమస్య కొద్దిగా అర్థమైంది రోహిత్‍కి. పెద్దగా నవ్వేసాడు. కార్తీక్ తెల్లబోయి చూస్తుండగా అన్నాడు, “”మనుషుల అభిప్రాయాలు ఎప్పటికీ ఒకేలా స్థిరంగా వుండవు. ఉన్న పరిస్థితులనిబట్టీ ఎదురైన అనుభవాలనిబట్టీ మారుతుంటాయి. కాలంతోపాటూ మారతాయి. ఇంటిపనంతా పూర్తిచేసుకుని, ఫ్రెష్‍గా తయారై కారిడాల్లో, సంధ్యవెలుతుర్లో జాజిపందిరి పరిమళాల మధ్యని కూర్చుని షెల్లీ, కీట్స్ గురించీ కృష్ణశాస్త్రి గురించీ చర్చించే సౌగంధ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అదే సౌగంధ, తల్లిగా, వుద్యోగస్థురాలిగా, గృహిణిగా తన సాధకబాధకాలు చెప్పుకుంటుంటే నీకామె కంపెనీ నచ్చకపోవచ్చు” అని కార్తీక్ ఏదో చెప్పబోతుంటే ఆపి, తనే కంటిన్యూ చేసాడు. అప్పటికి అతని పెదాలమీది నవ్వూ, ముఖంలోని ప్రసన్నతా ఎగిరిపోయాయి.
“నేను తనని ఆమె మాటలు వినో, కబుర్లకి మైమరిచో చేసుకోలేదు. ఆమె ఫేమిలీ బేక్ గ్రౌండు, చదువు, కెరీర్ అవకాశాలూ చూసి పటిష్టమైన సాంప్రదాయపు వేదికమీద పెళ్ళి చేసుకున్నాను. మేం పెళ్ళి చేసుకున్నప్పుడు జీవితకాలం కలిసి వుండాలనే ఒడంబడిక చేసుకున్నాం. కలిసి పిల్లల్ని కన్నాం. ఇల్లు కట్టుకున్నాం. ఏ కారిడార్లోనైతే నీకామె మంచి కంపెనీ యిచ్చిందో అదే కారిడార్లో కూర్చుని మేము మా పిల్లల భవిష్యత్తుకి ప్రణాళికలు వేసాము. వాళ్ళు కుటుంబాలుగా ఎదిగినప్పటి సుదీర్ఘ భవిష్యత్తుని వూహించుకున్నాం. కొన్ని అందమైన కలలు కన్నాం. కార్తీక్! మామధ్య కొన్ని భేదాభిప్రాయాలు వుండవచ్చు. ఏ యిద్దరు వ్యక్తులూ ఒక్కలా వుండరు. ఒక్కలా ఆలోచించరు. మేంకూడా అంతే. ఐనాగానీ మా యిద్దరి గమ్యం ఒకటే. సౌగంధకి తనమీద వచ్చిన రూమర్స్ తెలియక పోవచ్చు. తెలిసినా పట్టించుకోలేదేమో. ఒకవేళ తెలిసి, పట్టించుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురైతేమాత్రం నేను చెప్పిందే తనూ చెప్తుంది. నాకు తనమీద ఆ నమ్మకం వుంది. నీది ప్రేమని నేననుకోను. ఒకవేళ ప్రేమే అయినా అప్పటికే మరొకరి జీవితానుభవాలతో నిండిపోయిన స్త్రీ హృదయపు పాత్రలోకి దాన్ని వొంపకు” అనేసి లేచి నిలబడ్డాడు.
కార్తీక్ నిరుత్తరుడై చూసాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. బంతి సౌగంధ కోర్టులో వుంది. ఆమెది నిర్ణయం. అప్పటిదాకా తనేం మాట్లాడలేడు. కనీసం రోహిత్‍లా హక్కుగానో అహంభావంగానో కూడా.
సెలవుపెట్టి ఇంట్లోనే వుండిపోయింది సౌగంధ. ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు. కార్తీక్ ప్రతిపాదన మనసులో కదుల్తోంది.
పెళ్ళి….
ఒకమ్మాయిని, ఒకబ్బాయికిచ్చి చేస్తున్నామని దండోరా వేస్తున్నట్టు శుభలేఖలు వేయించి, బంధువులకీ, తెలిసినవాళ్ళకీ, స్నేహితులకీ యివ్వటం, వాళ్ళంతా పెళ్ళికి రావటం, బాజాభజంత్రీలు, వూరేగింపులు… భార్యాభర్తలుగా తామందరికీ పరిచయమవటం, జంటగా కలిసి శుభకార్యాల్లో నిలబడటం… పిల్లలు… వాళ్ళ తల్లిదండ్రులుగా పరిచయాలు … ఇవన్నీ యిలా జరగగా పెద్దలేసిన దండోరాని కాదని మళ్ళీ తిరిగి కార్తీక్‍ని తన భర్తగా నోటిఫై చెయ్యటం అంత తేలికా?
అసలెందుకు యిదంతా? ఏం ఆశించి? ఇప్పుడు లేనిది అప్పుడు దొరుకుతుందా? ఏమిటది? తను పోగొట్టుకున్నదా? పొందలేకపోయినదా? అందీఅందక వూరిస్తున్నదా? జీవితమా? అనుభవమా? అనుభూతా? ఏదైనాసరే, కొంతకాలానికి పాతబడుతుంది. అప్పుడు మళ్ళీ యిదే పరిస్థితి పునరావృతమైతే? ఛెళ్ళున చరిచినట్టైంది సౌగంధకి. అక్కడే గడ్డకట్టుకుపోయాయి ఆమె ఆలోచనలు. స్వరూప అంతకుముందే తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఫోను తీసుకుంది.
“ఆడా మగా మధ్య స్నేహమేమిటనేది మా అమ్మ. ఏదో ఒక సమయానికి వాళ్ళలోనో వీళ్ళలోనో ఆకర్షణ మొదలవక మానదు. ఆ రెండు ప్రవృత్తులూ అలాంటివి. దానికి మనమే వుదాహరణ” అంది సౌగంధ నెమ్మదిగా, లైనో అవతలివైపు వున్న కార్తీక్‍తో.
“తప్పేం వుంది?”
“ఎందుకు లేదు? అమ్మావాళ్ళూ చూపించిన ఏవో కారణాలకి రోహిత్ నచ్చాడు. అతన్లో లేని ఇంకేవో కారణాలకి నువ్వు నచ్చుతున్నావు. నీలో లేని మరో కారణానికి ఇంకొకరు నచ్చితేనో? అందుకే పెళ్ళి అనేది ఒక చెలియలికట్టలా ఈ సందిగ్ధాలన్నిటినీ ఆపాలి”
“ఎందుకు అంత ప్రయత్నపూర్వకంగా ఆపడం?’
“అలా ఆపుకోగలిగితేనే నిలకడగా వుండగలుగుతాం. లేకపోతే ప్రవాహంలో గులకరాళ్లలా కొట్టుకుపోతాం” అంది సౌగంధ. “మనం ఇంకపై కలుసుకోవద్దు కార్తీక్. ఈ ప్రలోభాలు మనని జయించకుండా వుంటేనే మంచిది” పెట్టేసింది.
తనని రోహిత్ కల్సినట్టు ఆమెకి చెప్పలేదు కార్తీక్. సరిగ్గా రోహిత్ అన్నట్టే ఆమె చెప్పడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది కొన్ని ప్రశ్నలు. సౌగంధకి తనమీద ప్రేమలేదా? ప్రేమ వున్నా సంప్రదాయాన్ని దాటలేకపోతోందా? స్నేహాన్నీ, ప్రేమనీ విడదీసుకుని చూస్తోందా?
కార్తీక్‍తో మాట్లాడాక రోహిత్‍కి యింటికి వెళ్ళాలనిగానీ సౌగంధ ముఖం చూడాలనిగానీ అనిపించలేదు. కార్తీక్‍ముందు అలా మాట్లాడినా, సౌగంధ తనని వదిలి పెట్టి వెళ్ళదనే నమ్మకం వున్నా ఆమె ప్రవర్తన అతన్ని గాయపర్చింది. ఎందుకలా చేసింది? పుస్తకాలు చదివితే? మనుషులందర్లా ప్రవర్తించరా? వాళ్లదోవలో వాళ్ళు వెళ్ళిపోతూ వుంటారా? కుటుంబంకోసమేకదా, తను కష్టపడుతున్నది? ఆమెకి ఎందుకు అర్థమవదు? గాలికబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కడుపులు నిండవు. ఇద్దరు పిల్లలు తమకి! వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఎంత ఖర్చు? బొట్టూబొట్టూ కలిస్తేనేకదా, సముద్రమయేది? తననుంచీ ఏం ఆశించింది? ఎందుకని ఆమెకీ ప్రలోభం? తనని వదిలేసి కార్తీక్‍తో వెళ్ళిపోవాలనుకుందా? లేకపోతే డబుల్‍గేమ్ ఆడదామనుకుందా? ఎంతదాకా వచ్చింది వాళ్ళ చనువు? కోపం కట్టలుతెంచుకుని వస్తుంటే పార్కులో వెళ్ళి కూర్చున్నాడు. ఆ స్థితిలో యింటికి వెళ్తే అసహ్యకరమైన గొడవ జరుగుతుందని అంత కోపంలోనూ తెలుసుకున్నాడు. అందుకే వంటరితనాన్ని కోరుకున్నాడు. ప్రశాంతమైన వాతావరణం కొద్దిసేపటికి అతని మనసుని చల్లబరిచింది. ఆలోచన మేల్కొంది. స్వరూప ఏం చెప్తుంది ఈ విషయంలో?
ఆ ఆలోచన అతన్ని నిలవనివ్వలేదు. వెంటనే వాళ్ళింటికి బయల్దేరాడు. ఆమె యింట్లోనే వుంది. రమణ లేడు. అది కొంచెం తెరిపినిచ్చింది. పరాయి మగవాడిముందు తనభార్యని గురించిన ఇలాంటి విషయం ఎలా మాట్లాడగలడు? అతను వుండి వుంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడే.
అతనిలా వస్తాడని స్వరూప వూహించినదే. ఆహ్వానించింది. మంచినీళ్ళూ, కాఫీ ఇచ్చింది.
“చెప్పండి!” మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ అడిగింది. ఒక విషయంపై పూర్తి అవగాహన వుండికూడా ఏమీ జరగనట్టు వుండటం ఇబ్బంది కలిగించే విషయమే.
“మీ ఫ్రెండు ఇలా ఎందుకు చేస్తోందో మీకేమైనా తెలుసేమోనని…” అన్నాడు.
“ఇద్దరికీ వయసులు వచ్చాయిగానీ పరిపక్వత రాలేదు. ఆఫీసు కేంటిన్లోనూ ఇంకోచోటా ఖాళీ దొరికినప్పుడల్లా ఏవేవో మాట్లాడుకుంటుంటారు. ఒకొక్కసారి వాళ్ళ సంభాషణలో నేను వుంటాను, ఒకొక్కసారి వుండను. పుకార్లు లేపేంత చెడు వాళ్ళమధ్య ఏమీ జరగలేదు” నిదానంగా అంది.
“అదే ఎందుకని? ఏం తక్కువ చేసాను తనకి? అన్నీ అమర్చాను….”
“ఆగండాగండి… మీరు అమర్చటమేమిటి? తనకీ జీతం వుందికదా?” ఆపింది స్వరూప. అలాంటి దెబ్బ కొట్టకపోతే మగవాడు ఆగడు. తనకి తనే ఆపాదించుకున్న ఒక సుపీరియర్ పొజిషన్లోంచీ సమస్య స్థాయికి దిగి రాడు.
“నేను తనకోసం చేసింది ఏమీ లేదంటారా స్వరూపా?!” నిజంగానే దెబ్బతిన్నాడు.
“పెళ్ళంటూ జరిగి, ఇల్లు ఏర్పడ్డాక దాన్ని నిలబేట్టుకుందుకు అందరం ఏదో ఒకటి చేస్తాం రోహిత్. చెయ్యకుండా వుండం. మనకి తోచింది మాత్రమే చేసుకుంటూ పోతే ఎలా? సౌగంధ చాలా డిప్రెసౌతూ వుంటుంది ఒకొక్కసారి. జీవితంపట్ల తనకి వున్న ఆలోచనలు వేరు. నాకూ తనకీ వున్న తేడా నేను చెప్తాను. మిగతాది మీరు వూహించుకోండి” అని ఆగింది.
అతను శ్రద్ధగానే విన్నాడు.
“నేను చాలా పేదరికంలోంచీ వచ్చాను. పేదరికం అంటే… నాన్నకి వుద్యోగం లేదు. వ్యవసాయంమీద… నికరమైన ఆదాయం లేకుండా… గాలివాటంగా బతికాం. నలుగురు ఆడపిల్లలం. మా పెళ్ళిళ్ళు ఎలాగనే భయంతో ప్రతిదానికీ సర్దుకుంటూ సర్దుకుంటూ గీసిగీసి ఖర్చుపెట్టుకుంటూ పెంచారు. పెళ్ళైంది. ఇద్దరం తెచ్చుకుంటున్నాం. ఇంకా పెళ్ళికి ముందుకిలాగే వుండాలని అనుకోనుకదా? మార్పు కోరుకుంటాను. సౌగంధ విషయానికి వస్తే తనకి ఎలాంటి యిబ్బందులూ తెలీవు. వాళ్ళింట్లో రెండుమూడు తరాలుగా వుద్యోగస్తులే. పెద్ద జీతాలు కాకపోవచ్చు. కానీ జీవితాలుమాత్రం స్థిరపడ్డాయి వీళ్ళు ఇద్దరే పిల్లలు. నెల తిరిగేసరికి కచ్చితంగా ఇంత ఆదాయం. ఏది ఎలా వుండాలోననే ప్లానింగ్‍కి అదొక అవకాశం యిచ్చింది. తిండికీ బట్టకీ పోరాడుతూ బతకాల్సిన స్థితి తనకి ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే ప్రాథమిక అవసరాలు తీరతాయో మనోవికాసం మొదలౌతుంది. తండ్రీ తాతా టీచర్లు కాబట్టి వాళ్ళు చదువుకి ప్రాధాన్యత యిచ్చారు. అనేకరకాల పుస్తకాలు చదివింది తను. తన ఆలోచనని విస్తృతం చేసుకుంది. తను నాలా ఆలోచించదు. నాకు భిన్నమైన మనిషి. కానీ తనూ మనిషే. ” స్వరూప ఆగింది.
రోహిత్ ఆలోచనలు ఆ మాటలకి కొనసాగింపుగా సాగాయి.
అతనికి తన చిన్నతనం గుర్తొచ్చింది. తండ్రిది చిన్నవుద్యోగం. తల్లి, తాము నలుగురు పిల్లలు. తాత, బామ్మ. ఇంతమందీ అతనిమీద ఆధారపడి వుండేవారు. వచ్చిపోయే బంధువులు. తండ్రి జీతం తిళ్ళకే సరిపోయేది కాదు. తల్లి పక్కవాళ్ళింట్లోంచీ చేబదులు తెచ్చేది. ఆవిడకి వారంలో ఆరురోజులు ఏవో ఒక కారణాన్న వుపవాసాలు. ఒక్కోరోజు వంటిపూట తినేది. ఇంకోరోజు పూర్తి వుపవాసం వుండేది. తండ్రి… నీరసంగా, పెరిగిన గెడ్డంతో విసుగ్గా వుండేవాడు. తనకి వుద్యోగం వచ్చేదాకా అదే పరిస్థితి. తర్వాత యిద్దరు తమ్ముళ్ళకీ వుద్యోగాలొచ్చాయి. చెల్లెలి పెళ్ళైంది. కుటుంబం తెరిపిన పడింది.
ఐతే, తనకి కడుపునిండా తిండికూడా పెట్టలేని భర్తని వదిలేసి పోవాలనిగానీ ఇంకోలా బతకాలనిగానీ తల్లి ఎప్పుడూ అనుకోలేదు. అలాగే సర్దుకుంటూ బ్రతికింది. ఆర్ధికంగా బలపడాలనే సౌగంధని వుద్యోగంలో చేరమన్నాడు. ఈ రోజున సౌగంధకి ఏ కష్టాలూ లేవు. చేతినిండా డబ్బుంది. ఫ్రిజ్జి నిండా రకరకాల పదార్థాలుంటాయి. బీరువానిండా చీరలున్నాయి. చేతినిండా డబ్బుంది. అయినా ఆమెకి ఎందుకీ ప్రలోభం? ఏం చూసింది కార్తీక్‍లో? ఎందుకిలా జరిగింది? అతని ఆలోచన మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది.
“ఇంట్లో పదిమంది మనుషులున్నప్పుడు మగవాళ్ళు ఎంతరాత్రిదాకా బయట తిరిగినా సమస్య వుండేదికాదు. ఉండేదే ఇద్దరైనప్పుడు, అందులో ఒకరు వూళ్ళు తిరుగుతూ వుంటే యింట్లో వుండే రెండోమనిషికి ఎలా వుంటుంది? కార్తీక్ పరిచయమవ్వకపోతే ఏ మందో మింగి చచ్చిపోయేది. ఎన్నోసార్లు చావుగురించి నాతో అంది” అని ఆగింది. అతను వులిక్కిపడ్డాడు. ఇది అతను వూహించని విషయం.
“ఎందుకు? ఏం తక్కువని?”
“అది మీరే ఆలోచించాలి. తెలుసుకోవాలి”
అతను తలపట్టుకున్నాడు
“మా ఆఫీసర్‍తో నేను పర్సనల్‍గా మాట్లాడాను. కార్తీక్‍ని వేరేచోటికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఒకటి రెండురోజుల్లో ఆర్డర్స్ వస్తాయి. నేను చొరవ తీసుకోక తప్పలేదు. అంతా చాలా సైలెంటుగా జరిగిపోతుంది. అతను జూనియర్‍మోస్ట్ కాబట్టి ట్రాన్స్‌ఫర్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు” అంది స్వరూప.
అతను ఆశ్చర్యంగా చూసాడు.
“మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలీటం లేదు. కార్తీక్‍తో మాట్లాడి మీయింటికి వస్తున్నాను. నేను సమస్య అనుకున్నదాన్ని చాలా బాగా పరిష్కారం చేసారు” అన్నాడు.
“ఒక్క నిముషం రోహిత్! మీరు ఎరుపని అన్నది సౌగంధ దృష్టిలో సరిగా అలాంటి ఎరుపే కాకపోవచ్చు. మనిషికీ మనిషికీ పెర్సెప్షన్లో తేడా వుంటుంది. అది జీవవైవిధ్యం. వాస్తవికతనుంచీ భావుకతదాకా ఇందులో వుంటాయి. ఆ వైవిధ్యంలోంచీ ప్రవర్తనా, దాన్నుంచీ అనుభవాలూ, పర్యవసానాలూ… ఇవన్నీ అవతలి వ్యక్తిని చేరుకోవడం దాకా సాగుతాయి. ఈ ప్రాసెస్‍లో ఇచ్చిపుచ్చుకోవటాలు ఒక భాగం. ఎదుటివారు మననుంచీ ఏం ఆశించారు, మనమేం ఇచ్చాము అనేది గ్రహించుకోగలిగితే అనేక సమస్యలు తీరిపోతాయి. బాగా సంపాదించుకుని స్థిరపడాలని మీరు అనుకున్నారు. కాదనకుండా సౌగంధ వుద్యోగంలో చేరి జీతం సంపాదించి యిస్తోంది. మీమాటకి తను విలువు యిచ్చినట్టేకదా? ఇంకా డబ్బుకోసం మీరు టూర్లమీద తిరుగుతూ వుంటేనూ పొద్దుపోయేదాకా ఆఫీసులో వుండిపోతేనూ మిమ్మల్ని తలుచుకుంటూ తను వంటరితనంలో గడపాలా? ఇలాంటప్పుడే పొరపాట్లు జరుగుతాయి. ఏ మనిషీ చెడ్డవాళ్ళు కాదు. ప్లీజ్, అర్థం చేసుకోండి” అంది.
అతను తలూపాడు. తనకి ఈ పుస్తకాలూ వాటిలో విషయాలూ పెద్దగా తెలీవు. పేపరుకూడా చదవడు. దండగని తన అభిప్రాయం. వృధా అయే ప్రతినిముషం తనకో రుపాయో రెండురూపాయలో దండగ చేసినట్టే అనిపిస్తుంది. సౌగంధ మేగజైన్స్‌మీద ఖర్చుపెట్టడం, లైబ్రరీనుంచీ పుస్తకాలు తెచ్చుకోవటం నచ్చదు. ఎన్నోసార్లు అన్నాడు. అంత తీరికుంటే పనిమనిషిని మానిపించి యింటిపని చేసుకొమ్మనికూడా సలహా యిచ్చాడు. అలాంటి విషయాలమీద ఇద్దరికీ గొడవ అయేది. ఇద్దరూ భిన్నధృవాలన్న విషయం ఇప్పుడు అర్థమైంది. ఇంత జరిగాక అర్థమైంది. ప్రాథమ్యాలు… డబ్బే… డబ్బొకటే కాదు… ఈ రెండిటిమధ్యా తాను తేల్చుకోవాలి…
అక్కడినుంచీ ఇంటికి వచ్చాడు. సౌగంధ ఇంట్లోనే వుంది.
చాలా సంవత్సరాల తర్వాత సౌగంధ పెళ్ళి గురించి తన కూతురి అభిప్రాయం అడిగింది. అప్పటికి ఆ అమ్మాయి చదువు పూర్తి చేసి వుద్యోగంలో చేరింది. రోహిత్ పెళ్ళి చేద్దామన్నాడు. సౌగంధ అందుకే అడిగింది.
“అమ్మా! అవసరం అనుకుంటే పెళ్ళి యిద్దరికీ అవసరమే. లేదనుకుంటే లేదు. వెనకటి రోజుల్లోలా ఏదో పర్సస్‍కోసం పెళ్ళి చేసుకునే రోజులు
కావివి. పిల్లలకోసం మగవాళ్ళూ, వండి పెట్టి యిల్లు చూసుకోవడంకోసం లేక సోషల్ సెక్యూరిటీకోసం ఆడవాళ్ళూ అనే రోజులు పోయాయి. వంటా తిండీ అనేవి పెద్ద సమస్యలు కావు. మైక్రోవోవెన్ సెట్ చేసుకుంటే ఎవరేనా వేడివేడిగా తయారుచేసుకోవచ్చు. ఇంక వుండాల్సింది ఒక్కటే. కమిట్మెంట్. ఒకరికోసం ఒకరం చివరిదాకా కలిసివుండటం అనే కమిట్‍మెంట్. భర్త అనేవాడు మంచి ఫ్రెండ్ కాలేకపోవచ్చు. మంచి ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ హజ్బెండ్ కాకపోవచ్చు. కాబట్టి పెళ్ళి వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక తల్లిపిల్లలు కూడా ఏ యిద్దరూ ఒకలా ఆలోచించరు. ఇద్దరు ఫ్రెండ్స్‌కూడా తమకి యింట్రెస్ట్స్ కలిసే విషయాలనే మాట్లాడుకుంటూ, వాటినే ప్రమోట్ చేసుకుంటూ స్నేహాన్ని పెంచుకుంటారు. చిన్న అభిప్రాయభేదం వస్తే జన్మలో మళ్ళీ ముఖం కూడా చూసుకోనివాళ్ళున్నారు. పెళ్ళంటే అలా విడిపోవాలనిపించకూడని బంధం కావాలి. ఈ విషయాలు అర్ధం చేసుకోగలిగే వ్యక్తిని చేసుకుంటాను” అందా అమ్మాయి.
రోహిత్, సౌగంధ ఒకరినొకరు చూసుకున్నారు. భావాలు వేరవచ్చు, పదాలు మారవచ్చు. కానీ మనిషి కోరిక మాత్రం అప్పటికీ యిప్పటికీ ఒకటే… శాశ్వతమైన అనుబంధం ఒక్కటేనా వుండాలి. లేకపోతే యిల్లూ, కుటుంబం అనేవి ఒక వూహగా మిగిలిపోతాయి. అందుకు భార్యాభర్తలు రెండోవాళ్ల చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడవాలి. ఎంతగా మన కాళ్ళు ఇమిడితే నడక అంత సౌకర్యంగా వుంటుంది. ఇది రోహిత్ తెలుసున్న సత్యం. అతను దాన్ని తెలుసుకున్నాక సౌగంధకి అతన్ని అనుసరించడం పెద్ద కష్టమవలేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.