ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi

  1. ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi
  2. ఓవర్‍కోటు – 2 Translation by S Sridevi
  3. ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi
  4. ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi
  5. ఓవర్‍కోటు – 5 Translation by S Sridevi
  6. ఓవర్‍కోటు – 6 Translation by S Sridevi

రష్యన్ మూలం “Shinel” by Nikolai V Gogol (in 1842)
Translated to English as “The Overcoat” by Isabel F Hapgood (in 1886) and available in Project Gutenberg in the Public domain.

వీధిలో అంతా ఇంకా ప్రకాశవంతంగానే ఉంది. కొన్ని చిన్న దుకాణాలు, చవకబారు క్లబ్‌లు తెరిచే ఉన్నాయి. పెద్దపెద్ద దుకాణాలు, క్లబ్బులు మూసేసినా, ఇంకా వాళ్ళ దినచర్య పూర్తవ్వలేదన్నందుకు చిహ్నంగా లోపల దీపాలు వెలుగుతున్నాయి. యజమానులకీ వుద్యోగులకీ మధ్య ఏవో సంభాషణలు జరుగుతున్నాయి. మూసేసిన తలుపుల సందుల్లోంచీ నిలువెత్తునా వెలుతురు పడుతోంది. అకారణంగా అకాకీకి చాలా వుత్సాహంగా అనిపించింది. ఆ సంతోషంలో అతను మెరుపువేగంతో పరిగెత్తుతున్న మహిళ వెనుక తనూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొంతసేపటికి ఆగి, ఇంతకు ముందులా మామూలుగా నడవసాగాడు. అలా ఎందుకు పరిగెత్తాడో ఎంత ఆలోచించినా అతనికే అర్థమవ్వలేదు. తన ఇంటి పరిసరాల్లోకి వచ్చాడు. లాంతర్ల మసకవెలుతుర్లో నిర్మానుష్యమైన దారి మొదలైంది. లాంతర్లుకూడా అక్కడొకటీ ఇక్కడొకటీ వున్నాయి. పగటిపూటే అవి నిర్మానుష్యంగా వుటాయి. రాత్రి ఈవేళలో చెప్పనే అక్కర్లేదు. ఆ తర్వాత తలుపులు తాళాలేసిన చెక్కయిళ్ళు మొదలయ్యాయి. వీటన్నిటినీ దాటుకుంటూనే అకాకీ విందు జరిగిన యింటికి వెళ్ళినది. రోడ్డుమీద, ఇళ్ళకప్పులమీద మంచు తళుక్కుమంటోంది
అతని వీధికి దారితీసే కూడలిని చేరుకున్నాడు. అకాకీ ఉల్లాసం బాగా తగ్గిపోయింది. భయంకరమైన ఎడారి దాటుతున్నట్టనిపించింది. దూరంగా, ఒక వాచ్‍మేన్ బాక్స్‌నుండి చిన్న మెరుపులాంటిది మెరుస్తున్నట్లు అనిపించింది. అది ప్రపంచపు అంచుని ఎక్కడో వున్నట్టు భావన. కూడలిలోకి ప్రవేశించాడు. ఏదో అసంకల్పిత చర్యలా భయం మొదలైంది. ఏదో చెడు జరగబోతోందనిపించింది. వెనక్కి తిరిగి చూసాడు. ఇరుపక్కలా చూసుకున్నాడు. చూట్టూ అంతా వంటరితనపు చీకటి సముద్రం. కళ్ళుమూసుకుని కూడలిని దాటాడు. కళ్ళూ తెరిచి చూసేసరికి ఎదురుగా అత్యంత సమీపంలో కొందరు గెడ్డం మనుషులు. గుండె వడివడిగా కొట్టుకుంది.
“అయితే, ఆ కోటు నాదే!” వాళ్ళలో ఒకడు అకాకీ కాలరు పట్టుకుని పెద్దగొంతుతో అన్నాడు.
“ఎవరేనా వున్నారా? సాయం చెయ్యండి” అకాకీ అరవబోయాడు.
“సహాయం!” రెండవవ్యక్తి అతని మూతిమీదికి పిడికిలి విసిరాడు. “ఎంత ధైర్యం నీకు, అరవటానికి?” అన్నాడు. అతని పిడికిలి ఒక మనిషి తలకాయంత వుంది.
తన కోటు లాక్కుని తనని ఒక తన్ను తన్నటంమాత్రం అకాకీకి తెలుసు. ఆ తర్వాతేం జరిగిందో అతనికి గుర్తులేదు. స్పృహ కోల్పోయి రోడ్డుమీద వున్న మంచులో తలకిందులుగా పడిపోయాడు. మళ్ళీ తెలివి రావటానికి కొన్ని నిముషాలు పట్టింది. నెమ్మదిగా కూడదీసుకుని లేచి నిలబడ్డాడు. చుట్టూ చూస్తే అక్కడెవరూ లేరు. చల్లటి చలి… కోటు పోయిందని గుర్తొచ్చింది. అదొక అశనిపాతంలా తాకింది మనసుని. పెద్దగా అరవసాగాడు. అతనిదేమీ పెద్ద గొంతు కాదు. ఐనా ఆపలేదు. అరుస్తునే వాచ్‍మేన్ బాక్స్‌వైపు పరుగెత్తసాగాడు. కాపలాదారు వాచ్‍బాక్స్ పక్కని తన ఈటెకి ఆనుకుని నిలబడి వున్నాడు. అరుస్తూ అంత కంగారుగా పరిగెత్తుకొస్తున్న వ్యక్తి ఎవరాని చూస్తున్నాడు. అతన్ని అకాకీ చూడలేదు.
“వాచ్‍మేన్! వాచ్‍మేన్!! ఏం చేస్తున్నావు నువ్వు? నీ డ్యూటీ మానేసి నిద్రపోతున్నావా?” తిట్టడం మొదలుపెట్టాడు.
“నన్ను తిట్టడం ఆపి అసలేం జరిగిందో చెప్పు” అన్నాడతను విసుగ్గా.
అకాకీ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పాడు.
“ఇద్దరు వ్యక్తులు నిన్నా కూడలిచివర్లో కలుసుకోవటం చూసాను. నీ స్నేహితులని అనుకున్నాను. రేప్పొద్దున్నే వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చెయ్యి. వాళ్ళైతే నీ కోటు ఎవరెత్తుకుపోయారో వెతికి పట్టుకుంటారు. నన్ను నిందించడంవలన ప్రయోజనం వుండదు” అన్నాడు.
అకాకీ ఇంటికి పరిగెత్తాడు. తలుపు దబదబ బాదేసాడు. ఆ శబ్దానికి దుస్తులేనా సరిచేసుకోకుండా కంగారుపడిపోతూ వచ్చి తలుపుతీసింది. అకాకీని చూసి నివ్వెరబోయింది. అతని జుత్తు పూర్తిగా రేగిపోయింది. వళ్ళంతా మంచుకొట్టుకుని పోయింది.
“అకాకీ అకాకియొవిచ్, ఏం జరిగింది?” ఆదుర్దాగా అడిగింది.
అతను జరిగినదంతా చెప్పాడు. ఆమె వింది.
“నువ్వు వెంటనే జిల్లా పోలీసు ప్రధానాధికారిని కలువు. అతనైతే ఏదైనా చేస్తాడు. కిందివారైతే సరైన చర్య తీసుకోకపోవచ్చు. చేస్తామని నీముందు చెప్పి, నువ్వెళ్ళాక ఫిర్యాదు పక్కన పడేస్తారు. అదీకాక నాదగ్గర ఒకప్పుడు వంటవాడిగా చేసిన ఫిన్నిష్ అన్నా ఇప్పుడు అతనిదగ్గర నర్స్‌గా చేస్తున్నాడు. ఎప్పుడూ మనింటిముందునుంచే వెళ్తాడు. చర్చిలోకూడా కలుస్తుంటాడు. చాలా అందర్తోనూ కలుపుగోలుగా నవ్వుతూ వుంటాడు. మంచివాడనే అనుకుంటున్నాను. నీకు అతను సాయపడవచ్చు” అంది వోదార్పుగా.
అకాకీ అక్కడినుంచీ బరువుగా కాళ్ళీడుస్తూ తన గదిలోకి చేరుకున్నాడు. ఆ రాత్రి ఎంతో భారంగా గడిచింది.
తెల్లవారుతూనే జిల్లా పోలీసు ప్రధానాధికారివద్దకు వెళ్ళాడు. నిద్రపోతున్నాడని కింది వుద్యోగులు చెప్పారు. మళ్ళీ పదింటికి వెళ్ళాడు. ఇంకా నిద్రలోనే వున్నట్లు సమాచారం. పదకొండు గంటలకు వెళ్తే ఆయన బైటికి వెళ్ళాడని చెప్పారు. భోజనం సమయానికి వస్తే ముందుగదిలో వున్న గుమస్తాలు అనుమతించడానికి నిబంధనలు వప్పుకోవని నిక్కచ్చిగా చెప్పేసారు. పైగా అసలెందుకు వచ్చాడో చెప్పమని నిర్బంధించారు.
పిల్లినేనా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది. తనిక కొంచెం తెగించకపోతే లాభం లేదని అర్థమైంది అకాకీకి. కోటు దొంగతనాన్ని గురించి చెప్పి, “నేను లీగల్ డిపార్టుమెంటుకి చెందినవాడిని. ప్రధానాధికారిగారిని వ్యక్తిగతంగా కలవాలి. దయచేసి అనుమతించండి. లేదంటే నేను పై అధికారులకి ఫిర్యాదు చేస్తాను. ఆ తరవాతి పరిణామాలు ఎలా వుంటాయో మీరే ఆలోచించుకోండి” అన్నాడు కొంచెం కటువుగా. ఐనా మర్యాదగానే.
దాంతో వాళ్ళు మరేమీ మాట్లాడలేదు. అందులో ఒకడు ధైర్యం చేసి ప్రధానాధికారిగారికి ఫోన్‍లో విషయం చెప్పాడు. అధికారి అకాకీని పంపించమని చెప్పాడు. అతను వెళ్ళాడు. ముఖ్యాధికారి దొంగతనానికి సంబంధించిన వివరాలు అడగటం మానేసి, ఇతరత్రా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఫిర్యాదు పక్కదారి పట్టింది.
“నువ్వంత రాత్రిదాకా ఇంటికి వెళ్ళకుండా ఏం చేసావు? రోజూ అలానే చేస్తావా? అది నీ అలవాటా? నీ కోటు పోయినరోజు రాత్రి నువ్వెక్కడికి వెళ్ళావు? ఏదేనా నేరం చెయ్యడానికి వెళ్ళావా?” అంటూ ప్రశ్నలు సంధించేసరికి అకాకీ తికమకపడిపోయాడు. తన కోటు విషయం సరైన విధంగానే ఫిర్యాదుచేసాడా లేదాననే అనుమానం వచ్చింది. నమస్కారం పెట్టి బయటపడ్డాడు.
జీవితంలో మొదటిసారి, ఆఫీసుకిగానీ ఆ పరిసరాల్లోకిగానీ వెళ్లలేదు అకాకీ. వెళ్ళాలనిపించలేదు. మర్నాడు పాతకోటు వేసుకుని వెళ్ళాడు. అదిప్పుడు ఇంకా ఘోరంగా కనిపిస్తోంది. అతని ముఖం పాలిపోయి వుంది.
“ఏం జరిగింది? అలా వున్నావేం?” అని ప్రతివాళ్ళూ అడగటమే. విషయం తెలిసి ఒకరిద్దరుతప్ప అందరూ అతనిమీద జాలిపడ్డారు. ఆ ఒకరిద్దరూ అంతటి దయనీయమైన పరిస్థితినికూడా వదలకుండా అకాకీని గేలిచేసారు. అంతా కలిసి కొంతమొత్తం పోగుచేద్దామని అనుకున్నారుగానీ, అప్పటికే వాళ్ళ పర్సులు చిల్లులు పడే సంఘటనలు రెండు జరిగాయి. డైరక్టరుగారి చిత్రపటంకోసం ఒకసారి, వాళ్ళ విభాగపు ఆఫీసరుయొక్క మితృడి పుస్తకంకోసం మరొకసారీ చందాలు వేసుకున్నారు. ఇప్పుడు అకాకీకి సాయం చేసే పరిస్థితిలో ఎవరూ లేరు.
“నువ్వలా పోలీసు అధికారులదగ్గరికి వెళ్ళడంవలన ప్రయోజనం వుండదు. వాళ్ళు నీ కోటుని వెతికి పట్టుకున్నా, అది నీదేనని ఆధారాలు చూపిస్తే తప్ప దాన్ని నీకివ్వరు. ఎవరేనా ఉన్నతోద్యోగిని వెళ్ళి కలువు. అతని ద్వారానైతేనే నీపని జరుగుతుంది” వారిలో ఒకరు, జాలితో సలహా ఇచ్చాడు.
చేసేదేం లేక అకాకీ ఉన్నతాధికారిగా చెప్పబడుతున్న ఒకతన్ని కలవడానికి నిర్ణయించుకున్నాడు. కొత్తగా పదోన్నతి తీసుకున్నాడు. అతని అధికారిక స్థానం ఏమిటో ఎవరికీ కచ్చితంగా తెలీదు. తోటి వుద్యోగులు అతన్ని తమసాటివాడని వప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఐనప్పటికీ వారితో చాలా సౌమ్యంగా, వాళ్ళేం చెప్పినా పాటించడానికి సిద్ధంగా వుంటాడు. పైవాళ్ళతో వినయం చూపిస్తాడు. కిందివాళ్ళతో మాత్రం చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. మొదటి రెండిటితో ఎఅవరికీ ఎలాంటి సమస్యాలేదు. మూడో విషయంలోనే ఇబ్బంది. అలా వుండమని అతనికి ఎలాంటి తర్ఫీదూ లేదు. పదోన్నతి పొందటానికి ముందు వారంరోజులపాటు సాధనచేసి అలాంటి కాఠిన్యం నేర్చుకున్నాడు. ఒకొక్కసారి అతనికి తనమీద తనకే జాలేస్తుంది. ఈ మూడువిధాల ప్రవర్తనతో చాలా యిబ్బందిపడుతుంటాడు. కిందివాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ల సంభాషణల్లో పాల్గొనాలని వుంటుందిగానీ అలా చెయ్యటం తన స్థాయికి తగింది కాదనిపిస్తుంది. దానివలన కింది వుద్యోగులకి చనువు పెరిగి, నెత్తికెక్కుతారేమోననే భయం. ఊ< ఆ< లాంటి పొడిమాటలు తప్ప ఒక్క అక్షరంకూడా ఎక్కువ చెప్పడు.