పక్కనే పెట్టుకున్న సెల్ రింగ్ అయితే ఉలిక్కిపడి లేచింది సీత. ఎవరా అని చూస్తే పుత్రరత్నం. ఈ టైంలో ఫోన్ చేసాడేమిటి చెప్మా అనుకుంటూ…
“చెప్పు నాన్నా! ఏమిటి ఇంత రాత్రివేళ ఫోన్ చేసావు?” అంది.
“ఏమీ లేదు. చాలారోజులయింది. నీతో మాట్లాడి అని చేసాను. ఏమీ చెయ్యకూడదా!” అన్నాడు హరి.
“ఛా!! అదేం కాదు. చాలారోజుల తరువాతకదా నీఫోన్ రావటం. రాత్రి రెండుగంటలవేళ వచ్చేసరికి ఏమైందా అని భయం వేసింది” అంది కాస్త కుదుటపడ్డ గొంతుతో.
“మమ్మీ! అవును నేను నీతో మాట్లాడి ఏడాదిపైనే అయింది. నీతో మాట్లాడాలనే ఉంటుందికానీ నువ్వు నా మాట ఏమాత్రం వినవు” అన్నాడు హరి కొంచెం కినుకగా.
“ఏ విషయంలో?” అడిగింది అభావంగా సీత.
“మళ్ళీ చెప్పాలా? నీకు ఎన్నిసార్లు చెప్పాను, రత్నంపిన్నీవాళ్ళకి దూరంగా వుండమని? నువ్వు వినవు. అందికే నేను దూరం అయిపోయాను నీకు”
“సరే!” అంది ముక్తసరిగా.
“అంటే నీకు నీ పిల్లలు దూరమైనా పరవాలేదు నీ అప్పచెల్లెళ్లే ముఖ్యమా?” హరి ప్రశ్న.
“అలా ఎపుడైనా అన్నానా??” సీత ఎదురు ప్రశ్న.
“మరి ఎందుకు వినవు మామాట?” హరి గొంతులో కాఠిన్యం.
“నీకు ఇష్టం ఉండదని నేను నా తోబుట్టువులకి దూరంగా ఉండాలి. నా తోబుట్టువులలో మీకు నచ్చని అంశాలు ఉన్నాయి కాబట్టి నేనుకూడా వారికి దూరం అయిపోవాలి వాళ్ళలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాగానీ. చాలా బావుంది. నేను ఎవరితో సంబంధబాంధవ్యాలు ఉంచుకోవాలి అనేది నిన్నటివరకూ నా అత్తవారు, మీ నాన్న నిర్ణయించారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నువ్వు నిర్ణయిస్తావు అంతేనా?” సీత మరింత స్పష్టతకోసం అడుగుతున్నట్లు హరిని అడుగుతూ, మనసులో “చిన్నప్పటినుండీ మీకు నామీద, నా పుట్టింటివారిమీద మనసుల్లో నాటిన విషబీజాలు, నాపట్ల మీముందే మీనాన్న అహంకారపూరిత ప్రవర్తన నిన్ను మరోలా మాట్లాడనిస్తే ఆశ్చర్యపోవాలి నేను” అనుకుంది.
“అవును, అంతే. నీ బాధ్యత నాదికదా!” హరి మరింత దృఢంగా తన భావం చెప్పేడు.
కాస్త చిరాకు కలుగుతున్నా అదేమీ బయటికి కనబడనీయలేదు సీత.
“ఓహో! నా బాధ్యత మీది అని ఏమి చేసారు నాన్నా, ఇన్నాళ్లు మీరంతా నాకు? నా అత్తవారుగానీ , మీ నాన్నకానీ, ఆయన పోయిన తరవాతినుండి నేటివరకూ నువ్వుకానీ నాపట్ల ఎలా ప్రవర్తించారు అన్నది ఒకసారి ఆలోచించు. ఇరవైయేళ్ళవయసులో పెళ్ళి అయి కాపరానికొచ్చాను. నాటినుండి నేటివరకూ ఉద్యోగం, ఇంటిబాధ్యతలు మోయటంతోనే జరిగిపోయింది. ఆయన తాగితాగి లివర్ పాడయి పోయారు. ఆయనది పెన్షన్ వచ్చే ఉద్యోగంకూడా కాదు. సర్వీస్‍లో వున్నపుడుకూడా తన వ్యసనాలకే తను తెచ్చేది చాలక నన్ను ఇమ్మనీ, ఇయ్యకపోతే ఇంట్లో గొడవలు. ఇన్ని సమస్యలు ఉన్నా ఒంటిచేత్తో ఇల్లు ఈదుకువచ్చాను. ఉన్న చిన్నపాటి ఆస్తి కరగపెట్టి, సరైన ఉద్యోగం, సంపాదన, బాధ్యత లేకుండా మామగారు, మీ నాన్న కాలం చేసారు. అవసరాలకు వాడుకుని మరిది వెళిపోయాడు. ఉన్నంతలో ఆడపడుచు పెళ్ళి చేసి పంపేసాను. ఇక నా శక్తికి వీలైన డిగ్రీచదువులు అక్కకీ, నీకూ చెప్పించాక మీకు తోచిన పెళ్ళిళ్ళు చేసుకు మీరు వెళిపోయారు. ఇప్పుడు నేనూ నానమ్మ, భర్త పోయి పుట్టింటికి వచ్చేసిన ఆడపడుచు నాకొచ్చే పెన్షన్‍తో, ఆమెకొచ్చే పెన్షన్‍తో గడుపుతున్నాము ఏదో తంటాలుపడి నేను అమర్చుకున్న ఈ రెండుగదుల ఫ్లాట్‍లో. ఇన్నేళ్ల నా జీవితం లో నాకు మీ నాన్నవైపువాళ్ళుగానీ, మీ నాన్నగానీ, నేను కన్న, పెంచిన మీరుగానీ చేసింది ఏమీ లేదు. అలాటిది నన్ను ఇది చెయ్యి, అది చెయ్యవద్దు అనిమాత్రం ఎందుకు కట్టడి చేస్తారు?” ప్రశ్నించింది వీలైనంత సౌమ్యంగానే.
“మేము ఇప్పుడిప్పుడేకదా, నిలదొక్కుకుంటున్నాం మమ్మీ?” హరి కొంచెం విసుగ్గా అడిగాడు.
“అవును నాన్నా! నాకు తెలుసు. నువు జాబ్ మానేసి బిజినెస్ పెడతానన్నప్పుడేగా నా రిటైర్‍మెంట్ బెనిఫిట్స్ నీకు, అక్కకి చెరిసగం పంచేసాను? నా పెన్షన్‍లో అంతులేని కధలో జయప్రదలా ఈ డెబ్భయ్యేళ్ల వయసులో అత్తగారిని పెట్టుకుని బ్రతుకుతున్నాను నాదైన పద్ధతిలో. ఇప్పుడుకూడా అలా వుండు, ఇలా చెయ్యి అని నాకెందుకు చెప్తారు మీరు?” సూటిగా అడిగింది.
“మమ్మీ! నీ ధోరణి నీదేగానీ మేము చెప్పేది వినవా?” హరి గొంతులో తీవ్రత ధ్వనించింది.
“హుం నా ధోరణి. ఇంట్లో ఎవడూ ఏనాడూ వినకపోతే, బాధ్యత పడకపోతే నా ధోరణిలో నేనుగాక మరోలా వుండే అవకాశం నాకెక్కడ కలిగింది? అయినా ఇప్పటివరకూ మీరు ఎవరైనా నాకు డబ్బు పెట్టారా? ఏదైనా పనిపరంగా సాయాలుచేసారా? ఏ బాధ్యత అయినా పంచుకున్నారా? లేదే! అంత ఎందుకు? నన్ను నిందించకుండా ఒక మంచిమాట ఆడారా? కనీసం వారానికి ఒకసారైనా ఫోన్ అయినా చేసారా? అవేవీ చెయ్యనివాళ్ళు … మీమాట నేను వినాలనిమాత్రం ఎలా ఆశిస్తారురా? మీ దృష్టిలో నేను మీకు ఇంటా బయటా కావలిసింది చేయటంకోసం మాత్రమే. మీ చదువులకుగానీ, పెళ్ళిళ్ళకుగానీ, నా పాత్ర మీ అవసరాలకు డబ్బు పెట్టటంవరకే. మీ నిర్ణయాలు మీరే తీసుకున్నారు. ఏనాడూ నేను కాదు, కూడదు అనలేదు. మీరెవరూ నీ అభిప్రాయం ఏమిటి అని నన్ను అడగనూ లేదు. అలాగే నేనుకూడా మిమ్మల్ని మీరేమి చేస్తున్నారు, మీ జీతభత్యాలు ఎంత అని ఒక్కరోజు అడగలేదు. నేను మీకిచ్చిన డబ్బు మీరేం చేసారని ఆరా తీయలేదు. కనీసం నేనిచ్చిన డబ్బు అయినా ఇలా ఖర్చుపెట్టండని మీకు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే అడిగినా నీకెందుకు అవన్నీ అంటారని నాకు తెలుసు. ఆ భాగ్యానికి అడిగి నా గౌరవం నేనేందుకు పోగొట్టుకోవటం అని నా చుట్టూ నేనే గిరిగీసుకుని దాన్నెప్పుడూ అతిక్రమించలేదు.
మీదంతా సర్వస్వతంత్రత. మా బతుకులు మా ఇష్టంవచ్చినతీరులో బతుకుతాం అని నిష్కర్షగా చెప్పి మీరు వెళి పోతున్నపుడుకూడా నాన్న చిరాకుపడితే నేను, ఎదిగిన పిల్లలు వాళ్ళు ఎంచుకున్న మార్గాలలో వెళ్ళనిద్దాం అని చెప్పి మిమ్మల్ని వెనకేసుకు వచ్చి ఆయన కోపానికి గురి అయానుతప్ప ఏనాడూ మిమ్మల్ని ఏమీ అనలేదు. మీ ఎవరినుండీ ఏమీ ఆశించలేదు. వచ్చిన కోడలినీ, అల్లుడినీ ఆదరించానేతప్ప ఏరోజూ పన్నెత్తు మాట అనలేదు. కానీ మీకు నాలోనూ, నా పుట్టింటివారిలోనూ ఎప్పుడూ సవాలక్షలోపాలు కనిపిస్తాయి. నా పెన్షన్ నేను ఎవరికి పెట్టేస్తానో అనుమానం. ఆ వివరాలు మీకు కావాలి. మీరు చెప్పినట్లే నేను నా ఆదాయం ఖర్చు పెట్టాలి. అలా చెయ్యను అన్నాను కాబట్టి నేను స్వార్ధపరురాల్ని. డబ్బుమనిషిని. నా పుట్టింటివాళ్ళ మాటలు విని నేనిలా చేస్తున్నానని మీ అనుమానాలు. అందుచేత నేను వాళ్ళకి దూరంగా ఉండాలి అని నన్ను వత్తిడి చేస్తారు. అలా చేసే నీకుగానీ అక్కకిగానీ నా అత్తింటివారిలో, నా భర్త అదే మీ నాన్నలో, మీలో లోపాలు కనబడవా? మీకు నాలో ఎన్నో తప్పులు కనబడుతున్నట్లే మీలో ఎన్నో తప్పులు నాకూ కనబడవచ్చని మీకు ఏ కోశానా అనిపించదా?
మీలో నాకు నచ్చని అంశాలు ,లోపాలు ఎన్నో వున్నా నేను మీ అందరినీ నాకు నేనుగా ఎప్పుడూ దూరం పెట్టలేదే? నాకు నచ్చలేదు దూరంగా వెళిపోండి అని ఎప్పుడూ అనలేదే? మీపట్ల నా బాధ్యత విస్మరించలేదే? అంత ఎందుకూ నాన్న పోయినాగానీ అత్తగారిని దూరంగా ఉంచలేదే? ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటూ ఎప్పుడూ అత్తింటివారిని దూరంపెట్టలేదే. నా దృష్టిలో మీలో లోపాలు ఎన్ని ఉన్నా మీ అందరితో సంబంధం కొనసాగిస్తున్న నేను మీ దృష్టి లో ఏవో లోపాలు ఉన్నాయని నా పుట్టింటివారిని దూరం పెట్టాలా? అలా చేయమని ఆదిని అత్తవారు, మీ నాన్ననుండి నేడు నీవరకూ నన్ను శాసించటం సమంజసమేనా అనే తలపు అసలు మీకెందుకు ఎప్పుడూ కలగదు?
నేను మిమ్మల్ని నా పుట్టింటివారికి డబ్బు పెట్టమనలేదు. వారికోసం పాటుపడమనలేదు. వాళ్ళెవరూ వచ్చి మిమ్మల్ని ఏనాడూ, దేనికీ దేబిరించలేదు. పైగా నాకు కష్టనష్టాలలో మీరంతా ముఖం చాటేస్తే నాకు అండదండగా నా తోబుట్టువులు నిలబడ్డారు. అలాటిది ఈరోజు నువ్వు వచ్చి నాతో మాట్లాడాలి అంటే నేను వారికి దూరంగా ఉండాలని షరతులు విధిస్తున్నావు. హుం! ఈ షరతులకు లోబడి వ్యక్తులతో, వారెవరుగానీ, సంబంధబాంధవ్యాలు ఇక నావల్లకాదు. తండ్రిదండన, తల్లిదండన, పురుషునిదండన ముగిశాయి నా జీవితంలో. ఇక ఇప్పుడు పుత్రుడిదండన అని నువ్వా? వద్దు!!…ఏ షరతులు లేకుండా, నా వ్యక్తిస్వేచ్ఛకు భంగంకలగనితీరులో నేను బతకాలి అనుకుంటున్నాననేది నువు అర్ధం చేసుకో. నాకదే చాలు. నా పిల్లలుగా నేను మీ దగ్గరినుండి అంతకన్నా ఏమీ ఆశించటంలేదు” అని ఖరాఖండీగా చెప్పేసింది.
“నీ ధోరణి నీదేకానీ మామాట వినవు మమ్మీ నువ్వు. నీ రేపు ఏమిటి అని ఆలోచన నీకు అసలు లేదా? ఎల్లకాలం ఇలాగే గడిచిపోతుందా ఎవరి అవసరం లేకుండా?” అని నిలదీసిన హరితో…
“నలభైయేళ్ల నువ్వు నీ ధోరణి మార్చుకోవు. డెబ్బయ్యేళ్ల నేను మారాలని ఎలా ఆశిస్తావు? శాసిస్తావు? హుం! నీ ఆలోచనలు, అవగాహనలు, ఆచారణలు, ప్రణాళికలు నీకు ఉన్నట్లే నాకు నావి ఉన్నాయి. ఉంటాయి అనే స్పృహ లేదు. ప్రతీది మీరు చెప్పినట్లు చెయ్యాలి. లేకపోతే మీకు చిరాకులూ, పరాకులూ, మాటలు విసిరేస్తారు. ఈ వయసులో నాకు ఆ నిందలూ, కట్టడీ అవసరమా? మీ ఇళ్లలో ఒదిగి వుంటూ, నాకు ఆసక్తి ఉన్నది ఏదీ చేయటానికి నాకు సమయం, అవకాశం లేకుండా ఊపిరిసలపనితనంలో ఇంకా ఎన్నాళ్ళు మగ్గాలి నేను? ఏ శాసనాలూ నియంత్రణలూ లేని వాతావరణం నాకు నా ఇల్లు. ఇది దాటి నేనెక్కడికీ రాను. నా మనసుకి విరుద్ధంగా నేనేదీ చెయ్యను. ఎన్నాళ్ళు ఇలా సాగితే అన్నాళ్ళు సాగుతుంది. నేను నిన్న, రేపుల గురించి ఆలోచించను. ఈ క్షణంలో బతుకుతాను నాన్నా! నన్ను ఇలా నాపాటికి ఇన్నాళ్లు ఎలా వదిలేసావో అలాగే వదిలెయ్యి” అంది
“సరే మమ్మీ! నీకు ఎప్పుడు మాట్లాడాలపిస్తే అప్పుడు ఫోన్ చెయ్యి. నేనుమాత్రం చెయ్యను” అని విసురుగా ఫోన్ కట్ చేసాడు హరి
“ఎందుకు నాయనా, ఫోన్ చెయ్యటం? బిజీగా వున్నాను అనే నీ చిరచిరలు వినటానికా? వద్దు. మీకు ఏ ఫోన్ నాకు నేనుగా చేయటం ఎప్పుడో మానేసాను. నీకు చేయాలనిపిస్తే నువ్వే చెయ్యి. కన్నపిల్లలతో మాట్లాడలేనంత రాచకార్యాలు నాకేమీ లేవుకాబట్టి మీరు ఫోన్ చేస్తే నేను మాట్లాడుతాను. కానీ ఎప్పుడో ఏదో జరుగుతుందేమో అనే పిరికితనం, అభద్రతభావంతో ఇప్పటినుండీ ఇరుకుతనంలో, మురికి మనస్తత్వాలమధ్య ఉండి బాధలు పడలేను. నా నిర్ణయం తాలూకు తప్పొప్పులు, సాధ్యాసాధ్యాలు ఆలోచించను. దిక్కులేనివారికి దేముడే దిక్కని ప్రపంచంలో నాపాటీ లేనివారు ఎందరో ఆత్మ స్టైర్యంతో బతుకుతున్నారు. ఇన్నాళ్లుగా ఒంటరిగా ఈదుకొస్తున్న నాకు ఇప్పుడు ఎందుకు లేని పోని భయాలు? జరిగేదేదో జరుగుతుంది. అంతవరకూ నేనేం చెయ్యాలో అది చేసుకు పోతాను. మరిక కొత్త బాధ్యతలు, బంధనాలు వద్దు నాకు!” అని దీర్ఘంగా నిట్టూర్చింది.
సెల్‍లో తనకిష్టమైన “జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది” పాట పెట్టుకుని దానితో తన గొంతు కలుపుతూ టీ పెట్టుకుందికి
కిచెన్‍లోకి దారితీసింది.

నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.