సౌమ్య బస్టాప్‌లో బస్‌కోసం చూస్తోంది. అలా రోజూ అలవాటే. ఆరోజు ఒకబ్బాయి ఫుట్పాత్కిందనుంచీ నడుచుకుంటూ తననే చూసుకుంటూ వెళ్ళాడని సౌమ్యకు అనిపించింది. ఆసక్తికరంగా అనిపించింది. కానీ కాసేపటికి మరిచిపోయింది. మళ్ళీ మర్రోజు ఆ అబ్బాయి తననే చూసుకుంటూ వెళ్ళాడని అనిపించింది. అరే భలే ఉందే ఈ భావన అనుకుంది.
రోజూ ఆ అబ్బాయి తననే చూస్తూ వెళ్ళడం సౌమ్యకు సరదాగాను, బావున్నట్లుగానూ అనిపించడం. ఇలా ఇద్దరికీ అలవాటుగా మారింది. ఆ రోజు సౌమ్య బస్టాప్‌లో అడుగుపెట్టబోతోంది, ఎదురుగా బస్టాప్ బల్లమీద ఆ అబ్బాయి కూర్చునిఉండటం చూసింది. సౌమ్యకి ఆశ్చర్యంతో, చిరుభయంతో అడుగు ముందుకు పడట్లేదు.
అతనే నెమ్మదిగా లేచి సౌమ్య దగ్గరకు వచ్చి ” మీకు ఇబ్బందిగా ఉందంటే నేను వెళ్ళిపోతాను ” అన్నాడు చిన్న గొంతుతో.
“నాకేం ఇబ్బంది? అయినా ఎందుకు ఇబ్బంది? ” అంది తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో.
“సరే మరి, నా పేరు శేఖర్, మీ పేరు తెలుసుకోవచ్చా” అడిగాడు.
అతనివైపు ఒకసారి చూసింది చిరుకోపంగా. మళ్ళీ ఏమయ్యిందో కానీ అప్రయత్నంగా ” నా పేరు సౌమ్య ” అని చెప్పేసింది.
అతను చిన్నగా నవ్వాడు. నవ్వితే చాలా బావున్నాడు అని అనుకుంటూ తనూ బదులుగా నవ్వింది.
“మీరూ నవ్వితే చాలా బావున్నారు ” అన్నాడు చిలిపిగా. అమ్మో నా మనసులో మాట చదివేస్తున్నాడే అనుకుంది సౌమ్య. అలా రోజూ ఇద్దరికీ కబుర్లు నడుస్తున్నాయి.
ఒకరోజు సౌమ్య బస్టాప్‌లోకి రావటం ఆలస్యం, గట్టిగా వర్షం మొదలయ్యింది. అరే శేఖర్ రాలేదే, ఇవాళ వస్తాడా, రాడా అని అనుకుంటోంది. శేఖర్ ఒక గొడుగుతో నడిచివచ్చాడు. రా అని సౌమ్యకు చేతితో సైగ చేసాడు. వెళ్ళాలా వద్దా అని తేల్చుకోలేకపోతోంది. రా అని అతను మళ్ళీ చేతితో పిలిచాడు. సౌమ్య వెళ్ళింది. గొడుగుకింద ఇద్దరూ అడుగులు కలిపి నడుస్తున్నారు. ఈ సంఘటన ఇద్దరికీ నచ్చింది. శ్రీ 420 సినిమా పాట, చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటలు ఇద్దరికీ మనఃమస్తిష్కాల్లో గుర్తొస్తున్నాయి. ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుంటే మధురమైన అనుభూతి కలుగుతోంది. గొడుగుమీద వానచినుకుల చిరుసంగీతం, మనసులో ప్రేమ తాలూకూ దివ్యభావన ఇద్దరినీ జీవితంలోని అతిమధురమైన క్షణాలను అనుభవించేలా చేస్తున్నాయి.
“సౌమ్యా నీ చదువు, నా చదువు పూర్తయ్యాక, మనమిద్దరం మన భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించుకుందాము ” అని అడిగాడు ప్రేమగా శేఖర్.
అది విన్న వెంటనే తల్లి తండ్రి అన్నయ్య గుర్తొచ్చారు సౌమ్యకి. కొంచెం భయం వేసింది, తన ప్రేమవిషయం వాళ్ళకి చెప్పటం ఎలాగా అని…
అంతే వెంటనే గొడుగునీడలోంచీ బయటకు వచ్చేసింది. ఏ దారిలో అయితే వచ్చిందో, అదే దారిలో మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తూ వెళుతోంది. సౌమ్య సందేహంలో ఉందీ అని అర్ధం చేసుకున్న శేఖర్ , ఆమె వెనకాలే వెళ్ళి విసిగించదలుచుకోలేదు.
అదేరోజు రాత్రి ఏడింటికి తల్లికి తన ప్రేమవిషయం చెప్పి, తండ్రిని ఎలాగైనా ఒప్పించమని కోరింది సౌమ్య.
తల్లి, ” నేనే ఒప్పుకోను, ఇంకా నాన్నను నేను ఒప్పించటమేమిటీ ” అంది.
“అమ్మా! శేఖర్ మంచివాడు” అని తల్లిని ఒప్పించబోయింది. అంతా పడగ్గదిలోంచి విన్న తండ్రి వచ్చి సౌమ్యతో నిక్కచ్చిగా చెప్పాడు ” నా స్నేహితుడు విఠల్ కొడుకుతో నీ పెళ్ళి అని ఎప్పుడో నిశ్చయమయింది, ఇప్పుడు నీ పిచ్చి ప్రేమగోల ఏమిటీ ” అని.
“నాన్నా! ఈ విషయం నాకు తెలియనుకూడా తెలియదు, పైగా శేఖర్ చాలా మంచబ్బాయి, మీరొకసారి అతన్ని కలిసి మాట్లాడండి, మా చదువులు అయ్యాకే మా పెళ్ళి ” అంది సౌమ్య.
తండ్రి సౌమ్య చెంప ఛెళ్ళుమనిపించాడు. ” నీ సలహాలు లేనిదే నీ పెళ్ళి చేయడం నాకు చేతకాదా, నోర్మూసుకుని ప్రేమా గీమా అనకుండా పడుండు ” అని శాసించాడు.
మళ్ళీ బస్టాప్‌కి వెళ్ళలేదు సౌమ్య. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. రెండేళ్ళ తర్వాత సౌమ్యకి పెళ్ళయిపోయింది వేరే అతనితో. జీవితంలో, ఎప్పుడూ, సౌమ్య వర్షం తగ్గేందుకు షాపింగ్ మాల్స్‌లో ఎదురుచూస్తూ, మార్కెట్లలో ఎదురుచూస్తూ ఉంటుందే తప్ప గొడుగు మాత్రం వాడలేదు కదా గొడుగుని ముట్టను కూడా ముట్టలేదు. గొడుగు సౌమ్యకు ఒక మరిచిపోయిన, మరిచిపోవాల్సిన మధురమైన జ్ఞాపకం, ఒక చేదు జ్ఞాపకం, ఒక ముల్లులాగా గుచ్చుకుని నొప్పిని కలిగించే జ్ఞాపకం. కొన్ని ప్రేమ జీవితాలు ఇలా విఫలమే బాధను పంచుతూ, బాధను పెంచుతూ.
నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.