PLANET– X23PI
“ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఎందుకు? ఏమైంది? అందరూ అనుకుంటున్నట్లుగా అవి కేవలం కట్టుకథలేనా? లేదంటే మన
ఇంజినీరింగ్‍లో లోపం ఉందా? ఇన్ని సంవత్సరాల పరిశోధనలకూ, ప్రయత్నాలకూ ఇదేనా మనకు లభించిన ఫలితం? దీనివలన అనవసరంగా మనం శత్రువులను పెంచుకుంటున్నాం. అదికూడా చాలా శక్తింతమైన గ్రహాలతో. మన ఇంజినీరింగ్ అద్భుతాలతో, యుద్ధనౌకలతో, కాంతివేగంతో ప్రయాణించే క్షిపణులతో మనం ఇంతవరకూ చాలాగ్రహాలను అదుపులో పెట్టుకున్నాం, కొన్నిటిని ఆక్రమించుకున్నాం. ఐనా సరిపోదు. మనకు ఇంకా చాలా ఎనర్జీ (ఇంధనం) కావాల్సి వుంది. ఇప్పుడున్న కొత్తటెక్నాలజీ ఎంత అద్భుతమైనదో అంత ఎనర్జీని తాగేస్తుంది. ఇదేతరహాలో కొనసాగితే రెండుమూడుసంవత్సరాలకంటే ఎక్కువకాలం మన గ్రహవాసులూ, మన అధీనంలో వున్న గ్రహవాసులూ మనుగడ సాగించలేరు. అది మన నాయకత్వానికే మచ్చ. ఇంత విశ్వంలో ఇప్పటివరకూ మనమంటే భయం, భక్తిగలవాళ్ళందరూ ఇక స్వతంత్రులుగా బతికేందుకు ధైర్యంచేస్తారు. ఇదంతా ఇప్పుడు మనం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ మిషన్, మెషీన్ రెండూ ధ్వంసం అయిపోవడంవల్లనే. కట్టుకథలని తెలుసుకోకుండా నమ్మడం తప్పా?
పరిశోధనాగ్రంథాలన్నీకూడా నొక్కి వక్కాణిస్తున్నాయి. అది సాధ్యమని. కట్టుకథలు కావని. అంతేకాకుండా, చరిత్ర చూసినాసరే, సరిగ్గానే ఉంది. మరెందుకు ఇలా జరిగింది? మెషీన్‍లోనే లోపం ఉండొచ్చు. చీఫ్ ఇంజినీర్‍కి చెప్పండి. ఎక్కడ లోపం వుందో రెండురోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పండి” అతని గొంతు ఖంగుమంది. వెంటనే ఆదేశాలు వెళ్ళిపోయాయి.
PLANET – M5Z27
మనసు కోపంతో రగిలిపోయింది యువరాజుకి. ముఖంలో ఏమాత్రం కోపాన్ని కనబరచకుండా గంభీరంగా లావాలా పొంగుతున్న ఆవేశాన్ని ఆపుకోవడం మానవమాత్రులకి అసాధ్యం, అలాంటి సమయాల్లో మౌనం వహించడం మహర్షులకే సాధ్యం. ఏమీ చేయలేకపోయారు ఇంతమంది సైన్యం, ఇన్ని ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇన్ని ఉన్నాసరే.
తన తండ్రి రాజు. ఆయన చనిపోయాక, రాణి అయిన తన తల్లి ఆధ్వర్యంలో తనే ఈ గ్రహపర్యవేక్షణను చేశాడు. రెండురోజులక్రితం రాణిని ఆ గ్రహం-X23PI నాయకుడు తీసుకెళ్ళిపోయాడు, సుసంపన్నంగా ఉన్న యీగ్రహాన్ని పూర్తిగా ధ్వంసంచేసిమరీ. తీసుకెళ్ళాక ఏం జరిగింది తన తల్లికి? అతిక్రూరంగా, బతికున్నప్పుడే ఆమె గుండెను పెకిలించి మరీ చంపేశారు. కట్టుకథలా అనిపించే ఆ చారిత్రకనిజాన్ని నిరూపించడానికికాదు, ఒక కిరాతక నార్సిసిస్టిక్ నియంత తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడంకోసం.
ఇంతకీ ఆ చారిత్రక నిజం ఏమిటంటే, పురాతనకాలంనుంచీ ఒక దివ్యశక్తి, తరతరాలకు చెందిన అనేకమంది స్త్రీల శరీరాలలో నిబిడీకృతమై ఉంటుంది. అది ఈ విశ్వంలో ఒక తరానికి చెందిన ఒక స్త్రీ శరీరానికే పరిమితమై ఉంటుంది. ఆ స్త్రీ మరణానంతరం వేరొక స్త్రీ శరీరంలోకి చేరుతుంది. అలా చేరినా అది సాధారణంగా పనిచేయలేదు. పనిచేయాలంటే ఆ స్త్రీ నిజమైన, షరతుల్లేని ప్రేమను పొందివుండాలి. అప్పుడే ఆ దివ్యశక్తి ఉత్తేజితమవుతుంది. దానికి విశ్వమంతటికీ సరిపోయే శక్తిని అందించగలిగే సామర్థ్యం ఉంటుంది.
ఆ దివ్యశక్తి ఆమె హృదయస్పందనల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ స్పందనలద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి విశ్వానికి చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆ దివ్యశక్తి ఒక స్త్రీ శరీరాన్ని ఏవిధంగా ఎంచుకుంటుందోమాత్రం ఏ చరిత్రలోనూ రాయలేదు. కానీ, అది ఒక్కొక్క తరానికి ఒక్కొక్క గ్రహానికి చెందిన స్త్రీని ఎన్నుకుంటుంది. ప్రకృతి జీవరాశులయొక్క అత్యాశను ముందుగానే పసిగట్టి చేసిన ఏర్పాటేమో యిది. ఆ శక్తి, ప్రతిసారీ ఒకే గ్రహవాసులకు లభించినట్లయితే ఆ గ్రహం తన యితర అవసరాలకోసం మిగతాగ్రహాలను నియంత్రించగలుగుతుంది. అందుకనేమో యిది యిలా నిర్ణయించబడింది!
కొంతమంది శాస్త్రవేత్తలూ, ఇంజినీర్లూ సృష్టిని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు, ఆ దివ్యశక్తిని అదుపులో పెట్టేందుకు అనేకతరాలనుండి ప్రయత్నాలు చేస్తున్నాసరే సత్ఫలితాలను పొందలేకపోయారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా అనేకమంది స్త్రీలను అన్యాయంగా బలికావించారు. M5Z27 రాణి అంతర్థానం, ఆమె దుర్మరణంకూడా అలాంటి ప్రయత్నాల్లో భాగమే. అత్యంత ఆధునిక సాంకేతికతకు నెలవైన X23PI గ్రహం, ఆ దేశ శాస్త్రసాంకేతికనిపుణులు ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారుచేసి, దాన్ని విశ్వశక్తికేంద్రంతో అనుసంధానించేందుకు అన్ని యేర్పాట్లూ చేశారు. దివ్యశక్తికేంద్రమైన స్త్రీహృదయాన్ని ఆ యంత్రంలో అమర్చినట్లయితేగనుక భావోద్వేగాలతో సంబంధం లేకుండా ఆ గుండె శక్తిని జనింపచేస్తుంది. అది థియరీలో చెప్పలేంత సులువుకాదని, అక్కడ ఆ మెషీన్ నాశనం కావడంద్వారా ఆ నాయకునికి ఇప్పుడు తెలిసింది.
PLANET – 6R41Q
అర్థరాత్రి దాటి మూడుగంటలు కావొస్తుంది. హఠాత్తుగా ఏదో పెద్ద శక్తివంతమైన ఉల్క భూమిని ఢీకొన్నట్టు భూమి కంపించింది. రాజప్రసాదంలో అంతఃపురంలో నిద్రిస్తున్న యువరాణికి శరీరంలో ఏదో విపరీత శక్తి ప్రవేశించినట్టయి, దిగ్గున లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. అక్కడక్కడా భూకంపానికి కింద పడిన వస్తువులుతప్ప ఇంకేవీ కనబడలేదు. ఏదో కలవచ్చిందేమో అని కళ్ళునులుముకుందామని చేతులను కళ్ళదగ్గరకు తెస్తున్నప్పుడు కనబడింది ఆమెకి తన మణికట్టుపైన ఒక నక్షత్రాకారపు నల్లనిగుర్తు. ఇదివరకటికి లేనిది ఇది ఎలా వచ్చిందని భయపడి, ఏదో నల్లని సిరా అయుంటుందని తుడుచుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది.
భయంతో వణుకుతు అంత అర్థరాత్రిసమయంలోనూ తండ్రిదగ్గరికి వెళ్ళింది. అప్పటికే భూకంపవివరాలను సేకరించి, తక్షణ ఉపశమనచర్యలను తీసుకోవడానికి మంత్రిమండలిని సమావేశపరిచాడు రాజు. రాజ్యదక్షతకు మారుపేరుగా, ప్రజల సంరక్షణ, సౌకర్యాలే పరమావధిగా పరిపాలన సాగిస్తాడని మొత్తం గెలాక్సీలోనే ఈ రాజుకి పేరు. రాకుమారి సరాసరి మంత్రిమండలి సమావేశంలో ఉన్న రాజు దగ్గరకే వచ్చి తన వింతకలనూ, తన మణికట్టు పై ఏర్పడిన విచిత్రమైన ఆకారాన్ని చూపించింది.
ఇటువంటి వైపరీత్యాన్ని ఊహించని రాజు, మంత్రిమండలి సలహాతో ఒక వృద్ధవైజ్ఞానికవేత్తను, అంతరిక్షశాస్త్రంలో ప్రసిద్ధుడైనవాడిని రప్పించాడు. ఆ శాస్త్రవేత్త ఎటువంటి తొట్రుపాటూ లేకుండా, “రాజా! ఇది మీకుకూడా తెలిసి ఉండవలసిన విషయమే. తరానికి ఒకరినిమాత్రమే వరించే అరుదైన అవకాశం ఇది. దివ్యశక్తి విషయం. అదిప్పుడు రాకుమారి హృదయస్థానమును పొందింది. ఇక అది శక్తివంతమయే గడియకోసం వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం అన్ని గ్రహకూటములలో నెలకొన్న పరిస్థితులవలన చాలామంది దివ్యశక్తిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. M5Z27 గ్రహరాణిని కేవలం ఈ శక్తికోసమే X23PI గ్రహనాయకుడు చంపేశాడని వార్త. వారు తయారుచేసిన దివ్యశక్తి సంచాలితయంత్రంకూడా యెందుకోమరి, మొరాయించింది. దాంతో రాణి మరణం వ్యర్థమైంది. ఇక ఆ దివ్యశక్తి ఆమె శరీరంనుండి వెలికితీసిన హృదయంలో’ కొన్నిరోజులపాటుమాత్రమే ఉంటుంది. అదికూడా చాలా కొద్దిగామాత్రమే విశ్వానికి కావాల్సిన శక్తిని ఇవ్వగలుగుతుంది. తర్వాత మన యువరాణీగారికి పూర్తిగా సంక్రమిస్తుంది. దాన్ని ఉపయోగించడానికి రెండేమార్గాలు – ఒకటి నిజమైన ప్రేమానుభూతిని యువరాణీ పొందడం, రెండవది శక్తివంతమైన దివ్యశక్తిసంచాలిత యంత్రాన్ని తయారుచేసి, దానికి యువరాణి గుండెను అమర్చడం. ఆ రెండింటిలో ఏది జరగాలన్నా దానికి మనకు తగినంత సమయం లేదు. అలా అని మనం చేతులుకట్టుకుని కూర్చోవాల్సిన పనిలేదు. మన శాస్త్రవేత్తలు, ఇంకా మన గ్రహకూటమిలోగల శాస్త్రవేత్తలు తరతరాలుగా ప్రయోగాలు చేస్తూ, శరీరానికి ఎటువంటి హాని కలుగచేయకుండానే శక్తిని ఉత్పత్తి చేయగలిగే యంత్రనమూనాలను తయారుచేశారు. అవి ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి. ఆ ప్రక్రియలను వేగవంతం చేయడానికి సంపదను మీరు సమకూర్చినట్లయితే, మనం మనకున్న తక్కువ సమయంలో సఫలీకృతం కాగలం.
యువరాణిగారిని అనేక ఇతర గ్రహకూటములనాయకులనుంచి దూరంగా ఉంచేందుకు కట్టుదిట్టమైన భద్రతాయేర్పాట్లనుమాత్రం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులలో, శక్తినిల్వలు విశ్వవ్యాప్తంగా తగ్గిన నేపథ్యంలో ఎటువైపునుంచి ఎవరు దాడిచేసి యువరాణిని తీసుకుపోతారో చెప్పలేము. ఇంతకిముందు చెప్పినట్లుగా దివ్యశక్తిని ఉపయోగించడానికి రెండుపద్ధతులు ఉన్నప్పటికీ, చారిత్రకాధారాలను అనుసరించి క్రూరులైన నియంతలూ, పాలకులూ ఇతరమార్గాలైన భయం, కోపాలనే భావోద్వేగాలనుంచికూడా, అంటే ఆ స్త్రీని భయభ్రాంతులకు గురిచేసి, క్రోధాన్ని కలిగించి పనిచేయించవచ్చని కనుగొన్నారు. ఐతే ఆ పద్ధతులు ప్రేమద్వారా ఉత్పత్తి అయ్యే శక్తికి ఏమాత్రమూ సాటిరావని, అలా ఉత్పత్తి అయిన శక్తి, జీవులలో ఇతరరకాలైన రోగాలనుకూడా కలుగజేస్తుందని శాస్త్రజ్ఞుల ఊవాచ.
M5Z27 రాణి, రాజుల సహజసిద్ధమైన నిజమైన ప్రేమవలననే గతతరం విశ్వజనులు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. X23PI నాయకుడి దుశ్చర్యవలన ఈ ఉత్పాతం సంభవించి, సకలజీవరాశి మనుగడను ప్రశ్నార్థకం చేసింది ఇప్పుడు” అన్నాడు.
PLANET – M5Z27
X23PI నాయకుడిపై వచ్చిన కోపానికి ఉన్నపళంగా అక్కడికి వెళ్ళి వాడిని చంపేయాలన్నంత కసిగా ఉంది M5Z27 యువరాజుకి. అతనికోపం ఇప్పటిదికాదు. తన తండ్రి చావుకు కారణమైన వాడిని చిన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఎలా చంపాలో తెలీదు, అంత శక్తికూడా లేదు. రాణీని రక్షించబోయేక్రమంలో మరణించిన తండ్రిని తలచుకొని బాధపడని క్షణంలేదు. తనకు తెలిసిన అత్యంతయోధుడు తండ్రి. ఆయనకూడా నిలువరించలేని X23PI నాయకుడిని ఎప్పటికైనా చంపేయాలన్నది తన ఆశయంగా బ్రతుకుతున్నాడు ఇప్పటివరకూ. కాని, ఈరోజు జరిగినదాంట్లో తనే బాధ్యుడేమో! చొరవచెయ్యకపోవటం తన తప్పే.
గ్రహాంతర బందిపోటుమూకలను అరికట్టడానికి వెళ్ళిన సమయంలో వాడు వచ్చి రాణీని తీసుకుపోయాడు. తీసుకుపోయి అమానుషంగా చంపేశాడు. ఎందుకిలా? ప్రకృతి తన క్షమను పరీక్షిస్తోందా? ఎందుకీ పరీక్ష? తనలో ఉన్న ఈ కోపానికి విశ్వమంతటినీ నాశనం చేసేయగల శక్తి ఉందిప్పుడు. కానీ, చేయాల్సింది అదికాదు. తనకు కావాల్సింది అదికాదు. తనది ప్రపంచనాశనంకాదు, వ్యక్తిగత ప్రతీకారం.
ప్రధానమంత్రిని, మంత్రిమండలిని సమావేశపరిచాడు, తనకు సలహా ఇవ్వవలసిందిగా కోరాడు. ఎంతో అనుభవజ్ఞులైన వారి సూచనలకు వ్యక్తిగత ప్రతీకారేచ్ఛ చల్లబడింది. సకలమానవకళ్యాణకాంక్ష చొరబడింది. వాళ్ళు చెప్పిన రాజనీతి వివరణలూ, విశ్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులూ, ఏర్పడుతున్న కూటములూ, అంతర గ్రహ రాజకీయాధిక పరిస్థితులను సవివరంగా తెలుసుకున్నాక, అతనితో సత్సంబంధాలు కలిగిన ఇతర గ్రహాలనుకూడా సాయం కోరాడు. వివిధ అంచెల్లో శతృగ్రహంపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించాడు.
X23PI
చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్ట్‌ను క్షుణ్ణంగా అధ్యయనంచేసి, నివేదిక తయారుచేసి తీసుకెళ్ళాడు.
“మన మెషీన్‍లో ఎటువంటి లోపంలేదు. దీన్ని తరతరాలుగా అనేకమంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సానపెడుతూ వచ్చారు. హార్డ్‌వేర్‍లో ఏ లోపమూ లేదు. ప్రామాణికంగా ఎమోషన్స్‌తో పనిచేసే ఈ దివ్యశక్తిని అదుపులోపెట్టి వాడుకోవాలంటే సరియైన సాఫ్ట్‌వేర్ ఉండాలి. అదికూడా చాలావరకు మనం సాధించాం, కానీ ఈ రాణి తన జీవితంలో అనేక కష్టాలనూ, నష్టాలనూ, అనేకరకాలైన అనుభవాలనూ చవిచూసింది. అంతటి క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ తయారుచేయడం కొంచెం కష్టంతో కూడుకున్నది. అందువల్ల ఇన్నిసంవత్సరాలు పైబడిన, వృద్ధస్త్రీ’గుండెను తట్టుకోవడం ఈ మెషీన్‍కు సాధ్యపడలేదు. దీనికి ప్రత్యామ్నాయం యుక్తవయసులో ఉన్న, యింకా పరిపక్వంకాని గుండెను సంపాదించడమే. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం 6R4IQ యువరాణికి ఆ దివ్యశక్తి సంక్రమించింది. ఆమె మనస్సు నిజమైన ప్రేమను తెలుసుకోకముందే మనం సాధించినట్లయితే ఇప్పుడు మన దగ్గరున్న సాఫ్ట్‌వేర్ దానిని నియంత్రించగలదు. ఒకసారి అది ఆ ప్రేమను ఆస్వాదించినట్లయితే, ఆమె మనస్సు సంక్లిష్టం అయిపోతుంది. దానిని ఛేదించడానికి ఇంకొక తరం పడుతుంది” అని చెప్పి ముగించాడు.
X23PI నాయకుడు దీర్ఘంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు తన సహగ్రహవాసులకూ, మిత్రకూటమీగ్రహాలకూ దండయాత్ర చేయడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు.
6R4IQ
దండయాత్ర విషయం తెలిసి రాజు భయభ్రాంతులకు గురయ్యాడు. తనగ్రహం చిన్నది, తనమిత్రకూటమికూడా చిన్నది. X23PI నాయకుడు చాలా క్రూరమైనవాడు. అతని సైన్యం చాలా శక్తివంతమైనది, ఆయుధాలు అధునాతనమైనవి, గ్రహాంతరయాన నౌకలు అతివేగవంతమైనవి. శాంతికాముకుడై, తను సైన్యాన్ని నిర్లక్ష్యం చేశాడని ఇప్పుడు బాధకలిగింది. కళలకూ, సంస్కృతికీ ఇచ్చిన ప్రాధాన్యత రక్షణరంగానికి ఇవ్వలేదని కుమిలిపోయాడు.
ప్రధానమంత్రి M5Z27 యువరాజు పంపిన సందేశం గురించి చెప్పాడు. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. తనదగ్గరున్న కొద్దిపాటి సైన్యాన్నీ, సంపదనూ, ఇతర యుద్ధసామాగ్రితో పంపుతానని తిరిగి వర్తమానం పెట్టమని చెప్పాడు ప్రధానమంత్రితో. ఇప్పుడు విశ్వం రెండుకూటములుగా విడిపోయింది. విశ్వశాంతి సౌభాగ్యాలకోసం ఒక కూటమి, సామ్రాజ్యాధికారంకోసం మరొక కూటమి.
W4R2ON3
ఈ మూడుగ్రహాలమధ్యలో ఉన్న ఇంటర్ – గలాక్టిక్ స్పేస్ W4R2ON3. అన్ని గెలాక్సీలనుంచీ, గ్రహకూటములనుంచీ వచ్చిన నాయకులూ, సైనికులూ, యుద్ధనౌకలతో, యుద్ధానికి సిద్ధమై ఈ స్పేస్‍లో కొలువుదీరారు. యుద్ధం భీకరంగా మొదలై ఇరువైపుల సైన్యాలూ చాలా దెబ్బతిన్నాయి. X23PI నాయకుని అనుభవం, వారి దగ్గరగల అత్యాధునిక ఆయుధాలకి అవతలివైపువారి సేన తునాతునకలైపోయింది మొదట్లో.
M5Z27 యువరాజు దక్షత, దీక్ష, నూతనయుద్ధవ్యూహాలూ, నైపుణ్యాలతో చాలావరకు ఎదురు నిలిచి పోరాడగలుగుతున్నారు. చాలారోజులతర్వాత ఇరువైపుల మిత్రకూటమి సభ్యులు ఒక్కరొక్కరుగా యుద్ధంనుంచి విరమించుకోవడం ప్రారంభించారు. సైనికుల మరణం, వనరులదుర్వినియోగం, ఇంధనం అయిపోవడంవంటి అనేక కారణాలవల్ల యుద్ధంనుంచి వైదొలిగారు.
X23PI నాయకుడుమాత్రం ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో 6R4IQ గ్రహంవైపుగా తన దండయాత్రను కొనసాగించాడు. అతనిని వెంబడిస్తూ, అదనుకోసం చూస్తూ M5Z27 యువరాజు అనుసరించాడు.
6R4IQ
X23PI నాయకుడు ఇన్నిరోజుల యుద్ధం తర్వాతకూడా అలసిపోకుండా ఎలా ముందుకు సాగగలుగుతున్నాడో M5Z27 యువరాజుకి అర్థంకాలేదు. మొత్తానికి X23PI యుద్ధనౌక 6R4IQకి చేరుకొంది. అతని వెనకనే M5Z27 యువరాజుకూడా చేరుకున్నాడు. సరాసరిగా X23PI నాయకుడు రాజప్రాసాదంలోకి నిర్భీతిగా చొరబడి అడ్డువచ్చినవాళ్ళందరినీ మట్టుబెడుతూ ముందుకుపోతున్నాడు. M5Z27 యువరాజు X23PI నాయకుడికి ఒక విచిత్రమైన పరికరం అమర్చి ఉండడాన్ని గమనించాడు. సరిగ్గా గమనించగా, అది తన తల్లి గుండె అమర్చినదీ శక్తినిచ్చేదీననిపించింది. ఇప్పుడు అర్థమైంది M5Z27 కి, అలుపెరుగని X23PI నాయకుడి రహస్యం.
కట్టుదిట్టమైన భద్రతావలయంలో ఉన్న యువరాణి దగ్గరకి అవలీలగా వెళ్ళిపోయాడు X23PI నాయకుడు. అతడిని నిలువరించేందుకు, ఇప్పటివరకూ వెనకవెనుకగా వచ్చిన యువరాజు ముందుకి దూకి సిద్ధమయ్యాడు. తను తెచ్చిన మారణాయుధాలన్నిటినీ ఒడుపుగా వినియోగిస్తూ, X23PI నాయకుడి దెబ్బలకి దొరకకుండా హోరాహోరీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా తగిలిన లేజర్‍గన్‍దెబ్బకు కిందపడ్డాడు. చేతిలో ఆయుధం ఎగిరి ఎక్కడో పడిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. అంతలో ఒక్కసారిగా ఏదో వింత విద్యుత్ ప్రవేశించినట్లయి, మూసుకుపోతున్న కళ్ళు తెరుచుకున్నాయి. ఎన్నడూ చూడనంత కాంతి పరచుకొనివుంది. అతనిచుట్టూ, ఏదో దివ్యశక్తి తన శక్తితరంగాలని విద్యుత్వేగంతో పంపిస్తున్నట్టు చుట్టూ ఉన్న వస్తువులు కంపిస్తున్నాయి. అతని చెయ్యి పట్టుకొని ఏదో మానవాతీతశక్తి లాక్కుపోతున్నట్టనిపిస్తోంది.
దూరంగా X23PI నాయకుడు కనబడ్డాడు. పరుగెత్తుకుంటూ అతనివైపు వస్తున్నాడు. కుడిచేత్తో దొరికిన వస్తువుని పట్టుకొని అతనివైపు విసిరాడు. అంతే! వెయ్యిపిడుగులు ఒక్కసారి పడినంత శబ్దంతో వేలవేల వోల్టుల విద్యుత్ వెలుగులు విరజిమ్మినట్టయి, మరుక్షణంలో ఎదురుగా వాడు కనిపించలేదు. దూరంగా అతని మాతృమూర్తి హృదయం బలహీనంగా కొట్టుకుంతోంది వాడి యంత్రంనుంచి విడిపోయి. శరీరభాగాలన్నీ తునాతునకలైపోయి గదంతా పరచుకునివున్నాయి X23PI నాయకుడివి. M5Z27 యువరాజు ఎడమచెయ్యి పట్టుకుని ఉంది ఆ యువరాణి సిగ్గుతో, నిజమైన ప్రేమ తనకు లభించిందని అర్థమై.
M5Z27
“ప్రేమకు అంత శక్తి ఉందని నాకు తెలీదు . ఆరోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అంతా ఒక మాయగా జరిగిపోయింది. యువరాజు, X23PI నాయకుడు నా గదిలోకి రాగానే అందరూ భయంతో పరుగెత్తారు. అతని భీకర ఆకారాన్ని చూసి నేనుకూడా భయపడ్డాను. అంతలోనే ఎక్కడనుంచి వచ్చారో మీరు అతన్ని ఎదుర్కోడానికి. ఆక్షణంలోనే నాకు ఆ అనుభవం కలిగింది. ఒక్కసారిగా నా శరీరం కాంతిమయమైంది. ఎప్పుడైతే మీరు కిందపడ్డారో నేను మీ చెయ్యి పట్టుకుని లేపడానికి ప్రయత్నించాను. అంతలో X23PI నాయకుడు మీవైపు దాడిచేస్తూ దూకాడు. మీరు అతనిమీదకు విసిరింది కేవలం ఒక పూలకూజా. కానీ అది నాలోంచి శక్తిని గ్రహించి శరాఘాతమైంది వాడిపాలిట. ఇలాంటిది కేవలం కట్టుకథలు అనుకునేదాన్ని, నిజమైన, స్వచ్ఛమైన ప్రేమలూ, శక్తులూ ఇవన్నీ కథల్లోనే ఉంటాయనుకునేదాన్ని ఆ రోజువరకూ” అంది యువరాణీ.
I’m Dr Manas Krishna kanth
Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.
Excellent Manas